నరేంద్ర మోడీ ప్రచార స్టయిలే వేరు
posted on Jan 31, 2015 @ 7:43PM
ఈరోజు డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ మళ్ళీ తన మాటల మాయాజాలంతో డిల్లీ ప్రజలను కట్టిపడేశారు. ఒకవైపు వారిని తన మాటలతో ఆకట్టుకొంటూనే, తన ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పిస్తూ మళ్ళీ తనతో కలిసి పనిచేస్తానని చెపుతున్న ఆమాద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కి చురకలు వేసారు. మోడీ మార్క్ ప్రచారం అంటే ఎలా ఉంటుందో డిల్లీ ప్రజలకు మరొకమారు రుచి చూపించారు.
ముందుగా ఆమాద్మీ పార్టీ ఆయువు పట్టు మీదే దెబ్బ తీసారు. డిల్లీ ప్రజలు ఎంతో నమ్మకంతో ఆ పార్టీకి ఓటేస్తే, అరవింద్ కేజ్రీవాల్ కేవలం 49 రోజుల్లోనే పదవిలో నుండి దిగిపోయి ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఆక్షేపించారు. కనుక ఈసారి డిల్లీ ప్రజలు ఆమాద్మీని దూరంపెట్టి సుస్థిరమయిన పాలన అందించగల బీజేపీకే ఓటువేసి గెలిపిస్తే, ఇంతకు ముందు కనీవినీ ఎరుగని విధంగా డిల్లీని అభివృద్ధి చేస్తూ ప్రజలకు మంచి పరిపాలన అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
“డిల్లీ మన దేశానికి ముఖచిత్రం వంటిది. అటువంటి డిల్లీ గురించి, ప్రజల సమస్యల గురించి అన్నీ క్షుణ్ణంగా తెలిసిన కిరణ్ బేడీ వంటి మంచి సమర్దురాలయిన మహిళా పోలీస్ అధికారిణి చేతిలో డిల్లీని పెడితే ప్రజలు కూడా నిశ్చింతగా ఉండవచ్చని అన్నారు. ఆమాద్మీ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ, “ఉట్టికి ఎగురలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లుగా డిల్లీని పరిపాలించలేని ఆమాద్మీ పార్టీ, ఏకంగా దేశాన్నే ఏలేద్దామనుకొంది. కానీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేక సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది.”
"మా పార్టీ నేతలు అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా పర్యటన విజయవంతం అయ్యిందని చెప్పుకొంటే దానిని ప్రతిపక్షాలు తప్పు పట్టాయి. ఒకవేళ ఆయన పర్యటనలో ఎక్కడయినా అపశ్రుతి జరిగితే, అప్పుడు ప్రతిపక్షాలు దానిని అందిపుచ్చుకొని ఎన్నికలలో లబ్ది పొందే ప్రయత్నం చేయవా? ఒకవేళ ఒబామా గణతంత్రదినోత్సవ వేడుకలలో పాల్గొని ఏ ఒప్పందాలు చేసుకోకుండా వెళ్ళిపోయినా ప్రతిపక్షాలు మా ప్రభుత్వాన్ని విమర్శించకుండా వదిలిపెడతాయా?" అని ఆయన నిలదీశారు.
తనతో భుజం భుజం కలిపి కలిపి పనిచేయగల బీజేపీకి ఓటువేసి గెలిపించినట్లయితే కేంద్రం, డిల్లీ ప్రభుత్వం రెంటి మధ్య మంచి సయోధ్య ఉంటుంది కనుక, చక్కగా పనిచేస్తూ డిల్లీని మరింత అభివృద్ధి చేయగలమని ఆయన చెప్పారు. ఆమాద్మీ పార్టీ తన పరిధిలో లేని అంశాలయిన భూసేకరణ చట్టాలను మార్పు, డిల్లీకి రాష్ట్ర హోదా వంటివి అనేక హామీలు ఇస్తోంది. ఆ సంగతి విద్యావంతులయిన ప్రజలకు తెలుసు. కానీ డిల్లీ మురికివాడలలో నివసించే ప్రజలకు తెలియదు. ఆమాద్మీ పార్టీ ఇస్తున్న ఆచరణ సాధ్యం కాని హామీలను నమ్మి మళ్ళీ మోసపోవద్దని డిల్లీ ప్రజలకు మోడీ హితవు పలికారు. ఒకవేళ ఆయన ఎన్నికల ప్రచారానికి మరింత సమయం కేటాయించగలిగి ఉండి ఉంటే, బహుశః బీజేపీకి భారీ మెజార్టీ సాధించి పెట్టేవారేమో?