చెన్నైకి వచ్చిన ఆర్నాల్డ్ స్కావ‌నెగ్గర్

  ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ స్కావనెగ్గర్ శంకర్, విక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఐ’ సినిమా ఆడియో వేడుకలలో పాల్గొనడానికి చెన్నైకి చేరుకున్నారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుక ఈరోజు సాయంత్రం జరుగనుంది. ఆర్నాల్డ్ రాక సందర్భంగా చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగే ‘ఐ’ ఆడియో వేడుకలో ‘టెర్మినేటర్’ ఆర్నాల్డ్‌తోపాటు ‘రోబో’ రజనీకాంత్ కూడా పాల్గొంటారు. ఆర్నాల్డ్ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను సోమవారం నాడే కలవనున్నారు. ‘ఐ’ చిత్రానికి సంగీతాన్ని అందించిన ఎ.ఆర్.రెహమాన్ ‘ఐ’ సినిమా ఆడియో వేడుకలో కూడా సంగీత విభావరిని నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.

ఏపీ మంత్రివర్గ నిర్ణయాలు

  సోమవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరిగింది. ‘పేపర్ లెస్ మీటింగ్’గా జరిగిన ఈ సమావేశంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు, ఐ ప్యాడ్లతోనే సమావేశం జరిగింది. నాలుగు గంటలపాటు జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు నిర్ణయాలు తీసుకుంది.   * చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సెజ్‌లో హోండా పరిశ్రమ ఏర్పాటుకు 600 ఎకరాల భూమి కేటాయింపు.   * ప్రభుత్వ పథకాల అమలు తీరు పర్యవేక్షణకు గ్రామ, మండల, మునిసిపల్, జిల్లా స్థాయుల్లో ప్రత్యేక కమిటీల ఏర్పాటు.   * అక్టోబర్ 2వ తేదీ నుంచి నిరంతర విద్యుత్ అమలు ప్రారంభం.   * అక్టోబర్ 2వ తేదీన ఎన్టీఆర్ సుజల స్రవంతి, వృద్ధాప్య పెన్షన్ల పెంపు ప్రారంభం.   * విద్యాశాఖకు ఉన్న అడ్డంకులు తొలగించుకోవాలని సూచన.   * అవాంతరాలు తొలగిన వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల.   * అక్టోబర్ మొదటివారం నుంచి రుణమాఫీ అమలు.   * అక్టోబర్ 2 లోగా ఎన్టీఆర్ క్యాంటిన్ల ఏర్పాటుపై చర్చ.   * మంత్రులు ఎవరి పనితీరు వారే సమీక్షించుకుని ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వాలి.

అజ్జూభాయ్ ఇంటికి కరెంట్, నీరు కట్

  ఎంపీలుగా ఓడిపోయినవారు, మాజీ కేంద్ర మంత్రులు తమ పదవులు పోగానే బుద్ధిగా ఢిల్లీలోని తమ నివాసాలను ఖాళీ చేసి తమ తిప్పలేవో తాము పడటం అనేది సంప్రదాయం. అదే మర్యాద కూడా. అయితే కొంతమంది ప్రజాప్రతినిధులు ఆ మర్యాదని పాటించరు. అలాంటి వారి విషయంలో అధికారులు అమర్యాదగా వ్యవహరిస్తూ వుంటారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ అజారుద్దీన్ విషయం కూడా ఇలాగే తయారైంది. అయ్యగారి ఎంపీ పదవీకాలం ముగిసిపోయింది. మొన్నటి ఎన్నికలలో కూడా సార్ చిత్తుగా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీలోని తన అధికార నివాసాన్ని ఖాళీ చేయాలి. అయితే అజారుద్దీన్ మాత్రం అధికారులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఇల్లు కాళీ చేయలేదు. దాంతో అధికారులు అజారుద్దీన్ ఇంటికి కరెంట్, వాటర్ సరఫరాని నిలిపేశారు. ఇప్పటికైనా అజారుద్దీన్ ఇంటిని ఖాళీ చేస్తారో లేదో చూడాలి. అన్నట్టు ఇలా కరెంట్, వాటర్ కట్ చేసింది కేవలం అజారుద్దీన్ ఒక్కడి ఇంటికే కాదండోయ్.. ఇలాంటి జిడ్డు మాజీ ఎంపీలు మొత్తం 30 మంది వున్నారట. వారు వుంటున్న ఇళ్ళన్నిటికీ కరెంట్, వాటర్ కట్ చేశారు.

రెగ్యులర్ ఇంక్రిమెంట్ కావాలి.. తెలంగాణ ఇంక్రిమెంట్‌ లాభం లేదు

  తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇంక్రిమెంట్ వల్ల తమకు ఎంతమాత్రం లాభం లేదని తెలంగాణ ఉద్యోగులు అంటున్నారు. సోమవారం నాడు సచివాలయంలో తెలంగాణ ఉద్యోగుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో లంచ్‌ అవర్ ర్యాలీ నిర్వహించారు. స్పెషల్ పేను అన్ని అలవెన్సులు వర్తించే రెగ్యులర్ ఇంక్రిమెంట్‌గా మార్చాలని తెలంగాణ ఉద్యోగులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తక్షణమే తెలంగాణ ప్రభుత్వానికి మార్చాలని విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ, హెల్త్ కార్డులు వెంటనే అమలు చేయాలన్నారు. సచివాలయ ఉద్యోగుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో సచివాలయం ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

వందరోజులు.. వెయ్యి అబద్ధాలు.. 178 ఆత్మహత్యలు...

  కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విరుచుకుపడ్డారు. కేసీఆర్ వంద రోజుల పాలనలో ఆయన సాధించిన ప్రగతి వెయ్యి అబద్ధాలు చెప్పడం, 178 మంది రైతుల ఆత్మహత్యలకు కారణం కావడమని ఆమె విమర్శించారు. రైతు రుణమాఫీ మీద కేసీఆర్‌కి ఇప్పటికీ స్పష్టత లేదని ఆమె అన్నారు. రైతులను ఆదుకోని కేసీఆర్ ప్రభుత్వాన్ని బతుకమ్మ తల్లి క్షమించదని చచెప్పారు. ఎంఐఎంతో ఎలాంటి పొత్తు పెట్టుకోకుండా గ్రేటర్‌ హైదరాబాద్‌లో కాంగ్రెస్ సొంతంగానే ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో కల్లు దుకాణాల ఏర్పాటుకు వ్యతిరేకంగా హైదరాబాద్‌ కాంగ్రెస్ కార్యకర్తలు పోరాడాలని రేణుకా చౌదరి పిలుపునిచ్చారు.

మా పార్టీకే ముఖ్యమంత్రి కుర్చీ....

  ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా వుంది మహారాష్ట్రలో శివసే వ్యవహారం. త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. శివసేన, బీజేపీ కూటమి అక్కడ పోటీ చేయబోతోంది. ఈసారి ఎన్నికలలో మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమికే అధికారం దక్కే అవకాశం వుందని సర్వే ఫలితాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి తమకే కావాలని శివసేన నాయకులు పేచీ పెట్టుకున్నారు. ఇప్పటికే శివసేన అధిపతి ఉద్ధవ్ థాకరే తానే తానే కాబోయే ముఖ్యమంత్రిని అని ప్రకటించుకుంటూ వున్నారు. తాజాగా శివసేన నాయకుడు సంజయ్ రౌత్ కూడా ఇదే విషయాన్ని తాజాగా ప్రకటించారు. బీజేపీకి కూడా ముఖ్యమంత్రి పదవి కావాలనే ఆశ వుండటంలో తప్పులేదు. అయితే మా పార్టీ మాత్రం ముఖ్యమంత్రి పదవిని వదులుకోదని అని స్పష్టంగా ప్రకటించారు. శివసేన నాయకుల వ్యాఖ్యలపై తమ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి మాధవ్ భండారి తెలిపారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న నమ్మకం వుందని ఆయన అన్నారు.

హైదరాబాద్‌లో సీమాంధ్రులకు భయం లేదు: నరసింహన్

  హైదరాబాద్‌లో సీమాంధ్రులకు అభద్రతాభావం ఉందనటం అవాస్తవమని, హైదరాబాద్ నగరంలో సీమాంధ్రులకు ఎలాంటి అభద్రత లేదని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అన్నారు. ప్రస్తుతం ఒకరోజు ఢిల్లీ పర్యటనలో వున్న గవర్నర్ సోమవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. మొదట కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచి విజన్‌తో పనిచేస్తున్నారని గవర్నర్ ఈ సందర్భంగా కితాబు ఇచ్చారు. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 9, 10లలో ఎలాంటి వివాదం లేదని, అయితే వాటిపై మరింత స్పష్టత రావలసిన అవసరం వుందని గవర్నర్ నరసింహన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

పాపం విజయవాడ: వెంకయ్య జాలి..

  ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడను చూస్తే తనకు జాలి వేస్తోందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. విజయవాడ విమానాశ్రయం చాలా దయనీయ స్థితిలో వుందని, విజయవాడ నగరం సరైన సదుపాయాలు లేకుండా వుందని, నగరపాలక సంస్థ దుస్థితిని చూస్తే బాధేస్తోందని ఆయన అన్నారు. స్మార్ట్ సిటీల మీద విజయవాడలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. విజయవాడ ప్రస్తుతం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోందని వాటిని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. విజయవాడ విమానాశ్రయం అభివృద్ధికి తనవంతు సహకారాన్ని అందిస్తానని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడం ఖరారు అయినట్టేనని ఆయన చెప్పారు.

దేశంలో ‘పింక్ టెర్రరిజం’... మేనకాగాంధీ

  కేంద్రమంత్రి మేనకాగాంధీ దేశంలో కొత్తరకం తీవ్రవాదం పెరిగిపోతోందని అన్నారు. ఆ తీవ్రవాదానికి ఆమె ‘పింక్ టెర్రరిజం’ అని పేరు పెట్టారు. అక్రమంగా జంతువులను వధిస్తూ, ఆ డబ్బును ఉగ్రవాదానికి, బాంబుల తయారీకి కొంతమంది ఉపయోగిస్తున్నారని ఆమె చెప్పారు. దీనికి ఆమె ‘పింక్ టెర్రరిజం’ అని పేరు పెట్టారు. పాలిచ్చే జంతువులను వధిస్తూ, విదేశాలకు ఎగుమతి చేస్తూ ఆ డబ్బుతో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆమె చెప్పారు. ఇందులో మత ప్రసక్తి లేదని ఆమె వివరించారు. జంతువుల హక్కుల గురించి పోరాడుతున్న మేనకా గాంధీ ఇండియా ఫర్ యానిమల్స్ అనే సదస్సులో మాట్లాడుతూ ఈ ‘పింక్ టెర్రరిజం’ గురించి ప్రస్తావించారు. ఉత్తర ప్రదేశ్ పోలీసులు నాలుగేళ్ళ క్రితమే ఈ తీవ్రవాదం గురించి చెప్పారని ఆమె గుర్తు చేశారు. పాలిచ్చే జంతువులను వధించడం.. దానికితోడు ఆ డబ్బును ఉగ్రవాదానికి ఉపయోగించడం విశృంఖలంగా సాగుతున్నందున.. దీన్ని అడ్డుకోడానికి అందరూ కృషిచేయాలని, ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆమె పిలుపు ఇచ్చారు.

పొన్నాల గోచీ మీద టీ విద్యామంత్రి కామెంట్లు

  తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గోచీ మీద కామెంట్లు చేశారు. పొన్నాల లక్ష్మయ్య గోచీని కాంగ్రెస్ వాళ్లే ఊడగొడతారని జగదీష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ని ప్రజలు తరిమి కొడతారని పొన్నాల అంటున్నారని, నిజానికి కాంగ్రెస్ పార్టీవాళ్ళే పొన్నాల గోచీ ఊడగొడతారని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఘాటైన పదజాలంతో హెచ్చరించారు. కేసీఆర్ వందరోజుల పాలనలో ఎలాంటి అభివృద్ధీ చేయలేదంటున్న పొన్నాల గతంలో ఆంధ్రావాళ్ళ కాళ్ళు మొక్కి పదవులు కాపాడుకుంటూ వచ్చారని జగదీష్ రెడ్డి విమర్శించారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతగాని దద్దమ్మలని, వారిద్దరూ నల్లగొండ జిల్లా ప్రజలకు చేసిందేమీ లేదని కనీసం ఎడమకాలువకు నీరు కూడా విడుదల చేయించలేదని మంత్రి మండిపడ్డారు.

చైనాలో భారీ వరదలు... 19 మంది మృతి

  మన దేశంలోని కాశ్మీర్లో భారత వర్షాల కారణంగా వరదలు ఆ రాష్ట్రాన్ని ముంచెత్తాయి. వరద పరిస్థితి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో చైనాలో కూడా భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా చైనాని కూడా వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా చైనాలో ఇప్పటి వరకు 19 మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ వుండే అవకాశం వుందని అధికార వర్గాలు అంటున్నాయి. ఇప్పటి వరకు 20 మంది గల్లంతయ్యారని తెలుస్తోంది. వరదల్లో చిక్కుకున్న వేలాదిమంది  ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చోంగ్‌కింగ్ నగరంలో 12 మంది, సిచువాన్ ప్రావిన్స్‌లో ముగ్గురు, షాంగ్జిలో నలుగురు మరణించారు.

గజల్ శ్రీనివాస్ ‘మందిర’ సీడీ ఆవిష్కరించిన సాధ్వి రితంబర

  ప్రముఖ గజల్ గాయకుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ హిందీలో స్వీయ సంగీత దర్శకత్వంలో గానం చూసి రూపొందించిన ‘మందిర్’ ఆడియో సీడీని ఉత్తర ప్రదేశ్‌లోని బృందావన్‌లోని వాత్సల్య జరిగిన ఒక కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త సాధ్వి రితంబర దేవి ఆవిష్కరించారు. ఆలయ పరిరక్షణ చైతన్య గీతాలతో రూపొందిన హిందీ సీడీ ఇది. ఈ సందర్భంగా సాధ్వి రితంబర దేవి మాట్లాడుతూ, ‘‘దేవాలయాలు దేశానికి ఆత్మాలాంటివి. బాల్యం నుంచి పిల్లలకు దేవాలయం, సనాతన ధర్మంపై అవగాహన కల్పించాలి. దీనికోసం తల్లిదండ్రులు, పాఠ్యాంశాలు స్ఫూర్తి కలిగించాలి. బాల బాలికలలో సనాతనధర్మం గురించి అవగాహన కలిగించే విధంగా స్ఫూర్తిదాయక పోటీలు, సదస్సులు నిర్వహించాలి. సేవ్ టెంపుల్స్ సాంస్కృతిక రాయబారిగా డాక్టర్ గజల్ శ్రీనివాస్ దేవాలయాల పరిరక్షణ కోసం రూపొందించిన ఈ సీడీలోని గీతాల ద్వారా ఆలయ పరిరక్షణ, గోమాత విశిష్ఠత, అన్నదాన ప్రాముఖ్యం, గంగా ప్రక్షాళలకు సంబంధించి ప్రజలకు అవగాహన పెరుగుతుంది. ఈ సీడీలోని గీతాలు ప్రజలను ఆలోచింపజేస్తాయి. డాక్టర్ గజల్ శ్రీనివాస్ గాన కృషి వల్ల ప్రజలు సనాతన ధర్మం దిశగాచైతన్యవంతులు అవుతారు’’ అన్నారు. ఈ ఆడియో ఆశిష్కరణ కార్యక్రమంలో డాక్టర్ గజల్ శ్రీనివాస్‌తోపాటు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, సేవ్ టెంపుల్స్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ వెలగపూడి ప్రకాశరావు, శ్రీమతి గురింధర్ కౌర్, సంజయ్ బయ్యా, లోపాముద్ర తదితరులు పాల్గొన్నారు.

గౌహతి ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

  గౌహతి ఐఐటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చదువుతున్న ఒక విద్యార్థి హాస్టల్ బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తుషార్ యాదవ్ అనే పేరున్న ఈ విద్యార్థి గుర్‌గావ్ ప్రాంతానికి చెందినవాడు. ఈ విద్యార్థి గత కొంతకాలంగా తీవ్ర డిప్రెషన్‌లో వున్నట్టు తెలుస్తోంది. అయితే తుషార్ యాదవ్ ర్యాగింగ్ కారణంగానే చనిపోయి వుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఐఐటీ అధికారులు మాత్రం తుషార్‌ని ఎవరూ ర్యాగింగ్ చేయలేదని అంటున్నారు. ఈ ఏడాది మార్చిలో ఇదే ఐఐటీలో ఎమ్మెస్సీ చదువుతున్న ఓ పశ్చిమ బెంగాల్ విద్యార్థి ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు.

ఏపీ మంత్రివర్గ సమావేశం.. పేపర్ లేకుండా...

  ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరిగింది., గతంలో జరిగిన మంత్రివర్గ సమావేశాల కంటే ఇది చాలా విభిన్నమైన మంత్రివర్గ సమావేశం. ఒక్క ఆంధ్రపదేశ్ మంత్రివర్గ సమావేశానికి సంబంధించినంతవరకు మాత్రమే కాకుండా దేశంలోనే ఇది అత్యంత విభిన్నమైన మంత్రివర్గ సమావేశం. ఎందుకంటే ఈ సమావేశంలో అసలు ఎంతమాత్రం కాగితాలు ఉపయోగించకుండా నిర్వహించారు. ఇది పేపర్ రహిత మంత్రివర్గ సమావేశం. కేవలం ఐ ప్యాడ్లు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల ద్వారానే మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఏ సందర్భంలోనూ పేపర్, పెన్ ఉపయోగించలేదు.

బతుకమ్మకి సోనియాని ఆహ్వానించాల్సిందే.. టీ కాంగ్రెస్

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా నిర్వహించ తలపెట్టిన బతుకమ్మ ఉత్సవాలకు కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీని ఆహ్వానించాల్సిందేనని టీ కాంగ్రెస్ నేతలు మొత్తుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియాగాంధీనే కాబట్టి బతుకమ్మ వేడుకలకు సోనియాగాంధీని ఆహ్వానించాల్సిందేనని టీ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని పణంగా పెట్టి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి తెలంగాణ ప్రజలు ఎప్పటికీ కృతజ్ఞులై వుండాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు డి.కె.అరుణ చెబుతున్నారు. బతుకమ్మ ఉత్సవాలకు కేంద్ర మంత్రులను, విదేశీయులను ఆహ్వానిస్తున్న కేసీఆర్ సోనియాగాంధీని మాత్రం ఎందుకు ఆహ్వానించడం లేదో తమకు అర్థం కావడం లేదని డి.కె.అరుణ అన్నారు. ఈనెల 17న హైదరాబాద్ సంస్థాన విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు.

రాజ్యసభ ఇస్తే ఆలోచిస్తా.. అమీర్‌ఖాన్

  బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్‌కి రాజ్యసభ సీటు మీద కన్ను పడినట్టు వుంది. ఆమధ్య సచిన్ టెండూల్కర్, రేఖ లాంటి వాళ్ళకి పిలిచి మరీ రాజ్యసభ సీటు ఇచ్చేసరికి, తనకు కూడా రాజ్యసభ సీటు అలాగే బంగారు పళ్ళెంలో పెట్టి మరీ అందితే బాగుండని అమీర్‌ఖాన్ ఆలోచిస్తున్నట్టుంది. అందుకే తన మనసులోని మాటను బయట పెట్టేశాడు. తనకు రాజ్యసభ సీటు ఇస్తే ఎంపీగా సేవలందించడానికి సిద్దమేననే సంకేతాలిచ్చాడు. రాజ్యసభకు ఎంపికకు అవకాశం వస్తే ఆలోచిస్తానని ఓ హిందీ చానెల్ కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ స్పష్టం చేశారు. మోడీ పాలన గురించి తన కంటే మీడియాకే ఎక్కువ తెలుసునని అమీర్‌ఖాన్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.

నా డ్యూటీ నేను చేశా.. మంత్రుల తప్పుల గురించి తెలియదు.. మన్మోహన్

  మాజీ ప్రధానమంత్రి నోరు తెరిచారు. ప్రధానమంత్రిగా తన డ్యూటీ తాను చేశానని, తన మంత్రివర్గంలో వున్న వాళ్ళు తప్పులు చేశారో లేదో తనకు తెలియదని ఆయన అన్నారు. మన్మోహన్‌సింగ్‌ని ఆకాశానికి ఎత్తేస్తూ ఆయన కుమార్తె దమన్‌సింగ్ రాసిన ‘స్ట్రిక్ట్‌లీ పర్సనల్: మన్మోహన్ అండ్ గురుశరణ్’ అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా మన్మోహన్‌సింగ్ మాట్లాడుతూ, ‘‘నా విధులు నేను నిర్వర్తించాను. ఇతరులు ఏమి చేశారన్న దానిపై నేనేమీ స్పందించలేను’’ అంటూ రెండంటే రెండు ముక్కల్లో తన స్పందనను వెల్లడించేశారు. తండ్రిపై వచ్చిన ఆరోపణలపై కూడా దమన్ సింగ్ కూడా పెద్దగా స్పందించలేదు. ‘‘వాస్తవంగా ఆ విషయం గురించి నాకేమీ తెలియదు. అందువల్ల దానిపై నేనేమీ మాట్లాడలేను’’ అని ఆమె అన్నారు.