జగన్ పై బాబు కొత్త ప్లాన్...

  ఏంటో పాపం జగన్ ఒకపక్క ప్రజా సంకల్పం పేరుతో పాదయాత్ర అంటూ జనంలోకి వచ్చి కష్టపడుతున్నా.. కష్టాలు మాత్రం ఆయన్ని వదిలేలా కనిపించడంలేదు. గత కొద్దిరోజుల నుండి ఆయనకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. నంద్యాల ఉపఎన్నిక ఓటమి నుండి మొదలైంది జగన్ కు షాకులు తగలడం. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓటమి, కోర్టు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వకపోవడం..పార్టీలో కీలక నేతల జంపింగ్ లు, ఇక పాదయాత్ర మొదలుపెట్టిన రోజే ప్యారడైజ్ పేపరల్లో జగన్ పేరు ప్రస్తావనకు రావడం.. ఇలా షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరో బాంబు పేలింది. అదేంటంటే.. . మనీలాండర్స్‌పై ఈడీ విడుదల చేసిన జాబితాలో జగన్‌తో ఉండటం. 31 షెల్ కంపెనీల ద్వారా రూ. 368 కోట్లు మనీ లాండరింగ్‌కు జగన్ పాల్పడినట్లు అందులో తెలుస్తోంది.   అయితే ఇప్పుడు జగన్ కు ఉన్న ఈ లూప్ హోల్స్ నే టీడీపీ పార్టీ ఇప్పుడు క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. దీనిపై చంద్రబాబు నేతలకు కొన్ని సూచనలు కూడా చేశారంట. ఈడీ విడుదల చేసిన జాబితాలో జగన్ పేరుంది... దీనిలో భాగంగానే ఇద్దరు ఇప్పటికే జైలుకు వెళ్లారు..  ఇక జగన్ కూడా జైలుకు వెళ్లేరోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోందని చంద్రబాబు పార్టీ నేతల దగ్గర ప్రస్తావించారట. అంతేకాదు.. ఇదే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన నాయకులకు సూచించారట. మనం రాజకీయంగా జగన్‌ను పట్టించుకోవలసిన పనిలేదు.. జగన్ ను గుడ్డిగా విమర్శించకుండా.. జగన్ కు సంబంధించిన కేసుల గురించి ప్రజల్లోకి తీసుకెళితే చాలని చిన్న సలహా కూడా ఇచ్చారట. మొత్తానికి జగన్ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి... ఏదో ప్రజల్ని తన వైపు తిప్పుకోవడానికి నానా కబుర్లు చెబుతుంటే... బాబు దానికి రివర్స్ లో జగన్ లోపాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వేరే ప్లాన్ వేశారు.

వాట్ ఏ కామెడీ బొత్సా...నువ్వు కూడా ఇలా..!

నంది అవార్డులపై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ అవార్డులపై పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే స్పందించి... ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ అవార్డుల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించారు. ఇక ప్రభుత్వంపై విమర్శలు గుప్పించినందుకు గాను మంత్రి లోకేశ్ కూడా ఘాటుగానే స్పందించాడు. ఇక లోకేశ్ వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారమే రేపాయి. లోకేశ్ వ్యాఖ్యలపై స్పందించిన పోసాని అయితే.. సంచలన వ్యాఖ్యలే చేశాడు. ఇప్పుడు అందరూ అయిపోయారు నా వంతు అన్నట్టు... బొత్స కూడా ఇప్పుడు రెడీ అయ్యాడు. తానేదో ఉత్తముడిని అన్నట్టు లెక్చర్లు ఇస్తున్నాడు. లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించి.. లోకేశ్ మదంతో, అహంభావంతో మాట్లాడుతున్నారని.. అన్నాడు. అంతేకాదు.. అక్కడితో ఆగకుండా.. అనర్హులకు అవార్డులు ఇవ్వడంపై ప్రశ్నిస్తే ఏపీలో ఆధార్ కార్డు అడుగుతారా..? ఏపీలో కార్డులు ఉన్నవారే జ్యూరీలోకి తీసుకున్నారా..? అంటూ ప్రశ్నించాడు.  ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని..పంచభూతాలను ప్రభుత్వ నేతలు దోచుకు తింటున్నారని.. భోగాపురం ఎయిర్ పోర్ట్ వ్యవహారంలో ముఖ్యమంత్రి, కేంద్ర విమానయాన శాక మంత్రి అశోక్ గజపతి రాజులు దోచుకుతింటున్నారని మైక్ ముందు ఓ రెచ్చిపోయాడు.   అంతే లోకేశ్ వ్యాఖ్యలేమో కానీ.. లోకేశ్ పై బొత్స చేసిన వ్యాఖ్యలు మాత్రం మాంచి కామెడిగా ఉన్నాయి అనుకుంటున్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు.. దోచుకోవడం గురించి బొత్స నే మాట్లాడాలి మరి అంటున్నారు. అసలు బొత్సా బ్యాక్ గ్రౌండ్ కి, బొత్సా చేసిన నిర్వాకాలకి ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు ఏమైనా సంబంధం ఉందా? అని అంటున్నారు పలువురు. వైఎస్ హయాంలో అందినకాడికి దోచుకొన్నారు..మీకు ఎన్ని బినామీలు ఉన్నాయో తెలుసు, సినిమాలు, ఛానెళ్లు, ఇసుక దందాలు, మద్యం సిండికేట్లు అబ్బో ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అందుకే అన్నా బొత్సన్నా.. లోకేశ్ గురించి మాట్లాడేముందు.. నీ గురించి ఒక్కసారి ఆలోచించుకో అన్నా అని పులువురు కౌంటర్లు వేస్తున్నారు. ఏంటో మరి మైక్ చూస్తే సత్తిబాబు నోరు పాపం కంట్రోల్ లో ఉండదేమో..

అత్యాచారం కేసులో 4 ఏళ్ళ బాలుడు, తలలు పట్టుకుంటున్న పోలీసులు

  ఢిల్లీలో ఎన్నో లైంగిక దాడులు జరిగిన ఘటనలు చూసుంటారు. ఇక నిందితులకు జైలు శిక్షలు కూడా పడ్డాయి. కానీ ఇటీవల ఓ కేసు పోలీసుల ముందుకు వచ్చింది. అది అత్యాచారం కేసు. అయితే ఆ కేసులో ఉన్న నిందితుడిపై కేసు నమోదు చేసినా... ఈ వ్యవహారంలో ఎలా ముందుకు అడుగు వేయాలో అర్దంకాక.. పోలీసులు తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. అంత కష్టమైన పరిస్థితి పోలీసులకు ఎందుకు వచ్చిందంటే.. ఆ నిందితుడు ఏదో సెలబ్రిటీనో.. లేక పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తో కాదు. ఆ నిందితుడు ఎవరంటే.. ఓ నాలుగేళ్ల బాలుడు. షాకింగ్ గా ఉంది కదా.. వినడానికి అలా ఉన్నా.. ఇది మాత్రం నిజం. ఈ దారుణమైన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆ వ్యవహారం ఏంటో తెలుసుకోవాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే.   నాలుగేళ్ల పసిప్రాయం అంటే.. ఆటలు, రైమ్స్, పిల్లలతో సరదాసరదా ఉంటారు పిల్లలు. కానీ ఢిల్లీలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న ఆ చిన్నారిపై నాలుగేళ్ల బాలుడు అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. ముందు జరిగిన ఘటన గురించి పాప తన తల్లితో చెప్పినా.. ఆమె పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత పాప వెక్కివెక్కి ఏడుస్తూ జరిగిన షాకింగ్ ఘటనను తల్లికి వివరించగా.. ఖంగుతిన్న తల్లి స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. కానీ వారు పట్టించుకోకపోవడంతో..  పోలీసులను ఆశ్రయించింది. దీంతో విషయం వెలుగుచూసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారి నుంచి వివరాలు సేకరించేందుకు పోలీసులు శిశు సంక్షేమ సంఘాన్ని సంప్రదించారు. మేజిస్ట్రేట్, శిశు సంక్షేమ సంఘానికి ఆ చిన్నారి అన్ని వివరాలను చెప్పిందని, అన్ని కోణాల్లోనూ కేసును దర్యాప్తు చేస్తున్నామని నైరుతి ఢిల్లీ డీసీపీ శిభేశ్ సింగ్ తెలిపారు. స్కూలు యాజమాన్యం వైఖరిపైనా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఘటనలో ఇతరుల ప్రమేయంపైనా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. కాగా, చిన్నారికి ద్వారకలోని రాక్‌లాండ్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. లైంగిక దాడి నిజమేనని వైద్యులు తేల్చారు. పోలీసులు వైద్య పరీక్షల నివేదిక ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు.   అయితే ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే.. బాలునిపై అత్యాచారం క్రింద కేసు నమోదు చేసినప్పటికీ, బాల నిందితుడిని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు.  ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలని పోలీసులకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే 7 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలపై చట్టపరమైన చర్యలు తీసుకోరాదు. అందుకే దానిపై న్యాయ నిపుణులను సంప్రదించాలని పోలీసులు ఆలోచిస్తున్నారు. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ ప్రకారం ప్రాషిక్యూషన్‌కు వ్యతిరేకంగా ఏడు సంవత్సరాలలోపు వయస్సువారికి కొన్ని రక్షణలను కల్పిస్తుందని ఢిల్లీ పోలీసు ప్రతినిధి దీపక్‌ పాథక్‌ అన్నారు. ఈ విషయాన్ని అత్యంత సున్నితమైనదిగా పరిగణిస్తున్నామని ఆయన తెలిపారు. ఏది ఏమైనా నాలుగేళ్ల బాలుడు.. నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేశాడంటే.. రోజులు ఎలా తయారయ్యాయో అర్ధమవుతుంది. మరి పిల్లలు ఇలా అవ్వడానికి తల్లిదండ్రుల్లో లోపం ఉందా.. లేక స్కూల్లో పర్యావేక్షణ లో లోపం ఉందా.. బోధనల్లో ఎమైనా లోపం ఉందా.. లేక మారుతున్న రోజులను బట్టి ఇలా తయారవుతున్నారా..? ఏదైనా ఆడుకోవాల్సిన వయసులో పిల్లలు ఇటువంచి దారుణాలకు ఒడిగడుతుంటే.. దీనిలో సమాజం పాత్ర ఎంత ఉంది..

అయ్యో రేవంత్.. ఎంత కష్టమొచ్చింది..

  ఎంత ఫాస్ట్ గా పార్టీ మారీ.. ఎంత హడావుడి చేశాడో ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టు తయారైంది. ఏదో అయిపోయినట్టే.. టీడీపీ పార్టీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇంకేముంది కాంగ్రెస్ పార్టీలో తనదే హవా అంతా.. నేను చెప్పిందే వేదం అన్నట్టు నేతలు నా మాట వింటారు అని అనుకున్నాడు. కానీ మొత్తం రివర్స్ కొట్టింది. నిన్న మొన్నటి వరకూ కొడంగల్ లో తానే గెలుస్తానని ధీమాతో ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు భయపడుతున్నాడట. అందుకే రాజీనామా లేఖ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వకుండా తిరుగుతున్నాడు. ఆయన రాజీనామా లేఖపై తాజాగా వివాదం చెలరేగిన సంగతి తెలసిందే కదా. అయితే ఇప్పుడు మరో కొత్త ట్విస్ట్ నెలకొంది.   అదేంటంటే.. రేవంత్ రెడ్డి తన రాజీనామా లేఖను చంద్రబాబుకు ఇచ్చానని చెప్పిన సంగతి తెలిసిందే కదా. అయితే టీటీడీపీ నాయకులు మాత్రం ఇవ్వలేదని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు చర్చంతా రేవంత్ రెడ్డి రాజీనామా లేఖపైనే నడుస్తోంది. అంతేకాదు రాజీనామా లేఖ విషయంలో రేవంత్ రెడ్డి డబల్ గేమ్ కూడా ఆడుతున్నాడని అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. ఎందుకంటే.. రేవంత్ తన రాజీనామా లేఖను చంద్రబాబుకు ఇచ్చానని చెబుతుంటే... టీ టీడీపీ అధ్యక్షుడు రమణ మాత్రం ఇవ్వలేదని అంటున్నాడు. రేవంత్ కూడా రాజీనామా మీద క్లారిటీ ఇవ్వడం లేదు. తనకు భీ ఫారం ఇచ్చిన చంద్రబాబు నాయుడికి రాజీనామా సమర్పించాలని... ఎమ్మెల్యేగా తనకు ప్రభుత్వం కల్పిస్తున్నా అన్ని వసతులను రద్దు చేసుకోవాలని స్పీకర్ కు లేఖ కూడా రాశాడు.   ఇదిలా ఉంటే... స్పీకర్ కు రాజీనామా లేఖ ఇస్తే తప్ప రాజీనామా అమోదం కాదు. రాజీనామ ఆమోదం తర్వాతే వసతుల ఉపసంహరణ అనేది ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. కానీ అలా కాకుండా ఎన్ని లేఖలు రాసినా వసతుల ఉపసంహరణ జరగదు. ఇది తెలిసే రేవంత్ మైండ్ గేమ్ ఆడుతున్నడని టీఆర్ఎస్ చెప్తోంది. నిజంగా రేవంత్ కు చిత్తశుద్ది ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఇలా చేయడం వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దల నుండి గ్రీన్ సిగ్నల్ రాకపోవడం వల్లే రేవంత్ ఎటూ తేల్చుకోలేకపోతున్నాడని అంటున్నారు. కొడంగల్ లో గెలుపు రేవంత్ కు అంత సులువు కాదని..రేవంత్ ఓడిపోతే అది కాంగ్రెస్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుందని జంకుతున్నారట. దీంతో ఒకపక్క టీఆర్ఎస్ నేతల నుండి ఒత్తిడి.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆదేశాలతో రేవంత్ రెడ్డి అయోమయ స్థితిలో పడ్డాడట. మొత్తానికి రెండు రోజులు హడావుడి చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ముందు ముందు ఇంకెన్ని విషయాల్లో తగ్గాల్సి వస్తుందో చూద్దాం....

ఇదేదో తమాషా అయిపోయిందే..!

  ఒకటి కాదు రెండు కాదు ఇప్పటివరకూ ఉత్తరప్రదేశ్ లో ఎన్నో రైలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. గత కొద్ది నెలలనుండి మాత్రం ఈ ప్రమాదాలు మరీ ఎక్కువయిపోయాయి. అందుకే వీటికి బాధ్యత వహిస్తూ.. అప్పట్లో కేంద్ర రైల్వేశాఖ మంత్రిగా ఉన్న సురేశ్ ప్రభు కూడా తన పదవికి రాజీనామా చేశారు కూడా. కానీ మంత్రిగారు రాజీనామా చేసినంత మాత్రాన ప్రమాదాలు ఆగుతాయా...జరుగుతూనే ఉన్నాయి. ఆమధ్య కళింగఉత్కళ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 24మంది చనిపోగా 156 మంది గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన రెండు రోజులకే... న్యూఢిల్లీ నుంచి హౌరా వెళ్తున్న కైఫియత్ ఎక్స్‌ప్రెస్ అరియా వద్ద పట్టాలు తప్పి ఈ ప్రమాదంలో 74 మందికి పైగా గాయపడ్డారు. ఆ తరువాత అదే యూపీలో హౌరా నుంచి జబల్ పూర్ వెళుతున్న శక్తిపుంజ్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. అలాగే ఇప్పుడు తాజా మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. యూపీలోని బాందా వద్ద వాస్కోడిగామా - పాట్నా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. రైలులోని 13 బోగీలు పట్టాలు తప్పాయి.   ఉదయం 4 గంటలకు ట్రైన్ పట్టాలు తప్పినట్లు అధికారులు చెప్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేశామని హెల్ప్ లైన్ నంబర్స్ ఏర్పాటు చేశామని పియూష్ గోయల్ తెలిపారు. అంతేకాదు మృతుల కుటంబాలకు రూ.5లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. లక్ష, గాయాలైన వారికి రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియాగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. చికిత్స పొందుతున్న 9 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.     ఇక్కడివరకూ బాగానే ఉన్నా... అసలు ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కానీ.. కేంద్ర ప్రభుత్వ కానీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా.. ఏదో తమాషా చూసినట్టు చూస్తున్నారు తప్పా దానికి సరైన పరిష్కార మార్గాలు మార్గం కనిపెట్టడం లేదు. ఏదే ప్రమాదం జరిగినప్పుడు చనిపోయినవారికి నష్టపరిహారం చెల్లిస్తున్నారు. సైలెంట్ అయిపోతున్నారు. పోనీ ప్రజలైనా సమస్యపై పోరాటం చేస్తున్నారా అంటే అదీ లేదు.. ఏదో యూపీలో ఇలాంటి ప్రమాదాలు జరగడం కామనే అన్నట్టు.. అటు రాష్ట్ర ప్రభుత్వం.. ప్రజలు.. కేంద్ర ప్రభుత్వం పిచ్చ లైట్ గా తీసుకుంటున్నారు. మరి వాళ్లు అలా లైట్ గా తీసుకున్నంత కాలం ఇలాంటి ప్రమాదాలు ఆగవు..

సొంత భవన్ లో టీ మంత్రికి షాక్.. ఏపీ సిబ్బంది సాయం...

ఒకటిగా ఉన్నా రాష్ట్రం విడిపోయింది. ఏపీ అంటూ తెలంగాణ అంటూ రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇక రాష్ట్రాలతో పాటు ప్రజల్లో కూడా కాస్త మార్పులు వచ్చాయని చెప్పొచ్చు. ఏదో రాష్ట్రం విడిపోయినా మనందరం ఒకటే అని చెపుతున్నా.. కొన్ని విషయాల్లో మాత్రం ఆ తేడా కనిపిస్తూనే ఉంటుంది. ఇక రాజకీయాల్లోకి వచ్చే సరికి ఈ పరిస్థితి ఇంకా విచిత్రంగా కనిపిస్తుంటుంది. అదేమంటే.. ప్రాంతీయ భావనలు రాజకీయమైన లబ్థి కోసమే కానీ వ్యక్తిగత అంశాల్లో కాదన్న విషయం అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది. రాజకీయంగా ఎన్ని తిట్టుకున్నా... రెండు రాష్ట్రాల నేతలు కలిసినప్పుడు మాత్రం బాగానే ముచ్చటించుకుంటారు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు అనుకుంటున్నారా...? ఎందుకంటే...  రాజకీయం కోసం ఎంతవరకైనా సై అన్నట్లుగా వ్యవహరించే తత్త్వం పాలకుల్లో ఉన్నా.. ప్రజల్లో లేదని నిరూపించే ఉదంతం తాజాగా దేశ రాజధానిలో చోటు చేసుకుంది.   అసలు సంగతేంటంటే... తెలంగాణ భవనంలో తెలంగాణ రాష్ట్ర మంత్రికి షాక్ తగిలితే.. అందుకు భిన్నంగా ఆయనకు ఏ మాత్రం సంబంధం లేని ఆంధ్రప్రదేశ్ సిబ్బంది స్పందించి.. ఆయనకు ఇబ్బంది లేకుండా చేయటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తెలంగాణకు చెందిన ఓ మంత్రి ఇటీవల ఒక అవార్డు తీసుకునేందుకు గాను ఢిల్లీ వెళ్లారు. ఇక అక్కడకు వెళ్లిన ఆయన అవార్డు తీసుకొని తిరిగి.. తెలంగాణ భవన్ లోని తన రూంకి వెళ్లారు. అయితే అక్కడ తనకు భోజనం తీసుకురామ్మని ఓ సిబ్బందికి చెప్పగా.. మంత్రి గారి గురించి తెలీని సదరు సహాయకుడు ఇప్పుడిక్కడ భోజనం దొరకదని చెప్పాడు. అంతేనా... దగ్గర్లోని హోటల్ కు వెళ్ళండి అంటూ ఓ ఉచిత సలహా కూడా పడేశాడట. అయితే అదే సమయంలో.. అక్కడ ఉన్న ఓ ఆంధ్రా సిబ్బంది... మంత్రి గారిని గుర్తుపట్టి...  భోజనం తీసుకొస్తానంటూ క్యాంటీన్ కు పరుగున వెళ్లి భోజనం తెచ్చి ఇచ్చాడట. ఇక సొంత భవనంలో తనకు ఎదురైన చేదు అనుభవానికి షాక్ తిన్న మంత్రిగారు.. ఇక్కడకు వచ్చి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో అక్కడి అసిస్టెంట్ పై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశారు. అంతేకాదు సదరు మంత్రిగారు ఏపీ సిబ్బంది చేసిన సహాయాన్ని కూడా ప్రత్యేకంగా చెప్పారట.

రజనీ భయపడ్డాడా..? అందుకే ఆ నిర్ణయమా...!.

  గత కొన్ని సంవత్సరాలుగా రజనీకాంత్ రాజకీయ ప్రస్థానంపై ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. రజనీ రాజకీయాల్లోకి వస్తున్నారో.. పలానా పార్టీలో చేరుతున్నారనో.. అబ్బో ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ అప్పుడు ఆ వార్తలను ఖండించారు రజనీ. అయితే ఇటీవలే వార్తలను నిజం చేయాలని రజనీ కూడా త్వరలో రాజకీయ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు తన అభిమాన సంఘాలతో ముచ్చటించినప్పుడు కూడా త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని చెప్పాడు. ఇక దీంతో అభిమానులు కూడా అప్పటినుండి ఎప్పుడు రజనీ రాజకీయాల్లో అడుగు పెడతారా అని ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి కూడా అభిమానులకు నిరాశే ఎదురైంది. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు ముగించి ఆ తర్వాత పార్టీ గురించి మరోసారి అభిమానులతో చర్చిస్తాను అంటూ రజనీ మళ్లీ వాయిదా వేశారు. అయితే దీని వెనుక మరో స్టోరీ వినిపిస్తోంది.   రజినీకాంత్‌ పార్టీ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడానికి కారణం మాత్రం కమల్ అని తెలుస్తోంది. ఎందుకంటే.. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న కొన్ని రోజుల్లోనే కమల్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నా అని బహిరంగంగానే ప్రకటించాడు. ఇక అప్పటినుండో ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు కమల్. అంతేకాదు.. కమల్‌ మరి కొన్ని రోజుల్లో పార్టీని ప్రకటించడం ఖాయమని... 2019 పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో కమల్‌ పార్టీ పోటీకి దిగే అవకాశాలు కూడా ఉందని అంటున్నారు. ఈనేపథ్యంలోనే... కమల్‌, రజినీకాంత్ కు పోటీ పడే అవకాశం ఉందని.. పార్టీ ఏర్పాటుకు ఇంకాస్త సమయం తీసుకోవాలని అందుకే.. పార్టీ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారని అంటున్నారు. సినిమా పరిశ్రమకు చెందిన ఇద్దరు ప్రముఖులు రాజకీయ పార్టీ పెట్టడం వల్ల ఉపయోగం ఉండదని, కమల్‌తో ఢీ కొట్టడం వల్ల లాభం జరగక పోగా నష్టం ఎక్కువ అవుతుందని రజినీకాంత్‌ భావిస్తున్నాడట. అందుకే పార్టీ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. దీంతో భవిష్యత్తులో కమల్‌ పార్టీ, కమల్‌ పని తీరును బట్టి రజినీకాంత్‌ రాజకీయ పార్టీ ఆధారపడి ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ఒకవేళ కమల్ పార్టీకి ప్రజల ఆదరణ ఎక్కువైతే ఇక రజనీ రాజకీయాల్లోకి రావడం డౌటే అని అంటున్నారు. మరి  కమల్ నాకు పోటీ ఏంటని రజనీ వస్తాడా..? లేక..? వెనుకడుగు వేస్తాడా..?చూద్దాం ఫైనల్ గా ఏం జరుగుతుందో.

ఇప్పుడెందుకు నోరు పెగలడం లేదు పోసాని..!

నంది అవార్డుల రచ్చ ఏమో కానీ... ప్రస్తుతం పోసానీ కృష్ణ మురళీ మాత్రం హాట్ టాపిక్ అయ్యాడు. నందుల రచ్చపై ఇప్పటివరకూ ఎంతో మంది స్పందించినా.. పోసాని స్పందించినట్టు మాత్రం ఎవరూ స్పందించలేదు. కాస్త ఎక్కువగానే రెచ్చిపోయాడు. ఏదైనా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం పోసానీకి మొదటినుండి అలవాటే. ఎదుటి వారు ఎంతటివారైనా లెక్క లేకుండా ఢీకొంటాడు. అందుకే ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు అని కూడా చూడకుండా.. మంత్రి నారా లోకేశ్ పై విరుచుకుపడ్డాడు. నంది అవార్డుల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేస్తున్నందుకు..వాటిపై స్పందించిన లోకేశ్ ఏపీలో ఆధార్ కార్డ్ లేనివాళ్లు కూడా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డాడు. ఇక అంతే లోకేశ్ చేసిన వ్యాఖ్యలకుగాను పోసానీ.. లోకేష్ ని తాగి మాట్లాడుతున్నావా అంటూ అందరూ షాకయ్యేలా కామెంట్లు వేశాడు. అయితే ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయం చోటుచేసుకుంది. నంది అవార్డులపై అనవసరంగా ప్రభుత్వాన్ని అంటున్నారని... లోకేశ్ అన్నందుకు పోసానీ అంతలా విరుచుకుపడుతున్నాడు..మరి ఇదే విషయంపై స్పందించిన వైసీపీ నాయకుడు సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావుపై ఎందుకు నోరు పెగలడంలేదు అని అంటున్నారు.   నందుల రచ్చపై ఆదిశేషగిరిరావు స్పందించి పోసానికి కౌంటర్లు విసిరిన సంగతి తెలిసిందే. పోసాని వ్యవహారాన్ని అనవసర రాద్ధాంతం గా కొట్టిపారేశారు. అయినా నంది అవార్డుల్లో కులాల ప్రస్తావన ఏంటని తప్పుబట్టారు. అవార్డులు రానివాళ్లు ఏదో ఒక్కటి చెప్పి ఇలా గొడవ చేయడం మాములే అన్నారు. అయితే ఆదిశేషగిరిరావు విషయంలో మాత్రం పోసాని ఎందుకు స్పందించడంలేదు.. ఆయన గొంతు ఎందుకు ఇంకా పెగల్లేదు అని అనుకుంటున్నారు. ఎందుకంటే.. తాను అభిమానిస్తున్న జగన్ పార్టీలో నాయకుడు కావడం వల్ల ఆదిశేషగిరిరావు ని పోసాని ఏమీ అనలేకపోతున్నారా అని కొంతమంది టాక్. అంతేకాదు ఇప్పుడు మరో ఆసక్తికర విషయం కూడా బయటపడింది. అసలు లోకేశ్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఎవరో ఒకరు ఉండి ఉంటారు... అందుకే లోకేశ్ విషయంలో అంత ఫాస్ట్ గా రియాక్ట్ అయిన పోసానికి.. ఆదిశేషగిరిరావు విషయంలో అవ్వడం పెద్ద మ్యాటరేమి కాదు.. కానీ ఆదిశేషగిరిరావు విషయంలో మాత్రం... పోసానీ గొంతు పెగలడం లేదంటే తెర వెనుక ఎవరో ఉన్నారు అని అనుకుంటున్నారు. మరి చూద్దాం.. పోసానీ రెస్పాండ్ అవుతాడో..? లేదో..?

జగన్ కే షాకిచ్చాడుగా..నెక్ట్స్ ఏంటీ..?

  పార్టీ ఫిరాయించిన నేతలపై వేటు వేస్తేనే అసెంబ్లీ సమావేశాలకు వస్తామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పట్టుబట్టి అసెంబ్లీ సమావేశాలు డుమ్మా కొడుతున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇది తాను పాదయాత్ర చేసుకోవడానికి పెట్టుకున్న కుంటి సాకు అని ఎవరిని అడిగినా టక్కున చెప్పేస్తారు. ప్రజా సంకల్పం పేరుతో జగన్ ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. తాను అనుకున్నట్టే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా మరీ పాదయాత్ర చేస్తున్నారు. ఇక జగన్ ఆదేశాలు పాటించిన నేతలు కూడా అసెంబ్లీ సమావేశాలు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు.   కానీ ఇప్పుడు సొంత పార్టీ నేతలే జగన్ కు షాకిచ్చారు.  సభకు హాజరుకాకూడదని నిర్ణయం తీసుకున్న జ‌గ‌న్‌కు ఆ పార్టీ బాపట్ల ఎమ్మెల్ల్యే కోన రఘుపతి షాక్ ఇచ్చారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎస్టిమేట్స్ కమిటీకి అయన హాజరయ్యి అందరికి షాక్ ఇచ్చారు. ఈ ఎస్టిమేట్స్ కమిటీలో ప్రభుత్వ సభ్యులతో పాటు ప్రతిపక్ష సభ్యులును కూడా భాగస్వామ్యం చేశారు అసెంబ్లీ స్పీకర్. ఈ క్రమంలోనే ఆయన ఈ సమావేశానికి హాజరయినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు రఘుపతి అసెంబ్లీకి రావడంతో.. ఈయన జగన్ కు తెలిసి అసెంబ్లీకీ వచ్చాడా..? తెలియకుండా వచ్చాడా..? అని చర్చించుకుంటున్నారు. ఎందుకంటే.. జగన్ ను కనుక పర్మిషన్ అడిగితే.. జగన్ పర్మిషన్ ఇచ్చే అవకాశమే లేదు. దీనికి కారణం.. ఏ సమావేశాలకు హాజరుకాబోమని చెప్పి మళ్లీ ఇలా చేస్తే ప్రజల్లో చులకన అయ్యే అవకాశం ఉంటుంది కనుక జగన్ ఖచ్చితంగా ఒప్పుకునే అవకాశమే లేదు. అంటే ఆయన వైసీపీ అధినేత మాట ధిక్కరించే ఈ సమావేశాల‌కు హాజరయ్యారనే అనుమానం తలెత్తుతుంది. ఇంకో ఇంట్రస్టింగ్ న్యూస్ ఏంటంటే... ర‌ఘుప‌తి సైకిల్ ఎక్కుతారంటూ కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పుడు రఘుపతి ఇలా చేయడంతో ఇది నిజమేనేమో అని అనుకుంటున్నారు. మరి చూద్దాం ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుందో. రఘుపతిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా వేసీపీ నేతలు అసెంబ్లీకి వస్తారా..? లేక అసెంబ్లీకి వచ్చినందుకు ఆయనపై యాక్షన్ తీసుకుంటారా..? చూద్దాం ఏం జరుగుతుందో..

ఏపీ "అన్నీ పెండింగ్".. నమో "నమ్మించి మోసం"

  ప్రస్తుతం ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అనడం కంటే అన్నీ పెండింగ్ అని అనుకోవడం మంచిదేమో అనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏపీ పై చిన్న చూపే దీనికి కారణం అని కాస్త రాజకీయానుభవం ఉన్న ఎవరైనా చెప్పొచ్చు. అసలే రాష్ట్రాన్ని విడదీసి కాంగ్రెస్ కావాల్సినంత పాపం మూట గట్టుకుంది. దాంతో కాంగ్రెస్ కు ప్రజలు బాగానే బుద్ది చెప్పారునుకోండి. ఇప్పుడప్పుడే కాంగ్రెస్ పైకి రావడం కూడా కష్టమే. అయితే అప్పుడు రాష్ట్రం విడిపోతున్నప్పుడు బీజేపీ పలికిన ప్రగల్బాలు తలుచుకుంటే ఇప్పుడు ఒళ్లు మండక తప్పదు. ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరితే...ఐదు సంవత్సరాలు ఏంటి.. మేము కనుక అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా సొల్లు మాటలు చెప్పారు. ఇక కేంద్ర ప్రభుత్వంలో తాము అధికారంలోకి వచ్చిన తరువాత కానీ వాళ్లకి సాకులు కనిపించాయి. ఆ చట్టం.. ఈ చట్టం అని చెప్పి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని చెప్పింది. పోనీ ప్రత్యేక ప్యాకేజీ అయినా సరిగ్గా ఇస్తుందా అంటే అదీ లేదు. ఇప్పటివరకూ అతీ గతీ లేకుండా పోయింది. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనాలన్నింటినీ విదేశీ రుణ ప్రాజెక్టుల ద్వారా అందజేస్తామని... విదేశీ రుణాల్లో 90 శాతాన్ని కేంద్రమే భరిస్తుందని హామీ ఇచ్చారు.   మరోపక్క ప్రభుత్వమేమో విదేశీ రుణం  అందితేనే అభివృద్ధి పనులు చేపట్టవచ్చని చూస్తుంది. కేంద్ర ప్రభుత్వమేమో.. ముందు రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా కింద 30 శాతం నిధులు ఖర్చు చేస్తేనే మిగతా రుణం గురించి ఆలోచిస్తామని చెబుతోంది. అసలే రాష్ట్ర విడిపోయి రెవెన్యూ లోటుతో ఉన్న ఏపీ ముందు ఖర్చు ఎలా చేస్తదట. దీనివల్ల దాదాపు 19 వేల కోట్ల విలువైన ప్రతిపాదనలు కేంద్రం వద్ద అలానే పెండింగ్ లో ఉన్నాయి. ఒక రైల్వే జోన్ అయితేనేంటి.. పోలవరం ప్రాజెక్ట్, అసెంబ్లీ సీట్ల పెంపు, దుగరాజపట్నం పోర్టు వ్యవహారం... ఒకటి కాదు రెండు కాదు ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో పనులు పెండింగ్ లో పడిపోయాయి. ఇక కాస్తో కూస్తో ఏపీకి సపోర్ట్ గా ఉన్న వెంకయ్యను కాస్త సైలెంట్ చేసేశారు. మరి ఎంతో నమ్మకంగా మోడీని నమ్ముకున్న చంద్రబాబుకు మోడీ మాత్రం నమ్మించి మోసం చేస్తున్నారు. మరి ఇలానే ఉంటే భవిష్యత్తు ఎన్నికల్లో దాని ఫలితం ఎలా ఉంటుందో కేంద్ర ప్రభుత్వం చూడక తప్పదనిపిస్తోంది.

ఇటు వంశీ.. అటు బీజేపీ.. మధ్యలో చంద్రబాబు..

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామకు సిద్దమైనట్టు తెలుస్తోంది. ఇంతకీ వంశీ అంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే. వల్లభనేని వంశీ తన నియోజక వర్గం అయిన  గన్నవరం పరిథిలోని బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజుకి చెందిన డెల్టా షుగర్స్ నాలుగునెలల కిందట మూసివేశారు. దీంతో దీనిపై వంశీ.. ప్రభుత్వంపై కొన్నిరోజుల నుండి సీరియస్ గా ఉన్నారు. దీన్ని మరో ప్రాంతానికి తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని..ఈ ఫ్యాక్ట‌రీని ఇక్కడ నుంచి తీసేసి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని త‌ణుకుకు త‌ర‌లించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇదే జరిగితే తమ ప్రాంతంలోని చెరకు రైతులు నష్టపోతారని, ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కొన్నాళ్లుగా ఆయన చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు.   అయితే ప్రభుత్వం నుండి సరైన స్పందన రాకపోవడంతో అటో.. ఇటో తేల్చుకుందామని చంద్రబాబు కార్యాలయానికి వెళ్లగా.. అక్కడ ఉన్న సీఎంవో అధికారులు ఆయనతో అమర్యాదగా ప్రవర్తించారట. దీంతో ఆగ్రహంతో ఉన్న వంశీ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ నేపథ్యంలో తన రాజీనామా లేఖను స్పీకర్ కు ఇవ్వాలని వెళ్లగా.. మరో ఎమ్మెల్యే ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అడ్డుకుని ఆ లెటర్‌ని చించివేశారట. ఇక కోపంతో ఊగిపోతున్న వంశీని బుజ్జగించడానికి మంత్రి లోకేశ్  కళావెంకట్రావును మద్యవర్తిగా పంపారట. మరి బీజేపీ-టీడీపీ రెండూ ప్రస్తుతానికైతే మిత్రపక్షంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు ఎవరికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారో అన్నది ట్విస్ట్... చూద్దాం మరి ఏం జరుగుతుందో.. చంద్రబాబు వంశీ కోపాన్నిచల్లార్చుతారో.. లేదో...

నందుల రచ్చ వెనుక బడా నిర్మాత.... చంద్రబాబు చెక్...!

  ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై జరుగుతున్న రచ్చా అంత ఇంతా కాదు. ఇప్పటికే ఈ వ్యవహారం పై జరగాల్సిన రచ్చ అంతా జరిగిపోయింది. పెద్ద పెద్ద సినీ ప్రముఖులు సైతం ఈ వ్యవహారంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వంపై.. అవార్డులు ప్రకటించిన వారిపై మండిపడ్డారు. ఇది చాలా అన్యాయమని... కుల రాజకీయాలు జరిగాయి.. ఇవి నంది అవార్డులు కాదు.. కమ్మ అవార్డులు అని.. ప్రభుత్వం వారికి ఇష్టం వచ్చిన వాళ్లకు అవార్డులు ఇచ్చిందిని ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో విమర్శలు గుప్పించారు. దీంతో ఈ రచ్చపై లోకేశ్ కూడా ఘాటుగానే స్పందించాడు. ఆంధ్రాలో ఆధార్ కార్డు లేనివారు కూడా ఈ అంశంపై విమర్శలు చేస్తున్నారంటూ గట్టిగానే సమాధానం చెప్పాడు. అయితే లోకేశ్ వ్యాఖ్యలు కూడా ఇంత దుమారం రేపుతాయని అనుకోలేదు. పోసాని లాంటి వాళ్ళు లోకేష్ ని పట్టుకుని తాగి మాట్లాడుతున్నావా అని ప్రశ్నించేసరికి.. ఇలా జరుగుతుందని ఏమాత్రం ఊహించని చంద్రబాబు.. దీనికి ఎలాగైనా పరిష్కారం చూడాలని నిర్ణయించుకున్నారు.   ఆ క్రమంలోనే కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడినట్టు తెలుస్తోంది. అసలు ఈ వ్యవహారం మొత్తం వెనుక ఉంది ఓ బడా నిర్మాత అని తెలిసిందట. మొత్తం వ్యవహారం ఓ సీనియర్ నిర్మాత కనుసన్నల్లో జరిగినట్టు నిర్ధారణకు వచ్చారట. ఇప్పుడు పోసాని ఏ బోయపాటికి అవార్డు వచ్చిందని రగిలిపోతున్నాడో ఆ అవార్డు కోసం గట్టిగా సిఫార్సు చేసింది కూడా ఆ అగ్ర నిర్మాత అట. బోయపాటికి అవార్డు ఇచ్చాక పోసానిని రెచ్చగొట్టడంలో కూడా ఆయన హస్తం ఉందట. ఇక ఇది తెలుసుకున్న చంద్రబాబు.. గట్టి షాక్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఇంకో రూట్ లో ఆ నిర్మాత తో పాటు మరికొందరు సినీ పెద్దలకు షాక్ ఇచ్చేలా ప్లాన్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీ సర్కార్ మీద నందుల అంశంలో కొందరు దాడి చేయడానికి వారికి వున్న ఆర్ధిక బలం ప్రధాన కారణం అని టీడీపీ సర్కార్ గుర్తించిందట. అంతేకాదు... నిర్మాత వల్ల దెబ్బ తిన్న చిన్న సినిమాల నిర్మాతలు కొందరు బాబు దగ్గరకు వెళ్లి అక్కడ జరిగే అక్రమాల గురించి పూస గుచ్చినట్టు వివరించారట. ఆ అక్రమాలకు, నియంతృత్వానికి బ్రేకులేస్తే అంతా కంట్రోల్ లోకి వస్తుందని ఆ చిన్న నిర్మాతలు చెప్పిన ప్రతిపాదనల మీద గట్టిగా వర్కౌట్ చేస్తోందట బాబు సర్కార్. కొత్త నియమాలతో వచ్చే మార్పులు సదరు బడా నిర్మాతకు చుక్కలు కనిపిస్తాయి అంటున్నారు. మరి చూద్దాం చంద్రబాబు ఎలాంటి షాక్ ఇస్తారో...

పోసానిని చూసి వణికిపోతున్న జగన్...ఎందుకో తెలుసా..?

రాజకీయాల్లో, సినీ రంగాల్లో సెంటిమెంట్లు ఉండటమనేది సహజమే. సినీ ఇండస్ట్రీలో అయితే లక్కీ నెంబర్లు, ముహూర్తాలు చూసుకుంటారు. ఇక రాజకీయాల్లోకి వస్తే ముహూర్తాలు చూడటం కంటే మనుషులను ఎక్కువగా పట్టించుకుంటారు. ఇప్పుడు వైసీపీకి అలాంటి భయమే పట్టుకుందట. ఇంతకీ ఎవరి విషయంలో వైసీపీకి అంత భయం పట్టుకుంది అనుకుంటున్నారా.. ఆ వ్యక్తి ఎవరో కాదు పోసాని కృష్ణమురళి. పోసానికి.. వైసీపీకి ఉన్న సంబంధం ఏంటీ అని అనుకుంటున్నారా..? అదెంటో తెలియాలంటే కాస్త ప్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే.   ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంలో పోసాని కృష్ణమురళి దిట్ట. అది అందరికీ తెలిసిందే.  ఆ ధైర్యంతోనే.. అప్పట్లో 2004 వ సంవత్సరంలో చంద్రబాబు మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నరోజుల్లో చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచేలా టీడీపీ కి ఓటేయమని కోరాడు. ఎంతోమంది మహామహులే ఇలా అడగటానికి భయపడ్డారు. కానీ పోసాని మాత్రం ఎలాంటి భయం లేకుండా టీడీపీ కి ఓటేయమని కోరుతూ సొంత ఖర్చుతో పేపర్ ప్రకటన ఇచ్చారు. ఫైనల్ గా ఏమైంది ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. ఇక ఆ తరువాత 2009 ఎన్నికలు.. వై.ఎస్ , చంద్రబాబు వంటి దిగ్గజ నేతల మధ్యలోకి ప్రజారాజ్యంతో దూసుకొచ్చారు చిరంజీవి. ఆ ఎన్నికల టైం లో పోసాని ప్రజారాజ్యం లో చేరడమే గాకుండా ఆ పార్టీ తరపున గుంటూరు జిల్లా చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఏమైంది అందరికీ తెలిసిందే. ఆ తరువాత 2014 ఎన్నికలు... రాష్ట్ర విభజన జరిగింది. కాంగ్రెస్ కూడా రెండుగా చీలిపోయింది. వైసీపీ పేరుతో జగన్ కొత్త పార్టీ పెట్టాడు. ఇక ఈ ఎన్నికల్లో పోసానీ జగన్ కు తన మద్దతును తెలిపాడు. దురదృష్టం ఏంటంటే ఆ ఎన్నికల్లో జగన్ ఓడిపోయాడు. అందుకే ఇన్ని చూసిన తరువాత ఇప్పుడు పోసాని మరోసారి వైసీపీకి మద్దతు తెలుపుతుండటంతో... పై మూడు ఎన్నికల్లో తాను మద్దతు తెలిపిన పార్టీలకు ఎలాంటి గతి పట్టిందో అలాంటిదే తమ పార్టీకి పడుతుందేమో అని భయపడుతున్నారట. అసలే జగన్ వచ్చే ఎన్నికల్లో తానే గెలుస్తా అన్నట్టు...వచ్చే ఎన్నికల్లో తానే సీఎం అంటూ చెప్పుకుంటున్నాడు. పాపం మొన్నటివరకూ రోజా అంటే భయపడేవాళ్లు పార్టీ నేతలు.. ఇప్పుడు పోసానిని చూస్తే భయపడుతున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో...

షాకింగ్ ఫ్యాక్ట్స్... బిచ్చగాళ్లు కాదు కోటీశ్వరులు...

ఇటీవల కాలంలో వచ్చిన బిచ్చగాడు సినిమా గుర్తుండే ఉంటుంది కదా... తన తల్లిని కాపాడుకోవడానికి ఓ కోటీశ్వరుడు కొన్ని రోజులు భిక్షాటన ఎత్తుతాడు. ఇక ఈసినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ స్టోరీ ఎందుకు చెపుతున్నారనుకుంటున్నారా..? ఎందుకంటే.. హైదరాబాద్ లో జ‌ర‌గ‌నున్న‌ గ్లోబ‌ల్ స‌మ్మిట్ నేప‌థ్యంలో సిటీలో భిక్షాట‌న‌ను నిషేధించిన సంగతి తెలిసిందే కదా. బిచ్చ‌గాళ్లంద‌రినీ చ‌ర్ల‌ప‌ల్లి ఓపెన్ జైల్లో ఉన్న ఆనందాశ్ర‌మానికి త‌ర‌లించారు. అయితే అక్కడ కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆశ్రమంలోఉన్న వారి  వివరాలు నమోదు చేస్తున్న నేపథ్యంలో భిక్షాటన చేసేవాళ్లలో కొంత మంది కోటీశ్వరులు కూడా ఉన్నారన్న విషయం బయటపడింది.   ఫర్జూనా అనే 50 ఏళ్ల మ‌హిళ తాను ఎంబీఏ పూర్తి చేసి, లండ‌న్‌లో అకౌంట్స్ ఆఫీస‌ర్‌గా ప‌నిచేసిన‌ట్లు తెలిపింది. ప్ర‌స్తుతం లంగ‌ర్ హౌస్‌లో భిక్షాట‌న చేస్తున్న ఆమె వివ‌రాలు చెబుతున్న‌పుడు ఆమె అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడ‌టం విని పోలీసులు కంగుతిన్నారు. భ‌ర్త చ‌నిపోయాక, ఆస్తులను బంధువులు కబ్జా చేయడంవల్ల.. స‌మ‌స్య‌లు తీవ్రం కావ‌డంతో మ‌న‌శ్శాంతి కోసం భిక్షాట‌న చేయ‌మ‌ని ఓ మతగురువు చెప్పడంతో దర్గా దగ్గర బిచ్చగత్తెగా మారింది. ఇక ఆ త‌ర్వాత ఆమె కుమారుడు వ‌చ్చి అఫిడ‌విట్ స‌మ‌ర్పించి ఫర్జూనాను తీసుకెళ్లాడు. ఇక ర‌బియా బైస్రా అనే మ‌హిళ‌ది కూడా ఇలాంటి క‌థే. ఆమె అమెరికా గ్రీన్ కార్డు హోల్డ‌ర్‌. కోటీశ్వ‌రురాలు. ద‌గ్గరి బంధువులే ఆస్తి కోసం మోసం చేయ‌డంతో ఓ ద‌ర్గా ద‌గ్గ‌ర బిచ్చ‌గ‌త్తెగా మారాల్సి వ‌చ్చింది. ఆమెను ఆశ్ర‌మానికి త‌ర‌లించార‌ని తెలిసి బంధువులు వ‌చ్చి జాగ్ర‌త్త‌గా చూసుకుంటామ‌ని డిక్ల‌రేష‌న్ ఇవ్వ‌డంతో పోలీసులు ఆమెను వారితో పంపించారు. మొత్తానికి బిచ్చగాడు సినిమాను రీల్ లో కాకుండా రియల్ లైఫ్ లో చూపించారు.

ఏం పాదం రోజా.. అలా ఎంట్రీ.. జగన్ పై కేసు..

యాదృశ్చికమో లేక రోజా టైం బాలేదో తెలియదు కానీ అందరూ అన్నట్టే జరగడం ఆశ్చర్యం. గతంలో రోజా వల్ల జగన్ అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది అన్న కథనాలు వచ్చాయి. ఒకటి కాదు రెండు కాదు.. అలాంటి ఘటనలు చాలానే జరిగాయి. ఇప్పుడు జగన్ పై కేసు నమోదు అవ్వడంతో.. మళ్లీ రోజాపై విమర్శలు మొదలయ్యాయి. రోజా వచ్చిందో..? లేదో..? జగన్ పై కేసు నమోదైంది అని కామెంట్లు విసురుతున్నారు. ఇటీవల జరిగిన నంద్యాల ఉపఎన్నికల్లో ఓడి పోవడానికి ఓ రకంగా రోజానే కారణమని సొంత పార్టీ నేతలే తిట్టుకున్నారు. ఆతరువాత.. రోజా తిరుమలపై కొబ్బరికాయ కొట్టింది.. పాదయాత్ర ఆగింది అని అన్నారు. ఇప్పుడు జగన్ పాదయాత్రకి రోజా వెళ్లింది.. జగన్ పై కేసు నమోదైంది అంటున్నారు.   ప్రస్తుతం జగన్ ప్రజాసంకల్పం పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ పాదయాత్రలో రోజా కూడా పాల్గొంది. పాదయాత్రలో భాగంగా.. జగన్, రోజా  వైసీపీ నేతలు బనగాని పల్లెలో మహిళా సదస్సు నిర్వహించారు. దీంతో అనుమతి లేకుండా ఈ సదస్సు నిర్వహించారన్న ఆరోపణలతో జగన్ పై కేసు నమోదైంది. జగన్ కేవలం పాదయాత్ర కోసం మాత్రమే అనుమతి తీసుకున్నారు. కానీ మహిళా సదస్సు నిర్వహించడం కోసం కాదని టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వైసీపీ మహిళా సదస్సుకు అనుమతి తీసుకోలేదని పోలీసులు అభ్యంతరం చెప్పారు. మహిళలను తరలిస్తున్న వాహనాలను మొదట్లో అడ్డుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం మహిళలను అడ్డుకుంటోందని ఆరోపిస్తూ.. ధర్నా చేస్తామని రోజా హుస్సేనాపురానికి చేరుకున్నారు. అక్కడ పెద్దగా మహిళలు లేకపోవడంతో ఆమె తిరిగి బనగానపల్లెకు వచ్చారు. పట్టణంలో వాహనంలో అటూ ఇటూ తిరుగుతూ హడావిడి చేసి చివరకు జగన్‌ పాదయాత్రలో పాల్గొన్నారు. ఏదేమైనా రోజా పాద‌యాత్ర‌లో ఎంట‌ర్ అయ్యిందో లేదో జ‌గ‌న్‌పై కేసు న‌మోదైంది.

ఒక్క టూర్.. పవన్ ను మార్చేసిందిగా...!

  ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది అని సరదాగా చెప్పుకుంటుంటా..అప్పుడప్పుడు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఒక్క టూర్ పవన్ ను మార్చేసిందా అనిపిస్తోంది. గత మూడు రోజులుగా పవన్ లండన్ టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే కదా. ప్రజా సమస్యలపై ఆయన స్పందిస్తున్న తీరుపై.. ఆయనకు 'ఇండియా-యూరోపియన్ బిజినెస్ ఫోరం' ఎక్స్‌లెన్సీ అవార్డును ప్రకటించింది. దీంతో పవన్ కు ఉన్న మైలేజ్ ఇంకా పెరిగిపోయింది. మరోవైపు పవన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు కూడా ఆయనకు అవార్డు రావడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక ఇదే జోష్ లో ఉన్న పవన్ కూడా ఇంకా ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లి.. వారితో మమేకం అయి.. వారి సమస్యలను తెలుసుకొని కృషి చేయాలని భావిస్తున్నారట.   అయితే పవన్ ఇంతకుముందు కూడా ఇవే ఆలోచనలు చేసేవాడు. ఇక 2019లో పార్టీ ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి దిగనుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటినుండే వర్కవుట్లు చేస్తున్నారు. కానీ.. పవన్ సినిమాలు చేస్తూ.. విదేశాల్లో ఉండటం వల్ల కొన్ని పనులు మాత్రం జరగడంలేదు. కానీ విదేశీ పర్యటన నుంచీ తిరిగి వచ్చిన తరువాత ఈ విషయంలో చాలా సీరియస్ గా వర్కౌట్ చేయాలని చెప్పారట.. లండన్ టూర్ నుండి వచ్చిన పపన్ పార్టీ నేతలతో సమావేశమై.. త్వరలోనే ప్లీనరీని నిర్వహించి, పార్టీ విధివిధానాలను ప్రజలకు వివరించాలని భావిస్తున్నారట. అందుకే..ప్లీనరీకి సంభందించిన ఏర్పాట్లు..తదితర విషయాలు వేగవంతం చేసేలా పార్టీ శ్రేణులకి చెప్పారట. అంతేకాదు... పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని..రెండు రాష్ట్రాలలో చాలా వేగంగా సభ్యత్వ నమోదు జరిగేలా చూడాలని పార్టీ నాయకులని ఆదేశించారని తెలుస్తోంది. ఇక వచ్చే ఎన్నికలకు కూడా ఎంత సమయం కూడా లేదు కాబట్టి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించే విషయంపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారట. మొత్తానికి లండన్ వాళ్లు ఇచ్చిన అవార్డు ఎఫెక్ట్ వల్ల... లండన్ టూర్ వల్ల పవన్ లో మార్పు బాగానే వచ్చింది.

శశికళ ఆస్తులపై దాడులు..జయలలిత నమ్మినబంటు కారణమా...!

  అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్సి శశికళ ఆస్తులపై.. ఆమె కుటుంబ సభ్యుల ఇళ్లపై ఏకకాలంలో ఐటీ దాడులు జరిపిన సంగతి తెలిసిందే కదా. ఈ దాడులు దేశ వ్యాప్తంగా పలు సంచలనమే సృష్టించింది. అంతేకాదు ఐటీ దాడుల్లో కొన్ని కోట్ల ఆస్తులు కూడా బయటపడ్డాయి. దాదాపు రూ. 5 లక్షల కోట్ల విలువైన స్థిరాస్తులను అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే... ఈ దాడుల వెనుక ఓ వ్యక్తి ఉన్నాడట. అదెవరో కాదు..  జయలలిత సహాయకుడు 'పూంగుండ్రన్' అనే వ్యక్తట. అతను ఎవరూ..?ఏంటి.. ?ఈ దాడుల వెనుక అతని హస్తం ఏంటీ అన్న విషయాలు తెలుసుకోవాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే.   పూంగుండ్రన్.. ఎన్నో ఏళ్లుగా జయలలితకు నమ్మినబంటుగా ఉన్నాడు. అన్నాడీఎంకెలో జయలలిత అధికారంలోకి వచ్చినప్పటినుండీ.. పెరుగుతూ పూంగుండ్రన్ ఆమె సహాయకుడిగా వ్యవహరిస్తూ వస్తున్నాడట. అంతేకాదు అతని తండ్రి శంకరలింగం జయలలితకు స్పీచ్ కూడా రాసి ఇచ్చేవాడట. ఇక జయలలిత పోయస్ గార్డెన్స్ అయితే పూంగుండ్రన్ హలా బాగానే కొనసాగిందట. ఎవరూ ఫోన్ చేసినా.. ఎంతటి వారైనా సరే.. ముందు పూంగుండ్రన్ తో విషయం చెబితేనే.. ఆ తర్వాత జయలలిత వారితో మాట్లాడేవారట.  జయలలిత పార్టీ వ్యవహారాలతో పాటు, ఆమె వ్యక్తిగత ఆస్తుల విషయాలను పూంగుండ్రన్ చాలా దగ్గరిగా పరిశీలించేవాడట.   అయితే ఇదంతా శశికళ ఎంట్రీ ఇవ్వకముందట. ఇక ఎప్పుడైతే శశికళ ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుండి పూంగుండ్రన్ పాత్ర తగ్గిపోయిందట. ఆతరువాత శశికళను జయలలతి బయటకు పంపడం.. ఎలాగో అలా మళ్లీ పోయెస్ గార్డెన్ కు రావడం జరిగిపోయింది. ఇక ఈ క్రమంలో శశికళ పూంగుండ్రన్ తో చేతులు కలిపినట్టు తెలుస్తోంది. ఇది ఒకప్పటి స్టోరీ.. ఇక ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ ఆస్తులపై దాడులు నిర్వహించాలని ప్లాన్ చేసిన ఐటీ అధికారులు...  ముఖ్యంగా ఎవరిని పట్టుకుంటే వివరాలన్ని బయటపడుతాయో అన్నది ఆరా తీశారు. ఈ క్రమంలో పూంగుండ్రన్ పేరే వారికి ప్రధానంగా కనిపించింది. దీంతో ముందు అక్కడినుండే నరుక్చొచారు ఐటీ అధికారులు. తీగ లాగితే డొంగ కదిలినట్టు.. ముందుగా పూంగుండ్రన్‌ కార్యాలయంపై ఐటీ దాడులు చేయగా.. అందులో అసలు విషయాలు బయటపడ్డాయి.. దశాబ్దాలుగా పోయెస్ గార్డెన్ కేంద్రంగా జరిగిన ఆస్తుల కొనుగోళ్లు, పంపకాలు, బినామీలు, బినామీ కంపెనీల వ్యవహారాలు వంటి విషయాలన్ని పూంగుండ్రన్ అధికారులకు వివరించినట్టు తెలుస్తోంది. ఆ ఆధారాలతోనే ఏకకాలంలో ఐటీ అధికారులు 200ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఇంకా కొన్ని చోట్ల ఐటీ అధికారులు దాడి జరిపే అవకాశం ఉంది. చూద్దాం.. ఇంకా ఎన్ని కోట్ల ఆస్తులు బయటపడతాయో.

కుల రాజకీయాలు అంటే మంట...

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందరి కంటే కాస్త భిన్నంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఒక హీరోగా కాకుండా వ్యక్తిగతంగా ఆయన్ని ఇష్టపడేవాళ్లే ఎక్కువ. ఇక ఇప్పుడు ఏదో ప్రజలకు సేవ చేద్దామన్న ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చాడు. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చా అని చెప్పిన పవన్ కళ్యాణ్... అప్పుడప్పుడు ప్రజల సమస్యలపై స్పందిస్తూనే ఉన్నాడు. ఇక ప్రజా సమస్యలపై స్పందిస్తున్న తీరుకు ఆయనకు లండన్ అవార్డ్ కూడా ఇచ్చింది. ఇక యూరప్ టూర్లో వున్న పవర్ స్టార్.. 'తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్' (TAL) నిర్వహించిన 'యువ సమ్మేళనం'లో పాల్గొని రాజకీయాల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో కులాల పాత్ర ఎలా ఉంటుందో చెప్పారు. యువ సమ్మేళనం యువతీయువకులతో ముచ్చటించిన పవన్... మీ దృష్టిలో మానవత్వం అంటే ఏంటి అన్న ఒకమ్మాయి ప్రశ్నకు.. పవన్ కళ్యాణ్ గట్టిగా స్పందించారు. కుల, వర్ణ, ప్రాంతాలంటూ ఏ అడ్డుగోడలూ లేకుండా సమభావం పాటించడమే మానవత్వం అన్నారు.   ఇంకా రాజకీయాల గురించి మాట్లాడుతూ..పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వగానే నువ్వు పలానా కులం అంటూ ముద్ర వేస్తారు.. వద్దన్నా మెళ్ళో ఒక బిళ్ళ తగిలిస్తారు.. ఈ తరహా కుల రాజకీయాలకు తాను వ్యతిరేకం అన్నారు. కుల ప్రాతిపదికన ఎవరు మద్దతిచ్చినా తీసుకునేది లేదని స్పష్టం చేశారాయన. ఆ మాటకొస్తే మానవత్వమే నా కులం అంటూ చెప్పుకొచ్చారు. ''నేను ఏ కులంలో పుట్టినా.. నాకు మాత్రం క్రిస్టియన్ పాప పుట్టింది.. కులం అనేది మన ఛాయిస్ కానప్పుడు.. ఆ కులానికి మనమెందుకు ప్రయారిటీ ఇవ్వాలి'' అంటూ సూటిగా ప్రశ్నించారు పవన్ కళ్యాణ్.

ఆడపిల్ల పుట్టిందని.. టీఆర్ఎస్ లీడర్ రెండో పెళ్లి....

టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ ఆడపిల్లా.. మగపిల్లవాడా అన్న తేడా పెద్దగా ఎవరు పట్టించుకోవడంలేదు. మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లు పోటీ పడుతున్నారు. ఎక్కడో కొంత మంది ఉన్నారు.. ఆడపిల్లా.. మగపిల్లాడా అని చూసేవారు. అది కూడా చదవుకోనివారు.. కాస్త మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నవారు. కానీ ఇక్కడ ఓ ప్రజా ప్రతినిధి కూడా ఆడపిల్ల పుట్టిందని ఏకంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. అతను ఎవరో కాదు...ఓ టీఆర్ఎస్ ప్రతినిధి. తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన పులకండ్ల శ్రీనివాస్‌రెడ్డి.. టీఆర్ఎస్ పార్టీలో యువజన విభాగంలో పనిచేస్తున్నాడు. అయితే అతనికి  చందానగర్‌కు చెందిన సంగీతతో నాలుగేళ్ల క్రితమే వివాహం జరిగింది. వారికి రెండేళ్ల క్రితం ఆడపిల్ల కూడా పుట్టింది. కానీ ఆడపిల్ల పుట్టడం శ్రీనివాస్ రెడ్డికి నచ్చలేదు. దీంతో అతను మరొక యువతిని రెండో పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చాడు. ఇక ఇది చూసి సహించలేని సంగీత తన భర్తను నిలదీసింది. ఆడపిల్ల పుట్టిందని రెండో పెళ్లి చేసుకున్నానని చెప్పాడు.అంతేకాకుండా సంగీతను దారుణంగా కొట్టి ఇంటినుండి గెంటివేశాడు. ఇక ఈ తతంగం అంతా అక్కడ ఉన్న కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియీలో వదలగా.. అది ఇప్పుడు వైరల్ అవుతుంది.   మరోవైపు తీవ్రగాయాల పాలైన సంగీత తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇంటి ముందు ఆందోళన చేపట్టడంతో అసలు కథ బయటపడింది. ఇక విషయం వెలుగుచూడటంతో శ్రీనివాస్‌రెడ్డి ఇంటి నుండి పరారయ్యాడు. ఈ ఘటనతో.. టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలినట్టైంది. మరి ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులే ఇలా ఉంటే ఏం చేస్తాం...