బాత్‌రూమ్‌లో దూరిన మొసలి... బాబోయ్!

  గుజరాత్‌లోని ఆనంద్ నగరం సమీపంలోని సోజిత్రా అనే పట్టణంలో భరత్ పటేల్ అనే ఒకాయన నాలుగు రోజుల క్రితం ఉదయాన్నే నిద్రలేచి ఆవలిస్తూ తమ ఇంట్లో వున్న టాయిలెట్‌కి వెళ్ళాడు. టాయిలెట్ లోపలకి చూసిన ఆయన ఆవలిస్తూ తెరిచిన నోటిని తెరిచినట్టే వుంచేసి కళ్ళు కూడా పెద్దవి చేసుకుని బాత్రూమ్‌లోకి చూశాడు. తాను చూస్తున్నది కలా నిజమా అని డౌటొచ్చి కళ్ళు నులుముకున్నాడు, చేతి మీద గిల్లుకుని కెవ్వుమనబోయి అంతలోనే నోరు మూసేసుకున్నాడు. ఇంతలో ఆయన గారు బాత్‌రూమ్‌లో ఏం చూశాడంటే ఓ అయిదడుగుల మొసలిని చూశాడు. ఓ మొసలి భరత్ పటేల్ బాత్‌రూమ్‌లో సెటిలై రెస్టు తీసుకుంటోంది. మొసలినిచూసిన కొద్ది క్షణాల తర్వాత భరత్ పటేల్‌కి తన కర్తవ్యం గుర్తొచ్చింది. తాను బాత్‌రూమ్‌కి ‘వచ్చిన పని’ని కూడా మరచిపోయి కార్యాచరణలోకి దిగిపోయాడు. వెంటనే బాత్‌రూమ్ డోర్ మూసేసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. ఫారెస్టు అధికారులు ఓ బోనును పట్టుకొచ్చి సదరు మొసలిని పట్టుకుని తీసుకెళ్ళిపోయారు. ఇంత టౌన్ మధ్యలోకి, అది కూడా మా బాత్రూమ్‌లోకి మొసలి ఎలా వచ్చిందో చెప్పండి.. నాకు తెలియాలి అని భరత్ పటేల్ వేసిన ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు.

పార్లమెంటు క్యాంటిన్లో ఫుడ్డు.. యాక్..!

  పార్లమెంటు క్యాంటిన్లో ఆహార పదార్థాలు ఎంతమాత్రం బాగోవట్లేదని, క్యాంటిన్లో నిల్వ వున్న ఆహారం ఇస్తున్నారని, ఆ ఆహారం పాచికంపు కొడుతోందని, ఆ ఆహారం తిని తమ ఆరోగ్యాలు పాడవుతున్నాయని పలువురు రాజ్యసభ సభ్యులు స్పీకర్‌కి ఫిర్యాదు చేశారు. జేడీయూ ఎంపీ కేసీ త్యాగి, సమాజ్ వాది పార్టీ ఎంపీలు రాంగోపాల్ యాదవ్, జయాబచన్ స్పీకర్‌కి పార్లమెంటు క్యాంటిన్‌లో ఆహారం బాగాలేందంటూ ఫిర్యాలు చేసిన వారిలో వున్నారు. పార్లమెంటులో తిన్న ఆహారం కారణంగా తమ ఆరోగ్యాలు ఇప్పటికే పాడయ్యాయని, ఇప్పటికైనా పార్లమెంటు క్యాంటిన్‌ను సంస్కరించాలని వారు స్పీకర్‌కి విజ్ఞప్తి చేశారు.

స్టాలిన్ మీద జయలలిత కేసు

  తమిళనాడు అసెంబ్లీలో ద్రావిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నాయకుడు, కరుణానిధి కుమారుడు స్టాలిన్‌ మీద తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నై ప్రిన్సిపల్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. అసెంబ్లీ బయట తనకు, అసెంబ్లీ స్పీకర్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారని జయలలిత తన పరువునష్టం దావాలో పేర్కొన్నారు. ఈ పరువునష్ట దావాను ముఖ్యమంత్రి తరఫున చెన్నై నగర పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.ఎల్.జగన్ కోర్టులో దాఖలు చేశారు. ఈ సంవత్సరం జులై 22వ తేదీన స్టాలిన్ అసెంబ్లీ నుంచి బయటకి వస్తూ తనకు, స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని జయలలిత తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

తెలంగాణ రవాణా పన్నుకు హైకోర్టు బ్రేక్

  ఆంధ్రప్రదేశ్ వాహనాలు తెలంగాణలోకి ప్రవేశించాలంటే త్రైమాసిక పన్ను కట్టాలంటూ తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. బుధవారం ఉదయం నుంచి తెలంగాణ సరిహద్దుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న ఏపీ రిజిస్ట్రేషన్ వాహనాలను నిలిపేశారు. దీనిమీద ఆంధ్రప్రదేశ్ రవాణా మంత్రి సిద్దా రాఘవరావు స్పందిస్తూ దీనిపై గతంలో జారీ అయిన జీవో నంబర్ 43ని గౌరవించాలని, మార్చి 2015 వరకు ఎలాంటి పన్ను వసూలు చేయకూడదని చెప్పారు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం దీనికి అనుకూలంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద హైకోర్టు స్పందించింది. రవాణా పన్ను విషయంలో గతంలో జారీ అయిన జీవో నంబర్ 43 మార్చి 31, 2015 వరకు అమలులో వుంటుందని, దీనిని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించాలని సూచించింది. హైకోర్టు జోక్యంతో తెలంగాణ ప్రభుత్వం సేకరించాలని భావించిన రవాణ పన్ను అంశానికి బ్రేక్ పడే అవకాశం వుంది.

ఢిల్లీ హైకోర్టులో సోనియా, రాహుల్ పిటిషన్

  సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన ఆస్తులను దురాక్రమించారని భారతీయ జనతాపార్టీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఆగస్టు 7వ తేదీన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయి. ఈ కేసును సవాల్ చేస్తూ సోనియా, రాహుల్ ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సదరు పిటిషన్‌లో నేషనల్ హెరాల్డ్ ఆస్తులను తాము దురాక్రమణ చేయలేదని పేర్కొనడంతోపాటు ఈ కేసు విషయంలో కోర్టుకు హాజరు కావడం నుంచి తమను మినహాయించాలని కూడా కోరినట్టు తెలుస్తోంది.

పవన్‌పై కేసీఆర్ వ్యాఖ్యలు.. కోర్టు ఆదేశాలు..

  ఎన్నికల ప్రచారం సందర్భంగా టీఆర్ఎస్ అధినేత, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సినీ నటుడు పవన్ కళ్యాణ్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసు విషయంపై అనంతపురం కోర్టు స్పందించింది. కేసీఆర్ పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి 15 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి పూర్తి నివేదిక అందించాలని అనంతపురం కోర్టు గతంలో ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు బుధవారం ఆ నివేదిక సమర్పించాల్సి వుంది. ఈ నేపథ్యంలో పోలీసులకు కోర్టును తమకు మరింత సమయం కావాలని కోరారు. ఈ సందర్భంగా కేసీఆర్‌పై కేసు పెట్టిన న్యాయవాది కోర్టుకు తన వాదనను వినిపించారు.

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ విశ్వవిద్యాలయం

  ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలో హైదరాబాద్‌లోని నల్సార్ తరహా న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి రాష్ట్ర రాజధానిలో న్యాయశాస్త్ర పరిశోధన, అధ్యయనం జరగడం కోసం జాతీయ సంస్థ నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ సర్వీసెస్ (నల్సార్) ఏర్పాటు కావాలని గతంలో సుప్రీంకోర్టు కమిటీ సిఫారసు చేసింది. ఈ సిఫారసులకు అనుగుణంగా ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖ దీనికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర న్యాయశాఖ, కేంద్ర హోంశాఖ, కేంద్ర మానవవనరుల శాఖల కార్యదర్శులకు, రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్‌కి తెలియజేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు కోతల్లేవ్!

  నవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రజలు రంజాన్ రోజున ఒక శుభవార్త విన్నారు. ఆ శుభవార్త మంగళవారం నుంచి అమలులోకి రావడంతో ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. రెండు సంవత్సరాల నుంచి తమను వేధించిన ఆ సమస్య మంగళవారంతో సమసిపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో సంతోషంగా వున్నారు. ఆ సమస్య పేరు కరెంట్ కోత. మంగళవారం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు కోతలు నిలిచిపోయాయి. మంగళవారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెటూళ్ళతో సహా అన్ని ప్రాంతాలోనూ నిరంతరాయంగా 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా కాలంతో సంబంధం లేకుండా నిరంతరం విద్యుత్ కోతలను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ పరిణామం సంతోషాన్ని కలిగిస్తోంది. ఎండలు తగ్గిపోవడంతో విద్యుత్ వినియోగం తగ్గిపోయింది. దానితోపాటు విద్యుత్ ఉత్పత్తి కూడా పెరగడంతో కరెంటు కోతలను ఎత్తివేశారు. త్వరలో పరిశ్రమలకు కూడా ఎలాంటి కోత లేకుండా విద్యుత్ ఇచ్చే అవకాశం వుందని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఇరుగు పొరుగు రాష్ట్రాలకు భారీ స్థాయిలో విద్యుత్ అమ్మే స్థాయికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏపీ వాహనాలు పన్నుకట్టాలా?.. ఆలోచించుకోండి!

  ఆంధ్రప్రదేశ్‌ వాణిజ్య రవాణా వాహనాలు తెలంగాణలోకి ప్రవేశించాలంటే ఇప్పటి నుంచి తెలంగాణ రవాణాశాఖకు మూడు నెలల పన్ను కట్టాల్సిందే. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంట్రాక్టు, గూడ్స్ వాహనాలు, మోటార్ క్యాబ్స్, మాక్సీ క్యాబ్స్, కమర్షియల్ ట్రాక్టర్స్, ప్యాసింజర్ ఆటో రిక్షాలకు వర్తిస్తుందని తెలంగాణ రవాణా శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంఈ జీవో జారీ చేయడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాహనాలను తెలంగాణ సరిహద్దుల్లో నిలిపివేస్తున్నారు. నేషనల్ పర్మిట్ ఉన్న వాహనాలు, వ్యక్తిగత వాహనాలకు పన్ను నుంచి తెలంగాణ ప్రభుత్వం మినహాయించింది. తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాలంటే పర్మిట్ ట్యాక్స్ చెల్లించాలంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఆంధ్రప్రదేశ్ రవాణా మంత్రి శిద్దా రాఘవరావు స్పందించారు. పన్ను విధింపుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని శిద్దా రాఘవరావు అన్నారు. గవర్నర్ నిర్ణయం మేరకు 2015 మార్చి వరకు పన్ను విధించడం సరికాదన్నారు.

అసెంబ్లీ ద్వారం కూల్చివేత కేసు పురోగతి

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ద్వారం కూల్చివేత కేసులో పురోగతి వచ్చింది. బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రవేశ ద్వారాన్ని ఒక వ్యక్తి కూల్చివేశాడు. ఆ కూల్చివేతతో అసెంబ్లీ ఆవరణలో సంచలనం రేగింది. ప్రవేశ ద్వారాన్ని కూల్చిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సంఘటన స్థలాన్ని డీజీపీ కమలాసన్ రెడ్డి సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సంఘటన దృష్ట్యా అసెంబ్లీ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ద్వారాన్ని కూల్చిన వ్యక్తిని వరంగల్ జిల్లాకి చెందిన అశోక్‌రెడ్డి అని పోలీసుల విచారణలో తేలింది. అశోక్‌రెడ్డి అసెంబ్లీ ఒకటో గేటును దూకి లోపలకి వచ్చాడని, అతని మానసిక పరిస్థితి మీద అనుమానాలున్నాయని పోలీసులు ప్రకటించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రవేశద్వారాన్ని కూల్చడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌ నగరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారికి, వారికి సంబంధించిన ఆస్తులకు, అంశాలకు రక్షణ కరవైందన్న ఆరోపణలు వినవస్తున్న తరుణంలో జరిగిన ఈ సంఘటన ఈ అంశంలో కేంద్రం మరింత తీవ్రంగా ఆలోచించాల్సిన విషయాన్ని గుర్తు చేస్తోంది.

‘స్నేహ’ డెలివరీ... నల్లపిల్ల పుట్టింది!

  దేశంలో అరుదైన తెల్ల పులుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఈ పులి జాతి సంతతిని పెంచడానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. తెల్లపులి జాతిని అంతరించిపోతున్న జాతి జాబితాలో చేర్చి వాటిని సంరక్షిస్తున్నారు. ఈ నేపత్యంలో భువనేశ్వర్‌లోని నందన్ కనన్ బయోలాజికల్ పార్కులో ‘స్నేహ’ అనే తెల్లపులి నాలుగు కూనలకు జన్మ ఇచ్చింది. ఈ నాలుగు కూనల్లో ఒక నల్ల రంగు కూన కూడా వుండటం విశేషం. ఇప్పటికే సిమిలిపాల్ పులుల సంరక్షణ కేంద్రంలో నల్లరంగు పులులు వున్నాయి. జూలో వున్న తెల్లపులికి నల్లటి పులిపిల్ల పుట్టడం ఇదే ప్రథమమని జూ క్యూరేటర్ చెబుతున్నారు.

చుండూరు కేసులో సుప్రీం కోర్టు స్టే

  దళితుల ఊచకోతకు సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుంటూరు జిల్లా చుండూరు ఘటన గురించి అందరికీ తెలిసిందే. ఈ కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న 20 మంది, ఇతర నిందితులు 36 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు చుండూరు ఘటనలో మరణించినవారి బంధువులు సుప్రీం కోర్టును ఆశ్చయించారు. ఈ కేసు బుధవారం నాడు సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. సుప్రీం కోర్టు ఈ కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించడంతోపాటు ఈ కేసులో నిందితులందరికీ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది.

30 మంది అమ్మాయిలకు అస్వస్థత

  కలుషితమైన ఆహార పదార్థాలు తినడంతో 30 మంది అమ్మాయిలు అస్వస్థతకు గురయ్యారు. రంగారెడ్డి జిల్లా కుల్కచర్లలోని కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థినులు మంగళవారం రాత్రి హాస్టల్‌లో వండిన కలుషిత పదార్ధాలు తినడంతో అస్వస్థతకు గురయ్యారు. వాంతులతో అస్వస్థతకి గురైన 30 మంది విద్యార్థినులను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ గురుకుల విద్యాయం విద్యార్థినులు హాస్టల్‌లో ఆహారం ఎంతమాత్రం బాగా వుండటం లేదని గత రెండు రోజులుగా ఆందోళనకు దిగారు. అయితే మంగళవారం రాత్రి కూడా నాణ్యత లేని భోజనం చేయడం వల్ల వీరు అస్వస్థతకి గురైనట్టు తెలుస్తోంది.

అది జాతీయ పతాకం కాదు: మల్లికా షెరావత్

  ‘డర్టీ పాలిటిక్స్’ సినిమా కోసం తాను తన ఒంటిమీద కప్పుకున్నది జాతీయ పతాకం కాదని మల్లికా షెరావత్ ఈ అంశం వివాదాస్పదం అయినప్పటి నుంచీ చెబుతోంది. మూడు రంగులున్నంత మాత్రాన దానిని జాతీయ పతాకం అనడమేంటని ప్రశ్నించింది. లేనిపోని వివాదం సృష్టించేవారే ఈ విషయం మీత గోల చేస్తున్నారని అంటోంది. కాగా ఈ అంశం మీద మల్లికా షెరావత్ మీద హైదరాబాద్ హైకోర్టులో కోర్టులో కేసు నమోదైన విషయం తెలిసిందే. జాతీయ పతాకాన్ని అవమానించిన మల్లికా షెరావత్‌ మీద తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

మసాజ్ కోసమంటూ వెళ్ళాడు.. మర్డర్ చేశాడు!!

  చైనాలో మసాజ్ ఇండస్ట్రీ బాగా విస్తరించి వుంటుంది. మహిళలు తమ ఇళ్ళలోనే మసాజ్ సెంటర్లు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ వుంటారు. చైనాలోని ఝువాంగ్ అనే ప్రాంతంలో నివసించే ఓ కాలేజీ విద్యార్థి దురలవాట్లకి బానిసైపోయి అప్పుల్లో మునిగిపోయాడు. దాంతో అతను డబ్బు కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. అందులో భాగంగా మసాజ్ చేసే ఒక మహిళ ఇంటికి వెళ్ళాడు. ఆ కుర్రాడు మసాజ్ చేయించుకోవడానికి వచ్చాడని భావించిన సదరు మహిళ అతన్ని ఇంట్లోకి ఆహ్వానించింది. అయితే అతను అక్కడకి వెళ్ళింది మసాజ్ చేయించుకోవడానికి కాదు.. మర్డర్ చేయడానికి. ఇంట్లోకి వెళ్ళగానే అతను తన దగ్గరున్న సుత్తితో ఆమె తలమీద గట్టిగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. అప్పుడా కుర్రాడు ఆమె మృతదేహాన్ని తాపీగా ఓ దుప్పట్లో చుట్టాడు. ఇంట్లో వున్న డబ్బు, బంగారం, విలువైన వస్తువులన్నిటినీ దోచుకుని వెళ్ళిపోయాడు. పోలీసులు ఈ కేసును పరిశోధించి సదరు హంతకుడిని పట్టుకున్నారు. పోలీసులకు దొరికిపోయిన సదరు హంతకుడు ఇప్పుడు అమాయకంగా ముఖం పెట్టి, స్వతహాగా తాను చాలా మంచోడినని, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కారణంగానే ఏదో ఒక చిన్న మర్డర్ చేశానని చెబుతున్నాడు. ప్రపంచం నాశనమైపోయింది!!

కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం దుంపనాశనం

  పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో దేశంలో, ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా వ్యవసాయాన్ని నీరుగార్చిందనే విషయంలో కొన్ని ఉదాహరణలు చంద్రబాబు నాయుడు ఇచ్చారు.   1. కేంద్రంలో, రాష్ట్రంలో పదేళ్ళపాటు ప్రభుత్వాలు నడిపిన కాంగ్రెస్ పాలకుల అశాస్త్రీయ విధానాల కారణంగా వ్యవసాయ పరిశోధనలు ఆగిపోయాయి. వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి.   2. బడ్జెట్‌లలో వ్యవసాయానికి ఎలాంటి కేటాయింపులు జరపకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.   3. ప్రపంచ వ్యవసాయ రంగంలో భారతదేశం వెనుకబడి వుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత వెనుకబడి వుంది. దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వాలే.   4. ప్రభుత్వ వ్యవహారశైలి వల్ల వ్యవసాయ ఖర్చులు పెరిగిపోయి దిగుబడులు తగ్గిపోయాయి.   5. భూసార పరీక్షలు, రైతు శిక్షణా తరగతుల వంటి వాటిని పూర్తిగా నిలిపేశారు. ఎరువల షాపులవాళ్ళు చెప్పినట్టుగా ఎరువులు, పురుగుమందులు ఉపయోగించే దురవస్థకు రైతులను చేర్చారు.

రైతన్నా.. ఇదిగో ఐప్యాడ్!

  తమిళనాడు రాష్ట్రంలో విద్యార్థులకు లాప్‌టాప్‌లు ఇచ్చిన ముఖ్యమంత్రి జయలలిత విద్యార్థుల నుంచి జేజేలు అందుకుంటున్నారు. అదే బాటలో నడుస్తూ అందరికీ అన్నం పెట్టే అన్నదాతకి ఐప్యాడ్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. రైతులకు వ్యవసాయానికి సంబంధించిన సంపూర్ణ సమాచారం తెలుసుకోవడానికి ఈ ఐప్యాడ్‌లు ఎంతో ఉపయోగపడే అవకాశం వున్న నేపథ్యంలో ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఉపగ్రహం నుంచి రైతుల ఐప్యాడ్‌లకు నేరుగా సమాచారం అందేలా కూడా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది ఆలోచన. ఏ సీజన్‌లో ఎలాంటి పంటలు వేయాలి, భూసార పరీక్షలు, విత్తనాల సమాచారం, ఎరువులు, పంట మార్కెటింగ్... ఇలాంటి విషయాలన్నిటిలో ఐప్యాడ్‌లు రైతుకు చేదోడు వాదోడుగా వుంటాయని భావిస్తున్నారు.