కాంగ్రెస్ ఘన చరిత్రలో సీబీఐ అధ్యాయం

  125 సం.ల చరిత్ర కలిగిన పార్టీ మాదని కాంగ్రెస్ నేతలు అందరూ గర్వపడటం మనం నిత్యం చూసేదే. అయితే, అంత ముసలిదయిపోయింది గనుకనే అంత ముసలి ఆలోచనలు చేస్తోందని విమర్శించేవారు లేకపోలేదు.   తనకు మద్దతు ఇచ్చినంత కాలం సదరు పార్టీలను ఖాతరు చేయక ఒంటెత్తు పోకడలు పోవడం, వారు మద్దతు ఉపసంహరిస్తే వారిని సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్, ఆదాయపన్ను శాఖా వంటి సంస్థల చేత కేసులు పెట్టించి ముప్పతిప్పలు పెట్టడం వంటి దుర్లక్షణాలు అన్నీకలిగి ఉన్నకాంగ్రెస్ పార్టీ, తన ఘన చరిత్రలో ఇప్పుడు కొత్తగా సీబీఐ అనే ఒక అద్యాయాన్ని కూడా జోడించుకొంది. తవ్విన కొద్ది గుట్టలు గుట్టలు బయటపడే అటువంటి అంశాలన్నిటినీ పేర్కొనాలంటే ప్రత్యేకంగా మరో చరిత్ర అవుతుంది.   మన రాష్ట్రానికి సంబంధించి జగన్ మోహన్ రెడ్డితో సీబీఐ ఆడుకొంటున్నతీరు అందుకు ఒక మంచి నిదర్శనం కాగా, రెండు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీకి తలాక్ చెప్పి బయటకొచ్చిన ఓవైసీ సోదరులకు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి గుణ పాఠం చెప్పిందో అందరికీ తెలుసు.   మాజీ బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కారి తన పదవిలో మళ్ళీ పునర్నియామకం అవుతున్న నిమిషంలో ఆదాయపు పన్నుశాఖ వారిని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ వేసిన పాచికకు ఆయన ఓడిపోయాడు. కానీ ఆ తరువాత ఆదాయపన్ను శాఖ కూడా మరి ఆయనను పట్టించుకొన్న దాఖలాలు లేవు. ఎందుకంటే, దాని లక్ష్యం కాంగ్రెస్ అధిష్టానాన్ని విమర్శిస్తున్న నితిన్ గడ్కారి (కూడా) ఒక అవినీతి పరుడని నిరూపించడం మాత్రమే. కానీ, తొందరపడి కూసిన కోయిలలా కాంగ్రెస్ ముందే విసిరిన ఆ పాచిక వలన బీజేపీకి నష్టం జరుగకపోగా మేలే జరిగింది. ఒక అవినీతి పరుడయిన వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా చేసుకొని ఎన్నికల సమరాంగణంలో దూకడం ఆ పార్టీకే నష్టం కలిగించేది. కానీ, కాంగ్రెస్ చేసిన మేలు వలన అది ఆయన స్థానంలో మచ్చలేని రాజ్ నాథ్ సింగును ఎన్నుకోగలిగింది.   ఒకవైపు ములాయం సింగు( సమాజ్ వాది) మరో వైపు మాయావతి (బహుజన్ సమాజ్ వాది) ఇద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీ తమని సీబీఐ చేత బెదిరిస్తూ మద్దతు పొందుతోందనే రహస్యం మీడియావారి చెవుల్లో చాలా కాలంగానే వేస్తున్నారు, కానీ ఈ రోజుల్లో చేయి మెలిక పెట్టకుండా అటువంటి వారిని లొంగదీయలేమని కాంగ్రెస్ నిశ్చితాభిప్రాయం.   ఇక ములాయం సింగు తమ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు డబ్బు తీసుకొంటున్నాడని, గౌరవనీయులయిన కేంద్ర మంత్రి వర్యులు బీణా వర్మగారు ఒక చక్కటి బహిరంగ రహస్యం పార్లమెంటులో చెప్పినపుడు ఎవరూ ఆశ్చర్యపోలేదు కానీ, అటువంటి దేవరహస్యాలు ఇలాగ బహిరంగంగా ఎవరయినా చెప్పుకొంటారా అని ఊగిపోయారు.   ఇక తమిళ తంబి కరుణలేని కరుణానిధి యుపీయే ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించి ఇంటికి చేరుకొనే లోగానే సీబీఐ వారు ఆయనకీ గుమ్మంలోనే ఎదురయ్యారు. ఆయన కొడుకు స్టాలిన్ విదేశాల నుండి తెచ్చుకొన్న విలసవంతమయిన కార్లకి పన్ను కట్టలేదంటూ ఈ రోజు ఆయన ఇంటిలో సోదాలు నిర్వహించారు. కానీ, చెన్నై చిదంబరం కన్నెర్ర చేయడంతో సీబీఐ వారు తోక ముడుచుకొని వెళ్ళిపోయారు. సీబీఐ వారు చెపుతున్న కుంటిసాకుల సంగతి ఎలా ఉన్నా, వారు సోదాలు నిర్వహించిన సమయం, సందర్భం చూస్తే, వారి వెనుక కాంగ్రెస్ ఉందని అర్ధం అవుతుంది. కాంగ్రెస్ చరిత్రలో ఇటువంటి అధ్యాయాలు మరిన్ని మనం చూడాలో తెలియదు.

సడక్ బంద్ లో పాల్గొన్న ఎమ్మెల్యేల అరెస్ట్

  టి.ఆర్.ఎస్. టి.జెఎసి ఇతర పార్టీలు కర్నూల్-హైదరాబాద్ నేషనల్ హైవే సడక్ బంద్ కు పిలిపునిచ్చారు. ఆలంపూర్ లో తెలంగాణావాదులు లారీల అద్దాలను ధ్వంసం చేశారు. వాహనాలను అడ్డుకుంటున్న ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో రెచ్చిపోయిన తెలంగాణా వాదులు పోలీసు వాహనాలపై రాళ్ళ వర్షం కురిపించారు. షాద్ నగర్ వద్ద కల్వకుంట్ల తారక రామారావును, కొత్తకోటలో భిక్షపతి యాదవ్, సమ్మయ్య, రాజయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతియుతంగా తాము నిరసన తెలియజేస్తుంటే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఇలా తమను దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం దారుణమని, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఈ చర్యకు తగిన మూల్యం చెల్లించుకుంటుందని, తెలంగాణా ఇస్తామని చెప్పి మాట మార్చిన వారిపై కేసులు నమోదు చేయాలని, తెలంగాణా ఉద్యమాన్ని ఎంత అణచాలనుకున్నా ఉద్యమం మరింత ఉధృతమౌతుందని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.

సిబీఐ సోదాలకు బ్రేక్

  డీఎంకే యూపీఏ ప్రభుత్వానికి మద్ధతు ఉపసంహరించుకున్న మరుసటి రోజే ఎం.కె. స్టాలిన్ నివాసం, ఆయన వ్యక్తిగత కార్యదర్శి నివాసాల్లో సీబీఐ జరుపుతున్న సోదాలు నిలిపివేశారు. విదేశీ కార్ల దిగుమతి సుంకం చెల్లింపు విషయంలో రెవెన్యూ ఇంటలిజెన్స్ డైరెక్టర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సిబీఐ గురువారం స్టాలిన్ నివాసంపై దాడులు చేసి సోదాలు నిర్వహించింది. డిఎంకే యూపీఏ నుండి వైదొలగడంతో పాటు ఐదుగురు మంత్రులు రాజీనామా కూడా చేశారు. యూపీఏ ప్రభుత్వానికి బయటనుండి కూడా మద్ధతు ఇవ్వబోమని కరుణానిధి స్పష్టం చేయడంతో కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు చేపట్టిందని తీవ్ర విమర్శలు రావడంతో కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసింది. కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం కూడా సిబీఐ దాడులకు నిరసన తెలపడంతో యూపీఏ ప్రభుత్వం సిబీఐణి తక్షణమే సోదాలు నిలిపివేయాలని సిబీఐని ఆదేశించడంతో సిబీఐ సోదాలు ఆపి వెనక్కి వెళ్ళిపోయారు.

కేవీపీ పాత్రపై సిబీఐ దర్యాప్తు

  జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఆప్తమిత్రుడు కేవీపీ రామచంద్రరావు పాత్రపై సిబీఐ కూపీ లాగుతోంది. వై.ఎస్. హయాంలో ప్రభుత్వ నిర్ణయాల్లో కేవీపీ హస్తం కూడా ఉండవచ్చని సిబీఐ అనుమానిస్తుంది. జగన్ అక్రమాస్తులు, ఎమ్మార్ కేసుల దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు మంత్రులు, ఐఏఎస్ ల గురించి రాష్ట్ర ప్రభుత్వం నుజ్ఞ్ది వివరాలు తీసుకున్న సిబీఐ కేవీపీ గురించి అధికారిక సమాచారం కోరడం ఇదే ప్రథమం. మొదటిసారి వై.ఎస్. ప్రభుత్వం ఏర్పడినప్పుడు వై.ఎస్. కేవీపీణి ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. సలహాదారుగా ఆయన ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకపాత్ర పోషించారు. వై.ఎస్. సమక్షంలో జరిగే కీలక సమావేశాల్లో ఆయన కూడా పాల్గొనేవారు. ఎమ్మార్ విల్లాల విక్రయాల వ్యవహారంపై కేవీపీని పిలిచి విచారించిన సిబీఐ తాజాగా జగన్ అక్రమాస్తుల కేసులోనూ దృష్టి సారించి కేవీపీకి సంబంధించిన పూర్తీ సమాచారాన్ని సిబీఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సిబీఐ అడిగిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించేందుకు సిద్ధపడుతోంది.

మే 5న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు

  బుధవారం ఢిల్లీలో జరిగిన విలేఖరుల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమీషనర్ వి.ఎస్. సంపత్  మాట్లాడుతూ కర్ణాటక శాసనసభకు మే 5న ఒకే దశలో ఎన్నికలు జరపాలని, కర్ణాటకలోని 224 శాసన స్థానాలకు జరిగే ఎన్నికలకు బుధవారం నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని ఎన్నికల్లో ధనం, కండబలాన్ని నిరోధించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని, వార్తా కథనాల రూపంలో వచ్చే పరోక్ష ప్రకటనల పైనా నిఘా ఉంటుందని, ఆస్తులు, అర్హతలు, నెర చరిత్రకు సంబంధించి ఒకే అఫిడవిట్ ను రూపొందించినట్లు, పోలీసు అధికారులను సొంత జిల్లాల్లో ఉండనీయబోమని, ఒకేచోట మూడేళ్ళుగా పనిచేస్తున్న పోలీసు అధికారులను కూడా బదిలీ చేస్తామని, తగినన్ని బలగాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 10న విడుదల చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 17, నామినేషన్ల పరిశీలన  ఏప్రిల్ 18న, నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 20 ఆఖరు తేదీ అని ప్రకటించారు. ఎన్నికలు మే 5న నిర్వహిస్తారు. ఏప్రిల్ 8న ఓట్ల లెక్కింపు జరుగుతుందని కూడా తెలిపారు.

ప్రపంచంలోనే తొలిసారి ... భారత్ కే సాధ్యం

  నీటిలోపల సూపర్ సానిక్ క్రూయిజ్ మిస్సైల్ ని ప్రయోగించడం ప్రపంచంలోనే తొలిసారి. భారత్ - రష్యా దేశాల సంయుక్తంగా అభివృద్ధి చేసిన 290కిలోమీటర్ల పరిధిని చేరుకునే  బ్రహ్మోస్ క్షిపిణిని విశాఖ తీరంలోని సబ్ మెరైన్ నుంచి బుధవారం విజయవంతంగా ప్రయోగించి పరిశీలించారు. బ్రహ్మోస్ క్షిపిణి అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ సిఈవో మాట్లాడుతూ వ్యూహం రచించిన యుద్ధ వాతావరణంలో భాగంగా బంగాళాఖాతం జలాల్లోని సబ్ మెరైన్ నుండి ఉదయం 9-30నిముషాలకు బ్రహ్మోస్ క్షిపిణి దూసుకెళ్ళింది. 'ఎస్' ఆకారంలో విన్యాసం చేస్తూ నీటికి ఒక మీటర్ ఎత్తులో ప్రయాణించి లక్షిత నౌకను ధ్వంసం చేసింది. వర్టికల్ లాంచ్ కాన్ఫిగరేషన్ లో సబ్ మెరైన్లలో అమర్చడానికి బ్రహ్మోస్ క్షిపిణి సిద్ధంగా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైంది, ఈ ప్రయోగంలో క్షిపిని పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు.

సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకం

  బుధవారం సిఎం కార్యాలయంలో తెలంగాణా మంత్రులు శ్రీధర్ బాబు, సునితా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, డి.కె.అరుణ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ ను సడక్ బంద్ కు అనుమతి ఇవ్వాల్సిందిగా వారు కోరగా ముఖ్యమంత్రి సమాధానమిస్తూ సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా సడక్ బంద్ కు అనుమతి ఇవ్వలేమని, ఇలాంటి కార్యక్రమాలకు గతంలో సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా వెళ్ళలేమని, ఈ విషయంలో అందరి సలహాలు తీసుకుంటామని, మీడియా ఇచ్చే సూచనలు కూడా స్వీకరిస్తామని రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. సడక్ బంద్ కు అనుమతి లేదని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అది విరుద్ధమని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇందుకోసం 8వేలమంది పోలీసులను రంగంలోకి దింపామని, మహబూబ్ నగర్ జిల్లాలో 2700 మందిని బైండోవర్ చేశామని, కర్నూలు సరిహద్దు నుండి శంషాబాద్ వరకూ పోలీసు సిబ్బందిని మోహరించామని, ఈ ప్రాంతమంతా 30 పోలీసు యాక్టు అమల్లో ఉన్నాడని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. హైవే పైకి ఎవరూ ఆందోళన చేయడానికి రావద్దని, అలా వస్తే వారిని అదుపులోకి తీసుకుంటామని హైదరాబాద్ రేంజ్ డిఐజీ నాగిరెడ్డి అంటున్నారు.

సడక్ బంద్ పై ఢీ అంటే ఢీ

  తెలంగాణా రాష్ట్ర సాధనకోసం టిజెఎసి, టి.ఆర్.ఎస్. కలిసి చేస్తున్న ఉద్యమాలలో భాగంగా నేడు ఉదయం ఏడు గంటలనుండి రాత్రి ఏడు గంటల వరకు హైదరాబాద్-కర్నూలు హైవేపై సడక్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. టి.ఆర్.ఎస్., టి.జెఎసి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెపుతుండగా అటు పోలీసు యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని భగ్నం చేయాలనే యోచనలో వుంది. హైదరాబాద్-కర్నూలు జాతీయ రహదారి మార్గంలో శంషాబాద్ నుంచి ఆలంపూర్ వరకు జెఎసిలోని రాజకీయ పార్టీలు టి.ఆర్.ఎస్., బిజెపి. న్యూడెమోక్రసీ, ఉద్యోగ-ప్రజాసంఘాల నేతలు ఇప్పటికే మొహరించారు. సడక్ బంద్ కోసం టి.ఆర్.ఎస్. ఐదు కేంద్రాలను గుర్తించింది. ఆ ఐదు కేంద్రాలు శంషాబాద్, జడ్చర్ల, భూత్పూర్, కొత్తపేట, ఆలంపూర్. ఆలంపూర్ వద్ద టి.ఆర్.ఎస్.ఎల్సీ. ఉపనేత ఈటెల రాజేందర్, జెఎసి చైర్మన్ కోదండరాం, పాలమాకుల వద్ద టి.ఆర్.ఎస్.ఎల్సీ. నేత టి.హరీష్ రావు, తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత ఇన్ చార్జులుగా ఉన్నారు.

తూర్పు గోదావరిలోకి బాబు ప్రవేశం

  తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో తన పాదయాత్ర ముగించుకొని ఈ రోజు కొవ్వూరు-రాజమండ్రి మధ్యగల రెయిల్-కం-రోడ్ బ్రిడ్జ్ మీదుగా తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించనున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జిల్లా నేతలు, కార్యకర్తలు బ్రిడ్జ్ వద్ద ఉదయం నుండే ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు ఈ రోజు రాత్రికి రాజమండ్రీలో బస చేసి రేపటి నుండి తిరిగి తన పాదయాత్రను కొనసాగిస్తారు. గత ఆరు నెలలుగా నిర్వివిరామంగా పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు నాయుడు వచ్చే నెల 19వ తేదీన తన పాదయత్ర కు ముగింపు పలికి, తన పుట్టిన రోజు నాడు అంటే వచ్చే నెల 20న విశాఖపట్నంలో పార్టీ నిర్వహించబోయే ఒక భారీ బహిరంగ సభలో పాల్గొన్న తరువాత ఆయన హైదరాబాదు తిరిగి వెళ్ళిపోతారు. కొద్ది రోజుల విశ్రాంతి తీసుకొన్న తరువాత మళ్ళీ మిగిలిన రెండు జిల్లాలు-విజయనగరం మరియు శ్రీకాకుళం లను బస్సులో పర్యటిస్తారు.

మోడీకి వీసా ఇచ్చే సమస్యే లేదు ... అమెరికా

  గుజరాత్ బిజెపి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి అమెరికా ప్రభుత్వం వీసా నిరాకరించింది. దీనిపై అమెరికా విదేశాంగ మంత్రి రాబర్ట్ బ్లేక్ వివరణ ఇస్తూ బ్రిటన్ ప్రభుత్వం మోడీకి వీసా విషయంలో వైఖరి మార్చుకున్నా అమెరికా మాత్రం అలాంటి ఆలోచనలో లేదని, పునరాలోచించే ప్రసక్తే లేదని, గోద్రా అల్లర్ల కేసులో ఆయన పాత్ర ఉన్నదన్న ఆరోపణలు ఒక కొలిక్కివస్తేనే ఆయనకు వీసా మంజూరు చేసే విషయంలో పునరాలోచిస్తామని, తమ దేశ పర్యటన కోసం వీసా దరఖాస్తు చేకుంటే ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుని వీసా మంజూరు చేయాలా వద్దా అన్న విషయం పరిశీలిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి రాబర్ట్ బ్లేక్ అన్నారు.

తెదేపా వైపు చూస్తున్న మజ్లిస్ ?

  వాపును చూసి బలుపనుకొన్న మజ్లిస్ పార్టీకి కిరణ్ సర్కార్ నుండి బయట పడిన తరువాత వాపుకి బలుపుకి ఉన్న తేడాను గ్రహించగలిగింది. అందువల్లే, జైలు నుండి బయటకి వచ్చిన తరువాత అక్బరుద్దీన్ మరెక్కడా కూడా అసందర్భ ప్రసంగం చేసే దైర్యం చేయలేదు, అదే విధంగా ఆ మధ్య మీడియాలో ఒక వెలుగు వెలిగిన అతని సోదరుడు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ కూడా మీడియాకు మొహం చాటేశాడు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పినపుడే, ‘జగన్ మంచోడనే సర్టిఫికేట్’ కూడా జారీచేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపాలనే తమ మనసులో ఆలోచనలను మజ్లిస్ స్పష్టం చేసినప్పటికీ, మళ్ళీ తన మనసు మార్చుకొనడంవలననేమో, మొన్న ఆ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలుకకుండా ఓటింగులో తెదేపా పద్ధతినే అనుసరించింది.   ఈ సంకేతాలు అర్ధం చేసుకొన్నతెదేపా కూడా మజ్లిస్ పార్టీతో జత కట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెడుతూ, మొట్ట మొదటి చర్యగా ఆ పార్టీ కోరుతున్నవిధంగా వచ్చేనెలలో జరగనున్న హైదరాబాద్‌ స్థానిక సంస్థ ఎన్నికల్లో మజ్లిస్‌కు మద్దతునివ్వాలని టీడీపీ నిర్ణయించుకొన్నట్లు సమాచారం.   ఒకవేళ, వీరిరువురి ఎన్నికల పొత్తులు ఖాయం అయినట్లయితే అది వారికి మేలు చేయడమే కాకుండా, తెరాస, కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు కొత్త సవాలు విసురుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా బలమయిన ముస్లిం ఓటు బ్యాంకు గల మజ్లిస్, బలమయిన పార్టీ క్యాడర్ గల తెదేపాలు ఏకమయితే, వారి విజయావకాశాలు గణనీయంగా పెరగవచ్చును.   అయితే, ఈ పరిణామాలను చూస్తూ తెరాస, కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు చేతులు ముడుచుకొని కూర్చోవు గనుక, ఆ మూడు కూడా ఎన్నికల లోపుగానే చేతులు కలిపినా ఆశ్చర్యంలేదు. తెలంగాణా అంశంపై ఏదో ఒక నిర్దిష్టమయిన ప్రకటన చేసి తెరాసను, జగన్ మోహన్ రెడ్డిని జైల్లోంచి విడుదల చేసి వైకాపాను తనలో కలిపేసుకోవడమో లేక వారితో ఎన్నికల పొత్తులు పెట్టుకొని తెదేపా+మజ్లిస్+లెఫ్ట్+లోకసత్తా కూటమిని ఎదుర్కోవడమో కాంగ్రెస్ పార్టీ చేయవచ్చును.   కానీ, రాష్ట్రంలో అధికారం కోరుకొంటున్న జగన్ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలు రెండూ కలిసిపనిచేయడం అసంభవం కావచ్చును. అదే జరిగితే, మళ్ళీ ఎన్నికలలో ముక్కోణపు పోటీ అనివార్యం కావచ్చును. తద్వారా వచ్చే ఎన్నికల తరువాత రాష్ట్రంలో ఏ పార్టీకి పూర్తీ మెజారిటీ లబించక రాష్ట్రం పరిస్థితి ఇంకా అద్వానంగా మారే అవకాశాలున్నాయి.

ఇటలీ జైళ్ళలో మగ్గుతున్న 109మంది భారత పౌరులు

  ఇటలీ దేశం జైళ్ళల్లో సుమారు 109మంది భారత పౌరులు ఉన్నారని తెలిసింది. ఫిబ్రవరి 2010న రాజ్యసభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రభుత్వం సమాధానమిస్తూ ఇటలీ ప్రభుత్వం భారత పౌరులు జైళ్ళలో ఉన్న భారతదేశ పౌరుల వివరాలను గోప్యంగా ఉంచిందని, భారతపౌరులను ఎందుకు అరెస్ట్ చేసి జైళ్ళల్లో ఉంచారన్న విషయాన్ని ఎన్ని సార్లు అడిగినా ఇటలీ ప్రభుత్వం నుండి సరైన సమాధానం రాలేదని తెలిపింది. అలాగే గతేడాది నవంబర్ లో ఈ విషయమై ఎక్స్ టర్నల్ మినిష్టర్ సల్మాన్ కుర్షీద్ మాట్లాడుతూ ఎంతమంది భారతదేశ పౌరులను ఇటలీ ప్రభుత్వం జైళ్ళలో పెట్టిందో అన్న సమాచారం తమ దగ్గర లేదని, ఇటలీ ప్రభుత్వం తమ విన్నపాలను పట్టించుకోవడం లేదని తెలిపారు. అంటే గత రెండు సంవత్సరాలుగా ఇటలీ ప్రభుత్వం భారతదేశ పౌరులను విడుల చేయలేదని తెలుస్తుంది. నేరగాళ్ళు ఏ దేశానికి చెందినవారైనా ఆ దేశానికి గర్వకారణం కాదు కానీ, ఇటలీదేశ జైళ్ళలో భారతదేశ పౌరులను ఎందుకు పెట్టారో అన్న సమాచారం కూడా భారతదేశానికి లేకపోవడం విచారకరం. జైళ్ళలో వున్నవారిలో 95 శాతం మంది పంజాబ్ నుండి వెళ్ళిన వ్యవసాయ కూలీలు కాగా వీరంతా దొంగతనంగా దేశంలో ప్రవేశించినవారు, దొంగతనాలు, హత్యలు చేసినవారు. సుఖదేవ్ సింగ్ కంగ్ అనే సిక్కు నాయకుడి అంచనా ప్రకారం సుమారు 600 నుండి 700మంది భారత పౌరులు జైళ్ళల్లో ఉన్నారని, ఖచ్చితమైన అంకె తెలపటం కష్టమని ఆయన అంటున్నారు.

చైనా ఐదు సూత్రాల పథకం 'పంచశీల'

  చైనా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జి జంగ్ పింక్ వచ్చే వారంలో జరగనున్న బ్రిక్స్ దేశాల కూటమి సదస్సులో భారత ప్రధాని  మన్మోహన్ సింగ్ తో భేటీ కానున్నారు.ఈ సందర్భంగా భారత తో సంబంధాలను మరింత మెరుగు పరచుకునేందుకు ఐదు సూత్రాల (పంచశీల)కొత్త కార్యక్రమాలను ప్రధానికి వివరించనున్నారు. సరిహద్దు వివాదం సంక్లిష్టమైనదని దీనికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం సాధించేవరకూ స్నేహపూరిత చర్చలు కొనసాగిస్తామని, ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకూ ఇరుదేశాలు తమ మధ్య సంబంధాలకు విఘాతం కలగకుండా సరిహద్దుల వద్ద శాంతిని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు.ఇరుదేశాలు బహుళపక్ష వేదిక ద్వారా పరస్పరం సహకరించుకుంటూ వర్తమాన దేశాల చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉందని జీ జింగ్ పింగ్ పేర్కొన్నారు.

పోలీసును చితక్కొట్టిన ఎమ్మెల్యేలు

  వసాయి నియోజకవర్గ ఎమ్మెల్యే క్షితిజ్ ఠాకూర్ వాహనాన్ని బాంద్రా-వొర్లి ప్రాంతంలో సోమవారం సూర్యవంశి అనే పోలీసు అధికారి ఆపాడు. మంగళవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయం అనంతరం ఎమ్మెల్యే సద్దారు పోలీసు అధికారిపైన ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. పోలీసు అధికారి తన కారును నిలిపివేసి తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించాడని, తనపై అభ్యంతరకరంగా ప్రవర్తించిన పోలీసు అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే ఠాకూర్ డిమాండ్ చేశారు. ఆ సమయంలో పోలీసు అధికారి విజిటర్స్ గ్యాలరీలో కూర్చుని వుండగా గమనించిన ఎమ్మెల్యే పోలీసు అధికారి సూర్యవంశి వద్దకు దూసుకువెళ్ళగా అతనికి మరికొందరు ఎమ్మెల్యేలు తోడయ్యి పోలీసు అధికారిపై దౌర్జన్యానికి దిగి, అతన్ని చితకబాదారు. అక్కడే వున్న విధానసభ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుపడి సూర్యవంశిని బయటకు తీసుకుని వెళ్ళారు.

తుదిశ్వాస విడిచిన ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ధర్మారావు

  గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న తెలుగు అకాడమీ మాజీ చైర్మన్, భాషోద్యమ నేత, కాలమిస్టు చలమాల ధర్మారావు (79) మంగళవారం తెల్లవారుఝామున 12.50నిముషాలకు హైదరాబాద్ లోని కామినేని ఆసుపత్రిలో గుడిస్వాష విడిచారు. 1934 మార్చి 30వ తేదీన కృష్ణాజిల్లా పెద్ద అవుటపల్లిలో సీతారత్నమ్మ, నాగభూషణం దంపతులకు జన్మించిన ఆయన ఉస్మానియాలో పిజి చేసి కర్నూలు సచివాలయంలో, తరువాత హైదరాబాద్ సచివాలయంలో పలుశాఖలలో విధులు నిర్వర్తించారు. గోరాశాస్త్రి శిష్యునిగా ప్రసిద్దుడైన చలమాల ధర్మారావు నాలుగేళ్ల పాటు అధికార భాషాసంఘం కార్యదర్శిగా, ప్రభుత్వ సంయుక్త కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. సి.ధర్మారావుగారు 'రవ్వలు-పువ్వులు;, 'ప్రేమిచుకుందాం రండి' వంటి గ్రంథాలను రచించారు. పలు ప్రముఖ దినపత్రికలకు కాలమ్స్ అందించారు. ధర్మారావు మృతిపట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియచేశారు. బుధవారం ఉండిం అంబర్ పేట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుమారులు శ్రీనివాస్, రామ్మోహన్ తెలిపారు.