భార్యని చంపి తననీ కాల్చుకున్న కానిస్టేబుల్!

  చండీఘర్‌లో ఒక కానిస్టేబుల్ దారుణానికి ఒడిగట్టాడు. తన సర్వీస్ తుపాకీతో తన భార్యమీద కాల్పులు జరిపి దారుణంగా చంపాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. ఒక ఆస్పత్రి గేటు దగ్గర ఈ సంఘటన జరిగింది. తనను తాను కాల్చుకున్న కానిస్టేబుల్ చావు బతుకులతో పోరాడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కానిస్టేబుల్ కూడా బతికే అవకాశం చాలా తక్కువ అని తెలుస్తోంది. కానిస్టేబుల్ జరిపిన కాల్పుల్లో అతని భార్య చనిపోగా, దారిన పోతున్న ఓ మహిళకు బుల్లెట్ గాయాలు తగిలి గాయపడింది. కానిస్టేబుల్ ఈ ఘాతుకానికి ఒడిగట్టడానికి కారణాలు ఇంకా స్పష్టంగా తెలియకపోయినప్పటికీ, కుటుంబ కలహాల కారణంగానే ఈ సంఘటన జరిగి వుంటుందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.

కూలిన అల్జీరియా విమానం.. ఉగ్రవాద కోణం!!

  110 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో ప్రయాణిస్తున్న అల్జీరియాకు చెందిన ఒక పౌరవిమానం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ విమానం సహారా ఎడారి ప్రాంతంలో కూలిపోయి వుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. విమానంలో వున్నవారు ఎవరూ బతికి వుండే అవకాశం లేదని చెబుతున్నారు. ఈ విమానం చాలా పాత విమానం అని కూడా వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ విమాన ప్రమాదంలో ఉగ్రవాద కోణాన్ని కూడా చూస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ విమానంపై గుర్తు తెలియని తీవ్రవాదులు దాడి చేసి ఉంటారన్న కోణంలో కూడా నిపుణులు అద్యయనం చేస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో ఇందుకు అవకాశాలు తక్కువ అని నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో వాతావరణం చాలా ప్రతికూలంగా ఉన్న విషయం తెలిసిందే కాబట్టి విమానం ఆ పరిస్థితిని తట్టుకోలేక కూలిపోయి ఉండవచ్చునని భావిస్తున్నారు.

మాసాయిపేట ప్రమాదం: ఆ విద్యార్థి బతికే వున్నాడు!

  మెదక్ జిల్లా మాసాయిపేటలో స్కూలు బస్సును రైలు ఢీకొన్న ప్రమాదంలో 16 మంది విద్యార్థులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చనిపోయిన విద్యార్థి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అందజేయడంలో జరిగిన పొరపాటు గందరగోళాన్ని సృష్టించింది. ఈ ప్రమాదంలో చనిపోయిన దత్తు అనే విద్యార్థి మృతదేహాన్ని దర్శన్‌గౌడ్ అనే విద్యార్థి మృతదేహంగా భావించిన వైద్యులు ఆ మృతదేహాన్ని దర్శన్‌గౌడ్ తల్లిదండ్రులకు అప్పగించారు. దర్శన్‌గౌడ్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతూ ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే గాయపడిన విద్యార్థులలో ఒక విద్యార్థి స్పృహలోకి వచ్చి, తనపేరు దర్శన్ గౌడ్ అని తన తల్లిదండ్రుల వివరాలను చెప్పడంతో వైద్యులు షాక్ అయ్యారు. దర్శన్ గౌడ్ తల్లిదండ్రులను పిలిపించగా వారు ఎంతో ఆనందంతో ఆస్పత్రికి వచ్చి తమ కుమారుడిని గుర్తించి గుండెలకు హత్తుకున్నారు. చనిపోయాడని భావించి అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత తమ కుమారుడు బతికే ఉండటం చూసి ఆ తల్లిదండ్రుల ఆనందానికి అంతులేకుండా పోయింది. ఇదే సమయంలో వారు అంత్యక్రియలు జరిపిన విద్యార్థి మృతదేహం ఎవరిదని పరిశీలిస్తే అది దత్తు అనే విద్యార్థి మృతదేహంగా తేలింది.

నా భర్త నుంచి కాపాడండి బాబోయ్: ఉన్నతాధికారి!!

  సామాన్య మహిళలే కాదు.. ఉన్నతాధికారులుగా వున్న మహిళలు కూడా భర్తల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఆవేదన తాజాగా మరొకటి బయటపడింది. తనను, తన పిల్లల్ని చంపేస్తానని బెదిరిస్తున్న తన భర్త నుంచి తనకు రక్షణ కల్పించాలని ఓ ఉన్నతాధికారి మహిళ పోలీసులను ఆశ్చయించింది. తన భర్త తన బాగు, తన పిల్లల బాగు పట్టించుకోకపోవడమే కాక ఇప్పుడు తమని చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని, తన భర్త నుంచి రక్షణ కల్పించాలని రాష్ట్రస్థాయిలో అత్యున్నత స్థాయి సర్వీసుకు చెందిన గ్రూప్-1 అధికారి విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన నిర్మల పోలీసులను వేడుకుంది. ఆయుర్వేద డాక్టర్ అయిన తన భర్త తనను చంపేస్తాడని, తనకు రక్షణ కల్పించాలని ఆమె పోలీసులను వేడుకుంటోంది.

కామన్వెల్త్ గేమ్స్: భారత్ బంగారు బోణీ!

  గ్లాస్కోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశం మొదటిరోజే బంగారు పతకంతో బోణీ కొట్టింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్ 48 కిలోల విభాగంలో సంజితా చాను స్వర్ణ పతకం, సయకొమ్ మీరాబాయ్ చాను రజత పతకం కైవసం చేసుకున్నారు. కాంస్య పతకాన్ని నైజీరియాకు చెందిన కెచి ఓపరా గెలిచింది. జూడో క్రీడలో భారత్ మూడు పతకాలు కైవసం చేసుకుంది. పురుషుల 60 కేజీల విభాగంలో నవ్‌జోత్ చనా, మహిళల 48 కేజీల విభాగంలో సుశీలా లిక్మబామ్ రజతాలు గెలుచుకున్నారు. ఇక, మహిళల 52 కిలోల విభాగంలో కల్పనా తౌడమ్ కాంస్యంతో సరిపెట్టుకుంది. దీంతో, తొలిరోజు భారత్ ఖాతాలో మొత్తం ఏడు పతకాలు చేరాయి. మొత్తమ్మీద పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో ఉంది.

అల్జీరియా విమానం కూలింది.. కానీ.. ఎక్కడుంది?

  అల్జీరియాకు చెందిన ఒక పౌరవిమానం గురువారంనాడు బుర్కినా ఫాసో నుంచి అల్జీర్స్‌కు వస్తుండగా కూలిపోయింది. ఈ విమానంలో 110 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. టేకాఫ్ తర్వాత ఈ విమానం జాడ కనిపించలేదు. అయితే ఈ విమానం కూలిపోయిందని అధికారులు నిర్ధారణగా చెబుతున్నారు. అయితే ఎక్కడ కూలిందన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. మొదట ఓ నదిలో కూలిపోయిందన్న వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఎడారిలో కూలిపోయిందని అన్నారు. తాజాగా మాలీ ప్రాంతంలో ఈ విమానం కూలిపోయిందని అంటున్నారు. భారీగా వర్షం కురుస్తూ వుండడం, ప్రచండ గాలులు వీస్తూ వుండడం వల్ల ఈ విమానం కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఈ విమానంలో ఎక్కువమంది ఫ్రెంచ్, స్పానిష్ జాతీయులే వున్నట్టు తెలుస్తోంది.

చంద్రబాబు పుట్టపర్తి సందర్శన!

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన గురువారం నాడు ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం పుట్టపర్తిని సందర్శించారు. ట్రస్టు సభ్యులు రత్నాకర్, చక్రవర్తి తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అనంతరం సత్యసాయి మహాసమాధిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దర్శించుకున్నారు. అనంతరం చంద్రబాబు శాంతిభవన్ అతిథి గృహంలో ట్రస్టు వర్గాలతో ప్రత్యేకంగా చర్చించారు. ట్రస్టు సేవల గురించి ముఖ్యమంత్రి ట్రస్టు సభ్యుల నుంచి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. పుట్టపర్తి అభివృద్ధి, సత్యసాయి ట్రస్టుకు ప్రభుత్వ పరంగా అన్నివిధాలు చేయూతనిస్తానని ముఖ్యమంత్రి ట్రస్టు సభ్యులకు భరోసా ఇచ్చినట్లు సమాచారం.

భర్తని ఇనుప రాడ్‌తో కొట్టి చంపిన భార్య

  కరీంనగర్ జిల్లాలో ఓ భార్య తన భర్తని ఐరన్ రాడ్‌తో కొట్టి చంపేసింది. కరీంనగర్ జిల్లా గోదావరిఖని ఐడీ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. భర్త సర్దుకుపోతున్నా భార్య ఆవేశంతో ఊగిపోతూ అక్కడే వున్న ఇనుప రాడ్‌తో భర్త తలమీద ఒక్క వేటు వేసింది. దాంతో ఆ భర్త అక్కడిక్కడే మరణించాడు. కుటుంబ కలహాల కారణంగానే ఈ హత్య జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. భార్యను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

తెలంగాణ కేబుల్ ఆపరేటర్లకు కేంద్రం నోటీసులు!!

  తెలంగాణ వ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లు రెండు టివీ చానళ్ల ప్రసారాలను నిలిపివేసిన అంశంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్ర సమాచార శాఖ మంత్రిత్వ శాఖ తెలంగాణలోని కేబుల్ ఆపరేటర్లకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఛానళ్ళ ప్రసారం నిలిపివేయడం చట్ట విరుద్ధమని, కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ నిబంధనలు, 1994లోని 16వ ఉప నిబంధన కింద మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో మూడు రోజుల్లో తెలపాలంటూ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఎంఎస్‌వోలకూ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. అలాగే ట్రాయ్‌ నిబంధనలకు వ్యతిరేకంగా చానళ్లను ఎందుకు నిషేధించారో ఆగస్టు 11 నాటికి తెలపాలంటూ టెలిఫోన్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఎంఎస్‌వోలకూ నోటీసులు జారీచేసింది.

సానియాకి కోటి ఓకే.. నా డబ్బుల మాటేంటి: సైనా!!

  టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన వివాదం ఇంకా రగులుతూనే వుంది. ఇంతలో మరో క్రీడాకారిణి నా సంగతేంటంటూ రంగంలోకి వచ్చింది. ఆమె మరెవరో కాదు. బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్. 2012లో లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం తనకు ప్రభుత్వం నుంచి అందాల్సిన మొత్తం ఇప్పటికీ అందలేదని సైనా వ్యాఖ్యానించింది. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మీర్జా ఎంపిక కావడం, ఆమెకు కోటి రూపాయలు నజరానాగా ఇవ్వడం నాకు సంతోషాన్ని కలిగించే అంశమే. అయితే నేను నా సంగతి ఏమిటని అడుగుతున్నాను. రెండేళ్ల క్రితం ఒలింపిక్స్‌లో దేశానికి కాంస్య పతకం అందించాను. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన నగదు ప్రోత్సాహకమే రాష్ట్ర ప్రభుత్వంనుంచి దక్కకపోవడం నాకు బాధ కలిగిస్తోంది’ అని సైనా నెహ్వాల్ ట్వీట్ చేసింది. సైనా ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన సమయంలో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆమెకి 50 లక్షలు బహుమతి ప్రకటించారు.

కృష్ణాజిల్లాలో స్కూలు బస్సుకు ప్రమాదం!!

  మెదక్ జిల్లాలో స్కూలు బస్సును రైలు ఢీకొన్న ప్రమాదంలో 16 మంది పిల్లలు, డ్రైవరు, క్లీనర్ మరణించిన సంఘటన ఇంకా తెలుగువారి గుండెలను పిండేస్తున్న తరుణంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లాలో మరో స్కూలు బస్సు ప్రమాదానికి గురైంది. కృష్ణాజిల్లా జగయ్యపేట మండలం రామచంద్రునిపేటలో ఓ స్కూలు బస్సు ప్రయాణిస్తుండగా బస్సు రెండు వెనుక చక్రాలు అకస్మాత్తుగా ఊడిపోయాయి. ఈ విషయాన్ని గ్రహించిన డ్రైవర్ బస్సును ఆపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు తక్కువ వేగంతో వెళ్ళడం వల్ల కూడా పెద్ద ప్రమాదం సంభవించలేదు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 48 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు.

‘అల్లుడు శీను’ మూవీ టాక్!

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తన కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ సమంత కథానాయికగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ‘అల్లుడు శీను’ సినిమా ఈరోజే విడుదల. గత రెండు మూడు రోజులుగా ఈ సినిమాని ఇండస్ట్రీలోని ప్రముఖులకు ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాగుందని అభినందిస్తున్నారు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అయితే ప్రెస్ మీట్ పెట్టి మరీ బెల్లంకొండ శ్రీనివాస్‌ని, సినిమాని అభినందించారు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ చాలా ఈజ్‌గా నటించాడని, కథాంశం బాగుందని, వినాయక్ స్టయిల్లో అదిరిపోయేలా సినిమా వుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా భారీ నిర్మాణ విలువలతో రూపొందిందని, పాటల కోసం వేసిన సెట్స్ అద్భుతమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఈ పాపం రైల్వేదే: తెలంగాణ ప్రభుత్వం

  మాసాయిపేట రైల్వేక్రాసింగ్‌ దుర్ఘటనలో చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడానికి రైల్వే శాఖదే పూర్తి బాధ్యత అని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇంత ఘోరం జరిగిందని తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రమాద సంఘటనపై రైల్వే శాఖ మంత్రి మాట్లాడిన తీరు సరైన విధానం కాదన్నారు. సౌత్‌సెంట్రల్‌ రైల్వేజోన్‌ జీఎం శ్రీవాస్తవ్‌ను మూడు రోజుల క్రితం గ్రామస్థులు కలిసి గేట్‌ ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ ఆయన ఎంతమాత్రం స్పందించలేదని చెప్పారు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం ఇంత మంది చిన్నారుల ప్రాణాలను బలిగొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని ప్రతి రైల్వేక్రాసింగ్‌ వద్ద గేట్లు ఏర్పాటు చేయడానికి తమ ప్రభుత్వం సైతం ఖర్చు భరిస్తుందని హరీష్ రావు ప్రకటించారు. జరిగిన ప్రమాదంలో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ముఖ్యమంత్రి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని చెప్పారు.

తెలంగాణ పౌరులకు సిటిజన్ కార్డులు!

  తెలంగాణ పౌరులకు ప్రత్యేకంగా సిటిజన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ పధకాల లబ్దిదారులను ఎంపిక చేయడం కోసం ఆగస్టులో సామాజిక ఆర్థిక స్థితిగతుల సర్వేను చేయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ సర్వే వల్ల పథకాలు ఎవరికి అమలు చేయాలో తేలుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఇళ్లు, రేషన్ కార్డులు లాంటి ప్రభుత్వ పధకాలలో భారీ స్థాయిలో అవినీతి జరుగుతున్న నేపధ్యంలో ఈ సర్వే ప్రజల సామాజిక , ఆర్ధిక స్థితిగతులను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని కేసీఆర్ చెప్పారు. ఆ తర్వాత తెలంగాణ పౌరులకు పాస్‌పోర్టు తరహాలో తెలంగాణ సిటిజన్ కార్డులు ఇస్తామని, ఈ కార్డులు బహుళ ప్రయోజనకార్డులుగా ఉంటాయని కేసీఆర్ తెలిపారు.

ముష్టోడు కాదు... కోటీశ్వరుడు!!

  ఆ బిచ్చగాడు పోలీసులకే షాక్ ఇచ్చాడు సౌదీ అరేబియాలో భిక్షమెత్తుతున్న ఒక అరబ్ జాతీయుడిని పోలీసులు పట్టుకున్నాడు. సౌదీ అరేబియాలో భిక్షాటన నిషిద్ధం. అయితే చట్టాన్ని వ్యతిరేకిస్తూ భిక్షాటన చేస్తున్న ఒక వ్యక్తిని సౌదీ అధికారులు అదుపులోకి తీసుకుని అతడిని సోదా చేయగా నగదుతోపాటు 12 లక్షల సౌదీ రియల్స్ అతని ఇంట్లో లభించాయి. అతను కోటీశ్వరుడని తెలియడంతో పోలీసుల కళ్లు బైర్లు కమ్మాయి. యాచకుడి అవతారంలో ఉన్న అతగాడు దాదాపు 3 లక్షల అమెరికన్ డాలర్ల ఆస్తిపరుడని అధికారుల దర్యాప్తులో తేలింది. ఒక గల్ఫ్ దేశం నుంచి పెట్టుబడిదారు లైసెన్సు కూడా అతగాడు పొందినట్లు బయటపడింది. ఆ వ్యక్తికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరంతా సౌదీలో ఎంచక్కా విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు.