విమానయాన సంస్థలు మెట్టు దిగాలా? జేసీ బెట్టు మానాలా?
posted on Jun 16, 2017 @ 2:36PM
నిరంతరం మారేది ఏది? కాలమే! కాలంతో పాటూ మనమూ మారాలి. ఈ విషయం అందరికంటే బాగా తెలుసుకోవాల్సింది రాజకీయ నేతలే! ఎందుకంటే, వారికి ఎప్పటికప్పుడు కాలం సవాలు విసురుతూనే వుంటుంది. అదీ జనం సోషల్ మీడియా సాక్షిగా ఫుల్లుగా అలెర్ట్ అయిన ప్రస్తుత తరుణంలో ఏ మాత్రం ఏమరపాటుగా వున్నా అంతే సంగతులు! కాని, ఈ సత్యం మన జేసీ దివాకర్ రెడ్డి గారికి బోధపడినట్టు లేదు! మొన్నటికి మొన్న శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఏం చేశారో దాదాపు ఈయన అలాంటి పనే చేసి చిక్కుల్లో పడ్డారు…
విశాఖ నుంచీ హైద్రాబాద్ రావాల్సిన జేసీ ఇండిగో విమానం ఎక్కాలి. లేటుగా వచ్చిన ఆయన బోర్డింగ్ పాస్ ఇవ్వాలంటూ గొడవ చేశారు. ఆలస్యమైంది కాబట్టి తరువాతి ఫ్లైట్ లో పంపుతామని చెప్పారు ఇండిగో కంపెనీ సిబ్బంది. అంతే దివాకర్ రెడ్డి దిక్కులన్నీ ఏకం చేశారు. ప్రింటర్ కింద పడేసి హంగామాకి కారణం అయ్యారు. ఇదే ఇప్పుడు ఆయనకు ఇబ్బంది తెచ్చిపెడుతోంది. మొదట్లో మామూలుగా సద్దుమణుగుతుందని అంతా భావించినా ఎయిర్ లైన్స్ సంస్థల వాలకం చూస్తుంటే గొడవ పెద్దదయ్యేలానే కనిపిస్తోంది.
ఇండిగో సిబ్బందితో గొడవ తరువాత వెంటనే మీడియాకి వివరణ ఇచ్చిన జేసీ దాడి చేయలేదని చెప్పారు. కాని, టీవీల్లో వచ్చిన వీడియో ఫుటేజ్ సీన్ వేరేలా చూపిస్తోంది. జేసీ ఆగ్రహంతో ఊగిపోవటం, ప్రింటర్ కిందపడటం లాంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే, మొదట ఆయన విమానయానంపై ఇండిగో ఎయిర్ లైన్స్ నిషేదం విధిస్తే ఇప్పుడు ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్ వేస్, విస్తారా, స్పైస్ జెట్, ఎయిరేషియా, గో ఎయిర్ కూడా దివాకర్ రెడ్డిపై వేటు వేశాయి. అంటే ఇక మీదట ఇన్ని సంస్థల విమానాలు వేటిల్లోనూ ఆయన తిరగటానికి వీల్లేదన్నమాట!
ఒక్కో సంస్థ… జేసీ లాంటి సీనియర్ ఎంపీని , అందులోనూ ఎన్డీఏ భాగస్వామి అయిన టీడీపీ పార్టీ నేతని నిషేధించటం కాస్త ఇబ్బందికర విషయమే. పైగా ప్రస్తుతం విమానయాన శాఖను చూస్తోంది మన తెలుగు వారు ఆశోక్ గజపతి రాజే! మరి ఆయన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ విషయంలో స్పందించినట్టు ధీటుగా స్పందిస్తారా… లేక సాటి తెలుగు వాడు, స్వంత పార్టీ ఎంపీ అయిన దివాకర్ రెడ్డిని వెనకేసుకొస్తారా చూడాలి! ఏది ఏమైనా జేసీ విశాఖ ఎయిర్ పోర్ట్ ఎపిసోడ్ అటు ఆయనకి, ఇటు పార్టీకి, కేంద్రంలో మోదీ సర్కార్ కి ధర్మ సంకటమే తెచ్చి పెట్టింది. ఈ గొడవ ఎంత దాకా సాగుతుందో చూడాలి. ఎయిర్ లైన్స్ సంస్థలు మెట్టు దిగుతాయా? జేసీ బెట్టు చాలిస్తారా? ఇవే ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నలు!