కరెంట్ షాక్.. తల్లీ కొడుకుల మృతి

  కరెంట్ షాక్‌కి గురై తల్లీ కొడుకులు మరణించారు. గుంటూరు జిల్లా నగరం మండలం ఈదుపల్లి గ్రామంలో ఈ విషాద సంఘటన జరిగింది. చింతల నాంచారమ్మ (55) అనే మహిళ మంగళవారం రాత్రి వర్షం పడుతూ వుండగా ఇంట్లోని విద్యుత్ కేబుల్‌ను సరిచేసే ప్రయత్నం చేసింది. వర్షం కారణంగా విద్యుత్ తీగలు బాగా తడిసిపోయి వుండటంతో ఆమెకు తీవ్ర విద్యుదాఘాతానికి గురై కిందపడి గిలగిలా కొట్టుకుంటోంది. దాన్ని గమనించిన ఆమె కుమారుడు శ్రీనివాసరావు (35) తల్లిని కాపాడే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో శ్రీనివాసరావు కూడా కరెంట్ షాక్‌కి గురయ్యాడు. ఈ సంఘటనలో తల్లీకొడుకులు ఇద్దరూ మరణించారు.

మెట్రో ప్రాజెక్టు నుంచి తప్పుకుంటాం: ఎల్ అండ్ టీ లేఖ

  హైదరాబాద్‌ మెట్రోరైలు ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని మెట్రో ప్రాజెక్టును నిర్మిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ భావిస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆ సంస్థ ఛైర్మన్ వీబీ గాడ్గిల్ తెలంగాణ ప్రభుత్వానికి 20 పేజీల సుదీర్ఘ లేఖ రాసింది. ఆ లేఖలో మెట్రో రైలు ప్రాజెక్టు కారణంగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించింది. మెట్రో రైలు ప్రాజెక్టు పనులను శరవేగంగా చేస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ వేగం రాష్ట్ర విభజన తర్వాత తగ్గిపోయింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి వస్తున్న సమస్యలతోపాటు రాష్ట్ర విభజన కారణంగా మారిన పరిస్థితులు కూడా ఎల్ అండ్ టీ సంస్థను ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడానికి ప్రిపేర్ చేశాయి. మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కూడా ఆ సంస్థ విమర్శించింది. ఈ ప్రాజెక్టు నుంచి మేం తప్పుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగా మా సంస్థకు నష్టం రాబోతోంది. అందువల్ల మా ఖర్చులు మాకు ఇచ్చేసి మెట్రో రైలును మీరే నిర్మించుకోండి అని ఎల్ అండ్ టి ఆ లేఖలో స్పష్టంగా చెప్పింది.

గోల్కొండ దగ్గర ఉద్రిక్తం.. బీజేపీ నేతల అరెస్ట్...

  తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగురవేస్తానని భారతీయ జనతాపార్టీ ప్రకటించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం గోల్కొండ కోట మీద జాతీయ జెండా ఎగురవేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. గోల్కొండ కోట మీద ఎవరూ జెండా ఎగురవేయకుండా భద్రతా ఏర్పాట్లు చేసింది. అయితే బీజేపీ నాయకులు మాత్రం అక్కడ జాతీయ జెండా ఎగురవేస్తామని స్పష్టంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ విమోచన దినమైన బుధవారం నాడు బీజేపీ నాయకులు గోల్కొండ కోట దగ్గరకి చేరుకున్నారు. కోట లోపలకి వెళ్ళి అక్కడ జాతీయ జెండా ఎగురవేయడానికి ప్రయత్నించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. దాంతో గోల్కొండ ప్రాంతలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

రజాకార్లు కావాలో తెలంగాణ ప్రజలు కావాలో తేల్చుకో కేసీఆర్... కిషన్‌‌రెడ్డి

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు రజాకార్లు కావాలో, తెలంగాణ ప్రజలు కావాలో తేల్చుకోవాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి సవాల్ విసిరారు. హైదరాబాద్లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బుధవారం తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు కిషన్రెడ్డి అధ్యక్షతన ఘనం జరిగాయి. ఈ సందర్భంగా కిషన్రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, కర్ణాటకలోని రాష్ట్ర ప్రభుత్వాలు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతున్నా ఇక్కడ ఎందుకు జరపడం లేదని కేసీఆర్ను ప్రశ్నించారు. ఎవరు వద్దన్నా కాదన్నా గోల్కొండ కోట మీద జాతీయ జెండా ఎగురవేస్తామని కిషన్రెడ్డి స్పష్టం చేశారు.

గోల్కొండ పరిసరాల్లో భారీ భద్రత

  తెలంగాణ విమోచన దినం సందర్భంగా గోల్కొండ కోట మీద జాతీయ జెండా ఎగురవేస్తామని భారతీయ జనతాపార్టీ ప్రకటించిన నేపథ్యంలో గోల్కొండ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. గోల్కొండకు వెళ్లే అన్ని దారుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా భద్రతా దళాలు మోహరించాయి. 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. గోల్కొండ కోటపై విమోచన దినోత్సవాల నిర్వహణపై ప్రభుత్వం స్పందించకుంటే తామే రాష్ట్రవ్యాప్తంగా విమోచన దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహిస్తామని బీజేపీ ప్రకటన చేసింది. దానికి తగ్గ సన్నాహాలు కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలో గోల్కొండ పరిసరాల్లో భద్రతను పెంచారు.

ఫుల్లుగా మందుకొట్టి యాక్సిడెంట్ చేసిన యువతి

  మందుకొట్టి యాక్సిడెంట్లు చేయడం ఒక్క మగాళ్ళ హక్కు మాత్రమే కాదు.. లేడీస్ కూడా ఈ రంగంలో తమ హక్కును నిరూపించుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఓ యువతి మంగళవారం రాత్రి తప్పతాగి కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ మెహిదీపట్నం ప్రాంతంలోని ఫ్లై ఓవర్ మీద నుంచి వెళ్తూ ఓ ద్విచక్ర వాహనాన్ని తన కారుతో ఢీకొట్టింది. ఆ తర్వాత ఫ్లై ఓవర్ మీద వున్న డివైడర్ని ఢీకొట్టింది. తర్వాత కారు దిగి తూగుతూ జోగుతూ నానా హడావిడి చేసింది. ఇదెక్కడి చోద్యమమ్మా అని అక్కడున్నవారు అడిగితే నన్ను అడగటానికి మీరెవరంటూ తిరగబడింది. ఈలోగా పోలీసులు వచ్చి ఆమెను బ్రీత్ అనలైజర్‌తో పరీక్షిస్తే మేడమ్ గారు పీకలదాకా మందు కొట్టిన విషయం నిరూపణ అయింది. దాంతో పోలీసులు ఆమె మీక కేసు నమోదు చేశారు. గతంలో కూడా రెండు మూడు సందర్భాలలో ఈమెగారే ఇలా తప్పతాగి యాక్సిడెంట్లు చేసిన చరిత్ర కూడా వుందని తెలిసింది. ఈమె డ్రైవింగ్ లైసెన్స్‌ని రద్దు చేసే పనిలో పోలీసులు వున్నట్టు సమాచారం. ఈ యువతి అబిడ్స్‌లోని ఓ సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయట.

నేడు మోడీ పుట్టినరోజు... తల్లి ఆశీస్సులు...

  నేడు భారత ప్రధాని నరేంద్రమోడీ పుట్టినరోజు. నరేంద్రమోడీ 64వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నరేంద్రమోడీ తన తల్లి హీరాబెన్ ఆశీస్సులు తీసుకోవడానికి గుజరాత్‌లోని గాంధీనగర్‌కి వెళ్ళారు. అక్కడ ఆమె పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా హీరాబెన్ తాను నరేంద్రమోడీ పుట్టినరోజు కోసం ప్రత్యేకంగా చేయించిన మోడీకి ఇష్టమైన మిఠాయిని మోడీకి తినిపించారు. అలాగే ఆమె మోడీకి ఒక దండను కూడా కానుకగా ఇచ్చారు. మోడీ నుదుటన ఆమె ముద్దు పెట్టారు. ఈ సందర్భంగా మోడీ తన తల్లి ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. ఇదిలా వుంటే, నరేంద్రమోడీ పుట్టినరోజు వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని భారతీయ జనతాపార్టీ వర్గాలు భావించాయి. అయితే నరేంద్రమోడీ వాటిని వారించారు. తన పుట్టినరోజు వేడుకలు జరిపేకంటే, వరద కష్టాల్లో వున్న కాశ్మీర్ వాసులను ఆదుకుంటే సంతోషిస్తానని అన్నారు.

కోడి కోసం బావిలోకి.. మామా అల్లుళ్ళ మృతి

  బావిలోపడిన కోడి చనిపోయింది. తనతోపాటు మరో ఇద్దర్ని చంపేసింది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కోట గ్రామంలో జరిగింది. చనిపోయిన ఇద్దరూ మామా అల్లుళ్ళు కావడం విషాదకరం. గ్రామంలోని దళితవాడలో ఒక కోడి బావిలో పడి చనిపోయింది. చనిపోయిన కోడిని బయటకి తీసుకురావాలన్న ఉద్దేశంతో కోటయ్య (40) అనే వ్యక్తి బావిలోకి దిగాడు. అయితే బావిలో దిగిన కోటయ్య ఎంతసేపటికీ బయటకి రాకపోవడంతో అతని మేనమామ వెంకట రమణయ్య (55) కూడా బావిలోకి దిగాడు. బావిలోని విష వాయువుల కారణంగా ఇద్దరూ బావిలోనే చనిపోయారు. దాంతో దళితవాడలో విషాదం అలముకుంది. బావిలో వున్న వారిని బయటకి తీసుకురావడానికి ఎవరూ సాహసించలేకపోతున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకి తీశారు.

మహిళలకు శుభవార్త... అంట్లు తోమే రోబో!

  శాస్త్రవేత్తలు మహిళలకు ఉపయోగపడే మంచి రోబోని కనిపెట్టారు. ఈ రోబో ఎంచక్కా అంట్లు తోమేస్తుంది. ఆ తోమటం కూడా ఆషామాషీగా కాకుండా పూర్తి శుభ్రంగా తోమేస్తుంది. ఏదైనా పాత్ర పూర్తిగా శుభ్రపడకపోతే దాన్ని పక్కన పడేయదు. చక్కగా పూర్తిగా శుభ్రం అయ్యే వరకూ తోముతుంది. ఈ రోబో పాత్రల మీద జిడ్డు, ఆహార పదార్ధాలని సెన్సర్ల ద్వారా పసిగట్టేసి అవి పాత్రల మీద ఎంతమాత్రం లేకుండా జాగ్రత్త పడుతుంది. ఈ రోబో పేరు ‘బోరిస్’. గత వారం జరిగిన బ్రిటీష్ సైన్స్ ఫెయిర్‌లో ఈ రోబోని ప్రదర్శించారు. దీనిని బర్మింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ రోబో మార్కెట్లోకి వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా పనిమనుషుల గిన్నెలో రాయిపడటం ఖాయం.

జేసీ బ్రదర్ ఆగ్రహం.. కేసు.. ఉపసంహరణ

  తాడిపత్రి తెలుగుదేశం ఎమ్మెల్యే జేసీ ప్రభాకర రెడ్డి మీద స్టేట్ బ్యాంకు అధికారులు కేసు పెట్టడంతో తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తర్వాత బ్యాంకు అధికారులు కేసును వాపసు తీసుకోవడంతో పరిస్థితులు సర్దుమణిగాయి. స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం దగ్గర చెత్త విపరీతంగా పేరుకుపోతోందని, దాన్ని శుభ్రం చేయాలని బ్యాంకు అధికారులతో ప్రభాకరరెడ్డి వాగ్వాదానికి దిగారు. దాంతో బ్యాంకు అధికారులు ఆయన మీద కేసు పెట్టారు. తన మీద కేసును నిరసిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎస్బీఐ బ్యాంకు వద్ద ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే ఆందోళనకు మద్దతుగా భారీగా ప్రజలు తరలి వచ్చి బ్యాంకు ముందు చాలాసేపు ధర్నా చేపట్టారు. దాంతో పోలీసులు భారీగా మోహరించారు. తాడిపత్రి అట్టుడికిపోయింది. తాను తాడిపత్రి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపడితే బ్యాంకు అధికారులు తన పైన కేసు పెట్టడమేమిటని జేసీ ప్రశ్నించారు. ఎట్టకేలకు బ్యాంకు అధికారులు జేసీ ప్రభాకరరెడ్డి మీద కేసు ఉపసంహరిచుకోవడంతో వివాదం సర్దుమణిగింది.

అమీర్ ‘పీకే’ కొత్త పోస్టర్ విడుదల

  బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ నటించిన తాజా చిత్రం ‘పీకే’ విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. పోస్టర్ల దగ్గరే ఈ సినిమాకి భారీ పబ్లిసిటీ లభిస్తోంది. బట్టల్లేని ఒంటికి కేవలం ఒక టేప్ రికార్డర్ మాత్రమే పెట్టకుని మొదటి పోస్టర్‌ విడుదల చేసిన అమీర్ ఖాన్ ఆ తర్వాత ఒంటినిండా బట్టలతో బ్యాండ్ బృందం సభ్యుడిగా రెండో పోస్టర్లో కనిపించాడు. అప్పటి నుంచి మూడో పోస్టర్‌లో అమీర్ ఎలా వుంటాడా అన్న ఎదురుచూపులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ‘పీకే’ సినిమా మూడో పోస్టర్ మూవింగ్ పోస్టర్ రూపంలో విడుదలైంది. ఈ పోస్టర్లో అమీర్‌ఖాన్ పాతకాలం పోలీసు డ్రస్‌లో వుండగా, మరో నటుడు సంజయ్‌దత్ బ్యాండ్ ట్రూప్ సభ్యుడిలా వున్నాడు. ఈ పోస్టర్‌కీ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ‘పీకే’ సినిమా డిసెంబర్ 19న విడుదల కానుంది.

విభజన ప్రక్రియ పూర్తి కావలసి వుంది: చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అధికారులు, సిబ్బంది విభజన జరగాల్సి ఉందని ఆయన చెప్పారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌తో ఏపీకి నిరంతర విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలోనే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చంద్రబాబు మీద ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు సమర్థుడు, ఆదర్శప్రాయుడు అన్నారు. ప్రతిపాదించిన 50 రోజుల్లోనే ప్రాజెక్టులను ఓకే చేయించుకున్నారన్నారు. బాబు నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకు వెళ్తుందన్నారు.

మహేష్‌బాబుకి సూర్య ‘మై ట్రీ ఛాలెంజ్’

  ఈమధ్యకాలంలో ‘ఐస్ బకెట్ ఛాలెంజ్’ చాలా పాపులర్ అయింది. దాన్ని అనుసరిస్తూ అనేక ఛాలెంజ్‌లు రంగంలోకి దిగాయి. అయితే మలయాళ నటుడు మమ్ముట్టి ఏవేవో పిచ్చిపిచ్చి ఛాలెంజ్‌లు చేయకుండా ‘మై ట్రీ ఛాలెంజ్’ అనే ఒక మంచి ఛాలెంజ్‌ని ప్రవేశపెట్టాడు. మమ్ముట్టి మూడు చెట్లు నాటి మరో ముగ్గురు సినీ ప్రముఖులకు ‘మై ట్రీ ఛాలెంజ్’ విసిరాడు. ఆ ఛాలెంజ్ ప్రకారం ఆ ముగ్గురు నటులు మూడేసి చెట్లు నాటి వాళ్ళు కూడా ఛాలెంజ్ చేయాలి. మమ్ముట్టి మూడు చెట్లు నాటి సూర్య, విజయ్, షారుక్ ఖాన్లకు ఛాలెంజ్ విసిరాదు. ఈ ఛాలెంజిని స్వీకరించిన సూర్య.. తన తర్వాత ముగ్గురిని సవాలు చేశాడు. వాళ్లలో మహేష్ బాబు, సుదీప్, అమీర్ ఖాన్ ఉన్నారు. మిగతావాళ్ళ సంగతేమోగానీ, మన మహేష్‌బాబు ఈ ఛాలెంజ్‌ని స్వీకరిస్తాడో లేదో చూడాలి.

మా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూశారు: కేసీఆర్

  మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించిన తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్లు....   * మా ప్రభుత్వాన్ని ప్రతి చిన్న విషయంలోనూ తప్పు పట్టే ప్రయత్నాలు కొన్ని ప్రతిపక్షాలు చేశాయి. ప్రతి విషయంలోనూ ప్రభుత్వాన్ని తప్పు పడుతూ గోబెల్స్ ప్రచారం చేశాయి. ఏది మాట్లాడినా దాంట్లో తప్పులు తీసి ప్రచారం చేయబోతే ప్రజలు చావుదెబ్బ కొట్టారు. అతితెలివి పనికిరాదని చెప్పారు.   * ప్రజలకి ఇచ్చిన ప్రతి మాటా నెరవేరుస్తానని హామీ ఇస్తున్నాను.   * మెదక్‌లో మరోసారి విజయం సాధించడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.   * ఎన్నికల సందర్భంగా కొన్ని అతిమాటలు విన్నాను. పొన్నాల, టీడీపీ, బీజేపీ నాయకులు అతిగా మాట్లాడారు. ప్రజలు వారికి బుద్ధి చెప్పారు. చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టు డిపాజిట్లు మాత్రం దక్కించుకున్నారు.   * ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని కోరుతున్నాం. వాటిని మేం స్వాగతిస్తాం. కానీ అనవసరంగా ప్రతి విషయంలో కోడిగుడ్డు మీద ఈకలు పీకితే మీకే బూమెరాంగ్ అవుతుంది.   * అమరుల త్యాగఫలితంగా తెలంగాణ ఏర్పడింది. అడ్డదిడ్డంగా పనిచేస్తే కుదరదు. కొంత టైం తీసుకుని పూర్తిగా పరిస్థితులను అర్థం చేసుకుని పనులు చేస్తాం. నిజం చెప్పాలంటే కేసీఆర్ మార్కు పాలన, టీఆర్ఎస్ మార్కు పాలన ఇంకా తెలంగాణలో ప్రారంభం కాలేదు. దసరా నుంచి పథకాలు వరుసగా ప్రారంభం అవుతాయి.