దేశ రాజధానిలో మరో ఘోరం!

  ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా మహిళల మీద అత్యాచారాలు ఆగడం లేదు. దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి మరో ఘోరం జరిగింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థిని మీద ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఈనెల 19వ తేదీన జరిగింది. అయితే ఈ విషయాన్ని ఇంతకాలం గుండెలో అదుముకుని కుమిలిపోతున్న బాధితురాలు చివరికి పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది. పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. బడికి వెళ్తున్న ఈ బాలికని ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి, అత్యాచారం జరిపారు. ఈ తతంగాన్ని వీడియో తీసి ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోను ఇంటర్నెట్‌లో పెడతామని ఆ బాలికని బెదిరించారు. అయితే ఆ బాలిక తెగువ ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు యువకులలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ద్వారం కూల్చివేత

  ఆంద్రప్రదేశ్ శాసనసభకు అవమానం, అపచారం జరిగాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రవేశ ద్వారాన్ని ఒక వ్యక్తి పగులగొట్టాడు. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తి ఎవరు, ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి, అసెంబ్లీ ద్వారాన్ని కూల్చివేయాల్సిన అవసరం అతనికి ఎందుకు వచ్చింది.. ఇలాంటి చర్య చేయడానికి అతనిని ఎవరైనా ప్రేరేపించారా.. అనే ప్రశ్నలకు అతని నుంచి సమాధానం రాబట్టడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్‌ నగరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారికి, వారికి సంబంధించిన ఆస్తులకు, అంశాలకు రక్షణ కరవైందన్న ఆరోపణలు వినవస్తున్న తరుణంలో జరిగిన ఈ సంఘటన ఈ అంశంలో కేంద్రం మరింత తీవ్రంగా ఆలోచించాల్సిన విషయాన్ని గుర్తు చేస్తోంది.

కిడ్నాపైన ఇంజనీర్లు విడుదల

  నాగాలాండ్ రాష్ట్రంలో ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన ఇద్దరు తెలుగు ఇంజనీర్లు ప్రతీష్ చంద్ర, రఘు విడుదలయ్యారు. ఈ ఇద్దరు ఇంజనీర్లు పనిచేస్తున్న ప‌ృథ్వి కన్‌స్ట్రక్షన్స్, రత్నా కన్‌స్ట్రక్షన్స్ ప్రతినిధులు ఉగ్రవాదులతో జరిపిన చర్చలు ఫలించడంతో ఇంజనీర్లు విడుదలయ్యారు. కిడ్నాపైన ఇంజనీర్లను విడిపించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న శ్రద్ధ కూడా వీరు త్వరగా విడుదల కావడానికి దోహదపడిందని తెలుస్తోంది. విడుదలైన ఇద్దరు ఇంజనీర్లు బుధవారం సాయంత్రానికి విజయవాడ చేరుకునే అవకాశం వుంది. కాగా ఇంజనీర్లు పనిచేస్తున్న కంపెనీల యాజమాన్యం ఉగ్రవాదులకు భారీ మొత్తం ముట్టజెప్పడం వల్లే వీరిని విడుదల చేశారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేస్తున్న తెలుగువారు కిడ్నాప్‌లకు గురవుతున్నారు. ముందుముందు ఇలాంటి కిడ్నాప్‌లు జరగకుండా నివారించాల్సిన అవసరం వుంది.

మల్లికా షెరావత్‌ మీద కేసు పెట్టారు!!

  బాలీవుడ్ మసాలా తార మల్లికా షెరావత్ మీద కోర్టులో కేసు నమోదైంది. మల్లికా షెరావత్ తాజాగా నటించిన ‘డర్టీ పాలిటిక్స్’ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం మల్లికా షెరావత్ జాతీయ పతాకాన్ని ఒంటికి చుట్టుకుని సెక్సీ పోజులు ఇవ్వడం వివాదాస్పదమైంది. ఈ సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో మల్లికా షెరావత్ మీద కేసు నమోదైంది. భారత జాతీయ పతాకాన్ని అవమానించిన మల్లికా షెరావత్‌ మీద తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైదరాబాద్ హై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. జాతీయ పతాకాన్ని ఒంటికి చుట్టుకోవడం అంటే జాతీయ పతాకాన్ని అవమానించడమేనని, ఈ విషయంలో మల్లికా షెరావత్ మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పిల్ వేశారు. హైదరాబాద్‌కి చెందిన ఒక సామాజిక కార్యకర్త ఈ కేసును దాఖలు చేశారు.

ధనుష్‌ కొత్త ఇల్లు కూల్చివేత!

  తమిళ హీరో ధనుష్ కోయంబత్తూరు జిల్లాలో నిర్మిస్తున్న అత్యంత అధునాతన భవనాన్ని తమిళనాడు అధికారులు మంగళవారం నాడు నేలమట్టం చేశారు. కోయంబత్తూరు జిల్లాలోని వైదేహీ నీర్‌విళిచ్చి ప్రాంతంలో ధనుష్ ఒక పెద్ద భవంతిని నిర్మిస్తున్నారు. అయితే ఈ భవనం అటవీశాఖకు సంబంధించిన స్థలంలో నిర్మించారని, ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అందుకనే కూల్చివేయడం జరిగిందని అధికారులు చెబుతున్నారు. మంగళవారం నాడు ధనుష్ పుట్టినరోజు జరుపుకున్నారు. ధనుష్ పుట్టినరోజు నాడే ఆయన ఎంతో ఇష్టపడి కట్టుకుంటున్న భవనాన్ని కూల్చివేయడం చాలా బాధాకరమని ఆయన అభిమానులు అంటున్నారు. ధనుష్ తాజాగా హీరోగా నటించి, నిర్మించిన ‘ఇల్లా పట్టదారి’ సినిమా ఘన విజయం సాధించింది. ఈ కూల్చివేత ఘటన ఆ ఆనందాన్ని కూడా ఆవిరిచేసేసింది.

ఇంజనీర్లని రక్షించండి ప్లీజ్: కంభంపాటి

  నాగాలాండ్‌లో విజయవాడకు చెందిన ఇద్దరు తెలుగు ఇంజనీర్లు ప్రతీష్ చంద్ర, రఘులను తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. నాగాలాండ్‌లో కన్‌స్ట్రక్షన్ కాంట్రాక్టులు నిర్వహించే పృథ్వి కన్‌స్ట్రక్షన్స్ సంస్థలో వీరిద్దరూ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఈ కిడ్నాప్ సంగతి తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. కిడ్నాపైన ఇంజనీర్లను రక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కంభంపాటి రామ్మోహనరావు నాగాలాండ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీతో ఫోన్‌లో మాట్లాడి విజ్ఞప్తి చేశారు. ఈ విషయం మీద నాగాలాండ్ అధికారులతో ఆంధ్రప్రదేశ్ అధికారులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు.

యథాతథంగా ఎంసెట్ కౌన్సిలింగ్

  విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో వుంచుకుని ఎంసెట్ కౌన్సిలింగ్‌ను యథాతథంగా నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎంసెట్ కౌన్సిలింగ్‌ను ఆలస్యం చేసినట్టయితే విద్యార్థుల భవిష్యత్తు పాడువుతుందని, విద్యా సంవత్సరం ఆలస్యమైతే విద్యార్థుల పీజీ కోర్సుల నుంచి ఉద్యోగాల వరకు ప్రతి విషయంలోనూ నష్టం జరుగుతుందని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. అందువల్ల ఎంసెట్ కోచింగ్ యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఎంసెట్ కౌన్సిలింగ్‌ను నిర్వహించాలని తాము తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించినప్పటికీ కౌన్సిలింగ్ ఆపకూడదని ఉన్నత విద్యామండలి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎంసెట్ కౌన్సిలింగ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ఉన్నత విద్యామండలి ప్రయత్నాలు చేస్తుంది. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోకపోయినప్పటికీ కౌన్సిలింగ్ యథాతథంగా జరుగుతుంది.

నాగాలాండ్‌లో ఇద్దరు తెలుగు ఇంజనీర్ల కిడ్నాప్

  నాగాలాండ్ రాష్ట్రంలో ఇద్దరు తెలుగు ఇంజనీర్లు కిడ్నాప్ అయ్యారు. వీరిని తీవ్రవాదులు కిడ్నాప్ చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాగాలాండ్‌లో కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తున్న పృథ్వి కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు చెందిన ఇద్దరు ఇంజనీర్లు గోగినేని ప్రతీష్ చంద్ర, రఘులను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు. ఈశాన్య రాష్ట్రాలలో కాంట్రాక్ట్ పనులు చేసే సంస్థలకు చెందిన ఉద్యోగులను తీవ్రవాదులు కిడ్నాప్ చేయడం, వారిని విడిచిపెట్టాలంటే భారీగా డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేయడం ఈమధ్యకాలంలో సాధారణంగా మారింది. కొద్ది నెలల క్రితం అస్సాం రాష్ట్రంలో నాగమల్లేశ్వరరావు అనే ఇంజనీర్ని తీవ్రవాదులు కిడ్నాప్ చేసి, వారికి ముట్టవలసినవి ముట్టిన తర్వాత ఆయనని విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా నాగాలాండ్‌లో ఇద్దరు తెలుగు ఇంజనీర్లు కిడ్నాప్ అయ్యారు.

సచిన్ తొడకొట్టాడు...!!

  భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తొడ కొట్టాడు. నమ్మ బుద్ధి కావడం లేదా.. ఇది నిజంగా నిజం.. సచిన్ జంటిల్మన్ అనే మాట ఎంత నిజమో, ఆయన పక్కా మాస్ హీరోలాగా తొడ కొట్టారన్న మాట కూడా అంతే నిజం. ముంబైలో ప్రొ కబడ్డీ లీగ్ కార్యక్రమ ప్రారంభోత్సవంలో సచిన్ టెండూల్కర్ సతీ సమేతంగా అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అమితాబ్ దంపతులు, అభిషేక్ బచ్చన్ దంపతులు, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక కబడ్డీ మ్యాచ్ ప్రారంభానికి ముందు అమీర్‌ఖాన్, సచిన్ టెండూల్కర్ ఇద్దరూ కబడ్డీ గ్రౌండ్‌లోకి వచ్చి కబడ్డీ ఆడుతున్నట్టుగా అభినయించారు. ఈ సందర్భంగా ఇద్దరూ కబడ్డీ ఆట తరహాలో తొడలు కొట్టారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూసిన అందరూ కరతాళ ధ్వనులు చేశారు.

ఖమ్మం జిల్లాలో వర్షం ఫుల్లు

  ఖమ్మం జిల్లాలో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. ఇంతకాలం చుక్క నీరులేక ఎండిపోయిన నోళ్ళు తెరిచిన ఖమ్మం జిల్లా భూములు ఇప్పుడు హాయిగా వాన నీటిని ఆస్వాదిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలోని చింతూరులో 17.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో ఖమ్మం జిల్లాలో ఇదే అత్యధిక వర్షపాతం. జిల్లాలోని కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లందు, మణుగూరు ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వర్షపు నీరు భారీగా చేరింది. దాంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. జిల్లాలోని తాలిపేరు రిజర్వాయర్‌కి భారీగా వరదనీరు చేరడంతో 17 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు.

మెదక్ ప్రమాదం: తరుణ్, వైష్ణవి మృతి

మాసాయిపేట ఘటనలో తీవ్రంగా గాయపడి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరూ చిన్నారులు మృతి చెందారు. సోమవారం సాయంత్రం చిన్నారి తరుణ్ మృతి చెందగా, ఈ రోజు ఉదయం 11 ఏళ్ల వైష్ణవి తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. తరుణ్ తలకు తీవ్ర గాయాలై, తీవ్ర రక్తస్రావం కావడంతో చిన్నారి శరీరం వైద్యానికి సహకరించలేదు. అలాగే చిన్నారి వైష్ణవి పరిస్థితి విషమంగా ఉందని నిన్ననే వైద్యులు చెప్పారు. ఉదయమే ఆ బాలిక చనిపోవటంతో అక్కడ విషాదపరిస్థితి నెలకొంది. చిన్నారుల మృతితో యశోద ఆసుపత్రి ప్రాంగణం కుటుంబీకుల రోదనలతో శోకసంద్రంగా మారింది. చిన్నారి తల్లిదండ్రులను ఆక్రందనలు అందర్నీ కదిలించాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. మాసాయిపేట రైలు ప్రమాద మృతుల సంఖ్య 18కు చేరింది.

12 మందిని పొట్టన పెట్టుకున్న కంటైనర్

  బీహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిద్రిస్తున్న వారిపైనుంచి కంటైనర్ దూసుకువెళ్ళడంతో 12 మంది మరణించారు. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో ఐదుగురు మహిళలు వున్నారు. న్యూఢిల్లీ నుంచి కోల్‌కతా వరకు వున్న నేషనల్ హైవే నంబర్ 2లో ఔరంగాబాద్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ‘కన్వారీస్’ అనే పిలిచే శివదీక్షను ధరించిన భక్తులు జార్ఖండ్‌లోని దియోఘర్ దేవాలయానికి పాదయాత్ర చేస్తూ వెళ్తున్నారు. రాత్రి సమయం కావడంతో వీరందరూ రోడ్డు పక్కన నిద్రిస్తున్నారు. మంగళవారం తెల్లవారుఝామున వేగంగా ప్రయాణిస్తున్న కంటైనర్ నిద్రిస్తున్న వారి మీద నుంచి దూసుకుపోవడంతో ఈ ఘోరం జరిగింది.

ఈ నెల 30న ఎంసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్

సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ పై ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. సోమవారం సమావేశమైన ఉన్నత విద్యామండలి ఈ నెల 30 న ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ తేదీని వెల్లడించాలని నిర్ణయించింది. ఆగష్టు 7 నుంచి ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన ముగిసే లోపు తమ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ ప్రభుత్వాల ముందుంచుతారు. కౌన్సిలింగ్ అవసరమైన చర్యలు పూర్తి చేయాలని కూడా ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అధికారులు లేకున్నా కోరం ఉన్నందున కౌన్సిలింగ్ తేదీలపై నిర్ణయాన్ని వెలువరించారు. ఈ సమావేశానికి తెలంగాణ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ హాజరుకాలేదు.

వైద్య చరిత్రలో అద్భుతం జరిగింది

  ప్రపంచ వైద్య చరిత్రలో అద్భుతం జరిగింది. సాధారణంగా గర్భిణిగా వున్న స్త్రీ మరణిస్తే ఆమె గర్భంలో వున్న శిశువు కూడా చనిపోతుంది. అయితే గాజా అల్లర్ల నేపథ్యంలో పాలస్తీనాలో ఒక నిండు గర్భిణి పేలుళ్ళ కారణంగా మరణించింది. అయితే ఆమె గర్భంలో వున్న శిశువును అయినా బతికించాలన్న ఉద్దేశంతో డాక్టర్లు చాలా అర్జెంటుగా ఆ తల్లి మృతదేహానికే సర్జరీ చేశారు. ఆశ్చర్యకరంగా ఆమె కడుపులో వున్న ఆడశిశువు అప్పటికి బతికే వుంది. డాక్టర్లు ఆ పాపని ‘మిరాకిల్ బేబీ’ అని పిలుస్తున్నారు. తల్లి మరణించాక కడుపులో వున్న బిడ్డ బతికి వుండటం అనేది చాలా అరుదుగా జరుగుతూ వుంటుందని, ఒకవేళ గర్భిణి చనిపోయినప్పటికీ కొన్ని నిమిషాల వ్యవధిలో సర్జరీ చేసి బిడ్డను బయటకి తీసినట్టయితే బతికే అవకాశాలు వుంటాయని డాక్టర్లు చెబుతున్నారు. గాజా అల్లర్లలో ఆ తల్లి చనిపోయినప్పటికీ ఆ తల్లి కలలు మాత్రం ఇప్పుడు సజీవంగా వున్నాయి.

మరో స్కూలు బస్సు ప్రమాదం: నో ప్రాబ్లం

  మెదక్ జిల్లా మాసాయిపల్లిలో జరిగిన స్కూలు బస్సు, రైలు ప్రమాదం విషాద జ్ఞాపకాలు ఇంకా అందర్నీ వెంటాడుతూనే వున్నాయి. అయినా కొంతమంది స్కూలు బస్సు డ్రైవర్లకు బుద్ధి వచ్చినట్టు కనిపించడం లేదు. రంగారెడ్డి జిల్లా కీసర మండంలోని బండ్ల గూడ దగ్గర ఓ పాఠశాల బస్సు వేగంగా వచ్చి ఒక ట్రాక్టర్ని, రెండు కార్లను ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు తీవ్ర కుదుపులకు గురైంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. అలాగే కార్లలో వున్నవారికి, ట్రాక్టర్ నడిపే వ్యక్తికి ఎలాంటి గాయాలు తగలలేదు. స్కూలు బస్సును నడుపుతున్న డ్రైవర్ తప్పతాగి బస్సును నడిపినట్టు తెలుస్తోంది.

మెదక్ రైలు ప్రమాదం: ఏడుగురు ఇంటికి

మెదక్ జిల్లా బస్సు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులలో 12 మంది ఆరోగ్యం కుదుటపడిన విషయం తెలిసిందే. వారికి ఇక ఏ ప్రమాదమూ లేదని వైద్యులు చెప్పారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..గాయపడిన విద్యార్థులలో ఏడుగురిని యశోదా ఆసుపత్రి వైద్యులు ఈ రోజు డిశ్చార్జ్ చేశారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు మాట్లాడుతూ... కోలుకుంటున్న మరో ఏడుగురు విద్యార్థులను రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. మొత్తం 20 మంది విద్యార్థులు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతు౦డగా వారిలో ఇంకా ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు.

రోడ్లపై రేసింగ్‌లు చేస్తే చిప్పకూడే..!!

రోడ్లపై రేసింగ్‌లకు పాల్పడితే ఇక నుంచి జైలు శిక్ష తప్పదని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. సైబరాబాద్‌లో జరుగుతున్న రేసింగ్, బెట్టింగ్‌లపై కమిషనర్ స్పందిస్తూ రేసింగ్‌ల వల్ల యువకులతో పాటు ఇతర వాహనదారులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. కొందరు యువకులు ద్విచక్రవాహనాలతో రోడ్లపై రేసింగ్‌లకు పాల్పడడమే కాకుండా పోకిరీ చేష్టలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి, నార్సింగిలో 80మంది యువకులను అదుపులోకి తీసుకున్నట్లు కమిషనర్ వివరించారు. ప్రస్తుతానికి యువకుల తల్లిదండ్రుల పూచీకత్తుపై వారిని వదిలిపెడుతున్నట్లు సీపీ తెలిపారు. ఇక నుంచి రేసింగ్‌లకు పాల్పడే యువకులపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామన్నారు.