లేచి నిలబడటానికి దొబ్బిడాయా?
posted on Oct 25, 2017 @ 4:14PM
విచారణలో ఉన్న కేసులు కోర్టుల్లో కోకొల్లలు. ఇప్పుడున్న న్యాయమూర్తులందరూ రిటైరైనప్పటికి కూడా.. ఈ కేసులు పూర్తవ్వవు. పైగా కొత్త కొత్త కేసులు పుట్టుకొస్తుంటాయ్. కాబట్టీ... ఉన్న కేసులపై న్యాయమూర్తులు దృష్టి సారిస్తే సరిపోతుంది. ఉపయోగం లేని వ్యవహారాలపై సమయం వృద్ధా చేసుకోవడం సుద్ధ దండగ. ఇది కేవలం నా అభిప్రాయం.
‘సినిమా థియేటర్లలో జాతీయ గీతం తప్పని సరి.. అందరూ లేచి నిలబడాల్సిందే’ అనే నిబంధన పెట్టింది న్యాయస్థానాలే. ఈ వ్యవహారంపై ఎవరో ‘మేధావి’ గారు...‘ఎందుకు నిలబడాలి’ అని కోర్టులో పీల్ దాఖలు చేశారు. పనిలేనోడు పిల్లి తల గొరిగాట్ట. బహుశా వీరిది అదే కోవ. వార్తల్లో వినిపించాలి, కనిపించాలి.. ఈ కక్కుర్తితో.. సింపుల్ గా కొన్ని కాగితాలు నావి కావ్ అనుకుంటారు. వీటిపై కోర్టెందుకు స్పందించాలి? ‘మాకు చాలా పనుంది’ అని వి...స్సిరి అవతలేయొచ్చుగా? పక్కనే డస్ట్ బిన్లు ఉన్నాయి కూడానూ!
అసలు నాకు తెలీక అడుగుతానూ... జాతీయ గీతం వినిపిస్తే... కాసేపు నిలబడటానికి దొబ్బిడాయా? జనవరి 26న ఓ సారి... పంద్రాగస్టున మరో సారి... జాతీయ జెండాకు ‘జై’ కొట్టే సిగ్గులేని ‘జాతి’ మనది. సినిమాలు మాత్రం వారానికోసారి చూడాల్సిందే. ఏ? ఏసీ థియేటర్లో కూర్చున్నప్పుడు.. కాసేపు ‘జనగణమన’ కోసం లేచి నిలబడతే మీ సొమ్మేమైనా పోతుందా?
‘అలా నిలబడటం అసహజంగా ఉంటుందట’ ఒకాయన అన్నాడు. ‘భక్తి మనసుల్లో ఉండాలట’ ఇది ఇంకొకరి స్టేట్మెంటూ!. ఎదురుగా తెరపై జెండా రెపరెపలాడుతూ కనిపిస్తుంటే... నువ్వు ఏసీ థియేటర్లో కాలుమీద కాలేసుకొని చూస్తూ కూర్చోవడం దేశభక్తి అవుతుందా? మనకు స్కూళ్లలో నేర్పించి అదేనా?. నీ మనసులో భక్తి లేదని ఎవరూ అనడం లేదు. అది ప్రదర్శించే అవకాశం అరుదుగా మాత్రమే వస్తున్నప్పుడు... దాన్ని పాటించి, భావితరాల వారికి మార్గదర్శివి కమ్మని అంటున్నాం. అలా చేస్తే... నిన్ను చూసి నీ పిల్లలకు దేశభక్తి పెరుగుతుంది. దేశం పట్ల గౌరవభావం పెరుగుతుంది. దేశం తల్లి. దేశాన్ని ప్రేమించని వాడు తల్లిని కూడా ప్రేమించలేడు. ఈ విషయం ప్రతి ఒక్కరికీ అర్థమవ్వాలి. దానికి ఇదే మార్గం. నిజానికి థియేటర్లలో జాతీయగీతం అనేది ప్రతి ఒక్కరికీ ఓ మహద్భాగ్యం. కానీ... కొందరు చీడపురుగులకు ఇది కూడా భారంగా కనిపిస్తోంది. ఇది మన దౌర్భాగ్యం.
తమిళ నటుడు అరవింద్ స్వామిగారు రీసెంట్ గా ట్వీటాట్ట. ‘సినిమా హాళ్లలోనే వందేమాతరం ఎందుకు? ప్రభుత్వ కార్యాలయాల్లో, కోర్టులు, అసెంబ్లీ, పార్లమెంట్ ప్రారంభంలో జాతీయగీతం ఎందుకు వినిపించదు?’ ఇవి ఈయనగారి ప్రశ్నలు. ఈ ప్రశ్నలను బట్టి... స్వామిగారి పరిజ్ఙానం ఏ పాటిదో తేలిపోయింది. ప్రభుత్వకార్యాలయాల్లో జాతీయ గీతం తప్పని సరి. పాటించకపోవడం వ్యవస్థలో సమస్య. ఇక కోర్టులు, పార్లమెంట్, అసెంబ్లీ అంటారా..! వాటి ప్రారంభ సమయాల్లో తప్పకుండా జాతీయ గీతాలాపన ఉండాల్సిందే. ఈ విషయం స్వామిగారికి తెలీకపోవడం.. రొంబా.. బాధాకరం. ఏనాడైనా టీవీల్లో అయినా అసెంబ్లీ చూసిన ముఖమైతే... ఆ విషయం తెలుస్తుంది. పాపం... ఇలాంటి వాళ్లను చూసి మనం జాలిపడటం తప్ప.. ఏమీ చేయలేం. ‘మేం మేధావులం’ అని వాళ్లకు వాళ్లు ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఈ కారణంగానే... ఇలాంటి పస లేని స్టేట్మెంట్లు ఇస్తుంటారు.
టోటల్ గా చెప్పేదొక్కటే... జాతీయ గీతం వినిపిస్తే... ‘లేచి నిలబడండి’. మంచి పని చేశామన్న ఆనందంతో మనసు నిండుతుంది. వెనుక తరాల వారికి ప్రవర్తన నేర్పిన వాళ్లం అవుతాం. ఎంతోకొంత కేలరీలైనా తగ్గుతాయ్ .. అదన్నమాట విషయం‘జైహింద్’.