మైసూర్ రాజవంశాన్ని వెంటాడుతున్న 4వందలేళ్ల శాపం గురించి మీకు తెలుసా?
posted on Jun 16, 2017 @ 2:30PM
రాజ్యాలు, రాజవంశాలు పోయాయి. ఇప్పుడంతా ప్రజాస్వామ్యం , ప్రజలే రాజులు అనుకుంటాం. కాని, ఇప్పటికీ రాజులు, రాజ కుటుంబాలు, సింహాసనాలు అంటే జనానికి ఎక్కడలేని ఆసక్తి! కొందరికైతే పిచ్చి కూడా! ఉదాహరణకే బ్రిటన్నే తీసుకోండి. అక్కడ ప్రజాస్వామ్యం వచ్చేసి వందల ఏళ్లు గడిచిపోతోంది. అయినా బ్రిటన్ మహారాణి, యువరాజు అంటే ఎక్కడలేని ఇంట్రస్ట్ చూపిస్తారు ఇంగ్లీషు వాళ్లు. అలాంటి ఓ రాజ కుటుంబమే మనకూ వుంది! అదే మైసూర్ మహారాజా వంశం!
దేశానికి స్వాతంత్ర్యం వచ్చేదాకా మైసూర్ సంస్థానం పాలన కొనసాగింది. తరువాత అది ఇప్పటి కర్ణాటక రాష్ట్రంగా ఆవిర్భవించింది. కాని, మైసూర్ లో రాజవంశీయుల ప్యాలెస్, వారి ధనం, దర్పం అన్నీ చెక్కుచెదరకుండా వున్నాయి. ప్రతీ దసరాకు విద్యుత్ వెలుగుల్లో ధగధగలాడే ప్యాలెస్ ను మీడియా కూడా ప్రత్యేకంగా చూపిస్తూ వస్తుంది. కాని, అందంగా కనిపించే మైసూర్ ప్యాలెస్ లోలోపల దాగిన చాలా రహస్యాలు ఎవరికీ తెలియవు! అలాంటి ఓ రహస్యమే 4వందల ఏళ్లుగా మైసూర్ రాజవంశాన్ని వెంటాడుతోంది! దాని వల్లే ప్రతీ తరంలోనూ సింహాసనం అధిష్టించే వారసుడు లేక నానా తంటాలు పడుతున్నారు మైసూర్ రాజులు!
ఇప్పటికి 4వందల ఏళ్ల కింద మైసూరు రాజ్యాన్ని తిరుమలరాజు అనే ఆయన పరిపాలించేవాడు. కాని, ఆయనపై ఒడయార్ తిరుగుబాటు చేసి సింహాసనం దక్కించుకున్నాడు. ఇప్పటికీ ఒడయార్లే మైసూర్ ను ఏలుతున్నారు. కాని, ఒడయార్ వల్ల రాజ్యాన్ని, భర్తని కోల్పోయిన తిరుమలరాజు భార్య అలమేలమ్మ ఆగ్రహంతో కావేరీ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటూ మైసూర్ రాజవంశం సంతానం లేక అంతమైపోతుందని శపించిందట! అది నిజమవుతోందా అన్నట్లు… గత 4వందల ఏళ్లుగా మైసూర్ రాజైన ఏ ఒక్కరికీ కొడుకులు పుట్టలేదు. దగ్గరి బంధువుల్ని ఎవరో ఒకర్ని దత్తత తీసుకుని రాజును చేయటమే జరుగుతోంది.
ఇక ఇప్పుడు మైసూర్ సింహాసనంపై కూర్చున్న రాజు పేరు… యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్. ఆయన భార్య త్రిషీక కుమారి. వీరికి తప్పకుండా కొడుకు పుడతాడని జ్యోతిష్యులు చెప్పారట. వారు చెప్పినట్టే మహారాణి గర్భం ధరించింది. త్వరలో తల్లికానుంది! ఈ పరిణామంతో మైసూర్ కోటలో సంతోషం వెల్లివిరిస్తోందట! ఎందుకంటే, 4వందల ఏళ్లుగా ఏనాడూ పసి పాపల నవ్వులు మైసూర్ కోటలో వినిపించనేలేదు! ఇప్పుడిక తమ శతాబ్దాల శాపం తీరిపోయిందని వారు మురిసిపోతున్నారు…