పెట్రోల్ బంకుల దగ్గర కార్ల హడావిడి మరో ఐదారేళ్లేనట!
కార్ అంటే కేవలం ఒక వాహనం కాదు. అదొక ప్రిస్టేజ్ సింబల్. అదొక సక్సెస్ సంకేతం. అందుకే, ఎవరైనా సరే నాలుగు కాసులు వెనకేయగానే కార్ కొని షికారు చేసేస్తుంటారు. అయితే, మరో ఐదు, పదేళ్ల తరువాత కార్లు కొనే వాళ్లు, పెట్రోల్ , డీజిల్ కొట్టించి చేతి చమురు వదిలించుకునే వారు భారీగా తగ్గిపోతారట! ఆ దెబ్బతో చమురు ధరలు భారీగా పడిపోయి ఆయిల్ ఉత్పత్తి చేస్తూ పెత్తనం చెలాయిస్తోన్న దేశాలు అతలాకుతలం అవుతాయట! అంతే కాదు, ఇప్పుడున్న లక్షల కోట్ల ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా తుడిచిపెట్టుకుపోతుందట! ఏంటిదంతా… అనుకుంటున్నారా? ఇదేదో జ్యోతిష్యం కాదు! ఒక అమెరికన్ ఫ్యూచరిస్టు బిజినెస్ మ్యాన్ విశ్లేషణ!
టోనీ సెబా అనే వ్యాపారవేత్తకి అమెరికాలోనూ, ప్రపంచం వ్యాప్తంగా కూడా ప్రత్యేక గుర్తింపు వుంది. అందుక్కారణం ఆయన కొన్నాళ్ల క్రితం చేసిన ప్రిడిక్షన్! ఆయన చెప్పిన దాని ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సోలార్ ఎనర్జీ వాడకం విరివిగా పెరిగిపోతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. టోనీ చెప్పినట్టే సౌరశక్తితో అద్భుతాలు సాధ్యమవుతున్నాయి. అయితే, తాజాగా భవిష్యత్ అంచనా వేయటంలో దిట్ట అయిన టోనీ మరో బాంబు పేల్చాడు. ఐదారేళ్లలో లీటర్ పెట్రోల్ ధర 30రూపాయలకి పడిపోవచ్చని చెప్పాడు! ఎందుకో కూడా కన్విన్సింగ్ గా వివరించాడు!
టోనీ అనాలిసిస్ ప్రకారం… ఇప్పుడు ఎక్కడ చూసినా విద్యుత్ శక్తితో నడిచే వాహనాల వినియోగం పెరుగుతోంది. మన దేశంలో ఇంకా విపరీతంగా పెట్రోల్, డీజీల్ కార్ల అమ్మకాలు జరుగుతోన్న చాలా దేశాల్లో ఎలక్ట్రిక్ కార్ల తయారీపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. తక్కువ నిర్వహణ వ్యయం, అస్సలు కాలుష్యాం చేయకపోవటం వీటి స్పెషాలిటీస్! అందుకే, మన విద్యుత్ శాఖా మంత్రి పీయూష్ గోయల్ కూడా ఆ మధ్య 2030నాటికి భారత ప్రభుత్వ వాహానాలన్నీ ఎలక్ట్రిక్ కార్లే వుండబోనున్నాయని ప్రకటించారు! టోనీ చెప్పే దాని ప్రకారం ఇండియాలోనే కాదు… 2030నాటికి యావత్ ప్రపంచం విద్యుత్ కార్లనే పెద్ద మొత్తంలో వాడేస్తుందట!
కేవలం ఎలక్ట్రిక్ కార్ల వాడకం పెరగటంతోనే పెట్రోల్, డీజీల్ ధరలు పడిపోతాయా? కానే కాదు! ముందు ముందు నగర జీవనంలో భారీ మార్పులు రానున్నాయట. అందులో ప్రధానమైంది ప్రతీ ఒక్కరూ స్వంతంగా ఎడాపెడా కార్లు కొనకపోవటం! విపరీతమైన ట్రాఫిక్ జామ్ లు, స్వంతంగా నడిపించుకోవటంలోని ఒత్తిడి, అంతే కాక ఉబర్ లాంటి ట్యాక్సీ సర్వీసుల తక్కువ ధర సేవల కారణంగా.. దాదాపు 95శాతం మంది ఓన్ కార్స్ వాడటం మానేస్తారట! మరి దీని ఎఫెక్ట్ ఎలా వుంటుంది? ఖచ్చితంగా ఆయిల్, ఆటోమొబైల్ ఇండస్ట్రీలు ఢమాల్ మంటాయట! మరో పది, పదిహేను ఏళ్ల తరువాత కూడా పెట్రోల్ , డీజీల్ కార్లు కొనేవారున్నా భారీగా సంఖ్య తగ్గిపోతుందట. దాని వల్ల ఆటోమొబైల్ , ఆయిల్ పరిశ్రమలు పెద్ద కుదుపుకి గురై ధరలు భారీగా పతనం అవుతాయి!
ఇదంతా టోనీ చెప్పిన భవిష్యత్ లోని ఎకనామిక్స్! కాని,పెట్రోల్, డీజీల్ ధరలు పడిపోయి… చమురు కొనే వారు తగ్గిపోతే … పెద్ద పెద్ద రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు అయిల్ ను అడ్డు పెట్టుకుని ఆటాడుకుంటున్న సౌదీ లాంటి సంపన్న దేశాలు… అప్పుడు డమ్మీ అవుతాయి. వాటిపై ఆధారపడే వారు లేకపోవటంతో ఇస్లామిక్ ఉగ్రవాదం లాంటి అంశాల విషయంలో చాలా మార్పులు వస్తాయి. అలాగే, సౌదీ లాంటి పెట్రోల్ డాలర్ దేశాల రాజభోగం అంతం కావచ్చు. మొత్తం మీద రానున్న కాలంలో విద్యుత్ కార్ల షాక్ ప్రపంచానికి తప్పకపోవచ్చు! కాని, కాలుష్యం అస్సలు చేయని ఆ కార్లు ఎంత త్వరగా అంతే మంచిదని కూడా అంటున్నారు పర్యావరణ ప్రేమికులు!