ఫార్ములా ఈ రేస్ కేసు.. కేటీఆర్ క్విడ్ ప్రోకో!.. అరెస్టేనా?
posted on Nov 21, 2025 @ 9:50AM
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావును ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు గవర్నర్ అనుమతించడం రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో కేటీఆర్ అరెస్టు ఖాయమన్న ప్రచారం కూడా జోరందుకుంది. ఈ నేపథ్యంలోకే ఫార్ములా ఈ కార్ కేసును లొట్టపీసు కేసుగా గతంలో కేటీఆర్ అభివర్ణించడంతో.. అసలీ కేసేంటి? ఇందులో కేటీఆర్ పై ఉన్న అభియోగాలేంటి.. పది వారాల పాటు నాన్చి నాన్చి గవర్నర్ ఇప్పుడే కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వడమేంటి? జూబ్లీ బైపోల్ ఫలితానికీ.. గవర్నర్ అనుమతి ఇవ్వడానికి సంబంధం ఏంటి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.
బీఆర్ ఎస్ హయాంలో గత అసెంబ్లీ ఎన్నికల ముందు 2023లో హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేస్ నిర్వహించారు. ఇది సాఫీగానే సాగిపోయింది. అయితే ఆ తర్వాత దీనిపై తీవ్ర వివాదాలు ముసురుకున్నాయి. ఈ రేస్‌ను కండక్ట్ చేసిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్‌కు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ఖాతా నుంచి 54.88 కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయి. అయితే ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు ఈ సొమ్ము బదిలీ చేసేందుకు హెచ్ ఎండీఏ ఎటువంటి తీర్మానం చేయలేదు. కనీసం ఆర్థిక శాఖ అనుమతి కూడా పొందలేదు. దీంతో కేవలం అప్పటి మంత్రి కేటీఆర్ నోటి మాటే వేదంగా, శాశనంగా భావించి హెచ్ఎండీఏ దాదాపు 54.88 కోట్ల రూపాయలను ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు బదిలీ చేసింది. అయితే ఆ వెంటనే 45 కోట్ల రూపాయలను కేటీఆర్ ఖాతాకు ఫార్ములా ఈ కార్ ఈవెంట్ స్పాన్సర్ సంస్థ ఏస్ నెక్ట్స్ జెన్ సంస్థకు బదిలీ చేసింది. దీనిపైనే కేసు నమోదైంది. సుమారు 55 కోట్ల రూపాయలను ఇచ్చి దానిలో 45 కోట్ల రూపాయలను ఎన్నికల బాండ్ల పేరుతో కేటీఆర్ ఖాతాకు బదిలీ చేశారన్నది ఏసీబీ ఆరోపణ.
సో ఈ ఫార్ములా రేస్ వెనుక భారీ అవినీతి జరిగిందని ఏసీబీ చెబుతోంది. దీంతో మాజీ మంత్రి చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. అసలు ఏం జరిగిందన్న విషయంపై ఆరా తీయాలంటే మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్‌ను విచారించాలని కోరుతూ ఏసీబీ గవర్నర్ అనుమతి కోరారు. అనుమతి ఇవ్వడంలో జాప్యం చేసినా గవర్నర్ చివరకు అనుమతి ఇచ్చారు. దీంతో కేటీఆర్ చిక్కుల్లో పడ్డట్టేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేటీఆర్ క్విడ్ ప్రోకో ప్రస్ఫుటంగా బయటపడిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా ఇప్పటి వరకూ కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వకుండా మౌనంగా ఉన్న గవర్నర్ ఇప్పుడు అంటే జూబ్లీ ఉప ఎన్నిక తరువాత ఓకే చెప్పడం వెనుక బీజేపీ ఉందంటున్నారు.
బీఆర్ఎస్ రాష్ట్రంలో బీజేపీకి బీ టీమ్ గా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఇక ఇటీవలి కాలంలో తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత అయితే ఏకంగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందంటూ బాంబ్ పేల్చారు. ఈ నేపథ్యంలోనే జూబ్లీ ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కోల్పోవడానికి బీఆర్ఎస్ తో రహస్య ఒప్పదం అన్న ఆరోపణలను ప్రజలు విశ్వసించడమే కారణమని కమలనాథులు భావిస్తున్నారు. దాంతో అటువంటిదేమీ లేదని చాటుకోవడానికే ఇప్పుడు ఫార్ములా ఈ కార్ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి లభించిందని అంటున్నారు.