ఇది కూడా విజయమే మన సైనికులకి
posted on Jun 7, 2017 @ 4:09PM
పేరు దానిష్ అహ్మద్. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్లో వున్న డూన్ పీజీ కాలేజ్లో అగ్రికల్చర్ సైన్స్ అండ్
టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. అయితే, దానిష్ కాశ్మీర్లోని భద్రతా దళాల సమక్షంలో బేషరతుగా లొంగిపోయాడు! ఎందుకు? ఇదే కదా మీ అనుమానం? అతనో మామూలు గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ అయితే ఇంత చర్చే జరిగేది కాదు. అతనో కాశ్మీరీ. సైన్యం పై రాళ్లు రువ్వుతున్నాడని కొన్నాళ్ల కింద ఆర్మీ అరెస్టు చేసింది. తరువాత అతడి కెరీర్ దృష్టిలో పెట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసింది. కట్ చేస్తే … సదరు స్టూడెంట్ మహాశయుడు సబ్జర్ భట్ అనే హిజ్బుల్ ఉగ్రవాది అంత్యక్రియల్లో ప్రత్యక్షమయ్యాడు! తనను ఫైటర్ గా అలంకరించుకున్న జిహాదీ వీరుడు చేతిలో గ్రెనెడ్ పట్టుకుని దేశ వ్యతిరేక నినాదాలు చేశాడు. ఇదంతా లోకల్ కాశ్మీరీ మీడియా వాళ్లు తీసిన వీడియోలో రికార్డ్ అయింది!
బుర్హాన్ వనీ తరువాత హిజ్బుల్ కామాండర్ అయిన సబ్జర్ భట్ అంత్య క్రియల్లో దానిష్ అహ్మద్ కనిపించటం సైన్యాన్ని అలెర్ట్ చేసింది. అతడ్ని గతంలో స్టోన్ పెల్టర్ గా భావించిన ఆర్మీ ఈసారి ఉగ్రవాదిగా పరిగణించింది. వెంటనే అతడి తల్లిదండ్రుల్ని గుర్తించి వాళ్లకు కౌన్సింగ్ ఇచ్చి అహ్మద్ ను లొంగిపోయేలా ఒత్తిడి తేవాలని సూచించింది. వాళ్లు అదే పని చేశారు. చివరకు, ఇంకా గ్రాడ్యుయేషన్ చేస్తున్న అహ్మద్ ఉగ్రవాద నరకాన్ని వదిలి బయటపడ్డాడు. లొంగిపోయాడు.
దానిష్ అహ్మదే చెప్పిన దాని ప్రకారం, అతడ్ని సోషల్ మీడియాలో దక్షిణ కాశ్మీరీ ఉగ్రవాద సంస్థలు ముగ్గులోకి లాగాయి. ఉత్తర కాశ్మీర్లో కూడా అతడ్ని ఉగ్రవాదం రాజేయమని ప్రొత్సహించాయి. రాళ్లు రువ్వు మూకల్ని సిద్ధం చేయమని చెప్పాయి. అవన్నీ అహ్మద్ చేశాడు కూడా. అయితే, తీరా మనోడు దక్షిణ కాశ్మీర్ కి వెళ్లి ఉగ్రవాదులతో కలిసి నాలుగు రోజులు వున్నాక కాని అసలు విషయం అర్థం కాలేదు. నిజంగా ఉగ్రవాదపు హింసతో సాధించగలిగేది ఏం లేదని అహ్మద్ కి తేలిగ్గానే అర్థమైంది! అందుకే, వెనక్కి వచ్చి రాష్ట్రీయ రైఫిల్స్ సైన్యాధికారుల సమక్షంలో లొంగిపోయాడు.
సైన్యం ముందు లొంగిపోయిన దానిష్ అహ్మద్ ఖచ్చితంగా తెలివైన పనే చేసినట్లుగా భావించాలి. ఎందుకంటే, మోదీ సర్కార్ రాను రాను సైన్యానికి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చేస్తోంది. కాబట్టి ఉగ్రవాదులు బతికి బట్ట కట్టడం కష్టమైన పనే. దానిష్ కూడా హిజ్బుల్ సంస్థలో వుండి గన్ను పడితే తూటాలకు రాలిపోవాల్సింది. ఇప్పుడు ఇలా లొంగిపోవటం వల్ల ప్రాణానికైతే ప్రమాదం వుండదు. అలాగే, చట్టరిత్యా విచారణ జరిగిన తరువాత అతడికి జైలు శిక్ష పడుతుంది. ఆ శిక్ష కూడా ముగించుకుంటే అతని బతుకుదెరువు విషయంలో కూడా ప్రభుత్వ సాయం అందుతుంది!
దానిష్ అహ్మద్ వ్యక్తిగత లాభాలు పక్కన పెడితే కాశ్మీర్ లోయలో ఈ పరిణామం పెద్ద మార్పులకే దారి తీయవచ్చు. ఉగ్రవాదం పట్ల ఇంత కాలం ఆకర్షితలవుతూ వచ్చిన యువత రెండో ఆలోచన చేసే అవకాశం వుంది. నిజంగా జిహాదీల మాటల్లో నిజాయితీ లేదని వారు విశ్వసించటం మొదలుపెట్టవచ్చు. అంత భారీ మార్పులే కాకున్నా కనీసం ముందు ముందు మరింత మంది యువ టెర్రరిస్టులు లొంగుబాటు బాటలో నడిచే అవకాశమైతే వుంది. ఎన్ కౌంటర్లలో దిక్కుమొక్కూలేని చావు కన్నా విచారణ ఎదుర్కొని ప్రాణాలతో వుండటం మేలని భావించవచ్చు. మొత్తం మీద, దానిష్ అహ్మద్ లొంగుబాటులో సైన్యం, కాశ్మీరీ పోలీసుల పాత్రని మెచ్చుకుని తీరాలి. ఉగ్రవాది తాలూకూ తల్లిదండ్రుల్ని కూడా ఓపికగా కన్విన్స్ చేసి అహ్మద్ ను బయటకి లాగ గలిగారు!