జగన్ బెదిరింపు రాజకీయాలు...ప్రజా విశ్వసనీయత ఎక్కడ?
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తున్నాడు, అరెస్ట్ చేస్తానంటున్నాడు. కూటమి ప్రభుత్వ భాగస్వామ్యానికి ఎవరైనా ముందుకు వస్తే, తాను అధికారంలోకి రాగానే అరెస్ట్ చేస్తానని ఆయన బెదిరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ మోడల్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని ఆహ్వానించినందుకు నిరసనగా 'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమం చేపట్టారు.
కోటి సంతకాలు చేసిన వారి చిరునామా, ఫోన్ నంబర్లు కూడా పొందుపరిచామని, ఎవరైనా పరిశీలించుకోవచ్చని కూడా తెలిపారు. ఇది మాత్రం కొత్త విధానం. "మేము అబద్ధం చెప్పడం లేదు" అని నిరూపించుకునే ప్రయత్నం ముందుగానే చేశారు. ఇంతవరకు బాగానే ఉంది.ప్రైవేటు భాగస్వామ్యం గురించి ఒక అనుమానం వ్యక్తం చేయడం, అందుకు నిరసన వ్యక్తం చేయడం విపక్షంగా జగన్ బాధ్యత. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టగానే, ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించేందుకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారని భావించిన వారికి, ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలు వినగానే నిరాశే మిగిలింది.
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 5 కోట్ల జనాభాలో, ఇంత తక్కువ వ్యవధిలో ఒక కోటి నాలుగులక్షల సంతకాలు సేకరించడం అంటే అంత సులభం ఏమీ కాదు. ప్రతి పల్లెలోనూ, పట్టణాలలోనూ జనరల్ బాడీ మీటింగులు పెట్టినా సేకరించడం కష్టం. పల్లెల్లో సంతకాలు పెట్టడం మరీ కష్టం. అధికారపార్టీకి వ్యతిరేకంగా సంతకం పెట్టాలంటే ఖచ్చితంగా సంకోచిస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ను 'సంక్షేమ రాష్ట్రం' అనే కంటే 'సంక్షేమ పథకాల రాష్ట్రం' అంటే బాగుంటుంది. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న 'సూపర్ సిక్స్' పథకాలే కాక, వారి మేనిఫెస్టో ప్రకారం చేసిన వాగ్దానాలు కొన్ని ఉన్నాయి. తటస్థంగా ఉండేవాళ్ళు అంత బాహాటంగా రారు. పట్టణాలలో మీటింగులకు రావడమే కష్టం. ఇన్ని పరిమితుల మధ్య కోటి సంతకాలు సేకరించడం కష్టంతో కూడుకున్న పని. జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు ఎప్పుడూ వాస్తవానికి దూరంగా ఉన్నట్లు వెంటనే రుజువు అవుతూ ఉంటాయి.
అందుకే సంతకాల విషయంలో రుజువులు కూడా జత చేయవలసి వచ్చింది. ఇంత కష్టపడి కార్యకర్తలు చేసిన పనిని, ఆయన మీడియా ముందు మాట్లాడిన మాటలతో వృధా చేశారు. పీపీపీ మోడల్‌ను తాను ఇంతగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ముందుకు వచ్చి ప్రభుత్వ భాగస్వామ్యంలో వైద్య కళాశాలలు తీసుకుంటే, వారిని తాను అధికారంలోకి రాగానే అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తానంటున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఎవరినో ఒకరిని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తుంటారు. ఆయన అధికారంలోకి వచ్చిన రోజు మొదలు తెలుగుదేశంపార్టీ కార్యకర్తల నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు అరెస్ట్ చేసే పనిలో పడి పాలనను మరచిపోవడమే జగన్ ప్రస్తుత పరిస్థితికి కారణం.
ప్రధానమంత్రి, అమిత్ షా ఆశీస్సులు ఉంటే చాలనుకుని పాలనకు దూరంగా ఉన్నారు. బటన్ నొక్కితే చాలనుకుని ప్రజలకు దూరం అయిపోయారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరెస్టులు వైసీపీకి ఎంతవరకు ఉపయోగపడ్డాయో అనే సమీక్ష జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ ఎప్పుడైనా చేసుకున్నారో లేదో కానీ, ప్రజలకు అరాచకం నచ్చకనే జగన్మోహన్ రెడ్డిని పక్కకు పెట్టారు. ఆయన అధికారంలోకి వస్తేఏంచేయాలనుకుంటున్నారు అంటే 'జైళ్లు నింపుతాడు' అనే నినాదం ఇస్తున్నట్లుగా ఉంది. ఇప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాపార సంస్థలను వెళ్లగొడతాను అనే మాటతోనే ఆయన కాలం వెళ్లదీస్తున్నారు. ఆయనకు చాలా పెద్ద న్యాయవాదుల బృందం ఉంది. పెట్టుబడులు పెట్టిన వారిని జైల్లో పెట్టడానికి చట్టరీత్యా అవకాశం ఉండదు అనే కనీసపు సలహా కూడా ఇస్తున్నట్లుగా లేరు. ఆయనకు రాజకీయ సలహాదారులు కూడా అనేకమంది ఉన్నారు.
ఇలా బెదిరించినందువలన ప్రజలు ఓట్లు వేయరు అనే సలహా మాత్రం చెప్పడం లేదు. తానొక మాజీ ముఖ్యమంత్రి అనే విషయం మరచిపోయి, యోగా దినోత్సవం నాడు ప్రధాని ఆంధ్రప్రదేశ్ వచ్చి యోగా చేసిన విషయం పక్కన పెట్టి, మీడియా ముందు అభినయం చేస్తూ చేసిన హేళన.. ఆయన ప్రజాక్షేత్రంలో ఇక ప్రజలను మెప్పించలేరు అనే విషయాన్ని ఆయనే చెప్పుకున్నట్లు అయింది. అటువంటి అభినయం చూసిన వారు కొంతమంది ఆయన్ను కమెడియన్లతో పోలుస్తున్నారు. తాను అధికారంలో ఉండగానే గౌరవం కోల్పోయారు. బెదిరిస్తే బెదరరు అని అర్థమయ్యాక కూడా 'జైల్లో పెడతాము' అంటారు.
ఉద్యోగులను రిటైర్ అయినా వదిలిపెట్టం అని అంటారు. జగన్మోహనరెడ్డి ఎలాగూ అంటున్నాడు కాబట్టి మేము తక్కువ కాదు అన్నట్లు కాకాణి గోవర్ధన్ రెడ్డి.. ఇరిగేషన్ డిపార్టుమెంటు ఉద్యోగులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కుమ్మక్కు అయి అవినీతి చేస్తున్నారంటూ, వాళ్ల ప్రభుత్వం రాగానే జైల్లో వేసి వాళ్ల ఆస్తులన్నీ జప్తు చేయిస్తారట. 'సముద్రం లోపల ఉన్నా వదిలిపెట్టను' అంటాడు జగన్. దేశమంతా అమలు చేస్తున్న పీపీపీ మోడల్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్నది. పథకంలో ఏవైనా అప్రజాస్వామికమైనవి ఉంటే ముందుగా ఆపథకాన్ని ఛాలెంజ్ చేయాలి.
ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ ఒక పథకాన్ని, దానికి కొన్ని మార్గదర్శకాలనే కాకుండా కొన్ని నిధులను కూడా సమకూర్చిన కేంద్రం మీద కనీసపు నిరసన తెలపకుండా.. కేంద్రం సూచించిన విధంగా పీపీపీ మోడ్‌లో కళాశాలలను ప్రమోట్ చేస్తున్న చంద్రబాబు నాయుడునో, భాగస్వామ్యానికి ముందుకు వచ్చిన ప్రైవేట్ వ్యక్తులనో అరెస్ట్ చేయాలనడం జగన్ అవివేకానికి చిహ్నం. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ వైద్య కళాశాలలలో ప్రభుత్వమే సీట్లు అమ్మే సంస్కృతిని పరిచయం చేసిందే జగన్మోహన్ రెడ్డి. అలాంటి పద్ధతిని ప్రవేశపెడుతూ ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీఓల పైన అప్పటి ప్రతిపక్షం టీడీపీ న్యాయపరమైన చర్యలు చేపట్టకపోవడం ఆశ్చర్యకరం.
ఆ విషయమై ఇప్పటికీ రాష్ట్రంలో పౌరులకు కనీస అవగాహన కలిగించకపోవడం టీడీపీ వైఫల్యానికి పరాకాష్ట. జగన్మోహన్ రెడ్డి కోరుకునేది పేద విద్యార్థులకు వైద్య విద్య ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశ్యం అనుకుంటే, ముందుగా చేయవలసింది మెడికల్ సీట్లను ప్రభుత్వమే అమ్మకానికి పెట్టిన తన పాలసీకి ప్రజలకు క్షమాపణ చెప్పి, పీపీపీ మోడ్‌లో ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వ విధానాన్ని న్యాయస్థానంలో సవాల్ చేయాలి. అటువంటి విధానాన్ని రూపొందించిన కేంద్రానికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేయాలి. జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం నిలబడాలనుకుంటే వాస్తవాలు మాత్రమే ప్రజలకు వివరిస్తూ, ఒక పద్ధతిలో నిరసన తెలుపుతూ న్యాయపోరాటం చేయాలి.
కానీ ఆయన అధికారం గురించి, చంద్రబాబు నాయుడును జైలుకు పంపించడం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. నిజంగా ప్రజల కోసమే అయితే సాదాసీదాగా లోకేష్ మాదిరిగా ప్రజలకు చేరువ కావాలి. ముఖ్యంగా వాస్తవాలు మాట్లాడాలి. పొద్దుటే మీడియా ముందు యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
అక్కడ జగన్ విశ్వసనీయత కోల్పోతున్నారు.ఇక రుషికొండ రాజభవనం గురించి జగన్ మాట్లాడకపోవడమే మంచిది. అధికారంలో ఉన్నప్పటి కంటే, అధికారం కోల్పోయాక జగన్మోహన్ రెడ్డి ప్రజల నమ్మకాన్ని ఎక్కువ కోల్పోయి, కూటమి ప్రభుత్వానికి మరో పదేళ్లు తానే బాటలు వేస్తున్నట్లుగా ఉన్నది. అందుకే జగన్ చెప్పే కోటి సంతకాలను కూడా ప్రజలు విశ్వసించలేక పోతున్నారు.