ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు..

పార్టీ శ్రేణులు, అభిమానులను ఉత్తేజపరిచేలా ట్వీట్ చేశారు సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌. పార్టీ అంతర్గత నిర్మాణంలో కీలక అడుగులు వేస్తున్న ఇలాంటి క్లిష్ల పరిస్థితుల్లో కొందరు మనల్ని తప్పు దారి పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారని.. వాటిపై ఎవరూ స్పందించవద్దని సూచించారు. జనసేన శ్రేణులు, అభిమానులకు ఒక విన్నపం. మనం పార్టీ నిర్మాణంలో ఆచరణాత్మకంగా అడుగులు వేస్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా ముందుకు వెళుతున్నాం. ఈ తరుణంలో కొందరు పేరు కోసమో.. మన దృష్టిని మరల్చడానికో.. మనల్ని చికాకు పర్చడానికో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అటువంటివాటిపై మీరెవ్వరూ స్పందించవద్దని మనవి చేస్తున్నాను.   వ్యక్తిగతంగా నాపై విమర్శలు చేసినా.. నాకు అపకీర్తి వచ్చేలా మాట్లాడినా మనం హుందాగానే ప్రవర్తిదిద్దాం. ఎందుకంటే.. ప్రస్తుత రాజకీయాలకు భిన్నంగా, బాధ్యతాయుతమైన రాజకీయ వ్యవస్థ ఆవిష్కరానికి జనసేన దృఢ నిశ్చయంతో ముందుకెళుతున్న విషయం మీ అందరికీ విదితమే. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా రాజకీయాలు పరిఢవిల్లాలని బలంగా నమ్మడమే కాదు.. ఆచరణలో చూపాలన్న నా దృఢ సంకల్పంతో ఆవిర్భవించిందే జనసేన పార్టీ. మానవత్వమే మతంగా, సమాజ హితమే అభిమతంగా రూపుదిద్దుకుంటోంది జనసేన.   యువత భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు, సమాజ భవిష్యత్తు, దేశ భవిష్యత్తుకు విశాల దృక్పథం కలిగిన రాజకీయాలు చాలా అవసరమని జనసేన విశ్వసిస్తోంది. ఇటువంటి తరుణంలో మనపై వచ్చే కువిమర్శలపై మీరు ఆవేశం చెందకండి. మీ ఆవేశం పార్టీకి మేలు చేయకపోగా ఒక్కోసారి హాని చేయవచ్చు. మనపై చేస్తున్న ప్రతి కువిమర్శను పార్టీ లెక్కగడుతూనే ఉంది. అవి హద్దులు మీరుతున్నప్పుడు సమయం, సందర్భం చూసి పార్టీ స్పందిస్తుంది. అంతవరకు మీరు ప్రజాసేవే పరమావధిగా ముందుకు వెళ్లండి. హుందాగా పార్టీ కోసం పనిచేయండి. ఓర్పే మన పార్టీకి రక్ష’ అని ట్వీట్‌ చేశారు.   

అల్లర్లు చేయమని 1.25 కోట్లు

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో డేరా సచ్ఛా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ బాబా దోషిగా తేలడం.. దీనిని తట్టుకోలేక డేరా మద్ధతుదారులు పంచకుల సహా హర్యానా, రాజస్థాన్‌లలో రావణ కాష్టాన్ని రగిలించారు. ముఖ్యంగా పంచకులలో జరిగిన విధ్వంసం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఆ అల్లర్లన్నీ డేరా బాబాను జైలుకు వెళ్లకుండా తప్పించేందుకే చేశారని పోలీసులు నిర్థారించారు. ముఖ్యంగా డేరా దత్తపుత్రిక హానీప్రీత్ సింగ్ తన తండ్రిని బయటకు తెచ్చేందుకు కుట్రలు చేశారని ఆమెపై అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హానీప్రీత్ దేశం విడిచి పారిపోయారు.   దీంతో ఆమెను వెతికేందుకు పోలీసులు, బీఎస్ఎఫ్, నిఘా వర్గాలు ఇండో- నేపాల్ బోర్డర్‌ను జల్లెడ పట్టారు. తాజాగా గుర్మీత్ వ్యక్తిగత సహాయకుడు, డ్రైవర్ అయిన రాకేశ్ కుమార్‌‌ను విచారించిన పోలీసులకు మరిన్ని దిగ్భ్రాంతికరమైన విషయాలు తెలిశాయి. గుర్మీత్ దోషిగా తేలిన తర్వాత పంచకుల తదితర ప్రాంతాల్లో అల్లర్లు రేకెత్తించేందుకు డేరా పంచకుల బ్రాండ్ హెడ్‌ చామ్‌కౌర్‌ సింగ్‌కు హనీప్రీత్ సింగ్ రూ.1.25 కోట్లు ముట్టజెప్పిందట. ఈ మొత్తాన్ని సంఘ విద్రోహ శక్తులకు ఇచ్చిన చామ్‌కౌర్ అల్లర్లు జరపాల్సిందిగా ఆదేశించాడట. ఈ విధంగా జరిగిన అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో 36 మంది ప్రాణాలు కోల్పోయారు.

బయటకొచ్చిన చిన్నమ్మ

అన్నాడీఎంకే బహిష్కృత నేత, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళా నటరాజన్ జైలు నుంచి బయటకొచ్చారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల శిక్షను విధించింది సుప్రీంకోర్టు. దీనిలో భాగంగా బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఆవిడ భర్త నటరాజన్ ఆరోగ్యం క్షీణించి ప్రస్తుతం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.   ఈ విషయం తెలుసుకున్న శశికళ తన భర్తను చూసుకునేందుకు పెరోల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తొలుత కర్ణాటక జైళ్ల శాఖను కోరగా..వారు నిరాకరించారు. దీంతో ఆమె కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాల స్పందనను కోరింది. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం శశికళకు షరతులతో కూడిన ఐదు రోజుల పెరోల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. ఈ ఐదు రోజుల పెరోల్‌‌ను వ్యక్తిగత అవసరాల కోసమే వినియోగించుకోవాలని.. రాజకీయ కార్యక్రమాలకు హాజరు కావొద్దని ఆదేశించింది. దీంతో ఆమె జైలు నుంచి బయటకు రానున్నారు. ఈ నేపథ్యంలో శశికళ మద్ధతుదారులు సంబరాల్లో మునిగిపోయారు.. ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.

ఏపీ మంత్రులకు పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదట

తెలుగుదేశం పార్టీకి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మధ్య ఉన్న బంధం గురించి తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా చెబుతారు. పాలించడానికి కాదు..ప్రశ్నించడం కోసమంటూ జనసేన పార్టీని స్థాపించినా.. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనుభవజ్ఞుడైన చంద్రబాబు వల్లే అవుతుందని.. తాను ఎన్నికల్లో పోటీ చేసి ఆయనను ఇబ్బందిపెట్టడం ఇష్టం లేదని ప్రకటించి.. టీడీపీకి సంపూర్ణ మద్ధతు తెలిపారు.. అంతేకాకుండా ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసి తెలుగుదేశం విజయంలో ఒక చేయి వేశారు పవన్. అందువల్ల ఆయనంటే టీడీపీ కార్యకర్తలకు, నేతలకు ఎనలేని గౌరవం.     తన తరపున ఎన్నో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేశారు పవర్‌స్టార్. టీడీపీ నేతలు కూడా పవన్ మాటకు విలువనిచ్చి వాటిని పరిష్కరించారు. అయితే ప్రతి విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందించే పవన్.. తాజాగా ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు, మంత్రి పితాని సత్యానారయణల పేర్లను ప్రస్తావిస్తూ కళ్యాణ్ ట్వీట్ చేశారు. "అశోక్ గజపతిరాజు గారికి పవన్‌ కళ్యాణ్ ఎవరో తెలియదు.. మంత్రి పితాని గారికి పవన్ కళ్యాణ్ ఏంటో తెలియదు.. సంతోషం" అని ట్వీట్ చేశారు. జనసేనానికి వీరిమధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. పార్టీ పెట్టిన నాటి నుంచి టీడీపీ నేతలపై ఎప్పుడు ఈ స్థాయిలో అసహనం ప్రదర్శించలేదు. దీనిపై తెలుగుదేశం వర్గాలు స్పందించాల్సి ఉంది.

గాంధీ హత్య వెనుక గాడ్సే ఒక్కడే కాదా..?

  అహింస అనే ఆయుధంతో భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టిన జాతిపిత మహాత్మాగాంధీని చంపింది ఎవరు అంటే ముక్త కంఠంతో చెప్పే పేరు గాడ్సే. 1948 జనవరి 30 సాయంత్రం 5.17 నిమిషాలకు ఢిల్లీలోని బిర్లా నివాసంలో ప్రార్థనా సమావేశ మందిరానికి వెళుతున్న గాంధీజీని గాడ్సే తన వెంట తెచ్చుకున్న తుపాకీతో మూడుసార్లు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిపాడు.   ఆ వెంటనే గాడ్సే లొంగిపోవడం..న్యాయ విచారణ అనంతరం ఆయన్ను ఉరి తీసినప్పటికీ మహాత్ముని హత్యపై ఇప్పటికీ పలు అనుమానాలు తలెత్తుతూనే ఉన్నాయి. గాడ్సే గాంధీని మూడు బుల్లెట్లతో కాల్చాడని నాటి పోలీసులు ఎఫ్ఐఆర్‌లో రాశారు. అయితే గాంధీకి నాలుగు బుల్లెట్లు తగిలాయని..అందువల్లే ఆయన మరణించారంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే ఆ నాలుగో బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది..? దాన్ని ఎవరు పేల్చారు..? అన్న అంశాన్ని అప్పటి పోలీసులు పక్కన పెట్టారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై డాక్టర్ పంకజ్ ఫడ్నీస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.. మహాత్ముని హత్యకేసును రీ ఓపెన్ చేసి విచారణ జరపాలని కోరారు. ఈ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం నేడు విచారించనుంది.

ఒకేసారి ఎన్నికలకు ఈసీ " సై "

విడతల వారీగా కాకుండా దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలను నిర్వహించాలని ప్రధాని నరేంద్రమోడీ ఇటీవలి కాలంలో తన మనసులోని మాటను బయటపెట్టారు. తద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనం ఆదా అవ్వడమే కాకుండా..ఎంతో విలువైన సమయం కూడా ఆదా అవుతుందని ఆయన అభిప్రాయం. దీనిపై దేశంలోని మేధావులు, స్వచ్ఛంధ సంస్థలు, పలు పార్టీల నేతల హర్షం వ్యక్తం చేశారు.   ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ప్రతి ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ఉంటుంది. మరి 29 రాష్ట్రాలతో పాటు లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనా..? ఏ పార్టీ అయినా ఐదేళ్ల పాటు అధికారంలో ఉండాలనే అనుకుంటుంది.. అంతేకానీ గడువు తీరకుండా అధికార కుర్చీని దిగడానికి ఎవరైనా ఇష్టపడతారా..? అయితే ప్రధాని మాత్రం ఇందుకు అవసరమైన రాజకీయ, రాజ్యాంగ, పాలనాపరమైన కసరత్తు వేగం చేశారు. సరిగ్గా ఇదే సమయంలో తాము ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని తెలిపింది కేంద్ర ఎన్నికల సంఘం.   వచ్చే ఏడాది సెప్టెంబర్ తర్వాత దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగలమని ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ వెల్లడించారు. ఈ ప్రక్రియకు కావాలసిన వివరాలు, ఈవీఎంలు, డబ్బు గురించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించామన్నారు. ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించాలంటే 40 లక్షల ఎన్నికల పరికరాలు కావాలి..వీవీపాట్ కోసం రూ.3,400 కోట్లు, ఈవీఎంల కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు అవుతుందని రావత్ అన్నారు. తమ అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఇందుకు సంబంధించి నిధులు అందించడంతో తమ పని ప్రారంభించామని.. అదనపు పరికరాల కోసం ఆర్డర్లు ఇచ్చామని.. సెప్టెంబర్ 2018 నాటికి అన్ని పరికరాలు అందుబాటులోకి వస్తాయని, అప్పుడు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు తాము పూర్తి స్థాయిలో సిద్ధమని తెలిపారు.

కేసీఆర్‌ను టీడీపీలో చేర్చారు

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకప్పుడు తెలుగుదేశం కుటుంబసభ్యుడు అన్న సంగతి తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా చెబుతారు. క్రియాశీలక కార్యకర్తగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన టీడీపీకి ఎనలేని సేవలందించారు. సిద్ధాంతపరమైన విబేధాల కారణంగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట వేరు కుంపటి పెట్టుకున్నారు కేసీఆర్. తెలంగాణ ప్రజల దశాబ్దాల కల అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రజాకర్షక పథకాలతో.. సంక్షేమ కార్యక్రమాలతో మంచి పాలనను అందిస్తున్నారు. ఆయనకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది.   అమరావతి శంకుస్థాపన సందర్భంగా..తిరుపతికి కుటుంబసమేతంగా వచ్చిన వేళ..తాజాగా పరిటాల శ్రీరామ్‌ పెళ్లికి అనంతపురం వెళ్లిన గులాబీ బాస్‌కి ఏపీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మా సొంత నేత అన్నంతగా తెలుగుదేశం శ్రేణులు కూడా జయ జయ ధ్వానాలు పలికాయి. ఇప్పుడు ఏకంగా కేసీఆర్‌ను టీడీపీ నేతను చేసేశారు తెలుగు తమ్ముళ్లు. తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లేందుకు.. వచ్చే ఎన్నికల నాటికి పటిష్టం అయ్యేందుకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి పిలుపునిచ్చింది ఆ పార్టీ అధినాయకత్వం.   అధినేత సూచనల మేరకు ఆ కార్యక్రమాన్ని వాడవాడలా విజయవంతంగా నిర్వహిస్తున్నారు నేతలు. అయితే ఈ కార్యక్రమంలో కేసీఆర్‌ను భాగస్వామిని చేసేశారు ప్రకాశం జిల్లాకు చెందిన నాయకులు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొనేందుకు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వెలమవారిపాలెం గ్రామానికి వస్తున్నారు. ఎమ్మెల్యే రాకను పురస్కరించుకొని గ్రామపెద్దలు భారీ ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. వాటిలోని ఒక ఫ్లెక్సీలో పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఫోటో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటొలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోను కూడా చేర్చడంతో అది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఏది ఏమైనా కేసీఆర్‌పై తమకున్న అభిమానాన్ని ఆ ఊరి వాసులు ఇలా చాటుకున్నారన్నమాట.

కోదండరామ్ ఎవరు.. నాకు తెలీదన్న కేసీఆర్...

  తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కేసీఆర్ ఎంతో గానే పోరాటం చేసిన సంగతి తెలిసిందే. కానీ అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రం పోషించింది ఎవరంటే.. టక్కున కోదండరామ్ పేరు వినిపిస్తుంది. తెలంగాణ ఉద్యమం చేయడానికి కీలక పాత్రధారి, సూత్రధారి కోదండరామ్. అయితే అలాంటి కోదండరామ్ ఎవరో తనకు తెలియదు అంటున్నారు.. అలా అంటుంది ఎవరో కాదు కేసీఆర్. అవును నిజం.. సి.ఎం కేసీఆర్ కు కోదండరామ్ ఎవరో తెలియదంట.. ఆయన ఎవరు అని ప్రశ్నించారు. గతకొద్ది కాలంగా కోదండరామ్ కు, కేసీఅర్ ప్రభుత్వానికి మధ్య అంతగా పడట్లేదన్న సంగతి అందరికీ తెలిసిన నిజమే.  మొన్నీ మధ్య మంత్రులంతా మూకుమ్మడిగా కోదండరామ్ పై మాటల దాడి చేశారు. అయితే ఇప్పుడు ఏకంగా..  సింగరేణి ఎన్నికల వేళ కోదండరామ్ ఎవరని ప్రశ్నించే స్థాయికి వెళ్లారు కేసీఆర్. దీంతో కేసీఆర్ పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారం శాశ్వతం కాదని కేసీఆర్ గుర్తుంచుకోవాలని.. లేకపోతే రాబోయే కాలంలో కేసీఆర్ ప్రజల చేతిలో తిప్పలు పడక తప్పదని అంటున్నారు. మరి దీని ప్రభావం ఎంత ఉంటుందో చూడాలంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందే.

మోడీ నాకంటే పెద్ద యాక్టర్...నేను పిచ్చోడిలా కనిపిస్తున్నానా...?

  ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య పై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ప్రధాని నరేంద్ర మోడీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ ను ఇటీవల కాల్చి చంపిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పుడు స్పందించిన ప్రకాశ్ రాజ్ ...గౌరీ లంకేష్ హత్య పై మోడీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. అంతేకాదు.. వరుసగా జర్నలిస్టులను హతమారుస్తుంటే ప్రధాని హోదాలో నోరు మెదపక పోవడం విచిత్రంగా ఉందని... తన కంటే మోడీ ఉత్తమ నటుడని.. అందుకే ఆయనకు ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వాలన్నారు. ప్రధాని తీరుకు నిరసనగా జాతీయ ఉత్తమ నటుడుగా తనకు ఇచ్చిన అవార్డును వెనక్కు ఇచ్చేందుకు సిద్దమని ప్రకటించారు ప్రకాష్ రాజ్.   అయితే ఇప్పుడు తాను వ్యాఖ్యలపై స్పందించి వివరించారు ప్రకాశ్ రాజ్.. `నేను మాట్లాడిన విష‌యాల‌ను త‌ప్పుగా అర్థం చేసుకున్నారు. నేను అవార్డులు తిరిగి ఇచ్చేస్తాన‌ని వ‌స్తున్న వార్త‌లు చాలా హాస్యాస్ప‌దంగా ఉన్నాయి. నేను క‌ష్ట‌ప‌డి ప‌ని చేసి గెల్చుకున్న అవార్డుల‌ను తిరిగి ఇచ్చేంత మూర్ఖుడిని కాను. అవి నాకు గ‌ర్వ‌కార‌ణం` అని ఓ వీడియో ద్వారా ట్వీట్టర్లో తెలిపారు.

ఒకే వేదికపైకి కమల్, రజనీ

ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలన్నీ రజనీ, కమల్ ‌చుట్టూ తిరుగుతున్నాయి. సినిమాలు క్రమ క్రమంగా తగ్గించేస్తూ వస్తున్నఈ ఇద్దరు సూపర్‌స్టార్లు ఇప్పుడు రాజకీయరంగ ప్రవేశం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రజనీ రాజకీయరంగ ప్రవేశంపై కమల్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో తలైవా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల మీదకు వచ్చి కమల్ దిష్టిబొమ్మలు దగ్ధం చేసి..నిరసన తెలుపుతున్నారు.   ఈ క్రమంలో వీళ్లిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు అగ్ర కథానాయకులు ఒకే వేదిక మీదకు చేరారు. చెన్నైలో జరిగిన శివాజీ మెమోరియల్ ప్రారంభోత్సవ వేడుకకు రజనీ, కమల్ హాజరయ్యారు. గత ఏడాది ఆగష్టు 4న చెన్నై, కామరాజర్ సారైలోని శివాజీ విగ్రహాన్ని హైకోర్టు ఆదేశాల మేరకు మరోచోటికి తరలించింది ప్రభుత్వం..అయితే ఈ చర్యపై శివాజీ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహాం వ్యక్తం చేశారు. వారి ఆగ్రహాన్ని చల్లార్చేందుకు చెన్నై అడయార్‌లో సుమారు రూ.3 కోట్ల ఖర్చుతో 28,300 చదరపు అడుగుల్లో శివాజీ గణేశన్ మెమోరియల్‌ను నిర్మించింది ప్రభుత్వం. దీని ప్రారంభోత్సవానికి రావాలని శివాజీ తనయుడు ప్రభు సీఎం పళనిస్వామిని కోరాడు. అయితే ముందుగా అనుకొన్న కార్యక్రమాల వల్ల రాలేకపోతున్నానని వివరణ ఇచ్చుకున్నారు..అయితే తన ప్రతినిధిగా పన్నీర్‌ సెల్వంను పంపుతున్నట్లు స్వయంగా ప్రభు ఇంటికి వెళ్లి చెప్పారు ముఖ్యమంత్రి. దీనిలో భాగంగా ఇవాళ జరిగిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో కలిసి రజనీ, కమల్ పాల్గొన్నారు. అనంతరం వారిద్దరూ శివాజీతో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

అమ్మ మరణం..వారికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి

ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలన్నీ జయలలిత మరణం చుట్టూనే తిరుగుతున్నాయి. అమ్మ మరణంపై ప్రభుత్వం విచారణ కమిషన్ నియమించడం ఆ తర్వాత అధికార అన్నాడీఎంకేకు చెందిన కొందరు మంత్రులు జయ ఆస్పత్రిలో చేరడానికి ముందు..ఆ తర్వాత జరిగిన సంఘటనలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అన్నాడీఎంకేలో తలెత్తుతున్న సంక్షోభాలను తనకు అనుకూలంగా మార్చుకొని..రాజకీయ లబ్ధి పొందేందుకు పావులు కదుపుతున్న ప్రతిపక్షనేత, డీఎంకే కార్యానిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ మరోసారి రంగంలోకి దిగారు.   అన్నాడీఎంకే నేతల పొంతన లేని మాటలు రాష్ట్రంలో గందరోగోళానికి కారణమయ్యాయని ఆయన ఆరోపించారు. జయ మరణంపై ఇప్పటికీ ప్రజల్లో ఎన్నో అనుమానాలున్నాయని..రిటైర్డ్, సిట్టింగ్ న్యాయమూర్తులతో దీనిపై విచారణ జరిపితేనే అసలు నిజాలు బయటకు వస్తాయన్నారు. ముఖ్యంగా మంత్రులు శ్రీనివాసన్, సెల్లూరు రాజుకు లై డిటెక్టర్ టెస్ట్ చేస్తే చాలన్నారు..వీరేకాకుండా ఇతర రాష్ట్రాలకు చెందినవాళ్లు, ఢిల్లీ నుంచి వచ్చినవాళ్లు, గవర్నర్ విద్యాసాగర్ రావు, ఎయిమ్స్, లండన్‌కు చెందిన వైద్యులు అందరినీ విచారణ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఇష్టం వచ్చినట్లు ప్రకటనలు ఇచ్చి పార్టీ పరువు తీస్తోన్న మంత్రులపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులందరినీ తన నివాసానికి పిలిపించుకున్న సీఎం..అందరికీ ఫుల్‌గా క్లాస్ పీకారట..అంతేకాదు ఇక మీదట అమ్మ ఆస్పత్రిలో ఉన్నప్పటి విషయాలపై మాట్లాడకూడదని హెచ్చరించారట.

మాట్లాడుకుందాం రమ్మని..!

గుడి, బడి, అన్న, తమ్ముడు, తండ్రి, తాత ఇలా ఎక్కడా..ఎవరి దగ్గరా స్త్రీకి రక్షణ లేకుండా పోతుంది. ఎప్పుడు ఎవరి మనుసులో ఏ దుర్బుద్ధి పడుతుందో ఆ పరమాత్ముడికి కూడా తెలియదు. తాజాగా ప్రకాశం జిల్లా కనిగిరిలో దారుణం జరిగింది. సరదాగా మాట్లాడుకుందాం అంటూ రమ్మని పిలిచిన ప్రేమికుడే ఆమెను బలవంతంగా అత్యాచారం చేయమని తన స్నేహితుడి చేతుల్లో పెట్టాడు. అక్కడితో ఆగకుండా ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.   తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..ఓ యువతి కనిగిరిలో డిగ్రీ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన కార్తీక్ అనే యువకుడికి చదువు వంటబట్టక ఖాళీగా తిరుగుతున్నాడు. ఖాళీగా ఉండేవాడు ఏం చేస్తాడు.. అమ్మాయిల చుట్టూ తిరుగుతాడు కదా.. అచ్చం అలాగే కార్తీక్‌ డిగ్రీ చదువుతున్న యువతితో స్నేహం చేస్తున్నాడు. ఆ ఫ్రెండ్‌షిప్ కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఓ రోజు కార్తీక్ మాట్లాడుకుందామంటూ ఆ యువతిని ఊరి చివర ఉన్న పొలాల వద్దకు తీసుకెళ్లాడు. తన మిత్రులు సాయి, పవన్‌లను కూడా తోడు కోసం రమ్మన్నాడు. యువతికి తోడుగా ఆమె స్నేహితురాలు వెళ్లింది. అందరు కలిసి కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. అలా అయితే వారు వార్తల్లోకి ఎక్కుతారు.   మాటల్లో మాటగా కార్తీక్ తన స్నేహితురాలిని రేప్ చేయమంటూ..తన స్నేహితుడు సాయికి అప్పగించాడు. ఆ మాట చెప్పడమే ఆలస్యం..సాయి ఆ యువతిని గట్టిగా పట్టుకొని..బలవంతంగా బట్టలు విప్పే ప్రయత్నం చేశాడు. ఆ అమ్మాయి ఏడుస్తూ ఎంతగా బ్రతిమలాడుతున్నా వినకుండా దుర్మార్గంగా వ్యవహరించాడు. తనను నమ్మి వచ్చిన అమ్మాయిని స్నేహితుడు అలా చేస్తుంటే ఏ మాత్రం సిగ్గు లేకుండా ఈ తతంగాన్నంతా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆ కీచకుల బారి నుంచి ఎలాగొలా తప్పించుకున్న బాధితురాలు ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు దారుణాన్ని గురించి చెప్పింది. అయితే కుటుంబం పరువు పొతుందని భయపడిన వారు సైలెంట్‌గా ఉండిపోయారు. అయితే తమకు సహకరించలేదన్న అక్కసుతోనో..మరో కారణం చేతనో ఆ దుర్మార్గులు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..విషయం బయటకు రావడంతో యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు మృగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి ఘటనలన పాఠంగా తీసుకుని అమ్మాయిలు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలంటున్నారు పోలీసులు.

గిన్నిస్ రికార్డు లక్ష్యంగా మహాబతుకమ్మ

ఆనాదిగా ప్రకృతికి భారతీయులకు విడదీయరాని సంబంధం ఉంది. తమకు బతుకునిస్తూ..నిత్యం వెన్నంటి నిలిచే ప్రకృతిని దైవంగా ఆరాధిస్తారు భారతీయులు. సంఘంలో క్రమశిక్షణకు, వ్యక్తుల ఆధ్మాత్మిక సరళికి ప్రకృతి మాత దోహదం చేస్తోంది. ప్రకృతి స్వరూపిణిగా అమ్మతల్లిని భావించి, వివిధ పుష్పాలతో పేర్చి బతుకమ్మగా ఆరాధిస్తారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. మహాలయ అమావాస్య నుంచి మహర్నవమి వరకు తొమ్మిది రోజుల పాటు సాగే బతుకమ్మ సందడి తెలంగాణ వ్యాప్తంగా సాంస్కృతిక సౌరభాల్ని వెదజల్లుతోంది.   నవరాత్రుల్లో చేసే చక్రార్చనకు ప్రతిరూపమే బతుకమ్మ ఆరాధన..! ప్రకృతిని పూజించండి..పరిరక్షించండి..ఆ ప్రకృతే మిమ్మల్ని రక్షిస్తుంది అనే సందేశాన్ని బతుకమ్మ అందిస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత బతుకమ్మకు మరింత ప్రాచుర్యం కలిగించే ప్రణాళికలకు రూపకల్పన చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. బతుకమ్మను రాష్ట్రపండుగగా ప్రకటించడంతో పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రతి జిల్లాకు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశారు.   అంతేకాకుండా ట్యాంక్‌బండ్‌పై భారీగా వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా బతుకమ్మ ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసేందుకు తెలంగాణ పర్యాటక శాఖ కృషి చేస్తోంది. సీఎం కేసీఆర్ దిశానిర్దేశం ప్రకారం ఇవాళ మహాబతుకమ్మ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. సుమారు 35 వేల నుంచి 40 వేల మంది ఆడబిడ్డలతో చరిత్రలో ఎక్కడా నిర్వహించని విధంగా ఉత్సవాన్ని నిర్వహించి, గిన్నిస్ బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాలని తెలంగాణ టూరిజం ప్రయత్నిస్తోంది. గతేడాది అక్టోబర్ 12న తెలంగాణ బతుకమ్మ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు పోటీకి అర్హత సాధించింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మహిళలు బతుకమ్మలను పేర్చుకొని బస్సుల్లో స్టేడియానికి తరలివస్తారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవితతో పాటు పలువురు మహిళా నేతలు బతుకమ్మ ఆడనున్నారు.   ఆరో రోజు బతుకమ్మ వేడుకలు: బతుకమ్మ వేడుకల్లో ఆరో రోజు అమ్మవారిని అలిగిన బతుకమ్మగా పూజించారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.   రవీంద్రభారతి: రవీంద్ర భారతిలో తెలంగాణ సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో భాగంగా నిన్న ప్రదర్శించిన మహిషాసుర మర్థిని నృత్య రూపకం ఆకట్టుకుంది. అలాగే భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న బతుకమ్మ ఫిల్మోత్సవంలో ఫిదా సినిమాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ చేతుల మీదుగా ఫిదా చిత్ర యూనిట్‌ను ఘనంగా సత్కరించారు. అనంతరం యువ దర్శకులు అడిగిన ప్రశ్నలకు శేఖర్ కమ్ముల సమాధానాలిచ్చారు.   ఏడో రోజు బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా రవీంద్ర భారతి ప్రివ్యూ థియేటర్‌లో జరుగుతున్న బతుకమ్మ ఫిల్మోత్సవంలో ఇవాళ ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో వచ్చిన "క్యాంపస్ అంపసెయ్యా" సినిమాను ప్రదర్శించనున్నారు.  

ఆరో రోజుకి చేరుకున్న బతుకమ్మ సంబరాలు..

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ చిన్నా, పెద్దా లయబద్ధంగా ఆడే బతుకమ్మతో తెలంగాణ పులకించిపోతోంది. ఈ నెల 20న ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన పండుగ తొమ్మిది రోజుల అనంతరం ఈ నెల 28న జరిగే సద్దుల బతుకమ్మ నిమజ్జనంతో ముగుస్తుంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన బతుకమ్మను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది.    పండుగను పురస్కరించుకొని అక్కాచెల్లెమ్మలకు ఈ ఏడాది తొలిసారిగా కోటి ఆరు లక్షల బతుకమ్మ చీరలను పంచేందుకు నిశ్చయించింది. రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదింటి ఆడపడుచులకు సిరిసిల్ల చీరలను పంపిణీ చేయడం ద్వారా అటు చేనేతలకు, ఇటు పేద కుటుంబాలకు బహుళ ప్రయోజనకరంగా ఉండేలా ఈ పథకాన్ని రూపొందించారు సీఎం. రాష్ట్రంలో దాదాపు 86 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి..తెల్ల కార్డు ఉన్న కుటుంబాలన్నింటికీ చీరలు పంపిణీ చేయాలని..ఈ మేరకు అవసరమయ్యే చీరల తయారీకి ఇప్పటికే చేనేత, జౌళి శాఖకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. సీఎం నిర్ణయంతో సిరిసిల్ల నేత కార్మికులకు చేతినిండా పని దొరికినట్లయ్యింది. కార్మికుల ఆత్మహత్యలు, ఆకలి చావులతో సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు శాశ్వత ఉపాధి కల్పించేందుకు ఈ కార్యక్రమం దోహాదపడునుంది.    అలాగే ఈ నెల 26న మహా బతుకమ్మ వేడుక నిర్వహించడానికి తెలంగాణ సాంస్కృతిక, పర్యాటకశాఖలు భారీ ఏర్పాట్లు చేశాయి. అలాగే 20వ తేది నుంచి రవీంద్రభారతిలో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు బతుకమ్మ ఫిలిం ఫెస్టివల్‌ను ఏర్పాటు చేశారు. ఇవాళ ఆరో రోజు సందర్భంగా రవీంద్రభారతి ప్రధాన వేదికలో డాక్టర్ జయప్రద రామమూర్తి గారిచే ఫ్లూట్, శ్రీమతి భాగ్యలత & బృందంచే కూచిపూడి నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. అలాగే బతుకమ్మ ఫిల్మోత్సవంలో భాగంగా..ప్రతీ ఫ్రేమ్‌లో తెలంగాణ నుడికారాన్ని, సంస్కృతిని మేళవించిన ఫిదా సినిమాను ప్రదర్శిస్తారు. అనంతరం అనిశ్ కురువిల్లా..డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాపై చర్చిస్తారు..   ఐదవ రోజు ఉత్సవాలు: ఐదవ రోజు బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పీపుల్స్ ప్లాజా: తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలను పర్యాటక శాఖ ఛైర్మన్ పేర్వారం రాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు, ఐఏఎస్ అధికారుల కుటుంబసభ్యులు బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు.   ప్రెస్ క్లబ్: సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత పాల్గొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అడవి పూలకు పూజలు చేసే సంస్కృతి ఒక్క తెలంగాణకే ఉందని కవిత అన్నారు. గత సంవత్సరం బేటీబచావో నినాదంతో బతుకమ్మను నిర్వహించగా..ఈ యేడు బేటీపఢావో నినాదంతో నిర్వహించారు.   తెలంగాణ భవన్‌: తెలంగాణ భవన్‌లో జరిగిన ఉత్సవాల్లో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి నిజామాబాద్ ఎంపీ కవిత పాల్గొన్నారు. తోటి మహిళలతో కలిసి బతుకమ్మలను పేర్చి పూజ అనంతరం ఆడిపాడారు.   రవీంద్ర భారతి: ఐదవ రోజు బతుకమ్మ వేడుకల్లో భాగంగా రవీంద్రభారతిలో రంగు రంగుల బతుకమ్మలను అలంకరించి..మహిళామణులందరూ ఆడిపాడారు..అలాగే బతుకమ్మ ఫిల్మోత్సవంలో భాగంగా శివరాజ్‌కుమార్ దర్శకత్వంలో..శ్రీనివాస్ రెడ్డి హీరోగా వచ్చిన జయమ్ము నిశ్చయమ్మురా సినిమాని ప్రదర్శించారు.   తెలంగాణా లోని ప్రతి ఊరు , ప్రతి వీధి , బతుకమ్మ తెచ్చిన పూల శోభతో వర్ణ రంజితం గా వుంది . రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు వల్ల అందరూ ఎంతో ఉత్సాహం గా బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్నారు . వాడ వాడలా బతుకమ్మ ఆట పాటలతో తెలంగాణా పులకించి పోయింది.  

రేప్ చేసిన బాబా..అరెస్ట్‌కి భయపడి ఆస్పత్రికి..!

ఇద్దరు మహిళా సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ బాబా జైలుకు వెళ్లిన ఘటన ఇంకా దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఘటన ఆధ్యాత్మిక రంగంలో మాయని మచ్చగా మిగిలింది. ఈ నేపథ్యంలో బాబాలను జనం నమ్మలేని స్థితి దాపురించింది. ఈ పరిణామాల మధ్యలో మరో స్వామిజీ అత్యాచారం కేసులో అరెస్టయ్యాడు. రాజస్థాన్‌కు చెందిన ఫలాహారి బాబా తనపై అత్యాచారం జరిపినట్లు ఓ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.   70 ఏళ్ల కౌశేలంద్ర ప్రపన్నచార్య మహరాజ్‌కు రాజస్థాన్‌లో మంచి గుర్తింపు ఉంది. కేవలం పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకోవడంతో అతడిని ఫలాహారి బాబాగా పిలుస్తుంటారు భక్తులు. కొద్దిరోజుల క్రితం న్యాయవిద్య చదువుతున్న ఓ 21ఏళ్ల యువతికి ఇంటర్న్‌షిప్ విషయంలో బాబా సాయం చేశాడు. దీంతో స్వామిజీకి కృతజ్ఞతగా ఆశ్రమానికి విరాళం ఇచ్చేందుకు గత నెల 7న ఆ యువతి ఆశ్రమానికి వెళ్లింది. ఆ సమయంలో బాబా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలాహారీ బాబా తనపై అత్యాచారం చేశాడని..ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి వస్తున్నారని సమాచారం అందుకున్న ఫలాహారీ బాబా అనారోగ్యం పేరిట ఆస్పత్రిలో చేరాడు. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించి..ఆరోగ్యం నిలకడగా ఉందని తెలియడంతో అక్కడికక్కడే అరెస్ట్ చేసి..రిమాండ్‌కు తరలించారు.

రక్షణమంత్రిగా దుర్గామాత..ఆర్ధికమంత్రిగా లక్ష్మీదేవి

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మంచి వక్త అని అందరికి తెలిసిందే..ప్రాసలు, అంత్య ప్రాసలు, ఛలోక్తులు, పొడుపు కథలతో ఆయన చేసే ఉపన్యాసానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..రాజకీయ ప్రత్యర్థులు సైతం ఈ విషయాన్ని ఒప్పుకుంటారు. తాజాగా తన వాక్చాతుర్యాన్ని..పురాణాలపై తనకున్న పట్టును మరోసారి చూపించారు వెంకయ్య.   మొహాలీలోని ఇండియన్ బిజినెస్ స్కూల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మహిళా సాధికారికత గురించి మాట్లాడారు ఉప రాష్ట్రపతి. మనదేశంలో ప్రాచీనకాలం నుంచి మహిళలను గౌరవిస్తూ వస్తున్నామని..దేశంలోని నదులన్నీ స్త్రీ పేర్లతో కూడినవేనని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. గంగా, యమున, కావేరి, నర్మద, మహానది, తపతి తదితర నదులు ఇందుకు ఉదాహరణ అని అన్నారు. చివరకు దేశాన్ని కూడా భరతమాత అని పిలుస్తామని..లేదంటే మదర్ ఇండియా అని అంటామని వివరించారు. ఇక పురాణాల ప్రాతిపదికన చూస్తే..సరస్వతీ దేవి విద్యాశాఖా మంత్రిగా, దుర్గామాత రక్షణ మంత్రిగా, లక్ష్మీదేవి ఆర్థిక మంత్రిగా ఉన్నారంటూ ఆయన చెప్పగానే ఆడిటోరియం కేరింతలతో మార్మోగిపోయింది.

హనీప్రీత్ డేరాకి కూతురు కాదు..భార్య

ఇప్పుడు దేశవ్యాప్తంగా డేరా బాబా ఎంత ఫేమస్సో..హనీప్రీత్ సింగ్ కూడా అంతే ఫేమస్..ఎందుకంటే ఆయన దత్తపుత్రిక కాబట్టి..కానీ తాజా విచారణలో ప్రపంచం నివ్వెరపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. డేరా..హనీప్రీత్ మధ్య ఉన్న రిలేషన్ తండ్రీకూతుళ్ల బంధం కాదట..ఈ విషయం హనీప్రీత్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా తెలిపాడు. 1999 నుంచి హనీ..డేరా బాబాకి భార్యాలా వ్యవహరిస్తోందన్నారు.   అదే ఏడాది తనకు ఆమెకు వివాహం జరిగిందని..హనీప్రీత్..గుర్మీత్‌లు సన్నిహితంగా గడుపుతుండగా..తాను చూశానని విశ్వాస్ అన్నారు..అందుకే తనను చంపేస్తానని చాలా సార్లు బెదిరించారని ఆయన వాపోయారు..ఆమెతో ఇక కలిసి బతకలేక 2011లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నానని తెలిపారు. అయితే అంతకు ముందే బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీసావంత్ ఈ విషయాలను తెలిపింది. డేరా దత్తపుత్రికిగా పైకి చెప్పబడుతూ లోపల అతడితో రాసలీలలు సాగిస్తోందంటూ ఆరోపించింది. అంతేకాదు..ఓ సారి డేరా ఆశ్రమంలోకి వెళ్లినప్పుడు వయాగ్రా పొట్లాలు చూసిందట. తాజాగా విశ్వాస్ గుప్తా వ్యాఖ్యలు ఈ విషయానికి బలాన్ని చేకూరుస్తున్నాయి..

అధికారముంటే ఏమైనా చేస్తారా..?

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కోల్‌కతా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దుర్గామాత విగ్రహాల నిమజ్జనంపై మమత ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను కోల్‌కతా హైకోర్టు రద్దు చేసింది. అసలు ఇంతటి వివాదానికి కారణం ఏంటంటే..శరన్నవరాత్రులు ముగిసిన తర్వాత అప్పటి వరకు పూజించిన దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సారి నిమజ్జనోత్సవం జరిగే రోజు మొహర్రం వచ్చింది. అదే రోజు ముస్లిం సోదరులు కూడా తాజియా ఊరేగింపు జరుపుతారు..   రెండు ఊరేగింపులు ఒకేసారి వస్తే శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమవుతాయనే భావనతో మమత ప్రభుత్వం దుర్గామాత విగ్రహాలను మొహర్రం రోజున నిమజ్జనం చేయరాదంటూ ఆదేశించింది. ఆ ఆదేశాలను సవాలు చేస్తూ కోల్‌కతా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసింది. అధికారం చేతుల్లో ఉంది కాదా అని నిరంకుశ ఆదేశాలు జారీ చేయవచ్చునా..? అని ప్రశ్నించింది.  మొహర్రం ఊరేగింపుకు, దుర్గామాత విగ్రహాల నిమజ్జనాలకు వేర్వేరు మార్గాలను నిర్ణయించాలని ఆదేశించింది. ముంబై పోలీసులను చూసి నేర్చుకోవాలని సూచించింది. 

నా లాంటోడు రాజకీయాల్లో వెస్ట్

ఎవరు ఏమనుకున్నా..ఎంతగా విమర్శించినా మనసులో మాటను ఉన్నది ఉన్నట్లు మొహమాటం లేకుండా చెప్తారు టీడీపీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు జేసీ..తాజాగా ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.. అందుకు కారణం కూడా చెప్పారు..లోక్‌సభ సభ్యుడిగా తాను ఫెయిల్ అయ్యానని తన మనస్సాక్షి చెబుతోందని అన్నారు. తాడిపత్రి నియోజకవర్గంలోని చాగల్లు రిజర్వాయర్‌కు నీరు కూడా తీసుకురాలేని తనకు ఎంపీ పదవి ఎందుకని ప్రశ్నించారు.   ప్రజలకు హామీలు ఇచ్చి..వాటిని నెరవేర్చడంలో విఫలమైనందుకే రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చానని చెప్పారు. సోమవారం లేదా మంగళవారం ఢిల్లీకి వెళ్లి, లోక్‌సభ స్పీకర్‌కు రాజీనామా లేఖను అందిస్తానని చెప్పారు. అయితే తాను ఎంపీ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని..టీడీపీకి కాదని జేసీ తెలిపారు..సీఎం చంద్రబాబు నాయకత్వంలోనే తాను భవిష్యత్తులోనూ పనిచేస్తానని చెప్పారు. ఆయన వెర్షన్ ఇలా ఉంటే.. అధిష్టానంతో ఎక్కడ చెడినందువల్లే జేసీ ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా అనంత అభివృద్ధికి కొన్ని శక్తులు అడ్డు తగులుతున్నాయని జేసీ చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే దివాకర్ రెడ్డి రాజీనామాపై టీడీపీ అధినేత స్పందించాల్సి ఉంది.