హాట్ సమ్మర్లో… ఏపీ బీజేపి, టీడీపీ మధ్య కోల్డ్ వార్!

  అమిత్ షా తెలుగు రాష్ట్రాల పర్యటన హాట్ హాట్ గా సాగుతున్నట్టే కనిపిస్తోంది. ఒకవైపు తెలంగాణలో ఓపెన్ వార్ కి తెరతీసిన షా ఆంధ్రాలో కూడా పార్టీ బలోపేతానికి నడుం బిగించారు. అయితే, ఈ క్రమంలో తెలంగాణలో పెద్దగా ఇబ్బందులేం లేవు. ఎందుకంటే, అక్కడ టీఆర్ఎస్ ని హ్యాపీగా టార్గెట్ చేయవచ్చు. గులాబీతో కమలానికి ఎలాంటి పొత్తు లేదు కాబట్టి! కాని, ఏపీలో సీన్ డిఫరెంట్ గా వుంది. అధికార పార్టీతో పొత్తులో వున్న బీజేపి మంత్రివర్గంలో కూడా వుంది. అయినా, బీజేపి, టీడీపీ నేతల మధ్య పదాల ప్రచ్ఛన్న యుద్ధం సాగుతూనే వుంది. ఇదే ఇప్పుడు అమిత్ షా ముందుకొచ్చిన ప్రధానాంశం అంటున్నారు…   తెలంగాణలో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలను టార్గెట్ చేసిన అమిత్ షా విజయవాడ ఫ్లైట్ ఎక్కారు. అదీ ఆంధ్రా సీఎంతో కలిసి. మరి వారిద్దరి మధ్యా  సంభాషణ ఎలా జరిగింది? అది అధికారికంగా తెలిసే ఛాన్స్ లేకున్నా… బయటకి వినిపిస్తోన్న టాక్ మాత్రం … చంద్రబాబు లోకల్ బీజేపి నేతల వ్యవహార శైలిపై షాకి కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది. బేజేపీతో పొత్తు కారణంగా టీడీపీ కొంత నష్టపోయినా తాము దేశ సంక్షేమం కోసం మోదీతో కలిసి సాగుతున్నామని అన్నారట. కాని, ఏపీ కాషాయ నేతలు మాత్రం పదే పదే ఇష్టానుసారం మాట్లాడుతున్నారనీ, కట్టడి చేయాలని చెప్పారట బాబు!   టీడీపీ నాయకులు బీజేపికి వ్యతిరేకంగా మాట్లాడితే తాను కఠినంగా హెచ్చరించానని కూడా బాబు షాకి చెప్పారట. ఇదంతా విన్న బీజేపి జాతీయ అధ్యక్షులు సీఎంతో ఏమన్నారో తెలియదుగాని… విజయవాడలో దిగిన ఆయనకు ఆంధ్రా బీజేపి నేతలు కూడా కంప్లైంట్లు వినిపించారట. టీడీపీ నాయకుల మాటలు అసలు పొత్తు అక్కర్లేదన్నట్టు దురుసుగా వున్నాయని వారన్నారట! అంతే కాదు, బీజేపి సైకిల్ తో కలిసి సాగటం వల్ల వెనుకబడిపోతోందని, ఒంటరిగా ముందుకు వెళ్లాలని సూచించారట! మరి వాళ్ల విన్నపాల్ని అమిత్ షా సీరియస్ గా తీసుకుంటారా? ఎన్డీఏలో విశ్వాసపాత్రమైన భాగస్వామిగా వున్న టీడీపీని అంత తేలిగ్గా వద్దనుకుంటారా? ఇవన్నీ ఎలక్షన్ల ముందుగాని తెలియవు!   ఏపీలో పరిస్థితి చూస్తోంటే … టీడీపీ, బీజేపి లోకల్ నాయకులు చాలా మందికి పొత్తు భారంగానే వున్నట్టు కనిపిస్తోంది. కాని, ఇటు చంద్రబాబు, అటు మోదీ ఇద్దరికీ ఇప్పుడప్పుడే తెగదెంపులు చేసుకుని ఇతర పార్టీలకు లాభం చేయాలని లేదు. కారణం… రాజ్యసభలో , రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ అవసరం బీజేపికి ఇంకా చాలా వుంది. అలాగే, నవ్యాంధ్ర తొలి సర్కార్ కి కూడా కేంద్ర సాయం ఇంకా చాలా ఏళ్ల వరకూ కావాల్సిందే. అప్పుడే నిలదొక్కుకోగలిగేది. ఈ విషయం సీనియర్ పొలిటీషన్ అయిన చంద్రబాబుకి తెలియదా? అందుకే, ఆయన రాష్ట్రంలో బీజేపి మద్దతు ఎంత మాత్రం అవసరం లేకున్నా సహనం వహిస్తున్నట్టు కనిపిస్తోంది. చూడాలి మరి… ముందు ముందు… అమిత్ షా ఆంధ్రాలో వచ్చే కొన్ని ఎమ్మెల్యే సీట్ల కోసం టీడీపీ లాంటి బలమైన పార్టీ భాగస్వామ్యం వద్దనుకుంటారా? ఎన్డీఏకు చేటు తెచ్చుకుంటారా? అలాంటి తెలివి తక్కువ పని చేసేటంత ఆవేశపరుడా… మన గుజరాతీ అమిత్ షా భాయ్? అన్నిటికి రాబోయే కొన్ని నెలల్లోనే సమాధానం తెలుస్తుంది!

తెలంగాణ రాజకీయాల్లో ‘షా’నా మార్పులు రానున్నాయా?

  షా వచ్చాడు. బీజేపి కార్యకర్తలకి హుషారు పుట్టించాడు. చంద్రబాబుతో కలిసి ఆంధ్రాలో కాలుమోపాడు. బీజేపి జాతీయ అధ్యక్షుడి తెలంగాణ టూర్ ఇంతే అనుకున్న వారికి కేసీఆర్ ప్రెస్ మీట్ కొత్త జోష్ తీసుకొచ్చింది. ఎవరో టీఆర్ఎస్ లీడర్లు టీవీ కెమెరాల ముందుకొచ్చి బీజేపిని నాలుగు మాటలు అనేసి ఊరుకుంటారనుకున్న అందరికీ … ఏకంగా కేసీఆర్ గొంతు సవరించుకుని విరుచుకపడటం… ఆశ్చర్యమే కలిగించింది! ఎందుకంటే, దేశంలో బీజేపి అతి పెద్ద పార్టీ కావచ్చు. తెలంగాణలో మాత్రమే కమలం 5సీట్లకు పరిమితం. అవి కూడా హైద్రాబాద్ నగరంలోనే. కాని, పెద్దగా పట్టు లేని బీజేపిని ఉద్దేశించి కేసీఆర్ అంతటి నేత కౌంటర్ ఇవ్వటం … రాబోయే ఎన్నికల ముఖచిత్రం ఆవిష్కరిస్తోంది!   అమిత్ షా లక్ష కోట్లు కేంద్రం తెలంగాణకు ఇచ్చిందంటే .. కేసీఆర్ లెక్కలు చెప్పి మరీ పిచ్చి లెక్కలు మానండి హెచ్చరించాడు. కాని, వెంటనే షా కూడా తనవైన లెక్కలు జనం ముందు పెట్టాడు. అక్షరాలా లక్ష కోట్లు మోదీ సర్కార్ తెలంగాణకు ఇచ్చిందని నిరూపించే ప్రయత్నం చేశారు. అయితే, ఇలాంటి మాటల తూటాలకు రెండ్రోజుల కన్నా ఎక్కువ విలువ వుండదు. అందరూ మరిచిపోయేవే. కాని, ఇక్కడ అసలు గుర్తించాల్సిన కీలక పరిణామం ఏంటంటే… అమిత్ షా, మోదీల టార్గెట్ తెలంగాణ సీఎం కుర్చీ కోసం కాదు. కేసీఆర్ లాంటి ఉద్యమ నేత సారథ్యంలో టీఆర్ఎస్ బలంగా వుండగా రాత్రికి రాత్రి అధికారం రాదని వారికీ కూడా తెలుసు. అయినా కూడా తెలంగాణలో అధికారం మాదేనంటూ పోరాడటమే రాజకీయం. అందులో సాధ్యాసాధ్యాలు భవిష్యత్తే తేలుస్తుంది. కాని, అమిత్ షా ప్రస్తుత ప్రాథమిక లక్ష్యం కేసీఆర్ చేత కాంగ్రెస్ కంటే ఎక్కువ విమర్శలు చేయించుకోవటం! ఆ పనిలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి!   తెలంగాణలో బీజేపి ఆవిర్భావం నుంచీ అప్రస్తుత పార్టీనే. పెద్దగా ప్రభావితం చేసిన సందర్భాలంటూ ఏమీ లేవు. టీడీపీ భాగస్వామిగా కూడా ముద్రపడిపోయింది. కాబట్టి ముందు అమిత్ షా టీఆర్ఎస్ ను ఢికొట్టే ధీటైన పార్టీగా కమలాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని ప్రయత్నిస్తున్నట్టు మనం భావించవచ్చు. అందుకే, ఆయన టీ టూర్ లో భాగంగా గులాబీని పదే పదే విమర్శించి సీఎంకి ఆగ్రహం తెప్పించారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ కి ఇచ్చే రేంజ్లో కేసీఆర్ బీజేపికి కౌంటర్ ఇచ్చారు. ఇదే ట్రెండ్ ఇలాగే కొనసాగితే కమలం, గులాబీల పరస్పర ఎటాక్, కౌంటర్ ఎటాక్ లతో కాంగ్రెస్ ఆరటిపండు అవ్వాల్సి వస్తుంది. అప్పుడు రాబోయే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోకున్నా ప్రధాన ప్రతిపక్ష హోదా పొందవచ్చు. కేవలం 5గురు ఎమ్మేల్యేలు హైద్రాబాద్ లో మాత్రమే వున్న బీజేపికి అది కూడా చాలా పెద్ద విజయమే అవుతుంది!   అమిత్ షా టూర్ తరువాత ఓవైసీ కూడా నోరు విప్పాడు. హైద్రాబాద్ ను వశం చేసుకుంటామంటోన్న షా స్వయంగా తనతో పోటీ పడాలని మాస్ మసాలా పొలిటికల్ సవాల్ విసిరాడు. అది జరగక్కపోయినా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఐఎం, బీజేపిల హోరాహోరి పోరు భాగ్యనగరంలో తప్పక పోవచ్చు. అమిత్ షాకి కావాల్సింది కూడా అదే! మిగతా సెక్యులర్ పార్టీల కన్నా ఎంఐఎం తమ మీద ఎంత రెచ్చిపోతే కాషాయదళానికి వ్యవహారం అంతే ఈజీ! సో… మొత్తానికి అమిత్ షా టూర్ తరువాత అర్జెంట్ గా తేరుకుని వ్యూహం పన్నాల్సిన పార్టీ ఏదైనా వుందంటే అది తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష హోదాలో వున్న కాంగ్రెస్. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కంటే ఎక్కువగా హస్తం పార్టీ బీజేపి తట్టుకుని నిలబడాల్సిన అవసరం రావచ్చు!

తెలుగువారి అదృష్టం Toneflix యాప్ – నారా లోకేష్‌

  డిజిటల్‌ మాధ్యమంలో మరో విప్లవానికి తెరతీస్తూ తెలుగువన్‌ రూపొందించిన TONEFLIX అప్లికేషన్‌, ఆంధ్రప్రదేశ్‌ పంచాయతిరాజ్, ఐటీ శాఖ మంత్రి శ్రీ నారాలోకేష్ చేతుల మీదుగా ఆవిష్కరింపబడింది. నిన్న విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో నారాలోకేష్‌తో పాటుగా తెలుగువన్ మేనేజింగ్‌ డైరక్టర్ కంఠంనేని రవిశంకర్‌, ఆబ్జెక్ట్‌ వన్‌ డైరక్టర్‌ జయప్రకాష్‌, ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కె. విజయానంద్ ప్రభుతులు పాల్గొన్నారు. వీరితో పాటుగా తెలుగువన్‌తో కలిసి TONEFLIX అప్లికేషన్‌ను రూపొందించడంలో భాగస్వామిగా నిలిచిన స్వీడన్‌కు చెందిన టెరానెట్‌ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.   కార్యక్రమంలో తెలుగువన్‌ తరఫున శ్రీ రవిశంకర్‌ మాట్లాడుతూ, తెలుగువారు ఎక్కడ ఉన్నా తొలి స్థానంలో ఉండాలనే ఆకాంక్షతో తెలుగువన్ సంస్థను నెలకొల్పామంటూ తమ లక్ష్యాన్ని పేర్కొన్నారు. TONEFLIX అప్లికేషన్‌ ద్వారా ఎలాంటి ఇంటర్నెట్‌, డేటా చార్జీల అవసరం లేకుండా అపరిమితమైన వీడియోలను షేర్‌ చేసుకోవచ్చని చెప్పారు. అయితే ఈ అప్లికేషన్ కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాదనీ... ఆడియో ఫైల్స్, ఈ బుక్స్, డాక్యుమెంట్లని కూడా షేర్‌ చేసుకోవచ్చని తెలిపారు. భవిష్యత్తులో డిజిటల్ మాధ్యమాల ద్వారా చదువుని సాగించే E-Learning రంగంలో కూడా ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుందని ఆశించారు. ఇప్పటికే విజయవాడ బస్‌స్టేషన్‌లోని ప్రయాణికులకు ఇంట్రానెట్‌ ద్వారా ఉచితంగా వీడియో కంటెంట్‌ చూసే అవకాశం కల్పించామని... ఇప్పుడు Toneflix  అప్లికేషన్‌ ద్వారా బస్సులో ప్రయాణిస్తూ కూడా వీడియోలు చూసుకునే సౌలభ్యం కలగనుందని చెప్పుకొచ్చారు. ఈ యాప్ ఉన్నవారు తమ మొబైల్‌లో ఉన్న వీడియోలను ఒకరి నుంచి ఒకరికి షేర్‌ చేసుకోవచ్చుననీ, ఈ క్రమంలో వారి వ్యక్తిగత సమాచారానికి ఎలాంటి ప్రమాదమూ ఉండదని భరోసాని అందించారు. హైదరాబాదుని శరవేగంగా అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యుల చేతుల మీదుగా ఈ యాప్‌ను విడుదల చేయించడం తన ఉద్దేశమంటూ, మనసులోని కోరికను వెలిబుచ్చారు.   ఈ యాప్‌ను లాంఛనంగా ప్రారంభించిన నారాలోకేష్‌ మాట్లాడుతూ తెలుగువన్‌తో తనకి ఉన్న సుదీర్ఘమైన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 2000 సంవత్సరం నంచే తాను తెలుగువన్ వీడియోలు చూస్తూ వచ్చాననీ, ఇప్పటికీ తాను తెలుగువన్‌ చూస్తూ ఉంటాననీ చెప్పుకొచ్చారు. Toneflixలాంటి యాప్ ఒకటి వస్తుందని తాను కూడా ఊహించలేదనీ, ఆంధ్రరాష్ట్రంలో ఇలాంటి సాంకేతికత నిజం కావడం అందరి అదృష్టమనీ కొనియాడారు. తెలుగురాష్ట్రాల్లో ఇలాంటి విప్లవం, అభివృద్ధికి దారితీస్తుందని ఆశించారు. ఒకప్పుడు బస్సులో వేసిన ఒకే ఒక్క సినిమాను బలవంతంగా చేసే పరిస్థితి ఉండేదనీ, Toneflix యాప్ ద్వారా బస్సులో యాప్‌ ఉన్నవారంతా తమ వీడియోలను షేర్‌ చేసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. ఇంత క్లిష్టమైన యాప్‌లో సెక్యూరిటీ ఫీచర్స్ అసాధారణంగా ఉన్నాయని ప్రశంసించారు. ఇలాంటి మాధ్యమాల వల్ల భారీస్థాయిలో ఉద్యోగాలని కల్పించలేకపోవచ్చు కానీ, ఉపాధికి మాత్రం అవకాశం ఉంటుందని అన్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని యువతలో ఉన్న ప్రతిభని నిరూపించుకునేందుకు తెలుగువన్‌ ఆస్కారం ఇస్తోందని ప్రశంసించారు. దాదాపు 1500 మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు తెలుగువన్ ద్వారా షార్టఫిల్మ్స్‌ను ప్రపంచంతో పంచుకుంటున్నారని కొనియాడారు. తమ ప్రభుత్వం కూడా డిజిటల్ మాధ్యమానికి పెద్దపీట వేస్తోందనీ, 2019 నాటికి ఫైబర్‌గ్రిడ్‌ను ఏర్పాటు చేసి ఇంటింటికీ ఇంటర్నెట్‌, టీవీ, టెలిఫోన్‌ సదుపాయాలను కల్పించే ప్రయత్నం చేస్తోందనీ గుర్తుచేశారు. తాను ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదల చేస్తున్న తొలి యాప్‌ Toneflix విజయవంతం కావాలని ఆశించారు. Toneflix యాప్‌లో 1500 చిత్రాలు, 45 వేల వీడియోలు ఉన్నాయి కాబట్టి టెక్నాలజీకి అనుగుణమైన కంటెంట్‌ కూడా ఉందంటూ ప్రశంసించారు. ఈ యాప్ చెంత ఉంటే కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా హాయిగా ప్రయాణం చేసేయవచ్చంటూ కితాబునిచ్చారు. తెలుగువన్‌ సారధిగా విజయవంతమైన రవిశంకర్‌గారు అమరావతిలో కూడా పెట్టుబడి పెట్టాలంటూ ఆహ్వానించారు.   టోన్‌ఫ్లిక్స్‌ యాప్‌ ఆవిష్కరణలో భాగంగా మున్ముందు ‘స్మార్ట్‌ విలేజ్‌ అప్లికేషన్’ పేరుతో మరో యాప్‌ను రూపొందించే ప్రయత్నం చేస్తున్నట్లు టెరానెట్‌, తెలుగువన్‌ ప్రతినిధులు పేర్కొనడం గమనార్హం. దీంతో గ్రామంలోని ప్రజలంతా ఎలాంటి డేటా, ఫోన్‌ చార్జీలు చెల్లించే అవసరం లేకుండానే యాప్‌ ఉన్న ఇతర వ్యక్తులతో సంభాషించే అవకాశం ఉంటుంది. అదే కనుక సాధ్యమైతే డిజిటల్‌ చరిత్రలో మరో అద్భుతం సాకారమవుతుందని భావిస్తున్నారు.  

ప్రమాదంలో ప్రకాశం జిల్లా టీడీపీ... భయపడుతోన్న సీనియర్లు

  గొట్టిపాటి, కరణం వర్గపోరు ప్రకాశం జిల్లాలో టీడీపీ ప్రమాదంలో పడేస్తోంది. ఇద్దరు నేతలు కొట్టుకుంటూ పార్టీ ప్రతిష్టను బజారు కీడుస్తున్నారని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. ఇది విపక్షం బలపడటానికి మేలు చేస్తుందన్న భయం పార్టీ నేతల్లో మొదలైంది.   గొట్టిపాటి-కరణం మధ్య వర్గపోరు ఈనాటికి కాదు... దశాబ్దాలుగా ఫ్యాక్షన్‌ వార్‌ నడుస్తోంది. రెండు కుటుంబాలు రాజకీయంగా బలమైనవే. ఇద్దరికీ జిల్లాలో బలమైన అనుచర గణం ఉంది. అందుకే ఒకప్పటి పగలు, ప్రతీకారాలు ఇప్పటికీ కొనసాగుతూ వస్తున్నాయి. అయితే ఈ ఇద్దరినీ కలిపి... జిల్లా పార్టీ వ్యవహారాలను చక్కదిద్దేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇద్దరిలో ఎవరినీ కాదనుకోలేని పరిస్థితి. ఇదే గొట్టిపాటి-కరణం వర్గపోరు ముదరడానికి కారణమవుతోంది.   గొట్టిపాటి టీడీపీలో చేరిక సమయంలోనే కరణం తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటి నుంచి బలరాం కుతకుతలాడుతూనే ఉన్నారు. బహిరంగ వేదికలపై ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటూనే ఉన్నారు. వీరి అనుచరులు ఏకంగా మారణకాండకు పాల్పడుతున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా తమదే పైచేయని రుజువు చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కరణం-గొట్టిపాటి వర్గపోరుతో అధికారుల బదిలీలు, పించన్ల మంజూరు, ఫ్లెక్సీలు, శిలాఫలకాలు... ఇలా ప్రతి అంశం అత్యంత సున్నితమైనదిగా మారుతోంది.   ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వర్గ విభేదాలు పార్టీ ప్రతిష్టను మసకబారుస్తున్నాయన్న వాదన జిల్లా పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఇద్దరూ ఒక్కటై ప్రత్యర్ధి పార్టీని ఇరుకున పెట్టాల్సింది పోయి... వారికి అస్త్రంగా మారడం పార్టీకి నష్టం చేకూరుస్తుందన్న భావన కనిపిస్తోంది. పదేపదే ఇలా గొడవకి దిగడం వల్ల ప్రజల్లో పార్టీ చులక అవుతుందంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీకి తీవ్రనష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. అంతర్గత పోరు ఇలాగే కొనసాగితే పార్టీ మరింత కష్టాల్లో పడటం ఖాయమంటున్నారు.

చంద్రస్వామీ : రాజీవ్ హత్యతో ప్రమేయమున్న ఈ గురూజీ మీకు తెలుసా?

  న్యూ దిల్లీలోని అపోలో ఆసుపత్రిలో, మంగళవారం మధ్యాహ్నం, గుండెపోటు కారణంగా చంద్రస్వామి మరణించారు. ఈ వార్త వినగానే ప్రస్తుత తరానికి ఎవరీ చంద్రస్వామి అనే డౌట్ వస్తుంది! కాని, 1990ల నాటి కాంగ్రెస్ రాజకీయాలతో పరిచయం వున్న వారికి ఆయనెవరో బాగానే తెలుసు. 66ఏళ్ల వయస్సులో గుండెపోటుతో పాటూ అనేక అవయవాల వైఫల్యంతో మృతి చెందిన ఆయన అప్పట్లో అత్యంత వివాదాస్పద బాబాజీ! ఏకంగా ఒక ప్రధాని హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కున్నవాడు! మరో ప్రధానికి అత్యంత ఆప్తుడు! అయితే, ఇద్దరూ సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ కు చెందిన పీఎంలే కావటమే విశేషం!   చంద్ర స్వామి గురించి చెప్పుకోవటం మొదలు పెడితే అన్నీ ఆశ్చర్యకర విషయాలే! అయితే, ఆయన గురించి అందరూ మొట్ట మొదట చెప్పే వాఖ్యం… మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి సన్నిహితుడనీ, ఆధ్యాత్మిక గురువని! అదే ఆయనకు ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెట్టింది!   జ్యోతిష్య శాస్త్రంలో ఉద్ధండ పండితుడని పేరున్న స్వామీజీ కేవలం పీవీకి మాత్రమే దగ్గరివాడు కాదు. ఆయన దిల్లీలో కట్టుకున్న ప్రఖ్యాత ఆశ్రమానికి భూమిని కేటాయించింది ఇందిరా గాంధీ అంటారు! అలాగే, ప్రపంచ వ్యాప్తంగా ఆయన సలహాలు తీసుకున్న వీవీఐపీలు బోలెడు మంది వున్నారు. బ్రూనై సుల్తాన్, బెహ్రైన్ సుల్తాన్,  హాలీవుడ్ నటి ఎలిజబెత్ టేలర్, బ్రిటన్ ప్రధాని మార్గరేట్ థాచర్, ఆయుధాల వ్యాపారి ఆద్నాన్, మాఫియా డాన్ దావూద్… వీళ్లంతా ఆయన శిష్యులే! రాజకీయ నాయకులు మొదలు సినిమా వారి వరకూ, వ్యాపారులు మొదలు నేరగాళ్ల వరకూ అందరూ చంద్రస్వామి మహిమకు జోహార్లు కొట్టిన వారే!   అంతర్జాతీయంగా పేరు మోసిన వారెందరికో మార్గ నిర్దేశనం చేసిన చంద్రస్వామి అదే రేంజ్ లో న్యాయపరమైన చిక్కుల్లో కూడా ఇరుక్కున్నారు. ఆయన మీద 1996లో ఆర్దిక సంబంధమైన ఆరోపణలు మోపబడ్డాయి. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ న్యాయస్థానానికి ఈడ్చింది. చివరకు చంద్ర స్వామి 9కోట్లు ఫైన్ చెల్లించాల్సి వచ్చింది. ఇంకా కొన్ని ఆరోపణలపైన ఆయన మీద ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి. అయితే, అన్నిటికంటే విభ్రాంతికరమైన అంశం… రాజీవ్ గాంధీ హత్య కేసులో ఆయన ప్రమేయం వుందని జైన్ రిపోర్ట్ వెల్లడించింది. ఇది కోర్టుల్లో నిరూపించబడలేదు కాని చాలా మంది చంద్రస్వామి ప్రమేయం రాజీవ్ హత్యలో వుందని గట్టిగా నమ్ముతూ వుంటారు!   కేవలం కొన్ని సంవత్సరాల వ్యవధిలో దేశ రాజకీయాల్లో సంచలనం అయిన చంద్రస్వామి అంతే వేగంగా కనుమరుగు కూడా అయ్యారు. గత కొన్ని ఏళ్లుగా ఆయన గురించి ఎక్కడా చిన్న న్యూస్ కూడా కనిపించకపోవటమే ఇందుకు నిదర్శనం! అయితే, ఆయన మరణంతో ఒక మిస్టరీకి మాత్రం తెరపడినట్టైంది!

ఆ మేజర్ ను శిక్షించమన్నారు! మోదీ సర్కార్ సత్కరించింది!

  కాశ్మీర్ లోయలో అల్లరి మూకలు అరాచకం సృష్టిస్తున్నాయి. అదే సమయంలో భారత సైన్యం కూడా ధీటుగా ఎదుర్కొంటూ వస్తోంది. పోయిన సంవత్సరం బుర్హాన్ వనీ అనే ఉగ్రవాది ఎన్ కౌంటరైనప్పట్నుంచీ పాక్ ప్రేరేపిత వేర్పాటు వాదుల రాళ్ల వర్షాలు ఆగటం లేదు. అయితే, ఆర్మీ పెల్లెట్ గన్స్ వాడినా, కాల్పులు జరిపినా వివాదాస్పదం అవుతూనే వుంది. మానవ హక్కుల ఉల్లంఘన అంటూ విమర్శలు ఎదురవుతున్నాయి. అయితే, ఎవరు ఎన్ని విధాల వేలెత్తి చూపినా కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ ఆర్మీ వెనక్కి తగ్గే సూచనలు కనిపించటం లేదు. ఆందోళనకారులతో మెతకగా ప్రవర్తించే ఉద్దేశం వున్నట్టు ఎంత మాత్రం భారత్ సంకేతాలు ఇవ్వటం లేదు.   ఏప్రెల్ నెలలో శ్రీనగర్ ఉప ఎన్నిక సందర్భంగా ఆందోళనకారులు తీవ్రమైన రాళ్ల దాడి చేశారు. దానికి ప్రతిగా వాళ్లలోని ఒక రాళ్లు రువ్వుతున్న కాశ్మీరీ యువకుడ్నే మేజర్ నితిన్ గొగోయ్ తన జీపుకు ముందు భాగంలో కట్టేసుకుని ముందుకు పోయాడు. ఈ వ్యూహం ఫలించి రాళ్లు రువ్వుతు్న ఆందోళనకారులు ఆర్మీకి దారిచ్చారు. అయితే, జీపుకి ఒక మనిషిని అలా కట్టేసిన వీడియో బయటకి రావటంతో వివాదం తలెత్తింది. సహజంగానే కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చివరకు ఆ పని చేసిన మేజర్ పై ఆర్మీ శాఖా పరమైన విచారణ చేసింది. దానిలో భాగంగా ఈ మధ్యే మేజర్ నితిన్ గొగోయ్ తప్పేం లేదని తే్ల్చింది. ఆయన ఆందోళనకారుల రాళ్ల వర్షం నుంచి తప్పించుకుని శాంతి  భద్రతల్ని కాపాడటానికే అలా చేశాడని ఆర్మీ కోర్టు అభిప్రాయపడింది!   కాశ్మీరి వేర్పాటు వాదిని జీపుకి కట్టేసిన మేజర్ ని నిర్దోషిగా పేర్కొనటమే కాక ఆయనకి భారత ఆర్మీ కమండేషన్ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. ఇలా పురస్కారాలు ఇవ్వటం సబబు కాదని అప్పుడే శరద్ యాదవ్ లాంటి నేతలు మోదీ సర్కార్ పై గళం విప్పారు. కాని, నిత్యం నరకం లాంటి పరిస్థితుల్లో వుంటూ దేశాన్ని రక్షిస్తోన్న ఆర్మీకి నైతిక మద్దతు ఇవ్వటం తప్పు కాదన్నదే సర్కార్, ఆర్మీ చీఫ్ ఉద్దేశంలా కనిపిస్తోంది. అందుకే, రాళ్లు రువ్విన వ్యక్తిని జీపుకి కట్టేసిన మేజర్ పై చర్యలు తీసుకోవటం కాకుండా.. ఏకంగా అవార్డ్ ఇచ్చి సత్కరించారు! ఇది ఖచ్చితంగా ఆందోళకారులకి, వేర్పాటువాదులకి, పాక్ అనుకూల శక్తులకి గట్టి సంకేతమే అనుకోవాలి. భారత్ తాటాకు చప్పుళ్ల లాంటి రాళ్ల దాడులకి ఎలాంటి పరిస్థితుల్లోనూ భయపడదని చెప్పినట్లైంది!

గ్లామర్ ప్రపంచం… బూతుల గ్రామర్!

  సినిమా వాళ్లు ఏ కామెంట్ చేసినా జనానికి ఆసక్తే! ఇక వాళ్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే? మీడియాకి, సోషల్ మీడియాకి పండగే! అందులోనూ ఒక నటుడు వివాదస్పద వల్గర్ మాటలు మాట్లాడితే? కలకలం బయలుదేరుతుంది! కాశ్మీర్ గురించి, సైనికుల గురించి, రాముడి గురించి, రామాయణం గురించి… ఇలా ఎన్ని రకాల అంశాల మీద ఎవరు ఎంత దిగజారుడు వ్యాఖ్యలు చేసినా రాని రియాక్షన్ సినిమా వాళ్ల వల్గర్ కామెంట్స్ కి వస్తూ వుంటాయి. ఆ టాపిక్కే అలాంటిది. పోనీ… సినిమా వాళ్లు చేసే చులకన కామెంట్లని పట్టించుకోకుండా వుందామా అన్నా అదీ సాధ్యం కాదు. ఎందుకంటే, వాళ్లకు ఇదే పరిపాటి అయిపోతోంది కాబట్టి!   రారండోయ్ వేడుక చూద్దాం అనే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చలపతి రావు దారుణంగా మాట్లాడాడు. ఆయన వ్యాఖ్యల్ని వేరే ఎవరో కాదు… ఆయనే స్వయంగా సమర్థించుకోలేకపోయాడు. తాను చేసింది తప్పని మీడియా ముందు ఒప్పుకుని సారీ చెప్పేశాడు. కానీ, మహిళా సంఘాలు ఎంత మాత్రం వెనక్కి తగ్గటం లేదు. క్షమాపణలు ఎవరికి కావాలి… జైలుకి వెళుదువుగాని… అంటున్నారు. వాళ్ల కోపానికి కూడా ఒక అర్థం వుంది. గతంలో ఇదే చలపతి రావు ఒక మీడియా ఛానల్ కెమెరా ముందు రేపుల గురించి గొప్పగా చెప్పుకున్నాడు. అసలు సినిమా వాళ్లలో కొందరికి ఎందుకీ నోటి పూత? సమాధానం ఇండస్ట్రీలోని కల్చర్ లో దొరుకుతుంది!   ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా సినిమా రంగంలో చాలా మంది ఇష్టానుసారం మాట్లాడుతుంటారు. కెమెరా ముందు వాళ్లు మాట్లాడే డబుల్ మీనింగ్ డైలాగ్ లకు వంద రెట్లు ఎక్కువ బూతులు అలా యథాలాపంగా వదిలేస్తుంటారు. అందరూ అలాంటి అరాచకులేనా అంటే కాదనేదే సమాధానం. కానీ, కొందరు మాత్రం డైలాగ్ పర్వర్ట్స్ వుంటారు. వాళ్లు ఎప్పటికీ మారరు. వాళ్లు మారాల్సిన అవసరం ఇండస్ట్రీలో వుండదు కూడా. ఇష్టం వున్నా లేకున్నా ఇండస్ట్రీలోని స్త్రీలు అవసరం కొద్దీ, అవకశం కొద్దీ సర్దుకుపోతుంటారు. అయితే, ఇలాంటి బూతు వ్యవహారాలు అన్ని రంగాల్లోనూ వుంటాయి. అక్కడా స్త్రీలు చాలా సార్లు చూసీ చూడనట్టు వదిలేస్తుంటారు. కాని, సినిమా వాళ్లకుండే గ్లామర్ వల్ల అవ్వి అప్పుడప్పుడూ ఇలా వివాదాస్పదం అవుతూ వుంటాయి.   చలపతి రావులా ఏదంటే అది మాట్లాడే ప్రబుద్ధులు సినిమా రంగంలో చాలా మంది. కాని, వాళ్లలో చాలా మ్యాగ్జిమమ్ శాల్తీలు కెమెరా ముందుకు రాగానే సర్దుకుంటారు. జాగ్రత్తగా మాట్లాడతారు. అయినా కూడా అప్పుడప్పుడూ అలవాటులో పొరపాటుగా నోరు జారటం అనివార్యమే! అది వాళ్లకో బలహీనత! చలపతి రావు లాగా గతంలో ఒక అగ్ర హీరో ఇలాగే వేదికపై స్త్రీలకు కడుపు చేయాలంటూ ఉచిత సలహా విసిరేశాడు! ఆయనకున్న స్టేచర్ కి, స్టేటస్ కి ఇప్పుడైనంత గొడవ కాలేదని భావించుకోవాలి. అలాగే, మన డిఫరెంట్ డైరెక్టర్ కూడా ఒకాయన ఈ మధ్య ట్విట్టర్ లో సన్నీ లియోన్ మీద తన వ్యామోహం సరిగ్గా వుమన్స్ డే నాడు వెళ్లగక్కాడు. స్త్రీలందరూ సన్నీ లియోన్ లా మగవాళ్లకు ప్లెషర్ ఇవ్వాలంటూ ఏదేదో చెప్పేశాడు! ఇక ఆలీ గురించి చెప్పేదేముంది? ఆయన ముందుకు కెమెరా, మైక్ వస్తే ఎవరు బలైపోతారో తెలియనే తెలియదు! హీరోయిన్స్ మొదలు షో నిర్వహిస్తోన్న యాంకర్ వరకూ ఎవ్వరైనా సిగ్గుతో చచ్చిపోవాల్సిందే! అంత సుకుమారంగా చెలరేగిపోతాడు…   ఇంతకీ చలపతి రావుకి శిక్ష పడుతుందా? జైలుకి వెళతాడా? మన భారతీయ న్యాయవ్యవస్థలో కేసులు తేలి శిక్షలు పడాలంటే ఎంత తేలికో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాబట్టి చలపతి రావు విషయంలో ఇప్పుడప్పుడే బ్రేకింగ్ న్యూస్ లు ఏం మనం వినే ఛాన్స్ లేదు. అయితే, ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పడం ఒక్కటే కొంత నయం. కాని, ఇక ముందైనా సినిమా వాళ్లు తమకున్న గ్లామర్, ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని బహిరంగంగా బూతులు మాట్లాడకపోతే బెటర్. టీవీ షోల్లోనూ, సినిమాల్లోనూ కూడా బూతులు వుండకూడదని మనం ఆశించటమైతే … అత్యాశే అవుతుంది!

ఎమ్మెల్యే హత్య కేసులో మాజీ ఎంపీకి జైలు శిక్ష

   ఓ ఎమ్మెల్యే హత్య కేసులో ఓ ఎంపీకి జైలు శిక్ష పడింది. ఈ ఘటన జార్ఖండ్ లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జనతాదళ్ పార్టీకి చెందిన మాజీ పార్లమెంట్ సభ్యుడు ప్రభునాథ్ సింగ్‌..23 ఏళ్ల కిందట ఎమ్మెల్యే అశోక్ కమార్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో భాగంగా ఇన్ని సంవత్సరాలకు గాను జార్ఖండ్ రాష్ట్రంలోని హజరీభాగ్ కోర్టు జైలు శిక్ష విధించింది.   కాగా నార్త్ బీహార్ మార్సాఖ నియోజక వర్గానికి చెందిన శాసనసభ్యుడు అశోక్ కుమార్ సింగ్‌ని ఆ రాష్ట్ర రాజధాని పాట్నాలో అతని అధికారిక నివాసంలోనే జులై 3, 1995 సంవత్సరంలో దుండగులు బాంబులు వేసి హత్య చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యేతో పాటు మరో వ్యక్తి అనిల్ కుమార్ సింగ్ మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మెల్యే అశోక్‌కుమార్ సింగ్ భార్య చాందినీ దేవీ ఫిర్యాదు చేశారు. తన భర్తను ఎంపీ, అతడి సోదరుడు చంపారని చాందినీ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసుల దర్యాప్తులో ఈ హత్య కుట్రలో ప్రభునాథ్‌సింగ్ పాత్ర ఉన్నట్లు తేల్చారు. ఈ కేసులో మాజీ ఎంపీతో పాటు ఎంపీ సోదరుడు ధనానాథ్‌సింగ్‌తో పాటు మరో వ్యక్తి రితేశ్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.

తమిళనాడులో… తలైవా చెప్పిన యుద్ధం మొదలైపోయింది!

  రాజకీయాల్ని అందరూ బురద గుంట అంటారు. కాని, ఆ బురద గుంటని ఎవరో ఒకరు లోపలికి దిగి శుభ్రం చేస్తేనే కదా బాగుపడేది! ఇది ఓ సినిమాలో డైలాగ్! ఇప్పుడు ఆ సత్యం బాగా బోధపడుతోన్న వ్యక్తి రజినీకాంత్. అసలు తమిళనాడులో తలైవాకి వ్యతిరేకంగా నిరసనల్ని ఎవరమైనా ఊహించగలమా? అసాధ్యం! కాని, ఇప్పుడు అదే జరుగుతోంది. తమిళుల వెండితెర వేల్పు అని పేరున్న రజినీనే తమ వాడు కాదంటూ కొన్ని తమిళ సంఘాలు రోడ్డు మీద పడ్డాయి. ఈ మారాఠీ గైక్వాడ్ కన్నడిగుడే కాని మా వాడు కాదంటూ, మాకొద్దంటూ రెచ్చిపోతున్నాయి! ఎందుకు రాజకీయాలు బురద గుంట లాంటివో అత్యంత వేగంగా అర్థమైపోయి వుంటుంది రజినీకి! ఆల్రెడీ రాజకీయ బురద అంటించుకుంటోన్న ఆయన ఇదంతా ముందే ఊహించాడని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు!   43 ఏళ్లుగా తమిళనాడులోనే వుంటోన్న సూపర్ స్టార్ తమిళుడు కాదా? జన్మతః మరాఠీ అయిన ఆయన కర్ణాటకలో పుట్టి, పెరిగారు. కాని, తన అదృష్టాన్ని, కీర్తిని, డబ్బుని, ఆనందాన్ని అన్నిట్ని చెన్నై టీనగర్ లోనే వెదుక్కున్నారు. సాధించుకున్నారు. కోట్లాది మంది అభిమానుల్ని కూడా! కాని, ఆయన ఇలా రాజకీయాల్లోకి వస్తానని అస్పష్టంగానైనా సూచన ఇచ్చారో లేదో అలా రోడ్డుపైకి వచ్చేశాయి తమిళ సంఘాల మూకలు. అసలు ఏ భారతీయుడైనా ఏ భారతీయ రాష్ట్రంలోనైనా పోటీ చేయవచ్చని, ఓట్లు అడగవచ్చని రాజ్యాంగం చెబుతోంది. కాని, స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచీ తమిళనాడులో ఆ ప్రాంతం పేరు చెప్పుకుని బ్రితికే దేశ వ్యతిరేక బ్యాచీలు బోలెడు వున్నాయి. కరుణానిధి సహా అక్కడ ఎందరో నాయకులు ఉత్తరాది మీద ద్వేషం నూరిపోసి తమ రాజకీయ సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. తమ స్వార్థం కోసం సంస్కృతాన్ని, సంస్కృతిని, దేశాన్ని, దేశ ఐక్యతని దగా చేశారు. తమిళనాడు అంటే ద్రవిడ దేశమని, ఉత్తరాది వారు ఆర్యులని, బ్రిటీషర్ల కాలపు సిద్ధాంతాలు పదే పదే చెప్పి జాతీయ పార్టీలు కాలుపెట్టకుండా చూసుకున్నారు. ఇప్పుడు ఆ కోవలోని వారే రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై కూడా సలసల మరిగిపోతున్నారు. దక్షిణాదికే చెందిన వాడైన తలైవా తమిళుడు కాదు కన్నడిగుడు అంటూ దిగజారుడు భావన ప్రచారం చేస్తున్నారు…   రాజకీయాల్లోకి వస్తే తనను కన్నడ వాడివంటూ టార్గెట్ చేస్తారని రజినీ ముందే ఊహించాడు. అందుకే, ఆయన ఫ్యాన్స్ తో తాను 43ఏళ్లుగా తమిళుడిని అయిపోయానని చెప్పారు. యుద్ధం వస్తే సిద్ధంగా వుండాలని అన్నారు. ఆయన ఎప్పుడో ఎన్నికల ముందు వస్తుంది అనుకున్న వీధి పోరాటం ఇప్పుడే వచ్చేసింది. ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేల మద్దతున్న తమిళ సంఘాలు ఏకంగా రజినీకాంత్ ఇంటి ముందుకే చేరాయి నిరసనలు చేయటానికి. కన్నడవాడైన ఆయన అసలు తమిళ రాజకీయాల్లోకి రావొద్దంటూ దుర్మార్గ యుద్ధం ప్రకటించాయి. అందుకు జవాబుగా తమిళనాడు వ్యాప్తంగా పడయప్ప అభిమానులు కూడా రోడ్లపైకి వచ్చారు. మొత్తానికి మన ముత్తు చెప్పిన యుద్ధం మొదలు కానే అయింది!   రజినీ పొలిటికల్ ఎంట్రీ మీద మంటగా వున్న బోలెడు మంది నాయకులు, సెలబ్రిటీలు వున్నారు తమిళనాడులో. జయలలితకి ఎంతో దగ్గరగా మెలిగిన శరత్ కుమార్ పబ్లిగ్గానే రజినీకాంత్ ను రాజకీయాల్లోకి రావొద్దంటూ హెచ్చరించాడు. ఇలాంటి వారు స్టాలిన్ వర్గంలోనూ చాలా మందే వున్నారు. వీరి భయాలకి అసలు కారణం రజినీకాంత్ కన్నడ బ్యాక్ గ్రౌండ్ ఎంత మాత్రం కాదు. జయ, కరుణా లేని తమిళ రాజకీయంలో రజినీ ఎంట్రీ భారీ మార్పులు తెస్తుంది. చాలా మంది పొలిటికల్ కెరీర్లకు ఫుల్ స్టాప్ లు కూడా పడవచ్చు. అంతే కాదు, తలైవా అండతో బీజేపీ కూడా తమిళనాడులో ప్రవేశించే వ్యూహం పన్నుతోంది. అది కూడా తమిళ జాతి సిద్ధాంతం చెబుతూ పబ్బం గడిపిన ఉత్తరాది వ్యతిరేక పార్టీలకు భరింపరానిదిగా వుంది. అందుకే, రజినీకాంత్ పైన దాడి మొదలు పెట్టారు. ముందు ముందు ఆయన మోదీతో భేటీ అయ్యి కమలంతో కలిస్తే మాత్రం ఈ దాడులు, తమిళ జాతి ఆత్మాభిమానం నినాదాలు మరింత పెరిగిపోతాయి. వాట్ని బాక్సాఫీస్ ని గెలిచినంత ఈజీ మాత్రం కాదు రోబోకి! చూడాలి మరి… కబాలి ఏం చేస్తాడో? చుట్ట గిర్రున తిప్పి నోట్లో వేసుకున్నంత తేలిగ్గా తమిళనాడు జనాన్ని బుట్టలో వేసుకుంటాడో లేదో! కాకపోతే… దశాబ్దాల తరబడి ద్రవిడ సిద్దాంతం మర్రి చెట్టు నీడలో మగ్గిన తమిళనాడుకి మాత్రం రజినీ అవసరం చాలా వుంది. ఆయనకు తమిళనాడుతో వున్న అవసరం కంటే ఒకింత ఎక్కువే!

జేమ్స్ బాండ్ స్వంత దేశానికి మైండ్ జామ్ చేసేస్తోన్న ఉగ్రవాదం!

  మన భాషలో చెప్పుకోవాలంటే… హైద్రాబాద్ కి బంజారాహిల్స్ , జూబ్లిహిల్స్ ఎలాంటివో… ప్రపంచానికి యూరప్, అమెరికా అలాంటివి! అందమైన ప్రదేశాలు, అద్భుతమైన అభివృద్ధి, ఉత్సాహం, ఉల్లాసం వగైరా వగైరా. కానీ, అన్నిటికంటే ముఖ్యమైంది భద్రత! యూరోప్ లో , అమెరికాలో వుండే భద్రత మరెక్కడా వుండదని అందరూ భావించే వారు. అందుకే, అమెరికన్ సీఐఏ, ఎఫ్బీఐ, బ్రిటీష్ సీక్రెట్ సర్వీసెస్ ఇంటలిజెన్స్, స్కాట్లాండ్ యార్డ్ వంటివన్నీ వాల్డ్ ఫేమస్ అయ్యాయి. హాలీవుడ్ సినిమాలకు అతి పెద్ద ముడి సరుకు కూడా అయ్యాయి! కాని, ఇప్పుడు ఐసిస్ , ఆల్ ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థల హింసోన్మాదులు ది గ్రేట్ బ్రిటీష్ ఏజెంట్ జేమ్స్ బాండ్ నే వెక్కిరిస్తున్నారు. దాడి మీద దాడి చేస్తూ లండన్, మాంచెస్టర్ అన్న తేడా లేకుండా తెల్ల వాళ్ల గుండెల్లో నిద్దురపోతున్నారు. కేవలం బ్రిటనే కాదు … ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, స్విట్జర్లాండ్ అన్నీ గడగడ వణికిపోతున్నాయి!   సోమవారం మరోసారి బ్రిటన్ ఉలిక్కిపడింది. మాంచెస్టర్ నగరం బిక్క చచ్చిపోయింది. లండన్ లో ఆ మధ్య జరిగిన ఉగ్ర దాడి మరవక ముందే మరో ఇంగ్లీష్ సిటీలో మృత్యు సంగీతం మార్మోగింది. మాంచెస్టర్ ఎరీనాలో అమెరికన్ పాప్ సింగర్ అరియానా గ్రాండే షో ముగియగానే ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ఇది నిజంగా బ్రిటన్ కు ఒళ్లు గగుర్పొడిచే పరిణామం. ఎందుకంటే, ఇంత వరకూ యూరప్ లో ఆత్మాహుతి దాడులు చాలా తక్కువ. సిరియా, లిబియా, నైజీరియా, పాకిస్తాన్ లాంటి వెనుకబడ్డ దేశాల్లోనే జిహాదీలు ఆత్మాహుతులకు పాల్పడుతుంటారు. కాని, ఈసారి యూరప్ మొత్తానికి పెద్ద దిక్కైన బ్రిటన్ గుండెలో మానవ బాంబు పేలింది! ఇది రాను రాను క్షిణిస్తున్న అగ్రరాజ్యాల భద్రతా వ్యవస్థకి సంకేతం! అరికట్టలేని ఉన్మాద ఉగ్రవాద విలయానికి సూచన!   ఆధునిక ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తున్న ఉగ్రవాదం ఎలా మొదలైంది? అదొక పెద్ద చర్చ! ఒక్క మాటలో చెప్పుకుంటే మాత్రం ఉగ్రవాదానికి మూలాలు అమెరికా నేతృత్వంలోని బ్రిటన్ లాంటి దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్న నాటో కూటమిలో వున్నాయి. తమకు బిజినెస్ కావాలంటే ఆయుధాలు, బాంబులు అమ్మటం, అవసరం తీరగానే ఉగ్రవాదుల ఏరివేత అంటూ ముస్లిమ్ దేశాలపై దాడులు చేయటం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలకు పరిపాటి. ఇప్పుడు ఆ డేంజరస్ గేమ్ కి అసలు ఫలాల్నే పాశ్చాత్య దేశాలు అనుభవిస్తున్నాయి!   ఉగ్రవాదం విషయంలో పాశ్చాత్య దేశాల ద్వంద్వ నీతే కాదు మరో నిర్లక్ష్యమూ సామాన్య జనం కొంపలు ముంచుతోంది. ఉగ్రవాద పీడిత దేశాల నుంచీ వలస వచ్చే లక్షలాది జనాన్ని యూరోపియన్ దేశాలు అడ్డు అదుపు లేకుండా స్వీకరించేశాయి. అది మంచి విషయమే కావచ్చు. కాని, సామాన్య శరణార్థుల మధ్యలోనే మేక వన్నె ఉగ్రవాదులు కూడా యూరోప్ లో ప్రవేశించారు. ఈ మధ్య జరుగుతోన్న వరుస దాడులకి ఇదే కారణమంటున్నారు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు. ముస్లిమ్ దేశాల నుంచీ వలస వచ్చే వారిని తమ మతం కారణంగా తిరస్కరించాల్సిన అవసరం లేదు. కాని, అదే సమయంలో యూరోపియన్ సెక్యులర్ నేతలు తమ స్వంత ప్రజల భద్రత కూడా దృష్టిలో పెట్టుకోవాలి. శరణార్థులు అందరూ శరణమనే వస్తున్నారా? లేక రణానికి కుట్ర చేసేందుకు దేశంలో దూరుతున్నారా? గట్టి నిఘా పెట్టి నిర్ధారించుకోవాలి! నిజమైన ఉగ్ర దాడులు అరికట్టడం జేమ్స్ బాండ్ సినిమాలు తీసినంత తేలిక కాదు! దశాబ్దాలుగా ఉగ్రవాదానికి బలైపోతోన్న భారత్ లాంటి దేశాలు అదే నిరూపిస్తున్నాయి. ఇండియా, ఇజ్రాయిల్ లాంటి వాటి నుంచీ ఇప్పుడు యూరోప్, అమెరికా ఎంతో నేర్చుకోవాల్సి వుంది…

నంద్యాల వైసీపీ అభ్యర్ధి ఖరారు... కాక రేపుతోన్న జగన్‌ నిర్ణయం

  కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికకు వైసీపీ తరఫున అభ్యర్థి ఖరారైనట్లు తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఉపఎన్నిక అనివార్యమవగా... భూమా నాగిరెడ్డి వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరడంతో ఈ స్థానం తమదేనని, మళ్లీ తమ ఖాతాలో వేసుకుంటామని వైసీపీ చెబుతోంది, అందుకు పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. టీడీపీ నుంచి భూమా ఫ్యామిలీ బరిలోకి దిగితే... భూమా కుటుంబాన్ని ఎదుర్కొనే సత్తా ఉన్న గంగుల కుటుంబానికే టికెట్ ఇవ్వాలని డిసైడైనట్లు తెలుస్తోంది.   గంగుల కుటుంబం నుంచి వైసీపీ గూటికి చేరిన గంగుల ప్రభాకర్ రెడ్డికి నెల రోజులు తిరగక ముందే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు జగన్‌. దాంతో గంగుల ప్రభాకర్ రెడ్డి అన్న ప్రతాప్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వైఎస్ జగన్‌‌తో ప్రతాప్ రెడ్డి భేటీ కావడంతో ఆ వార్తకు బలం చేకూరింది. ప్రతాప్ రెడ్డి పార్టీలో చేరిన వెంటనే నంద్యాల ఉపఎన్నికలో అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ప్రతాప్ రెడ్డి చేరికపై జిల్లా వైసీపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. పార్టీలో చేరగానే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమేంటని పార్టీ అధిష్టానంపై కొందరు నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.   గంగుల కుటుంబానికి ఇప్పటికే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. మళ్లీ అదే కుటుంబానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడాన్ని కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. వారంతా జగన్‌తో చర్చించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న రాజగోపాల్ రెడ్డి... టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తనకే టికెట్‌ దక్కుతుందని విశ్వాసంతో ఉన్నారు. అయితే సడన్‌గా గంగుల ప్రతాప్‌రెడ్డి పేరు తెరపైకి రావడంతో... తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. అయితే పార్టీ నేతలకు నచ్చజెప్పి గంగుల ప్రతాప్‌‌రెడ్డికే టికెట్‌ ఇచ్చేందుకు జగన్‌ డిసైడైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి నంద్యాల టికెట్‌ గొడవ వైసీపీలో ఎలాంటి చిచ్చు పెడుతుందో చూడాలి.

తెలంగాణపై కమలం కన్నేయడానికి అసలు కారణమేంటంటే?

  2014 నుంచి మోదీ, అమిత్‌ షా ద్వయానికి దేశంలో ఎదురేలేదు. ఉత్తరభారతంలో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలనే కాదు, యూపీలో ప్రాంతీయ పార్టీలనూ పెకలించివేసింది. ఇప్పటివరకు 13 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలున్నాయి. కానీ దక్షిణాదిలో మాత్రం ఒక్కదాంట్లోనూ పవర్‌లో లేదు. అందుకే సౌత్‌పై ఎప్పుడూలేనంతగా కాన్‌సన్‌ట్రేట్ చేసింది. దక్షిణాదిలో, అందులోనూ తెలంగాణపై అమిత్‌ షా ఫోకస్‌ పెట్టడానికి చాలా కారణాలున్నాయి. కమలం వికసించడానికి ఇక్కడ చాలా అవాశముుందని ఆ పార్టీ నేతలు అంచనాకి వచ్చారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే బీజేపీ ప్రధాన ఉద్దేశం కాదు, కేంద్రంలోనూ ఈ రాష్ట్రం నుంచి కమలానికి ఎక్కువ బలం కావాలని అమిత్‌ షా తలపోస్తున్నారు.   దక్షిణాదిపై బీజేపీ దృష్టిపెట్డడానికి అసలైన కారణం మరొకటి ఉంది. 2014లో మెజార్టీ ఎంపీ స్థానాలను గెలిచింది ఉత్తరాదిలోనే. కానీ 2019లో ఈ స్థానాల్లో ఎన్ని నిలబెట్టుకుంటుంది అన్నది అనుమానమే. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత ఏదోక స్థాయిలో తప్పకుండా ఉంటుంది. అప్పుడు కేవలం ఉత్తరాది మీదే ఆధారపడితే, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అందుకే దక్షిణాదిలో బలం పెంచుకోవడం కాషాయదళానికి అనివార్యం. అందుకే మిషన్ 7‌ను ప్రారంభించింది బీజేపీ.  ఇందులో తెలంగాణ, ఏపీ, కర్నాటక, తమిళనాడు, కేరళతో పాటు ఒడిషా, వెస్ట్‌ బెంగాల్ ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా ప్లాన్ చేస్తోంది బీజేపీ. అయితే ఈ ఏడు రాష్ట్రాల్లో అన్నింటి కంటే కమలానికి మెరుగ్గా కనిపిస్తున్న ఏకైక స్టేట్‌ తెలంగాణ.   తెలంగాణలో, అందులోనూ హైదరాబాద్‌లో బీజేపీకి బలమైన క్యాడర్ ఉంది. గ్రేటర్‌లో సికింద్రాబాద్‌ ఎంపీ స్థానంతో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలున్నారు. గతంలో కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు గెలవడంతో, అక్కడా బీజేపీకి కాస్త పట్టుంది. మహబూబ్ నగర్ నుంచి గతంలో బీజేపీ నుంచి గెలుపొందిన జితేందర్ రెడ్డి, ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్నా, అక్కడ క్యాడర్‌ పటిష్టంగానే ఉంది. నిజామాబాద్ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణకు ఇప్పటికీ నిజామాబాద్‌లో పట్టుంది. హైదరాబాద్ తర్వాత బీజేపీ కీలకంగా భావిస్తున్న స్థానాల్లో మెదక్ లోక్‌సభా నియోజకవర్గం. ఆ పార్టీ నేతగా అలె నరేంద్ర పోటీ చేయడంతోపాటు ఎంపీగా గెలుపొందారు.   తెలంగాణలో తమకు అవకాశాలు మెండుగా ఉన్నాయని భావించడానికి బీజేపీ చాలా అంశాలను చూపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ డీలాపడుతోంది. టీడీపీ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. దాని ఓట్లు కూడా తమకే పడతాయనుకుంటోంది. మోదీ అభివృద్ది మంత్రంతో టీఆర్ఎస్‌కు ధీటుగా నిలబడగల పార్టీ తమదేనని భావిస్తోంది కమలం. కేసీఆర్ కుటంబ పాలనను ఎత్తిచూపుతామని, రైతులు, విద్యార్థులు, ఉద్యోగుల్లో కేసీఆర్ పట్ల వ్యతిరేకతను తమవైపు మళ్లించుకుంటామని అనుకుంటోంది. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనేన్న నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి విజయం సాధించాలనుకుంటోంది. మరి అమిత్‌‌షా ప్లాన్‌ వర్కవుట్‌ అవుతుందా? కమలం నేతల ఆశలు నెరవేరతాయో లేదో చూడాలి.

కేసీఆర్‌ను ఢీకొట్టే నాయకుడేడి?... అమిత్‌షా పాచికలు పారతాయా?

  తెలంగాణ అనగానే దేశవ్యాప్తంగా ఇప్పుడు గుర్తొచ్చే పేరు కేసీఆర్. తెలంగాణ సాధకుడిగా నాలుగున్నర కోట్ల ప్రజల్లో ఆయనకు విశేష అభిమానముంది. అందుకే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను, ఇప్పించిన బీజేపీని కాదని, కేసీఆర్‌కు పట్టంకట్టారు జనం. దేశమంతా మోదీ హోరుగాలిని తట్టుకుని తెలంగాణలో కేసీఆర్‌ విజయం సాధించారు. ఇప్పటివరకైతే, ప్రభుత్వ వ్యతిరేకత అంతగా కనిపించడం లేదు. మూడేళ్లలో వివిధ జిల్లాల్లో జరిగిన ఎన్నికల విజయాలే అందుకు నిదర్శనం. ఏ పార్టీకైనా అధికార కాంక్ష ఉండటం సహజమే, అయితే టీఆర్ఎస్‌ను కాదని ఇఫ్పుడు తెలంగాణలో ఏ పార్టీనీ జనం విశ్వసించే పరిస్థితిలేదంటున్నారు విశ్లేషకులు.   తెలంగాణలో టీఆర్ఎస్ తర్వాత బలంగా ఉన్న పార్టీ కాంగ్రెస్‌. కానీ నాయకుల్లో ఐక్యత లేకపోవడం, కేసీఆర్‌‌కు ధీటైన లీడర్‌ కానరాకపోవడం హస్తం పార్టీకి లోటు. కానీ ఊరూరా కాంగ్రెస్‌కు బలమైన క్యాడర్‌ ఉంది. టీడీపీలోనూ నాయకత్వ సంక్షోభమున్నా, కార్యకర్తలున్నారు. వామపక్షాల ప్రభావం నామమాత్రమైనా, పటిష్టమైన శ్రేణులున్నాయి. వీటితో పోలిస్తే, బీజేపీకి అంతబలమైన క్యాడర్ లేదు. మరి స్థానికంగా బలంగా ఉన్న ఈ పార్టీలను కాదని, బీజేపీకి పట్టంకడతారా? ఉత్తరాది ఫార్ములాకు ఇక్కడ ఆమోదం లభిస్తుందా? అంటే చెప్పలేని పరిస్థితి   క్షేత్రస్థాయిలో బలంగా లేనందుకే బీజేపీ రకరకాల ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్, టీడీపీలోని జనాకర్షక నేతలను పార్టీలోకి ఆహ్వానించాలనుకుంటోంది. కాంగ్రెస్‌ నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్, అలాగే టీడీపీ నుంచి రేవంత్‌ రెడ్డిలకు కాషాయ జెండా కప్పాలని ప్రయత్నిస్తోంది. ఇంకా భావసారూప్యత ఉన్న నాయకులను పార్టీలోకి చేర్చుకుని, బలమైన క్యాడర్‌ను నిర్మించుకోవాలని ప్రణాళికలు వేస్తోంది.   ఇలా బలమైన ప్రతిపక్షం లేకపోవడం, కులమత సమీకరణలు, మోడీ అభివృద్ది మంత్రతో తెలంగాణలో పాగా వేయాలని స్కెచ్‌ వేస్తున్నారు అమిత్‌ షా. టీఆర్‌ఎస్‌కు అసలైన ప్రత్యామ్నాయం బీజేపీనేనన్న భావన ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఎలాంటి వ్యూహాలతో ముందుకుపోవాలో మూడు రోజుల పర్యటనలో కాషాయ శ్రేణులకు వివరించబోతున్నారు షా. అయితే కేసీఆర్‌ను ఢీకొట్టగల నాయకుడు తెలంగాణ బీజేపీ నేతల్లో ఒక్కరూ కూడా కనబడటం లేదనే చెప్పాలి. మరి అమిత్‌ షా స్ట్రాటజీ ఇక్కడ సక్సెస్‌ అవుతుందో లేదో కాలమే సమాధానం చెబుతుంది.

రాయలసీమ టీడీపీలో వర్గపోరు... చంద్రబాబుకు తంటాలు..!

  తమ్ముళ్ల వ్యవహారం చంద్రబాబుకు బీపీ తెప్పిస్తోంది. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకూ ఎక్కడచూసినా పార్టీ ప్రతిష్టకు ఇబ్బంది కలిగే సంఘటనలు జరుగుతున్నాయి. వైసీపీ నుంచి వచ్చిన వలస నేతలతో పార్టీకి బలం అనుకుంటే, అదికాస్తా పార్టీలో వర్గపోరుకు ఆజ్యం పోసింది. దాంతో తానొకటి అనుకుంటే తమ్ముళ్లొకటి తలుస్తున్నారన్న ఆవేదన చంద్రబాబును వేధిస్తోంది. ముఖ్యంగా పార్టీలో నేతల మధ్య నెలకొన్న వర్గపోరు చివరకు హత్యలవరకూ దారితీయటం చంద్రబాబుకు ఆందోళన కలిగిస్తోంది.   ఏ ఒక్క జిల్లాలోనూ లీడర్లు హ్యాపీగా ఉన్న పరిస్థితి కనిపించటం లేదు. మొన్నటికి మొన్న చిత్తూరులో ఎంపీ శివప్రసాద్ చేసిన రచ్చ చంద్రబాబుకు తలబొప్పి కట్టేలా చేసింది. అదే సమయంలో మంత్రి పదవి ఆశించి భంగపడ్డ గాలి సైలెంటవ్వటం, మంత్రి పదవి తీసేసిన తర్వాత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కాస్తంత వయొలెంటుగా స్పందించటం పార్టీ శ్రేణుల్ని అభద్రతా భావానికి గురయ్యేట్లు చేసింది. ఇక అనంతపురంలో మంత్రి పరిటాల తనయుడు శ్రీరామ్ వివాదాల్లోకి తలదూర్చటం, తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో పయ్యావుల కేశవ్ వ్యూహాత్మక మౌనం పాటించటం పార్టీకి కొంత ఇబ్బందిగా మారింది.   ఇక ఎప్పుడూ వివాదాలతో సావాసం చేసే జేసీ సోదరులకు, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య నెలకొన్న విభేదాలు పార్టీని ఎప్పుడో ఇబ్బందుల్లోకి నెట్టేసింది. అదేవిధంగా కడప జిల్లాలో రామసుబ్బారెడ్డికి మంత్రి ఆదినారాయణరెడ్డికి మధ్య నెలకొన్న విభేదాలు ఎప్పటికప్పుడు బ్లాస్ట్‌ అవుతూనే ఉన్నాయి. గతంలో కేఈ వర్సెస్ భూమా వర్గంగా ఉండే కర్నూలు జిల్లాలో ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. ప్రస్తుతం భూమా వర్గానికి శిల్పా వర్గానికి మధ్య నెలకొన్న విభేదాలపై ముఖ్యమంత్రే స్వయంగా పంచాయితీ చేసినా ఇంకా చాపకింద నీరులా అసంతృప్తి సెగలు కొనసాగుతున్నాయి. ఇవి కేవలం ముఖ్య నేతల మధ్య వైరమే అనుకుంటే పొరపాటే ...ఎందుకంటే ఈ ప్రభావం జిల్లాలోని మారుమూల గ్రామాలవరకూ పాకిపోయింది..దీంతో రాజకీయ ప్రత్యర్ధులకు బలం కల్పించినట్లయింది.   ఓవరాల్‌గా చంద్రబాబుకు తమ్ముళ్ల తలనొప్పి ఎక్కువవుతోంది. బయట జరుగుతున్న రచ్చ కంటే పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న రచ్చే చంద్రబాబును మరింత ఆందోళనలోకి నెడుతోంది. పార్టీలో వలసల ప్రభావం, అంతర్గత కలహాలు, తమ్ముళ్ల బరితెగింపుతో పార్టీ ప్రతిష్టకు ముప్పు వాటిల్లుతుందనే భయం సైతం బాబును వెంటాడుతోంది.

టార్గెట్‌ టీఆర్‌ఎస్‌... వచ్చీరాగానే కేసీఆర్‌‌పై అమిత్‌షా బ్రహ్మాస్త్రం

  2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణ పర్యటన సాగుతోంది. అమిత్‌షా వచ్చీరాగానే కేసీఆర్‌ సర్కార్‌ను టార్గెట్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలతో మిషన్‌ తెలంగాణ స్టార్ట్‌ చేశారు. నల్గొండ జిల్లా తెరెట్‌పల్లిలో ఇంటింటికీ కలియదిరిగారు. దళితులతో సహపంక్తి భోజనాలు చేశారు. తెరెట్‌పల్లిలో గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించిన అమిత్‌షా.... కేసీఆర్‌‌ పాలనపై ఏ ఒక్కరూ సంతోషంగా లేరంటూ నిప్పులు చెరిగారు. ప్రజలకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారని టీఆర్‌ఎస్ సర్కార్ పై మండిపడ్డారు. కేసీఆర్‌ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అమిత్ షా ఆరోపించారు.   తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాలు సరిగా అమలు కావడం లేదన్నారు అమిత్ షా. దేశవ్యాప్తంగా 4కోట్ల మరుగుదొడ్లు కట్టిస్తుంటే.... తెలంగాణలో మాత్రం నిర్మాణాలు జరగడం లేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కేంద్రం అనేక పథకాలు అమలు చేస్తున్నా... తెలంగాణలో అమలుకు నోచుకోవడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బీజేపీ కార్యకర్తలదేనన్న అమిత్ షా.... తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.   నల్గొండ జిల్లా తెరెట్‌పల్లిలో గ్రామంలో పలువురి ఇళ్లకెళ్లిన కమల దళపతి... ప్రజల సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు కావడం లేదని గుర్తించిన అమిత్‌షా.... పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మోడీ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలను ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత బీజేపీ కార్యకర్తలేదన్నారు. మొత్తానికి మొదటిరోజే కేసీఆర్‌ ప్రభుత్వాన్ని అమిత్‌షా టార్గెట్‌ చేయడంతో.... టీఆర్ఎస్‌ నేతలు ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.

అమిత్‌‌షా, రాహుల్‌ టూర్లపై టీఆర్‌ఎస్‌ సర్వే... ఏం తేలిందంటే?

  తెలంగాణలో సాధారణ ఎన్నికలకు మరో 23 నెలల గడువే మిగిలి ఉంది. దాంతో సమయం దగ్గర పడుతున్నకొద్దీ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఇప్పటికే తెలంగాణలో పర్యటిస్తుండగా, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పది రోజుల వ్యవధిలో తెలంగాణకి రానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరి పర్యటనలూ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చాలా రోజుల తర్వాత రాష్ట్రానికి వస్తున్న రాహుల్‌గాంధీ జూన్‌ 1న సంగారెడ్డి బహిరంగ సభలో పాల్గోనున్నారు.   అమిత్‌‌షా, రాహుల్‌... ఇద్దరి టార్గెట్టూ టీఆర్‌ఎస్‌ పార్టీయే అయినా.... గులాబీ బాస్‌ మాత్రం ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. 2014 తర్వాత పార్టీ బలోపేతానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకున్న టీఆర్ఎస్... కలిసి వచ్చిన అందరి నేతలను పార్టీలో చేర్చుకుంది. 75 లక్షల మంది టీఆర్‌ఎస్‌ సభ్యత్వం తీసుకున్నారు. అంతేకాదు పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్ఠపరిచేందుకు నియోజకవర్గ కమిటీల ఏర్పాటుకు నిర్ణయించింది. పార్టీ ప్లీనరీ, ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. అయితే అమిత్‌షా, రాహుల్‌లు... టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేయడంతో ఏ స్థాయిలో ప్రభావం ఉంటుందో తెలుసుకోవడానికి సర్వేలు చేయిస్తోంది.   అమిత్‌‌షా, రాహుల్‌ పర్యటనల ప్రభావాన్ని సూక్ష్మస్థాయిలో విశ్లేషిస్తోంది టీఆర్‌ఎస్‌. అందుకే అమిత్‌ షా, రాహుల్‌ పర్యటించే ప్రాంతాల్లో జనం నాడిని తెలుసుకోవాలని సర్వే సంస్థలకు టీఆర్ఎస్ బాధ్యతలు అప్పగించింది. పార్టీ శ్రేణులు సైతం పరిస్థితులను సూక్ష్మంగా గమనించాలని, జనాభిప్రాయాన్ని తెలుసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అసంతృప్తులను విపక్షాలు తమ వైపు తిప్పుకునే అవకాశం ఉంటుందని, వీటిపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించింది. అయితే అమిత్‌షా పర్యటిస్తోన్న నల్గొండ జిల్లాలో, రాహుల్‌ పర్యటించనున్న సంగారెడ్డిలో టీఆర్‌ఎస్‌ బలంగా ఉందని, బీజేపీ, కాంగ్రెస్‌ అగ్రనేతలు పర్యటించినా తమకేమీ ఢోకా ఉండదని గులాబీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ నేతలు ఎందుకు కిమ్మనడం లేదు? అమిత్‌‌షాకి భయపడుతున్నారా?

  కమల దళపతి రావడం రావడమే టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేశారు. ఏదో ఆషామాషీగా తెలంగాణ పర్యటనకు రాలేదనే స్ట్రాంగ్‌ సంకేతాలు పంపారు. మొదటి రోజే అధికార పార్టీ టీఆర్‌ఎస్‌పైనా, ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ లక్ష్యం 2019నే అంటూ నేరుగా టీఆర్‌ఎస్‌కే సవాల్‌ విసిరారు. వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం కాస్కోమంటూ గులాబీ దళానికి హెచ్చరికలు పంపారు. కేసీఆర్‌ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్న అమిత్‌షా... కనీసం ప్రజలకు మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణలో సరిగా అమలు కావడం లేదన్న కమల దళపతి.... కేంద్రంలోనూ... రాష్ట్రంలోనూ ఒకే పార్టీ ....అధికారంలో ఉంటే ఇలాంటి సమస్య ఉండదని, మరింత అభివృద్ధి జరుగుతుందంటూ టీఆర్‌ఎస్‌ సర్కార్‌ను టార్గెట్ చేశారు.   కమల దళపతి కాలు దువ్వుతున్నా గులాబీ నేతలు మాత్రం కిమ్మనడం లేదు. అమిత్ షా ఆరోపణలపై స్పందించే లీడరే కనిపించడం లేదు. అమిత్ షా తొలి రోజే కాకపుట్టించే ప్రసంగం చేసినా టీఆర్ఎస్ లీడర్లు మాత్రం కౌంటర్‌ ఇచ్చేందుకు సాహసించలేకపోయారు. రాష్ట్ర నేతలు, విపక్ష లీడర్లు చేసే చిన్నచిన్న ఆరోపణలకే ఘాటుగా కౌంటర్‌ ఇచ్చే టీఆర్‌ఎస్‌ నేతలు... అమిత్‌షా విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు, ఎంపీలను  స్పందించమంటే... మంత్రులు చూసుకుంటారని..... మంత్రులను అడిగితే హైకమాండ్‌ చూసుకుంటుందని మాట దాట వేస్తున్నారు.   టీఆర్ఎస్ నిజంగానే బీజేపీకి భయపడుతోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమిత్‌షా నుంచి ఈ స్థాయిలో దాడి ఉంటుందని టీఆర్ఎస్ ఊహించలేకపోయిందా? లేదంటే కమల దళపతి అనూహ్యంగా విసిరిన సవాల్‌తో డిఫెన్స్ లో పడిపోయిందో తెలియడం లేదు. తెలంగాణలో నిజంగానే కేంద్ర పథకాలు అమలు కావడం లేదా? సొంత పథకాల కోసం కేంద్ర పథకాలను పక్కన పెడుతున్నారా..? అమిత్ షా ఆరోపణలకు టీఆర్ఎస్ దగ్గర సమాధానం లేదా? తెలంగాణలో ఎవరొచ్చినా భయం లేదన్న నాయకులు ఇప్పుడెందుకు సైలెంటైపోయారు... ఇలా అనేక ప్రశ్నలు, అనుమానాలు తలెత్తుతున్నాయి.

చంద్రబాబు ఆగ్రహానికి కారణమేంటి? నిజంగానే దోస్తీ చెడిందా?

  2014 ఎన్నికల్లో పాలూ నీళ్లలా కలిసిపోయారు. సైకిల్‌పై కమలాన్నెక్కించుకుని గత ఎన్నికల్లో రాష్ట్రమంతా చుట్టేసింది టీడీపీ. అయితే మూడేళ్లు తిరక్కుండానే ఆ బంధం సడలిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి? మిత్రలాభం కాస్తా మిత్రభేదంగా మారుతోన్న మాటలు వినిపిస్తున్నాయి? సైకిల్‌తో కటీఫ్ చెప్పేసి ఫ్యాను కింద సేదతీరేందుకు కమలం సిద్ధమవుతుందనే ఊహాగానాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ శరవేగంగా మారుతోన్న రాజకీయాలను చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఇలాంటి అనుమానం కలుగక మానదు. అంతేకాదు టీడీపీ-బీజేపీ నేతలు ఎడమొఖం... పెడమొఖంగా ఉంటున్నారంటున్నారు.   2019 నాటికి దక్షిణాది రాష్ట్రాల్లో సొంతంగా ఎదగాలనుకుంటున్న బీజేపీ... ఒంటరి పోరుకు మొగ్గుచూపుతోంది. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందంటూ కె.లక్ష్మణ్‌ ప్రకటించగా.... ఏపీలోనూ అదే దిశగా అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఏదైనా పార్టీతో కలిసి పోటీ చేయాలనుకుంటే... బీజేపీకి ఎక్కువ స్కోప్‌ ఉండేలా జాగ్రత్త పడుతోంది. అయితే టీడీపీతో కలిసి ముందుకెళ్తే కమలం ఎదుగుదలకు పెద్దగా స్కోప్‌ లేదని భావిస్తుందో ఏమో తెలియదు కానీ... తెలుగుదేశం నుంచి కొంచెం దూరం జరుగుతున్నట్లే కనిపిస్తోంది. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీతో దోస్తీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు పంపుతోంది. వైసీపీ అధినేత జగన్‌కు మోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం, మోడీతో జగన్‌ భేటీని బీజేపీ లీడర్లు వెనకేసుకురావడం చూస్తుంటే ఇలాంటి అనుమానం కలుగక మానదు.   జగన్‌... మోడీని కలవడంతో తెలుగు తమ్ముళ్ల ముఖంలో నెత్తురు చుక్క లేకుండా పోయింది. అది కూడా చంద్రబాబు విదేశాల్లో ఉన్న టైమ్ చూసి జగన్ అపాయింట్ మెంట్ కోరడం... వెంటనే మోడీ అంగీకరించడం, భేటీ జరగడం జరిగిపోయాయి. పైగా గంటపాటు ఏకాంత చర్చలు జరిపి బయటకొచ్చాక జగన్ చాలా ఉత్సాహంగా కనిపించారు. అంతేకాదు రాష్ట్రపతి అభ్యర్ధి ఎన్నికలో ఎన్డీఏకు మద్దతునిస్తామని ప్రకటించారు. ఈ పరిణామాలు టీడీపీకి కోపం తెప్పించాయి. అందుకే గతంలో రెండుమూడుసార్లు మోడీని జగన్‌ కలిసినా పెద్దగా స్పందించని టీడీపీ నేతలు... ఈసారి మాత్రం ఘాటుగానే రియాక్టవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం మోడీతో జగన్‌ భేటీ కావడంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో మోడీ-జగన్‌ భేటీపై బీజేపీ నేతలు సానుకూలంగా స్పందిస్తుండటం.... టీడీపీకి కోపం తెప్పిస్తోంది. అంతేకాదు విదేశాల నుంచి రాగానే చంద్రబాబు.... ప్రధాని అపాయింట్ మెంట్ కోరినా దొరకలేదనే టాక్‌ వినిపిస్తోంది. ఈ పరిణామాలన్నీ చూస్తున్న టీడీపీ నేతలు లోలోన ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మరి ఈ పరిణామాలు బీజేపీ-టీడీపీ దోస్తీపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి.

రాళ్లురువ్వినోడి బదులు ‘ఆమె’ను జీపుకి కట్టేయాలన్న రావల్!

  కాశ్మీర్ కాష్టంలా మండుతోంది. పోయిన సంవత్సరం ఒక్క ఉగ్రవాది ఛస్తే ఇప్పటి దాకా యుద్ధం కొనసాగుతూనే వుంది. బుర్హాన్ వని అనే టెర్రరిస్ట్ భద్రతా దళాల కాల్పుల్లో హతుడయ్యాడు. అప్పట్నుంచీ ఇప్పటి దాకా వేర్పాటు వాదుల రాళ్ల రణరంగం ఆగటమే లేదు. అయితే, రాను రాను కాశ్మీరీ వేర్పాటువాదుల దుర్మార్గాలు అన్ని హద్దులు చెరిపేస్తున్నాయి. తాజాగా ఒక క్రికెట్ మ్యాచ్ సందర్భంగా దేశ వ్యతిరేక శక్తులు పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు చెందిన జాతీయ గీతం ఆలపించారట! ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ పాక్ జెండాలు ప్రదర్శించే వేర్పాటు వాద కాశ్మీరీలకు ఇది మామూలు విషయమే కావచ్చు. కాని, మిగతా భారతీయులకి ఎంతో మనస్తాపం కలిగిస్తుంది. మోదీ వస్తే కాశ్మీర్ సమస్య కోలిక్కి వస్తుందనుకున్న వారైతే మరింత ఆవేదనకి గురవుతున్నారు పరస్థితుల్ని చూసి…   ఒక వైపు కాశ్మీర్ ను దేశం నుంచి వేరు చేయాలని దేశ ద్రోహులు కుట్రలు పన్నుతుంటే మరో వైపు మన మేధావులు కొందరు కాశ్మీరీ స్వాతంత్ర్యం అంటూ అమానుష వ్యాఖ్యలు చేస్తుంటారు. అలాంటి వారిలో ఎప్పుడూ వినిపించే కరుడుగట్టిన పేరు అరుంధతీ రాయ్. కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడే ఆమె పదే పదే అక్కడ జరిగే ఆజాదీ పోరాటాల్ని కూడా సమర్థిస్తుంటారు. ఈ  మధ్య అరుంధతీ ‘’ 7వేలు కాదు 7లక్షలు కాదు 70లక్షల మంది భారతీయ సైన్యం వచ్చినా ఆజాదీ బృందం గొంతు నొక్క’’లేరని రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించింది. అందుకు ప్రతిస్పందనగా అన్నట్టు బాలీవుడ్ సీనియర్ నటుడు పరేష్ రావల్ ట్విట్టర్ లో ఘాటైన కామెంట్స్ చేశాడు.   ఆ మధ్య రాళ్లు రువ్వే అల్లరి మూకల నుంచి తమని తాము కాపాడుకోవటానికి ఆర్మీ వారు ఒక కాశ్మీరీ వేర్పాటు వాదిని జీపుకి కట్టేసి తీసుకెళ్లారు. అతడి బదులు అరుంధతీ రాయ్ ని కట్టేయాలని తీవ్రంగా వ్యాఖ్యానించాడు పరేష్ రావల్! ఇది ఇప్పుడు ట్విట్టర్ లో పెద్ద దుమారంగా మారింది. చాలా మంది బీజేపి ఎంపీ అయిన రావల్ ను సమర్థిస్తున్నప్పటికీ విమర్శించే వారు కూడా చాలా మందే వున్నారు. అంతటి హింసాత్మక ట్విట్స్ పరేష్ స్థాయి నటుడి నుంచి ఆశించలేదని చాలా మంది ఖండించారు. అంతే కాదు, ఒక స్త్రీ పట్ల, రచయిత్రి పట్ల హింసాత్మాకంగా మాట్లాడటం దుర్మార్గమని తిట్టారు.   పరేష్ రావల్ ట్వీట్ నిజంగానే సమర్థనీయం కాదు. కాని, అదే సమయంలో అరుంధతీ రాయ్ దేశం కోసం పోరాడుతున్న ఆర్మీపై పదే పదే చేసే వ్యాఖ్యలు కూడా అత్యంత దిగువ స్థాయికే చెందుతాయి. ఎక్కడో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘన బూచిగా చూపి కాశ్మీర్ నే పాకిస్తాన్ కు వదిలేయమని ఆమె చేసే వాదన పరమ దుర్మార్గం. దానికి ప్రతిగానే పరేష్ రావల్ అలా స్పందించారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా, వివాదాలు రాజేసేలా కాకుండా కాశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపేలా పరేష్ రావల్, అరుంధతీ రాయ్ లాంటి సెలబ్రిటీలు మాట్లాడితే బావుంటుంది…