మెట్రో రైలు ఎక్కబోతున్నారా..? ఈ జాగ్రత్తలు పాటించండి..!!
హైదరాబాద్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న మెట్రో ప్రారంభానికి కొద్ది గంటలే మిగిలి ఉంది.. ఈ నేపథ్యంలో మెట్రో ఎక్కి నగర అందాలను తిలకించాలని చిన్నా పెద్దా అందరు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే మామూలు రైల్వే స్టేషన్‌లో వలే మెట్రోలో ప్రయాణించాలంటే కుదరదు.. ఇక్కడ ఒళ్లు దగ్గర పెట్టుకొని నడుచుకోకపోతే తాట తీస్తారు. ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియమ నిబంధనలను హైదరాబాద్ మెట్రో కార్పోరేషన్ విడుదల చేసింది. వీటిని ఉల్లంఘిస్తే శిక్షలు కఠినంగా ఉంటాయి.. ప్రయాణికుల అవగాహన కోసం ఈ నియమ నిబంధనల జాబితాను ప్రతి మెట్రో స్టేషన్‌లోనూ తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ భాషల్లో నోటీసు బోర్డులో ఏర్పాటు చేశారు. మెట్రో రైళ్లు, స్టేషన్‌లలో ఎటువంటి అతిక్రమణలకు పాల్పడిన వారిపై మెట్రో రైలు చట్టం - 2002 ప్రకారం జరిమానాతో పాటు గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఒక్కో మెట్రో రైలులోని మూడు కార్లలో ఒకేసారి 974 మంది ప్రయాణించే వీలుంది. ఇందులో 126 మంది కూర్చొని, 848 నిలబడి ప్రయాణించడానికి వీలుగా రూపొందించారు.
మెట్రో స్టేషన్, బోగీల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
* స్టేషన్ లోకి వెళ్లే సమయంలో తనిఖీ సిబ్బందికి, భద్రతా సిబ్బందికి సహకరించాలి
* టికెట్ లేకుండా ప్రయాణిస్తే కఠిన చర్యలు ఉంటాయి
* టికెట్ కౌంటర్, ఆటోమెటిక్ ఫెయిర్ కలెక్షన్ గేట్ల వద్ద మీ వంతు వచ్చే వరకు క్యూలైన్ లో నిలబడాలి
* మెట్లు, ఎస్కలేటర్లపై జాగ్రత్తగా వెళ్లాలి
* రైలు ప్లాట్ ఫామ్ పై నిలిచిన తర్వాతే బోగీలోకి ప్రవేశించాలి
* ఏదైనా సహాయం కావాలనుకుంటే కస్టమర్ సర్వీస్ లేదా స్టేషన్ సిబ్బందిని సంప్రదించాలి
* మెట్రో సిబ్బంది, స్టేషన్ స్టాఫ్, తోటి ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి
* బోగీలో హ్యాండ్ రైల్ ను పట్టుకుని నిలబడాలి
* చిన్నారులు, వికలాంగులు, సీనియర్ సిటిజెన్స్, మహిళలు సీట్లలో కూర్చునేందుకు సహకరించాలి
* నిషిద్ధ వస్తువులు, పేలుడు పదార్థాలను గుర్తిస్తే… వెంటనే మెట్రో సిబ్బందికి తెలియజేయాలి
* ప్రయాణిస్తున్న సమయంలో టోకెన్లు, స్మార్ట్ కార్డులు చూపించాలని మెట్రో సిబ్బంది అడిగితే వారికి సహకరించాలి
* రైల్లోకి ప్రవేశించిన తర్వాత ఫొటోలు తీయరాదు
* రైళ్లలో ఆహారం, తినుబండారాలు తీసుకోకూడదు
* పెంపుడు జంతువులను తీసుకెళ్లకూడదు
* రైలు కోసం ప్లాట్ ఫామ్ పై పరుగెత్తరాదు
* స్టేషన్ పరిసరాలు, బోగీల్లో ఉమ్మి వేయడం, ధూమపానం చేయడం, పాన్ నమలడం చేయరాదు. ఆల్కహాల్ సేవించరాదు.
* చిన్నారులను స్టేషన్ పరిసరాల్లో, ప్లాట్ ఫామ్ పై వదలడం లాంటివి చేయరాదు.
* మెట్రో స్టేషన్ పరిసరాల్లో వీధి వ్యాపారాలు నిషేధం
* బోగీలకు నోటీసులు అంటించరాదు
* తమ స్మార్ట్ కార్డును లేదా టోకెన్ ను ఇతర ప్రయాణికులతో పంచుకోరాదు
* బోగీ డోర్లు తెరుచుకునే లేదా మూసుకునే సమయంలో వాటి మధ్య నిల్చోరాదు