వాళ్ళందరి నోళ్ళు కేసీఆరే మూయించాలి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం మాట్లాడినా దాన్ని కామెడీగా చూడటం, కామెంట్లు చేయడం చాలామందికి అలవాటైపోయింది. కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలు, ఆచరణ సాధ్యం కాని మాటలు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఒకపక్క కేసీఆర్ బంగారు తెలంగాణను సాధించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. దీనికి అర్థం చేసుకోలేని చాలామంది ఆయన మాట్లాడిన మాటలకు పెడర్థాలు తీస్తూ ఆనందిస్తున్నారు. అలాంటి వారినోళ్ళు మూయించాల్సిన అవసరం ముఖ్యమంత్రి కేసీఆర్ మీద వుంది. ఆమధ్య కేసీఆర్ ఒక్క ఎకరం భూమిలో వ్యవసాయం చేసి కోటి రూపాయలు సంపాదించవచ్చని తన ఫామ్ హౌస్ సాక్షిగా చెప్పినా నమ్మకుండా ఎటకారంగా, ఏళాకోళంగా కామెంట్లు చేశారు. ఈ వేసవిలో హుస్సేన్ సాగర్ని ఖాళీ చేయిస్తానని అంటే అది అయ్యేపని కాదని అన్నారు. సచివాలయాన్ని మారుస్తానంటే అర్థంలేని పని అన్నారు. అసలు ఇలాంటివాళ్ళ ఉద్దేశమేంటి? కేసీఆర్ ఏం మాట్లాడినా దాంట్లోంచి పెడర్థాలు తీయడమేనా? లేటెస్ట్‌గా కేసీఆర్ తాను 70 వేల నుంచి 80 వేల పుస్తకాలు చదివానని చెప్పగానే ఈ విమర్శకులు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.
కేసీఆర్ చెప్పిన ఈ మాటను పట్టుకుని ప్రతిపక్ష నాయకులు ప్రెస్‌మీట్లు పెట్టి మరీ ఎటకారంగా మాట్లాడుతున్నారు. పుట్టిన దగ్గర్నుంచి రోజుకో పుస్తకం చదివినా అన్ని పుస్తకాలు చదవడానికి వీలు కాదని అంటున్నారు. కేసీఆర్ చెప్పిన వందలాది అబద్ధాలలో మరో అబద్ధం చేరిందని విమర్శిస్తున్నారు. ఇలా విమర్శించడం అన్యాయం, దారుణం, ఘోరం. కేసీఆర్ని విమర్శించేవారు 70 నుంచి 80 వేల పుస్తకాలు చదవలేరేమోగానీ, కేసీఆర్ చదవగలరు. ఆయనకు ఆ శక్తి వుంది. ‘రోబో’ సినిమాలో రజనీకాంత్‌లా చదివే శక్తి ఆయనకు వుందేమో. ఆయన్ని విమర్శించేవాళ్ళకు ఈ విషయం తెలియకపోవచ్చు కదా. కేసీఆర్ నిజంగానే 70 నుంచి 80 వేల పుస్తకాలు చదివే వుంటారు. నో డౌట్ ఎందుకంటే, ఆయన ప్రదర్శించే అపారమైన జ్ఞానం, చక్కని మాటతీరు, సంస్కారబద్ధంగా వుండే ప్రవర్తన, ఇతరులను గౌరవించే తీరు... ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చి వుంటాయనుకుంటున్నారు? ఆయన చదివిన 70 నుంచి 80 వేల పుస్తకాల నుంచే వచ్చి వుంటాయి. అంచేత, కేసీఆర్ని విమర్శిస్తు్న్నవాళ్ళు ఇప్పటికైనా తమ తప్పు తెలుసుకోవాలి. కేసీఆర్ శక్తిని తక్కువ అంచనా వేయడం మానుకోవాలి. కేసీఆర్ గారూ, మీరు విమర్శకులను ఎంతమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకిప్పుడు 65 సంవత్సరాలు. మీరు నిండు నూరేళ్ళు బతుకుతారు. బ్యాలన్స్ వున్న ఈ 35 ఏళ్ళలో మిగిలిన ఆ 20 నుంచి 30 వేల పుస్తకాలు కూడా చదివేసి, మొత్తం లక్ష పుస్తకాలు చదివిన ఘనతని సొంతం చేసుకోండి. విమర్శకుల నోళ్ళు మూయించండి.