సుబ్రతా రాయ్ నెత్తిన పాలు...

  సహారా అధినేత సుబ్రతా రాయ్ నెత్తిన సుప్రీం కోర్టు పాలు పోసింది. వేల కోట్ల రూపాయల ఆర్థిక నేరాల కేసులో సహారా గ్రూప్ అధినేత సుబ్రతారాయ్ గత కొంతకాలంగా జైల్లోనే వుంటున్న విషయం తెలిసిందే. తనను జైల్లోంచి విడుదల చేస్తే ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి జనానికి ఇవ్వాల్సిన డబ్బు ఇస్తానని సుబ్రతారాయ్ గత కొంతకాలంగా సుప్రీం కోర్టుకు మొర పెట్టుకుంటున్నాడు. అయితే దీనికి గతంలో అనేకసార్లు సుప్రీంకోర్టు నో చెప్పింది. అయితే ఇప్పుడు తాజాగా సుప్రీం కోర్టు సుబ్రతారాయ్‌కి ఒర అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం సుబ్రతా రాయ్ వుంటున్న తీహార్ జైలు నుంచే ప్రతి నెలా 10 రోజులపాటు తన ఆస్తుల అమ్మకాలను పర్యవేక్షించుకోవచ్చని అనుమతి ఇచ్చింది. ఈనెల 5వ తేదీ నుంచి తన ఆస్తుల విక్రయానికి సంబంధించిన లావాదేవీలను జైలు ఆవరణలోనే జరుపుకోవచ్చని సూచించింది.

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌పై ‘సుప్రీం’లో ఇంప్లీడ్‌

  ఎంసెట్ కౌన్సిలింగ్ విషయంలో ఉన్నత విద్యామండలి సుప్రీంకోర్టులో శుక్రవారం నాడు ఇంప్లీడ్‌ దాఖలు చేసింది. ఎంసెట్ కౌన్సిలింగ్‌కి తమకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరింది. ఎంసెట్ కౌన్సిలింగ్ విషయంలో ఆగస్టు 4న సుప్రీంకోర్టు తీర్పు రానుంది. ఆగస్టు 4న తీర్పు అనుకూలంగా వస్తే యథావిధిగా కౌన్సెలింగ్‌ కొనసాగిస్తామని, ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలనే దానిమీద ఆగస్టు 5న సమావేశం నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి అధికారులు చెబుతున్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వెలిబుచ్చుతున్నా ఉన్నత విద్యామండలి ముందుకే వెళ్తోంది. దీనిలో భాగంగా ఆగస్టు 7 నుంచి కౌన్సిలింగ్ జరుపుతామంటూ బుధవారం ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ దాఖలు చేసింది.

భార్య గొంతు కోశాడు... ఆత్మహత్యాయత్నం చేశాడు..

  అనంతపురంలో ఓ భర్త తన భార్య గొంతు కోశాడు. ఆ తర్వాత తన చెయ్యి కోసుకుని పరారయ్యాడు. అనంతపురంలోని శ్రీకంఠం సర్కిల్‌లో రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్న యువతి మీద ఆమె భర్త దాడి చేశాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోశాడు. దాంతో ఆమె గిలగిలా కొట్టుకుంటూ రోడ్డు మీద పడిపోయింది. భార్య గొంతు కోసిన సదరు భర్త తన చేతిని కూడా కోసుకున్నాడు. ఈ సంఘటన చూసి జనం గుమిగూడటంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. గొంతు కోయడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో వున్న ఆ యువతిని స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు భార్య గొంతు కోసి, తన చేతిని కోసుకున్న భర్త కోసం గాలిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది.

పోలవరంతో పెను ప్రమాదం: కవిత

  ఆంధ్రప్రదేశ్ మీద టీఆర్ఎస్ ఎంపీ కవిత తన అభిమానాన్ని ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణం కానున్న పోలవరం ప్రాజెక్టు కారణంగా భవిష్యత్తులో పెను ప్రమాదాలు తలెత్తే అవకాశం వుందని చెబుతూ ఆ విధంగా ఆమె ఆంధ్రప్రదేశ్‌ మీద తన అభిమానాన్ని చాటారు. పార్లమెంటులో పోలవరం ప్రాజెక్టు అంశం మీద మాట్లాడుతూ కవిత ఇలా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రాన్నీ సంప్రదించకుండా పోలవరం ప్రాజెక్టు మీద ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆమె ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు మీద సమగ్ర అధ్యయనం జరగాల్సి వుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టులకు ఇష్టానుసారం అనుమతులు ఇవ్వడం కాదని ఆమె అన్నారు.

కేసీఆర్ 1956 సర్టిఫికెట్ తెచ్చుకోగలరా: కిషన్ రెడ్డి

  స్థానికత నిర్ధారణ కోసం 1956 నుంచి తమ కుటుంబం తెలంగాణలోనే నివసిస్తోందన్న సర్టిఫికెట్ తెచ్చుకోవాలని అంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత గ్రామం నుంచి ఆసర్టిఫికెట్ తెచ్చుకోగలరా అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. విద్యార్థుల ఫీ రీయింబర్స్‌మెంట్ అంశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న విధానం సమర్థనీయంగా లేదని ఆయన విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ స్థానికతకు సంబంధించిన వివాదాన్ని సృష్టించారని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం విద్యార్థులను మానసికంగా ఎంతో బాధపెడుతోందని ఆయన అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం వైఖరీ వల్ల బీసీ, ఎస్టీ, ఎస్సీ విద్యార్థులే నష్టపోతున్నారని తెలిపారు. కేసీఆర్ తన నిర్ణయాన్ని పునస్సమీక్షించుకోవాలని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా సూచించారు.

ప్రణాళికా సంఘం పరిశీలనలో ఏపీకి ప్రత్యేక హోదా... ప్యాకేజీ..

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయాన్ని కేంద్ర ప్రణాళికా సంఘం చురుకుగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా దక్కవలసి వుంది. ఏపీకి ప్రత్యేక హోదా అంశం మీద కేంద్ర ప్రణాళికా శాఖామంత్రి రావు ఇందర్‌జిత్ సింగ్ గురువారం రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోతున్నామని చెప్పారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయమై ఏర్పడిన సందిగ్ధతకి తెరపడింది. అలాగే ఏపీలో వెనక బడి ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర రీజియన్లకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించే అంశాన్ని ప్రధాని అధ్యక్షతన జరిగే జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డిసి) సమావేశంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

శ్రీలంకకు సైన్యం సంగతి రాజీవ్ సొంత నిర్ణయం: నట్వర్

  శ్రీలంకకు భారత సైన్యాన్ని పంపించే నిర్ణయం రాజీవ్ గాంధీ సొంతగా తీసుకున్నారని, ఈ విషయంలో ఆయన తన కేబినెట్‌ని ఎంతమాత్రం సంప్రదించలేదని, అధికారుల సలహా కూడా తీసుకోలేదని కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ తెలిపారు. ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్’ పేరిట ఆయన రాసిన పుస్తకంలో ఇందిరాగాంధీ కుటుంబం గురించి వ్యక్తంచేసిన విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. శ్రీలంకకు భారత సైన్యాన్ని పంపించడం అనే అంశం చివరికి రాజీవ్ గాంధీ హత్యకు దారితీసింది. ఈ నిర్ణయాన్ని రాజీవ్ గాంధీ సొంతగా తీసుకున్నారు. ఆయన చావుకు ఆయనే కారణమయ్యారు. ఈ విషయాన్ని నట్వర్ సింగ్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అప్పటి శ్రీలంక అధ్యక్షుడు జయవర్ధనే కోరగానే రాజీవ్ గాంధీ ఎంతమాత్రం ఆలోచించకుండా సైన్యాన్ని శ్రీలంకకి పంపారని నట్వర్ చెప్పారు. శ్రీలంక ప్రభుత్వంతోగానీ, ఎల్.టి.టి.ఇ. అధినేత ప్రభాకరన్‌తోగానీ రాజీవ్ గాంధీ వ్యవహరించిన విధానం సమర్థనీయం కాదని అన్నారు. ఈ విషయాలను తాను ప్రశ్నిస్తే రాజీవ్ గాంధీ తనను కసురుకున్నారని నట్వర్ వెల్లడించారు.

తాటతీస్తాం: పాక్‌కి ఇండియా వార్నింగ్!!

  భారత సైనిక దళాల ప్రధానాధికారిగా జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ బాధ్యతలు స్వీకరించారు. అలా బాధ్యతలు స్వీకరించారో లేదో ఇలా పాకిస్థాన్‌కి వార్నింగ్ ఇచ్చారు. పాక్ సైనికులు భారత సైన్యం మీద దాడులకు పాల్పడితే తగిన గుణపాఠం చెబుతామని, అలాంటి చర్యలను చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సైనికుల తలలు కత్తిరించడం లాంటి ఘటనలు జరిగితే చాలా వేగంగా, ఘాటుగా, పాకిస్థాన్ ఊహించని విధంగా ప్రతిస్పందిస్తామని ఆయన హెచ్చరించారు. ఆర్మీ చీఫ్‌గా పదవి చేపట్టి 24 గంటలు గడవక ముందే ఆయనీ హెచ్చరికలు చేయడం విశేషం. దల్బీర్ సింగ్ సుహాగ్ భారతదేశ 26వ ఆర్మీ చీఫ్‌.

ఫేస్‌బుక్ మీద 725 కోట్ల కేసు!

  సామాజిక నెట్‌వర్క్ ఫేస్‌బుక్ వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో అన్ని నష్టాలూ వున్నాయి. ఫేస్‌బుక్ వినియోగదారుల నుంచి ఎన్ని ప్రశంసలు పొందుతూ వుంటుందో అన్ని విమర్శులూ భరిస్తూ వుంటుంది. తాజాగా ఫేస్‌బుక్ మీద ఒక అమెరికా మహిళ పరువునష్టం దావా వేసింది. తన పరువు పోగొట్టినందుకు ఫేస్‌బుక్ తనకి 123 మిలియన్ డాలర్లు (725 కోట్ల రూపాయలు) నష్టపరిహారంగా ఇవ్వాలని తన దావాలో పేర్కొంది. ఇంతకీ ఆమె పరువు ఏ విధంగా పోయిందంటే... అమెరికాలోని టెక్సాస్ నగరానికి చెందిన మరియం అలీ అనే మహిళ ఇల్లినాయిస్‌కి చెందిన అదీల్ షా అనే వ్యక్తిని ప్రేమించింది. ఎంచక్కా సహజీవనం చేసింది. ఐదేళ్ళ క్రితం వీరిద్దరూ తిట్టుకుని, తన్నుకుని విడిపోయారు. మరియం అలీ మీద అదీల్‌కి ఏరేంజ్‌లో కోపం ఉందోగానీ, అతను మరియం అలీ పేరు మీద ఫేస్‌బుక్ ఫేక్ ఖాతాని తెరిచి ఆమెకి సంబంధించిన ‘‘ఫొటోలు’’ అప్‌లోడ్‌ చేశాడు. ఆ అకౌంట్, అందులో వున్న తన ‘‘ఫొటోలు’’ చూసి కంగారుపడిపోయిన మరియం అలీ ఈ అకౌంట్‌ని తొలగించండి మహప్రభో అని ఫేస్‌బుక్‌కి కంప్లయింట్ చేసింది. మరియం ఎంత మొత్తుకున్నా ఫేస్‌బుక్ సదరు అకౌంట్‌ని తొలగించలేదు. దాంతో ఆమె ఫేస్‌బుక్ ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందంటూ కోర్టుకెక్కింది.

సమ్మె బాటలో ఆర్టీసీ

  ఆర్టీసీ సమ్మె బాటలో నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్మికుల క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్) నిధులను ఆర్టీసీ వినియోగించుకుని ఆ నిధులను తిరిగి జమచేయని అంశం మీద కార్మికులు ఆగ్రహంగా వున్నారు. ఈ అంశం మీద శనివారం నుంచి సమ్మె చేయనున్నట్టు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ (ఇయు) నాయకులు ప్రకటించారు. సీసీఎస్‌కి సంబంధించిన 220 కోట్లను ఆర్టీసీ తన సొంత ఖర్చులకు వాడుకుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ డబ్బు వడ్డీతో కలిపి 293 కోట్లకు చేరిందని, ఆ డబ్బును వెంటనే తిరిగి ఇచ్చేయాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే సమ్మె నిర్ణయాన్ని మరో కార్మిక సంఘం నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయూ) విభేదిస్తోంది. ముందస్తు నోటీసులు లేకుండా సమ్మెచేయడం సరికాదని పేర్కొంది.

తైవాన్‌లో కోనసీమ తరహా గ్యాస్ పేలుడు

  ఇటీవల కోనసీమలోని నగరం గ్రామంలో గ్యాస్ పైప్ లైన్‌ లీకేజీ కారణంగా పేలుడు జరిగి అనేకమంది మరణించిన విషయం తెలిసిందే. తైవాన్‌లో కూడా సరిగ్గా అలాంటి గ్యాస్ పేలుడు ప్రమాదం జరిగింది. దక్షిణ తైవాన్‌లోని కౌషింగ్ నగరంలో జరిగిన ఈ గ్యాస్ పేలుడులో 15 మంది మరణించగా, 243 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుందని తెలుస్తోంది. భూగర్భంలోంచి వెళ్తున్న గ్యాస్ పైప్ లైన్ లీక్ కావడంతో ఈ దుర్ఘటన జరిగింది. కౌషింగ్ నగరంలోని ఓ ప్రాంతం ప్రజలు శుక్రవారం ఉదయం నుంచి ఏదో గ్యాస్ వాసన వస్తోందని భావిస్తున్నారు. అయితే అకస్మాత్తుగా గ్యాస్‌కి మంటలు అంటుకుని పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా మరణాలు, గాయపడటం మాత్రమే కాకుండా భారీ స్థాయిలో ఆస్తినష్టం జరిగింది. వీధుల్లో తిరిగే వాహనాలన్నీ పాడైపోయాయి. అనేక భవనాలు కూడా రూపురేఖలు మారిపోయాయి. ఈ పేలుడు ధాటికి భూకంపం వచ్చినట్టుగా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు: ఐదుగురి మృతి

  ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు జరిగి ఐదుగురు మరణించారు. రాజధాని రాయ్‌పూర్ దగ్గర ఛోటి ఉర్లా గ్రామంలో వున్న నవభారత్ ఫ్యూజ్ కర్మాగారంలో శుక్రవారం తెల్లవారుఝామున పేలుడు సంభవించడంతో ఐదుగురు కార్మికులు మరణించారు. 20 మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. గాయపడినవారు రాయ్‌పూర్‌లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కర్మాగారంలో డిటోనేటింగ్ ఫ్యూజ్ తయారు చేస్తున్నప్పుడు పేలుడు సంభవించిందని తెలుస్తోంది. ఈ పేలుడు ధాటికి కర్మాగారం పైకప్పు కుప్పకూలింది. పేలుడు శబ్దం రెండు కిలోమీటర్ల దూరం వరకు వినిపించినట్టు తెలుస్తోంది.

ఒకే వేదిక మీద సచిన్, పవన్?

  టాలీవుడ్ మూవీ స్టార్ పవన్ కళ్యాణ్, ఇంటర్నేషన్ క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్ శుక్రవారం నాడు విజయవాడలో ఒకే వేదిక మీద కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయవాడలో శుక్రవారం నాడు వ్యాపారవేత్త, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ నిర్మించిన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సచిన్ టెండూల్కర్ వస్తున్నారు. ఈ ప్రారంభోత్సవంలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. పొట్లూరి వరప్రసాద్ పవన్ కళ్యాణ్‌కి సన్నిహితుడు. ఈమధ్య ముగిసిన ఎన్నికలలో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పొట్లూరి వరప్రసాద్‌కి టీడీపీ టిక్కెట్ ఇప్పించడానికి పవన్ కళ్యాణ్ తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే చివరి నిమిషంలో అది మిస్సయింది. అయినప్పటికీ పొట్లూరి వరప్రసాద్, పవన్ కళ్యాణ్ మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సచిన్‌తోపాటు పవన్ కళ్యాణ్‌ని కూడా పొట్లూరి వరప్రసాద్ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు స్టార్స్‌ని ఒకే వేదిక మీద చూస్తే ఇటు క్రికెట్ అభిమానులతోపాటు అటు సినిమా అభిమానులకు కూడా పండగే. సచిన్, పవన్ ఒకరినొకరు కలవటం ఇదే మొదటిసారి కాబోదు.. గతంలో చిరంజీవి కుటుంబాన్ని సచిన్ టెండూల్కర్ ఎన్నోసార్లు కలిశారు.

శాసనమండలికి మంత్రి నారాయణ

  విద్యావేత్త నారాయణ ఆంధ్రప్రదేశ్ శాసనసభలోగానీ, శాసన మండలిలోగానీ సభ్యుడు కాకుండానే రాష్ట్ర మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. చట్ట ప్రకారం ఆయన మంత్రిపదవి చేపట్టిన ఆరు నెలల లోగా శాసన సభకు గానీ, శాసన మండలి గానీ ఎంపిక కావలసి వుంది. ఈ నేపథ్యంలో ఆయనను శాసన మండలికి సభ్యుడిగా ఎంపిక చేయడానికి తెలుగుదేశం పార్టీ సన్నాహాలు చేస్తోంది. మే 21న కోలగట్ల వీరభద్ర స్వామి శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ ఖాళీని నారాయణతో భర్తీ చేయాలని తెలుగుదేశం భావిస్తోంది. ఈ స్థానానికి ఆగస్టు 21వ తేదీన ఉప ఎన్నిక జరగబోతోంది. ఎమ్మెల్యేల కోటాలో జరిగే ఈ ఉప ఎన్నికకు ఆగస్టు నాలుగో తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆగస్టు 11వ తేదీలోగా నామినేషన్లు దాఖలుచేయాలి. ఉపసంహరణకు తుదిగడువు ఆగస్టు 14. అవసరమైతే 21వ తేదీన పోలింగ్ నిర్వహించి, అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారు. అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉండటం వల్ల ఎమ్మెల్సీ పదవికి నారాయణ ఎంపిక లాంఛనమే అవుతుంది.

చెప్పుల్లో 125 కోట్ల ఖరీదైన హెరాయిన్

  శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా హెరాయిన్ స్మగ్లింగ్‌ని అరికట్టడానికి పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా స్మగ్లర్లు తమ తెలివితేటలు పెంచుకుని విజయవంతంగా స్మగ్లింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే అప్పుడప్పుడు వాళ్ళ ఖర్మ కాలి దొరికిపోతున్నారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి ముంబైలో జరిగింది. మహిళల చెప్పుల సోల్స్‌లో దాచి, చెప్పుల రవాణా పేరుతో జరుగుతున్న హెరాయిన్ స్మగ్లింగ్ గుట్టును ముంబై పోలీసులు రట్టు చేశారు. 125 కోట్ల రూపాయల ఖరీదైన 36 కిలోల బరువున్న హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్త్రీల చెప్పుల రవాణా పేరుతో ఢిల్లీ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు హెరాయిన్ స్మగ్లింగ్ జరుగుతోందన్న సమాచారాన్ని అందుకున్ను ముంబై పోలీసులు పక్కా స్కెచ్ వేసి హెరాయిన్‌ని, స్మగ్లర్ల బృందంలోని ఇద్దరు ఆఫ్ఘనిస్థాన్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. ఈ హెరాయిన్‌ని మొదట ఆఫ్ఘనిస్థాన్ నుంచి పాకిస్థాన్‌కి, అక్కడి నుంచి ఢిల్లీకి తెచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది.