కోదండరాముడికి క్లారిటీ వచ్చింది

ఎవరికైనా, ఏ విషయంలో అయినా క్లారిటీ రావడం ముఖ్యం. అలా క్లారిటీ రాకపోతే ముందుకు అడుగు వేయడం కష్టం. పాపం మొన్నటి వరకూ ప్రొఫెసర్ కోదండరామ్‌కి ఈ క్లారిటీ లేకపోవడం వల్లే చాలా టైమ్ వేస్టయింది. ఈమధ్యకాలంలో ఆయన క్లారిటీని సంపాదించుకోవడంతో మరో ముందడుగు వేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో టీఆర్ఎస్‌తో కలసి ముందడుగు వేసిన కోదండరామ్‌ని ఇతర పార్టీల వారు కేసీఆర్ జేబులో మనిషిగా విమర్శించారు. ఆ విమర్శలకు ఎంతమాత్రం వెరవకుండా టీఆర్ఎస్ మైలేజీ పెరగడానికి ఆయన తనవంతు సహకారాన్ని అందించారు. మిగతా పార్టీలు తెలంగాణ కోసం ఎంత జుట్టు పీక్కున్నా, తెలంగాణ కోసం కృషి చేసిన ఏకైక పార్టీగా  టీఆర్ఎస్‌ని ప్రజల దృష్టిలో నిలపడంలో ఆయన సక్సెస్ అయ్యారు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి ఆయనకు రావల్సిన గుర్తింపు రాలేదన్నది మాత్రం సత్యం. ప్రభుత్వం నుంచి ఎప్పటికైనా గుర్తింపు వస్తుందేమోనని ఆశగా ఎదురుచూసిన ఆయన ఇక లాభం లేదని అర్థం చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి తనకెలాంటి గౌరవం లభించదని క్లారిటీ వచ్చిన ఆయన తాజాగా మరో పోరాటం ప్రారంభించారు. పొలిటికల్ జేఏసీ అనేది ఇప్పుడు ముగిసిపోయిన చరిత్ర కాబట్టి ఇప్పుడు ఆయన తెలంగాణలో వున్న అనేక శక్తుల సమీకరణంగా మారిన తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ (టఫ్) నీడన చేరారు. ఈ ‘టఫ్’లో వున్నవాళ్ళందరూ కేసీఆర్ దృష్టిలో టఫ్ వ్యక్తులే. కేసీఆర్ అంటే విరుచుకుపడే వ్యక్తులే. ఇలాంటి వ్యక్తులందరూ వున్న ‘టఫ్’ నిర్వహిస్తున్న కార్యక్రమాలలో కోదండరామ్ ప్రత్యేక శ్రద్ధతో పాల్గొంటున్నారు. ఆ కార్యక్రమాల్లో ‘టఫ్’ ప్రముఖులు కేసీఆర్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తూ, రాళ్ళు వేస్తూ వుంటే కోదండరామ్ కూడా తనవంతుగా చిన్న చిన్న గులకరాళ్ళు విసరడం ప్రారంభించారు. భవిష్యత్తులో ఆ చిన్న గులకరాళ్ళు పెద్దపెద్ద బండరాళ్ళుగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ‘టఫ్’లో వున్నవాళ్ళందరూ తెలంగాణ వచ్చినా ప్రయోజనం ఏమీ చేకూరలేదని, కేసీఆర్ నిరంకుశ పాలన వచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వారితో చేతులు కలపడం అంటే కేసీఆర్ని కోదండరామ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టే భావించాలి. పోనీలెండి, పదవి దక్కకపోయినా పోరాటం కంటిన్యూ అవుతోంది. కంగ్రాట్స్ ప్రొఫెసర్ కోదండరామ్.

కొత్త ఓటరు కార్డులు వస్తాయోచ్

  మీకు ఓటుందా? మీ దగ్గర ఓటర్ గుర్తింపు కార్డు వుందా? ఆ ఓటర్ గుర్తింపు కార్డు బ్లాక్ అండ్ వైట్‌లో వుందా? రాబోయే రోజుల్లో మీ ఓటర్ గుర్తింపు కార్డు రంగుల్లో కళకళలాడబోతోంది. ఇప్పుడు మీ కార్డు మీద అస్పష్టంగా వున్న మీ ఫొటో ఫ్యూచర్లో రంగుల్లో కళకళలాడనుంది. తళతళ మెరవనుంది. ఈ కార్డులు మీ చేతికి ఎప్పుడు వస్తాయో డేట్ అడిగితే చెప్పలేంగానీ, సాధ్యమైనంత త్వరలో ఆ కార్డులు మీకు అందుతాయి. అయితే గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారడానికి మధ్యలో ఒక దశ వున్నట్టే మీ ఓటర్ గుర్తింపు కార్డులు కొత్త అవతారం ఎత్తడానికి కూడా మధ్యలో ఒక దశ వుంది. ఆ దశ పేరే ‘ఓటర్ గుర్తింపు కార్డులను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవడం’. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విషయానికి వస్తే, ఈ రెండు రాష్ట్రాల్లో డబుల్ ఓట్లు దాదాపు పాతిక లక్షలు వున్నాయట. కొందరు కావాలని రెండు చోట్ల ఓటరుగా పేర్లు నమోదు చేయించుకున్న వాళ్ళు అయితే, మరికొందరు అడ్రస్ మారగానే కొత్తగా పేరు నమోదు చేయించుకున్నవారు. ఇలా రెండు చోట్ల ఓటు వున్నవారి ఓటును ఒక్కదానికే పరిమితం చేయడానికి ఎన్నికల కమిషన్ ఓటర్ కార్డుకు, ఆధార్ కార్డుకు లింకు పెట్టింది. ఓటర్ గుర్తింపు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసే ప్రక్రియ ఇప్పటికే జరుగుతోంది. కొంతమంది ఆన్‌లైన్లో ఈ అనుసంధానం పూర్తి చేసుకున్నారు. ఇంకా చాలా చోట్ల ఇలా అనుసంధానం జరగాల్సి వుంది. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 75 శాతం అనుసంధానం పూర్తయిందని చెబుతోంది. వందశాతం పూర్తికాగానే ఆధార్ నంబర్‌తో కూడిన ఓటర్ కార్డులను జారీ చేస్తారట. ఇటీవలి కాలంలో కలర్ ఓటర్ కార్డులనే జారీ చేస్తున్నారు. దాంతో సహజంగానే ఆధార్ అనుసంధానం పూర్తయిన తర్వాత జారీ చేసే కార్డులు కూడా కలర్‌ కార్డులు అయ్యే అవకాశం వుంది. కాబట్టి పౌరుల చేతులకు కలర్ ఓటర్ ఐడీ కార్డులు వచ్చే అవకాశం వుంది. పౌరులకు కలర్ కార్డులతోపాటు పౌరుల జీవన ప్రమాణాలు కూడా కలర్‌ఫుల్‌గా మారగలిగితే ఎంత బావుంటుందో.

కేసీఆర్ ఒక మినీ మోడీ: రాహుల్ గాంధీ

  ఈరోజు ఆదిలాబాద్ జిల్లా పడ్యాల్ గ్రామంలో రైతులను, పార్టీ కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాని మోడీ, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని జాతీయ మోడీ అయితే, కేసీఆర్ తెలంగాణాలో మినీ మోడీ అని ఆయన చమత్కరించారు. ఇద్దరూ కూడా దేశాన్ని, తెలంగాణా రాష్ట్రాన్ని ఏదో అభివృద్ధి చేసేస్తున్నట్లు గొప్పలు చెప్పుకోవడమే తప్ప నిజంగా చేసిందేమీ లేదని ఎద్దేవా చేసారు. ఇద్దరూ ప్రజలకి అనేక హామీలను ఇచ్చేరని కానీ వాటిలో ఏ ఒక్కదానిని వారు అమలు చేసి చూపలేకపోయారని ఆయన విమర్శించారు. మేక్ ఇన్ ఇండియాతో బోలెడన్ని ఉద్యోగాలు వస్తాయని మోడీ అన్నారని కానీ ఇంత వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారని, అదేవిధంగా తెలంగాణాలో కేసీఆర్ కూడా ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారని ఆయన విమర్శించారు.   రైతులు ఆత్మహత్యలు చేసుకొంటే నేనెందుకు వారిని పరామర్శించడానికి బయలుదేరానని వారు ప్రశ్నిస్తున్నారని నాకు తెలిసింది. కానీ రైతులు కష్ట కాలంలో ఉన్నప్పుడు మోడీ కానీ కేసీఆర్ గానీ స్వయంగా వెళ్లి వారిని పరామర్శించి, వారికి అండగా నిలబడితే నేను వెళ్ళవలసిన పనేముంటుంది? వారిరువురూ రైతులను పట్టించుకోలేదు కనుకనే నేను రైతుల కోసం బయలుదేరవలసి వచ్చింది,” అని అన్నారు.   అయితే, ప్రధాని మోడీని, ముఖ్యమంత్రి కేసీఆర్ ని విమర్శిస్తున్న రాహుల్ గాంధీ జిల్లాలో కొన్ని వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొంటే కేవలం ఓ నలుగురిని మాత్రమే ఎందుకు కలిసారు? మిగిలినవారిని ఎందుకు కలవలేదు? అని ప్రశ్నించుకొంటే ఆయనకే సమాధానం దొరుకుతుంది.   లోక్ సభలో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పొందలేని కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ ఒక జిల్లాలో పర్యటన చేసినప్పుడు జిల్లాలో ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలందరినీ పరామర్శించలేనప్పుడు, వారికి ఆర్ధిక సహాయం చేయలేనప్పుడు, ఇక ఇంత సువిశాలమయిన భారత దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధాని మోడీ, తెలంగాణాను పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వెళ్లి ఆత్మహత్యలు చేసుకొన్న ప్రతీ ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించి, వారికి సహాయం చేయగలరని రాహుల్ గాంధీ ఏవిధంగా భావిస్తున్నారు? అటువంటి సమస్యలను పరిష్కరించేందుకు మంత్రులు, అధికారులు, యంత్రాంగం ఉంది. వారిని, ఆ యంత్రాంగాన్ని సరిగ్గా నడిచేలా చేయడమే వారి బాధ్యత తప్ప నేరుగా వెళ్లి దేశంలో ప్రతీ రైతును పలకరించి ఓదార్చడం కాదు వారి పని.   ఇక ఉద్యోగాల విషయానికి వస్తే గత పదేళ్ళుగా దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో తెలియదు కానీ ఇంకా ఏడాది తిరక్క ముందే మోడీ, కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వాలని రాహుల్ ఆశించడం కూడా హాస్యాస్పదమే. ఒక సంస్థ స్థాపించడానికే కనీసం ఒకటి రెండేళ్ళ కాలం పడుతుంది.   మేక్ ఇన్ ఇండియా పధకం మొదలుపెట్టి ఇంకా ఆరునెలలు కూడా కాలేదు. అదే విధంగా తెలంగాణాలో కొత్త పరిశ్రమలు స్థాపించేందుకు ప్రభుత్వం చాలా గట్టిగా కృషి చేస్తోందనే విషయం కాంగ్రెస్ నేతలకు కనబడకపోవచ్చును. కానీ ప్రజలందరికీ కనబడుతోంది. అటువంటప్పుడు ఉద్యోగ కల్పనకు మరి కొంత సమయం పడుతుందనే సంగతి రాహుల్ గాంధీకి తెలియదనుకోవాలా లేక తెలిసీ ప్రజలను తన మాటలతో తెలివిగా త్రప్పు ద్రోవ పట్టిస్తున్నారనుకోవాలా?

అందుకే ఆర్టీసీ సమ్మెను కొనసాగనిచ్చారుట!

  తెలంగాణా ఆర్టీసీ కార్మికులకు ఆంధ్రా ఆర్టీసీ కార్మికుల కంటే ఒక్క శాతం అధికంగా అంటే 44శాతం ఫిట్ మెంట్ ఇస్తున్నట్లు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన తరువాత, ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో గుజరాత్ రాష్ట్రం తరువాత తెలంగాణా రాష్ట్రమే ఆర్ధికంగా బలమయిన రాష్ట్రమని అందుకే కార్మికులకు అడిగిన దానికంటే ఒక్క శాతం ఎక్కువే ఇస్తున్నామని ఆయన అన్నారు.   దానిపై తక్షణమే స్పందించిన మాజీ కాంగ్రెస్ యంపీ పొన్నం ప్రభాకర్ తెలంగాణా ధనిక రాష్ట్రమని చెప్పుకొంటున్నప్పుడు, ఆ ఇచ్చే ఫిట్ మెంట్ ఏదో కార్మికులు సమ్మె మొదలుపెట్టక ముందే ఎందుకు ఇవ్వలేదు? తొమ్మిది రోజులపాటు సమ్మె చేసిన తరువాతే ఎందుకు ఇచ్చారు? అంటే ప్రజలలో, ఉద్యోగులలో మంచి పేరు సంపాదించుకోవడానికే తప్ప వేరెందుకు కాదు. కార్మికులు కోరినట్లు ముందే వారి వేతనాలు పెంచి ఉంటే వారు సమ్మె చేసి ఉండేవారు కాదు దాని వలన ఆర్టీసీకి మరింత నష్టం వాటిల్లేది కాదు ప్రజలకూ వారం రోజుల పాటు ఇబ్బందులు తప్పేవి. కానీ కేసీఆర్ ప్రజలలో మంచి పేరు సంపాదించుకోవడానికే సమ్మె జరగనిచ్చినట్లుంది,” అని తీవ్ర విమర్శలు చేసారు.

రాహుల్ గాంధీ అందుకే తెలంగాణాను ఎంచుకొన్నారా?

  రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణాలో పాదయాత్ర చేసారు. కానీ ఆయన తెలంగాణాలో బదులు ఆంధ్రాలో పర్యటించి ఉండి ఉంటే పార్టీకి ఎక్కువ ప్రయోజనం చేకూరేది. ఏవిధంగా అంటే ప్రస్తుతం ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. పైగా కొంతమంది శాసనసభ్యులు, యం.యల్సీ.లుగా ఎన్నికయ్యి చట్టసభలలో పార్టీకి ప్రాతినిధ్యం కూడా వహిస్తున్నారు.   కానీ రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. ఒక్కరంటే ఒకరు కూడా కాంగ్రెస్ తరపున ఎన్నిక కాలేదు. దానితో వారి ఆత్మవిశ్వాసం కూడా బాగా దెబ్బతిని ఉంది. అటువంటప్పుడు రాహుల్ గాంధీ ఆంధ్రాలో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అక్కడి కార్యకర్తలు, నేతలలో మళ్ళీ మనోధైర్యం పెంచేందుకు ఆంధ్రాలో పర్యటించి ఉండి ఉంటే పార్టీకి ఎంతో కొంత మేలు జరిగేది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్ర విభజన చేసినందుకు కాంగ్రెస్ పార్టీపై నేటికీ చాలా ఆగ్రహంతో ఉన్నందునే బహుశః ఆయన ఆంధ్రాలో అడుగుపెట్టడానికి భయపడి తెలంగాణాతో సరిపెట్టుకొన్నారేమో? అని రాజకీయవర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

రాహుల్ ఓదార్పు యాత్రలకి జగనే ప్రేరణా?

  జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలు, రైతు భరోసా యాత్రల గురించి ఆ నోటా ఈ నోటా ప్రాకి చివరికి ఆ విశేషాలు డిల్లీలో రాహుల్ గాంధీ చెవిలో పడ్డాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ళుగా ఓదార్పు యాత్రలు చేస్తున్నా వాటిని ఏ మాత్రం పట్టించుకోని రాహుల్ గాంధీ ఇప్పడు వాటిపై ఆసక్తి కలిగినట్లుంది. జగన్మోహన్ రెడ్డి తన ఓదార్పు యాత్రలు, ఇప్పుడు రైతు భరోసా యాత్రల ద్వారా రాష్ట్రంలో తన పార్టీని ఏవిధంగా బలపరుచుకొంటున్నారో ఇప్పుడు తను కూడా అదే విధంగా కిసాన్ యాత్రలతో రెండు నెలల శలవుతో డ్యామేజి అయిన తన ఇమేజిని, ఎన్నికల తరువాత ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయిన తన కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి మండే ఎండల్లో చెమటోడ్చుతున్నారు పాపం.   కానీ ఈ హడావుడిలో రాహుల్ గాంధీ ఒక ముఖ్యమయిన విషయం మరిచిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ళుగా చేసిన ఓదార్పు యాత్రల వలన వైకాపా బలపడగలిగిందే తప్ప ఎన్నికలలో మాత్రం గెలవలేకపోయింది. కనుక ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్న ఈ ఫ్లయింగ్ పాదయత్రల వలన ఆయననుకొన్న ప్రయోజనం దక్కుతుందా? అంటే అనుమానమే. కనుక ఒకవేళ ఆయన నిజంగా తన పార్టీని బలోపేతం చేసుకోవాలనుకొంటే, ఒక్కో రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని అక్కడి నేతలతో కలిసి సమీక్షించి, అక్కడ పార్టీని బలోపేతం చేసుకొనేందుకు ఏమి చేయాలో అది చేస్తే ఏమయినా ప్రయోజనం ఉంటుంది. లేదా జగన్మోహన్ రెడ్డిలాగే రాహుల్ గాంధీ కూడా ఒక్కో రాష్ట్రంలో కొన్ని రోజులపాటు ఏకధాటిగా పాదయాత్రలు, ఓదార్పు యాత్రలు చేసినా ఏమయినా ప్రయోజనం ఉండవచ్చును. కానీ ఇటువంటి ఫ్లయింగ్ పాదయత్రలు, పరామర్శ యాత్రల వలన, స్థానిక కాంగ్రెస్ నేతలకు, ప్రభుత్వానికి తడిపిమోపెడు ఖర్చు తప్ప మరే ప్రయోజనం ఉండబోదని రాజకీయ వర్గాలలోనే ఒక టాక్ వినిపిస్తోంది.

మరీ అన్ని తప్పటడుగులా జగన్?

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గత ఆరేళ్ళ బట్టి ప్రత్యక్ష రాజకీయాలలోనే ఉంటునప్పటికీ, ఇప్పటికీ తప్పటడుగులు వేస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. గత 8 రోజులుగా సమ్మె చేస్తున్నఆర్టీసీ కార్మికులకు అండగా తమ పార్టీ నిలబడుతుందని, అరొక నాలుగయిదు రోజులలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక సంఘాల డిమాండ్లను పరిష్కరించి వారిచేత సమ్మె విరమింపజేయలేకపోతే తమ పార్టీ వారికి సమ్మెకు మద్దతుగా రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయితే ఎంతసేపు ఏదో ఒక వర్గాన్ని తనవైపు త్రిప్పుకోవాలనే యావే గానీ దాని వెనుక ఉండే సమస్యల గురించి ఆయన ఆలోచించ(లే)రని ఆయన చేసిన ఈ హెచ్చరిక స్పష్టం చేస్తోంది. ఆర్టీసీ కార్మికుల సంఘాలు తక్షణమే సమ్మె విరమించాలని, లేకుంటే చట్టపరమయిన చర్యలు చేప్పట్టవలసి వస్తుందని మొన్న హైకోర్టు హెచ్చరించిన తరువాత జగన్మోహన్ రెడ్డి అనంతపురం బస్టాండ్ లో సమ్మె చేస్తున్న కార్మికులను కలిసి వారికి మద్దతు ప్రకటించిన తరువాత ప్రభుత్వానికి ఈ హెచ్చరిక చేసారు. అంటే హైకోర్టు ఆర్టీసీ కార్మికులను సమ్మె విరమించమని హెచ్చరిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి వారిని సమ్మె చేయమని ప్రోత్సహిస్తున్నట్లుంది.   హైకోర్టు ఆదేశాలను కాదని వారు తమ సమ్మె కొనసాగించినందుకు ఈరోజు కార్మిక సంఘాలకు కోర్టు ధిక్కారణ నేరం క్రింద షో కాజ్ నోటీసులు జారీ చేసింది. సమ్మె చేస్తున్న వారందరిపై ఎస్మా చట్టం ప్రయోగించమని ప్రభుత్వాలను ఆదేశించింది. సమ్మె వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నందున తాత్కాలిక ఉద్యోగులతో బస్సులను నడుపమని, వాటికి ఎవరయినా అడ్డుతగిలితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయమని హైకోర్టు ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాలను ఆదేశించింది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఇంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తునప్పుడు తెలివయిన ఏ రాజకీయనాయకుడు కోర్టుతో చెలగాటం ఆడే ఆలోచన కూడా చేయడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూడా అనంతపురం జిల్లాలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకి తమ పార్టీ మద్దతు ఉంటుందని ప్రకటించడం విశేషం. కోర్టు వద్దని చెపుతున్న సమ్మెకు ఆయన మద్దతు ప్రకటించడం చూస్తే ఇంకా ఎంతకాలం ఇలా తప్పటడుగులు వేస్తారో అనే అనుమానం కలుగుకమానదు.   తాజా సమాచారం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక సంఘాలు కోరుతున్నట్లుగానే 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చేందుకు అంగీకరించింది. కనుక ఈరోజు నుండి వారు సమ్మె విరమించే అవకాశం ఉంది. తను చేసిన హెచ్చరికకు భయపడే ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం దిగి వచ్చిందని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పుకొంటారేమో?

ఎంతమాటన్నారు దాసరి గారూ!

తాను రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశానని ప్రముఖ దర్శకుడు, కేంద్ర మంత్రి డాక్టర్ దాసరి నారాయణరావు చేసిన వ్యాఖ్యలు యావత్ తెలుగువారు షాక్‌కి గురయ్యేలా చేశాయి. మరీ సున్నిత హృదయులైతే కన్నీరు మున్నీరు అయ్యేలా చేశాయి. కొంతమంది అయితే గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఇంకొంతమంది సీనియర్ సిటిజన్స్ అయితే భగవంతుడా ఆ మహానుభావుడి నోటి వెంట ఈ మాట వినడానికేనా ఇంకా మేం బతికి వుంది అని కుమిలిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో నిజాయితీకి నిలువుటద్దంగా, పేద, బడుగు, బలహీన వర్గాల ఆకలి తీర్చిన మహా నాయకుడిగా పేరు గడించిన ఆయన రాజకీయాల్లోకి రాకపోతే పేదలు అన్యాయమైపోయేవారు. రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఆయన చేసిన సేవలు అద్భుతం, అమోఘం, అపూర్వం, అనిర్వచనీయం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంత అద్భుతంగా వుందంటే ఆయనే కారణం. తెలంగాణ రాష్ట్రం సిరిసంపదలతో తులతూగుతోందంటే అంతా ఆయన చలవే. ఆయనే రాజకీయాల్లోకి రాకపోతే ఈ తెలుగుజాతి వాణిని ఢిల్లీలో వినిపించే దిక్కూమొక్కూ లేకుండా పోయేది. అసలు ఆయన తనంతట తాను రాజకీయాల్లోకి రాలేదు. రాత్రనక, పగలనక నిద్రాహారాలు మాని ఆయన తెలుగుజాతికి చేసిన సేవను కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. ఆయనను ఎంపీగా, కేంద్రమంత్రిగా చేస్తే తెలుగువాళ్ళంతా సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతారని భావించి ఆయనకు పదవులు అప్పగించింది. ఆ సమయంలో ప్రతి తెలుగు హృదయం ఆనందంతో పులకరించిపోయింది.   ఎంపీగా, కేంద్రమంత్రిగా ఆయన చేసిన సేవలు నిజంగా నభూతో నభవిష్యతి. ఆ సమయంలో ఆయన తన పలుకుబడిని ఉపయోగించి ఎన్నో ప్రాజెక్టులు ఏపీకి వచ్చేలా చేశారు. ఎన్నో పథకాలు ఏపీలో అమలయ్యేలా చేశారు. మా రాష్ట్రానికి నిధులు ఇచ్చి తీరాల్సిందేనని పట్టుబట్టి లక్షల కోట్ల నిధులు మంజూరయ్యేలా చేశారు. బొగ్గు శాఖ సహాయ మంత్రిగా ఆయన ఎంతో ప్రతిభావంతంగా పనిచేశారు. చుట్టూ బొగ్గు వున్నా తాను మాత్రం స్ఫటికంలా మెరిశారు. అయితే ఇంత నిజాయితీపరుడి మీద ఎవరో కుట్ర పన్ని ఆయన్ని అవినీతి కేసులో ఇరికించారు. మల్లెపువ్వులాంటి ఆయనకు బొగ్గు మసి పూశారు. కొంతమంది గిట్టనివాళ్ళు అంటున్నట్టుగా డాక్టర్ దాసరి నారాయణరావు ‘బొగ్గులపులి’ కాదు.. ఆ బొగ్గును కాల్చితే వచ్చే ‘నిప్పు’. ఆయన కూడా ఏదో ఒకరోజు ఒక జయలలితలాగా తనమీద వున్న కేసుల నుంచి బయటపడతారు. తనను తాను నిప్పులాంటి మనిషి అని రుజువు చేసుకుంటారు. తెలుగు ప్రజల హృదయాలలో వెలుగు నింపుతారు.   మరి ఇలాంటి నిజాయితీపరుడైన వ్యక్తి రాజకీయాల్లోకి రాకపోతే... మైగాడ్... ఊహించడానికి కూడా ధైర్యం చాలడం లేదు. అందుకే, అయ్యా దాసరి గారూ, తమరు ఇంకెప్పుడూ రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశానని అనకండి. ఇప్పటికే ఆవేదనతో కుమిలిపోతున్న మా హృదయాలను మరింత ఆవేదనకు గురి చేయకండి. మీలాంటి నాయకులే ఈ దేశానికి ఆదర్శం. మీలాంటి గొప్ప నాయకులే రాబోయే తరాలకు మార్గదర్శకులు. కొన్ని శతాబ్దాల తర్వాత దాసరి నారాయణరావు అనే గొప్ప రాజకీయ నాయకుడు రక్తమాంసాలతో ఈ భూమ్మీద తిరిగాడని చెబితే జనం నమ్మలేనంత గొప్ప రాజకీయ నాయకుడు మీరు. అందుకే మీరు ఇంకా రాజకీయాల్లో కొనసాగాలి. వీలైతే మరోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాలి. అది కూడా బొగ్గు శాఖ మంత్రి అయితే ఈ తెలుగుజాతి మొత్తం ఎంతో సంతోషిస్తుంది.

దావూద్.. ఇక నువ్వు వచ్చేయ్

  హాయ్ దావూద్ ఇబ్రహీం.. ఇప్పుడు నీ గురించి ఇండియాలో ఒకటే చర్చ. మా అధికార, ప్రతిపక్ష పార్టీలో నీ గురించే మాట్లాడుకుంటూ, పోట్లాడుకుంటూ టైమ్ పాస్ చేస్తున్నాయి. నువ్వు అప్పుడెప్పుడో లొంగిపోతానని అంటే, గవర్నమెంటోళ్ళే వద్దులేబ్బా అని నీకు చెప్పారంటగా. ఆ విషయంలో కూడా ఇప్పుడు బాగా రచ్చ రచ్చ జరుగుతోంది. నువ్వు ఎక్కడున్నావో, ఎలావున్నావో, అసలు వున్నావో లేవో ఇండియా గవర్నమెంటోళ్ళకి కూడా తెలియని పరిస్థితి. కాకపోతే హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాత్రం నువ్వు పాకిస్థాన్‌లో వున్నావని డిసైడ్ చేశారు. నిన్ను సాధ్యమైనంత త్వరలో పట్టేసుకుంటామని చెప్పారు. నిన్ను పట్టుకునేవరకూ విశ్రమించనని ప్రకటించేశారు. పాపం పెద్దాయన.. ఆయన ఆరోగ్యం అంతంతమాత్రం. అన్నమాటకు కట్టుబడి ఎక్కువకాలం విశ్రమించకపోతే ఆయన ఆరోగ్యం పూర్తిగా పాడైపోయి ఆ పోస్టు ఖాళీ అయ్యే ప్రమాదం వుంది. అంచేత నువ్వు వెంటనే పట్టుబడిపోయి ఇండియాకి వచ్చేసెయ్. ఏంటీ... నువ్వు పట్టుబడితే జైల్లో వేస్తారని, చంపేస్తారని భయపడుతున్నావా? పిచ్చి దావూదూ... అవన్నీ పాత రోజులు... ఇప్పుడు మన ఇండియాలో పరిస్థితులన్నీ మారిపోయాయ్. అంచేత నువ్వు అలాంటి భయాలేవీ పెట్టుకోకుండా ఇండియాకి వచ్చేసెయ్.   అయినా నువ్వు ఎందుకలా భయపడుతున్నావ్? అసలు నువ్వేం చేశావని? పాపం ఏదో వ్యాపారం చేసుకున్నావ్. దానికి ప్రభుత్వం మాఫియా అని పేరు పెట్టింది. ఓ ఫైన్ మార్నింగ్ ముంబైలో దీపావళి జరుపుకున్నావ్. కాకపోతే నువ్వు పెట్టిన బాంబులతో పాటు జనమూ పేలిపోయారు. అది నీ తప్పు కాదు.. నువ్వు బాంబులు పెట్టించిన చోటకి వచ్చిన జనానిదే తప్పు. నువ్విప్పుడు ఇండియాకి తిరిగి వచ్చేసి ఈ రకంగా వాదించి గెలవొచ్చు. నీ తరఫున వాదించడానికి రామ్ జెఠ్మలానీ లాంటి లాయర్లు మన దగ్గర బోలెడంతమంది వున్నారు. ఒకవేళ పొరపాటుగా నీకు శిక్ష పడినా డోన్ట్ వర్రీ.. ఈ కోర్టు కాకపోతే ఆ కోర్టు... ఆ కోర్టు కాకపోతే మరో కోర్టు... మన దేశంలో కోర్టులకు కొదువ లేదు. న్యాయానికి లోటు లేదు. ఒక కోర్టు ఓ పాతికేళ్ళపాటు నీ కేసులని విచారణ జరిపి నువ్వు నరరూప రాక్షసుడివని డిసైడ్ చేసిందనుకో, మరోకోర్టు రెండ్రోజుల్లోనే నువ్వు శాంతిదూతవి అని తీర్పు ఇచ్చేస్తుంది. కొంతకాలం జైల్లో ఉండాల్సి వచ్చినా కంగారుపడాల్సిన పనేం లేదు. బయటికంటే ఎక్కువ ఫెసిలిటీలు జైల్లోనే వుంటాయి. అంచేత ఇంకేమీ డౌట్లు పెట్టుకోకుండా ఇండియాకి వచ్చేయ్... నిన్ను చూసి కూడా చాలా రోజులైంది.

దేశభద్రత విషయంలో కూడా రాజకీయాలేనా?

  కొన్ని సం.లు సీబీఐలో పనిచేసిన నీరజ్ కుమార్ అనే ఉన్నతాధికారి ముంబై బాంబు ప్రేలుళ్ళ తరువాత దానికి సూత్రధారిగా అనుమానిస్తున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తనకు స్వయంగా ఫోన్ చేసి తనకు రక్షణ కల్పిస్తే లొంగిపోయేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పాడని, కానీ అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వంలో కొందరు రాజకీయ నాయకులు దానికి అడ్డుతగలడంతో దావూద్ ఇబ్రహీంను అరెస్ట్ చేయలేకపోయామని చెప్పడంతో రాజకీయ పార్టీలు గగ్గోలు చేసాయి. అది చూసి ఆయన మాట మార్చి తానెప్పుడు దావూద్ లొంగిపోతాడని చెప్పలేదంటూ బుకాయించారు. ఆ తరువాత హోం శాఖకు చెందిన అధికారి ఒకరు దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో ప్రభుత్వానికి తెలియదని ప్రకటించారు. పాకిస్తాన్ లోనే దావూద్ ఇబ్రహీం తలదాచుకొన్నాడని అతనికి పాకిస్తాన్ ప్రభుత్వమే రక్షణ కల్పిస్తోందని ఇంతవరకు భారత్ వాదిస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం హోం శాఖకు అధికారి చెప్పిన ఆ మాటలు పట్టుకొని దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేడనే సంగతి భారత ప్రభుత్వానికి కూడా తెలుని, ఆ విషయాన్ని ఆ అధికారి మాటలే దృవీకరిస్తున్నాయని, కానీ భారత ప్రభుత్వం ఇంతకాలంగా తమపై అనవసరంగా నిందలు వేస్తోందని విమర్శలు గుప్పించింది. దావూద్ ఎక్కడ ఉన్నడో తమకు తెలియదని చెప్పడంతో మళ్ళీ గగ్గోలు చేయడం మొదలుపెట్టిన విపక్షాలకి పాక్ ప్రభుత్వం చేసిన వాదన మరొక ఆయుధంగా అందడంతో మూకుమ్మడిగా ఎన్డీయే ప్రభుత్వంపై దాడి చేసాయి. ఆ దెబ్బకి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ మాట మార్చక తప్పలేదు. హోం శాఖ మంత్రి రాజ్ నాద్ సింగ్ పార్లమెంటులో సభ్యులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లోనే తలదాచుకొన్నాడనే సంగతి మాకు తెలుసు. ఏదో ఒకరోజు అతనిని భారత్ కు తప్పకుండా రప్పించి తీరుతాము. అవసరమయితే ఇంటర్ పోల్ సహాయం కూడా తీసుకొంటాము” అని అన్నారు. అయితే ఇంతకు ముందు అతను ఎక్కడో ఉన్నాడో తనకు తెలియదన్న ప్రభుత్వం ఇంతలోనే మళ్ళీ ఎందుకు మాట మార్చిందని ప్రతిపక్షాలు నిలదీశాయి.   వారి వాదోపవాదాలను పక్కనబెట్టి ఆలోచిస్తే ఒక విషయం అర్ధమవుతుంది. దావూద్ ఇబ్రహీంతో సహా భారత్ పై దాడి చేసిన ఉగ్రవాదులు అందరూ పాకిస్తాన్ లోనే తలదాచుకొంటున్న సంగతి పార్లమెంటులో కూర్చొన్న వారందరికీ తెలుసు. ముంబైలో అనేక వందల మంది ప్రాణాలు కోల్పోవడానికి కారకుడయిన దావూద్ ఇబ్రహీంని ఏవిధంగా బందించి బోను కెక్కించాలనే తపన కంటే, ఈ అంశాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వాన్ని ఏవిధంగా ఇరుకున పెట్టాలనే తపనే ప్రతిపక్షాలలో కనబడుతోంది. ఇక అధికార పార్టీ కూడా వారి భారి నుండి ఏవిధంగా తప్పించుకోవాలా అనే ఆరాటమే కనబడుతోంది. దేశభద్రతకు సంబంధించిన విషయంలో కూడా మన రాజకీయ పార్టీలు ఈవిధమయిన రాజకీయాలు చేస్తుంటాయి గనుకనే ఉగ్రవాదులు మన ఇరుగుపొరుగు దేశాలలోనే దర్జాగా, నిశ్చింతగా జీవించగలుగుతున్నారు.

చిరంజీవి 150 సినిమా చేస్తే మరి ప్రజలు, కాంగ్రెస్ సంగతి?

  ఇప్పడు అందరూ చిరంజీవి 150 సినిమా గురించే మాట్లాడుకొంటున్నారు. ఇక ఆయన అభిమానుల ఆనందానికి హద్దే లేదు. ఆ సినిమా గురించి ట్వీటర్, ఫేస్ బుక్ వంటి సామాజిక వెబ్ సైట్లలో చాలా జోరుగా చర్చలు సాగుతున్నాయి. మీడియాలో కూడా అదే చర్చ. కానీ ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఉంటూ రాష్ట్రాభివృద్ధి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన పూర్తి సమయం వెచ్చించకుండా ఈవిధంగా సినిమాలు చేసుకోవడం ఎంత వరకు సమంజసం? ఈ ప్రశ్న ఆయన వంటి పార్ట్ –టైం రాజకీయ హీరోలందరికీ కూడా వర్తిస్తుంది. ఆయన అసలు రాజకీయాలలోకి రాకుండా సినీ పరిశ్రమలోనే కొనసాగుతూ ఆ సినిమాను తీస్తున్నట్లయితే ఆయనను ఎవరూ వేలెత్తి చూపే అవకాశం ఉండేది కాదు. లేదా తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసి సినిమాలు చేసుకొన్నా ఎవరూ అడిగేవారు కాదు.     తమ సినిమాలలో ప్రజల సంక్షేమం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసి కాశీకి వెళ్ళిపోగల చిరంజీవి, ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నిజంగానే చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన రాష్ట్రం కోసం, ప్రజల కోసం తన సినిమాలు త్యాగం చేయలేరా? రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రం అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. రాష్ట్రం మళ్ళీ నిలద్రోక్కుకొని లేచి నిలబడాలంటే కేంద్రం సహాయ సహకారాలు చాలా అవసరం. కానీ ప్రత్యేక హోదా, రైల్వే జోన్, వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు వంటి కొన్ని అంశాలలో చాలా జాప్యం జరుగుతోంది. కనుక రాష్ట్రానికి చెందిన ప్రతీ ఒక్క యంపీ కూడా పార్టీలకి అతీతంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలి. కానీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న చిరంజీవి ఏదో మొక్కుబడిగా పార్లమెంటు సమావేశాలలో పాల్గొనడమే తప్ప ఏనాడు వాటి గురించి కేంద్రాన్ని అడిగింది లేదు. కనీసం సమావేశాలకు హాజరయిందీ లేదు. ఎందుకంటే ఆయన తన 150 సినిమా నిర్మాణం గురించి చాలా బిజీగా ఉన్నారు.   పార్లమెంటుకి వెళ్లి ప్రత్యేక హోదా గురించి లేదా రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టుల గురించి ఆయన మాట్లాడక పోయినా కాంగ్రెస్ పార్టీ ‘ప్రత్యేక హోదా’ కోసం గుంటూరులో చేసిన ఒక్కరోజు దీక్షకు మాత్రం ఎందుకో హాజరయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా లభించే అన్ని సౌకర్యాలను నిరభ్యంతరంగా వాడుకొంటున్న చిరంజీవి మరి ప్రజా ప్రతినిధిగా తన విధులను ఎందుకు నిర్వర్తించడం లేదు? అని ప్రశ్నిస్తే ఆయన వీరాభిమానులకు చాలా కోపం రావచ్చును. ఇంతకు ముందు సినిమాలు మాత్రమే చేసుకొంటున్నప్పుడు ఆయనను ఎవరూ ఇటువంటి ప్రశ్న అడగలేదు. కానీ ఆయన ఇప్పుడు ఒక బాధ్యత గల ప్రజా ప్రతినిధిగా జీతభత్యాలు, సకల సౌకర్యాలు పొందుతున్నప్పుడు ఆయనకు ఇటువంటి ప్రశ్నలు ఎప్పుడో అప్పుడు ఎదురవుతూనే ఉంటాయి.   ఆయన ఒక ప్రజా ప్రతినిధిగా రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయకపోయినా, రాజకీయాలలో తనకీ స్థాయి కల్పించిన కాంగ్రెస్ పార్టీ ఋణం తీర్చుకొని ఉన్నా బాగుండేది. కానీ కాంగ్రెస్ పార్టీ చాలా కష్టకాలంలో ఉన్న ఈ సమయంలో దానిని గాలికి వదిలి తన 150 సినిమా చేసుకొంటున్నారు. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీలో ఆయన వంటి అత్యంత ప్రజాధారణ కలిగిన వ్యక్తి మరొకరు కనబడకపోవడంతో పార్టీ అధిష్టానం ఆయనకే ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయిందనే సంగతి పక్కన పెడితే, ఎన్నికలలో ఓడిపోయిన తరువాత చాలా దయనీయంగా మారిన తన పార్టీని కాపాడుకోవడానికి ఆయన ప్రయత్నించకుండా తన 150వ సినిమా చేసుకోవడానికి వెళ్ళిపోయారు.   ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కానీ, కేంద్రంలో గానీ అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే అప్పుడు కూడా ఆయన పార్టీని ఇదేవిధంగా వదిలిపెట్టి ఉండేవారా? అని కాంగ్రెస్ శ్రేణులే ప్రశ్నిస్తున్నాయి. కనుక ఆయన ఒకవేళ మళ్ళీ సినిమాలలో నటించదలచుకొంటే రాజకీయాలకు స్వస్తి పలికితే మంచిది. లేదా రాజకీయాలలో కొనసాగాలనుకొంటే, తన పూర్తి సమయం ప్రజా సేవకే వినియోగించినా అందరూ హర్షిస్తారు. కానీ ఈవిధంగా పార్ట్-టైం ప్రజాసేవ వలన ఇటువంటి విమర్శలకు తావిచ్చినట్లవుతుంది.

కడియం మోచేతి నీటి సిద్ధాంతం

  ఆంధ్రావారి మోచేతి నీటిని తాగుతున్నారంటూ టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ టీడీపీ నాయకులను విమర్శిస్తూ వుంటారు. అయితే అలా విమర్శిస్తున్న వారు కూడా గతంలో ఆంధ్రావారి మోచేతి నీటిని తాగినవారేనని టీటీడీపీ నాయకులు ప్రతి విమర్శలు చేస్తూ వుంటారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈమధ్యకాలంలో తరచుగా ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ వుంటారన్న విషయం తెలిసిందే. అయితే సమయం సందర్భం లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ వుండటమే ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. మొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీలో అనేక హోదాలు, పదవులు అనుభవించిన కడియం శ్రీహరి ఇప్పుడు టీఆర్ఎ‌స్‌లో వుండేసరికి టీడీపీ ఆంధ్రాపార్టీ అయిపోయింది. పార్టీ కార్యక్రమాలతోపాటు అధికార కార్యక్రమాలలో కూడా కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీలో ఉన్నవారిని విమర్శిస్తున్నారు. ఇటీవల వరంగల్ జిల్లాలో జరిగిన అధికార కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు కడియం శ్రీహరి, టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు పాల్గొన్నారు. ఆ వేదిక మీద శ్రీహరి ఆంధ్రా పార్టీ మోచేతి నీళ్ళు అనే పాత పాట పాడటం మొదలుపెట్టారు. దాంతో తిక్కరేగిన ఎర్రబెల్లి దయాకరరావు కడియం శ్రీహరిని ఒక్క దులుపు దులపడంతో ఆయన గప్‌చుప్ అయిపోవాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీని, ఆంధ్రప్రదేశ్‌ని ఇంతలా విమర్శించే కడియం శ్రీహరి మొన్నీమధ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తెలంగాణలోని రేయాన్స్ ఫ్యాక్టరీకి అవసరమైన ముడిసరుకును ఆంధ్రప్రదేశ్ నుంచి అందించాలని, అది కూడా 50 శాతం సబ్సిడీతో ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. మరి ఆంధ్రావారి మోచేతి నీళ్ళు తాగడానికి ప్రయత్నిస్తోంది కడియం శ్రీహరే కదా అని తెలంగాణ టీడీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి.

ఉద్యమిస్తే ఉరికించి కొడతారు

  తెలంగాణ రాష్ట్రంలో ఈమధ్యకాలంలో ఉద్యమాల గొడవ ఎక్కువైపోయింది. ఉద్యమాల కారణంగానే తెలంగాణ వచ్చింది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉద్యమాలేంటి? అందుకే భవిష్యత్తులో తెలంగాణలో ఉద్యమాల ఊసే లేకుండా చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది. ఉద్యమాల ఊసెత్తిన వాళ్ళని ఉరికించి కొట్టడానికి అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఇటీవలి కాలంలో విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు... ఇలా అన్ని వర్గాల వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. ధర్నాలు, ర్యాలీలు, నినాదాలతో రాష్ట్రాన్ని హోరెత్తిస్తున్నారు. ఇది సహజంగానే ప్రభుత్వానికి చిరాకు తెప్పిస్తున్నాయి. అందుకే ఇలాంటి ఉద్యమాలను అణిచేసే మార్గంలో తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈమధ్య తెలంగాణ రాష్ట్రానికి నాలుగు ఇండియన్ రిజర్వ్ పోలీసు బెటాలియన్లను కేంద్రం కేటాయించింది.ఈ నాలుగు బెటాలియన్ల సేవలను పది జిల్లాల్లో ఉద్యమం పేరుతో నిరసన కార్యక్రమాలను చేపట్టేవారిని అదుపు చేయడానికి వినియోగించనున్నట్టు తెలుస్తోంది. ఎవరు ఎలాంటి ఉద్యమం చేసినా వారిని అణచివేయడానికి పోలీసు యంత్రాంగానికి ఫుల్ పవర్స్ ఇవ్వాలని నిర్ణయించారట. అలాగే పోలీసులకు ఆధునిక ఆయుధాలు, లాఠీలు, వైర్‌లెస్ సెట్లు, వాహనాలను అందించాలని కూడా నిర్ణయించారట. అంటే ఇకమీద ఉద్యమాలు చేస్తూ రోడ్డు మీదకి ఎక్కేవారిని పోలీసులు ఉరికించి కొట్టడం ఖాయమన్నమాట. అంచేత ఉద్యమకారులూ... జర సోచాయించుకోండి.

జయమ్మా... నీకు తిరుగే లేదు...

అమ్మా జయలలితమ్మా... జాతకమంటే నీదేనమ్మా... సినిమా రంగంలో నీకు ఎలాగూ తిరుగులేకుండా హవా నడిపించావు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా నువ్వు హవా నడిపిస్తున్నావమ్మా. నిన్ను మొట్టమొదట ‘పురచ్చితలైవి’ (విప్లవ నాయకి) అన్నవాడెవడో గాని వాడికి వందనాలమ్మా. ఎంజీఆర్ తర్వాత ఎవరా అని అనుకుంటున్న సమయంలో కొంతకాలం అన్నా డీఎంకేకి దూరంగా వున్నప్పటికీ ఆ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టావు. తమిళనాడు రాజకీయాల్లో ఎంజీఆర్, కరుణానిధి తర్వాత ఆ స్థాయిని పొందావు. తమిళనాడు అసెంబ్లీలో అవమానానికి గురైనా ఎంతమాత్రం అదరకుండా బెదరకుండా నీ లక్ష్యం వైపు  దూసుకెళ్ళావు. రాజకీయాల్లో కాకలు తీరిన కరుణానిధి లాంటి యోధుడినే మట్టి కరిపించి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఫిక్సయిపోయావు. నీమీద ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా వాటిని ఎంతమాత్రం పట్టించుకోకుండా విజయపథంలో నడుస్తున్నావు. ప్రజల్ని ఆకట్టుకోవాలంటే నీ తర్వాతే ఎవరైనా. ప్రజలకు గిఫ్టులిస్తావు.. ముఖ్యమంత్రి పదవిని గిఫ్టుగా పొందుతూ వుంటావు. ఒకప్పుడు దేశ రాజకీయాలనే శాశించిన మహిళా శక్తివి నీవమ్మా. వాజ్‌పాయ్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన శక్తి స్వరూపిణి నీవమ్మా. అక్రమాస్తుల కేసులో మొన్నామధ్య నీకు శిక్ష పడినప్పుడు నువ్వు ఎమ్మెల్యే పదవిని, ముఖ్యమంత్రి పదవిని వదులకున్నావు. అప్పుడు అందరూ నీ పని అయిపోయిందని అనుకున్నారు. కానీ బూడిదలోంచి పైకి లేచే ఫినీక్స్ పక్షి తరహాలోనే ఎంత గొప్పగా ఆ కేసులోంచి పడ్డావో చూశాక నీకు నువ్వే సాటి అని, ఇక నీకు తిరిగేలేదని అర్థమైపోయిందమ్మా. మరోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్న నీకు అభినందనలు జయమ్మా.

మనవి భలే కోర్టులు

  మొత్తానికి మన దేశంలో కోర్టులు భలే కోర్టులు. ఒక్కోసారి సంవత్సరాలకు సంవత్సరాలు కేసులు విచారిస్తాయి. ఒక్కోసారి లటుక్కుమని తీర్పులు ఇచ్చేస్తాయి. దీనికి సంబంధించిన జ్ఞానం లేనివారికి జ్ఞానోదయం కలిగే విధంగా తాజాగా రెండు తీర్పులు వెలువడ్డాయి. ఒకటి సల్మాన్ ఖాన్ కేసు. మరోటి జయలలిత కేసు. సల్మాన్ ఖాన్ తాగి డ్రైవ్ చేసి ఒకర్ని చంపేశాడనే కేసు, జయలలిత అక్రమాస్తుల కేసు దశాబ్దాల తరబడి విచారణ జరిగి సెషన్స్ కోర్టులు ఇద్దరినీ దోషులుగా నిర్ధారించాయి. అటు ముంబై హై కోర్టు, ఇటు కర్నాటక హైకోర్టు ఇద్దరికీ సపోర్టుగా నిలిచాయి. సల్మాన్ ఖాన్ కేసు విచారణ జరిగా జరగలేదని ముంబై హైకోర్టు ఒక్క రోజులో చెప్పేసింది. మళ్ళీ విచారణ జరగాల్సిన అవసరం వుందని చెప్పి ఇక ఈ కేసు తేలిపోయినట్టేనని చెప్పకనే చెప్పేసింది. ఇక జయలలిత తన ఎమ్మెల్యే పదవిని, ముఖ్యమంత్రి పదవిని వదులుకునేలా సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే నాలుగైదు నెలల్లోనే పెద్దగా విచారణ ఏమీ జరగకుండానే కర్ణాటక హైకోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించేసింది. వీళ్ళిద్దరినీ దోషులుగా తేల్చడానికి సెషన్స్ కోర్టులకు దశాబ్దాల తరబడి పడితే, గౌరవనీయమైన హైకోర్టులు మాత్రం రోజుల్లోనే వీరిని నిర్దోషులుగా తేల్చేశాయి. ఇంత గొప్పగా పనితీరును కనబరుస్తున్న హైకోర్టులకు వందనం, అభివందనం. ఇలాంటి భలే కోర్టులు మన దేశంలో వున్నందుకు దేశ పౌరులుగా మనం గర్వించాలి.

ఇది ప్రతిపక్షం కాదు.. అతిపక్షం

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్నది ప్రతిపక్షం అని చెప్పడానికి ఎంతమాత్రం అర్హత కనిపించడం లేదు. అతిపక్షం అనే మాట ఇప్పుడున్న ప్రతిపక్షానికి అతికినట్టు సరిపోతుంది. నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షం విధ్వంసాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రతి చిన్న విషయాన్ని కోతి పుండును బ్రహ్మరాక్షసిలా చేసే విధంగా సొంత మీడియాతో నానాయాగీ చేస్తున్న ప్రతిపక్ష నాయకుడి విధానంలో బోలెడంత అతి కనిపిస్తోంది. అందుకనే పై మాట వాడాల్సి వచ్చింది. రాజధాని భూముల విషయంలో, ప్రాజెక్టుల విషయంలో, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష నేత వ్యవహరించిన అతిపక్ష తీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చిరాకు తెప్పించింది. ఏపీ ప్రజలకు ఇప్పటి వరకు ఎన్నో ప్రతిపక్షాలను చూశారు. కానీ ఇప్పుడున్న తరహా ప్రతిపక్షాన్ని మాత్రం ఇంతవరకు ఏపీ ప్రజలు మాత్రమే కాదు.. దేశంలోని ఏరాష్ట్రంలోనూ ఎవరూ చూసి వుండరని చెప్పుకుంటే అతిశయోక్తి కాదు. గతంలో విషయాలు అలా వుంటే, ఇప్పుడు ఆర్టీసీ సమ్మె సందర్భంగా సదరు అతిపక్ష నాయకుడు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా వుంది. ఆర్టీసీ ఉద్యోగులు ఆచరణ సాధ్యం కాని కోర్కెలతో సమ్మె చేస్తుంటే ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రజల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని అయినా సమ్మెను వ్యతిరేకించినట్టయితే ఓ పద్ధతిగా వుండేది. అయితే సదరు అతిపక్ష నాయకుడు మాత్రం సమ్మెకు మద్దతు ప్రకటించడం దారుణం. అంటే ప్రజలు ఇబ్బంది పడటాన్ని ఆయన సమర్థిస్తున్నారన్నమాట. ఆయన సొంత మీడియా కూడా సమ్మె ప్రభుత్వ తప్పు అన్నట్టుగా కలరింగ్ ఇస్తూ కథనాలు ఇస్తోంది. మొత్తమ్మీద ఈ అతిపక్ష తీరును ప్రజలు చీదరించుకుంటున్నారు.

ఇది చదివితే మీకు నిద్రపట్టకపోవచ్చు...

మీరు మీ ఇంట్లో గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోతున్నారా? అయితే ఈ వాస్తవాలు చదివిన తర్వాత మీకు నిద్రపట్టకపోవచ్చు. మనం గుండెల మీద చేతులు వేసుకుని హాయిగా నిద్రపోగలుగుతున్నామంటే ప్రధాన కారణం సరిహద్దుల్లో నిరంతరం పహారా కాస్తూ వుండే మన సైనికులే. అయితే మారిన పరిస్థితుల్లో వారి పహారా మనకు ఎంతవరకు రక్షణ కల్పిస్తుందో చెప్పలేని పరిస్థితి. ఈ విషయంలో మన సైనికుల శక్తి సామర్థ్యాల విషయంలో మనం ఎలాంటి సందేహాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. వారి దగ్గర వున్న ఆయుధ సంపత్తి విషయంలోనే మనం భయపడాల్సి వస్తోంది. ఇప్పటికప్పుడు ఏ శత్రుదేశమో మన సరిహద్దులను దాటడానికి భారీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తే, మన సైనికులు వారిని కేవలం 10 రోజులు మాత్రమే నిలువరించగలరు. ఆ తర్వాత చేతులు ఎత్తేయడం మినహా వారు చేయగలింది ఏమీ వుండదు. గతంలో అయితే 40 రోజులపాటు ఏకధాటిగా యుద్ధం చేయడానికి సరిపడే ఆయుధ సామగ్రి సరిహద్దుల్లో సైనికుల దగ్గర వుండేది... ఇప్పుడు ఆ ఆయుధాల నిల్వ సామర్థ్యం 10 రోజులకు పడిపోయింది. ఈ విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వెలుగులోకి తెచ్చింది. ఈ సమస్య భారత సైనికులను 1999 నుంచి వేధిస్తోంది. మందుగుండు నిల్వలను పెంచుకోవాలని అప్పటి నుంచి సైన్యం ప్రయత్నిస్తున్నా ఇప్పటి వరకు సైన్యానికి పూర్తిస్థాయి నిల్వలు సమకూరలేదు. ఇంతే కాకుండా, ఇప్పుడు మన సైన్యం దగ్గర ఉన్న చాలా ఆయుధాలు ఔట్ డేటెడ్ అయిపోయాయి. వాటిని ప్రస్తుతం ఉపయోగించే పరిస్థితులు లేవు. అలాగే అనేక ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పేల్చడానికి ఉపయోగించే పరికరాలు రిపేరుకు వచ్చాయి. వేల కోట్ల రూపాయల ఖరీదైన ఈ పరికరాలకు రిపేర్ చేయించకపోవడం వల్ల అవన్నీ మూలన పడి వున్నాయి. ఇండియన్ ఆర్మీలో వున్న ఇలాంటి పరిస్థితులను తక్షణం సరిదిద్దాల్సిన అవసరం వుందని కాగ్ సూచించింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం హాయిగా నిద్రపోగలమా?

మావోలకి మోడీ సందేశం వేస్ట్

మావోయిస్టుల సిద్ధాంతానికి, రాజకీయ నాయకుల సిద్ధాంతానికి చాలా తేడా, దూరం వున్నాయి. ఈ రెండు వ్యవస్థలూ ఎప్పటికీ కలవని రైలు పట్టాల్లాంటివి.ఈ విషయం గతంలో ఎన్నోసార్లు రుజువైంది. మావోయిస్టులను జన జీవన స్రవంతిలో కలవాలని ఎన్నో వందలమంది రాజకీయ నాయకులు పిలుపులు ఇచ్చారు. ఏవేవో ఆశలు చూపించారు. అయితే అవి ఎప్పుడూ సత్ఫలితాన్ని ఇవ్వలేదు. చివరికి కొన్ని సందర్భాలలో మావోయిస్టులు ఆయుధాలని వదలాలని అనుకుంటే, అవి వారికే బెడిసికొట్టి భారీ నష్టాలను మిగిల్చాయి. మొత్తమ్మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో మావోయిస్టులు - రాజకీయ నాయకులకు సయోధ్య కుదిరే అవకాశమే లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఈ విషయం తెలియదని అనుకోలేం. అయితే ఆయన ఛత్తీస్‌గఢ్ పర్యటన సందర్భంగా మావోయిస్టులు ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని పిలుపు ఇచ్చారు. ఆయన పిలుపు అయితే ఇచ్చారుగానీ, ఆ పిలుపు ఫలించడం మాత్రం కలలో మాట. మావోయిస్టులకు ప్రథమ శత్రువులు రాజకీయ నాయకులు. అలాంటి నాయకులుచెప్పిన మాటలు విని మావోయిస్టులు తుపాకులను వదిలేసే ప్రసక్తే వుండదు. వారు తుపాకులు వదిలేసి, ప్రభుత్వాలతో చర్చలు జరిపిన ప్రతిసారీ నష్టపోతూనే వచ్చారు. ఏపీ విషయానికి వస్తే,  అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పిలుపు మేరకు తుపాకులు విడిచిపెట్టి చర్చలకు వచ్చిన మావోయిస్టులు ఘోరంగా దెబ్బతిన్నారు. ఏపీలో మావోయిస్టులు దాదాపుగా తుడిచిపెట్టుకుని పోవడానికి ఆ సందర్భం ముఖ్య కారణంగా మారింది. ఇలాంటి పాఠాలు గతంలో కూడా మావోయిస్టులు నేర్చుకున్నారు. అందుకే మరోసారి అలాంటి పొరపాటు చేయరు. రాజకీయ, మావోయిస్టు వ్యవస్థల మధ్య నిరంతర ఘర్షణ అలా కొనసాగాల్సిందే. మోడీ ఛత్తీస్‌గఢ్ పర్యటనను పురస్కరించుకుని 250 మందిని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఒకరిని చంపేశారు. అదృష్టం బాగుండి కిడ్నాప్ చేసిన మిగతా వారిని విడిచిపెట్టేశారు. ఇలా ప్రభుత్వాలకు సవాల్ విసురుతున్న మావోయిస్టులకు మోడీగారు శాంతిపాఠాలు నేర్పించే ప్రయత్నాలు చేయడం, శాంతి సందేశాలు ఇవ్వడం వేస్ట్.

ఎన్నికలంటే టీఆర్ఎస్‌కి భయమా?

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉప ఎన్నికలంటే, జీహెచ్ఎంసీ ఎన్నికలంటే టీఆర్ఎస్ భయపడుతోందా? ఠాఠ్... అలాంటిదేమీ లేదు... టీఆర్ఎస్ పాలన చూసి ప్రజలు మురిసిపోయి ముగ్ధులైపోతున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం తమ పూర్వ జన్మ సుకృతమని ప్రజలు భావిస్తున్నారు. ఏ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్‌‌ని గెలిపించేస్తారు అని టీఆర్ఎస్ నాయకులు పైకి చెబుతూ వుండొచ్చుగానీ, వాస్తవ పరిస్థితి వారు చెబుతున్నట్టుగా లేదని, అందుకే ఉప ఎన్నికలకు, జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం కావడానికి టీఆర్ఎస్ వెనుకడుగు వేస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతోపాటు పలు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలను టీఆర్ఎస్ ఎదుర్కోవలసి వుంది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు హైదరాబాద్‌లో ఎక్కువగా వుండటం వల్ల ఇక్కడ టీఆర్ఎస్ విజయం అంత సులభం కాదు. అయినప్పటికీ ఆక్రమించుకున్న స్థలాలను క్రమబద్ధీకరించడం, ముస్లింలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేయడం, ఎంఐఎంతో దోస్తీ చేయడం తమకు ఉపయోగపడుతుందని టీఆర్ఎస్ నేతలు పైకి చెబుతున్నప్పటికీ  లోపల ఏవో సందేహాలు వారిని పీడిస్తున్నాయి. సీమాంధ్రులను దువ్వే ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించిన దాఖలాలు కనిపించడం లేదు. అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వెనుకాడుతూ వచ్చింది. అయితే కోర్టు ఆదేశాల కారణంగా ఎన్నికలు జరపక తప్పని పరిస్థితి వచ్చింది. అలాగే టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి చేరిన తలసాని వంటి ఎమ్మెల్యేలు, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కడియం శ్రీహరి కూడా తన ఎంపీ స్థానానికి  రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాల్సి వుంది. అలాగే కడియం రాజీనామా చేసిన ఎంపీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరపాల్సి వుంది. అలాగే అవసరమైతే టీఆర్ఎస్‌లో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేల స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరపాల్సి వుంటుంది. ఈ ఎన్నికలలో ఏ స్థానంలో అయినా టీఆర్ఎస్ ఓడిపోయిన పక్షంలో అది టీఆర్ఎస్‌కి షాక్ ఇచ్చే అవకాశం వుంది. అందుకే అసలు ఉప ఎన్నికలు జరగకుండా తప్పించుకునే మార్గాలను టీఆర్ఎస్ అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ చూస్తుంటే ఎన్నికలంటే టీఆర్ఎస్ భయపడుతోందని భావించాల్సి వస్తోందని పరిశీలకులు అంటున్నారు.