కృష్ణ, గోదావరిపై కుట్ర జరిగిందట...
కృష్ణ, గోదావరి జలాల విషయంలో తెలంగాణ మీద కుట్ర జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ ఎస్‌కె పండిట్, గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్ ఎమ్మెస్ అగర్వాల్‌తో కేసీఆర్ సోమవారం భేటీ అయ్యారు. కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన ప్రాజెక్టులకు నిబంధనలు రూపొందించి అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రెండు నదులపై నిర్మించిన ప్రాజెక్టుల గేట్లు, నీటి విడుదల తదితర కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను ఇరు రాష్ట్రాలకు అప్పగించకుండా బోర్డులే నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. అన్ని ప్రాజెక్టుల వద్ద సిఐఎస్‌ఎఫ్ సాయుధ బలగాలతో భద్రత ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్ సహా అన్ని నగరాలు, పట్టణాలు, ప్రాంతాల తాగునీటి అవసరాల కోసం నీటిని కేటాయించిన తర్వాతనే ఇతర అవసరాలకు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా సీమాంధ్ర పాలకులు వ్యవహరించారని కేసీఆర్ అన్నారు.