Read more!

‘నీగ్రో’ అన్నాను.. అయాం వెరీ సారీ... గోవా సీఎం

 

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తాను ‘నీగ్రో’ అనే పదాన్ని ఉపయోగించినందుకు అసెంబ్లీలో క్షమాపణలు చెప్పారు. సాధారణంగా ఆఫ్రికన్ జాతీయులను ‘నీగ్రో’ అని పిలవడం అమర్యాదకరం.. వారిని ‘బ్లాక్స్’ అనాలి. గోవా ముఖ్యమంత్రి గోవా అసెంబ్లీలో గోవా ప్రభుత్వం అదుపులో వున్న విదేశీయుల గురించి వివరిస్తూ, ఓ గుర్తు తెలియని ఆఫ్రికన్ నీగ్రో వ్యక్తిని కలాంగుటే గ్రామం వద్ద అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. దీనిపై విపక్షాలు విమర్శలు చేశాయి. ‘నీగ్రో’ అనే పదం జాతి వివక్ష కిందికి వస్తుందని మండిపడ్డాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ దీనిపై స్పందిస్తూ... ఇలాంటి పదాల వాడకంతో విదేశీ యాత్రికులకు ప్రతికూల సందేశాలు వెళతాయంది. దీనిపై సీఎం పారికర్ వివరణ ఇస్తూ.. ఇది పోలీస్ డిపార్ట్‌మెంటు తప్పిదమని, ఆ విభాగంలోని ఓ క్లర్కు సదరు ఫైల్లో నీగ్రో అని పేర్కొన్నాడని తెలిపారు. అయినప్పటికీ నీగ్రో అనే పదం ఉపయోగించినందుకు తాను క్షమాపణలు కోరుతున్నానని మనోహర్ పారికర్ అన్నారు.