బ్రిటన్ హెచ్చరిక-భారత్ కు మరో చెంప దెబ్బ
posted on Mar 19, 2013 6:51AM
బ్రిటన్ హెచ్చరిక-భారత్ కు మరో చెంప దెబ్బ ఇంతవరకు వివిధ దేశాల ప్రభుత్వాలు భారత్ లో పర్యటిస్తున్న తమ పౌరులను ఉగ్రవాదుల దాడులను దృష్టిలో ఉంచుకొని రద్దీగా ఉండే ప్రాంతాలలో సంచరించ వద్దని హెచ్చరించడం విన్నాము. కానీ, ‘ఉగ్రవాదుల దాడిని అరికట్టడం మన చేతుల్లో లేదు’ అని మనకు మనం సర్ది చెప్పుకొని విదేశీ ప్రభుత్వాలు చేసిన హెచ్చరికలను మనకి అవమానకరంగా భావించక తేలికగా తుడిచేసుకోగలిగాము. కానీ, ఇప్పుడు బ్రిటన్ దేశ ప్రభుత్వం భారత్ లో పర్యటించే తన మహిళా పర్యాటకులను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడం మనకి చెంపపెట్టు వంటిదేనని చెప్పవచ్చును.
మొన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో స్విట్జర్లాండ్ మహిళా పర్యాటకురాలిపై జరిగిన సామూహిక అత్యాచారంతో ఉలిక్కి పడిన బ్రిటన్ ప్రభుత్వం, భారత్ లో పర్యటించే తన మహిళా పర్యాటకులను బీచుల వద్ద, మారుమూల ప్రాంతాలలో ఒంటరిగా తిరుగవద్దని హెచ్చరికలు జారీ చేసింది. తగిన రక్షణ లేకుండా ఒంటరిగా తిరుగవద్దని, తమ భద్రతా విషయంలో మరింత జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది. ఇది, బ్రిటన్ దేశం తన పర్యాటకులకు చేస్తున్న ఒక హెచ్చరికగా పైకి కనిపిస్తున్నపటికీ, మన దేశంలో మహిళలపై నానాటికి పెరిగిపోతున్న అత్యాచారాలను అంతర్జాతీయ సమాజం కూడా నిశితంగా గమనిస్తోందని సూచిస్తోంది. ఈ హెచ్చరిక మన దేశానికి చెంప దెబ్బ వంటిదని గుర్తించవలసి ఉంది.
డిల్లీ సంఘట జరిగిన తరువాత దానిని నుండి మనం కొత్తగా నేర్చుకొన్న గుణపాఠం ఏమి లేకపోగా శృంగారానికి 16 ఏళ్ల వయసు ఆమోదకరమా లేక 18 ఏళ్ల వయసే అమోదకరమా? అంటూ మన కేంద్ర ప్రభుత్వం చర్చలలో మునిగిపోయుంటే, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్లిప్త వైఖరి అవలంబిస్తున్నాయి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా యుద్ధ ప్రాతిపదికన తగిన చర్యలు, ప్రణాళికలు తీసుకోవలసిన ప్రభుత్వాలు, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు తాము చాల బాద్యతాయుతంగానే ఉన్నామని చెప్పుకోవడానికి ప్రజల ముందు ఏదో హడావుడి చేయడం, గంభీరమయిన ప్రకటనలు చేయడం తప్ప ఇటువంటి వాటిని శాశ్వితంగా నిరోధించడానికి చేపట్టవలసిన ప్రణాళికలు కానీ ఆలోచనలు కానీ చేయడం లేదు.
ప్రభుత్వాలకి, రాజకీయ పార్టీలకి మద్య ఉన్న సన్నటి గీత ఎప్పుడో చెరిగిపోయి నందున, ఇప్పుడు ప్రభుత్వాలు అంటే వాటిని నడిపిస్తున్న సదరు రాజకీయ పార్టీలు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మానవీయ కోణంలో చూడకపోగా, తమ ప్రత్యర్ది పార్టీలు ఈ అంశాన్ని తీసుకొని తమను ఏవిధంగా ఇరుకున పెడతాయి, దానిని తాము సమర్ధంగా ఏవిధంగా ఎదుర్కోవాలి అనే ఆలోచిస్తు, ఇటువంటి సామాజిక రుగ్మతలను కూడా రాజకీయం చేస్తూ అత్యంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వాలే ఈవిధంగా ఉన్నపుడు వాటి కనుసన్నలలో నడిచే సదరు పోలీసు శాఖలు అంతకంటే గొప్పగా ఎలా ఆలోచించగలవు? నానాటికి పెరిగిపోతున్న అత్యాచారాలను కేవలం ‘కేసులుగా’నే పరిగణిస్తున్నారు పోలీసులు.
యధా రాజ తధా ప్రజా అన్నట్లు డిల్లీ ఉదంతంపై తీవ్రంగా స్పందించిన ప్రజలు నేడు ఇటువంటి సంఘటనలు దేశంలో ఎన్ని జరుగుతున్నపటికీ స్పందించడం లేదు.
డిల్లీ సంఘటన తరువాత మన దేశంలో మాహిళలపై పెరుగుతున్న సామూహిక అత్యాచారాలను మన ప్రభుత్వాలు పట్టించుకోనందునే నేడు విదేశీ ప్రభుత్వాలు కూడా నేడు మనకి సుద్దులు చెప్పగలుగుతున్నాయి. ఇప్పటికయినా, మన ప్రజల, ప్రభుత్వాల, వ్యవస్థల ఆలోచనలో మార్పు వస్తుందో లేదో చూడాలి.