రాహుల్ కి పబ్లిసిటీ దక్కుతోంది! పబ్లిక్ లో నమ్మకం?
posted on Jun 8, 2017 @ 5:30PM
దేశంలో కాంగ్రెస్ పతనమవుతోందా? బీజేపి బలపడుతోందా? బీజేపి బలపడటం కంటే కాంగ్రెస్ పతనం అవుతోందని చెప్పటమే కరెక్టే! ఎందుకంటే, అడపాదడపా కమలదళం ఎక్కడైనా మంచి అవకాశం ఇచ్చినా హస్తం పార్టీ అధికారం హస్తగతం చేసుకోవటంలో విఫలం అవుతోంది. తాజాగా మధ్యప్రదేశ్ లో రైతులపై కాల్పులు అలాంటి దుర్ఘటనే!
ఎక్కడైనా సరే… అన్నం పెట్టే రైతులు తూటాలకు బలికావటం అత్యంత దారుణం. పోలీసులు కాల్పులు జరిపారో, లేదో మరో కారణం చేతనో, మొత్తానికి మధ్యప్రదేశ్ లోని మందసౌర్ ప్రాంతంలో విషాదం జరిగిపోయింది. కాల్పుల ఘటనలో కుట్ర కోణం వున్నా లేకున్నా.. బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. అంటే ఎంపీలోని బీజేపీదే! కాని, రైతుల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహాన్ని, మీడియాలో చెలరేగుతున్న చర్చని … కాంగ్రెస్ సద్వినియోగం చేసుకుంటోందా? రాహుల్ గాంధీ వ్యవహార శైలి చూస్తుంటే కాదనే అనిపిస్తోంది!
దాద్రిలో బీఫ్ కారణంగా మర్డర్ జరిగిందన్న వార్త వచ్చింది మొదలు హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య వరకూ రాహుల్ ఎక్కడ బీజేపి దోషిగా దొరుకుతుందా అని ఉరుకులు పరుగులు పెడుతున్నాడు. ఎక్కడ ఏ చిన్న కారణం దొరికినా యాంగ్రీ యంగ్ మ్యాన్ లా ఎంట్రీ ఇస్తున్నాడు. మధ్యప్రదేశ్ లోనూ అదే చేశాడు. అయితే, రైతులు మరణించి కర్ఫ్యూ అమల్లో వున్న సున్నితమైన ప్రాంతంలోకి ప్రతిపక్ష పార్టీ జాతీయ వైస్ ప్రెసిడెంట్ ని ఏ ప్రభుత్వమైనా అనుమతిస్తుందా? శివరాజ్ సింగ్ చౌహాన్ గవర్నమెంట్ కూడా పోలీసుల ద్వారా అదే చేసింది! కాని, మరణించిన రైతుల కుటుంబాల పరామర్శకి బయలుదేరిన రాహుల్ అరెస్టై, నిరసన తెలిపి వెనక్కి వచ్చేయలేదు. రచ్చ రచ్చ చేసి పబ్లిసిటీ స్టంట్ గా మార్చేసుకున్నాడు…
రైతుల కుటుంబాల్ని పరామర్శించటం మంచిదే అయినా పోలీసులు అనుమతించకపోగానే రూల్స్ ని బ్రేక్ చేసి హంగామా చేయటం రాహుల్ స్థాయికి తగదు. ఆయన పోలీసులతో పోట్లాడుకోవటమే కాకుండా ఒక పోలీస్ ని తోసేశాడు కూడా. అంతటితో ఆగకుండా పోలీసులు అనుమతించని ప్రాంతంలోకి నెంబర్ ప్లేట్ కూడా లేని బైక్ పైన మరో ఇద్దిరితో కలిసి ప్రవేశించాలని ప్రయత్నించాడు. హెల్మెట్ పెట్టుకోవాలని కూడా భావించలేదు! ఇంతా చేసి తనని పోలీసులు రైతుల కుటుంబాల వద్దకి పరిస్థితి ఉద్రిక్తంగా వున్నప్పుడు అనుమతించరని రాహుల్ కి తెలియధా? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏదైనా ఉద్రిక్త పరిస్థితి తలెత్తితే అక్కడికి ప్రతిపక్ష నేతల్ని స్వేచ్ఛగా వదిలేస్తారా? ఇంత మాత్రం లాజిక్ వుండాలి కదా?
రైతుల ప్రాణాలు పోయి జనం విషాదంలో వున్నప్పుడు వారికి నైతికంగా రాహుల్ అండగా వుంటే బావుంటుంది. అంతే కాని, అమాంతం సంఘటనా స్థలంపైకి దండెత్తి వచ్చి పోలీసులు చేయగానే రచ్చ చేసి దిల్లీకి తిరిగి వెళ్లిపోతే… శివరాజ్ సింగ్ ని కాదని రాహుల్ ని మధ్యప్రదేశ్ ఓటర్లు ఎందుకు నమ్ముతారు? త్వరలోనే భారతదేశ అత్యంత పురాతన పార్టీకి అధ్యక్షుడు అవుతాడని చెబుతోన్న రాహుల్ గాంధీ మరింత మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తే తప్ప బీజేపిని ఢీకొట్టడం సాధ్యం కాదు. నెంబర్ ప్లేట్ లేని బైక్ పై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే మీడియాలో కవరేజ్ తప్ప ప్రాక్టికట్ ఉపయోగం అంటూ వుండదు!