టిడిపి పవర్ దీక్ష

        పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తగ్గించాలని, అప్రకటిత విద్యుత్‌ కోతలను ఎత్తివేయాలని, వ్యవసాయానికి ఏడుగంటల విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రత్యేక నిరసనదీక్షలు చేపట్టింది. మంగళవారం రాత్రి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ల లో 30 మంది టీడీపీ ఎమ్మెల్యేలు నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. అసేంబ్లీ నుండి పాదయాత్రగా వేదిక వద్దకు చేరుకుని దీక్షలో కూర్చున్నారు. దీక్షలో రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్‌ రాథోడ్‌, టిడిపి శాసనసభాపక్షం విప్‌ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌, సీనియర్‌ శాసనసభ్యులు కెఇ.కృష్ణమూర్తి, అశోక్‌ గజపతిరాజు, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌, జి.జయపాల్‌ యాదవ్‌, పి.మహేందర్‌రెడ్డి, కె.ఎస్‌.రత్నం, కె.దయాకర్‌రెడ్డి, డి.అనసూర్య, ఎస్‌.వెంకటవీరయ్య, డి.ఉమామహేశ్వరరావు, శ్రీరామ్‌ రాజగోపాల్‌, కె.నారాయణరెడ్డి, పి.రఘునాథరెడ్డి, సీతక్క, సత్యవతి రాథోడ్‌, రత్నం, తుమ్మల నాగేశ్వరరావు, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, ఎల్వీ రమణ, పి.కేశవ్‌, దేవినేని ఉమామహేశ్వరరావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, శ్రీరాం తాతయ్య, పి.పుల్లారావు, జె.ఆంజనేయులు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, అన్నపూర్ణమ్మ, ఉమామాధవరెడ్డి, బి.చందర్‌రావు, కె.లలితా కుమారి, ఎం.లింగారెడ్డి, హనుమంత్‌షిండే, అబ్దుల్‌ గని, నక్క ఆనంద్‌, శివరామరాజు, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, కె.శ్రీధర్‌ తదితరులు దీక్షలో కూర్చున్నారు.

మొబైల్ ఫోన్లలో వస్తున్నా మీకోసం

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఎల్లపుడూ ముందుడే తెలుగుదేశం పార్టీ కొంత కాలం క్రితం చంద్రబాబు పాదయాత్రను యూ-ట్యూబ్, గూగుల్ హాంగ్ అవుట్ వంటి వెబ్ సైట్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసి అందరి ప్రశంశలు అందుకొంది. మళ్ళీ ఇప్పుడు పార్టీ పాటలను కాలర్ ట్యూన్స్ మరియు డైయలర్ టోన్స్ గా అందజేస్తోంది. పార్టీ కార్యకర్తల, నేతల కోరిక మేరకు పార్టీ పాటలలో బాగా ఆకటుక్కొన్న 6 పాటలను, చంద్రబాబు పాదయత్ర కోసం ప్రసిద్ధ సినిమా గీత రచయితల చేత వ్రాయించిన 15 పాటలను కాలర్ ట్యూన్స్ మరియు డైయలర్ టోన్స్ గా అందజేసేందుకు రాష్ట్రంలో మొబైల్ సర్వీసులు అందజేస్తున్న ఫోన్ ఆపరేటర్లతో పార్టీ ఒప్పందం చేసుకొందని పారీ ఐటీ విభాగం అధిపతి శ్రీనివాసరావు మీడియాకు తెలియజేసారు. వీటిని పార్టీ అధికారిక వెబ్ సైటు నుండి కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు.

లెఫ్ట్ నేతల దీక్ష భగ్నం, ఉద్రిక్తత

        విద్యుత్ బిల్లుల పెరుగుదల, విద్యుత్ సరఫరా సమస్యలపై గత నాలుగు రోజులుగా ఇందిరా పార్క్‌వద్ద నిరసన దీక్ష నిర్వహిస్తున్న వామపక్ష నేతలను పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు. దీక్షలో ఉన్న లెఫ్ట్ నేతలు బివి రాఘవులు, నారాయణలను అరెస్టు చేసి ఆస్పత్రికి తరలిస్తుండగా కార్యకర్తలు అడ్డుకోవడంతో తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్తితి నెలకొంది. కాగా సీపీఐ నేత నారాయణ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. బీపీ తగ్గిపోవడంతో ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయనను పరీక్షించిన డాక్టర్లు తక్షణం నారాయణకు వైద్య సహాయం అందించాలని పోలీసులకు సూచించారు. దీంతో లెఫ్ట్ నేతలు నారాయణ, రాఘవులు సహా పలువురు కార్యకర్తలను బలవంగా అరెస్టు చేశారు. నేతలను గాంధీ ఆస్పత్రికి తరలించనున్నట్లు తెలియవచ్చింది.

కృష్ణా జిల్లాలో ఫ్లెక్సీ పాలిట్రిక్స్

      వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల పాదయాత్ర కృష్ణా జిల్లాకు చేరుకున్న సంధర్బంగా మచిలీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లో కోడాలినాని తో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పెట్టడం సర్వత్రా చర్చ మొదలైంది. కొడాలి నాని జూ.ఎన్టీఆర్ కి స్నేహితుడనే విషయం అందరికీ తెలిసిందే, కానీ ఆయన ఇటీవల తెదేపా వీడి వైకాపాలో చేరిన తరువాత కూడా వారిద్దరి మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయని వార్తలు వచ్చాయి. వాటిని ఎన్టీఆర్ ఖండించక పోవడంతో టిడిపి నివురుగప్పిన నిప్పులా ఉన్న విబేధాలు మరింత రాజుకొనేందుకు దోహదపడ్డాయి. ఇటీవల జూ.ఎన్టీఆర్ విజయవాడ వచ్చినప్పుడు టిడిపి పార్టీ కార్యకర్తలు కానీ, పార్టీ జెండాలు గానీ చుట్టుపక్కల ఎక్కడా కనబడక పోవడంతో బాలకృష్ణ ఆదేశాల మేరకే ఆవిధంగా జరిగిందని వర్ణిస్తూ మీడియా కూడా యదాశక్తిన నిప్పు రాజేసే ప్రయత్నం చేసింది. ఆ తరువాత బాలకృష్ణ ఆ వార్తలను ఖండించడం జరిగింది. కానీ, ఇప్పుడు కొడాలి నానితో ఎన్టీఆర్ ఉన్న బ్యానర్ ప్రత్యక్షం అవడం మళ్ళీ కలకలం రేపుతోంది. నాని అనుచరులే తమ అభిమానం చాటుకోవడానికి ఆ బ్యానర్ ఏర్పాటు చేసి ఉండవచ్చును. అలా కాని పక్షంలో టిడిపిలో ముసలం పుట్టించెందుకే కావాలని ఎవరో పనికట్టుకొని ఆ పని చేసి ఉండవచ్చును. ఈ విషయం ఇప్పటికే మీడియా దృష్టికి రావడంతో వార్తను హైలైట్ చేస్తూ విశ్లేషణలు మొదలు పెట్టేసి౦ది.

జగనన్న బోనులో ఉన్న పులి: షర్మిల

  ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర విజయవాడ ప్రకాశం బ్యారేజి మీదుగా కృష్ణ జిల్లాలోకి ప్రవేశించిన సందర్భంగా స్థానిక కాళోజి మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ పులి బోనులో ఉన్నప్పటికీ అది పులే అని తన సోదరుడిని బోనులో ఉన్న పులితో ఆమె పోల్చారు. ఆయన బయట ఉంటే తెదేపా, కాంగ్రెస్ పార్టీల ఆటలు సాగవు గనుక, ఆ రెండు పార్టీలు కుమ్మకయి జగన్ మోహన్ రెడ్డి ని అన్యాయంగా జైలులో ఇరికించాయని ఆమె అన్నారు. ఈ ప్రభుత్వానికి బొత్తిగా మానవత్వం అనేది కరువయిపోయిందని ఆమె విమర్శించారు.   పాదయాత్రలు చేస్తూ ప్రజల మద్య తిరుగుతున్న చంద్రబాబు ప్రజల కష్టాలు స్వయంగా చూస్తున్నపటికీ, వారిని కష్టాలు పాలు చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికే అండగా నిలబడి ప్రజలకు ద్రోహం చేస్తున్నారని ఆమె అన్నారు. త్వరలోనే జగనన్న విడుదలయి రాజన్న రాజ్యం తెస్తాడని ఆమె ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు.   ఆమె తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డిని బోనులో ఉన్న పులితో పోల్చడం కాంగ్రెస్, తెరెసా, తెదేపాలకు మరో కొత్త అస్త్రం అందించినట్లయింది. జగన్ మోహన్ రెడ్డి వంటి పులిని బోనులో ఉంచక బయటకి వదిలితే అది మరింత రెచ్చిపోయి అందరినీ తినేస్తుందని, అందువలన దానిని బోనులోనే ఉంచడమే మేలని రేపటి నుండి తెదేపా, కాంగ్రెస్ నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆట పట్టించే అవకాశం ఉంది.

అక్బరుద్దీన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలి

        హిందువులు, హిందూ దేవతల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ మంగళవారం హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. జనార్థన్ గౌడ్ అనే న్యాయవాది ఈ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు చట్టవిరుద్ధమని, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని న్యాయవాది తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను కోర్ట్ ఎల్లుండి కి వాయిదా వేసింది. నిర్మల్, నిజామాబాద్ సభల్లో అసంధర్భగా అనుచిత వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్ మీద దేశవ్యాప్తంగా కేసులు నమోదైన విషయం తెలిసిందే.

"బ్రిక్స్'' సమావేశానికి చేరుకున్న మన్మోహన్ సింగ్

  బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా)సదస్సు దక్షిణాఫ్రికాలో తొలిసారిగా జరుగుతున్నాయి. ఈ సమావేశానికి భారత ప్రధాని మన్మోహన్ సింగ్, మంత్రులు చిదంబరం, ఆనంద్ శర్మ, జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ లు దక్షిణాఫ్రికాలోని డర్బన్ కు చేరుకున్నారు.  భారత ప్రధాని తన నాలుగు రోజుల పర్యటనలో చైనా కొత్త అధ్యక్షుడు జీ.జిన్ పింగ్ తో భేటీ కానున్నారు. ఈ భేటీలో భారత, చైనా మధ్య సంబంధాలు పటిష్టంగా ఉంచడంపై చర్చిస్తామని తెలిపారు. అలాగే ప్రధాని మన్మోహన్ సింగ్ బ్రిక్స్ దేశాల్లో మౌలిక సదుపాయాలూ, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు బ్రిక్స్ అభివృద్ధి బ్యాంకు ఏర్పాటుకు సంబంధించి సద్దాస్సులో ప్రకటన చేసే అవకాశముందని, ప్రపంచ ఆర్థికాభివృద్ధి, పునరుద్దరణ, అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ సంస్థలను, సుస్థిర అభివృద్ధి వంటి అంశాలను సంస్కరించే మార్గాలపై చర్చిస్తామని అన్నారు.

కేంద్రానికి మళ్ళీ తమిళ సెగ

  యుపీయే ప్రభుత్వానికి శ్రీ లంక రూపంలో దురదృష్టం ఇంకా వెంటాడుతూనే ఉంది. మొన్న కరుణానిధి పేల్చిన మద్దతు ఉపసంహరణ బాంబు దెబ్బకి యుపీయే కుప్పకూలి పోతుందని అందరూ భావించినప్పటికీ ఆపద్బాందవుల వంటి యస్పీ బీయస్పీ లు చక్రం అడ్డువేయడంతో ఇంకా నిలిచి ఉంది. ఎందరికో హ్యాండిచ్చిన తనకే డీయంకే హ్యాండిచ్చినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బాధపడకుండా తమిళ తంబిల కోరిక మేరకు ఐక్య రాజ సమితిలో శ్రీ లంకకు వ్యతిరేఖంగా ఓటేసి వచ్చి వారిని ప్రసన్నం చేసుకొందామనుకొంది. కానీ, అంతలోనే కామన్వెల్త్ దేశాల సమావేశం కూడా సరిగ్గా ఇప్పుడే వచ్చింది. అది కూడా శ్రీ లంక దేశంలోనే నిర్వహించబడతాయి గనుక యుపీయే సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. ఈసారి తన బద్దశత్రువయిన కరుణానిధి కంటే ముందుగానే తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత ప్రధాని మన్మోహన్ సింగుకి ఆ సమావేశాలను బహిష్కరించాలని కోరుతూ లేఖ వ్రాసారు. తద్వారా సభ్య దేశాలకు శ్రీలంక సంజాయిషీలు చెప్పుకోవలసి వస్తుందని, అది ఆ ప్రభుత్వం పై ఒత్తిడి సృష్టించి అక్కడ నివశిస్తున్న అమాయకులయిన తమిళుల ప్రాణాలు కాపాడుతుందని ఆమె వ్రాసారు. మానవ ధర్మంగా శ్రీ లంక లోని తమిళులను కాపాడవలసిన బాద్యత ఒక్క శ్రీ లంక మీదే కాక అందరి మీద ఉంది. కానీ, ఆ దేశంతో ఉన్న వ్యాపార సంబందాలు దెబ్బతింటాయనే భయంతో భారత్ తో సహా అనేక దేశాలు వెనకడు వేస్తున్నాయి. ఇటీవలే భారత్ ఆ దేశానికి వ్యతిరేఖంగా ఐక్యరాజ సమితిలోఓటేసి వచ్చింది కనుక, ఇప్పుడు కూడా కామన్ వెల్త్ సమావేశాలను బహిష్కరించే అవకాశం ఉంది.

ఊహాగానాలకు స్పందించను ... రాజీనామాపై జైపాల్ రెడ్డి

  కేంద్ర శాస్త్రం సాంకేతిక శాఖ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి, రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కె. జానా రెడ్డి  కేంద్రం మే నెలలో ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై అనుకూల నిర్ణయం తీసుకోకపోతే రాజీనామా చేస్తారని ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే. ఈ విషయమై కాంగ్రెస్ శ్రేణులను ప్రశ్నించగా అది వారి వ్యక్తిగత అంశమని పిసిసి ప్రధాన కార్యదర్శి, జైపాల్ బంధువు ఉద్దేమర్రి నరసింహారెడ్డి సమాధానం ఇచ్చారు. జైపాల్ రెడ్డిని రాజీనామా విషయంపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రత్యేక తెలంగాణాపై కేంద్రమంత్రిగా నేను ఏమీ మాట్లాడను, రాజీనామా చేస్తున్నానన్న ఊహాగానాలకు నేను స్పందించను అన్నారు.

సాయంత్రం బాబ్లీపై అఖిలపక్ష భేటి

        బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో నేడు సచివాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంపై సుప్రీం కోర్టు తీర్పు రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తుందని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిలదీశాయి. దీంతో ఈ విషయంపై అన్ని పార్టీలతో చర్చించి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా మన రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం కచ్చితంగా పొందేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సుప్రీం ఆదేశాల ప్రకారం బాబ్లీ నుంచి నీరు విడుదల చేసేందుకు స్పష్టమైన విధానాలకోసం అవసరమైతే కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే తెలియజేసింది.

అత్యాశకు పోయినందుకే జగన్ జైలుకు

  చంద్రబాబు పాదయాత్ర ముగింపు దశకు చేరుకొనే సమయానికి ఆయన గ్రామీణ ప్రజలతో ఏవిధంగా అనుసంధానం అవ్వాలోఇప్పుడు బాగా నేర్చుకొన్నట్లు కనిపిస్తున్నారు. ఆయన ఇప్పుడు గ్రామీణులకు సులువుగా అర్ధం అయ్యేందుకు తన ప్రసంగాలలో పిట్టకధలను జోడిస్తూ తను చెప్పదలుచుకొన్నది వారి మనసులలో నాటుకొనేలా చెపుతున్నారు. నిన్న మండపేట వద్ద గల ఏడిద గ్రామంలో జగన్ మోహన్ రెడ్డి గురించి వివరిస్తూ ఆయన చెప్పిన చిన్నపిట్ట కధ గ్రామస్తులను బాగా ఆకట్టుకోంది. దురాశాపరుడయిన వ్యక్తి ఒకడు రాజుగారి వద్దకు వచ్చి తనకు కొంత భూమి ఇప్పించమని అడిగితే, అతని సంగతి కనిపెట్టిన రాజుగారు ఆ రోజు మొత్తం అతను ఎంత దూరం నడిస్తే అంత మేరా అతనికే ఇచ్చేస్తానని చెప్పడంతో, అత్యాశకు పోయినా ఆ వ్యక్తి ఆయాసపడుతూ రోజంతా తిరిగి తిరిగి చివరకి గుండె ఆగి చనిపోయాడు. అప్పుడు ఆ రాజుగారు తన భటులను పిలిచి అతనికి ఇప్పుడు కేవలం 6 అడుగుల స్థలం చాలు గనుక, అతనిని 6అడుగుల గోతిలో కప్పెట్టమని ఆజ్ఞాపించారు. ఈ కధ అంతా చెప్పి జగన్ కూడా ఆ వ్యక్తిలాగే అత్యాశకు పోయినందుకు ఇప్పుడు అతనికి చిన్న జైలు గదే మిగిలిందని చెప్పడంతో ప్రజలు నవ్వాపుకోలేక పోయారు.

ఎమ్మేల్యే దేవిరెడ్డి మనసులో మాట

        ఎల్బీనగర్ కాంగ్రెస్ ఎమ్మేల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండిచాలని కోరగా కాంగ్రెస్ పెద్దలు చెప్పినా ఆ పనిమాత్రం చేయనని అంటూ తన మనసులోని ఆలోచనను బయటపెట్టారు. నేను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలి అనుకుంటే నన్ను ఆపేవారు ఎవరూ లేరు. నేను అందరికీ చెప్పిన తరువాతనే ఆ పార్టీలోకి వెళతాను. రాత్రికిరాత్రే పార్టీ మారాల్సిన అవసరం నాకు లేదు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేస్తారా ? ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా ? అన్న ప్రశ్నకు నేను ఎక్కడ పోటీ చేసినా ఎలాంటి ఇబ్బందిలేదు. నేనేంటో అందరికీ తెలుసు అని అన్నారు.

హోలీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  హోలీ వస్తుందంటే పిల్లలలో చెప్పలేని ఆనందం. హోలీ రోజుల రంగు రంగుల రంగులు ఒకరిపై ఒకరు జల్లుకుంటూ, పూసుకుంటూ తెగ హడావుడి చేస్తుంటారు పిల్లలే కాదు పెద్దలు కూడా. పూర్వకాలంలో ఎండాకాలంలో వచ్చే చర్మవ్యాధులు దరిచేరకుండా ఉండేందుకు ప్రకృతిలో దొరికే మొక్కలు, పూలతో రంగులు తయారుచేసుకునేవారు. కానీ ప్రస్తుతం అంత ఖాళీ ఎవరికుంది అందుకనే బజార్లలో దొరికే రంగులతోనే ఆనందిస్తున్నారు. మార్కెట్లలో దొరికే రంగులతో కళ్ళకు వివిధ రకాల జబ్బు వస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. హోలీ ఆడేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు తెలుసుకుందాం ... * చిన్న పిల్లలలను రంగులకు దూరంగా ఉంచాలి ఒకవేళ ఆడుకుంటుంటే పెద్దవాళ్ళు వారి దగ్గర ఉండాలి. * రసాయనాలతో తయారైన రంగులు కంట్లోకి వెళితే కార్నియా దెబ్బతిని, చూపు కోల్పోయే ప్రమాదం ఉంది, రంగుల్లోని ఆమ్లాలు, క్షారాలు వెంటనే తమ ప్రభావాన్ని చూపకపోయినా రాను రాను కంటి చూపును దెబ్బతీస్తాయి. * గులాల్ లాంటి రంగులు కంట్లోకి వెళ్ళి ఇబ్బందిని కలిగిస్తాయి. * పెట్రోలియం ఉత్పత్తులను ఉపయోగించి సునేర్ ను ముఖానికి పూసుకుంటారు. అయితే సునేర్ కంట్లోకి వెళితే కంటికి వెంటనే నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువ అందుకే సునేర్ ను వాడకపోవడమే మంచిది. * రంగులు కంట్లో పడితే వెంటనే శుభ్రమైన చల్లటి నీళ్ళతో కడగాలి. * కన్ను ఎరుపుగా మరి, మంటపుడితే వెంటనే కంటి వైద్యున్ని సంప్రదించాలి.

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఆరోగ్య నివేదిక

  ఈనెల 20వ తేదీన నాంపల్లి సిబీఐ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చంచల్ గూడ జైలు అధికారులు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఉస్మానియా వైద్యాధికారులను కోరింది. ఉస్మానియా వైద్యుల బోర్డు శ్రీలక్ష్మికి ఈనెల 30వ తేదీన అపాయింట్ మెంట్ ఇచ్చింది.  జైలు అధికారులు సిబీఐ కోర్టు 25లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిందని వైద్యుల బోర్డుకు తెలుపగా వైద్యాధికారుల బోర్డు సోమవారమే నివేదిక ఇచ్చేందుకు సిద్దమై శ్రీలక్ష్మి ఆరోగ్య సమస్యలను అడిగి ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్య పరీక్షలు చేసి, ఆమె పరిస్థితి ఏమీ బాగోలేదని, కనీసం లేచి నిలబడే స్థితిలో కూడా లేరని, ఆమె ఎడమకాలు ఎముక జాయింట్ల వద్ద తీవ్రంగా నొప్పి ఉందని ఆ మేరకు నివేదిక సిద్ధం చేసి చంచల్ గూడ జైలు అధికారులకు అందచేసినట్లు తెలిసింది. జైలు అధికారులు శ్రీలక్ష్మి ఆరోగ్య నివేదికను సిబీఐ కోర్టుకు సాయంత్రం సమర్పించింది. ఈ అంశంలో శ్రీలక్ష్మి ఆరోగ్య నివేదిక పై మంగళవారం సిబీఐ కోర్టు తదుపరి ఆజ్ఞలు జారీ చేసే అవకాశం వుంది.

అభ్యర్థులను ఖరారు చేసిన టిడిపి

  చంద్రబాబు నాయుడు పాదయాత్రలలోనే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. అన్ని పార్టీలకంటే ముందుగా తమ అభ్యర్థులను టిడిపి ఖరారు చేస్తోంది. రాజమండ్రి నుండి మురళీమోహన్ ను, అమలాపురం ఎస్సీ రిజర్వ్ సీటును గొల్లపల్లి సూర్యారావుకు, కాకినాడ సీటును పోతుల విశ్వంకు, ఏలారు సీటును మాగంటి బాబుకు, మచిలీపట్నం సీటును సిట్టింగ్ ఎంపి కొనకళ్ల నారాయణరావుకు, విజయవాడ సీటును కేశినేని నానికి, వల్లభనేని వంశీకి ముందుగా అనుకున్నట్టు గన్నవరం నుండి కాకుండా నూజివీడు అసెంబ్లీ సీటును ఖరారు చేసినట్లు తెలిసింది. అభ్యర్థులను ఖరారు చేయడమే కాకుండా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటనలు చేసి ప్రజల కష్టాలను తెలుసుకుని వాటిపై ఉద్యమించాలని చంద్రబాబు పిలుపునిచ్చినట్లు తెలిసింది.

శంకర్రావ్ తో సిఎం భేటీ

  మాజీ మంత్రి శంకర్రావు గ్రీన్ ఫీల్డ్స్ వ్యవహారం, పోలీసులు తనపై చేసిన దౌర్జన్యాన్ని సోమవారం సభలో మాట్లాడేందుకు అనుమతించాల్సిందిగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఛాంబర్ కు వెళ్లగా సభలో ఈ అంశాలు ప్రస్తావిస్తే ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి వస్తుందని స్పీకర్ శంకర్రావ్ కు చెప్పినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ హుటాహుటిన స్పీకర్ ఛాంబర్ కు వచ్చి శంకర్రావు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగారు. అయితే శంకర్రావు గ్రీన్ ఫీల్డ్స్ భూముల వివాదంలో పోలీసులు తనపట్ల దురుసుగా వ్యవహరించారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ వ్యవహారంపై సిఐడి విచారణ కొనసాగుతుందని వారంలోగా నివేదిక అందిన తరువాత తప్పనిసరిగా ఈ వ్యవహారంలో బాధ్యులైన వారపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి సమాధానమిచ్చారని తెలిసింది. అయితే శంకర్రావు మాత్రం ససేమిరా అంటూ ఈ అంశాన్ని సభలో ప్రస్తావించడానికి అనుమతించాలని, కావలసివస్తే తనను సస్పెండ్ చేయవచ్చని, పోలీసులు తనని దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్ కు తరలించే సాక్షాలు టీ.వి. ఛానల్స్ ప్రసారం చేశారు ఇంకా సిఐడి విచారణ ఎందుకు అని ముఖ్యమంత్రిని నిలదీసినట్లు తెలిసింది.

లోకేష్ బస్సు యాత్రకు సాక్షి

  వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాలో తమకు శత్రువయిన తెలుగుదేశం పార్టీ గురించి వ్యతిరేఖ వార్తలు ప్రచురింపబడటం సహజమే. కానీ, ఈ రోజు, ఆ పత్రిక అన్ని పత్రికల కంటే ముందుగా త్వరలో లోకేష్ బస్సు యాత్ర మొదలు పెట్టబోతున్నట్లు ఒక వార్త ప్రచురించడం విశేషం. జూన్ 2వ వారం నుండి లోకేష్ బస్సు యాత్ర మొదలు పెట్టబోతున్నట్లు తెలియజేసింది. చంద్రబాబు కూడా ఇక ముందు గ్రామాల పోలిమేరవరకు బస్సులోనే ప్రయాణించి, గ్రామంలో మాత్రమే పాదయాత్ర చేయనున్నారని, వచ్చే నెల 27 తరువాత పాదయాత్రకి ముగింపు పలికి, కొద్ది రోజుల విశ్రాంతి తీసుకొన్న తరువాత ఆయన కూడా బస్సు యాత్ర చేసి మిగిలిన జిల్లాలను పర్యటిస్తారని తెలియజేసింది. చంద్రబాబు పాదయాత్ర ముగింపు గురించి ఇప్పటికే అందరికీ తెలిసినప్పటికీ, ఆయన రెండు గ్రామాల మద్యన బస్సులో ప్రయాణించడం, లోకేష్ బస్సు యాత్ర గురించి మాత్రం అందరికంటే ముందుగా సాక్షి పేపరే వివరాలు అందజేయడం విశేషం. అయితే, లోకేష్ బస్సు యాత్ర గురించి ఇంకా అధికార ప్రకటన వెలువడక మునుపే సాక్షిలో ఈ వార్త రావడం మరో విశేషం.