ఒమన్‌లో భారతీయ కుటుంబం మృతి

  గల్ఫ్‌లోని ఒమన్‌లో ముగ్గురు సభ్యులన్న భారతీయ కుటుంబం మరణించింది. తమిళనాడుకు చెందిన అనే ఓ వ్యక్తి, తన పదేళ్ళ కూతురుతోపాటు వెళ్తున్న కారును ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరూ మరణించారు. ఈ వార్తను వారి కుటుంబానికి తెలియజేయడానికి మృతుడి దగ్గర దొరికిన ఫోన్‌ ద్వారా ప్రయత్నించగా, ఇంటి దగ్గర ఎవరూ ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పోలీసులు సమాచారం చెప్పడం కోసం ఆ ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళేసరికి అక్కడ మృతుడి భార్య కూడా చనిపోయి కనిపించింది. మృతుడు ఒమన్‌లోని సోహర్ స్టీల్ కంపెనీలో పని చేసేవాడు. ఆయన భార్య ఎల్ అండ్ టి సంస్థలో పనిచేసేది. కుమార్తె నాలుగో తరగతి చదువుతోంది. ఈ కుటుంబం మొత్తం ఒకేసారి చనిపోవడం మిస్టరీగా మారింది. తండ్రీ కూతురున్న వాహనాన్ని ట్యాంకర్ ఢీకొందా... లేక ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో వారే ట్యాంకర్‌కి వాహనాన్ని అడ్డు తెచ్చారా అనేది తేలాల్సి వుంది. మొత్తమ్మీద కుటుంబ తగాదాల వల్ల ఈ మరణాలు సంభవించాయని ఒమన్ పోలీసులు అనుమానిస్తున్నారు.

డ్రంక్ అండ్ డ్రైవింగ్‌లో దొరికిపోయిన మూవీ డైరెక్టర్

  హైదరాబాద్‌లో పోలీసులు నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలలో ‘వాంటెడ్’ దర్శకుడు బివిఎస్ రవి అలియాస్ మచ్చ రవి దొరికిపోయాడు. మచ్చ రవి దొరికిపోయిన సమయంలో ఆ కారులో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా వుండటం విశేషం. పోలీసులు నిర్వహించిన పరీక్షలో బీవీఎస్ రవి మోతాదుకు మించి భారీగా మద్యం సేవించినట్టు తేలింది. పోలీసులు రవి మీద కేసు నమోదు చేసి కారు స్వాధీనం చేసుకున్నారు. దాంతో రామ్ గోపాల్ వర్మ ఓ ఆటో ఎక్కి వెళ్ళిపోయినట్టు సమాచారం. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ సందర్భంగా బీవీఎస్ రవితోపాటు మరో 20 మందిని పోలీసులు పట్టుకున్నారు. వీరందరికీ సోమవారం నాడు కౌన్సిలింగ్ నిర్వహించి, మంగళవారం కోర్టులో హాజరు పరుస్తారు. దర్శకుడు బి.వి.ఎస్.రవి గతంలో  ఒకసారి మందుకొట్టి కారు డ్రైవ్ చేస్తూ దొరికిపోయాడు.అయినా మనిషి మారలేదు.

న్యూస్ రీడర్ ఉద్యోగాన్ని ఊడగొట్టిన జీ జిన్‌పింగ్

  భారత పర్యటనలో వున్న చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పేరును తప్పుగా పలికినందుకు దూరదర్శన్ ఓ న్యూస్ రీడర్‌ను ఉద్యోగం నుంచి తాత్కాలికంగా తొలగించారు. జీ జిన్‌పింగ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చి, ప్రధాని నరేంద్ర మోడీతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లో తొలి జీని ఆంగ్లంలో ఎక్స్, ఐ అనే రెండు అక్షరాలతోరాస్తారు. రోమన్ అంకెల్లోని '11' కూడా ఈ రెండు అక్షరాల మాదిరిగానే ఉంటుంది. దీంతో సదరు న్యూస్ రీడర్ చైనా అధ్యక్షుడి పేరును ఎలెవెన్ జిన్ పింగ్‌గా ఉచ్చరించింది. దీంతో ఆమెకు ఉద్వాసన పలికారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూస్తామని డీడీ డైరెక్టర్ జవహర్ సర్కార్ చెప్పారు. అయితే, ఆమె క్యాజువల్ బేసిస్ ఉద్యోగి అని, ఆమెను కొన్ని నెలల పాటు మాత్రమే ఉద్యోగం నుంచి తొలగించామని మరో అధికారి చెబుతున్నారు.

ఆస్తులను ప్రకటించిన సీఎం చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన తన ఆస్తులను, తన కుటంబ సభ్యుల ఆస్తులను ప్రకటించారు. గత నాలుగు సంవత్సరాలుగా ఎథిక్స్ కమిటీకి తన ఆస్తుల వివరాలను చంద్రబాబు తెలియజేస్తూ వస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే తన బ్యాంకు బేలన్స్ కొంచెం పెరిగిందని, మిగతా ఆస్తులు అలాగే వున్నాయని చంద్రబాబు చెప్పారు. అలాగే తన భార్య ఆస్తులు కూడా అలాగే వున్నాయని, ఆమె ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లో మాత్రం కొంత బేలన్స్ పెరిగిందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన కుమారుడు లోకేష్, కోడలు బ్రహ్మణి ఆస్తులను కూడా ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి వారి ఆస్తులు వారే ప్రకటించుకుంటారని చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా తమ కుటుంబం చేస్తున్న వ్యాపారాల వివరాలను కూడా చంద్రబాబు ప్రకటించారు. తమ కుటుంబానికి ఏదో ఒక జీవనాధారం వుండాలన్న ఉద్దేశంతోనే హెరిటేజ్ సంస్థను ప్రారంభించినట్టు చంద్రబాబు చెప్పారు. తమ నిర్వహణలో వున్న హోల్డింగ్స్ ఆస్తుల విలువ 90 లక్షలు పెరిగిందని ఆయన వెల్లడించారు. ఒక్క చిన్న అవకతవక కూడా లేకుండా తమ ఆస్తులు వుంటాయని ఆయన చెప్పారు.తన ఆస్తుల వివరాలను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పూర్తిగా చదివి వినిపించారు. తన ఆస్తుల వివరాలను వెల్లడించడం తన బాధ్యతగా భావిస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు.

కూతుర్ని, ఆరుగురు మనవళ్ళని కాల్చి చంపాడు...

  అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన కుమార్తెతో పాటు ఆరుగురు మనవళ్లను కాల్చి చంపాడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్లోరిడా బెల్ పట్టణంలో నివసించే డాన్ ఛార్లెస్ స్పిరిట్ (51) అనే వ్యక్తి తన ఇంట్లో ఉన్న ఏడుగురిని తుపాకితో కాల్చి చంపాడు. ఆ తర్వాత అతను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు ఆత్మహత్య చేసుకునే ముందే అత్యవసర సేవల విభాగానికి ఫోన్ చేసి ఇంటికి రావాలని చెప్పాడే కానీ.. ఇంటి చిరునామా మాత్రం చెప్పలేదు. ఫోన్ నంబర్ ఆధారంగా ఇంటి చిరునామా కనిపెట్టిన పోలీసులు అక్కడుకు చేరుకునే సమయానికి డాన్ తనను తాను కాల్చుకుని చనిపోయాడు. మొత్తం ఆ ఇంట్లో ఎనిమిది మంది మృతదేహాలు రక్తపు మడుగులో ఉన్నాయి. హత్య చేసిన చిన్నారుల్లో మూడు నెలల బిడ్డతో పాటు.. పదేళ్ల లోపు వారే. డాన్ ఛార్లెస్ మనవళ్లను, కూతుర్నీ చంపడానికి గల కారణాలు తెలియలేదు. కాగా, డాన్ స్పిరిట్ తన ఎనిమిదేళ్ల కొడుకును 2001లో కాల్చి చంపినట్లు స్థానికులు చెప్పారు. ఈ నేరానికి జైలుకు వెళ్లిన డాన్ 2006లో విడుదలయ్యాడు. ఇప్పుడు ఈ దారుణం చేశాడు.

కాశ్మీర్ మృతులు 277.. ఒమర్ అబ్దుల్లా

  జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో సంభవించిన వరదల్లో మొత్తం 277 మంది మృతి చెందినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అధికారికంగా ప్రకటించారు. గత 50 యేళ్ళలో ఎన్నడూ లేనివిధంగా జమ్మూకాశ్మీర్‌ను వరదలు ముంచెత్తాయని అన్నారు. అయితే, తొలుత భయపడిన స్థాయిలో మరణాల సంఖ్య లేకపోవడం ఊరటని ఇస్తోందన్నారు. వరదల సమయంలో రాజౌరీ జిల్లాలో ఓ పెళ్లి బస్సు కొట్టుకుపోయి 44 మంది చనిపోయారు. వారితో సహా ఒక్క జమ్మూలోనే 203 మంది మరణించారని వివరించారు. సహాయక చర్యల్లో భాగంగా 74 మృతదేహాలను కాశ్మీర్ వ్యాలీలోని పలు ప్రాంతాల్లో బయటకు తీసినట్లు ఒమర్ వివరించారు. కాగా, కొన్ని మృతదేహాలను జంతువులు తింటున్నాయని, మరికొన్ని దేహాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ వైపు కొట్టుకుపోయాయన్న వార్తలను ఆయన తిరస్కరించారు. కాగా, వరద బాధితులను రక్షించేందుకు సైన్యం అందించిన సేవలు ఎంతో గొప్పవన్నారు.

భారతీయ ముస్లింలు దేశభక్తులు.. మోడీ ప్రశంస

  భారత ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ ముస్లింల ఉదాత్తతను ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. ‘‘భారతీయ ముస్లింలు... దేశం కోసమే జీవిస్తారు. అవసరమైతే దేశం కోసం ప్రాణాలర్పించేందుకూ వెనుకాడరు. భారత్‌కు ఎలాంటి నష్టం కలగకూడదని ప్రగాఢంగా విశ్వసిస్తారు’’ అంటూ శుక్రవారం ఓ అమెరికా టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. ‘‘అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ భారతీయ ముస్లింల గురించి తప్పుగా అర్థం చేసుకుంటోంది. తమ ట్యూన్లకు అనుగుణంగా భారతీయ ముస్లింలు స్టెప్పులేస్తారని అనుకుంటోంది’’ అని కూడా మోడీ వ్యాఖ్యానించారు. ఇస్లాం పేరిట జరుగుతున్న విశ్వవ్యాప్త పోరులో పాలుపంచుకోవాలని భారతీయ ముస్లింలకు పిలుపునిస్తూ, ఇటీవల అల్ ఖైదా చీఫ్ అల్ జవహరి విడుదల చేసిన వీడియో మీద మోడీ ఈ మేరకు ఘాటుగా స్పందించారు. తన వ్యాఖ్యల ద్వారా భారతీయ ముస్లింల గొప్పదనాన్ని, దేశభక్తిని ప్రపంచానికి తెలియజేశారు.

ఫేస్‌బుక్‌లో దొరికిన దొంగమొగుడు

  ఘజియాబాద్‌లో ఓ టీచరమ్మ కష్టపడి చదువుకుని ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగం సంపాదించింది. ఇక పెళ్ళి చేసుకుందామనుకున్ని ఒక మాట్రిమోనీ వెబ్‌సైట్‌‌ని ఆశ్రయించింది. వెబ్‌సైట్ వాళ్ళు చూపించిన ఒక అందగాడిని చూసి ముచ్చటపడి పెళ్ళి చేసుకుంది. ఏడాది నుంచి వారి సంసారం ముద్దు ముచ్చట్లతో సాగుతోంది. అయితే ఈమధ్య ఫేస్‌బుక్ చూస్తున్న ఆమె తన భర్త పేజీ ఒకసారి చూసింది. అంతే ఆమెకి కళ్ళు తిరిగినంత పనైంది. తాను శ్రీరామచంద్రుడని అనుకుంటున్న తన భర్తకి ఆల్రెడీ చాలా ఏళ్ళ క్రితమే ఇంకొకరితో పెళ్ళయిందని, ఓ కూతురు కూడా వుందని తెలుసుకుని షాకైపోయింది. షాక్ నుంచి తేరుకుని పోలీసులకు రిపోర్టు చేసింది. పోలీసులు ఆమెగారి భర్త గారిని అరెస్టు చేసి నాలుగు పీకితే అన్ని విషయాలూ బయటపెట్టాడు. పోలీసులు సదరు దొంగమొగుడు గారిని సగౌరవంగా కటకటాల వెనక్కి నెట్టారు.

యువతికి అశ్లీల ఎస్సెమ్మెస్‌లు... నిర్భయ చట్టం...

  ఆదిలాబాద్ జిల్లాకి చెందిన ఓ యువతికి గత కొద్ది రోజులుగా అసభ్య మాటలు, చిత్రాలతో కూడిన మెసేజ్‌లు రావడం ప్రారంభమైంది. దాంతో ఆమె బెదిరిపోయింది. కొద్దిరోజులు అలా వచ్చి ఆగిపోతాయిలే అనుకుంది. అయితే ఆ మెసేజ్‌ల వరద ఆగలేదు. దాంతో ఆమె తీవ్ర మానసిక క్షోభకు గురైంది. ఎవరికైనా చెబుదామంటే ఆమె ఇబ్బందికరంగా భావించింది. ఆ మెసేజ్‌లు ఎవరు పంపుతున్నారో తెలియక బాధపడింది. అలా నిరంతరం మెసేజ్‌లు వస్తూ వుండే సరికి ఆమె సెల్ ఫోన్ మెసేజ్ సౌండ్ వింటేనే ఉలిక్కిపడే స్థితికి చేరుకుంది. ఎంతకీ అశ్లీల మెసేజ్‌లు ఆగకపోయేసరికి ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది. దాంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు దర్యాప్తు చేసి ఆదిలాబాద్ జిల్లాలోని లక్షణ్ చాందా మండలం వడ్యాల గ్రామం నుంచి ఆ మెసేజ్‌ల వస్తున్నాయని పసిగట్టారు. ఆ మెసేజ్‌లు పంపుతున్న ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. ఇద్దరి మీద నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

మేండలిన్ శ్రీనివాస్ మృతి.. మోడీ, చంద్రబాబు సంతాపం..

  ప్రముఖ మేండలిన్ వాయిద్య విద్వాంసులు మేండలిన్ శ్రీనివాస్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ శుక్రవారం నాడు చెన్నైలో మరణించిన సంగతి తెలిసిందే. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తూ వుండగా శ్రీనివాస్ మరణించినట్టు సమాచారం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేండలిన్ విద్వాంసుడైన మేండలిన్ శ్రీనివాస్ మరణం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపాన్ని తెలియజేశారు. బాల్యం నుంచే మేండలిన్ విద్వాంసుడిగా గొప్ప ప్రతిభ కనబరచిన మేండలిన్ శ్రీనివాస్ అకాల మరణం చెందడం బాధాకరమని మోడీ, చంద్రబాబు తమ సంతాప సందేశాల్లో పేర్కొన్నారు.

శ్రీకాళహస్తి ఆలయంలో లేడీ కిలాడీ..

  చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో ఒక లేడీ కిలాడీ భారీ మోసానికి పాల్పడింది. ప్రసిద్ధ కాళహస్తీశ్వరాలయానికి వచ్చిన భక్తులకు ఆ లేడీ కేడీ మత్తుమందు కలిపిన టీ తాగించింది. ఆ టీ తాగిన మహిళా భక్తులు స్పృహతప్పి పడివడంతో లేడీకేడీ వారి దగ్గరున్న నగలను తీసుకుని పోరిపోబోయింది. ఈ విషయాన్ని గమనించిన ఇతర భక్తులు ఆ కిలేడీని పట్టుకుని, దేహశుద్ధి చేసి ఆలయ సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కి తరలించారు. పోలీసులు కిలేడీ దగ్గరున్న బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. మత్తు కలిపిన టీ తాగి స్పృహ తప్పి పడిపోయిన మహిళలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఆస్తికోసం కన్న కూతుర్ని చంపేసిన తల్లి

  హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడాలో దారుణం జరిగింది. కన్నతల్లే కూతుర్చి నడి రోడ్డు మీద హత్య చేసింది. యూసుఫ్‌గూడాలోని లక్ష్మీ నరసింహ నగర్‌లో నివసించే లక్ష్మి (50) తన కుమార్తె కళ్యాణి (25)ని కత్తితో నడిరోడ్డు మీద నరికి చంపింది. కూతుర్ని చంపిన తర్వాత చేతిలో రక్తమోడుతున్న కత్తితో కూతురి శవం పక్కనే భయంకరంగా నిల్చుని వున్న లక్ష్మిని చూసి స్థానికులు బెదిరిపోయారు. లక్ష్మి తన ముగ్గురు కూతుళ్ళతో కలసి లక్ష్మీ నరసింహ నగర్‌లో నివసిస్తోంది. వీళ్ళమధ్య కొంతకాలంగా నెలకొన్న ఆస్తి తగాదాల కారణంగానే ఈ హత్య జరిగిందని తెలుస్తోంది. ఈ హత్య చేయడానికి మిగతా ఇద్దరు కూతుళ్ళు కూడా తల్లికి సహకరించారని సమాచారం. లక్ష్మి తన కన్న కూతుర్ని హత్య చేయడానికి ముందు తన ఇంటి చుట్టూ వున్న క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలను ధ్వంసం  చేసింది. బంజారాహిల్స్‌ పోలీసులు లక్ష్మితోపాటు ఇద్దరు కూతుళ్ళను అదుపులోకి తీసుకున్నారు.

మహేష్ ‘ఆగడు’.. షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ...

  నటీనటులు: మహేష్‌బాబు, తమన్నా, శ్రుతిహాసన్ (ఐటమ్ సాంగ్), రాజేంద్ర ప్రసాద్ ,నాజర్ , సోనుసూద్, వెన్నెల కిశోర్, పోసాని, ఎమ్మెస్.   సాంకేతికవర్గం: సంగీతం - ఎస్.ఎస్.థమన్ , సినిమాటోగ్రఫీ - కె.వి.గుహన్, నిర్మాతలు - రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం - శ్రీను వైట్ల.   ఘన విజయం సాధించిన ‘దూకుడు’ కాంబినేషన్‌లో రూపొందిన ‘ఆగడు’ సినిమా శుక్రవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొదటి నుంచీ ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ట్రైలర్లు, సాంగ్స్ ‘ఆగడు’ మీద ఆసక్తిని మరింతగా పెంచాయి.   కథ: అనాథ అయిన శంకర్ (మహేష్‌‌బాబు)ని పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాజారావు (రాజేంద్ర ప్రసాద్) చేరదీస్తాడు. నిన్ను తప్పకుండా పోలీస్ చేస్తానని హామీ ఇస్తాడు. అయితే శంకర్ చేయని నేరానికి బాల నేరస్తుల కారాగారానికి వెళ్ళాడు. అక్కడ బాగా చదువుకుని పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ఆ తర్వాత తన వ్యక్తిగత సమస్యకు కారణం కావడంతోపాటు సంఘ వ్యతిరేక శక్తిగా వున్న దామోదర్ (సోనూసూద్)ని హీరో ఎలా ఎదుర్కొన్నాడన్నది ఈ సినిమా కథాంశం.   నటీనటులు: మహేష్‌బాబు ప్రశంసనీయంగా నటించాడు. పంచ్ డైలాగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తమన్నా అందాలు ఆరబోసింది. ఒక్క పాటలో శ్రుతీహాసన్ మెరిసింది.   దర్శకత్వం: శ్రీను వైట్ల సినిమాని మాస్ మసాలతో పూర్తి కమర్షియల్‌గా రూపొందించారు. ‘ఆగడు’ సినిమా మహేష్ అభిమానులకు పండగ చేసుకునేలా వుంది.

ఆ హీరోయిన్ నా భార్య.. కాపురానికి పంపండి...

  కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడ తనను పెళ్ళి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని కన్నడ హీరోయిన్ మైత్రేయ కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసు నేపథ్యంలో కార్తీక్ గౌడ అరెస్టు వరకూ వెళ్ళి బెయిల్ దొరకడంతో జైలు జాతకం తప్పించుకున్నాడు. అయితే మంత్రి కొడుకు మీద కేసు పెట్టిన హీరోయిన్ మైత్రేయని మరో కేసు వేధిస్తోంది. హీరోయిన్ మైత్రేయ తన భార్య అని, తామిద్దరం గతంలో పెళ్ళి చేసుకున్నామని, అయితే మైత్రేయ తనతో కాపురం చేయడం లేదని కన్నడ దర్శకుడు రుషి మొత్తుకుంటూ కేసు పెట్టాడు. ఇప్పుడు రుషి తన భార్య మైత్రేయ తనతో కాపురం చేసేలా ఆదేశించాలని కోరుతూ బెంగుళూరులోని కుటుంబ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

బక్రీద్ రోజున గోవధపై నిషేధం

  బక్రీద్ సందర్భంగా గోవధపై నిషేధాన్ని విధించారు. ఆరోజున ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్ అండ్ యానిమల్ ప్రిజర్వేషన్ యాక్ట్ ప్రకారం ఆవులను, ఆవు దూడలను కబేళాలకు అమ్మడాన్ని, కొనుగోలు చేయడాన్ని నిషేధించినట్టు పోలీసులు తెలిపారు. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘించి కబేళాలకు వీటిని అమ్మినా, గోవధకు పాల్పడినా చట్టపక్రారం శిక్ష తప్పదన్నారు. బక్రీద్ సమయంలో ఆవులను, గేదెలను కబేళాల వద్ద కొనుగోలు చేయరాదని, కేవలం ఆంబోతులు, దున్నపోతులను మాత్రమే కొనాలని కబేళాల యజమానులకు పోలీసులు సూచించారు. బక్రీద్ ఒక్కరోజున ఇన్ని నిషేధాలు పెడితే సరిపోదు ఎప్పుడైనా గోవధ చేయరాదని ఆంక్షలు విధించాలని హిందూ వర్గాలు అంటున్నాయి.

మాజీ ఎంపీ కొంగులాగిన ఎమ్మెల్యే

  మధ్యప్రదేశ్‌లో దినేష్ రాయ్ అనే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే చాలా చిలిపి వాడని పేరు. అయితే తన చిలిపితనాన్ని ఓ మాజీ లేడీ ఎంపీ దగ్గర చూపించి అడ్డంగా దొరికిపోయాడు. సియోన్ నియోజకవర్గంలో జరిగిన ఓ బహిరంగసభలో బీజేపీ మాజీ ఎంపీ నీతా పటేరియాతో కలసి పాల్గొన్న దినేష్‌రాయ్ ఆ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన చేతికి నూనె అంటుకుంది. దాంతో సదరు ఎమ్మెల్యేగారు అటూ ఇటూ చూసి, తనని ఎవరూ గమనించడం లేదనుకుని నీతా పటేరియా కొంగు లాగి తన చేతిని ఆమె చీరకి తుడిచేశాడు. దీనిని ఓ స్థానిక ఛానల్ కెమెరా కనిపెట్టేసి ప్రసారం చేసేసింది. దాంతో నాలుక్కరుచుకున్న దినేష్‌ రాయ్ నీతా పటేరియా దగ్గరకి వెళ్ళి సారీ చెప్పాడు. కొంగు లాగడం వెనుక తనకు వేరే ఉద్దేశాలేవీ లేవని, మిమ్మల్ని నా వదినలా భావించి నా చేతులకు ఉన్న నూనె మీ చీరకు రాశానని చెప్పుకున్నాడు. నీతా పటేరియా ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయకపోయినప్పటికీ ఈ అంశం మీద దుమారం రేగుతూనే వుంది.

ట్రాన్స్‌ఫార్మర్ని ఢీకొట్టిన స్కూలు బస్సు...

  గుంటూరులో ఘోర ప్రమాదం తప్పిపోయింది. ఈ ప్రమాదం తప్పినందుకు దేవుణ్ణి నమ్మేవారు దేవుడికి, నమ్మనివారు ప్రపంచాన్ని నడిపించే ఏదో అదృశ్య శక్తికి నమస్కారం పెట్టితీరాల్సిందే. ఈ సంఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే, గుంటూరులోని నవభారత్ నగర్ దగ్గర ఒక ప్రైవేటు పాఠశాల బస్సు రోడ్డు మీద మలుపు తిరుగుతూ మూల మలుపులో వున్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ని ఢీకొట్టింది. బస్సు ధాటికి ట్రాన్స్‌ఫార్మర్‌ ఊగిపోయింది. ఈ సమయంలో బస్సులో 50 మంది విద్యార్థులు వున్నారు. అదృష్టవశాత్తూ బస్సు ట్రాన్స్‌ఫార్మర్ని ఢీకొన్న సమయంలో కరెంటు లేదు. అసలే గుంటూరులో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. బస్సు కూడా పూర్తిగా తడిచిపోయి వుంది. ఈ సమయంలో కనుక కరెంట్ ఉన్నట్టయితే ఆ ఘోరం ఊహించని విధంగా వుండేది.

తెలంగాణకు ప్రత్యేక హోదా కావాలి

  తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 14వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని కాకతీయ హోటల్లో జరుగుతున్న 14వ ఆర్థిక సంఘం సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో చాలా జిల్లాలు వెనుకబడి వున్నాయని, ముఖ్యంగా మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలు చాలా వెనుకబడి వున్నాయని కేసీఆర్ చెప్పారు. అందువల్ల తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం హోదా ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్ అగ్ర స్థానంలో వుందని కేసీఆర్ ఈ సందర్భంగా 14వ ఆర్థిక సంఘానికి చెప్పారు. తెలంగాణలో తమ ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న పథకాల వివరాలను సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా వివరించారు.