దానం పార్టీ మారనిది అందుకేనా..?
posted on Dec 5, 2015 @ 10:02AM
తెలంగాణ కాంగ్రెస్ నేత దానం నాగేందర్ పార్టీ మార్పుపై అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. దానం కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ చేరుతాడని వార్తలు జోరుగానే సాగాయి. కానీ తాను మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని దానం నిన్న తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు అందరి సందేహం ఒక్కటే.. నిన్న తను ప్రకటన చేయడానికి ముందు అంటే గురువారం రాత్రి దానం కొంత మంది టీఆర్ఎస్ నేతలతో మంతనాలు జరిపారు. అది ఎవరో కాదు, మంత్రి హరీశ్ రావు, కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయిన సీనియర్ నేత డీఎస్, జగదీశ్వర్ రెడ్డి.. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డిలు. ఈ సమావేశంతో దానం టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అవడం ఖాయమని అనుకున్నారు. ఇక నిన్న ఉదయం దానం తన ముఖ్య అనుచరులతో కూడా సమావేశమయ్యేసరికి ఇక టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడానికి ముహూర్తం ఖరారు చేయడమే అని అభిప్రాయపడ్డారు అందరూ. కానీ సమావేశం అనంతరం దానం ట్విస్ట్ ఇస్తూ తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని అన్నారు. ఇక్కడి వరకూ బానే ఉన్నా అసలు టీఆర్ఎస్ నేతలు, దానం ఏం మాట్లాడుకున్నారు.. అని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు టీఆర్ఎస్ నేతలతో భేటీ అయిన దానం కొన్ని షరతులు పెట్టగా వాటికి టీఆర్ఎస్ సానుకూలంగా స్పందించకపోవడంతో పార్టీ మార్పుకు అవాంతరం ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. అందుకే మళ్లీ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు అంటూ వ్యాఖ్యానిస్తున్నారని అంటున్నారు. ఇదిలా ఉండగా టీఆర్ఎస్ మాత్రం దానం విషయంలో సీరియస్ గా ఉన్నారని.. దానం మాత్రం పార్టీ మారడం ఖాయమని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కొంత సమయం ఆగాల్సిందే.