చేప ప్రసాదం… విశేషాలు, విమర్శలు, వివాదాల సమ్మేళనం!
posted on Jun 9, 2017 @ 4:52PM
1. మృగశిర కార్తె వస్తే అందరూ వాన చినుకుల కోసం చూస్తారు! రైతులు విత్తనాలు చల్లేందుకు సిద్ధమవుతారు. కాని, లక్షలాది ఆస్తమా రోగులు భాగ్యనగరం వైపు చూస్తారు. బత్తిన సోదరులిచ్చే చేప ప్రసాదం కోసం నిరీక్షిస్తారు! ఇంతకీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చేప ప్రసాదం గతం, ఘనత ఏంటి?
2. ఏటా లక్షల సంఖ్యలో ఆస్తమా రోగులు హైద్రాబాద్ వచ్చి చేప ప్రసాదం తీసుకుంటారు. ఈ పరంపర ఇప్పటిది కాదు. 1847 నుంచీ కొనసాగుతోంది. నిజాముల కాలంలోనే చేప ప్రసాదం పంపిణీ పాతబస్తీలో మొదలైంది. ఇప్పుడు ప్రసాదం అందిస్తోన్న బత్తిన సోదరుల తాతగారైన బత్తిన వీరన్న తొలిసారి ప్రసాదం పంచటం మొదలుపెట్టారు. తరువాత బత్తిని వంశంలో వరుసగా మూడు తరాలు ఈ ప్రసాదం పంపిణీ ఉచితంగా చేస్తూనే వున్నారు.
3. చేప ప్రాసదం పంపిణీ వెనుక ఆసక్తికరమైన కథనం ఒకటి వుంది. 1847 ప్రాంతంలో ఒక సాధువు బత్తిన వంశానికి చెందిన వీరన్న గౌడ్ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు. జోరు వానలో తడిసిపోయిన వచ్చిన ఆ సాధువుకి వీరన్న గౌడ్ భక్తిగా సేవలు చేశారు. అందుకు మెచ్చి ఆయన ఆస్తమా మందు ఎలా తయారు చేయాలో చెప్పి దాన్ని ఏటా మృగశిర కార్తె రోజున ఉచితంగా పంపిణీ చేయమని చెప్పి వెళ్లాడు. అప్పట్నుంచీ బత్తిని వంశజులు శతాబ్దమున్నరకు పైగా విజయవంతంగా చేప ప్రసాదం రోగులకు అందిస్తూ వస్తున్నారు.
4. చేప ముందు మూడు రకాలుగా ఇస్తారు రోగులకి. పూర్తి శాఖాహారులైతే బెల్లంతో కలిపి ప్రసాదాన్ని అందిస్తారు. మాంసాహారులైతే కొర్రమీను చేప నోట్లో ప్రసాదాన్ని వుంచి… ఆ చేపని రోగి చేత మింగిస్తారు. ఇక మూడో రకం ప్రసాదం.. ప్రత్యేకంగా పత్యం చేసే వారికి వేస్తారు.
5. ఈ చేప ప్రసాదం ప్రత్యేకంగా మృగశిర కార్తె రోజునే ఇవ్వటానికి కారణం… మృగశిర కార్తె నుంచీ వాతావరణంలో మార్పు రావటమే. ఎండ తగ్గి తేమ క్రమంగా పెరుగుతూ వుంటుంది. అందువల్ల ఆస్తమా రోగులు ఇబ్బంది పడే అవకాశం కూడా ఎక్కువగా వుంటుంది. అందుకే, వర్షాలు మొదలయ్యే మృగశిర కార్తె రోజు ఆస్తమాను అరికట్టే చేప ప్రసాదం ఇవ్వటం ఆనవాయితి.
6. కొన్నాళ్లుగా ఎంతో చరిత్ర కలిగిన ఈ చేప ప్రసాదంపై హేతువాదులు, శాస్త్రీయవాదుల దృష్టి పడింది. జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు మీడియా సాయంతో ఏటేటా పెద్ద వివాదమే రాజేశాయి. చివరకు వ్యవహారం కోర్టు దాకా వెళ్లింది.
7. కోర్టులో చేప మందు అని కాకుండా చేప ప్రసాదం అని వ్యవహారించాలని జడ్జ్ తీర్పునిచ్చారు. అలాగే అనేక సూచనలు కూడా న్యాయస్థానం చేసింది. కాని, ఉద్యమకారులు కోరినట్టు చేప ప్రసాదం పంపిణీ మాత్రం నిషేధించలేదు.
8. శతాబ్దమున్నర కాలంగా రోగులు అంతకంతకూ పెరుగుతూనే వున్న చేప ప్రసాదం హానికరమని ఎక్కడా నిరూపించబడలేదు. అలాగే శాస్త్రీయత కూడా ఋజువు కాలేదు. కాని, చేప ప్రసాదం హైద్రాబాద్ కి ఒక ప్రత్యేకత అని మాత్రం చెప్పుకోవచ్చు. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లోంచి జనం ఈ ప్రసాదం కోసం ఏటా వస్తుంటారు!
9. వివాదాల కారణంగా మధ్యలో ప్రభుత్వం చేప ప్రసాదం పంపిణీకి అండగా వుంటం మానేసినా… ఇప్పుడు గవర్నమెంటే అన్ని ఏర్పాట్లూ చూసుకుంటోంది. వచ్చే రోగులకి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తపడుతోంది.
10. కాల పరీక్షకి నిలబడి, ఎన్ని విమర్శలు, వివాదాలు వచ్చినా తట్టుకున్న బత్తిని సోదరుల చేప ప్రసాదం ఒక విధంగా సాంస్కృతిక అద్బుతమే. ఇక దాని వైద్యపరమైన లాభాలు ఔషధం స్వీకరిస్తున్న ఆస్తమా రోగులకే తెలియాలి. అందులో ఎలాంటి ఉపయోగం లేకుంటే లక్షలాది మంది ఎంతో శ్రమకోర్చి తీసుకోరు కదా?