వర్మ మీద కేసులు... కోర్టు స్టే...

  ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మీద నమోదైన కేసుల మీద హైకోర్టు స్టే విధించింది. రామ్‌ గోపాల్ వర్మ వినాయకుడి మీద తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని వ్యాఖ్యలు చేయడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఆయన మీద కేసులు నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్లోనే అనేక పోలీసు స్టేషన్లలో ఆయన మీద కేసులు పెట్టారు. రాంగోపాల్ వర్మ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని, అవి బాధ్యతారహితంగా ఉన్నాయంటూ మహారాష్ట్రలో కూడా ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వరకు హైకోర్టు స్టే ఇచ్చింది. ఇది రామ్ ‌గోపాల్ వర్మకి ఊరట ఇచ్చే విషయమే.

మెట్రోపై లేఖ రాసిన మాట వాస్తవమే... గాడ్గిల్

  మెట్రోపై తెలంగాణ ప్రభుత్వానికి తమ సంస్థ లేఖ రాసిన మాట వాస్తవమేనని, సెప్టెంబర్ 10వ తేదీన తమ సంస్థ లేఖ రాసిందని ఎల్ అండ్ టీ ఛైర్మన్ గాడ్గిల్ వ్యాఖ్యానించారు. మెట్రో రైలు విషయంలో ఎల్ అండ్ టీ సంస్థ రాసిన లేఖ గురించి మీడియాలో వచ్చిన నేపథ్యంలో ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్‌‌ని కలిశారు. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. మెట్రో ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. మెట్రో పనులు ఎక్కడా ఆగలేదని చెప్పారు. ఒక పెద్ద ప్రాజెక్టు పనులు జరుగుతున్నప్పుడే కాంట్రాక్ట్ సంస్థకు ప్రభుత్వానికి మధ్య లేఖలు సహజమేనని ఆయన అన్నారు. తాము తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిన మాట వాస్తవమే అయినప్పటికీ, పత్రికల్లో కథనాలు రావడమే దురదృష్టకరమని ఆయన అన్నారు. భారీ ప్రాజెక్టులు అన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు రావడం సహజమేనని ఆయన చెప్పారు. తమ సంస్థపై దుష్ప్రచారం జరుగుతోందని, తాము ఏ మీడియా సంస్థకీ లేఖలకు సంబంధించిన సమాచారం ఇవ్వలేదని గాడ్గిల్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో తమకున్న సమస్యలను సున్నితంగా పరిష్కరించుకోవాలన్నది తమ అభిమతమని పేర్కొన్నారు.

ఉక్రెయిన్ ఎంపీని చెత్త తొట్టిలో కుక్కేశారు...

  ఉక్రెయిన్ ప్రజల్ని చూసి మన దేశ ప్రజలు చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే మన దేశంలో ప్రజా ప్రతినిధులు పనులు చేయకపోయినా, అవినీతికి పాల్పడుతున్నా జనం అతగాడి పదవీకాలం ముగిసేవరకూ దిగులు ముఖాలు వేసుకుని చూడ్డం తప్ప మరేమీ చేయలేరు. అయితే ఉక్రెయిన్ ప్రజలు అలా కాదు. వాళ్ళు టైమ్ వేస్ట్ చేయరు.. పనికిమాలిన నాయకులను అస్సలు స్పేర్ చేయరు. ఉక్రెయిన్‌లో విటలీ జురవ్ స్కీ అనే ఎంపీ వున్నాడు. ఆయన ఎంపీగా గెలిచినప్పటి నుంచి ప్రజలకు ముఖం చూపించిన పాపాన పోలేదు. ప్రజల సమస్యలను పట్టించుకున్న పుణ్యానా పోలేదు. ఆయనగారి నియోజకవర్గం ప్రజలు చూశారూ చూశారు.. చివరికి పార్లమెంట్ ఎదురుగానే ఆయనకు ఘన సత్కారం చేశారు. మీతో మాట్లాడాలి సార్ అని పార్లమెంట్ నుంచి బయటకి పిలిచి, తమ దగ్గరకి వచ్చిన ఆయన్ని గట్టిగా పట్టుకుని మోసుకెళ్ళి పార్లమెంట్ ముందు వున్న చెత్తకుండీలో పారేశారు. చెత్తకుండీలోంచి బయటకి లేవబోయిన ఆయన మీదపడి అందరూ ఆయన్ని చెత్తకుండీలో మరింత లోపలకి నెట్టేశారు. పోలీసులు వచ్చి ఆయన్ని చెత్తకుండీలోంచి బయటకి తీశారు. తన నియోజకవర్గ ప్రజలు ఈ రకంగా అవమానించాక ఆయన ఊరుకున్నారా? ఆ మురికిబట్టలతోనే పార్లమెంట్‌ లోపలకి వెళ్ళి తన ఎంపీ పదవికి రాజీనామా చేసేశాడు.

మెట్రోపై టీ సీఎం కార్యాలయం ప్రకటన

  మెట్రో రైలు నిర్మాణం నుంచి తప్పుకుంటామంటూ ఎల్ అండ్ టీ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం బయటపడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టకే భంగం ఏర్పడింది. దాంతో తెలంగాణ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. మెట్రో రైలు నిర్మిస్తున్న ఎల్ అండ్ టీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సాధారణమని ముఖ్యమంత్రి కార్యాలయం ఆ ప్రకటనలో పేర్కొంది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా, తెలంగాణ ప్రజలకు నష్టం జరిగేలా పత్రికల్లో కథనాలు వస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఆ ప్రకటనలో పేర్కొంది.

‘వర్మ సరళా ఆంటీ’ ఎవరబ్బా?

  హిట్టో... ఫట్టో... రామ్‌గోపాల్ వర్మ ఏ సినిమా తీసినా ఆ సినిమా గురించి జనాల్లో చర్చ జరుగుతూనే వుంటుంది. వర్మ కూడా పరమ చెత్త సినిమా తీసి కూడా, ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా కూడా నాలుగు డబ్బులు జేబులో వేసుకుంటున్నాడు. అలాగే తాను ఏ సినిమా తీసినా విచిత్రమైన టైటిల్స్‌తో, వెరైటీ ప్రచారంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇప్పుడు వర్మ చేస్తున్న అలాంటి ప్రయత్నమే ‘వర్మతో సరళా ఆంటీ’ సినిమా. వర్మ ఈ పేరుతో సినిమా తీస్తున్నట్టు ప్రకటించగానే అందరిలో ఆసక్తి రేగింది. ముఖ్యంగా యూత్ అయితే తాము కోరుకునే మంచి మసాలా సినిమా వర్మ నుంచి రాబోతోందని అనుకున్నారు. ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందా అన్నట్టుగా వుంది యూత్ పరిస్థితి. ఇదిలా వుంటే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘సరళా ఆంటీ’ పాత్రను ఎవరు ధరించబోతున్నారన్న అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఒక ప్రముఖ నటి సరళా ఆంటీగా నటించోబోతున్నట్టు వర్మ చెప్పారు. దాంతో ఇప్పుడు ‘ఆంటీ’ అయిన మాజీ హీరోయిన్లలో ఎవరు ఈ పాత్ర ధరించే అవకాశం వుందా అనే ఆలోచనలు టాలీవుడ్‌లో నలుగుతున్నాయి.

రైల్వే ట్రాక్ మీద నిలిచిన బస్సు.. వామ్మో...

  అది విజయనగరం జిల్లా బొబ్బిలి. ప్రయాణికులతో క్రిక్కిరిసి వున్న ఆర్టీసీ బస్సు నిండు గర్భిణిలా మెల్లగా ప్రయాణిస్తోంది. ఇంతలో బస్సు సడెన్‌గా ఆగిపోయింది. డ్రైవర్ ఆగిపోయిన బస్సుని తిరిగి స్టార్ట్ చేయడానికి ఇగ్నిషన్ కీ తిప్పుతున్నాడు. కీ తిప్పుతుంటే బస్సు బుర్రు బుర్రుమంటోంది తప్ప ఎంతకీ స్టార్ట్ కావడం లేదు. ఇంతలో కొంతమంది ప్రయాణికులు బస్సులోంచి బయటకి చూసి అదిరిపోయారు. కెవ్వుమని కేకలు వేశారు. అసలు విషయం ఏమిటంటే, ఆ బస్సు కచ్చితంగా కాపలా లేని లెవల్ క్రాసింగ్ దగ్గర కచ్చితంగా రైల్వే ట్రాక్ మధ్యలో నిలిచిపోయింది. దాంతో ప్రయాణికులందరూ కంగారుపడిపోయి గబగబా బస్సు దిగే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బస్సులో తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. ఎటువైపు నుంచి ఏ రైలు వచ్చి ఢీకొంటుందోనన్న భయంతో ప్రయాణికులందరూ టెన్షన్ పడిపోయారు. ఎవరికి తోచిన దారిలోంచి వాళ్ళు బస్సు దిగేశారు. కొంతమంది ప్రయాణికులైతే బస్సు అద్దాలు పగులగొట్టి మరీ బస్సులోంచి దూకేశారు. బస్సులోంచి దూకేసిన కాసేపటికిగానీ ప్రయాణికుల టెన్షన్ తగ్గలేదు. ఆ తర్వాత అందరూ కలసి అటూ ఇటూ చూసుకుంటూ బస్సును ట్రాక్ మీద నుంచి అవతలకి నెట్టేశారు.

కేసీఆర్ వినాశకాలే విపరీతబుద్ధి.. జానా ఆగ్రహం

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ప్రతిపక్ష పార్టీల దాడి తీవ్రమైంది. పాపం ఏ విషయంలోనైనా ఆచి తూచి మాట్లాడే కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి కూడా కేసీఆర్ మీద ఒంటి కాలిమీద లేచి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని జానారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే కనకయ్యపై అనర్హత వేటు వేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి పిటిషన్ ఇచ్చినట్లు జానారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా పొందిన పదవిని విడిచిపెట్టకుండా వేరే పార్టీలోకి చేరడం అనైతికమని జానా అన్నారు. స్పీకర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి ఎమ్మెల్యే కనకయ్య మీద అనర్హత వేటు వేయాలని జానారెడ్డి కోరారు.

విమానం స్క్రూ లూజ్.. తప్పిన ప్రమాదం...

  మీరు విమానంలోగానీ ఎక్కబోతున్నారా? ఎందుకైనా మంచిది విమానంలో ఎక్కకముందే విమానంలోని అన్ని నట్లూ సరిగ్గా వున్నాయో లేదో చెక్ చేసుకుంటే మంచింది. ఎందుకంటే విమానాల నట్లు లూజైపోయినా పట్టించుకోకుండా గాల్లోకి తీసుకెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపాలైపోతాయి. ఇలాంటి సంఘటన ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎస్జి-451 విమానం బయల్దేరిన కొద్దిసేపటికే ఇంజన్లో సమస్యను గుర్తించిన పైలట్.. దాన్ని సింగిల్ ఇంజన్తోనే సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేశారు. ఆ తర్వాత పరిశీలిస్తే అర్థమైందేంటంటే, ఇంజన్లో ఒక కీలకమైన నట్టును సరిగ్గా బిగించలేదని. పైలెట్ అయితే సకాలంలో లోపాన్ని గుర్తించి, విమానాన్ని వెనక్కి తిప్పడంతో దాదాపు 175 మంది ప్రయాణికులకు ప్రాణాపాయం త్రుటిలో తప్పింది. ఈ సంఘటనతో ఆ విమానానికి మెయింటెనెన్స్ ఇంజనీర్గా వ్యవహరించి, సర్టిఫికెట్ ఇచ్చిన వ్యక్తికి అధికారాలను డీజీసీఏ తొలగించింది.

మీ వైద్యం మండ... పొట్టలో గుడ్డపెట్టి కుట్టేశారు..

  కర్నాటకలోని కేడూరులో ఒక ఆస్పత్రి వైద్యులు మహిళ కడుపులో గుడ్డ పెట్టి కుట్టేశారు. ఉడిపి సమీపంలోని కేడూరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో సులోచనా శెట్టి అనే మహిళ రెండో కాన్పు కోసం జూన్ 24న చేరింది. సిజేరియన్ ఆపరేషన్ చేసిన బిడ్డని బయటకి తీశారు. ఆ తర్వాత వైద్యులు ఆమె పొట్టలో ఒక గుడ్డ పెట్టి కుట్లు వేసేశారు. ఆ తర్వాత ఆమెకి ఆనారోగ్య సమస్యలు పెరిగిపోయాయి. కడుపు నొప్పిగా వుండటం, రక్తస్రావం జరుగుతూ వుండటంతో ఆమె స్థానికంగా వున్న ఒక స్కానింగ్ సెంటర్‌లో స్కాన్ చేయించుకుంది. అయితే సదరు స్కానింగ్ సెంటర్ వాళ్ళు స్కానింగ్ రిపోర్టు ఆమెకు ఇవ్వకుండా ఆస్పత్రికే ఇస్తామని చెప్పి పంపేశారు. ఆ తర్వాత సదరు ఆస్పత్రి వాళ్ళు మీకు మళ్ళీ చిన్న ఆపరేషన్ చేయాల్సి వుందని చెప్పి ఆ మహిళను పిలిపించారు. మళ్ళీ ఆపరేషన్ ఎందుకు చేయాలని ఆ మహిళ కుటుంబీకులు అడిగినా ఆస్పత్రివాళ్ళు సరిగా సమాధానం చెప్పలేదు. దాంతో ఆ మహిళను బెంగుళూరుకు తీసుకెళ్ళి పరీక్షలు చేయించగా ఆమె పొట్టలో గుడ్డ వున్న విషయం బయటపడింది. ఈ విషయాన్ని రెండో కంటికి తెలియకుండా చేయాలనే సదరు ప్రైవేట్ ఆస్పత్రివాళ్ళు మళ్ళీ ఆపరేషన్ చేయాలని అన్నారని అర్థం చేసుకున్న మహిళ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించి పొట్టలో వున్న గుడ్డని బయటకి తీయించారు. గుడ్డ అంటే అదేదో చిన్న గుడ్డ పేలిక కాదు.. చేతులు తుడుచుకునే నేప్‌కిన్.

కేసీఆర్ తీరువల్లే మెట్రో సమస్యలు...

  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలి వల్లనే మెట్రో రైలుకు సమస్యలు ఏర్పడ్డాయని కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ విమర్శించారు. కేసీఆర్ మొండి వైఖరి కారణంగానే మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి ఎల్ అండ్ టీ సంస్థ తప్పుకుంటానని లేఖ రాసిందని ఆయన అన్నారు. కేసీఆర్ తీరు కారణంగానే తెలంగాణ రాష్ట్రానికి రావల్సిన హీరో ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి వెళ్ళిపోయిందని షబ్బీర్ చెప్పారు. దాంతోపాటు మహేంద్ర ట్రాక్టర్ల యూనిట్ కూడా కేసీఆర్ వైఖరి కారణంగానే బెంగుళూరుకు తరలిపోయిందని అన్నారు. రాబోయే మూడేళ్ల వరకూ తెలంగాణకు కరెంట్ కష్టాలు తప్పవని కేసీఆర్ అంటున్నారని, కేవలం ఆయన నిర్లక్ష్య వైఖరి వల్లే పరిశ్రమలు ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నాయని షబ్బీర్ అలీ చెప్పారు. కేసీఆర్ ఇదే ధోరణి కొనసాగిస్తే తెలంగాణ అభివృద్ధి చెందడం కలలో మాటేనని షబ్బర్ అన్నారు.

రోడ్డు ప్రమాదం: హైదరాబాదీలు మృతి

  ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని రాప్తాడు మండలం గొల్లపల్లి దగ్గర మారుతీకారు అదుపు తప్ప రోడ్డు డివైడర్ని ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులను శ్రీహర్ష, కామేశ్వరరావు, సుమన్ గా పోలీసులు గుర్తించారు. శ్రీహర్ష కాకినాడ వాసి కాగా,మిగతా ఇద్దరు హైదరాబాద్‌కి చెందినవారు. వీరంతా బెంగళూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

నా ఆరోగ్యం భేషుగ్గా వుంది: కమల్ హాసన్

  ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ అనారోగ్య కారణంగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆయన స్వల్ప అస్వస్థతకి గురయ్యారని వార్తలతోపాటు, కమల్ హాసన్ నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారన్న వదంతులు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ స్పందించారు. ‘‘నేను షూటింగ్ సందర్భంగా ఫుడ్ పాయిజనింగ్, డీ హైడ్రేషన్‌కి గురి కావడంతో అనారోగ్యం కలిగింది. ఇప్పుడు నేను బాగానే వున్నాను. షూటింగ్ నిమిత్తం కేరళలోని మారుమూల గ్రామాలకు వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ సరైన హోటల్స్ లేకపోవడంతో ఏదిపడితే అది తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. రోడ్డుపక్కన వున్న దాభాల్లో తినడం, కలుషిత నీరు తాగడం వల్ల ఈ సమస్య ఏర్పడింది. ఇప్పుడు నేను కోలుకున్నాను. నేను నరాల సంబంధిత వ్యాధితోనే ఆస్పత్రిలో చేరానని వచ్చిన పుకార్లు తప్పు’’ అన్నారు. కాగా, కమల్‌హాసన్ బుధవారం నాడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు.

మెట్రోపై వార్తలు అవాస్తవం: కేటీఆర్

  మైట్రో రైలు ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని ఎల్ అండ్ టీ సంస్థ తాజాగా లేఖ రాసిందని వచ్చిన వార్తలు అవాస్తవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. కొంతమంది మెట్రో రైలు ప్రాజెక్ట్ను వివాదం చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. ఈ అంశం మీద ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తారని ఆయన తెలిపారు. మెట్రోపై ఎల్అండ్టీ లేఖ రాసినట్లు మీడియాలో చూసినట్లు కేటీఆర్ అన్నారు. ఈ వార్తను కొందరు కావాలని పనిగట్టుకుని రాసినట్టుగా ఉందని ఆయన విమర్శించారు. ఇదిలా వుంటే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. మెట్రో ప్రాజెక్ట్ వివాదంపై చర్చించారు. ఆ తర్వాత ఎన్వీఎస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మెట్రో పనులు ఎక్కడా ఆగలేదని, కొనసాగుతున్నాయని తెలిపారు. ఎల్అండ్టీ లేఖ ఇప్పుడు రాసింది కాదని.. పాతదేనని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు తమమధ్య జరుగుతూనే వుంటాయని ఆయన అన్నారు.

హైదరాబాద్ మెట్రోకి టీఆర్ఎస్ గ్రహణం పట్టింది.. రేవంత్ రెడ్డి

  ప్రతిష్ఠాత్మకమైన హైదరాబాద్‌ మెట్రో రైలుకు టీఆర్ఎస్ గ్రహణం పట్టిందని తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. మెట్రో రైలు పనులకు తెలంగాణ ప్రభుత్వం అవరోధాలు సృష్టిస్తూ పెద్ద అడ్డంకిగా మారిందని ఆయన అన్నారు. మెట్రో రైలు అలైన్‌మెంట్ మార్చాలని కేసీఆర్ ఎల్ అండ్ టీ సంస్థ మీద తీవ్ర ఒత్తిడి తెచ్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేసీఆర్ ఒత్తిడి భరించలేకే ఎల్ అండ్ టీ సంస్థ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటానంటూ లేఖ రాసిందని అన్నారు. ఈ వివాదం విషయంలో తెలంగాణ ప్రభుత్వం తక్షణం స్పందించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మెట్రో రైలు ప్రాజెక్టు మీద అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని  ఆయన సూచించారు.