పురందేశ్వరికి పొగ పెడుతున్న టి.సుబ్బిరామిరెడ్డి
posted on Mar 18, 2013 @ 9:48PM
ఇంకా సాధారణ ఎన్నికలకి ఒక సం. సమయం ఉండగానే, విశాఖలో రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామి రెడ్డికి, విశాఖ లోక్ సభ సభ్యురాలు మరియు కేంద్ర మంత్రి పురందేశ్వరికి మద్య విశాఖ లోక్ సభ స్థానం గురించి యుద్ధం మొదలయింది. తనకు గతంలోనే కేంద్రం మాట ఇచ్చింది గనుక వచ్చే ఎన్నికలలో విశాఖ నుండి తానేపోటీ చేయబోతున్నాని ప్రకటించుకోవడంతో బాటు, ఆమెను పక్కనున్న నర్సాపురం నుండో మరో నియోజక వర్గం నుండో పోటీ చేయమని ఒక ఉచిత సలహా కూడా ఇచ్చారు. పురందేశ్వరి కూడా తానూ విశాఖ నుండే పోటీ చేయాలనుకొంటున్నట్లు ప్రకటించడంతో ఇద్దరి మద్య యుద్ధం అనివార్యం అయింది.
ఈ నేపద్యంలో ఆయన అనుచరుడయిన భీమిలి శాసన సభ్యుడు మొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విశాఖకు వచ్చినప్పుడు పురందేశ్వరి వల్ల జిల్లాలో పార్టీకి చాల నష్టం జరుగుతోందని పిర్యాదు కూడా చేసారు. సుబ్బిరామి రెడ్డి వెనుకుండి ఈ కధ అంతా నడిపించారని మీడియాలో ఊహాగానాలున్నాయి.
ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం. ఆయన సోదరుడు బొత్స లక్ష్మణరావు వచ్చే ఎన్నికలలో భీమిలి నుండి శాసన సభకు పోటీ చేయాలనీ కోరుకొంటున్నందున త్వరలో ఆయన భీమిలి సమీపంలో గల ఆనందపురం అనే ప్రాంతానికి తరలి వచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
భీమిలికి ప్రస్తుతం ప్రాతినిద్యం వహిస్తున్న అవంతి శ్రీనివాస్ ను అక్కడి నుండి తప్పించే ప్రయత్నంలో బొత్సకు బావగారయిన శంకర్ రావు తన మద్దతు దారులుతో కలిసి మొన్న ఆనందపురంలో ఒక సభ ఏర్పాటు చేసి భీమిలి శాసన సభ్యుడు అవంతి శ్రీనివాస్ చేస్తున్న బ్లాక్ మెయిలింగు రాజకీయాల వలన పార్టీకి స్థానికంగా చాలా నష్టం కలుగుతోందని, ఆయనను వెంటనే తప్పించడం చాల అవసరం అని అన్నారు. అంతే కాకుండా భీమిలి మాజీ శాసన సభ్యుడు కర్రి సీతారంను వేదిక మీదకు తీసుకువచ్చి, వచ్చే ఎన్నికలలో ఆయనకు పురందేశ్వరి మద్దతు తెలుపాలని కూడా అయన కోరారు. ప్రస్తుతం కర్రి సీతారాంను తమ డమ్మీ అభ్యర్ధిగా అడ్డం పెట్టుకొని అవంతి శ్రీనివాస్ తో బొత్స సోదరులు యుద్ధం మొదలు పెట్టినప్పటికీ, పార్టీ టికెట్లు ఇచ్చే సమయానికి ఆయనను పక్కకు తప్పించి బొత్స సత్యనారాయణ తన సోదరుడికే టికెట్ ఇప్పించుకొంటారనేది అందరూ ఊహిస్తున్నదే.
అందువల్ల, ఆయన వర్గం ప్రస్తుతం సుబ్బిరామి రెడ్డి వర్గానికి చెందిన అవంతి శ్రీనివాస్ ను డ్డీ కొనే ప్రయత్నంలో పురందేశ్వరికి చేరువకావడానికి చేసిన ప్రయత్నాలలో భాగంగానే, ఆమెను ఇటీవల భీమిలి పరిధిలోకి వచ్చే ఆనందపురం సభకు ఆహ్వానించినపటికీ, అవంతి శ్రీనివాస్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆమె వారి ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు.
అయితే, ఆమె విశాఖ నుండి మళ్ళీ పార్లమెంటుకు పోటీ చేయాలనుకొంటే పీసీసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అండదండలు కోరుకోవడంలో అసహజమేమి లేదు. అందుకు ప్రతిగా, ఆయన సోదరుడికి ఆమె తన మద్దతు తెలుపడం కూడా తప్పక పోవచ్చును. అప్పుడు కేంద్రంలో మంచి పలుకుబడి కల సుబ్బిరామి రెడ్డి కూడా తనకు, తన అనుచరుడయిన అవంతి శ్రీనివాస్ కు అనుకూలంగా పావులు కదపవచ్చును.