గుర్గావ్ బాలుడి హత్య వెనుక "రేప్"

దేశ రాజధాని ఢిల్లీకి కూతవేటు దూరంలోని గుర్గావ్‌ ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూలులో ఏడేళ్ల చిన్నారి టాయ్‌లెట్‌లో శవమై తేలడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. చిన్నారి అని కనికరం లేకుండా కత్తితో అత్యంత పాశవికంగా బాలుడి గొంతు కోసి చంపడం అందరిని కంటతడి పెట్టించింది. పాఠశాలలో విద్యార్థుల మధ్య ఎటువంటి గొడవ జరిగిన దాఖలాలు లేవు..స్కూలు సిబ్బందిని ఎవరిని అడిగినా మాకు తెలియదు అన్న సమాధానమే.. మరి హత్య ఎవరు చేసి ఉంటారు..ఇదే ఖాకీల మెదళ్లను తొలిచేసింది. దీంతో ఆ ప్రశ్నకు సమాధానాన్ని తమ కోణంలో వెతికారు. ఆ వెతుకులాటలో అసలు నేరస్థుడు ఇంటి దొంగే అని తేలింది. అతను ఎవరో కాదు ఆ స్కూల్‌లో గత ఎనిమిది నెలలుగా డ్రైవర్‌గా పనిచేస్తోన్న 42 ఏళ్ల అశోక్ కుమార్.   అతను చిన్నారిని ఎందుకు హత్య చేశాడో తెలుసా..? లైంగిక దాడిని ప్రతిఘటించాడని.. అవును మీరు వింటున్నది పచ్చినిజం. నిన్న హత్యకు గురైన చిన్నారి ప్రద్యుమ్న ఠాకూర్‌ని వాళ్ల నాన్న స్కూలు వద్ద దించివెళ్లాడు. అప్పుడే బస్ పార్క్ చేసి వస్తున్న అశోక్‌కు బాలుడు టాయ్‌లెట్ వద్ద ఒంటరిగా కనిపించడంతో..అతనిపై లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడు..బాలుడు తప్పించుకునేందుకు యత్నించడంతో చిన్నారిని టాయ్‌లెట్‌లోకి లాక్కెళ్లి గొంతు కోసేశానని..కత్తితో రెండుసార్లు పొడిచానని అశోక్ తెలిపాడు. అనంతరం కత్తిని కడిగి ఘటనాస్థలంలో పడేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.   అయితే స్కూలు యాజమాన్యం ఏదో నిజాన్ని కప్పిపుచ్చేందుకే డ్రైవర్‌ని బలిపశువును చేసిందని కొందరు వాదిస్తున్నారు. హత్య జరిగిన సంగతి చెప్పకుండా మీ అబ్బాయి ఆరోగ్యం సరిలేదని ఆసుపత్రికి తీసుకెళుతున్నామని చెప్పడం.. రక్తపు మరకల్ని మాయం చేసేందుకు యత్నించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇందులో వాస్తవమెంతో తెలియదు కానీ..ఈ ఘటనతో సభ్యసమాజంలో అమ్మాయిలకే కాదు..అబ్బాయిలకు రక్షణ లేకుండా పోయిందని తేటతెల్లమైంది. మారుతున్న కాలమాన పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి ఉదంతాలు చాప కింద నీరులా భారతీయ సమాజంపై దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయకపోతే అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా నడిరోడ్డుపై నడవలేని పరిస్థితి రావడం ఖాయం.

ఈమెను చంపాలనుకుంటోంది ఎవరు..?

అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలి 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు డేరా సచ్ఛా సౌధ అధినేత గుర్మీత్ రాం రహీమ్ బాబా. ఆధ్యాత్మిక ముసుగులో ఆయన చేసిన అసాంఘిక కార్యకలాపాలకు అంతే లేదని..తాజాగా డేరా కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న తనిఖీల్లో వెల్లడవుతోంది. ఈ క్రమంలో ఆయన అక్రమాలకు ప్రత్యక్ష సాక్షి, గుర్మీత్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్‌ను పట్టుకునేందుకు రెండు రాష్ట్రాల పోలీసులు, ఐటీబీపీ, బీఎస్ఎఫ్, ఆర్మీ గాలింపు చేపట్టాయి. అత్యాచారం కేసులో శిక్ష పడటానికి ముందు..పడిన తర్వాత గుర్మీత్‌ను తప్పించేందుకు హనీప్రీత్ వ్యూహరచన చేశారు..పంచకులలో జరిగిన అల్లర్లు..దోషిగా తేలిన తర్వాత బాబాను రోహ్‌తక్ జైలుకు తరలించే క్రమంలో డేరా అనుచరులు మారణాయుధాలతో విరుచుకుపడటం ఇందులో భాగంగానే జరిగినట్లు పోలీసులు నిర్థారించారు.   ఈ అభియోగంగపై హనీప్రీత్‌ను అరెస్ట్ చేసి విచారణ జరపాలి అనుకునే లోపే గత నెల 25 తర్వాత ఆమె కనిపించకుండా పోయారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1న హనీప్రీత్ సింగ్‌పై లుక్ఔట్ నోటీసు జారీ చేశారు. కానీ అంతకు ముందే ఆమె దేశాన్ని వీడి వుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే డేరా అక్రమాల గుట్టు రట్టు చేయాల్సిందిగా పంజాబ్-హర్యానా ఉమ్మడి హైకోర్టు హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీస్ శాఖ సిర్సాలోని డేరా హెడ్ క్వార్టర్స్‌లో సోదాలు నిర్వహిస్తోంది. ఈ సోదాల్లో అనేక విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి. ఈ క్రమంలో హనీప్రీత్‌కు చెందినదిగా భావిస్తున్న ఒక డైరి లభించినట్లు.. తన వివాహానికి ఒక ఏడాది ముందు 1998లో ఆమె రాసుకున్న 101 పేజీల డైరీలో రహస్యాలు ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేసింది. ఆ డైరీయే ఇప్పుడు డేరా చీకటి సామ్రాజ్యానికి సాక్ష్యంగా నిలిచిందని ప్రచారం జరుగుతోంది.   ఆ చీకటి సామ్రాజ్యంలో తమ స్వప్రయోజనాల కోసం గుర్మీత్‌తో పాటు ఎంతోమంది భాగస్వాములయ్యారని ఇప్పుడు వారి భాగోతం ఎక్కడ బట్టబయలు అవుతుందోనని తప్పించుకునేందుకు మల్లగుల్లాలు పడుతున్నారట. ఈ నేపథ్యంలో డేరా బాబా అనైతిక చర్యలకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న హనీప్రీత్‌ను అంతమొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ మేరకు ఇంటెలిజెన్స్ బ్యూరో హర్యానా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ప్రత్యర్థుల చేతికి ఆమె చిక్కేలోగా హనీప్రీత్‌ను పట్టుకుని రాష్ట్రానికి తిరిగి తీసుకురావాలని పోలీసు శాఖ పట్టుదలతో ఉంది. హనీ కోసం ఇండో-నేపాల్ బోర్డర్‌లో ముమ్మరంగా వేట కొనసాగిస్తూ.. బోర్డర్ ఫోర్స్, సైన్యం, ఇతర రాష్ట్రాల పోలీసులతో టచ్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు హర్యానా డీజీపీ. ఈ నేపథ్యంలో ఆమెను చంపాలనుకుంది ఎవరా అన్నది మిస్టరీగా మారింది.

పవన్‌కు "గౌరీ లంకేశ్" పేరు తెలియదట..!

దేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ దారి వేరు..జనాల సమస్యలపై ప్రశ్నించేందుకు పార్టీ పెట్టుకున్న ఆయన సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్‌గా ఉంటూ, అప్పుడప్పుడు మాత్రమే జనాల్లోకి వెళతారు. గత మంగళవారం జరిగిన ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్యపై దేశం ఉలిక్కిపడింది. నిర్భయంగా వార్తలు రాస్తున్న ఓ జర్నలిస్టును చంపేశారంటూ పాత్రికేయ లోకం మండిపడుతూ రోడ్ల మీదకొచ్చి ఆందోళన నిర్వహించింది. పలు రాజకీయ పార్టీలు కూడా ఆమె హత్యను ఖండించాయి.   దీనిలో భాగంగా జనసేన తరపున స్పందిస్తూ వరుస ట్వీట్లు చేశారు పవన్..అంతా బాగానే ఉంది కానీ అక్కడే జనసేనాని తప్పులో కాలేశారు. గౌరీ లంకేశ్ పేరును గౌరీ శంకర్‌గా పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు పవన్‌పై విరుచుకుపడ్డారు. పార్టీ అధినేతగా ముందు ఆ అంశంపై కనీస అవగాహన ఉంచుకోవాలని..కనీసం పేరు కూడా సరిగా తెలియని పరిస్థితిలో ట్వీట్లు చేయడం అవసరమా అంటూ మొట్టికాయలు వేస్తున్నారు. విషయం తన దృష్టికి రావడంతో చేసిన తప్పును దిద్దుకుంటూ గౌరీ శంకర్ పేరును గౌరీ లంకేశ్‌గా చదువుకోవాలంటూ పవన్ మరో ట్వీట్ చేశారు. అయితే ఆయన ఎలాంటి క్షమాపణ చెప్పకపోవడం గమనార్హం. 

వస్త్రధారణ "రచ్చ"లో మిథాలీరాజ్

ఇటీవలి కాలంలో మహిళల వస్త్రధారణపై కామెంట్ చేయడం కామన్ అయిపోయింది. ముఖ్యంగా సెలబ్రెటీ స్టేటస్‌లో ఉన్నవారికి ఈ తాకిడి మరింత ఎక్కువైంది. సినీ తారలు, స్పోర్ట్స్ పర్సన్స్‌కు సంబంధించిన ప్రతి విషయమూ ఆసక్తికరమే..బయోగ్రఫి నుంచి వ్యక్తిగత విషయాల దాకా అన్నింటిపైనా అభిమానులకు ఆరాటం ఎక్కువే. ఈ రోజుల్లో సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి చిన్న విషయానికి విపరీతమైన బజ్ వచ్చేస్తోంది. ఒక దానికి పాజిటివ్ టాక్ వస్తే..మరోదానిపై నెగిటీవ్ కామెంట్లు వచ్చేస్తున్నాయి. ఒక సెలబ్రెటీ ఎక్కడో ఏదో ఫంక్షన్‌లో సెల్ఫీ దిగి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం‌..అది క్షణాల్లో వైరల్ అవ్వడం జరిగిపోతుంది.   దానిని చూసిన వారు బాగుంది అని లైక్ కొట్టడానికి బదులు..అందులోని తప్పొప్పులను వేలేత్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా మహిళా సెలబ్రెటీ అయితే ఇక అంతే ఉండదు. గతంలో వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి, సినీనటి అనసూయ వస్త్రధారణపై కొందరు విమర్శలు చేశారు. అలా చేసిన వారికి అంతే ఘాటుగా కౌంటరిచ్చారు వారిద్దరూ. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్ చేరారు.   ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోటోలో మిథాలీ వేసుకున్న వస్త్రధారణ అసభ్యకరంగా ఉందంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. నలుగురికి స్పూర్తి పంచాల్సిన స్థానంలో ఉంటూ ఇదేం పని అంటూ విమర్శిస్తున్నారు. మరి అభిమానులు ఊరుకుంటారా... అసలే ఇండియాలో క్రికెట్ ఒక మతమాయే. ఇక చూస్కోండి..మీ మైండ్‌సెట్ మార్చుకోండి..ఇలాంటి మనస్తత్వాన్ని ఇకనైనా విడిచిపెట్టాలంటూ క్లాసులు పీకుతున్నారు.. మేల్ డామినేటేడ్ ఇండియన్ క్రికెట్‌లో మహిళా క్రికెట్‌కు పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చి.. మహిళా క్రికెట్‌ అనేది ఒకటి దేశంలో ఉందని చాటి చెప్పింది మిథాలీనే అని..అలాంటి ఆమె విజయాలు చూడకుండా..ఇలా నీచమైన కామెంట్లు పెట్టడం విడనాడాలని వారు సలహా ఇస్తున్నారు. 

ఈ జపాన్ యువరాణి.. నిజమైన ‘మల్లీశ్వరి’

  అనగనగనగా... ఓ రాకుమారి.  ఆ రాకుమారీ... ఓ సామాన్యుడి ప్రేమలో పడింది. అంతటితో ఆగిందా!... ఓ సంస్థానానికే అధినాయకురాలు కావాల్సిన ఈ అంత:పుర కాంత... ప్రేమకోసం పదవినీ, అధికారాన్ని తృణప్రాయంగా వదులుకుంది. కోరుకున్న ప్రియుడ్ని పెళ్లాడబోతూ.. ప్రపంచం మొత్తం నివ్వెపోయేలా చేసింది.    ఏంటి? ఇదేదో... పాత సినిమా కథలా ఉంది అనుకుంటున్నారా!.. నిజమే పాత సినిమా కథే. మొన్నటి ‘పాతాళ భైరవి’ నుంచి, నిన్నటి ‘మల్లీశ్వరి’ వరకూ మనం కనిన కథే, వినిన కథే. నాడు తెరపై చూసిన ఈ పాత కథ.. నేడు కొత్త విశేషంగా మారింది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ విశేషం గురించే మాట్లాడుకుంటోంది. అసలు జపాన్ యువరాణి ‘మేకో’ చేసింది సాహసం అనాలా? త్యాగం అనాలా? లేక తెగింపు అనాలా? ప్రేమ కోసం ఇంతటి త్యాగం చేస్తారా? ప్రేమలో ఇంత మాయ ఉందా? కేవలం కథల్లో మాత్రమే కనిపించే అలాంటి పాత్రలు నిజజీవితాల్లో కూడా ఉంటాయా? ఇప్పుడు అందరి మనసుల్లో ఇదే ప్రశ్న.    తోటి గ్రాడ్యుయేట్ స్టూడెంట్.. ‘కియో కొమురో’తో తన ప్రేమ వ్యవహారాన్ని తన ప్యాలెస్ లోనే స్వయంగా మీడియాకు తెలియజేసింది మేకో. త్వరలో జరుగనున్న ఎంగేజ్మెంట్ విషయం కూడా అక్కడే విశదపరచింది. సంస్థానం కట్టుబాటు ప్రకారం... రాజవంశీయులను కాకుండా.. బయటవారిని వివాహం చేసుకుంటే, సంస్థానానికి చెందిన అధికారాలన్నింటినీ పరిత్యజించాలి. 2005లో ‘మేకో’ మేనత్త విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు ‘రాకుమారి మేకో’ కూడా అదే దారిలో పయనించడం జపాన్ లో చర్చనీయాంశమైంది. కాలేజ్‌లో చదువుతున్న రోజుల్లో కియో కొమురోతో స్నేహం మాత్రమే ఉండేదని.. అయితే, 2013లో ‘కియో కొమురో’.. ప్రపోజ్ చేశాడనీ, ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులూ కలవడంతో.. కియోతో జీవితం బావుంటుందనిపించిందనీ,  ఒకరంటే ఒకరికి అలవిమాలిన ఇష్టంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని మీడియాకు తెలిపారు జపాన్ యువరాణి ‘మేకో’.    టోక్యోలోని ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్సిటీలో వీరిద్దరూ అయిదేళ్లు కలిసి చదువుకున్నారు. ఇద్దరి వయసు 25 సంవత్సరాలే కావడం విశేషం. కియో కొమురో.. స్వశక్తితో ఎదిగిన వ్యక్తి. లోకల్ టూరిజం కేంపియన్లో ‘ప్రిన్స్ ఆఫ్ ది సా’గా తను ప్రసిద్ధి గాంచాడు. రేపు జరగనున్న వివాహానికి జపాన్ కి చెందిన రాజ కుటుంబాలన్నీ రానున్నాయ్. ప్రస్తుతం ప్రపంచం మొత్తం వీరి వివాహం గురించే మాట్లాడుకుంటోంది. ఇప్పటి వరకూ ‘బయట జరిగేవే సినిమాల్లో చూపిస్తారు’ అనుకునేవాళ్లం.. ఇప్పుడు ‘తెరపై జరిగేవి బయట కూడా జరుగుతాయ్’అని మనం నమ్మాలి. తప్పదు ఏమంటారు? 

గౌరీ ‌హత్య చుట్టూ "కుల" రాజకీయాలు

ఎవరు చేశారో..? ఎందుకు చేశారో..? తెలియదు కానీ గౌరీ లంకేష్ హత్య కన్నడ నాట సంచలనం కలిగించింది. తమకు వ్యతిరేకంగా కథనాలు వెలువరించారనే అక్కసుతోనే గౌరీని చంపి ఉంటారని అంతా భావిస్తూ వచ్చారు. మీడియా కూడా ఇదే బేస్ చుట్టూ కథనాలు వండి వార్చింది. కానీ ఆమె హత్య ప్రధాన రాజకీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. మరో తొమ్మిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు..వరుసగా రెండోసారి అధికారాన్ని అందుకోవాలని కాంగ్రెస్..గతంలో కోల్పోయిన అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని బీజేపీ ఇప్పటి నుంచే వ్యూహాలు రెడీ చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో గౌరీ లంకేష్ హత్య కన్నడ రాజకీయాలను ఒక కుదుపు కుదిపింది.. పార్టీలు ఉలిక్కిపడ్డాయి..ఇంతటి కలవరానికి కారణం ఆమె తన పత్రికలో సంచలన కథనాలు ప్రచురించారనో..లేకో మరోకటో కాదూ..ఆమె కులమే అగ్రనేతలను భయపెడుతోంది.   కర్ణాటకలో లింగాయత్ సామాజిక వర్గం అండదండలు ఉన్న వారికే అధికారమని దశాబ్ధాలుగా రుజువు అవుతూ వస్తుంది. రాజకీయ ప్రాబల్యశక్తిగా బలపడిన లింగాయత్‌లకు రాష్ట్రంలోని 224 అసెంబ్లీ సీట్లలో 110 స్థానాల ఫలితాలను ప్రభావితం చేయగల సత్తా ఉంది. ఆ మధ్య బీజేపీకి అలక వహించి కాంగ్రెస్‌కు దగ్గరైన ఆ కులస్తులు తిరిగి కమలానికి దగ్గరవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం హత్యకు గురైన గౌరీ లంకేష్ కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వారు కావడమే అసలు సమస్య. ఆ కులానికి చెందిన ఓట్లు కాషాయం చెంతకు చెరకుండా చేసేందుకు..లింగాయత్ వర్గాన్ని భయభ్రాంతులకు గురిచేసేందుకే రాజకీయ ప్రత్యర్థులు ఇలాంటి దాడులకు తెగబడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.   గడచిన రెండు సంవత్సరాల కాలంలో దక్షిణ కన్నడ జిల్లాలో బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లకు చెందిన 12 మందిని దారుణంగా హత్య చేశారు. వీరిలో అత్యధికులు లింగాయత్ వర్గం వారే. ఈ క్రమంలో వారి మద్ధతును కూడగట్టేందుకు పార్టీలు రంగంలోకి దిగాయి. దీనిలో భాగంగా కాంగ్రెస్ పార్టీయే ఈ దారుణాలు చేస్తోందని ఆరోపిస్తూ బీజేపీ దక్షిణ కన్నడ జిల్లాలో మెగా ర్యాలీకి పిలుపునివ్వగా..కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఢిల్లీ స్థాయిలో ప్లాన్ చేసుకుంటున్నారు..లెఫ్ట్ సహకారంతో జనంలోకి వెళ్లి..గౌరీ లంకేష్ హత్యపై ఢిల్లీ స్థాయిలో ఉద్యమం చేయాలని కసరత్తు చేస్తోంది కాంగ్రెస్. మరీ ఈ పరిణామాలు రానున్న రోజుల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తాయో వేచి చూడాలి.

పవన్ మళ్ళీ "హీరో" అయ్యాడోచ్..!

పవర్‌ కోసం కాదు..ప్రశ్నించడం కోసం అనే ట్యాగ్‌లైన్‌తో జనసేనను స్థాపించారు పవన్ కళ్యాణ్‌‌. కానీ పవన్ అన్న మాటను నిలబెట్టుకున్న సందర్భాలు చాలా తక్కువ. అయితే ఆయన ప్రశ్నించిన చాలా వాటికి ప్రభుత్వం స్పందించడంతో జనసేనాని జనాల దృష్టిలో హీరోగా నిలిచారు. మొన్నామధ్య ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై చలించిపోయిన పవన్ విషయాన్ని తన ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు ఏకంగా హార్వార్డ్ యూనివర్శిటీ వైద్య బృందాన్ని రంగంలోకి దింపి ఆ ప్రాంతంలో కిడ్నీ వ్యాధి మూలాలు గుర్తించి శాశ్వత పరిష్కారం కొనుగొనేందుకు కృషి చేశారు. ఇక అంతే జనసేనానికి ప్రజలు జేజేలు పలికారు..సమస్య ఏదైనా సరే పవన్‌ దగ్గరికి వెళితే న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం ఏర్పడిపోయింది.   తాజాగా ఏపీలో వ్యవసాయ శాఖ ఉద్యోగాలకు సంబంధించి తమకు అడ్డుగా మారిని జీవో 64ను రద్దు చేయాలని విద్యార్థులు గత కొద్ది రోజులుగా పోరాటం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందనా లేదు. దీంతో వారు తమ గోడును జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఆయన లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టే ఈ జీవోను రద్దు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో నిన్న ఆ జీవోను రద్దు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ వ్యవసాయ కళాశాలల విద్యార్థుల అభ్యర్థన మేరకు జీవో 64ను రద్దు చేస్తున్నట్లు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఈ వివాదంపై త్రిసభ్య కమిటీని నియమించామని..కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.   ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగడంలో సహకరించిన పవన్‌ను వారు ఆకాశానికి ఎత్తేశారు. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే ప్రభుత్వానికి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు జనసేనాని. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, సమస్యను పరిష్కరించింది గనుక సమ్మె విరమించి తరగతులకు హాజరవ్వాలని విద్యార్థులకు సూచించారు పవన్. మొత్తంగా చూస్తే తాజా ఇష్యూతో పవన్‌కు ప్రభుత్వం వద్ద ఉన్న పరపతి..ఆయనకు చంద్రబాబు సర్కార్ ఇస్తోన్న ప్రాధాన్యత అర్థమవుతుంది.

గౌతంరెడ్డి వెనుక "అపరిచిత వ్యక్తి" ఎవరు..?

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. రాజకీయంగా ఎదగడానికి నేతలు వేసే ఎత్తుగడలు చాలా చిత్రంగా ఉంటాయి..నిన్నటి వరకు మనతో తిరిగిన వ్యక్తి మనవైపే వేలేత్తి చూపుతాడు..తిట్టిన వ్యక్తే పొగుడుతాడు.. ఇదంతా రాజకీయ చదరంగంలో చాలా కామన్ . రంగా హత్య తర్వాత బెజవాడ టోటల్‌గా సైలెంట్ అయ్యిందని చెప్పవచ్చు. చిన్న చిన్న సెటిల్‌మెంట్లు చేసేవారిని కూడా ఖాకీలు అణిచివేయడంతో విజయవాడ ప్రజలు చాలా ప్రశాంతంగా కాలాన్ని వెళ్లదీస్తున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో మళ్లీ అక్కడ స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దివంగత వంగవీటి రంగాతో పాటు ఆయన సోదరుడు రాధా హత్యలపై ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైసీపీ నేత గౌతంరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో రంగా అభిమానుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది.   తమ అభిమాన నేతపై గౌతమ్‌రెడ్డి నోరు జారడంతో రంగా తనయుడు రాధాకృష్ణ తన అనుచరులతో కలిసి గౌతమ్ ‌రెడ్డి ఇంటి వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లడం..పోలీసులు ఆయన్ను అడ్డుకుని స్టేషన్‌కు తరలించడంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇద్దరు నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కి పార్టీ పరువుని నడిబజార్లో తీస్తుండటంతో వైసీపీ అధినేత సీరియస్ అయ్యారు. గౌతమ్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎప్పుడూ సంయమనంతో వ్యవహరించే గౌతమ్‌రెడ్డి హఠాత్తుగా ఎందుకు నోరు జారారా అని పార్టీ నేతలు, కార్యకర్తలు జుట్టు పీక్కొంటున్నారు. అయితే జగన్మోహన్‌రెడ్డే కావాలని ఇంత హైడ్రామా ఆడించారని ప్రచారం జరగ్గా.. కాదు ఇది వేరే వ్యక్తి డైరెక్షన్‌లో జరిగింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.   2014లో వైసీపీ టికెట్‌పై విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసిన గౌతమ్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి బొండా ఉమా చేతిలో ఓటమిపాలయ్యారు. సరే వచ్చేసారి సత్తా చూపిద్దాంలే అనుకుంటున్న సమయంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైసీపీలో చేరారు. సెంట్రల్‌ నియోజకవర్గంపై మొదటి నుంచి పట్టున్న నేత కావడంతో ఈ టికెట్‌ను మల్లాదికి ఇవ్వాలని జగన్ భావిస్తున్నారట. దీంతో తన రాజకీయ భవిష్యత్‌పై గౌతమ్‌ ఒత్తిడికి లోనయ్యారట. దానికి తోడు నంద్యాల, కాకినాడ ఫలితాల్లో టీడీపీ చేతిలో వైసీపీ చావు దెబ్బతినడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని అంటున్నారు. వీటన్నింటిని బేరీజు వేసుకుని ఇటీవల బీజేపీ నేతలను కలిసి మంతనాలు సాగించారని..పార్టీ మారే విషయంలో ఇద్దరు చర్చించుకున్నారని వార్తలు వచ్చాయి. ఉన్నపళంగా పార్టీ మారితే బాగుండదని..పార్టీ తనంత తానుగా సస్పెండ్ చేసే పరిస్థితి కల్పించుకోవాలని సదరు నేత గౌతంరెడ్డికి సూచించారట...దీనిలో భాగంగానే రంగాపై రెడ్డిగారు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని బెజవాడలో చర్చించుకుంటున్నారు. మరి దీనిలో వాస్తవమెంత అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

దత్తన్న పోస్ట్ "ఊస్ట్" అవ్వడానికి కారణం అదేనా..?

ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన దాదాపు మూడు సంవత్సరాల తరువాత నరేంద్ర మోడీ తన మంత్రివర్గంలో చేపట్టిన భారీ మార్పులు, చేర్పులు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. త్వరలో జరగనున్న కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2019 సార్వత్రిక ఎన్నికల లెక్కలను బేరీజు వేసుకుని మోడీ ఈ మార్పులు చేపట్టినట్లు ప్రచారం జరిగింది. పునర్వ్యస్థీకరణ ప్రక్రియకు ముందు మంత్రుల పనితీరుపై నిశితంగా సమీక్ష జరిపారట మోడీ.. వారిలో కొందరు మంత్రులకు నెగిటీవ్ మార్కులు..మరికొందరికి పాజిటీవ్ మార్కులు రావడంతో వాటి ఆధారంగా సంబంధిత మంత్రుల శాఖలను మార్చడం..హోదా తగ్గించడం..మంత్రి పదవి నుంచే తప్పించడం వంటి చర్యలు చేపట్టారు ప్రధాని. వారిలో ప్రముఖంగా ఉమాభారతి, రాజీవ్ ప్రతాప్ రూఢీతో పాటు తెలుగు వ్యక్తి బండారు దత్తాత్రేయ ఉన్నారు.   ఉమా భారతి పనితీరు సరిగా లేదని పక్కనబెట్టగా..75 సంవత్సరాలు దాటిన వారు పార్టీ పదవుల్లో ఉండరాదనే నిబంధనను సాకుగా చూపి కల్‌రాజ్‌ మిశ్రాకు నచ్చజెప్పారు. సరే వివాదాలకు దూరంగా, సౌమ్యుడిగా, నిత్యం ప్రజలలో ఉండే దత్తన్నను పదవి నుంచి ఎందుకు తప్పించారనేది రాజకీయ విశ్లేషకుల మెదళ్లను తొలిచేస్తోంది. తెలంగాణ ప్రాంత వ్యక్తి కావడం..టీఆర్ఎస్ అధినేతతో సాన్నిహిత్యం తదితర అంశాలను బేరీజు వేసుకున్న ప్రధాని దత్తాత్రేయను సాగనంపేందుకే నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ వర్గాలు చర్చించుకుంటున్నారు. అయితే అసలు మ్యాటర్ ఇది కాదట. మోడీ ఎన్నికల హామీల్లో ప్రధానమైనది ఉద్యోగాల భర్తీ. తాను అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తానన్నారు నరేంద్రుడు. ఉద్యోగాల కల్పనలో కీలకపాత్ర వహించే శాఖలైన స్కిల్ డెవలెప్‌మెంట్, పెట్రోలియం శాఖ, కార్మిక శాఖలను నిర్వహిస్తున్న.. రాజీవ్ ప్రతాప్ రూఢీ, ధర్మేంద్ర ప్రధాన్, బండారు దత్తాత్రేయల్లో ప్రధాన్ ఒక్కరే తన శాఖ నుంచి మెరుగైన ఫలితాలు సాధించినట్లు మోడీ రిపోర్టులో తేలిందని నీలాంజన్ ముఖోపాధ్యాయ అనే రాజకీయ విశ్లేషకుడు తాను రాస్తున్న మోడీ బయోగ్రఫీ పుస్తకంలో పొందుపరచడం సంచలనం కలిగించింది. దీంతో ధర్మేంద్రకు ప్రమోషన్ ఇచ్చి మిగిలిన ఇద్దరిని మంత్రివర్గం నుంచి ప్రధాని తప్పించారని నీలాంజన్ పేర్కొన్నారు.   కానీ గత ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతం నుంచి బీజేపీ గెలిచిన ఏకైక ఎంపీ స్థానం దత్తాత్రేయదే. అటువంటి నేతకు ఇలా జరగాల్సింది కాదని ప్రత్యర్థులు సైతం వాదిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో తనను పదవి నుంచి తప్పించబోతున్నారని ఢిల్లీలోని అత్యంత సన్నిహితులైన జర్నలిస్టుల ద్వారా తెలుసుకున్న దత్తాత్రేయ విషయాన్ని ఆర్ఎస్ఎస్ దృష్టికి తీసుకెళ్లారట..కానీ ఏం చేస్తాం..అక్కడంతా మోడీ మేనియా నడుస్తుంటే వారు మాత్రం ఏం చేయగలరు..ఈ విషయాన్ని ఆలస్యంగా బోధపడటంతో దత్తన్న తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా సైలెంట్‌గా హైదరాబాద్ వచ్చేశారు.

కలానికి రక్షణ కరువు

న్యూస్ పేపర్లో ప్రచురితమైన వార్త ప్రభుత్వాలను కదిలిస్తుంది..టీవీలో కనిపించే దృశ్యం అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. రేడియోలో వినిపించే ఒక స్వరం ప్రజలను చైతన్యపరుస్తుంది. పాత్రికేయానికి ఉన్న పవర్ అలాంటిది..తమ కలంతో సామాన్యుల గళాలను వినిపిస్తూ సమాజసేవలో తమ వంతు పాత్ర పోషించే జర్నలిస్టులకు మనదేశంలో రక్షణ కరువైంది. సిరా చుక్కల స్థానంలో నెత్తురు చుక్కలు దర్శనమిస్తున్నాయి. ఎదిరించి ప్రశ్నించి వార్తలు రాసిన పాపానికి ప్రాణాలను బలి పెట్టాల్సి వస్తుంది.   బెంగళూరుకు చెందిన ప్రముఖ పాత్రికేయురాలు, సామాజిక వేత్త గౌరీ లంకేశ్ దారుణ హత్యకు గురికావడంతో దేశంలో జర్నలిస్టుల పరిస్థితి మరోసారి చర్చకు వచ్చింది. భారతదేశంలో పాత్రికేయులు అత్యంత విషమ పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్నారని న్యూయార్క్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ సర్వేలో తేలింది. అంతేకాకుండా జర్నలిస్టులకు రక్షణ లేని దేశాల్లో భారత్‌కు మూడో స్థానం కట్టబెట్టిందంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 2015లో 110 మంది జర్నలిస్టులు హత్యగావింపబడ్డారు..వీరిలో న్యూస్‌ కవర్ చేయడానికి వెళ్లి 69 మంది చనిపోగా..43 మంది అసలు ఎందుకు చనిపోయారో కూడా కారణం తెలియదు. ఇదే సమయంలో భారత్‌లో 28 మంది పాత్రికేయులు దారుణ హత్యకు గురయ్యారు. ప్రధానంగా అయిల్ మాఫియా, అక్రమ మైనింగ్, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలతో విభేదాలు వంటి పలు కారణాలతో జర్నలిస్టులు హత్యగావింపబడ్డారు.    * ప్రస్తుతం అత్యాచారం, హత్య కేసులో దోషిగా శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీం‌కు వ్యతిరేకంగా కథనాలు రాసిన విలేకరి..రామచంద్ర చత్రపతిని అతని కార్యాలయంలోకి చొరబడి తుపాకీతో కాల్చి చంపారు. * మిడ్‌ డే ప్రతికకు చెందిన క్రైమ్ రిపోర్టర్ జ్యోతిర్మయి డేను అండర్ వరల్డ్ మాఫియా 2011లో హత్య చేసింది. * మహారాష్ట్రకు చెందిన సంపాదకుడు నరేంద్ర దబోల్కర్‌ను 2013లో ఆగస్టులో ఒక ఆలయం వెలుపల గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. * హిందీ దైనిక్ దీనబంధు’ విలేకరి సాయి రెడ్డి.. ఛత్తీస్‌ఘడ్‌లోని నక్సల్ ప్రభావిత జిల్లా బీజాపూర్‌లో అనుమానాస్పద రీతిలో హత్యకు గురయ్యాడు. * 2014 మే 27న ఒడిశా‌లోని స్థానిక టీవీ ఛానల్ స్ట్రింగర్ తరుణ్‌కుమార్‌ను అత్యంత దారుణంగా హత్య చేశారు. * 2014లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్టు ఎంవీఎన్ శంకర్ హత్యకు గురయ్యారు. ఎంవీఎన్ ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఆయిల్ మాఫియాపై పలు కథనాలు అందించారు. * 2013లో యూపీలోని ముజఫ్పర్‌నగర్‌లో ‘నెట్‌వర్క్ 18’కు చెందిన విలేకరి రాజేష్ వర్మను తుపాకీతో కాల్చి చంపేశారు. * ఫేస్‌బుక్‌లో మంత్రిగారికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టాడనే అక్కసుతో ఉత్తరప్రదేశ్‌లో‌ని షాజహాన్‌పూర్‌‌కు చెందిన విలేకరి జోగేంద్ర సిన్హాను సజీవ దహనం చేశారు. * 2015 జూన్‌లో మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ జిల్లాలో విలేకరి సందీప్‌ కొఠారీని సజీవ దహనం చేశారు. * వ్యాపం కుంభకోణంపై పరిశోధన చేస్తున్న ఆజ్‌తక్ రిపోర్టర్ అక్షయ్ సింగ్‌ అనుమానాస్పద స్థితిలో శవమై తేలారు. ఆయన మరణానికి కారణాలు నేటి వరకు తెలియదు. *  2016 మే 13న బీహార్‌లోని హిందీ దైనిక్ హిందుస్థాన్‌కు చెందిన జర్నలిస్టు రాజ్‌దేవ్‌ రంజన్‌ను తుపాకీతో కాల్చి చంపారు. బయటి ప్రపంచానికి తెలిసినవి వాటిలో ఇవి కొన్ని మాత్రమే..ఇంకా ఆచూకీ గల్లంతైన వారు..అనుమానాస్పదంగా మరణించినవారికి లెక్కే లేదు. ఇలాంటి వాటిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహా అనేక జర్నలిస్టు సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా చర్యలు మాత్రం శూన్యం. 

జగన్ హెల్త్‌కి అసలేమైంది?

  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన రెడ్డికి కేసులు కొత్తకాదు... కోర్టుల చుట్టూ తిరగడం కొత్తకాదు.. ఎన్నికలలో ఆయన పార్టీ ఓటమి పాలు కావడమూ కొత్తకాదు..  గతంలో ఇలాంటి  అనుభవాలు ఎన్నిసార్లు కలిగినా, జనంలోకి వస్తే ముఖం మీద చిరునవ్వు చెరగకుండా కనిపించే ఆయన ఇటీవలి కాలంలో ముఖం వాడిపోయి, బక్క చిక్కినట్టుగా, ముఖం మీద చిరునవ్వు లేకుండా కనిపిస్తున్నారు. పైగా ఎప్పుడూ క్లీన్ షేవ్‌లో కనిపించే ఆయన గత కొద్ది రోజులుగా కేశ సంస్కారం లేకుండా కనిపిస్తు్న్నారు. జగన్‌లో ఈ ఆకస్మిక మార్పుకి కారణమేంటి? ఒకవైపు నంద్యాలలో ఘోర పరాజయం, ఇంకో వైపు కాకినాడలో దారుణమైన అవమానం, ఇంకోవైపు జగన్ పాదయాత్ర చేయాలనుకుంటున్నది కోర్టుకు హాజరు నుంచి తప్పించుకోవడానికేనని సాక్షాత్తూ హైకోర్టే వ్యాఖ్యానించడమా? ఇవేవీ కాకుండా... నంద్యాలలో ప్రచారం ముగియగానే తన ఆరోగ్యం బాగాలేదంటూ జగన్ కాకినాడకు దూరంగా వున్నారు.. జగన్‌కి నిజంగానో ఆరోగ్యం బాగాలేదా? ఇంతకీ జగన్ ఆరోగ్యానికి ఏమైంది?   తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు ఆరోగ్యం క్షీణించాలని, ఆయనకు ఏదో జరిగిపోయి తాను ముఖ్యమంత్రి అయిపోవాలని జగన్ కలలు కంటూ వుంటారు. అలాంటి ఇప్పుడు చెడపకురా చెడేవు అనే సామెతలాగా జగన్ ఆరోగ్యమే క్షీణిస్తోందా? ఇప్పుడు వైసీపీ వర్గాల్లో ఈ ఆందోళన పెరిగిపోయింది. దెబ్బమీద దెబ్బ అన్నట్టుగా జగన్‌కి షాక్ వెంట షాకులు మొత్తం మూడు షాకులు తగిలాయి. ఆ షాకుల ప్రభావం వల్ల జగన్  డల్ అయిపోయారా? లేక నిజంగానే ఆరోగ్యం బాగాలేదా అనే విషయంలో క్లారిటీ లేక వైసీపీ వర్గాలు తల్లడిల్లుతున్నాయి. గతంలో ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా, నెలల తరబడి జైల్లో వుండి వచ్చినా ఎంతమాత్రం తొణకని, బెణకని జగన్ ఇప్పుడు ఇంతలా నీరసించిపోవడం పార్టీ వర్గాల్లో ఆందోళన పెంచుతోంది.   అసలింతకీ జగన్ ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్య ఏమిటనేది వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయినదానికీ, కానిదానికీ అనవసరంగా ఆవేశపడిపోవడం వల్ల బీపీ పెరిగిపోయిందా? లేక మరేదైనా  అనారోగ్య సమస్య తలెత్తిందా అని అనుకుంటున్నారు. పాదయాత్ర మీద హైకోర్టు కామెంట్లు చేయడం వల్ల ఇప్పట్లో జగన్ పాదయాత్ర చేసే అవకాశం కనిపించడం లేదు. ఒకవేళ పాదయాత్ర మీద న్యాయమూర్తులు ఎలాంటి  వ్యాఖ్యలు చేయపోయినట్టయితే జగన్ తప్పనిసరిగా పాదయాత్ర చేయాల్సిన పరిస్థితి వుండేది. అసలే క్షీణించిన ఆరోగ్యంతో వున్న జగన్ సహజంగానే పాదయాత్ర చేయలేకపోయేవారు. అది అధికార తెలుగుదేశానికి అడ్వాంటేజ్‌గా మారేది. తిడితే తిట్టిందిగానీ, కోర్టు మంచికే తిట్టిందనే అభిప్రాయంలో వైసీపీ వర్గాలు వున్నాయి. తమ నాయకుడు మళ్ళీ పూర్తి ఆరోగ్యాన్ని పొంది అధికార పార్టీని తిట్టే పనిలో నిమగ్నం కావాలని కోరుకుంటున్నాయి.  

కాకినాడలోనూ "ఫ్యాన్" క్రష్..!

మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లుగా ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షంగా వ్యవహరిస్తోన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి. దెబ్బ మీద దెబ్బ అది కూడా ఒకదాని వెంట ఒకటి తగులుతూ ఉండటంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను నిరాశ అవహిస్తోంది. గుండెను ఎంత నిబ్బరంగా ఉంచుకుందామన్నా వారికి సాధ్యం కావడం లేదు. అంచనాలను, సర్వేలను తలక్రిందులు చేస్తూ తెలుగుదేశం పార్టీ నంద్యాలలో ఘన విజయం సాధించింది. సమీకరణాలన్నీ అనుకూలంగా ఉన్న చోట ఓటమి వెక్కిరించడంతో వైసీపీ ఖంగుతింది.   ఆ షాక్ నుంచి బయటపడదాం అనుకుంటున్న సమయంలో కాకినాడ నగరపాలక సంస్థకు ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఎన్నిక నిర్వహించాలని హైకోర్టు తీర్పునివ్వడంతో వైసీపీ ఎన్నికలకు సిద్ధమైంది. కానీ లోలోపల ఏదో భయం.. అక్కడ ఏ ఫలితం వస్తుందోనని..చివరకు కార్యకర్తలు భయపడినంత పని జరిగింది. కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్‌ను తెలుగుదేశం పార్టీ తన్నుకుపోయింది. అధికార పార్టీ అక్కడ గెలుస్తుందని ముందే ఊహించారు. అయితే టీడీపీ ఆవిర్భావం తర్వాత ఒకసారి మాత్రమే కాకినాడలో గెలిచింది. 1985లో మున్సిపాలిటీగా ఉన్నప్పుడు తెలుగుదేశం ఛైర్మన్ ‌పీఠాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తూ వచ్చింది.   రాష్ట్ర విభజన తర్వాత హస్తం నామరూపాలు లేకుండా పోయింది. అప్పటిదాకా కాకినాడ పెత్తనం చలాయిస్తూ వచ్చిన నాయకుల్లో చాలామంది వైసీపీ, టీడీపీల్లోకి వెళ్లిపోయారు. కాబట్టి ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా హోరా హోరీ పోరు ఖాయమని విశ్లేషకులు భావించారు. అందుకు తగ్గట్టుగానే ప్రచారంలో ఇరు పార్టీలు దుమ్మురేపాయి. తీరా కౌంటింగ్ దగ్గరికి వచ్చే సరికి ఏకపక్షంగా మారిపోయింది. కౌంటింగ్ ప్రారంభమైన నాటి నుంచి సైకిల్ స్పష్టమైన మెజారిటీతో దూసుకెళ్లి మేయర్ పీఠాన్ని ఎగరేసుకుపోయింది. ఇలా వరుసగా తమను పరాభవాలు వెక్కిరిస్తుండటంతో వైసీపీ దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయింది.

నంద్యాల "వేడి" ఇంకా చల్లారలేదా..?

ఎన్నికలు అన్నాకా..అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు అత్యంత సహజం. ప్రచారంలో ప్రజలను ఆకర్షించాలనో..మీడియాలో హైలెట్ అవ్వాలనో నేతలు సవాళ్లు విసురుకుంటూ ఉంటారు. సరే ఎన్నికలు అయిపోయాకా..రిజల్ట్ కూడా వచ్చాకా ఛాలెంజ్‌లు చేసుకుంటే..ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అదే జరుగుతోంది. నంద్యాల ఉప ఎన్నికలో కలలో కూడా అనుకోని విధంగా తెలుగుదేశం గెలవడంతో వైసీపీ శ్రేణులను నైరాశ్యం ఆవహించింది. హుషారుగా కనిపించే నేతలు, కార్యకర్తలు చప్పబడిపోయారు..అవమాన భారంతో ఇళ్లు దాటి బయటకు కూడా రావడం లేదట కొంతమంది.   తాము చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్లే గెలిచామని తెలుగుదేశం నేతలు చెప్పుకుంటుండగా..అధికార దుర్వినియోగం, విచ్చలవిడిగా డబ్బు వెదజల్లడం, అక్రమ మార్గాల్లో అధికార పార్టీ గెలుపొందిందని వైసీపీ నేతలు ఆరోపిస్తూ కింద పడ్డా తమదే పైచేయి అన్న చందంగా ప్రవర్తిస్తున్నారు. ఆ ఫస్ట్రేషన్‌లో సరికొత్త సవాళ్లతో నోరు పారేసుకుంటున్నారు. దమ్ముంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలందరి చేత రాజీనామా చేయించి..గెలిచి చూపించాలంటూ వాదిస్తున్నారు. మరి అధికార పార్టీ వాళ్లు వూరుకుంటారా..? రెండాకులు ఎక్కువే చదివారు కదా..?   నిన్నటి దాకా నంద్యాలను రెఫరెండం అన్నవారు..అక్కడ పరువు పోయేసరికి మళ్లీ ఎన్నికలు కావాలనడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జగన్‌ ఎన్నికలకు వెళ్లడానికి అంత ఉత్సాహంగా ఉంటే..అప్పట్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తామన్నారు కదా.? అలా వారితో రాజీనామా చేయిస్తే ఎన్నికలు వస్తాయని అప్పుడు ఎవరి సత్తా ఎంటో తేల్చుకోవచ్చని ప్రతి సవాల్ విసిరారు. అయితే ఈ సవాల్‌కు లోటస్ పాండ్ నుంచి స్పందన రాలేదు. మొత్తానికి నంద్యాల ఉప ఎన్నికతో రాజకీయ వాతావరణం చల్లబడుతుందనుకుంటే అది ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు.

గుర్మీత్ "దానికి" పనికిరాడట..?

రేప్ చేసినందుకు గాను శిక్ష అనుభవిస్తూ..దాని నుంచి తప్పించుకోవడానికి తాను అసలు "ఆ" పనికే పనికిరాను అంటూ కేసు నుంచి బయట పడిన దాఖలాలు మనం ఎన్నో సినిమాల్లో చూశాం. ఇప్పుడు అలాంటి దానిని అడ్డు పెట్టుకొని శిక్ష నుంచి బయటపడేందుకు ట్రై చేశాడు డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రాం రహీమ్ బాబా. అత్యాచారం, హత్య కేసుల్లో దోషిగా తేలిన డేరా బాబాకు పంచకులలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. ప్రస్తుతం రోహ్‌తక్‌లోని కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు గుర్మీత్. అయితే తుదితీర్పు వెలువరించే రోజున న్యాయమూర్తి ముందు డేరా బాబా విచిత్ర వాదన వినిపించాడట.   డేరా అత్యాచారం చేశాడు అనడానికి బలమైన ఆధారాలున్నాయి..ఇక ఏటూ తప్పించుకునే అవకాశం లేదు దీంతో ఈ కేసు నుంచి ఎలాగైనా బయటపడేందుకు ఏం చెప్పాడో తెలుసా..? 1990 నుంచి తనకు లైంగిక సామర్థ్యం లేదని..తాను శృంగారం చేయడానికి పనికి రానని జడ్జి ముందు చెప్పుకున్నాడట. నపంసకుడినైన తాను రెండు అత్యాచారాలు ఎలా చేస్తానని తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేశాడు. పైగా విచారణ సందర్భంగా అతనికెప్పుడూ లైంగికపరమైన పరీక్షలు జరపలేదని బాబా తరపు లాయర్లు వాదనలు వినిపించడంతో సీబీఐ ఖంగుతింది.   అయితే ఊహించని విధంగా న్యాయమూర్తి జగ్‌దీప్ సింగ్ వేసిన ప్రశ్నకు గుర్మీత్, అతని న్యాయవాదులు అడ్డంగా దొరికిపోయారు. నీకు ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లున్నారు కదా..? అని జడ్జిగారు అడిగారు..అందుకు బాబా సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. ఎందుకంటే ఈ కేసులో గుర్మీత్‌కు అనుకూలంగా సాక్ష్యం చెప్పిన వారిలో ఒక వ్యక్తి స్వామిజీకి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నట్లు చెప్పాడు. మీరు నపుంసకుడు అయినప్పుడు ఇద్దరు బిడ్డలు ఎలా పుట్టారు..అంటే మీరు చెప్పింది అబద్ధం..ఆధ్యాత్మిక మార్గంలో దారి చూపుతారని నమ్మి వచ్చిన భక్తులతో ఓ క్రూర మృగంలా వ్యవహరించిన మీపై ఎలాంటి సానుభూతి చూపించేది లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మరో ఆలోచన లేకుండా 20 ఏళ్ల శిక్షను విధిస్తూ తీర్పు చెప్పారు. ఆ వార్త విన్న వెంటనే గుర్మీత్ కుప్పకూలిపోయాడు. ఇంక చేసేది లేక ఏడుస్తూనే జైలుకి వెళ్లాడు డేరా బాబా.

రోజమ్మా... మాట తప్పమ్మా!

నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి చేతిలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి తుక్కుతుక్కుగా ఓడిపోయారు. ఇదేం ఆశ్చర్యపోయే విషయం కాదు.. అందరూ ఊహించిందే జరిగింది. ఓడిపోతామని తెలిసినా నానా హడావిడి చేసిన వైసీపీ వర్గాల మీద జాలి పడటం తప్ప ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. అయితే ఎన్నికల ప్రచారం సందర్భంగా రెండు పార్టీల వాళ్ళూ రకరకాల ఛాలెంజ్‌లు, సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకున్నారు.   ఎక్కడో లగడపాటి రాజగోపాల్ ‌లాంటి వాళ్ళు తప్ప ఏ కరడుగట్టిన రాజకీయ నాయకుడూ తాను చేసిన సవాల్‌కి కట్టుబడి వున్నట్టు చరిత్రలో లేదు. ఈ ఎన్నికలలో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని శిల్పా మోహన్ రెడ్డి చేసిన సవాల్‌ని చాలామంది లైట్‌గా తీసుకున్నారు. ఎలాగూ ఓడిపోయిన తర్వాత ఆయన సింపుల్‌గా ‘‘తూచ్’’ అంటారనే అందరూ అనుకున్నారు. అందరూ అనుకున్నట్టుగానే ఆ మహానుభావుడు తాను చేసిన సవాల్‌కి కట్టుబడి వుండాల్సిన అవసరం లేదని కూల్‌గా చెప్పేశారు. ఇలాంటి రియాక్షన్ ముందుగానే ఊహించింది కాబట్టి ఎవరూ హర్ట్ కాలేదు.అయితే ఇప్పుడు జనాలు హర్ట్ అవుతామోనని భయపడుతున్న అంశం మరొకటివుంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా మరో భీషణ సవాల్ చేసిన వ్యక్తి రోజా. ఈ ఎన్నికలలో వైసీసీ అభ్యర్థి ఓడిపోతే గుండు కొట్టించుకుంటానని ఆమె బోండా ఉమకి సవాల్ విసిరారు. ఇప్పుడు ఎలాగూ వైసీపీ అభ్యర్థి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చాలామంది రోజాకి ఫొటోషాప్‌లో గుండు కొట్టేసి పెట్టేశారు.   ఇదిలా వుంటే, రోజా తాను చేసిన సవాల్‌ ప్రకారం నిజంగానే గుండు కొట్టించుకుంటారేమోనన్న ఆందోళన చాలామందిలో కలుగుతోంది. రోజా గుండు కొట్టించుకుంటే చూడలేక కళ్ళు తిరిగి పడిపోతామని చాలామంది భయపడుతున్నారు. అబద్ధాలు ఆడటం, ఆడిన మాట తప్పడం వైసీపీ వర్గాలకు అలవాటే. ఆ అలవాటు ప్రకారం రోజా కూడా మాట తప్పి గుండు కొట్టించుకోరన్న నమ్మకం ఒకవైపు వున్నప్పటికీ,  తాను చేసిన సవాల్‌కి కట్టుబడి ఆమె గుండు కొట్టించుకుంటారేమోనని జనం భయపడుతున్నారు. దేవుడా రోజాని గుండులో చూసే దౌర్భాగ్యం తమకి పట్టకుండా చూడమని భగవంతుణ్ణి వేడుకుంటున్నారు. గుండు విషయంలో రోజా మాట తప్పాలని ప్రార్థనలు చేస్తున్నారు.

ఆస్పత్రి కాదు... శ్మశానం!

గోరఖ్‌పూర్ బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (బీఆర్డీ ఆస్పత్రి) ఇప్పుడు వైద్యశాలగా కాదు... వందలాది మంది చిన్నారులను చంపేసిన శ్మశానంగా మారిపోయింది. ఈ ఏడాదిలోనే ఎంతోమంది చిన్నారులను పొట్టన పెట్టుకున్న ఆస్పత్రిగా నిలిచింది. ఈ ఏడాదిలోనే ఈ ఆస్పత్రిలో 1256 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. కేవలం ఆగస్టు నెలలోనే 296 మంది చిన్నారులు ఈ ఆస్పత్రిలో మరణించారు. ఆగస్టులోనే ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఈ ఆస్పత్రిలోనే 60 మంది పిల్లలు చనిపోయారు. ఆక్సిజన్ సరఫరా చేసే సంస్థకు ఈ ఆస్పత్రి వర్గాలు బిల్లులు చెల్లించకపోవడంతో సదరు సంస్థ ఆక్సిజన్ సరఫరా నిలిపేసింది. దాంతో ఈ దారుణం జరిగింది. ఆగస్టు 26 నుంచి 28 తేదీల మధ్య కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఈ ఆస్పత్రిలో 42 మంది చంటిపిల్లలు ప్రాణాలు కోల్పోయారు.   ఆగస్టు నెల ప్రారంభం వరకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించేస్తున్నానని ప్రచారం చేసుకున్న సన్యాసి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సర్కారుకి బీఆర్డీ ఆస్పత్రిలో జరుగుతున్న చిన్నారుల మృత్యు పరంపర ఇరకాటంలో పడేసింది. ఒకే ఆస్పత్రిలోనే కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో 1256 మంది చిన్నారులు మరణించడం అంటే మామూలు విషయం కాదు. ఈ అంశం మీద ముఖ్యమంత్రి ఇప్పటికీ న్యాయ విచారణకు ఆదేశించలేదు. ఆస్పత్రి వర్గాలు కూడా ఇన్ని మరణాలు సహజంగానే జరిగినట్టుగా చెబుతున్నాయి.   ఇతర ఆస్పత్రుల వారు తమ వల్ల కాదంటూ చేతులు ఎత్తేసిన కేసులు తమ దగ్గరకు వస్తున్నాయని, అలాంటి చిన్నారులు తమ ఆస్పత్రిలో మరణిస్తున్నారని  చెబుతున్నాయి. ఆక్సిజన్ ఆపడం వల్ల 60 మంది పిల్లల మరణానికి కారణమైన ఈ బోధనాస్పత్రి మాజీ ప్రిన్సిపాల్, అతని భార్యని అరెస్టు చేయడం ద్వారా తూతూ మంత్రం చర్యలు తీసుకున్నారు. ఏది ఏమైనా ఈ ఆస్పత్రిలో జరిగిన శిశు మరణాలన్నీ సహజమైనవేనా? ఏవైనా ఇతర కారణాలున్నాయా అనే విషయాన్ని ప్రభుత్వం విచారణ ద్వారా కనుక్కోవాల్సిన అవసరం వుంది.

మంత్రులకు టచ్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు..? ఏ క్షణమైనా..?

నంద్యాల బై పోల్ రిజల్ట్‌‌ ఎలా వచ్చినా సరే అధికార, ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అది నిజమైందని చెప్పవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ..ముఖ్యంగా జగన్మోహన్‌రెడ్డి పరపతి తదితర అంశాలు నంద్యాలలో స్పష్టంగా కనిపించాయని..అన్ని చోట్లా కాకపోయినా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ప్రజానాడి ఇలాగే ఉందని కొన్ని సర్వేలు తెలుపుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో కూడా నంద్యాల విజయాన్నే ప్రచార అస్త్రంగా మలచుకుని టీడీపీ ముందుకు వెళ్తుందని అంచనా..అదే జరిగితే అధికార పార్టీ దూకుడును వైసీపీ తట్టుకొని నిలబడగలుగుతుందా..? మరి మా రాజకీయ భవిష్యత్తు ఏంటా అని ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కీలక నేతల్లో భయం పట్టుకుందట.   దీంతో ఇక్కడ దుకాణం సర్దేసి తెలుగుదేశంలోకి వెళ్లేందుకు వారు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులతో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓ మంత్రిగారు తనకు సన్నిహితులైన మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటీగా మాట్లాడుతున్న వేళ ఆయన ఫోన్ రింగ్ అయ్యిందట. అప్పటి వరకు హుషారుగా కబుర్లు చెప్పిన సదరు మంత్రిగారు ఆ ఫోన్ వచ్చి రావడంతోనే లోపలికి వెళ్లి సుమారు 30 నిమిషాల తర్వాత బయటికి వచ్చారట. ఏంటీ సార్ మేటర్ అని అడిగితే..ఏముందయ్యా..? "వలసలు మళ్లీ స్టార్ట్" అన్నారట..   అంటే దాని అనర్థం వైసీపీ ఎమ్మెల్యేలు సైకిలెక్కేందుకు సైలెంట్‌గా ప్లాన్లు వేసుకుంటున్నట్లేగా..ఈ ఒక్క మంత్రికే కాదు..తమకు బాగా పరిచయమున్న అమాత్యులకు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు రహస్యంగా ఫోన్లు చేస్తున్నారట. తాము టీడీపీలోకి వస్తే తమను ఎలా ట్రీట్ చేస్తారు..? టికెట్ కన్ఫర్మా కాదా..? ఇలా ఓ పార్టీ నుంచి మరో పార్టీలోకి వచ్చేటప్పుడు చర్చించుకోవాల్సిన అన్ని విషయాలు చర్చించుకుంటున్నారట. మరోవైపు తమ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించబోతున్న విషయం తెలుసుకున్న వైసీపీ అధిష్టానం వారిని బుజ్జగించే పనిలో పడింది. మరి హైకమాండ్ బుజ్జగింపులకు వారు మెత్తబడతారో లేదో వేచి చూడాలి.?

పవన్ కళ్యాణ్ సమస్యలు పరిష్కరించే స్పెషలిస్టా?

  పార్ట్ టైమ్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ మరోసారి పోరాటం చేస్తానని ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ  కళాశాల డిగ్రీ   విద్యార్థులు తమకు సంబంధించిన సమస్యల చిట్టాని తీసుకుని పవన్ కళ్యాణ్ సార్ అడ్రస్ కనుక్కుని మరీ హైదరాబాద్‌లో వున్న ఆయన దగ్గరకి వెళ్ళారు. పవన్ కళ్యాణ్‌ని కలిసిన  వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఆయనకు తమ సమస్యలను ఏకరవు పెట్టేశారు. వ్యవసాయ అధికారుల నియామకం అంశం మీద ఇటీవల విడుదల చేసిన జీవో నంబర్ 24ని రద్దు చేసి, గతంలో  వున్న జీవో నంబర్ 16ని కొనసాగించాలని కోరారు. దాంతో మన వాగ్దాన కర్ణుడు పవన్ కళ్యాణ్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించేస్తానని హామీ ఇచ్చేశారు.  వ్యవసాయ విద్యార్థుల సమస్యలని ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని అల్టిమేటం జారీ చేసేశారు. వ్యవసాయ విద్యార్థులకు న్యాయం చేయకపోతే పోరాటం మొదలు పెట్టేస్తానని ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించేశారు.   అసలు సదరు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య ఏమిటి? ఆ సమస్యలో సహేతుకత వుందా? గతంలో వున్న 16వ నంబర్ జీవోని పక్కన పెట్టి ప్రభుత్వం 24వ నంబర్ జీవోని ఎందుకు తీసుకొచ్చింది? దాని వెనుక ప్రత్యేక కారణాలు ఏవైనా వున్నాయా? పవన్ కళ్యాణ్ దగ్గరకి వెళ్ళిన విద్యార్థులు కోరినట్టుగా చేస్తే వేరే ఎవరికైనా నష్టం జరిగే అవకాశం వుందా? తన దగ్గరికి ఎవరొచ్చి ఏం మొర పెట్టుకున్నా, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అయిపోతుందా? ప్రభుత్వం కానీ, ప్రభుత్వాధికారులు కానీ పవన్ కళ్యాణ్ తరహాలో ఆలోచించలేక కొత్త జీవో తీసుకొచ్చారా? ఈ ఇష్యూలో ఇలాంటి సందేహాలు ఎవరికైనా కలుగుతాయి. మరి పది మంది విద్యార్థులు తన దగ్గరకి వచ్చి మొరపెట్టుకోగానే ప్రభుత్వాన్ని హెచ్చరించేసిన పవన్ కళ్యాణ్‌కి ఇలాంటి సందేహాలు కలిగాయో లేదో మరి!   అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్యలు ఎదుర్కొంటున్న కొంతమంది పవన్ కళ్యాణ్ దగ్గరకే ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నారన్నది సమాధానం దొరకని ప్రశ్న. ఉద్దానం కిడ్నీ బాధితుల దగ్గర నుంచి, చేనేత కార్మికుల వరకు పవన్ కళ్యాణ్‌ని ఆశ్రయించారు. ప్రస్తుతం చాలామంది ఏదైనా సమస్య వుంటే పవన్ కళ్యాణ్ దగ్గరకి వెళ్ళి చెప్పుకోవాలన్న ధోరణిలో వున్నారు. అసలు ఇలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ దగ్గరకే ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నారో! ఆయన దగ్గరకి వెళ్తే సమస్య పరిష్కారమైపోతుందన్న నమ్మకం కూడా ఎందుకు కలుగుతోందో!   సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్నో, ప్రజా ప్రతినిధులనో, అధికారులనో సంప్రదించడం సాధారణంగా ఎవరైనా చేసే పని. కానీ కొంతమంది అలా ఎందుకు చేయడం లేదు? ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరిస్తుందన్న నమ్మకం లేదా? ప్రభుత్వం పరిష్కరించదనుకుంటే ప్రతిపక్షం సహకారాన్ని తీసుకోవాలి. ప్రతిపక్షాన్ని కూడా సంప్రదించడం లేదంటే ఇప్పుడు ఏపీలో వున్న ప్రతిపక్షం చేతగాని ప్రతిపక్షమన్న అభిప్రాయం జనంలో వుందా? అధికార, ప్రతిపక్షాలని కాకుండా  ప్రజాక్షేత్రంలో నిలవని, ఒక్క ఎన్నికలో కూడా పోటీ చేయని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎందుకు కలుస్తున్నారు? ఆయన ఏ సమస్యనైనా పరిష్కరించగలిగే స్పెషలిస్టనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందా? సినిమాల్లో ఎలాంటి సమస్యనైనా ఈజీగా పరిష్కరించే హీరోగారు రిజల్ లైఫ్‌లో కూడా అలాగే పరిష్కరిస్తారని అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్‌ని ఆశ్రయిస్తున్న వారి తీరుగానీ, అలాంటి సందర్భాల్లో పవన్ కళ్యాణ్ స్పందిస్తున్న తీరుగానీ ఇలాంటి ఎన్నో సందేహాలను కలిగిస్తోంది.

జగన్ విషయంలో కళ్ళు తెరిపించిన రోజా...

  వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఎవరెవరు ఏమనుకుంటున్నారు అని ఒక సారి పరిశీలిస్తే- జగన్ తనకి తాను నిజాయితీపరుడు, డబ్బులు లేని వాడు మరియు తదుపరి ముఖ్యమంత్రి గా ఊహించుకుంటున్నాడు. ఇక చంద్రబాబు నాయుడు మాటల్లో చెప్పాలంటే, జగన్ ఒక అవినీతిపరుడు, మూర్ఖుడు, రాజకీయ పరిజ్ఞానం లేని వాడు. ఇక సాధారణ జనం ఏమనుకుంటున్నారు అనే విషయం, నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి. తాను ఏం చేస్తాడో చెప్పడం పోయి, అధికార పక్షం తప్పులు ఎత్తిచూపడం పోయి, వ్యక్తిగత దూషణకి దిగిన జగన్ అందరి విమర్శలు ఎదుర్కోవడమే కాకుండా, తగిన ప్రతిఫలం కూడా అనుభవిస్తున్నాడు.   ఇక జగన్ కి అత్యంత సన్నిహితురాలు, సోదరి సమానురాలు అయిన రోజా తన అన్న గురించి మనకి తెలియని చాలా విషయాలు చెప్పి మన కళ్ళు తెరిపించే ప్రయత్నం చేసారు. ఒక రకంగా మనకు కొత్త జగన్ ని పరిచయం చేసే మహత్కార్యానికి నాంది పలికారు.   * జగన్ గురించి మనకు 1 శాతం కూడా తెలియదట. ఆయన రాముడు , కృష్ణుడు క్రీస్తు అల్లా అంతటి గొప్ప వాడట. అయితే, రోజా జగన్ అన్నని ఆ దేవుళ్లతో పోల్చకపోయినా, ఆయన కూడా దాదాపు గొప్పవాడు అనే సందేశం ఇచ్చారు. మీకు తెలుసా, జగన్ ప్రాణం పోతున్నా మడమ తిప్పడట. అందుకే, కొన్ని నియోజకవర్గాల్లో ఓడిపోతాం అని తెలిసినా మాట తప్పకూడదు అన్న నియమంతో టికెట్లు మార్చలేదుట. వై.ఎస్.ఆర్ ని అభిమానించేవారి కోసమే సోనియాని ఎదిరించి జైలు శిక్ష అనుభవించాడుట.   * జగన్ నిజయతీపరుడు అని చెబుతూ... ఈ మాట మీకు నవ్వు తెప్పించొచ్చు... అని జనాల స్పందన ఎలా ఉండబోతుందో ముందే ఊహించారు రోజా గారు. జగన్ నీతిమంతుడు కాకపొతే కోట్లు చిమ్మి డబ్బుతో అబద్ద వాగ్దానాలతో ముఖ్యమంత్రి అయ్యేవాడు అనే అభిప్రాయం వ్యక్తపరిచారు. అంటే, దీన్ని ఎలా తీసుకోవచ్చు- జనాలు డబ్బులు పంచిన వాళ్ళకే ఓట్లు వేస్తున్నారనా!   * భారతి సిమెంట్ కంపెని ప్రపంచ స్తాయిలో అవార్డ్ గెలుచుకుంది అని వివరించిన రోజా... జగన్ బాగానే సంపాదించాడు, సంపాదిస్తున్నాడు అని మనకి సూచనగా చెప్పింది. అలా అయితే, మరి జగన్ ఏంటి తనకి పంచడానికి డబ్బులు లేవంటాడు...?   * పవన్ కళ్యాణ్, మోడీ లని కూడా ఈ చర్చలోకి లాగిన రోజా, భలే కొసమెరుపు ఇచ్చింది. జగన్ ని పుచ్చలపల్లి సుందరయ్య తో పోల్చే ధైర్యం చేసింది. ప్రభుత్వపు వ్యక్తిగత దూషణలు దాడులను పట్టించుకోకుండా పుచ్చలపల్లి సుందరయ్య లాంటి గొప్పవారిని తలపించే విధంగా సబ్జెక్ట్ మాట్లాడుతూ ఒక కొత్త సంస్కృతిని ప్రవేశ పెట్టాడు, అని వ్యాఖ్యానించిన రోజాకి నిజంగా ఆ మహానుభావుడి గురించి కొంతయినా తెలుసా అనే సందేహం వస్తుంది.   * ఒక వ్యక్తిని పొగడాలి అంటే మూడు రకాలు. ఒకటి నేరుగా పొగడడం. రెండోది అవతలి వ్యక్తిని దూషించి తద్వారా తాము మెప్పుపొందే వ్యక్తిని పొగడడం. ఇక చివరిది, గొప్ప వ్యక్తితో పోల్చడం. రోజా ఆత్మపరిశీలన చేసుకోవలసిన విషయం ఏంటంటే, జగన్ ఏ విషయంలో పుచ్చలపల్లి సుందరయ్య గారితో పోలికలున్న లేదా పోల్చదగ్గ వ్యక్తి. పుచ్చలపల్లి ఒక మంచి రెబెల్ అని ఎవర్ని అడిగినా చెబుతారు. రోజా పొరపాటున జగన్ అధికార పార్టీ నేతల్ని దూషించే విధానం చూసి, ఆయన్ని రెబెల్ గా ముద్రవేసే ప్రయత్నం చేస్తున్నట్లుంది కాబోలు!   * ఇక రోజా విషయానికి వస్తే, జగన్ అన్నని ఎప్పటికీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఖరాఖండీగా చెబుతుంది. వాస్తవంగా తీసుకుంటే, రోజా కి కనుచూపుమేరలో అంతగా ఆదరించే మరో అన్నయ్య  కనిపించడం లేదనే చెప్పాలి. రోజా గతంలో చేసిన తీవ్ర విమర్శల దృష్ట్యా చంద్రబాబు పొరపాటున కూడా ఆమెను మళ్ళీ పార్టీలోకి తీసుకునే ఆలోచన చేయడు. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో మరో చెప్పుకోదగ్గ పెద్ద పార్టీ  లేదా అధికారం చేబట్టే సత్తా ఉన్న పార్టీ ప్రస్తుతానికి ఇంకోటి లేదు. ఇవన్నీ పరిశీలిస్తే, మరి రోజాకి కి జగన్ అన్న కాకుండా ఇంకో ప్రత్యామ్నాయం ఉందా!