సోనియా ఇఫ్తార్ విందు
posted on Jul 28, 2014 @ 2:19PM
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదివారం న్యూఢిల్లీలోని అశోకా హోటల్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ ఇఫ్తార్ విందు అటు స్వామికార్యంతోపాటు స్వకార్యం కూడా నెరవేరే విధంగా ఏర్పాటు చేశారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధికారంలో వున్న సమయంలో గత మూడు సంవత్సరాలుగా ఇఫ్తార్ విందు ఇవ్వని సోనియా గాంధీ అధికారం పోయిన తర్వాత ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ విందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముస్లిం మత పెద్దలతో పాటు బీజేపీ వ్యతిరేక శక్తులను కూడా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. నరేంద్రమోడీ ప్రభంజనానికి కకావికలైనపోయిన పలు పార్టీల నాయకులు ఈ విందులో పాల్గొని సోనియాగాంధీతో ముచ్చటించారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయు అధినేత శరద్ యాదవ్ కూడా ఈ విందులో పాల్గొన్నారు. సోనియా, లాలూ, శరద్ యాదవ్ ఒకే టేబుల్ మీద కూర్చుని విందు ఆరగించడం విశేషం. ఈ ముగ్గురూ విందులో తిన్నది తక్కువ మాట్లాడుకున్నది ఎక్కువ అని తెలుస్తోంది. బీహార్‌లో పది అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంగా కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయు జట్టుకట్టి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురూ ఒకే టేబుల్ మీద కూర్చుని ఇఫ్తార్ విందు ఆరగించడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.