Read more!

తెరాస ప్రభుత్వంపై వైకాపా విమర్శలు!!!

 

రాష్ట్ర విభజన తరువాత నుండి నేటి వరకు ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల మధ్య ప్రభుత్వాల మధ్య అనేక సమస్యలు, గొడవలు తలెత్తాయి. కానీ ఏనాడు కూడా వైకాపా ఏ అంశం మీద గట్టిగా స్పందించిన దాఖలాలు లేవు. పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెరాస అనధికార ప్రతినిధిగా వ్యవహరిస్తోంది. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు గుప్పిస్తూ ఏదో ఒక అంశం తీసుకొని ధర్నాలు, బస్సు యాత్రలు చేసే వైకాపా ఏనాడు కూడా ఆంద్రప్రదేశ్ ప్రయోజనాల కోసం తెలంగాణా ప్రభుత్వాన్ని నిలదీయలేదు. అందుకు కారణం ఆ రెండు పార్టీల మధ్య ఎవరికీ అర్ధం కాని అనిర్వచనీయమయిన అనుబంధమే. బహుశః ఆ రెండు పార్టీల ఉమ్మడి శత్రువు తెదేపా దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కారణంగానే తూర్పు పడమర వంటి ఆ రెండు పార్టీలు దగ్గరయ్యాయో లేక ఇంకేమయినా బలమయిన కారణాలున్నాయో వారే చెప్పాలి.

 

అయితే ఇంతవరకు ఆ రెండు పార్టీలు ఒకదానినొకటి విమర్శించుకోకుండా చాలా జాగ్రత్తగా రైలు పట్టాల మాదిరిగా సమాన దూరం పాటిస్తు పయనిస్తున్నాయి. కానీ ఇప్పుడు వైకాపా తిరిగి తెలంగాణా రాష్ట్రంలో పునః ప్రవేశం చేయాలనుకోవడంతో అధికార తెరాసపై బాణాలు ఎక్కుపెట్టక తప్పడం లేదు. నిన్న ఇల్లెందులో జరిగిన వైకాపా కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలంగాణా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు.

 

తెరాస పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను, రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అమలుచేస్తున్న తెలంగాణా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో కలిసి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

 

అయితే ఆయన చేస్తున్న ఈ విమర్శలు తెలంగాణాలో మళ్ళీ పార్టీ ఉనికిని చాటుకొనేందుకా లేక త్వరలో జరుగబోయే జి.హెచ్.యం.సి. ఎన్నికలలో హైదరాబాద్ జంట నగరాలలో స్థిరపడిన ఆంధ్రా ప్రజలను బుట్టలో వేసుకోవడానికా అనేది ఎన్నికల తరువాత గానీ తెలియదు.

 

పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ అధికార దాహంతోనే కొంతమంది నేతలు పార్టీని వీడిపోయారని ఆరోపించారు. కానీ కొండా సురేఖ వంటి అనేకమంది తెలంగాణా నేతలు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతోనే ఆయన మరణించిన తరువాత తమ పదవులు, అధికారం అన్నీ వదులుకొని వైకాపాలో చేరారు. రాష్ట్ర విభజన కోసం తెలంగాణాలో చాలా ఉదృతంగా ఉద్యమాలు జరుగుతున్న సమయంలో కూడా వారు వైకాపానే అంటిపెట్టుకొని ఉన్నారు తప్ప పార్టీ మారాలనుకోలేదు. కానీ ‘మడమ తిప్పను మాట తప్పను’ అని నిత్యం గొప్పలు చెప్పుకొనే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విభజన జరుగబోతోందనే విషయం పసిగట్టి తననే నమ్ముకొని వచ్చిన వారినందరినీ నడిరోడ్డు మీద వదిలేసి రాత్రికి తెలంగాణానుండి జంప్ అయిపోయారు. తీవ్ర వ్యతిరేక పరిస్థితులలో తెలంగాణాలో వైకాపాను బలోపేతం చేసిన కొండా సురేఖ వంటి అత్యంత విశ్వసనీయులకే హ్యాండిచ్చిన జగన్మోహన్ రెడ్డి రేపు పొంగులేటి వంటి మిగిలిన నేతలకి హ్యాండివ్వకుండా ఉంటారా? అని ఎవరికయినా సందేహం కలుగకమానదు.

 

ఈరోజు పొంగులేటి వంటి నేతలు తెలంగాణాలో వైకాపాను బలోపేతం చేసుకొనేందుకు తెరాస ప్రభుత్వాన్ని విమర్శించవచ్చును. కానీ రేపు జి.హెచ్.యం.సి. ఎన్నికలు ముగిసిన తరువాత మళ్ళీ అదే తెరాసతో అంటుకడదామని జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే అప్పుడు వారి పరిస్థితి ఏమిటి?అని వారే ఆలోచించుకోవలసి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.