పార్టీ ఎందుకు మారాంరా దేవుడా.. నిన్న బొత్స.. నేడు డీఎస్
posted on Dec 1, 2015 @ 10:56AM
కాంగ్రస్ ను వీడి వేరే పార్టీలోకి మారిన నేతలకు ఇప్పుడిప్పుడే నిజాలు తెలుస్తున్నట్టుంది. రాష్ట్రం విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీకి రెండు రాష్ట్రాల్లో సరైన ఉనికి లేకపోవడంతో.. ఆపార్టీలో ఉంటే సరైన రాజకీయ భవిష్యత్తు ఉండదని ఆలోచించుకొని చాలామంది సీనియర్ నేతలు కాంగ్రెస్ ను వీడి పలు పార్టీల కండువాలు కప్పుకున్నారు. కానీ ఆపార్టీలోకి చేరినప్పుడు బానే ఉన్న ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అసలు ఎందుకు పార్టీ మారామా అని ఆలోచించుకునే సంగ్ధిగ్దంలో పడినట్టు తెలుస్తోంది. మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన బొత్స సత్యనారాయణ కూడా అనవసరంగా వైకాపాలో చేరి ఇరుక్కుపోయానే అని తన సన్నిహితుల దగ్గర అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. పార్టీలో చేరిన కొత్తలో అంతా తానై హడావుడి చేసిన బొత్సకు ఆ తరువాత నిదానంగా జగన్ వ్యూహాలు అర్ధమయినట్టున్నాయి. కోస్తాలో తన పెత్తనం చూపించాలని అనుకున్న బొత్సకు జగన్ అంత ఛాన్స్ ఇవ్వడం లేదట. తన తరువాత ఏ ఒక్క లీడర్నీ ఆ.. స్థాయిలోకి రానివ్వడంలేదట దీంతో ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది అన్న పంథాలో.. బొత్స ఏదో అనుకుంటే ఆఖరికి ఇలా జరిగింది. దీంతో అనవసరంగా పార్టీ మారానే అని బాధపడిపోతున్నారట.
ఇప్పుడు మరో కాంగ్రెస్ సీనియర్ నేత కూడా సేమ్ ఇలానే ఫీలవుతున్నారట. అది ఎవరో కాదు.. ఉమ్మడి రాష్ట్రానికి రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్. ఈయన కూడా పార్టీ మారి టీఆర్ఎస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ కూడా సీనియర్ నేత అయిన డీఎస్ ను చాలా సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి ఓ కేబినెట్ ర్యాంకుతో కూడిన పదవిని కూడా ఇచ్చారు. దీంతో డీఎస్ కూడా చాలా కుష్ అయ్యారు. కానీ కేసీఆర్ అసలు అంతరార్ధం మాత్రం వేరని డీఎస్ కు చాలా లేట్ గా అర్ధమయి ఇప్పుడు ఫీల్ అవుతున్నారట. తన కూతురు కవితకు నిజామాబాద్ లో సరైన ప్రతిపక్షం లేకుండా చేసేందుకే కేసీఆర్… తనను టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారని… ఆ విషయం అర్ధంకాక తాను అనవసరంగా టీఆర్ఎస్ లోకి వచ్చానని సన్నిహితుల దగ్గర వాపోతున్నారట డీఎస్. అంతేకాదు తను ఎప్పటినుండో కలగంటున్న రాజ్యసభ సీటు గురించి కూడా డీఎస్ టెన్షన్ పడుతున్నారట. ఎందుకంటే తనకు కనుక ఎమ్మెల్సీ గా పోటీ చేసే అవకాశం ఇస్తే తన రాజ్యసభ సీటు ఆశలు ఆవిరైనట్టే అని మదనపడుతున్నారట.
మొత్తానికి నేతలకు తమ పార్టీనుండి వేరే పార్టీలోకి వస్తే పరిస్థితి ఎంటని ఇప్పుడిప్పుడే అర్ధమవుతున్నట్టుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి మరో ఇద్దురు రాజకీయ ఉద్దండులు ఆనం బ్రదర్స్ టీడీపీలోకి చేరుతున్నారు. మరి వారికైనా గౌరవప్రధమైన పదవులు దక్కుతాయా.. లేదా? వారు కూడా ఎందుకు పార్టీ మారాంరా దేవుడా అనే పరిస్థితి వస్తుందా?.. ఇవన్నీ తెలియాలంటే కొంత సమయం ఆగాల్సిందే.