ఐఫోన్ X వచ్చేసిందోచ్, స్పెషల్ ఫీచర్లు ఇవే!
ఐఫోన్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కొత్త మోడల్ ఐఫోన్ 10 (X) భారత కాలమానం ప్రకారం నిన్న రాత్రి 10.30 గంటలకు యూఎస్‌ఏలోని కాలిఫోర్నియాలో యాపిల్ ప్రధాన కార్యాలయంలో స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో ఆ సంస్థ సీఈవో టిమ్ కుక్ లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం అంతా సజావుగా సాగినప్పటికీ ఒక ఇబ్బందికర సంఘటన జరిగింది. టిమ్ కుక్ ఫేస్ ఐడీ గురించి వివరణ ఇస్తున్న సమయంలో ఐఫోన్ X లాక్ ఓపెన్ కాలేదు. దీంతో ఆయన కొంత ఇబ్బందిగా ఫీలయ్యారు. అయితే చివరకు బ్యాకప్ పాస్‌వర్డ్‌తో ఫోన్‌ను అన్‌లాక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఐఫోన్ మొదటి మోడల్ విడుదల చేసి 10 సంవత్సరాలు పూర్తయినందున అందుకు గుర్తుగా రోమన్ అంకె X పేరిట ఐఫోన్ X ను యాపిల్ విడుదల చేసింది. ఇక ఐఫోన్ X ఫీచర్ల గురించి తెలుసుకుందామా...
డిజైన్, కెమెరాలు, కలర్లు, ధర:
ఐఫోన్ X ముందు భాగంలో పైన వరుసగా ఫ్రంట్ కెమెరా, స్పీకర్, మైక్‌లు ఉంటాయి. ఇక కింది భాగానికి వస్తే, హోమ్ బటన్‌ను తీసేశారు. వెనుక భాగంలో కెమెరా, ఫ్లాష్, మైక్ లు ఉంటాయి. ఈ ఫోన్ వెనుక భాగంలో రెండు కెమెరాలను ఒకదాని కింద ఒకటి ఏర్పాటు చేశారు. f/1.8 అపర్చర్ సైజ్ గల ఈ కెమెరాల సామర్థ్యం 12 మెగాపిక్సల్. ఓఐఎస్ ఫీచర్ ఉండడం వల్ల కుదుపులు ఉన్నప్పటికీ ఫొటోలు, వీడియోలు షేక్ లేదా బ్లర్ అవకుండా వస్తాయి. ఇక ముందు భాగంలో ఉన్న సెల్ఫీ కెమెరా సామర్థ్యం 7 మెగాపిక్సల్. f/2.2 అపర్చర్ సైజ్ ఉండడం వల్ల సెల్ఫీ ఫొటోలు నాణ్యంగా వస్తాయి. దీనితో ఫుల్ హెచ్‌డీ వీడియోలను కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఐఫోన్ ఎక్స్ సిల్వర్, స్పేస్ గ్రే రంగుల్లో లభిస్తున్నది. ఇండియా లో ఐఫోన్ X 64 జీబీ ధర రూ.89వేలుగా ఉంది. ఇక 256 జీబీ వేరియెంట్ కావాలనుకుంటే రూ.1.02 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
డిస్‌ప్లే:
ఐఫోన్ X లో బెజెల్ లెస్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే 5.8 ఇంచ్ సైజ్ తో వస్తుంది. స్క్రీన్ రిజల్యూషన్ 2436 x 1125 గా ఉంది. అధునాతన ఓలెడ్ డిస్‌ప్లే టైప్‌ను ఇందులో ఏర్పాటు చేశారు. స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్‌ను ఏర్పాటు చేసారు. తద్వారా, ఫోన్ తెరపై సులభంగా గీతలు పడవు. 3డీ టచ్ డిస్‌ప్లే ఫీచర్‌ను కూడా ఇందులో ఉంది. ఐఫోన్ Xలో ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఉంది. సో, నీరు కానీ దుమ్ము కానీ పడినా ఫోన్ ఏమీ పాడవ్వదు.
ప్రాసెసర్, ర్యామ్, మెమరీ, ఆపరేటింగ్ సిస్టం, 4G , బ్యాటరీ:
ఐఫోన్ Xలో కొత్తగా హెగ్జాకోర్ తో యాపిల్ ఎ11 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. అందీ కాకుండా, ఇందులో ఎం11 మోషన్ కో ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 3 జీబీ ర్యామ్ ఉండగా, 64, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో దీన్ని యూజర్లకు అందిస్తున్నారు. అంటే, ఈ ఫోన్ వేగం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐఫోన్ Xలో సరికొత్త మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 11ను ఏర్పాటు చేశారు. ఇంతకు ముందు వచ్చిన ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ల కన్నా అనేక భిన్నమైన ఫీచర్లను ఇందులో ఉన్నాయి. డివైస్ సాఫ్ట్‌వేర్‌లో ఐకాన్లు, థీమ్స్, యాప్‌లను కొత్తగా డిజైన్ చేసి అందిస్తున్నారు. ఐఫోన్ Xలో 4జీ వీవోఎల్‌టీఈ సదుపాయం ఉంది. గతంలో మాదిరిగా ఈ ఫోన్ లో కూడా సింగల్ సిం ఆప్షన్ ఉండడం ఒక మైనస్ గా చెప్పొచ్చు. ఇక మెమరీ కూడా మనం పెంచుకోవడానికి ఆప్షన్ ఇవ్వలేదు. ఐఫోన్ Xలో కొత్తగా వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. సో, కేబుల్స్ లేకుండానే ఫోన్ ని చార్జింగ్ చేసుకోవచ్చు. ఐఫోన్ 7 కన్నా 2 గంటల ఎక్కువ బ్యాకప్‌ను ఐఫోన్ X ఇస్తుంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఉంది. ఒక గంటలో ఫుల్ ఛార్జింగ్ అవుతుంది.
యాపిల్ పే, 3డీ యానిమేషన్లు, ఫేస్ ఐడీ:
ఐఫోన్ Xలో యాపిల్ పే యాప్ ఉంది. దీంతో వీసా, మాస్టర్‌కార్డు, అమెక్స్ కార్డు హోల్డర్లు కార్డ్ లెస్ పేమెంట్స్ చేసుకోవచ్చు. ఫోన్‌లో డిఫాల్ట్‌గా వచ్చే ఎమోజీలకు తోడు ఐఫోన్ X యూజర్లు కొత్తగా 3డీ యానిమేషన్లను ఎమోజీలుగా వాడుకోవచ్చు. యూజర్ ముఖాన్ని స్కాన్ చేసుకున్న తరువాత ఒక ప్రత్యేకమయిన యాప్ యూజర్ ముఖానికి అనుగుణంగా వివిధ రకాల ఆకారాలతో కూడిన 3డీ యానిమేషన్స్‌ను క్రియేట్ చేస్తుంది. ఆ యానిమేషన్స్‌ను యూజర్లు ఎమోజీలుగా వాడుకోవచ్చు. ఐఫోన్ Xలో కొత్తగా ఫేస్ ఐడీ ఫీచర్ ఏర్పాటు చేశారు. ఫ్రంట్ కెమెరాను ఉపయోగించి ఫోన్‌ను లాక్, అన్‌లాక్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరాకు స్ట్రక్చర్డ్ లైట్ ట్రాన్స్‌మిటర్, స్ట్రక్చర్ లైట్ రిసీవర్, ఫ్లైట్/ప్రాక్సిమిటీ సెన్సార్‌లను జత చేశారు. దీని వల్ల ఫ్రంట్ కెమెరా యూజర్ కళ్లను స్కాన్ చేసి డివైస్‌ను లాక్, అన్‌లాక్ చేస్తుంది. అయితే, ఇంతకు ముందు చెప్పినట్టుగా, ఐఫోన్ X లాంచ్ సమయంలో ఫేస్ ఐడీ పనిచేయలేదు.