స్కూలు బస్సు ప్రమాదం మృతులు 16 మంది!

  మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద ఓ ప్రయివేట్ స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసిజర్ రైలు ఢీకొన్న ఘటనలో 16 మంది మృతి చెందారు. మరణించిన వారిలో 14 మంది విద్యార్థులు, బస్సు డ్రైవర్, క్లీనర్ ఉన్నారు. కాకతీయ పాఠశాలకు చెందిన బస్సు రైల్వే గేటు దాటుతుండగా నాందేడ్ ప్యాపింజర్ ఢీకొంది ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 34 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రమాదంలో 16 మంది మరణించగా, 20 మంది విద్యార్థులు హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రైల్వే గేట్ వద్ద కాపలా లేకపోవటం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పవన్ కళ్యాణ్ తదితరులు పరామర్శించారు.

‘చేరా’ కన్నుమూత!

  ప్రఖ్యాత సాహితీవేత్త, ‘చేరా’గా సుప్రసిద్ధులైన చేకూరి రామారావు (80) కన్నుమూశారు. ఆధునిక భాషా శాస్త్రంలో ఆయన కొత్త ఒరవడి సృష్టించిన సాహితీవేత్త. భాషాశాస్త్ర పరిశోధకుడిగా, సాహితీ విమర్శకుడిగా చేరా ఖ్యాతి గడించారు. 1934 అక్టోబర్ 1న ఖమ్మం జిల్లా మధిర మండలం ఇల్లందలపాడులో చేకూరి రామారావు జన్మించారు. అమెరికా కార్నెల్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. చేకూరి రామారావు 2002లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు పొందారు. ఆయన రచించిన ‘స్మృతి కిరణాంకం’కు ఈ అవార్డు దక్కింది. ముత్యాలసరాల ముచ్చట్లు, ఇంగ్లీషు-తెలుగు పదకోశం, భాషా పరిశోధన వ్యాసాలు (తెలుగులో వెలుగులు), రెండు పదుల పైన, చేరా పీఠికలు, తెలుగు వాక్యం, కవిత్వానుభవం ఆయన రాసిన పుస్తకాల్లో కొన్ని. చేరాతలు పేరుతో ఏళ్ల తరబడి సాహితీ శీర్షికలు నిర్వహించారు.

రోటీకి మతం రంగు: ఉద్ధవ్

  ‘రోటీ’ వివాదానికి కాంగ్రెస్ పార్టీ మతం రంగు పులుముతోందని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే తమ పార్టీ పత్రిక సామ్నాలో విమర్శించారు. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో పనిచేసే ముస్లిం చేత 11 మంది శివసేన ఎంపీలు ఉపవాస వేళలో బలవంతంగా రోటీ తినిపించారన్న అంశం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ‘సర్వర్ ముఖం మీద మతం పేరు రాసి ఉంటుందా?’ అంటూ ఆయన కాంగ్రెస్ పార్టీ మీద ఎదురు దాడి చేశారు. తమ పార్టీ ఎంపీలను విమర్శించే ముందు ఢిల్లీలోని మహరాష్ట్ర సదన్‌లో మరాఠి సంస్కృతికి జరుగుతున్న అన్యాయం, అవమానం మీద మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ దృష్టి సారించాలని థాకరే సూచించారు. అనుకోకుండా జరిగిన ఘటనపై విచారణ అంటూ గోల చేస్తే, సీఎం చవాన్‌కి కూడా కూడా బలవంతంగా రోటీ తినిపించాల్సి ఉంటుందని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు.

ఎ.పి. బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్‌బాబు?

  టెన్నిస్‌ స్టార్‌ సానియా మిర్జాను తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ టాప్ స్టార్ ‘ప్రిన్స్’ మహేష్‌బాబును నియమించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనికోసం మహేష్ బాబు బావ అయిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మహేష్ బాబుతో రాయబారం చేస్తున్నారన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. రాజకీయాలతో ఎలాంటి సంబంధం పెట్టుకోని మహేష్ బాబు గత ఎన్నికలలో తన సొంత బావకి ప్రచారం చేయడానికి కూడా ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటానికి అంగీకరిస్తారా అనే సందేహాలు వున్నాయి. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ కావడం అంటే తెలంగాణ ప్రజలకు దూరం అవ్వడం అనే కలరింగ్ వుంటుంది కాబట్టి దీనికి మహేష్ బాబు ఒప్పుకోకపోవచ్చన్న అభిప్రాయాలూ వున్నాయి. అయితే మహేష్‌బాబున్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఒప్పించాల్సిందిగా జయదేవ్‌కు చంద్రబాబు సూచించారన్న ఊహాగానాలు వినిపిస్తు్న్నాయి.

నదిలో కూలిన అల్జీరియా విమానం!!

  విమానాలకు యమగండకాలం నడుస్తున్నట్టుగా వుంది. అందుకే వరుసపెట్టి విమాన దుర్ఘటనలు జరుగుతూ వున్నాయి. అల్జీరియా దేశానికి చెందిన అల్జీర్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఏహెచ్ 5017 నెంబరు గల విమానం ఒకటి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అదృశ్యం అయిన విషయం విదితమే. ఒవగడౌగో నుంచి అల్జీర్స్ వెళ్తున్న ఈ విమానం నైజర్ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ విమానంలో 110 మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బంది వున్నారు. ఈ 116 మంది మరణించి వుండవచ్చని భావస్తున్నారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల విమానాన్ని దారి మార్చుకోవాలని సూచించిన కాసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు ఆ విమానంతో సంబంధాలు తెగిపోయాయి. ప్రచండంగా వీస్తున్న గాలుల వల్లే ఈ విమానం కూలిపోయిందని అధికారులు భావిస్తు్న్నారు. ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు బాగా పెరిగిపోయాయి. మలేషియా ఎయిర్లైన్స్కు చెందిన ఎంహెచ్-370 విమానం నాలుగు నెలల క్రితం అదృశ్యం కాగా, దాని ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. ఇటీవల రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులలో మలేషియా ఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానాన్ని క్షిపణి తాకడంతో అది కూలిపోయి అందులో ఉన్న మొత్తం 295 మంది మరణించారు. బుధవారం నాడు తైవాన్‌కి చెందిన విమానం కుప్పకూలి 51 మంది మరణించారు. తాజాగా గురువారం నాడు అల్జీర్స్ విమానం 116 మందితో ప్రయాణిస్తూ కుప్పకూలింది.

సానియాకి బోలెడంత సపోర్టు!

  టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను తెలంగాణ అంబాసిడర్‌గా నియమించడంపై తలెత్తుతున్న విమర్శలను తెలంగాణ రాష్ట్ర మహిళా నేతలు మండిపడ్డారు. సానియాపై బీజేపీ నేత లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని పార్లమెంటు కాంగ్రెస్ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. సానియా యూత్ ఐకాన్ అని, దేశానికి కీర్తిప్రతిష్టలను తెచ్చిపెట్టిందని అన్న రేణుకా చౌదరి డాక్టర్ లక్ష్మణ్ వ్యాఖ్యలను నాన్సెన్స్ అని కొట్టిపారేశారు. తెలంగాణ ప్రభుత్వం సానియా మీర్జాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం పట్ల బిఎస్పీ చీఫ్ మాయావతి హర్షం వ్యక్తం చేయగా, సానియాపై బిజెపి వ్యాఖ్యలు దురదృష్టకరమనికాంగ్రెసు నాయకుడు మనీష్ తివారీ అన్నారు. లక్ష్మణ్ వ్యాఖ్యలు సిల్లీ అని టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట కవిత అన్నారు.

శశిథరూర్-సునందా పుష్కర్ తిట్టుకుచచ్చేవారు: నళిని

  కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం పార్లమెంటు సభ్యుడు శశిథరూర్ మూడో భార్య సునందా పుష్కర్ ఆమధ్య అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. సునందది సహజ మరణం కాదన్న అనుమానాలు అప్పట్లోనే వ్యక్తమయ్యాయి. పోస్టుమార్టం చేసిన డాక్టర్ కూడా సునందది సహజ మరణంగానే చెప్పాలని అప్పటి యుపీఎ ప్రభుత్వం తనమీద వత్తిడి తెచ్చారని చెప్పడం కూడా ఆమధ్య సంచలనం కలిగించింది. తాజాగా ప్రముఖ జర్నలిస్టు నళినీసింగ్ థరూర్ - సునంద మధ్య వున్న ‘అనుబంధం’ గురించి వెల్లడించారు. శశిథరూర్, సునంద పుష్కర్ ఎప్పుడూ గొడవ పడుతూ వుండేవారని, ఒకరిని ఒకరు తిట్టుకునేవారని నళినీసింగ్ వెల్లడించారు. సునందా పుష్కర్ చనిపోయిన రోజు కూడా వాళ్ళిద్దరూ ముందురోజు రాత్రి నుంచి తెల్లవారు ఝామున నాలుగు గంటల వరకు హోటల్ రూమ్‌లో భయంకరంగా గొడవపడి ఒకరినొకరు తిట్టుకున్నారని నళినీసింగ్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాను హోటల్ సిబ్బంది నుంచి ధ్రువీకరించుకున్నానని తెలిపారు. పాకిస్థాన్‌కి చెందిన లేడీ జర్నలిస్టు మోహర్ తరార్ పట్ల థరూర్ ఆకర్షితుడవుతున్నాడని సునంద తనతో పలుసార్లు చెప్పిందని నళిని వెల్లడించారు. థరూర్; మెహర్ తరార్ తరచుగా రొమాంటిక్ మెసేజ్‌లు ఇచ్చుకునేవారని, వాటిలో ఒక మెసేజ్‌లో సునందా పుష్కర్‌కి విడాకులు ఇవ్వాలన్న పాయింట్ కూడా వుందని నళిని తెలిపారు.

తెలంగాణ సీఎంగా కేటీఆర్?

  తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్? ఇది ఒక ఊహాజనితమైన అంశం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. అందులో ఏ డౌట్ లేదు.. మరి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్ పేరు ఎందుకు వచ్చిందని డౌటు కదూ.. అది ఏమిటంటే, హైదరాబాద్‌లో జరిగిన ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు ‘‘సార్.. మీరే మా ముఖ్యమంత్రి అనుకుని మా సమస్యలు చెబుతున్నాం’’ అని ఆయనతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అలా కేటీఆర్‌ని ఆ మహిళలు ముఖ్యమంత్రిగా భావించి తమ సమస్యలు చెప్పుకున్నారు. అదీ అసలు విషయం! ఏమో.. ఆ మహిళల నోటి చలవ పుణ్యమా అని అన్నీ కలిసొస్తే భవిష్యత్తులో కేటీఆర్ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారేమో! ఉత్తర ప్రదేశ్‌లో ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ తరహాలో... ఏమంటారు?

స్కూలు బస్సు ప్రమాదం: 7 లక్షలు ఎక్స్‌గ్రేషియా

  మెదక్ జిల్లాలో స్కూలు బస్సును రైలు ఢీకొన్న ప్రమాదంలో మరణించిన చిన్నారుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కలసి ఏడు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాగా ప్రకటించాయి. ఇందులో తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు, కేంద్ర ప్రభుత్వం మూడు లక్షల రూపాయలు ఇస్తాయి. అలాగే ప్రమాదంలో గాయపడిన వారికి పాతికవేల రూపాయల ఆర్థిక సాయం చేయనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ గురువారం లోక్‌సభలో ప్రకటించారు. గాయపడిన చిన్నారుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు.

మరో విమానం అదృశ్యమైపోయింది.. మైగాడ్!

  విమానాలకు యమగండకాలం నడుస్తున్నట్టుగా వుంది. అందుకే వరుసపెట్టి విమాన దుర్ఘటనలు జరుగుతూ వున్నాయి. అల్జీరియా దేశానికి చెందిన అల్జీర్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఏహెచ్ 5017 నెంబరు గల విమానం ఒకటి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అదృశ్యం అయ్యింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు ఆ విమానంతో సంబంధాలు తెగిపోయాయి. రాడార్‌కి విమానం సిగ్నల్స్ అందడం లేదు. బుర్కినాఫాస్ నుంచి అల్జీర్స్‌.కి వెళ్తున్న ఈ విమానంలో మొత్తం 110 మంది ప్రయాణికులు, ఆరుగురు విమాన సిబ్బంది వున్నారు. మలేషియా ఎయిర్లైన్స్కు చెందిన ఎంహెచ్-370 విమానం నాలుగు నెలల క్రితం అదృశ్యం కాగా, దాని ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. ఇటీవల రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులలో మలేషియా ఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానాన్ని క్షిపణి తాకడంతో అది కూలిపోయి అందులో ఉన్న మొత్తం 295 మంది మరణించారు. బుధవారం నాడు తైవాన్‌కి చెందిన విమానం కుప్పకూలి 51 మంది మరణించారు. తాజాగా గురువారం నాడు అల్జీర్స్ విమానం 116 మందితో మాయమైపోయింది.

కరెంటు కట్.. కేసీఆర్, బాబు మీద వర్మ ట్విట్!

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కరెంట్ కోతల మీద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో కామెంట్ చేశారు. ఆ కామెంట్ కూడా మామూలుగా కాకుండా చాలా కామెడీగా చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో కరెంటు కోతలు వుండవనేది వర్మ ట్విట్ సారాంశం. అయితే వర్మ తన ట్విట్‌ని చాలా వెరైటీగా ఇచ్చాడు. ఇంతకీ ఆ ట్విట్‌లో ఏముందంటే, ‘‘కేసీఆర్, చంద్రబాబు నాయుడు ఏసీ లేకుండా నిద్రపోలేరు. అదువల్ల వారు కరెంట్ కోతల విషయంలో చాలా సీరియస్‌గా ఆలోచిస్తారని అనుకుంటున్నాను’’ అని వుంది. అలాగే వర్మ మరో ట్విట్‌లో గాంధీ, బాల్ థాక్రే కంటే కేసీఆర్ బాగా పనిచేస్తున్నారని అన్నారు. కేసీఆర్ని చూసి చంద్రబాబు నాయుడు నేర్చుకోవాల్సిన అవసరం వుందని చెప్పారు. వర్మ తాను తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగాడు కాబట్టి తాను కూడా తెలంగాణవాడినే అని చెప్పుకున్నాడు.

గాంధీ, బాల్ థాక్రే కంటే కేసీఆర్ బెటర్: వర్మ

  మొన్నటి వరకూ ట్విట్టర్‌లో టీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద మాటల బాణాలు వదిలిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఇప్పుడు ట్విట్టర్ వేదిక మీద కేసీఆర్ భజన మొదలుపెట్టాడు. కేసీఆర్‌కి అభిమానిగా మారిపోయినట్టుగా ట్విట్ చేశాడు. ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాగా పనిచేస్తున్నాడు. గాంధీ, బాల్ థాక్రే కంటే కేసీఆరే బాగా పనిచేస్తున్నాడు. ఆయన్ని చూసి చంద్రబాబు నాయుడు నేర్చుకోవాల్సింది చాలా వుంది. అయితే నేను చంద్రబాబు నాయుడిని తప్పు పట్టడం లేదు. నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను కాబట్టి నేను తెలంగాణవాడిని’’ అని వర్మ ట్విట్ చేశాడు. అసలు ఈ ట్విట్ ఎందుకు చేశాడో, దీని వెనుక వర్మ అంతరార్థమేమిటి అనేది ఆయనకే తెలియాలి.

ఊపిరి ఉన్నంత వరకూ ఇండియన్‌నే: సానియా

  తెలంగాణ ప్రభుత్వం టెన్నిస్ స్టార్ సానియా మిర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం పట్ల వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ కోడలిని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడమేంటన్న విమర్శలు వెల్లువెతుత్తున్నాయి. ఈ నేపథ్యంలో సానియా స్పందించింది. తాను తన ఊపిరి ఉన్నంతవరకూ భారతీయురాలేనని స్పష్టం చేసింది. తనను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడం తనకు బాధ కలిగిస్తోందని చెప్పింది. ఈ విషయంలో ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని వాపోయింది. ఎవరైనా తనను భారతీయురాలు కాదంటే తాను ఎంతమాత్రం అంగీకరించనని, తనపై విదేశీయురాలి ముద్ర వేయడాన్ని సహించలేనని సానియా చెప్పింది. తన కుటుంబం శతాబ్ద కాలంగా హైదరాబాద్‌లో నివసిస్తోందని సానియా గుర్తు చేసింది. తనను విమర్శిస్తున్నవారు అనవసర విషయాల మీద సమయాన్ని వృధా చేయకుండా దేశానికి ఉపయోగపడే అంశాల మీద దృష్టి పెడితే బాగుంటుందని సానియా సలహా ఇచ్చింది.

ఇద్దరు పిల్లలూ మృతి.. తండ్రికి గుండెపోటు!

  మెదక్ జిల్లా మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట స్కూలు బస్సును రైలు ఢీకొన్న సంఘటనలో రజియా, వహీద్ అనే ఇద్దరు అక్కా తమ్ముళ్ళు అక్కడికక్కడే చనిపోయారు. వీరిద్దరూ సమీపంలోని కిష్టాపూర్‌ గ్రామానికి చెందినవారు. తన ఇద్దరు పిల్లలూ ప్రమాదంలో చనిపోయారని తెలియగానే వారి తండ్రికి గుండెపోటు వచ్చింది. ప్రమాదకరమైన పరిస్థితిలో వున్న ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. కాగా,యాక్సిడెంట్‌కి గురైన బస్సును డ్రైవ్ చేసింది రెగ్యులర్‌గా బస్ డ్రైవ్ చేసే డ్రైవర్ కాదు.. ఒక ట్రాక్టర్ డ్రైవర్. బస్సు డ్రైవర్ సెలవు పెట్టడంతో పాఠశాల యాజమాన్యం ఒక ట్రాక్టర్ డ్రైవర్ని పిల్లలను తీసుకురమ్మని బస్సు ఇచ్చి పంపినట్టు తెలిసింది. ట్రాక్టర్ నడిపే వ్యక్తి నిర్లక్ష్యంగా బస్సును నడపడంతో ఇంత ఘోరం జరిగింది. స్కూలు బస్సులో మొత్తం 38 మంది ఉన్నారు. వారిలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరో ఏడుగురు ప్రాణాలు విడిచారు. మరో 15 చిన్నారులు మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నుంచి కేవలం ముగ్గురు చిన్నారులు మాత్రమే సురక్షితంగా బయట పడ్డారు.

అతను బస్సు డ్రైవర్ కాదు.. ట్రాక్టర్ డ్రైవర్!

  మెదక్ జిల్లాలో రైలు ఢీకొన్ని స్కూలు బస్సుకు సంబంధించి షాకింగ్‌కి గురిచేసే విషయం ఒకటి బయటపడింది. యాక్సిడెంట్‌కి గురైన బస్సును డ్రైవ్ చేసింది రెగ్యులర్‌గా బస్ డ్రైవ్ చేసే డ్రైవర్ కాదు.. ఒక ట్రాక్టర్ డ్రైవర్. బస్సు డ్రైవర్ సెలవు పెట్టడంతో పాఠశాల యాజమాన్యం ఒక ట్రాక్టర్ డ్రైవర్ని పిల్లలను తీసుకురమ్మని బస్సు ఇచ్చి పంపినట్టు తెలిసింది. ట్రాక్టర్ నడిపే వ్యక్తి నిర్లక్ష్యంగా బస్సును నడపడంతో ఇంత ఘోరం జరిగింది. స్కూలు బస్సులో మొత్తం 38 మంది ఉన్నారు. వారిలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరో ఏడుగురు ప్రాణాలు విడిచారు. మరో 15 చిన్నారులు మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నుంచి కేవలం ముగ్గురు చిన్నారులు మాత్రమే సురక్షితంగా బయట పడ్డారు.

స్కూలు బస్ ప్రమాదం: నాందేడ్ ప్యాసింజర్ డ్రైవర్ షాక్!

  నాలుగు గంటలు ఆలస్యంగా నడుస్తున్న నాందేడ్ ప్యాసింజర్ సరిగ్గా మెదక్ జిల్లా మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట క్రాసింగ్ దగ్గరకి వచ్చింది. సరిగ్గా అక్కడకి రైలు వేగంగా వచ్చేసరికి ట్రాక్ మీద అడ్డంగా వున్న స్కూలు బస్సును చూసి రైలు డ్రైవర్ బిక్షపతిగౌడ్ షాక్ అయ్యాడు. కనీసం బ్రేక్ వేసి రైలు ఆపే అవకాశం కూడా లేకపోవడంతో బస్సును ఢీకొని రైలు ముందుకు ఈడ్చుకుపోయింది. అకస్మాత్తుగా జరిగిన సంఘటన ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న రైలు డ్రైవర్ బిక్షపతి గౌడ్ సడెన్ బ్రేక్ కూడా వేయలేకపోయాడు. ఎందుకంటే రైలుకు సడెన్ బ్రేక్ వేస్తే వెనుక వున్న బోగీలన్నీ పట్టాలు తప్పి ఇంకా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం వుంది. అందుకే రైలు డ్రైవర్ రైలుకు నెమ్మదిగా బ్రేకులు వేశాడు. అయినప్పటికీ ప్రమాదానికి గురైన బస్సును అర కిలోమీటర్ దూరం ఈడ్చుకు వెళ్ళిన తర్వాతే రైలు ఆగింది. ఈ అరకిలోమీటరు దూరం రైల్వే ట్రాక్ రక్తసిక్తమైంది.