ఉన్నవాటికి విద్యుత్ ఇవ్వలేరు కానీ...
posted on Mar 18, 2013 @ 3:32PM
తాను దూరకంత లేదు తన మెడకో డోలన్నట్లు, విద్యుత్ సంక్షోభం వల్ల ఇప్పటికే రాష్ట్రంలోఅనేక పరిశ్రమలు మూతబడుతుంటే, మళ్ళీ నిన్న కొత్తగా రెండు పరిశ్రమలు రాష్ట్రంలో స్థాపించబోతున్నందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చాల సంతోషం వ్యక్తం చేసారు. ఆయన స్వస్థలమయిన చిత్తూరు జిల్లాలో ఒకటి, భారీ పరిశ్రమల శాఖా మంత్రి గీతారెడ్డి స్వంత జిల్లా మెదక్ లో జహీరాబాద్ వద్ద మరొక పరిశ్రమ స్థాపనకు రంగం సిద్ధం అయింది. రెండు పరిశ్రమలు కూడా వాహన తయారీ రంగానికి చెందినవే కావడం మరో విశేషం.
చిత్తూరు జిల్లాలో పీలేరువద్ద ‘ఇసుజి’ తన వాహన తయారీ సంస్థను స్థాపించడానికి ముందుకు రాగా, దేశీయ వాహన తయారీ సంస్థ ‘మహీంద్రా’ తన ట్రాక్టర్ల తయారీ సంస్థను జహీరాబాదు వద్ద స్థాపించేందుకు సిద్ధం అవుతోంది. గత రెండు సం.లలో కొత్తగా వస్తున్న పెద్ద పరిశ్రమలు ఈ రెండు మాత్రమే. అయితే, ఉన్నవాటికి విద్యుత్ సరఫరా చేయలేక చేతులెత్తేసిన మన రాష్ట్ర ప్రభుత్వం, పూర్తిగా విద్యుత్ మీదనే ఆధారపడి పనిచేసే ఈ రెండు భారీ పరిశ్రమలకు ఏవిధంగా విద్యుత్ సరఫరా చేస్తారో వివరించలేదు.
వాహన తయారీ సంస్థలు తమ వాహన విడిభాగాల ఉత్పత్తికి ప్రధానంగా వాటికి అనుబంధంగా ఏర్పడే చిన్న పరిశ్రమలు, వర్క్ షాపులపైన ఆధారపడి ఉంటాయి. అవికూడా పూర్తిగా విద్యుత్ మీద ఆధారపడి పనిచేసేవేనని ప్రత్యేకంగా చెప్పకరలేదు. గత నాలుగు సంలలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చిన్న పెద్దా పరిశ్రమలు పవర్ హాలీడేస్ మరియు సరయిన విద్యుత్ సరఫరా లేని కారణంగా దివాలా స్థితికి చేరుకొంటున్నాయి. ఇక చిన్నచిన్న వర్క్ షాపులు అనుబంధ పరిశ్రమల సంగతి అంతకంటే దారుణంగా ఉంది. విద్యుత్ కోతలతో తీవ్ర నష్టలపలవుతున్న చిన్న పరిశ్రమలు, విద్యుత సరఫరా సరిగ్గా ఉన్నా లేకపోయినా కూడా భారీగా వస్తున్నా విద్యుత్ బిల్లులతో కుదేలవుతున్నారు.
పెద్ద పరిశ్రమలపై ఆధారపడిపనిచేసే ఆ చిన్న సంస్థలు, విద్యుత్ సమస్య వల్ల ఆర్డర్లు తీసుకోవడానికి వెనుకంజ వేస్తుంటే, మరో వైపు సకాలంలో ఆర్డర్లు పూర్తి చేయని కారణంగా వాటిని పెద్ద పరిశ్రమలు బ్లాక్ లిస్టులో పెట్టక తప్పట్లేదు. ఇక, కొత్తగా పరిశ్రమలు స్థాపించాలనుకోనేవారు, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలకు తరలిపోతుంటే, ఉన్న పరిశ్రమలు మెల్ల మెల్లగా తమ ఉత్పత్తి కార్యక్రమాలు తగ్గించుకొంటూ అంతిమంగా మూసేసే ప్రయత్నంలో ఉన్నాయి. ఇక, ఇటువంటి సమయంలో మరి ఈ రెండు భారీ పరిశ్రమలు ఏ భరోసాతో మన రాష్ట్రంలో అడుగుపెట్టాయో వాటికి విద్యుత్ ఏవిధంగా అందిస్తారో ఎవరికీ తెలియదు.