30 ఏళ్ల పార్టీ.. మూడు నిమిషాల్లో మటాష్..!!

తెలుగుదేశం పార్టీ.. దశాబ్ధాల పాటు ఏకఛత్రాధిపత్యం కింద ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కోటలను బీటలను వార్చిన పార్టీ. తెలుగోడి ఆత్మాభిమానాన్ని నిలబెట్టిన పార్టీ. ఒక ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ వంటి శిఖరాన్ని ఢీకొట్టడమంటే అది మామూలు విషయం కాదు.. అందుకు కారణం టీడీపీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారకరామారావు పిలుపునందుకొని పార్టీకి మద్ధతునిచ్చి.. నేటికీ పార్టీ జెండా మోస్తున్న కోట్లాది మంది కార్యకర్తలు. టీడీపీ ఇంతకాలం రాజకీయాల్లో మనగలిగిందంటే అందుకు కారణం బలమైన క్యాడరే. అటువంటి పార్టీలో ఒక కుదుపు తీసుకువచ్చింది రాష్ట్ర విభజన. ఏపీలో అధికారాన్ని అందుకున్న తెలుగు తమ్ముళ్లు.. తెలంగాణలో మాత్రం ప్రతిపక్షంలో కూర్చొవలసి వచ్చింది.   చివరిసారిగా 2004లో ఉమ్మడి ఏపీలో పవర్‌ను చేజార్చుకున్న తెలంగాణ తెలుగు తమ్ముళ్లకు ముచ్చటగా మూడో పర్యాయం కూడా ప్రతిపక్షమే దిక్కైంది. సమీప కాలంలో పార్టీ అధికారంలోకి వచ్చే సూచన కనిపించకపోవడంతో.. ఎంతోమంది నేతలు అధికార టీఆర్ఎస్‌లోకి జంప్ చేశారు. ఇదే క్రమంలో 2014లో 15 మంది శాసనసభ్యులతో బలంగా కనిపించిన టీడీపీ.. మూడున్నరేళ్లు గడిచేసరికి ముచ్చటగా ముగ్గురితో సరిపెట్టుకుంది. కానీ కిందా మీద పడి.. కార్యకర్తలతో మద్ధతుతో బండి లాక్కొస్తున్న చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ఊహించని షాక్‌నిచ్చారు.   టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరబోతున్న ఆయన ఎంతమంది నాయకులు బయటికి వెళ్లినా.. ఏన్ని రకాల రాజకీయాలు జరిగినా చెక్కుచెదరకుండా ఉన్న పార్టీ క్యాడర్‌ను బీటలు వార్చారు. ఎన్టీఆర్ టీడీపీకి అంకురార్పణ చేస్తూనే బీసీలను బలంగా ఆకట్టుకున్నారు. అంతేకాకుండా బలమైన రెడ్డి సామాజిక వర్గం కూడా టీడీపీ జెండా మోసింది. ఇంద్రారెడ్డి, మాధవరెడ్డి వంటి వారితో మొదలుకుని ఎంతో మంది రెడ్లు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా అంతకు మించిన నేతలుగా పార్టీకి సేవ చేశారు. ఇలా కులాలకు అతీతంగా టీడీపీకి అండగా నిలబడిన వారంతా ఇప్పుడు ఆ బంధాన్ని తెంచుకోవాలని చూస్తున్నారు. అందుకు కారణం రేవంత్‌ రెడ్డి.   తెలంగాణలో కేసీఆర్‌కు ఎదురునిలవగల మోనగాడికి ఆయనను చూస్తున్నారు టీడీపీ కార్యకర్తలు..అందువల్ల ఆయనకే తమ మద్ధతు ప్రకటించాలని భావిస్తున్నారు. ఇదొక్కటే కాదు.. స్వయంకృతమో.. మరేదైనా కారణమో కానీ ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడం పార్టీని జాతీయ స్థాయిలో అప్రతిష్టపాలు చేసింది. అప్పటి నుంచే టీడీపీకీ తెలంగాణలో పతనం స్టార్ట్ అయ్యిందని రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట. తొలి నుంచి రేవంత్‌ వ్యవహారశైలి నచ్చని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ నాశనం కావడానికి ఆయనే కారణమన్నారు.. పార్టీలోకి వచ్చిన ఆరేళ్లలోనే టీడీపీని భ్రష్టు పట్టించిన ఘనత రేవంత్‌రెడ్డిదే అన్నారు. తనతో పాటు ఎంతోమంది నేతలు 30 ఏళ్లపాటు ఎన్నో కష్టాలకోర్చి బలోపేతం చేసిన పార్టీని రేవంత్ నిమిషాల్లో నాశనం చేశారని వ్యాఖ్యానించారు. 

రేవంత్‌ ఇంటి వద్ద "స్పై"డర్లు

చంద్రబాబు విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత అమరావతికి వెళ్లిన రేవంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ తెలుగుదేశానికి రాజీనామా చేశారు. వస్తూ.. వస్తూ బెజవాడ దుర్గమ్మ ఆశీర్వాదం తీసుకొని సొంత నియోజకవర్గం కొడంగల్‌కు వచ్చారు. టీడీపీకి వీడ్కోలు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలిసినప్పటికీ.. దానిపై స్పష్టత లేదు.. ఇప్పుడే చేరుతారా లేదంటే టైమ్ తీసుకుంటారా అన్న దానిపై రేవంత్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే అభిమానులు, పార్టీ కార్యకర్తలతో హైదరాబాద్ జలవిహార్ వద్ద "ఆత్మీయ సమావేశం" నిర్వహించి అన్ని వివరాలు అప్పుడు ప్రకటిస్తానని రేవంత్ చెప్పారు.   కానీ పోలీసులు ఈ సమావేశానికి అనుమతి నిరాకరించారు. దీందో అందరూ తన ఇంటి వద్దకే రావాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. ఆయనకు తెలంగాణలో మంచి పాపులారిటీ ఉండటంతో రేవంత్ నాయకత్వంలో నడిచేందుకు చాలా మంది మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే టీడీపీ నుంచి ఈ లిస్ట్ రెడీ అయిపోగా.. టీఆర్ఎస్‌కు చెందిన పలువురు అసమ్మతి వాదులు కూడా వీరికి జత కలిసే అవకాశం ఉండటంతో కేసీఆర్ అలర్ట్ అయ్యారు.   ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ అధికారులు జూబ్లీహిల్స్‌లోని రేవంత్ ఇంటి పరిసరాల్లో నిఘా వేసినట్లు టాక్. ఆయనను ఎవరెవరు కలుస్తున్నారు.. ఈ సమావేశానికి ఎవరెవరు హాజరవుతున్నారు అనే విషయాలను అత్యంత రహస్యంగా సేకరిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. చెప్పినట్లుగానే ఇవాళ ఉదయం పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకున్న అనంతరం రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల నుంచి తనను కలిసిన కార్యకర్తలు, నేతలను అప్యాయంగా పలకరించారు. వీరిలో చాలా మంది తెలుగుదేశానికి చెందిన వారు కాగా.. కొందరు ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ నిఘా వేశారన్న వార్త కొందరిలో గుబులు రేపుతోంది.  

రేవంత్ వెనుకడుగు..?

గత కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో సంచలనానికి కేంద్ర బిందువుగా మారారు టీడీపీ నేత రేవంత్ రెడ్డి. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు మీడియాలో విస్తృతంగా కథనాలు రావడం... వరుస ఢిల్లీ పర్యటనలు.. సొంతపార్టీ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలతో రేవంత్ పార్టీ మారుతున్నారనే వార్తలకు బలం చేకూర్చాయి. ఈ వివాదాం అటు తిరిగి ఇటు తిరిగి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ వర్సెస్ రేవంత్ రెడ్డిగా మారిపోయింది. రేవంత్ ఒక మామూలు ఎమ్మెల్యేనని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, టీడీఎల్పీ నేతగా ఆయన ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని తమ అధినేత చంద్రబాబు స్పష్టం చేసినట్లు రమణ తెలిపారు. లండన్‌ పర్యటనలో ఉన్న బాబు ఈ అంశంపై తనతో ఫోన్‌లో మాట్లాడారని అన్నారు.   దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, టీడీఎల్పీ నేతగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని రేవంత్‌కు తాను సూచించినట్లు పేర్కొన్నారు. అయితే టీడీఎల్పీ నేత హోదాలో ఎల్పీ సమావేశాన్ని నిర్వహించాలని రేవంత్ నిర్ణయించారు. టీడీఎల్పీ నేతను నేనే.. సమావేశం నిర్వహించే హక్కు నాకే ఉంది.. ఎల్పీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి రమణ ఎవరు.. అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇవాళ గోల్కొండ హోటల్‌లో జరగనున్న టీడీపీ-బీజేపీ సమావేశానికి హాజరుకానని ప్రకటించారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ ఆయన వెనక్కు తగ్గారు. ఒక ఎమ్మెల్యేగా ఈ సమావేశానికి హాజరవ్వాలని రేవంత్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. 

నా నెంబర్‌కు ఆధార్‌ను లింక్ చేయను

ఇప్పుడంతా ఆధార్‌మయం.. సిమ్‌కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ దాకా ఆధార్‌ లేకపోతే ఏ పని జరగడం లేదన్నది అందరికి తెలిసిందే.. కేంద్రప్రభుత్వం నిర్ణయంతో ఎక్కడికి వెళ్లినా ఆధార్‌ని వెంటపెట్టుకోవాల్సి వస్తుంది. ఏ పనికైనా.. పథకానికైనా 12 అంకెల సంఖ్యను తప్పనిసరి చేస్తుండంటంతో సమస్త సమాచారం ఒకే ఛత్రం కిందకు వచ్చేస్తోంది. దీని వల్ల విస్తృత ప్రయోజనాలున్నట్లే అంతేస్థాయిలో ప్రమాదం ఉందని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా పౌరుల వ్యక్తిగత సమాచారానికి భద్రత లేకుండా పోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.   ప్రతీ దానికి ఆధార్ అనుసంధానం వల్ల ప్రజల బ్యాంక్ ఖాతా సంఖ్యలు, ఈ-మెయిల్స్ చిరునామాలు, ఫోన్ నెంబర్లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే ప్రమాదముందంటున్నారు. ఆధార్ అనుసంధానంపై ఇప్పటికే ఎన్నో పిటిషన్లు సుప్రీంకోర్టు వద్ద ఉన్నాయి. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం.. సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి చేయరాదని కేంద్రానికి అక్షింతలు వేసింది.   తాజాగా ఇదే వ్యవహారంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. తన ఫోన్ నెంబర్‌కు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆధార్‌‌ను జతపరిచేది లేదని ఆమె తేల్చి చెప్పారు. ఇవాళ కోల్‌కతాలో పార్టీ కోర్‌ కమిటీ సమావేశంలో మాట్లాడిన మమత ప్రతీ ఒక్కరూ తమ ఫోన్‌ నంబర్‌ను ఆధార్‌కు అనుసంధానం చేసుకోవాలన్న కేంద్ర ఆదేశాలను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. అసలు బీజేపీ ప్రభుత్వానికి ఏం కావాలి.. పౌరుల వ్యక్తిగత వివరాలను వినాలనుకుంటుందా అని ప్రశ్నించారు. ఆధార్‌ను ఫోన్‌ నెంబర్‌కు అనుసంధానం చేసిన తర్వాతి క్షణం నుంచి భార్యభర్తలు మాట్లాడుకునే వ్యక్తిగత వివరాలన్నీ బీజేపీ హెడ్ ఆఫీసుకు వెళ్లిపోతాయని ఆరోపించారు. నా సమాచారం అలా మూడో కంటికి తెలియడం నాకు ఇష్టం లేదు.. కాబట్టి నా ఫోన్‌ నెంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోనని.. కావాలంటే తన నంబర్‌ను కట్ చేసుకోవచ్చని అన్నారు.

లేచి నిలబడటానికి దొబ్బిడాయా?

విచారణలో ఉన్న కేసులు కోర్టుల్లో కోకొల్లలు. ఇప్పుడున్న న్యాయమూర్తులందరూ రిటైరైనప్పటికి కూడా.. ఈ కేసులు పూర్తవ్వవు. పైగా కొత్త కొత్త కేసులు  పుట్టుకొస్తుంటాయ్. కాబట్టీ... ఉన్న కేసులపై న్యాయమూర్తులు దృష్టి సారిస్తే సరిపోతుంది. ఉపయోగం లేని  వ్యవహారాలపై సమయం వృద్ధా చేసుకోవడం సుద్ధ దండగ. ఇది కేవలం నా అభిప్రాయం.   ‘సినిమా థియేటర్లలో జాతీయ గీతం తప్పని సరి.. అందరూ లేచి నిలబడాల్సిందే’ అనే నిబంధన పెట్టింది న్యాయస్థానాలే. ఈ వ్యవహారంపై ఎవరో ‘మేధావి’ గారు...‘ఎందుకు నిలబడాలి’ అని కోర్టులో పీల్ దాఖలు చేశారు. పనిలేనోడు పిల్లి తల గొరిగాట్ట. బహుశా వీరిది అదే కోవ. వార్తల్లో వినిపించాలి, కనిపించాలి.. ఈ కక్కుర్తితో.. సింపుల్ గా కొన్ని కాగితాలు నావి కావ్ అనుకుంటారు. వీటిపై కోర్టెందుకు స్పందించాలి? ‘మాకు చాలా పనుంది’ అని వి...స్సిరి అవతలేయొచ్చుగా? పక్కనే డస్ట్ బిన్లు ఉన్నాయి కూడానూ!    అసలు నాకు తెలీక అడుగుతానూ... జాతీయ గీతం వినిపిస్తే... కాసేపు నిలబడటానికి దొబ్బిడాయా? జనవరి 26న ఓ సారి... పంద్రాగస్టున మరో సారి... జాతీయ జెండాకు ‘జై’ కొట్టే  సిగ్గులేని ‘జాతి’ మనది. సినిమాలు మాత్రం వారానికోసారి చూడాల్సిందే. ఏ? ఏసీ థియేటర్లో కూర్చున్నప్పుడు.. కాసేపు ‘జనగణమన’ కోసం లేచి నిలబడతే మీ సొమ్మేమైనా పోతుందా?    ‘అలా నిలబడటం అసహజంగా ఉంటుందట’ ఒకాయన అన్నాడు. ‘భక్తి మనసుల్లో ఉండాలట’ ఇది ఇంకొకరి స్టేట్మెంటూ!. ఎదురుగా తెరపై జెండా రెపరెపలాడుతూ కనిపిస్తుంటే... నువ్వు ఏసీ థియేటర్లో కాలుమీద కాలేసుకొని చూస్తూ కూర్చోవడం దేశభక్తి అవుతుందా? మనకు స్కూళ్లలో నేర్పించి అదేనా?. నీ మనసులో భక్తి లేదని ఎవరూ అనడం లేదు. అది ప్రదర్శించే అవకాశం అరుదుగా మాత్రమే వస్తున్నప్పుడు... దాన్ని పాటించి, భావితరాల వారికి మార్గదర్శివి కమ్మని అంటున్నాం. అలా చేస్తే... నిన్ను చూసి నీ పిల్లలకు దేశభక్తి పెరుగుతుంది. దేశం పట్ల గౌరవభావం పెరుగుతుంది. దేశం తల్లి. దేశాన్ని ప్రేమించని వాడు తల్లిని కూడా ప్రేమించలేడు. ఈ విషయం ప్రతి ఒక్కరికీ అర్థమవ్వాలి. దానికి ఇదే మార్గం. నిజానికి థియేటర్లలో జాతీయగీతం అనేది ప్రతి ఒక్కరికీ ఓ మహద్భాగ్యం. కానీ... కొందరు చీడపురుగులకు ఇది కూడా భారంగా కనిపిస్తోంది. ఇది మన దౌర్భాగ్యం.    తమిళ నటుడు అరవింద్ స్వామిగారు రీసెంట్ గా ట్వీటాట్ట. ‘సినిమా హాళ్లలోనే వందేమాతరం ఎందుకు? ప్రభుత్వ కార్యాలయాల్లో, కోర్టులు, అసెంబ్లీ, పార్లమెంట్ ప్రారంభంలో జాతీయగీతం ఎందుకు వినిపించదు?’ ఇవి ఈయనగారి ప్రశ్నలు. ఈ ప్రశ్నలను బట్టి... స్వామిగారి పరిజ్ఙానం ఏ పాటిదో తేలిపోయింది. ప్రభుత్వకార్యాలయాల్లో జాతీయ గీతం తప్పని సరి. పాటించకపోవడం వ్యవస్థలో సమస్య. ఇక కోర్టులు, పార్లమెంట్, అసెంబ్లీ అంటారా..! వాటి ప్రారంభ సమయాల్లో తప్పకుండా జాతీయ గీతాలాపన ఉండాల్సిందే. ఈ విషయం స్వామిగారికి తెలీకపోవడం.. రొంబా.. బాధాకరం.  ఏనాడైనా టీవీల్లో అయినా అసెంబ్లీ చూసిన ముఖమైతే...  ఆ విషయం తెలుస్తుంది. పాపం... ఇలాంటి వాళ్లను చూసి మనం జాలిపడటం తప్ప.. ఏమీ చేయలేం. ‘మేం మేధావులం’ అని వాళ్లకు వాళ్లు ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఈ కారణంగానే... ఇలాంటి పస లేని స్టేట్మెంట్లు ఇస్తుంటారు.  టోటల్ గా చెప్పేదొక్కటే... జాతీయ గీతం వినిపిస్తే... ‘లేచి నిలబడండి’. మంచి పని చేశామన్న ఆనందంతో మనసు నిండుతుంది. వెనుక తరాల వారికి ప్రవర్తన నేర్పిన వాళ్లం అవుతాం. ఎంతోకొంత కేలరీలైనా తగ్గుతాయ్ ..  అదన్నమాట విషయం‘జైహింద్’. 

జగన్ ఒకటి కాదా..? వంద మెట్లు దిగుతారా.??

ఎవ్వరు చెప్పినా వినని మొండితనం.. ఎంతటి రాజకీయ అనుభవం ఉన్న వారైనా సరే నా మాట వినాల్సిందే అన్న వైఖరి.. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన నేతలు జగన్ గురించి చేసిన వ్యాఖ్యలు. ఒకరు చెప్పారంటే అది కోపంతో చెప్పారు అనుకోవచ్చు.. కానీ కోరస్ పాడినట్లుగా అందరూ ఒకే మాట చెప్పడంతో నమ్మక తప్పని పరిస్థితి. ఈ తత్వమే జగన్‌ను చాలా తక్కువ ఓట్ల శాతంతో అధికారానికి దూరం చేసిందని సాక్షాత్తూ పార్టీ నేతలే బహిరంగంగా అనే మాట. అప్పట్లో రుణమాఫీని ప్రకటించాలని సీనియర్ నేతలు నెత్తి, నోరు మొత్తుకున్నారట. కానీ జగన్ వద్దంటే వద్దు అన్నారట. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు దానిని ఆచరణలో చేసి చూపించారు.. నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు.   ఇప్పుడు చేసిన తప్పులు జగన్‌కు గుణపాఠం నేర్పినట్లు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కొన్ని వర్గాలు మాత్రమే తనకు మద్ధతు ఇస్తున్నాయని.. వీరి మద్ధతుతోనే అధికారాన్ని అందుకోవడం దుర్లభమని గుర్తెరిగిన వైసీపీ అధినేత వ్యూహాన్ని మార్చారు. దీనిలో భాగంగా తన వైరి పక్షాలను, వ్యతిరేకించే వర్గాల మద్ధతు పొందాలని స్కెచ్ గీస్తున్నారు. నవంబర్ 2న పాదయాత్ర ప్రారంభించే నాటికి ఈ ప్లాన్‌ను విజయవంతంగా అమలు జరపాలని చూస్తున్నారు. ముందు నుంచి క్రైస్తవ పక్షపాతిగా ఉన్న ముద్రను పొగొట్టుకోవడం కోసం హిందూ మతానికి చెందిన స్వామిజీలు, మఠాధిపతులను కలుసుకోవడం.. వారి ఆశీస్సులు తీసుకోవడం చేస్తున్నారు. అలాగే తన తండ్రి కాలం నుంచి తన కుటుంబం పట్ల.. పార్టీ పట్ల వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల అధినేతలు రామోజీరావు, వేమూరి రాధాకృష్ణలను కలవాలని ఆయన భావిస్తున్నారు.   2014 ఎన్నికల ఓటమితో జగన్.. రామోజీరావుతో రాజీకి వచ్చారు.. ఎన్నికల ముగిసిన కొద్ది నెలల్లోనే స్వయంగా రాజగురువుని కలిసి వచ్చారు. ఆ తర్వాత మోహన్‌బాబు కుమారుడు మనోజ్ వివాహ సమయంలోనూ సమావేశమయ్యారు. దీంతో అప్పటి నుంచి ఈనాడులో జగన్‌పై వ్యతిరేక వార్తలు బాగా తగ్గాయి.. ఆయన అటెండైన చిన్నా, పెద్ద వార్తలు ఈనాడులో కనిపిస్తున్నాయి. తన తండ్రి వైఎస్ పాదయాత్రకు ముందు రామోజీరావును కలిసి పాదయాత్రకు విస్తృతమైన కవరేజీ ఇచ్చింది. ఇప్పుడు అదే స్ట్రాటజీని తను అమలు జరపాలని భావించిన జగన్ రాజగురువును కలిశారు. ఇక ఈ ప్లాన్‌లో నెక్ట్స్ పర్సన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ.. ఈనాడు తర్వాత తనను ఢీ అంటే ఢీ అంటున్న జ్యోతిని కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఆర్కే అపాయింట్‌మెంట్ కోరారట. అయితే వీరిద్దరి భేటీ ఎప్పుడన్నది తెలియదు. ఏది ఏమైనా ఈ సారి ఎలాంటి తప్పులు చేయకూడదని.. రాబోయే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో గెలవాలని జగన్ మెట్టు మీద మెట్టు దిగుతున్నారు.

మీ ఇంట్లో కుక్క ఉందా.. అయితే పన్ను కట్టండి..!

కాదేది కవితకు అనర్హం అన్నట్లు.. కాదేది పన్నుకు అనర్హం అంటున్నాయి ప్రభుత్వాలు. అప్పట్లో ఔరంగజేబు పెళ్లి చేసుకున్నా.. పండుగ చేసుకున్నా పన్ను విధించేవాడని చరిత్ర పుస్తకాల్లో చదివి ఇలాంటి పన్నులు కూడా ఉండేవా అని ముక్కు మీద వేలేసుకునే వాళ్లం. కానీ ఇప్పుడు ప్రభుత్వాల తీరు చూస్తుంటే అప్పటి రోజులే బెటరేమో అనిపించక మానదు. సంపాదించినా పన్ను.. ఖర్చు చేసినా పన్ను.. తింటే పన్ను.. కొంటే పన్ను ఇలా రకరకాల పన్నులతో సగటు భారతీయుడిని పన్ను పీకేస్తుంది.. ఈ పన్ను పోటులో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. ఇవి చాలవన్నట్లు ఇంకా కొత్త పన్నులు వస్తూనే ఉన్నాయి.   తాజాగా పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం పన్ను పోటుకు కొత్త అర్థం చెప్పింది. ఇంటికి కాపలా కోసమో.. సరదాగా గడిపేందుకనో.. తరతరాలుగా మన ఇళ్లలో పెంపుడు జంతువుల్ని పెంచుకుంటూ వస్తున్నాం.. వాటిని ఎందుకు వదిలి వేయాలి అనుకున్నారో ఏమో కానీ పంజాబ్ ప్రభుత్వం వీటిపైనా పన్ను కట్టాల్సిందేనని హుకుం జారీ చేసింది. రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజల ఇళ్లలో కుక్క పిల్లి, పంది, గొర్రె, ఒంటె, గాడిద, ఆవు, బర్రె వంటి పెంపుడు జంతువులు ఉంటే పన్ను కట్టాలని నోటీఫికేషన్‌లో తెలిపింది. మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ నేతృత్వంలో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. పంచాయతీలను మినహాయించి అన్ని మున్సిపాలిటీలు, నగరాల్లో ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొన్నారు. రూ. 200 నుంచి రూ.500 వరకు పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వుల సారాంశం.   ఒకవేళ ప్రజలు పన్ను కట్టకపోతే జంతువులను స్వాధీనం చేసుకోవచ్చనే అధికారాన్ని ఆయా అథారిటీలకు కట్టబెట్టింది సర్కార్. బ్రాండింగ్ కోడ్ పేరిట గుర్తింపు చిహ్నాలను లేదా నంబర్లను వాటికి కేటాయించటం గానీ.. అవసరమైతే మైక్రో చిప్‌లను అమర్చడం గానీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనిపై జంతు ప్రేమికుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇంట్లో సరదాగా పెంచుకునే జంతువులపై పన్నులు విధించడం ఏంటని వారు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. ఈ పన్ను వలన మూగజీవులకు కానీ.. పన్ను కట్టే వారికి ఏ విధమైన ప్రయోజనం లేదని.. అందువల్ల ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఈ తరహా విధానాన్ని కేరళ, గోవా ప్రభుత్వాలు అమలు చేసేందుకు ప్రయత్నించగా.. పెద్ద ఎత్తున నిరసన వెల్లువెత్తడంతో అవి వెనకడుగు వేశాయి.

మోడీ వర్సెస్ స్టార్స్..

  పాపం బీజేపీ పరిస్థితి తమిళనాడులో అంత బాలేదని చెప్పొచ్చు. ఎందుకంటే వరుసపెట్టి సూపర్ స్టార్స్ అందరూ తమ వ్యతిరేకతను చూపిస్తున్నారు. ఎవరైతే ముందు ఆ పార్టీకి మద్దతు పలికారో ఇప్పుడు వాళ్లే బీజేపీకి వ్యతిరేకత చూపిస్తుండటంతో బీజేపీ నాయకులు ఏం చేయాలో తెలియని అయోమయంలో పడ్డారు. ప్రధానిగా మోడీ ఎప్పుడైతే అధికారం చేపట్టారో అప్పటినుండి బీజేపీ పార్టీ రూపురేఖలే మారిపోయాయి. ఉత్తరాధిన ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా బీజేపీకి ఎదురులేకుండా పోయింది. అన్ని ఎన్నికల్లో దాదాపు విజయం సాధిస్తూ ప్రతిపక్ష పార్టీలకు నిద్రపట్టకుండా చేసింది. ఈ నేపథ్యంలో దక్షిణాధిన ప్రాంతాలపై కూడా దృష్టి సారించారు బీజేపీ పెద్దలు. కానీ తమిళనాడులో మాత్రం బీజేపీ వర్సెస్ స్టార్స్ అన్నట్టుమారింది పరిస్థితి.   ఇక తమిళనాడులో జయలలిత మరణానంతరం అస్తవ్యస్తంగా మారిన తమిళనాడు రాజకీయాల్లో కూడా వేలు పెట్టిన బీజేపీ.. అన్నాడీఎంకేకు తమ మద్దతు పలికి.. అధికారంలో కూర్చోబెట్టి తెర వెనుక ఉండి రాజకీయాలు నడిపిద్దామని ప్లాన్ వేసింది. కానీ అవి పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇక తాను రాజకీయ ప్రవేశం చేస్తున్నానని చెప్పిన రజనీకాంత్ పై దృష్టి పెట్టిన బీజేపీ రజనీ బీజేపీలోకి రావాలని..బీజేపీలో చేరాలంటూ రజనీకాంత్‌ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కోరారు. అంతేకాదు పలువురు ప్రముఖులు ద్వారా రాయబారాలు కూడా పంపారు. కానీ రజనీ మాత్రం ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదు. అయితే తాజాగా.. మెర్సల్ సినిమా వివాదంపై స్పందించిన రజనీ బీజేపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి బీజేపీకి షాక్ ఇచ్చాడు. ‘మెర్సల్’ సినిమా మంచి అంశాలను ప్రస్తావించారని ఆల్ బెస్ట్ అని చెప్పారు.   ఇక రజనీ తరువాత రాజకీయాల్లోకి వస్తున్నా అని చెప్పిన కమల్ కూడా ఏందుకో బీజీపీ విషయంలో తన మనసు మార్చుకున్నాడు. తమిళనాడు ప్రజల కష్టాలు తీర్చడానికి అవసరం అయితే బీజేపీతో కలిసి పని చెయ్యడానికి తాను సిద్దంగా ఉన్నానని కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత ఏమైందో ఏమో తెలియదు కానీ.. తన సిద్దంతాలకు బీజేపీ సిద్దాంతాలకు చాల వ్యత్యాసం ఉందని.. నోట్ల రద్దుకు బీజేపీకి మద్దతు తెలిపినందుకు క్షమాపణలు అడుగుతున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు.   ఇక ఇప్పుడు వాళ్లకి తోడుగా ప్రకాశ్ రాజ్ చేరాడు. గత కొద్దిరోజులుగా ప్రకాశ్ రాజ్ బీజేపీ తీరుపై మండిపడుతున్నారు. గౌరి లంకేశ్ హత్యకేసులో నోరు విప్పిన ఈయన.. తాజాగా తాజ్ మహల్ వివాదంపై కూడా స్పందించారు. తాజ్ మ‌హ‌ల్ చ‌రిత్ర త‌వ్వ‌కాలు మొద‌లుపెట్టార‌ని, ఇంత‌కీ తాజ్ మ‌హ‌ల్ ను ఎప్పుడు ప‌డ‌గొట్టాల‌ని అనుకుంటున్నారో చెబితే…త‌న పిల్ల‌ల‌కు చివ‌రిసారిగా తాజ్ మ‌హ‌ల్ ను చూపిస్తాన‌ని ట్వీట్ చేశారు. అంతేకాదు..  ప్రశ్నించడం అనేది నా ప్రాధమిక హక్కు..నేను ప్రస్నిస్తూనే ఉంటా..నా ప్రశ్నల వర్షం కొనసాగిస్తా అని ట్వీట్ చేశాడు.   రాజకీయాల్లో సినీ గ్లామర్‌ గురించి కొత్తగా చెప్పుకోడానికేముంది.? రాజకీయ పార్టీల్లో సినిమా గ్లామర్ ఎంత వరకూ ఉపయోగపడుతుందో అందరికీ తెలిసిందే. తమ అభిమాన హీరోలు ఏ పార్టీ తరపున ప్రచారాలు చేస్తారో.. అభిమానులు కూడా ఆ పార్టీకి ఓట్లు వేసి తమ అభిమానాన్ని చాటుకుంటారు. అందుకే రాజకీయ పార్టీలు కూడా సినిమారంగానికి చెందిన వారికి పార్టీల్లోకి తీసుకోవడానికి ఏ మాత్రం ఆలోచించరు. కానీ ఇప్పుడు వరుసపెట్టి తమిళనాడులో సూపర్ స్టార్స్  బీజేపీకి వ్యతిరేకంగా మారడం ఓ రకంగా పార్టీ నష్టం కలిగించేదే. మొత్తానికి బీజేపీ పప్పులు తమిళనాడులో ఉడికే ఛాన్స్ లేనట్టే కనిపిస్తోంది. మరి ముందు బీజేపీకి మద్దతు పలికిన స్టార్స్ ఇప్పుడు ఎందుకు పార్టీ నచ్చడం లేదు.. లేక బీజేపీనే అలా వ్యవహరిస్తుందా... ఇంకా ఎంత మంది స్టార్స్ కు బీజేపీ విధి విధానాలు నచ్చడం లేదు... ఇవన్నీ తెలియాలంటే మనకి కూడా రాజకీయ నాయకులకు ఉన్న బుర్ర ఉండాల్సిందే.

బీజేపీ నేతపై మెర్సల్ పైరసీ మచ్చ

విజయ్ ప్రధానపాత్రలో చేసిన మెర్సల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. కొందరు ఈ సినిమాకి మద్దతిస్తుంటే, మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా బీజేపీ నేతలు మెర్సల్ విడుదలయినప్పటినుండి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పథకాలపై విమర్శలు చేయడం సరికాదని విజయ్ పై, సినిమా దర్శక, నిర్మాతలపై తమ అసహనం వ్యక్త పరుస్తున్నారు. వత్తిడికి తలొగ్గిన మెర్సల్ నిర్మాత మురళి సినిమాలో నుండి వివాదాస్పద సన్నివేశాలు తొలగిస్తానని ప్రకటించారు.   ఇది ఇలా ఉంటే, ఒక టీవీ చర్చలో పాల్గొన్న బీజేపీ నేత హెచ్ డీ రాజా తాను మెర్సల్ సినిమాని ఆన్‌లైన్‌లో చూశానని... ప్రభుత్వ పథకాల్ని విమర్శిస్తూ సినిమా ఉందని వ్యాఖ్యానించారు... అలోచించి మాట్లాడాడో, అనాలోచితంగా ఈ వ్యాఖ్యలు చేసాడో తెలియదు కానీ ఇప్పుడు ఈ విషయం తమిళనాట దుమారం లేపుతుంది. ఒక బాధ్యతగల నాయకుడయి ఉండి పైరసీ చూడడం ఎంత వరకు సమర్ధనీయం అని పలువురు రాజాపై దుమ్మెత్తి పోస్తున్నారు.   తమిళ నటుడు, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ ఈ విషయంపై స్పందిస్తూ, రాజా చర్య పూర్తిగా విచక్షణా రహితం అని. తాను నిజంగా ఆశ్చర్యపోయానని ఇలాంటి బాధ్యతగల వ్యక్తులు పైరసీ చూడటమే కాకుండా అది పబ్లిక్ గా ప్రకటించడం హేయమని అభిప్రాయపడ్డారు. మరికొందరు సినీ పరిశ్రమ వ్యక్తులు మెర్సల్ కి తమ మద్దతు తెలుపుతూ బీజేపీ నాయకుడి చర్యని ఖండిస్తున్నారు.   

నేను కాంగ్రెస్‌లోకి వెళ్లడం లేదు

గత వారం రోజులుగా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన వ్యక్తి రేవంత్ రెడ్డి. తెలంగాణ తెలుగుదేశానికి ఆశాజ్యోతిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ పార్టీని వీడి.. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని మీడియాలో విస్తృతంగా కథనాలు వెలువడ్డాయి. దానికి తోడు ఏపీ టీడీపీ నేతలు పరిటాల సునీత, పయ్యావుల కేశవ్, యనమల రామకృష్ణుడుపై వ్యాఖ్యలు చేయడంతో ఆ కథనాలకు మరింత బలం చేకూరింది.   ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారడం గ్యారెంటీ అని అంతా ఫిక్సయిపోయారు. మొన్న జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలోనూ రేవంత్ విషయంపైనే ప్రధానంగా చర్చించారు. అయితే తాను ఏ పార్టీలోనూ చేరడం లేదంటూ మరో సంచలనం సృష్టించారు రేవంత్ రెడ్డి. ఇవాళ మీడియాతో మాట్లాడిన రేవంత్.. తనపై మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. పేదల కోసం పోరాడి తాను గుర్తింపు తెచ్చుకున్నానని చెప్పారు. మా పార్టీ నాయకులపై వస్తున్న వార్తలు.. కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నాయని అన్నారు. తమ అధినేత చంద్రబాబు విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తానని.. రాబోయే ఎన్నికల్లోనూ కొడంగల్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తా.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగిస్తానని రేవంత్ తెలిపారు.

ప్రేమ వివాహాలకు బాసటగా కేరళ హైకోర్టు

ఇటీవలి కాలంలో దేశంలో ప్రేమ పెళ్లిళ్లు చేసుకొనే వారి సంఖ్య ఎక్కువవుతోంది. తెలిసి తెలియని ఉరకలు వేసే వయస్సు, ఒకరినొకరు ఇష్టపడి, ప్రేమ మొదలై పెళ్లిళ్లకు దారితీస్తోంది. అయితే కాలం ఎంత మారినా.. పెద్దల మనసు మారడం లేదు.. తమ ఇంటి పిల్లో/పిల్లాడో కులం తక్కువ వారిని ప్రేమించాడనో.. వేరే మతం వారిని ప్రేమించాడనే అక్కసుతో కన్నప్రేమను మరిచిపోయి బిడ్డల ఉసురు తీస్తున్నారు. వీటినే పరువు హత్యలు అంటారు. ఇది ఏ ఒక్క ప్రాంతానికో, రాష్ట్రానికో పరిమిత కాలేదు.. దేశమంతా ఇదే ధోరణి ఉంది. ప్రాణం కంటే కుటుంబ ప్రతిష్ట ఎక్కువ అనుకోవటమే వారిని ఇలా ప్రేరేపిస్తుంది.   అయితే అలాంటి ప్రేమ జంటలకు బాసటగా నిలిచింది కేరళ హైకోర్టు. లవ్ జిహాద్ వ్యవహారంపై న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. తన భార్యను బలవంతంగా తీసుకెళ్లిన ఆమె తల్లిదండ్రులు ఘర్‌వాపసీ అంటూ మతం మార్పించారని ఓ ముస్లిం యువకుడు కోర్టును ఆశ్రయించాడు. కన్నూర్‌కు చెందిన ఓ హిందూ యువతి ఎర్నాకులంకు చెందిన ఒక ముస్లిం యువకుడిని ప్రేమించింది. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భావించిన ఆ యువతి ఈ ఏడాది మే 16న ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోంది. దీనిపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఈ వ్యవహారాన్ని వారు లవ్ జిహాద్ అంటూ ప్రచారం చేశారు. తమ కుమార్తెను బలవంతంగా ఇస్లాంలోకి మార్చి, తన మతాచారం పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు.   తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వీరి జాడను హర్యానాలోని సోనిపట్‌లో గుర్తించింది. అనంతరం యువతిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. వారు ఆమెను తిరిగి హిందూ మతంలోకి మార్చి అతన్ని మరచిపోవాలని హెచ్చరించారు. ఈలోగా సదరు ముస్లిం యువకుడు కోర్టును ఆశ్రయించడం.. న్యాయస్థానం విచారణ ప్రారంభించడం అన్ని చకచకా జరిగిపోయాయి. వీరిద్దరి వివాహాం చెల్లుతుందని.. ఆమె నిర్భయంగా తన భర్తతో కలిసి వెళ్లవచ్చని తీర్పు చెప్పింది. మరోవైపు బలవంతపు మత మార్పిడి కేంద్రాలను తక్షణమే గుర్తించి న్యాయస్థానం పోలీస్ శాఖను ఆదేశించింది. మతాంతర వివాహాల అనంతరం వారిని ఉగ్రసంస్థల్లోకి పంపిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా గత ఏడాది వ్యవధిలో ఒక్క కేరళలోనే ఈ తరహా వివాహాలు 90 వరకు జరిగాయని గుర్తించింది. వీటిలో 23 పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఇస్లామిక్ రాడికల్ గ్రూప్ నేతృత్వంలో జరగటం విశేషం.

లక్ష్మీస్ ఎన్టీఆర్‌ గురించి చంద్రబాబు ఏమన్నారో తెలుసా..?

గత కొన్ని రోజులుగా తెలుగు సినీ రంగంలోనూ.. రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ ఎన్టీఆర్ బయోపిక్ గురించే. మూడున్నర దశాబ్ధాల సినీ ప్రయాణం, తెలుగుదేశం పార్టీని స్థాపించి.. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారాన్ని అందుకుని రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితగాథను తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించగానే తెలుగునేల పులకించిపోయింది. ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రి బయోపిక్‌లో తానే నటిస్తానని చెప్పారు. ఈ లోగా విలక్షణ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తాను కూడా అన్నగారి బయోపిక్ తీస్తానని చెప్పడంతో అసలు వివాదం రేగింది. వర్మ అంటనే వివాదాలకు కేరాఫ్ అలాంటి వర్మ.. అన్నగారి జీవితాన్ని ఎంత వివాదాస్పదంగా తెరకెక్కిస్తాడోనన్న సందేహాన్ని సగటు తెలుగువాడు వ్యక్తం చేశాడు.   దానికి తోడు ఈ సినిమాను నిర్మిస్తోన్న వ్యక్తి వైసీపీ అధినేత జగన్‌కు అత్యంత సన్నిహితుడు.. దీంతో టీడీపీ అధినేతను టార్గెట్ చేస్తాడని విమర్శకుల అంచనా. వైశ్రాయ్ ఇన్సిడెంట్, తెలుగుదేశంలో చంద్రబాబు పాత్ర, చివరి రోజుల్లో అల్లుడిపై అన్నగారి అక్రోశం తదితర అంశాలను ఖచ్చితంగా టచ్ చేస్తాడని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారిగా ఈ అంశంపై స్పందించారు.   వర్మ తీయబోతున్న సినిమా గురించి అంతగా బాధపడాల్సిన అవసరం లేదని.. దీనిపై అతిగా స్పందించవద్దని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. ఎన్టీఆర్ యుగపురుషుడని సినీ, రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలను తెలుగుజాతి ఎన్నటికీ మరువదని అన్నారు. వర్మ- వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కలిసి తీస్తోన్న సినిమాను ప్రజలంతా గమనిస్తున్నారని సీఎం తెలిపారు. ఇలాంటి సినిమా గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నారు. ఎన్టీఆర్ బయోపిక్‌పై చంద్రబాబు ఎలా స్పందిస్తారో అనుకొన్న నేతలకు ఆయన తన మార్క్ మాటలతో.. చాలా కూల్‌గా సమాధానం చెప్పి.. ఏదేదో అవుతుందనుకొన్న వారికి బాబు మాటలు ఏమాత్రం రుచించవు.

నాడు చంద్రబాబు.. నేడు కేసీఆర్

చంద్రబాబు బిచ్చగాళ్లను కూడా ప్రశాంతంగా ఉండనివ్వడం లేదంటూ ఆయనను ప్రత్యర్థులు తరచూ అనే మాట. అందుకు కారణం లేకపోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాబు ఉన్న కాలంలో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. వైట్‌హౌస్ నుంచి వర్తమానం అందిందో లేదో ఇక చూస్కోండి భాగ్యనగరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ముఖ్యంగా బిచ్చగాళ్లను వేటాడి వెంటాడి.. వెతికి వెతికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలించారు. దీనిపై అప్పట్లో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తినప్పటికీ రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా కఠినంగా వ్యవహరించక తప్పలేదని నాటి ప్రభుత్వ పెద్దలు వివరణ ఇచ్చుకున్నారు.   తాజాగా ఇప్పుడు చంద్రబాబు దారిలో నడవనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణలో పెట్టుబడులు ఆకర్షించేందుకు గానూ ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సు జరిగే సమయంలో హైదరాబాద్‌లోని యాచకులను నిర్బంధించాలని నిర్ణయించింది. అయితే అప్పట్లో లాగా భాగ్యనగరానికి దూరంగా పంపించకుండా వాళ్ల కోసం కేసీఆర్ సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. యాచకులందిరినీ జైళ్ల శాఖ పరిధిలోని ప్రత్యేక వసతి గృహాలకు తరలించనుంది.   ఇందుకోసం చంచల్‌గూడ సెంట్రల్ జైలు వెనుక భాగంలో ఉన్న బాలుర అబ్జర్వేషన్ హోను పురుషు యాచకుల కోస.. దాని పక్కనే ఉన్న భవనాన్ని మహిళా యాచకుల కోసం కేటాయించనున్నారు. నవంబర్ 28 నుంచి 30 వరకు హెచ్‌ఐసీసీలో జరిగే ఈ సదస్సును ప్రధాని నరేంద్రమోడీ లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌తో పాటు దేశ విదేశాలకు చెందిన 1500 మంది పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పాల్గొనున్నారు. ఈ సదస్సుకు హాజరయ్యే వీవీఐపీలు, వీఐపీల కంటికి నగరంలోని యాచకులు కనిపించకూడదని ప్రభుత్వం ఈ తరహా ఏర్పాట్లు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ యాచకుల నిర్మూలన చట్టం-1977 కింద ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలంగాణ పురపాలక శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

నగరం మునిగిపోతుంటే.. బంగారు బిస్కెట్లా..?

కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య బాధ్యతలు స్వీకరించిన తర్వాత వరుస వివాదాలు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని చుట్టుముట్టాయి. 70 లక్షల విలువ చేసే వాచ్ వివాదంతో మొదలుపెట్టి.. కాకి వాలిందని కాన్వాయ్ మార్చడం, నిండు సభలో మహిళా నేతతో ముద్దు పెట్టించుకోవడం, సీఎం హోదాలో అసభ్యపదజాలంతో మాట్లాడటం పట్ల ప్రజల్లో సిద్దూపై వ్యతిరేకతను తీసుకువచ్చాయి. వీటిని అవకాశాలుగా తీసుకొన్న ప్రతిపక్షాలు సిద్ధరామయ్యని ఏకీపారేశాయి. ఆ తర్వాత జనం వీటిని మరచిపోయారనుకోండి. తాజాగా ఏరీ కోరీ మరో వివాదాన్ని కొని తెచ్చుకొన్నారు సిద్ధూ. ఓ పక్క ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో బెంగళూరు తడిసి ముద్దవుతోంది.   అస్తవ్యస్తమైన డ్రైనేజీకి తోడు రోడ్లపై అడుగడుగునా ఉన్న గుంతల కారణంగా ప్రమాదాలు జరిగి ఎందరో వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకపక్క ప్రజలు కష్టపడుతుంటే.. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసే వ్యవహారానికి సిద్ధూ సర్కార్ తెరతీసింది. కర్ణాటక విధాన సౌధ భవన సముదాయాన్ని నిర్మించి 60 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బంగారు బిస్కెట్లు కానుకగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.   మొత్తం 300 మంది ప్రజాప్రతినిధులకు బంగారు బిస్కెట్లు ఇచ్చేందుకు గాను సుమారు రూ.3 కోట్లు విడుదల చేసింది. అలాగే సిబ్బందికి కూడా రూ. 6 వేల విలువ చేసే వెండి కంచాలు బహూకరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 25న జరగనున్న వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొంటారు. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఓ పక్క భారీ వర్షాలతో బెంగళూరు మునిగిపోతుంటే ఎమ్మెల్యేలకు కానుకలు ఇవ్వాల్సిన సమయమా ఇది అంటూ ఆరోపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జన జీవనాన్ని తిరిగి గాడిలోకి పెట్టాల్సిందిపోయి బంగారు బిస్కెట్లు పంచాలనుకోవడమేంటీ..? అంటూ ప్రశ్నిస్తున్నారు. 

జగన్‌కి, రేణుకకి ఎక్కడ చెడింది..?

ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రచారం నిజమైంది. వైసీపీ మహిళా నేత, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరడం దాదాపుగా ఖరారైపోయింది. ఒకటి, రెండు రోజుల్లో ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. విషయం తెలుసుకున్న వైసీపీ అధినేత ఆమెను ఆపేందుకు అన్నీ రకాల ప్రయత్నాలు చేశారు. చివరికి స్వయంగా జగన్ ఫోన్ చేసి మాట్లాడినా రేణుక మనసు మార్చుకోలేదని టాక్.. పార్టీని వీడవద్దని, భవిష్యత్ వైసీపీదేనని అధినేత చెప్పినప్పటికీ.. తాను నిస్సహాయ స్థితిలో ఉన్నానని ఆమె జగన్‌తో స్పష్టంగా చెప్పారట.   రాజకీయాల్లో ఫిరాయింపులు జరగడానికి సవాలక్ష కారణాలు. డబ్బు కావొచ్చు, కేసుల భయం కావొచ్చు, ఇతరత్రా పనులు కావొచ్చు, స్వప్రయోజనాలో.. ఇంకేవో ప్రలోభాలు కావొచ్చు. అన్ని కలిపి జంపింగ్‌లకు కారణాలుగా మారుతున్నాయి. బుట్టా రేణుక సంగతి చూస్తే.. 2019 ఎన్నికల్లో కర్నూలు లోక్‌సభ టికెట్ తనకే ఇవ్వాలని రేణుక వైసీపీ అధినేతను జిల్లా నేతల సమక్షంలోనే అడిగారు. దీనికి ఆయన నుంచి స్పష్టమైన హామీ రాలేదు.   దానికి తోడు ఎంపీగా కాకుండా ఎమ్మిగనూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేయాల్సి ఉంటుందని చెప్పారట జగన్. అధికారంలోకి వస్తే మంత్రి పదవితో కూడా కన్ఫార్మ్ అన్నారట. కానీ లోక్‌సభకు వెళ్లడానికే మొగ్గుచూపుతున్న రేణుక టీకెట్ లభించని పక్షంలో పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు ఈ పరిస్థితులను ఒక కంట కనిపెడుతున్న టీడీపీ అధిష్టానం బుట్టాను సైకిల్ ఎక్కించేందుకు పావులు కదుపుతున్నారు. పార్టీలో చేరితే కర్నూలు టికెట్ తిరిగి మీకే ఇస్తామని ఓపెన్ ఆఫర్ ఇచ్చారట. దీనిపై కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని రేణుక తెలుగుదేశం నేతలతో అన్నారట. మరి ఆమె టీడీపీలో చేరతారా..? లేక జగన్ బుజ్జగింపులకు మెత్తబడతారా అన్నది కొద్ది రోజుల్లో తేలిపోనుంది.

బ్రదర్ అనిల్ తో వర్మ రహస్య భేటీ మర్మం ఏంటి?

  తన చిత్రాలకన్నా సంచలనాత్మక వ్యాఖ్యలతోనే రామ్ గోపాల్ వర్మ పాపులర్ అయ్యాడు. ఒక సినిమాని ప్రచారం చెయ్యాలి అంటే వర్మ తర్వాతే ఇంకెవరయినా అని చెప్పొచ్చు. కొందరు సినిమాలో గొప్పదనం వివరించి బజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే, కంటెంట్ ఎలా ఉన్నా దాన్ని ఏదో రకంగా వివాదాస్పదం చేసి మరీ జనాల్లోకి తీసుకెళ్లడం వర్మకి మాత్రమే తెలిసిన విద్య. తన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా జనం పట్టించుకోవడం మానేసిన తరుణంలో, వర్మ కొత్త మార్గం ఎంచుకున్నాడు.   అసలు, లక్ష్మి పార్వతి కోణంలో ఎన్టీఆర్ సినిమా తీస్తానని చెప్పడమే అతి పెద్ద సాహసమయితే, జనాల్లో మరింత ఆసక్తి పెంచేందుకు ఎవరో ఒకర్ని ఇందులోకి లాగి లెఫ్ట్, రైట్ ఇచ్చి వదిలేస్తున్నాడు. వైస్సార్ కాంగ్రెస్ నేత రాకేష్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తుండడం ఒక చర్చనీయాంశం అయితే, తాను నిజాలు నిర్భయంగా చెబుతాను అనడం కొందరికి మింగుడు పడని వ్యవహారంగా మారింది.   ఇక తాజాగా, వర్మ వైసీపీ అధినేత జగన్ కు స్వయానా బావ అయిన బ్రదర్ అనిల్ కుమార్ తో రహస్యంగా భేటీ కావడం రాజకీయ, సినీ వర్గాల్లో పెద్ద దుమారమే లేపుతుంది. అయితే, వర్మ తన లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి బ్రదర్ అనిల్ తో చర్చించాడా లేదా అన్న విషయంలో క్లారిటీ లేదు కానీ అనిల్ తాను సిద్ధం చేసుకున్న తమసోమా జ్యోతిర్గమయా కథతో సినిమా తీద్దామని వర్మతో అన్నట్లు వార్తలు వస్తున్నాయి.   బ్రదర్ అనిల్ కుమార్ నిర్మించనున్న తమసోమా జ్యోతిర్గమయా అనే సినిమా ద్వారా జగన్ హిందువులకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని వినికిడి. ఈ మధ్యే చిన్న జీయర్ స్వామిని కలిసి ఆశీర్వాదం తీసుకున్న జగన్, తాను హిందూ వ్యతిరేకిని కాదనే సందేశం ఇవ్వడంతో పాటు, 2019 లో జరగబోయే ఎన్నికలకి అన్ని వర్గాల్ని కలుపుకుపోయే ప్రయత్నాలన్నీ చేస్తున్నట్లుగా అగుపిస్తుంది. అయితే ఎన్ని చేసినా ప్రజలకి మెచ్చే విధంగా తానేం చేయబోతున్నాడో చెప్పగలిగినపుడే జగన్, ఇప్పటికే కొట్టలేనంత బలంగా కనిపిస్తున్న టీడీపీ కి తగిన పోటీ ఇవ్వగలడు, లేదంటే అంతే సంగతులు!

కౌంటర్ ఇచ్చేశాడుగా... రోడ్ల మీద తిరుగుతారా..?

  అనుకున్నదే జరిగింది. వాణి విశ్వనాథ్  కు వర్మ కౌంటర్ ఇవ్వనే ఇచ్చాడు. ఇప్పటికే వర్మ తీయబోయే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రానికి గాను పలు వివాదాలు తలెత్తాయి. టీడీపీ నేతలు వర్మ పై పలు విమర్శలు గుప్పించారు. వాళ్లకి తోడు వాణి విశ్వనాథ్ కూడా ఈ సినిమాపై స్పందించి... తెలుగు ప్రజల మనసులో ఆయన ఓ రాముడిగా, కృష్ణుడిగా ముద్రవేసుకున్నారు. ఆయన జీవితం గురించి బాలకృష్ణ ఓ చిత్రాన్ని తీస్తున్నారు. అది గొప్పగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే తండ్రి కాబట్టి ఎన్టీఆర్‌ను దేవుడిలాగానే చూపిస్తారు. కానీ, రామ్‌గోపాల్‌ వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’పై అనుమానాలున్నాయి. అందుకే ఎన్టీఆర్‌ బయోపిక్‌ను తెరకెక్కించే ప్రయత్నాన్ని వర్మ వెంటనే విరమించుకోవాలి. ఎన్టీఆర్‌కు కళంకం తెచ్చేలా సినిమా తీస్తే ఆయన ఇంటి ముందు ధర్నాకు దిగుతా.. అని వార్నింగ్ ఇచ్చారు.   ఇక దీనికి వర్మ ఊరుకుంటాడా... వాణి గారు, నా ఇంటి ముందు ధర్నా చేయడానికి నాకసలు ఇల్లే లేదు. రోడ్ల మీద తిరుగుతూ ఉంటా....అప్పుడు, మీరు కూడా నన్ను వెతుక్కుంటూ రోడ్ల మీద తిరిగితే సున్నితమైన మీ పాద పద్మములు కమిలిపోవూ?’ అని వర్మ చమత్కరించారు. మరి ఈ దుమారానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందా..? లేక కంటిన్యూ అవుతుందా... చూద్దాం..

వచ్చింది.. వెళ్లింది.. ఏం చేసింది..!

ఒక ఏడు, ఎనిమిది నెలల క్రితం తమిళనాడు సీఎం కుర్చీ కోసం రాజీ లేని పోరాటం చేశారు జయలలిత నెచ్చెలి శశికళ. కానీ కేంద్ర ప్రభుత్వ స్థాయిలో జోక్యం, రాజకీయ అవగాహన లేకపోవడం వంటి కారణాలతో ఆ పోరాటంలో చిన్నమ్మ విజయం సాధించలేకపోయారు. దీనికి తోడు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అనూహ్యంగా శిక్ష పడటంతో ఆమె రాజకీయ భవిష్యత్తుకు తెరపడినట్లయ్యింది. అయినప్పటికీ వెనక్కు తగ్గకుండా పన్నీర్ సెల్వానికి అధికారం దక్కకూడదన్న తన మాటను నెగ్గించుకుని విమర్శకుల చేత ఔరా అనిపించుకున్నారు.   ఈ నేపథ్యంలో ఆమె జైలుకెళ్లిన కాలంలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పళని- పన్నీర్ వర్గాలు కలిసిపోవడం, దినకరన్ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేయడం, తన వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడం లాంటివి జరిగిపోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో శశికళ పెరోల్ మీద బయటకు రావడంతో రాజకీయాల్లో ఎలాంటి మార్పులు సంభవిస్తాయోనని తమిళ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూశారు.   ఆమె వచ్చి రావడంతోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన భర్త నటరాజన్‌ను పరామర్శించారు. అయితే పెరోల్ నిబంధనలు అడ్డువస్తున్నప్పటికీ శశికళతో భేటీ కావడానికి కొంతమంది ప్రయత్నించారు. ముఖ్యంగా చిన్నమ్మ నివాసం, గ్లోబల్ ఆసుపత్రి కేంద్రాలుగా రాజకీయ చర్చలు సాగినట్లు చెన్నై టాక్. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై తమ మద్దతుదారులకు శశికళ కొన్ని సూచనలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈలోగా పెరోల్ గడువు ముగిసి.. చిన్నమ్మ జైలులో లోంగిపోయారు. దీంతో ఏదో జరుగుతుందనుకున్న కొంతమందికి నిరాశ ఎదురైంది.

జగన్ తీరుపై నేతల అసంతృప్తి...

  ఈ మధ్య  జగన్ వైఖరి పార్టీ నేతలకు కూడా అంతంగా నచ్చనట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ పార్టీ పలువురు నేతలు అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీ చేరారు. ఇప్పుడు తాజాగా జగన్ వైఖరి నచ్చక పార్టీ మారే ఆలోచనలో పడుతున్నారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా రంప చోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పార్టీ మారే యోచనలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. జగన్ తీరు సరిగా లేకపోవడం.. జగన్ అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోవడమే దీనికి కారణం. ఇప్పుడు మరో నేత కూడా జగన్ తీరు వల్ల అసంతృప్తి చెందినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా నేత అనుకుంటున్నారా..?  ప్రకాశం జిల్లా ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జి బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డి. ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల‌లో పోటీ చేసిన శివ‌ప్ర‌సాద్ మంత్రి శిద్ధా రాఘ‌వ‌రావు చేతిలో స్వ‌ల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఇన్నాళ్లు ఇంచార్జిగా పార్టీని న‌డిపిన ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల‌లో మాత్రం పోటీకి నిరాసక‌త్త‌త చూపుతున్నారు. దీనికి ప్రధాన కార‌ణం పార్టీ అధినేత జ‌గ‌న్ త‌న‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డ‌మేన‌ని వార్త‌లు వ‌చ్చాయి. అంతేకాదు ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పడం గమనార్హం. పోటీ విష‌యంలో త‌న వైఖ‌రి చెప్పేందుకు జ‌గ‌న్‌ను క‌లిసిన సంద‌ర్భంలో ఆయ‌న క‌నీసం అనున‌యించ‌లేద‌ని… స‌రేలే అన్న‌ట్లుగా మాట్లాడార‌ని.. అది త‌న‌ను మ‌రింత బాధించింద‌ని… మూడున్న‌రేళ్లు పార్టీని నియోజ‌క‌వ‌ర్గంలో నిల‌బెట్టినందుకు నాకు ఇచ్చే గౌర‌వం ఇదేనా అని ఆయ‌న కార్య‌కర్త‌ల‌ను నిల‌దీశార‌ని స‌మాచారం. మరి జగన్ ఇప్పటికైనా తన వైఖరి మార్చుకుంటాడా..? లేక తన పని తాను చేసుకుంటూ పోతాడా చూద్దాం.