లిబియాలో చిక్కుకున్న 1000 మంది భారతీయులు

  ఉపాధి కోసం విదేశాలకు వెళ్ళిన భారతీయులు కష్టాలు అనుభవిస్తున్నారు. ఇప్పటికే ఇరాక్‌లో చిక్కుకున్న భారతీయులను తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఎంతో శ్రమిస్తోంది. ఇప్పుడు అంతర్యుద్ధం జరుగుతున్న లిబియాలో కూడా దాదాపు వెయ్యి మంది భారతీయులు చిక్కుకుపోయినట్టుగా సమాచారం అందుతోంది. వీరిలో చాలామంది తెలుగువారే వున్నారు. అలాగే కేరళకు చెందిన దాదాపు వందమంది నర్సులు కూడా లిబియాలో చిక్కుకుపోయారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వారిలో ఎక్కువమంది కర్నూలు జిల్లా బేతంచెర్ల నుంచి వెళ్ళిన సిమెంటు పరిశ్రమ కార్మికులు. లిబియాలో చిక్కుకున్న వెయ్యిమంది కార్మికులను సురక్షితంగా భారతదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది.

సోనియా ఇఫ్తార్ విందు

  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదివారం న్యూఢిల్లీలోని అశోకా హోటల్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ ఇఫ్తార్ విందు అటు స్వామికార్యంతోపాటు స్వకార్యం కూడా నెరవేరే విధంగా ఏర్పాటు చేశారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధికారంలో వున్న సమయంలో గత మూడు సంవత్సరాలుగా ఇఫ్తార్ విందు ఇవ్వని సోనియా గాంధీ అధికారం పోయిన తర్వాత ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ విందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముస్లిం మత పెద్దలతో పాటు బీజేపీ వ్యతిరేక శక్తులను కూడా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. నరేంద్రమోడీ ప్రభంజనానికి కకావికలైనపోయిన పలు పార్టీల నాయకులు ఈ విందులో పాల్గొని సోనియాగాంధీతో ముచ్చటించారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయు అధినేత శరద్ యాదవ్ కూడా ఈ విందులో పాల్గొన్నారు. సోనియా, లాలూ, శరద్ యాదవ్ ఒకే టేబుల్ మీద కూర్చుని విందు ఆరగించడం విశేషం. ఈ ముగ్గురూ విందులో తిన్నది తక్కువ మాట్లాడుకున్నది ఎక్కువ అని తెలుస్తోంది. బీహార్‌లో పది అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంగా కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయు జట్టుకట్టి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురూ ఒకే టేబుల్ మీద కూర్చుని ఇఫ్తార్ విందు ఆరగించడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

అల్పపీడనంతో తెలంగాణ, ఆంధ్రలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ, గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, సత్తుపల్లిలోని ఓపెన్ కాస్టుల్లో భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయింది. కెటిపిసికి బొగ్గు సరఫరా నిలిచిపోవడంతో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఎర్పడింది. అలాగే రాజమండ్రి నగరం, రూరల్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వల్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఆచంట మండలంలోని ఆరు గ్రామాల్లో అంధకారం నెలకొంది. పశ్చిమగోదావరి జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాల్లో వేసిన వరినాట్లు ముంపునకు గురయ్యాయి. ఇప్పటికే వరినాట్లు ఆలస్యం కావడంతో ఆందోళనలో ఉన్న రైతులు ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో మరింత ఆందోళనకు గురవుతున్నారు.

ఫేస్‌బుక్ కొత్త సదుపాయం!!

  ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలకు చేరువైన ఫేస్‌బుక్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త సదుపాయాలకు రూపకల్పన చేస్తూ మరింత ఆకట్టుకుంటోంది. ఇప్పుడు మొబైల్ ఫోన్ల వినియోగదారుల కోసం ఫేస్‌బుక్ కొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు ఆండ్రాయిడ్, స్టార్ట్ ఫోన్లలో ఫేస్ బుక్‌ను చూడటమే తప్ప కావలసిన వాటిని సేవ్ చేసునే ఆప్షన్ మాత్రం లేదు. ఇప్పుడు సేవ్ ఆప్షన్‌ కూడా ఫేస్ బుక్ ప్రవేశపెట్టింది. ఈ సదుపాయం వల్ల ఇప్పుడు ఫేస్‌బుక్‌లో కనిపించే సినిమాలు, పాటలు, ఫొటోల వంటి వాటిని ఎంచక్కా సేవ్ చేసుకోవచ్చు. ఇంకో మంచి విషయం ఏమిటంటే, మనం సేవ్ చేసుకున్న ఫైల్స్ వివరాలు ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించవు. త్వరలో ఈ సదుపాయాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఫేస్ బుక్ ప్రకటించింది.

గ్రేటర్ ఎన్నికల కోసం పొన్నాల ప్రయత్నాలు..!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలపై నేతలు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యనేతల మధ్య ఉన్న అనైక్యత పార్టీ ఓటమికి ప్రధాన కారణమైందని నేతలు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ప్రధానంగా టీ-పీసీసీ చీఫ్ దృష్టి పెట్టారు. గ్రేటర్ లో కాంగ్రెస్ నేతలందరిని ఓకే మార్గంలోకి తెచ్చేందుకు ఆయన ప్రయత్నాలను మొదలు పెట్టారు. కాంగ్రెస్ లో నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయామన్న విషయాన్ని గ్రహించిన ఆయన పార్టీ కోసం పని చేసిన నేతలకు గ్రేటర్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలని నిర్ణయించినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో పార్టీ క్యాడర్ ను సిద్దం చేసేందుకు ఆయన రంగాన్ని సిద్దం చేస్తున్నారు. మరి గ్రేటర్ ఎన్నికల కోసం పొన్నాల చేపట్టిన ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి!      

ఇరాక్: తిరిగొచ్చిన తెలుగువారు!!

  ఇరాక్ దేశం అంతర్యుద్ధంతో అట్టుడికిపోతోంది. ఉపాధి కోసం ఇరాక్‌కి వెళ్ళిన తెలుగువారు అక్కడ చిక్కుకుపోయారు. వారిని ఇండియాకి తీసుకురావడానికి భారత ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాక్‌‌లో చిక్కుకున్న 193 మంది తెలుగువారు ఢిల్లీకి ఆదివారం చేరుకున్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాల ద్వారా ఢిల్లీ చేరుకున్న వారు ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ ఉమ్మడి భవన్‌లో బస చేశారు. వీరిలో 25 మంది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన విశాఖ జిల్లాకు చెందినవారు కాగా, మిగతావారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందినవారు. వీరిని ఎవరి స్వస్థలాలకు వారిని పంపించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇరాక్‌లో ఇంకా వందల సంఖ్యలో తెలుగువారు చిక్కుకున్నట్టు తెలుస్తోంది.

కోనసీమ వాసులకు కంగారెక్కువ: సునీల్ కామెంట్!!

  రాజకీయ నాయకులు ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియాకి అనుకూలంగా మాట్లాడ్డం రాజకీయ నాయకులకు అలవాటు. ఈ అలవాటు సినిమావాళ్ళకి కూడా వచ్చినట్టుంది. కమెడియన్ వేషాల నుంచి హీరో వేషాలకు ‘ఎదిగిన’ సునీల్ ఇప్పుడిప్పుడే ఈ అలవాటును నేర్చుకుంటున్నట్టుగా కనిపిస్తున్నారు. హోమియో పితామహుడు హానిమన్ విగ్రహ ఆవిష్కరణ కోసం కర్నూలు జిల్లాకి వెళ్ళిన సునీల్ అక్కడ తాను వెళ్ళిన పనేదో చేసుకుని రాకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాయలసీమకి వెళ్ళిన ఆనందంలో, జనానికి ఉత్సాహం పుట్టించాలన్న అత్యుత్సాహంలో కోనసీమను కించపరిచేలా మాట్లాడారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాయలసీమలో సునీల్ మాట్లాడుతూ, ‘‘కోనసీమ వాసులకు కంగారెక్కువ.. రాయలసీమ వాసులకు ధైర్యమెక్కువ’’ అని కామెంట్ చేశారు. ఈ కామెంట్ విని రాయలసీమ వాసులు ఆనందంతో పొంగిపోయారో లేదోగానీ, కోనసీమ వాసులు మాత్రం కయ్యిమంటున్నారు. తమకు కంగారెక్కువ అని అనడానికి సునీల్ దగ్గర వున్న ఆధారాలేంటని ప్రశ్నిస్తున్నారు. సునీల్ ఈసారి కోనసీమకు వచ్చినప్పుడు కోనసీమకు కంగారు ఎంత ఎక్కువో సునీల్‌కి చూపిస్తామని అంటున్నారు. సునీలూ.. ఇరుక్కుపోయావయ్యా!!

విజయకాంత్ ఆరోగ్యం విషమించిందా?

  ప్రముఖ తమిళ నటుడు, అభిమానులు ‘కెప్టెన్’ అని పిలుచుకునే డీఎండీకే పార్టీ అధినేత విజయకాంత్ ఆరోగ్యం పూర్తిగా విషమించినట్టు కనిపిస్తోంది. రాజకీయంగా కష్టకాలాన్ని ఎదుర్కొంటోన్న ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా చాలా ఆందోళనకరంగా వున్నట్టు తెలుస్తోంది. పదిహేను రోజుల క్రితం విజయకాంత్ అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో చేరారు. తీవ్రమైన అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారని వార్తలు వచ్చినప్పటికీ, ఆయన పార్టీ నాయకులు మాత్రం లోక్‌సభ ఎన్నికలలో కష్టించి పనిచేయడం వల్ల ఆరోగ్యం కొంచెం దెబ్బతింది అంతే అని చెప్పినప్పటికీ, జనం అనుమానాలు తీరలేదు. చెన్నై ఆస్పత్రి నుంచే విజయకాంత్‌ని సింగపూర్‌కి తరలించారు. అక్కడి నుంచి విజయకాంత్ కుటుంబం తిరిగి వచ్చింది. అయితే విజయకాంత్ మాత్రం వీల్ ఛెయిర్‌లో తిరిగి వచ్చారు. ఎయిర్ పోర్టు నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో ఆయనను ముఖం కూడా బయటకి కనిపించకుండా దుప్పట్లో కప్పేసి తీసుకెళ్ళారు. విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పటి వరకు ఆయన కుటుంబ సభ్యులు ఎలాంటి సమాచారం మీడియాకి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

12 మంది పిల్లలు సేఫ్!

  మెదక్ జిల్లా బస్సు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులలో 12 మంది ఆరోగ్యం కుదుటపడింది. వారికి ఇక ఏ ప్రమాదమూ లేదు. దాంతో ఆ విద్యార్థులను ఐసీయు నుంచి జనరల్ వార్డుకు మార్చారు. ఈ 12 మంది విద్యార్థులను మూడు రోజుల్లో ఇళ్ళకు పంపే అవకాశం వుంది. శివకుమార్, నిత్మష, శ్రీవాణి, శరత్ అనే విద్యార్థుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా వుంది. వారిని మరికొంతకాలం వైద్యుల పర్యవేక్షణలోనే వుంచుతారు. అయితే ప్రశాంతి, వరుణ్ గౌడ్, వైష్ణవి, తరుణ్ అనే చిన్నారుల ఆరోగ్య పరిస్థితి మాత్రం విషమంగా వున్నట్టు వైద్యులు చెబుతున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థులెవరికీ ఆపరేషన్లు చేయాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.

బీజేపీకి వ్యతిరేకంగా బీహార్‌లో మహాకూటమి!!

  భారతీయ జనతాపార్టీకి వ్యతిరేకంగా బీహార్‌లో ‘మహాకూటమి’ ఏర్పడింది. బీజేపీని ఓడించడమే ఏకైక లక్ష్యంగా జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. మొన్నటి వరకూ ఒకరినొకరు తిట్టుకున్న ఈ మూడు పార్టీలు ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో కలసి పోటీ చేయాలని నిర్ణయించుకన్నాయి. ఆగస్టు 21న ఈ పది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల జరుగనుంది. ఎన్నికల పొత్తులో భాగంగా జేడీయూ, ఆర్జేడీ నాలుగేసి స్థానాల్లో, కాంగ్రెస్ రెండు స్థానాల్లో పోటీ చేస్తోంది. జేడీయూ, ఆర్జేడీ మాజీ ముఖ్యమంత్రులు నితీశ్‌కుమార్, లాలూప్రసాద్‌యాదవ్‌లు కలిసికట్టుగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు. ఎంత చేసినా ఎన్నికల పూర్తయిన తర్వాత ఈ మూడు పార్టీల నాయకులు ఒకరినొకరు నోరారా తిట్టుకుంటారు!

ముంబైలో దాడి చేస్తాం: ఉగ్రవాదులు!!

  ఈ ‘ఉగ్రవాదులు’ అనేవాళ్ళు వున్నారే.. వీళ్ళ చేతుల్లో మిషన్ గన్లు, బాంబులు ఉంటాయి తప్ప తలలో మైండ్ ఉండదని అనిపిస్తూ వుంటుంది. దానికి ఉదాహరణగా నిలిచే అంశం ఇది. ఇజ్రాయిల్‌లోని గాజాలో అంతర్యుద్ధం జరుగుతున్న సందర్భంగా దాడులు, ప్రతిదాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే గాజాకి, ఇండియాకి ఎలాంటి సంబంధం లేకపోయినా, గాజాలో జరుగుతున్న దాడులకు ప్రతీకారంగా ముంబైలో దాడికి పాల్పడతామంటూ ముంబై పోలీసు కమిషనర్ రాకేశ్ మారియాకు బెదిరింపు లేఖ అందింది. ఎక్కడి గాజా, ఎక్కడి ముంబై.. అక్కడ జరుగుతున్న దాడులకు ముంబై మీద ఉగ్రవాద దాడి చేయడమేంటి? ఉగ్రవాదులు పంపారో లేక ఆ పేరుతో వేరే ఎవరైనా పంపారోగానీ, ముజాహిద్దీన్ పేరుతో ఆ లేఖ ముంబై పోలీసు కమిషనర్‌కి అందింది. దమ్ముంటే మమ్మల్ని ఆపండి అనే హెచ్చరిక కూడా ఆ లేఖలో వుంది.

న్యూస్ రీడర్ భర్త: కేసు మీద కేసు!!

  హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌.లో వున్న ఒక న్యూస్ ఛానల్‌లో న్యూస్ రీడర్‌గా పనిచేస్తున్న ఒక యువతికి మల్లికార్జున్ అనే వ్యక్తితో పెళ్ళయింది. పెళ్ళయిన దగ్గర్నుంచీ ఆ న్యూస్‌ రీడర్‌కి చిత్రహింసలు, మనోవేదన తప్ప సంతోషం అనే మాటే లేకుండా పోయింది. పైగా సదరు భర్తగారు మరో పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడటంతో న్యూస్ రీడర్ హైదరాబాద్‌లోని సంజీవరెడ్డి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు అతనిమీద కేసు నమోదు చేశారు. దాంతో అతని రెండో పెళ్ళి ఆగిపోయిందేమో, అప్పట్నుంచి అతను తన భార్య పనిచేస్తున్న న్యూస్ ఛానల్ దగ్గరకి వచ్చి కేసును ఉపసంహరించుకోవాలని గొడవ చేయడం ప్రారంభించాడు. కేసు వాపసు తీసుకోకపోతే చంపేస్తా, పొడిచేస్తా అని బెదిరించడం మొదలుపెట్టాడు. దాంతో ఆమె మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈసారి మరోకేసు నమోదు చేశారు.

జగన్ 420: మంత్రి దేవినేని

  ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీ నేత జగన్ మీద ఘాటు విమర్శలు చేశారు. జగన్మోహన్‌రెడ్డిని ఆయన ఫోర్ ట్వంటీ అని సంబోధించారు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని జనం ప్రజల సొమ్మును అడ్డగోలుగా దోచుకున్నారని అందుకే జైలుపాలయ్యారని, భవిష్యత్తులో జగన్‌కి జైలే దిక్కని అన్నారు. జగన్ ఓ ఫోర్ ట్వంటీ కాబట్టే, సీబీఐ జగన్‌పై నమోదు చేసిన కేసులలో ఎక్కువ 420 కేసులే వున్నాయని దేవినేని గుర్తు చేశారు. ఈమధ్య కాలంలో తెలుగుదేశం నాయకులు జగన్ మీద విమర్శల దాడి, వేడి పెంచారు. జగన్ చంద్రబాబుకు వ్యతిరేకంగా నరకాసుర వధ కార్యక్రమాన్ని ప్రారంభించిన దగ్గర్నుంచి జగన్ మీద మాటల దాడి పెరిగింది.

త్వరలో ఆంధ్ర, తెలంగాణ ప్రాజెక్టులకు జలకళ!

  మహారాష్ట్రలో భారీ వర్షాల వల్ల కృష్ణ దాని ఉపనదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దీంతో ఆల్మట్టి రిజర్వాయర్ లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రవాహస్థాయి ఎక్కువగా ఉండడంతో అధికారులు నీటిని కిందికి వదులుతున్నారు. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకోనున్నాయి. ఆల్మట్టి రిజర్వాయర్ లో ప్రస్తుతం 87 టీఎంసీలకు పైగా నీటి నిల్వ ఉంది. పై నుంచి లక్షా 57 వేల క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతోంది. నారాయణపూర్ రిజర్వాయర్ లోకి 9798 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 635 క్యూసెక్కుల నీటిని కిందకి వదులుతున్నారు. తుంగభద్ర ప్రాజెక్టులోకి 92891 క్యూసెక్కుల నీరు వస్తుండగా 3484 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యాంకు ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదనీరు మరో మూడు రోజులు కొనసాగితే డ్యాంపూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుతుంది. కృష్ణ, తుంగభద్రల నుంచి నీటిని విడుదల చేస్తే శ్రీశైలం జలాశయానికి కళకళలాడనుంది. వర్షాలు లేక ఎండిపోతున్న శ్రీశైలం జలాశయం, నాగార్జునసాగర్ డ్యాంలు మరికొద్ది రోజుల్లో జలకళ సంతరించుకునే అవకాశాలున్నాయి.

రుణమాఫీపై కేంద్రం హామీ ఇవ్వలేదు..!

  రుణమాఫీపై కేంద్రం ఎలాంటి హామీ ఇవ్వలేదని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు కుండబద్దలు కొట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై రెండు రాష్ర్ట ప్రభుత్వాలు చర్చించుకొని సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. రుణమాఫీపై తెలంగాణకు కేంద్రం ఎలాంటి నిధులు ఇవ్వదన్న ఆయన ఇతర రాష్ర్టాల మాదిరిగానే తెలంగాణకు కూడా కేంద్రం సహాయం ఉంటుందన్నారు. మరోవైపు ఏపీ రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదని తెలిపారు. సికింద్రాబాద్ ఎంపి బండారు దత్తాత్రేయ, పలువురు బిజెపి నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అయ్యన్న పాత్రుడుతో వైకాపా గీత భేటి

గత కొంత కాలంగా జగన్ తో విభేదిస్తున్న విశాఖ జిల్లా, అరకు వైకాపా ఎంపీ కొత్తపల్లి గీత ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్న పాత్రుడుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ సందర్భంగా మంత్రి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని అన్నారు. పాడేరు, అరుకు నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చలు జరిపినట్లు అయ్యన్న తెలిపారు. ఎంతో మంతి పార్టీని మారుతున్నారని ఈమె పార్టీ మారితో తప్పా? అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. ఆమె పార్టీలోకి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తామని... కానీ అటువంటి చర్చ జరగలేదని అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు.