Read more!

జగన్‌ ఖేల్ ఖతమయ్యేదే.. జస్ట్ మిస్....



పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులకు ఎలా ఆటంకం కలిగించాలా ఆన్న ఆలోచనలో ప్రస్తుతం  వైసీపీ అధినేత జగన్ వున్నారు. దానికోసం తన శాయశక్తులా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రాజెక్టులు నిర్మిస్తున్న ప్రాంతంలోని ప్రజల మనసుల్లో విషం నింపే ప్రయత్నాన్ని మొదలెట్టారు. దానికోసం ప్రాజెక్టుల యాత్రని చేపట్టారు. అయితే మంగళవారం నాడు వైసీపీలో జరగాల్సిన పరిణామాలు చివరి క్షణంలో ఆగిపోయాయి. ఆ పరిణామాలే కనుక జరిగి వుంటే, జగన్ పొలిటికల్ ఖేల్ ఖతమ్ అయిపోయి వుండేది. అప్పుడాయన ప్రాజెక్టుల యాత్రని పక్కన పెట్టి, రాజకీయ పతన యాత్రని  చేయాల్సి వచ్చేది. అసలింతకీ చివరి క్షణంలో ఆగిపోయిన ఆ పరిణామాలేంటి?

జగన్ వ్యవహార శైలి ఆ పార్టీలో వున్న ఎమ్మెల్యేలకు మొదట్నుంచీ నచ్చడం లేదు. జగన్ నుంచి దూరంగా పారిపోవాలన్న ఆలోచనలు ఎమ్మెల్యేలలో ఎప్పటి నుంచో వున్నాయి. ఈమధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విషయంలో జగన్ అనుసరిస్తున్న వైఖరి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేస్తు్న్న అడ్డగోలు పోరాటం చాలామంది ఎమ్మెల్యేలకు ఎంతమాత్రం నచ్చడం లేదు. పార్టీ ఎమ్మెల్యేలుగా వున్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితిల్లో జగన్‌ వెనుక నిలబడి అరుస్తున్నారు అంతే! ఇటీవలి కాలంలో పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల విషయంలో జగన్ తీరు వారికి ఎంతమాత్రం మింగుడు పడటం లేదు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ప్రాజెక్టుల విషయంలో జగన్ వైఖరిని బాహాటంగానే ఖండించారు. జగన్ వ్యవహారశైలితోపాటు, ఎప్పుడు జైలుకు వెళ్తాడో తెలియని వ్యక్తి నాయకత్వంలో పనిచేయడం చాలామంది ఎమ్మెల్యేలకు ఇబ్బందిగానే వుంది. వైసీపీ నుంచి విముక్తి లభించే ముహూర్తం ఎప్పుడొస్తుందా అని వారంతా ఎదురుచూస్తున్నారు.

ఆ దివ్యమైన ముహూర్తం మంగళవారం నాడు రానే వచ్చింది. మంగళవారం నాడు జగన్ ప్రాజెక్టుల వ్యతిరేక యాత్ర కోసం బస్సు ఎక్కి వెళ్ళగానే, వైసీపీకి మంగళం పలుకుదామని 40 మంది ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. జగన్ బస్సు యాత్రకి సన్నాహాలు చేసుకుంటూ వుంటే, ఈ 40 మంది ఎమ్మెల్యేలు పార్టీనుంచి బయటకి వెళ్ళిపోయే సన్నాహాలు ముమ్మరం చేసుకున్నారు. జగన్ అలా బస్సు ఎక్కగానే ఇలా పార్టీని చీల్చేసే ఏర్పాట్లు చేసుకున్నారు. వైసీపీకి ఉన్న మెజారిటీలో సగానికి పైగా వున్న ఈ 40 మంది జగన్‌కి జలక్‌ ఇచ్చారంటే అది జగన్‌కి రాజకీయంగా పెద్ద షాక్. ఆయన పెట్టిన పార్టీ ఆయన చేతుల్లోంచి జారిపోయే అవకాశాలు కూడా వున్నాయి.

తమ పార్టీ ఎమ్మెల్యేలు 40 మంది తనకు షాక్ ఇవ్వబోతున్నారన్న విషయం ఎలా తెలిసిందోగానీ జగన్‌కి తెలిసింది. దాంతో ఆందోళనకు గురైన ఆయన ఆ ఎమ్మెల్యేలతో టచ్‌‌లోకి వచ్చే ప్రయత్నం చేశాడు. అయితే వాళ్ళు తమకు జగన్ని కలిసే ఉద్దేశం లేదని, పార్టీని చీల్చడం ఖాయమని సంకేతాలు ఇచ్చారు. దాంతో జగన్ ఆపద్బంధువు వైవీ సుబ్బారెడ్డి రంగంలోకి దిగి 40 మంది ఎమ్మెల్యేల కాళ్ళూ గడ్డాలూ పట్టుకుని జగన్‌కి వారికి భేటీని ఏర్పాటు చేశారు. ఆ భేటీలో జగన్ వాళ్ళని ప్రాధేయపడిన తీరు చూస్తే శత్రువులకు కూడా కన్నీరు వచ్చేదట. ఆ స్థాయిలో బతిమాలడంతో ఆ 40 మంది ఎమ్మెల్యేలు శాంతించి తమ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటున్నామని చెప్పారట. మీరు తలపెట్టిన ప్రాజెక్టుల యాత్ర పూర్తి చేసుకుని రండి... మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అన్నారట. అప్పటికీ జగన్‌కి భయం తగ్గలేదు. తాను అలా బస్సు ఎక్కి వెళ్ళగానే, ఇక్కడ వీళ్ళు ఇలా ప్లేటు ఫిరాయిస్తే ఎలా అనే సందేహం ఆయన్ని పీడించింది. దాంతో ఆ 40 మంది ఎమ్మెల్యేలు కూడా తనతోపాటు ప్రాజెక్టుల యాత్రకి రావాల్సిందేనని బతిమాలి ఒప్పించాడట. ఇలా జగన్‌కి ప్రస్తుతానికి ఒక గండం గడిచింది. వైసీపీలో బద్దలు కాబోయే అగ్ని పర్వతం ప్రస్తుతానికి శాంతించింది. ఆ అగ్నిపర్వతం ఎప్పటికైనా బద్దలయ్యేదే!