2019లో… పిల్ల కాంగ్రెస్‌కి తల్లి కాంగ్రెస్సే గండి కొడుతుందా?
posted on Jun 7, 2017 @ 2:59PM
రాహుల్ ఏపీకి వచ్చాడు. వెళ్లాడు. ఆంధ్రా హస్తానికి జరిగిన లాభమేంటి? ఏం లేదని పెదవి విరిచే వారూ వున్నా, ఎంతో కొంత కదలిక వచ్చిందని సర్ది చెప్పే వారూ వున్నారు! కాని, అసలు రాహుల్ ఆంధ్రా సభ ఎఫెక్ట్ ఎవరి మీదా? ఎంత వరకూ? ఇదీ ఇప్పుడు రకరకాల విశ్లేషణలకు తావిస్తోంది! అందులో ఒకటి కాంగ్రెస్ వర్సెస్ వైసీపీ సిద్ధాంతం!
మామూలుగా చంద్రబాబు లాంటి నాయకులు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అంటూ వుంటారు. అంటే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ అని అర్థం! జగన్ పార్టీ నిజానికి కాంగ్రెస్ లోంచి పుట్టుకొచ్చిందే. అందులోని మెజార్టీ నేతలు ఒకప్పుడు జై సోనియా అంటూ నినాదాలు చేసినవారే. తరువాత జగన్ టెన్ జనపథ్ ను ఢీకొట్టి వేరు కుంపటి పెట్టగానే ఫ్యాన్ కిందకొచ్చి కూర్చున్నారు బోలెడు మంది ఆంధ్రా కాంగ్రెస్ నేతలు. రాష్ట్ర విభజన తరువాత మరీ సున్నా సీట్లు కాంగ్రెస్ కి రావటానికి ఇది కూడా ఒక కారణం! రాష్ట్రాన్ని దారుణంగా విభజించిన హస్తానికి బుద్ధి చెప్పాలని జనం భావించినా… మెజార్జీ కాంగ్రెస్ నేతలు జగన్ కి జై కొట్టడంతో కూడా ఏపీలో కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోయింది! అలా ఒక వైపు విభజన, మరో వైపు జగన్ విప్లవం దెబ్బకి కాంగ్రెస్ కుదేలైంది!
2014లో వచ్చిన జీరో సీట్ల రిజల్ట్ చూసి అందరూ ఇక కాంగ్రెస్ ఖతమ్ అనుకున్నారు. మూడేళ్లుగా ఏపీలోని ఒకరిద్దరు బడా కాంగ్రెస్ నాయకులు కూడా అదే డిసైడ్ అయ్యారు. కాని, ఈ మధ్య జరిగిన రాహుల్ గుంటూరు సభ ఆశ్చర్యం కలిగించేలా కొనసాగింది. ప్రధాన ప్రతిపక్షంగా వున్న తెలంగాణలో ఎంత సక్సెస్ అయిందో దాదాపు అంతే విజయవంతం అయింది ఏపీలో కూడా! అసలు ఒక్క ఎమ్మేల్యే కూడా లేని ఆంధ్రాలో కాంగ్రెస్ కు అలాంటి రెస్పాన్స్ రావటం నిజంగా విచిత్రమే! కాని, జనం ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ భరోసా ఏంటో చూద్దామని వచ్చి వుంటారనుకోవాలి!
రాహుల్ సభకి జనం వచ్చారా? లేక తెచ్చారా? లాంటి ప్రశ్నలు పక్కన పెడితే … కమ్యూనిస్టులు, పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ మాటను బలపరుస్తున్నారు. ఇవ్వగలిగిన బీజేపి ఇవ్వనని తెగేసి చెబుతోంది కాబట్టి మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్సే ఇప్పుడు ప్రత్యేక హోదా ఆశావహులకి ఆశాదీపం. కాబట్టి వచ్చే ఎన్నికల్లో అమాంతం ప్రధాన ప్రతిపక్షం అవ్వలేకపోయినా కొన్ని సీట్లు మాత్రం కాంగ్రెస్ ఎగరేసుకుపోయే ప్రమాదం కనిపిస్తోంది! అయితే, ఈ ప్రమాదం టీడీపీ కంటే ఎక్కువగా వైసీపీకే అంటున్నారు విశ్లేషకులు! ఎందుకంటే, గతంలో కాంగ్రెస్ ను కాదని ఓటేసిన వారంతా వైసీపీకే వేశారు.
ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ను ఆదరించాలని వారు డిసైడ్ అయితే గండి పడేది జగన్ కే! 2019లో కాంగ్రెస్ కనీసం పది సీట్లు గెలిచి మరో ఇరవై, ముప్పై సీట్లలో గెలుపుని ప్రభావితం చేసినా వైసీపీ అధికార పీఠం ఆశలు తారుమారు కావచ్చు! అంతే కాక, మరో జాతీయ పార్టీ బీజేపి ఏ మేర వైసీపీ నేతలకి గాలం వేస్తుందో కూడా పెద్ద సస్పెన్స్ గా వుంది. అధికారంలో వున్న టీడీపీలోంచి పెద్దగా వెళ్లకుండా బీజేపిలోకి వైసీపీలోంచే ఎక్కువ మంది వెళ్లే అవకాశం కనిపిస్తోంది! అదే జరిగితే… ఇటు కాంగ్రెస్ , అటు బీజేపి రెండు పార్టీల మధ్యా జగన్ పార్టీ తీవ్ర ఇబ్బందులే పడాల్సి వుంటుంది. ఇక టీడీపీతో యథా ప్రకారం బద్ధ శత్రుత్వం వుండనే వుంటుంది!