చంద్రబాబు ముందా నీ కుప్పిగంతులు జగన్..?

  రాజకీయాల్లో చంద్రబాబు నాయుడికి రాజకీయ చాణుక్యుడు అని ఊరకనే పేరు రాలేదు కదా. ఆయనకు ఉన్న రాజకీయ తెలివితేటలు చూసి చాలా పెద్ద పెద్ద రాజకీయ నేతలే ముక్కున వేలు వేసుకుంటారు. అలాంటిది వైసీపీ అధినేత జగన్ ఎంత. హనుమంతడి ముందు కోతి కుప్పి గంతులు వేసినట్టు... చంద్రబాబు ముందు జగన్ కూడా అలానే కుప్పి గంతులు వేస్తుంటాడు.. బొక్క బోర్లా పడుతుంటాడు. అలా అని సైలెంట్ గా ఉంటాడా అంటే.. అదీ లేదు. ఏదో ఒక రకంగా చంద్రబాబును కెలుకుతాడు. ఏదో ఒకటి అనిపించుకుంటాడు. ఇప్పుడు తాజాగా మరోసారి అలానే ఇరుకున పడ్డాడు జగన్. పనామా పేపర్స్ మాదిరి.. ఇటీవల ప్యారడైజ్ పేపర్లు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పేపర్లో జగన్ పేరు కూడా ఉన్నట్టు వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. దీంతో టీడీపీకి జగన్ జుట్టు అందినట్టైంది. అందుకే.. చంద్రబాబు తన నాయకులకు చెప్పి ప్రెస్ మీట్ పెట్టించి మరీ జ‌గ‌న్‌ను క‌డిగించారు. ఇక చంద్రబాబు ఆదేశాలతో య‌న‌మ‌ల‌, కేఈ, సోమిరెడ్డి, వ‌ర్ల రామ‌య్య జగన్ పై విరుచుకుపడ్డారు.   మరి దీనికి జగన్ ఊరుకుంటాడా... తనకు విదేశాల్లో ఆస్తులు కానీ, వ్యాపారాలు కానీ, న‌గ‌దు కానీ ఉంద‌ని బాబు నిరూపించాల‌ని అన్నాడు. అంతేకాదు 15 రోజులు టైం కూడా ఇచ్చాడు. అలా నిరూపిస్తే.. త‌క్ష‌ణం తాను త‌న పార్టీ జెండీ పీకేసి రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని అన్నారు. ఒక‌వేళ నిరూపించ‌క‌పోతే.. బాబు త‌న సీఎం సీటుకు రాజీనామా చేయాల‌ని స‌వాల్ విసిరారు. ఇంకేముంది జగన్ ఇచ్చిన సవాల్ కు చంద్రబాబు షాక్ అవుతారు... 15 రోజుల్లో నిరూపిస్తారా..? సవాల్ ను ఎదుర్కొంటారా..? అని అనుకున్నారు. మరి అక్కడ ఉంది చంద్రబాబు.. ఇలాంటి చిన్న విషయాలను కూడా చంద్రబాబు సీరియస్ తీసుకుంటే.. ఆయనకు జగన్ కు తేడా ఏముంటది. మరోసారి తన మార్క్ తెలివితేటలను నిరూపించుకున్నారు. జ‌గ‌న్ త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను త‌ప్పుకాద‌ని తానే నిరూపించుకోవాల‌ని సింపుల్ గా జగన్ కే కౌంటర్ ఇచ్చాడు. అంతేకాదు, జ‌గ‌న్ ఊరావాడా త‌ప్పుల మీద త‌ప్పులు చేసి, జ‌నాల్ని దోచుకుని వాటిని న‌న్ను నిరూపించ‌మంటే ఎలా అని కామెంట్ చేశారు. అంతేకాదు, జ‌గ‌న్ ఈ దేశంలో దోచుకున్న సంప‌ద‌ను క‌క్కిస్తామ‌ని, ప్ర‌జ‌ల‌కు పంచుతామ‌ని అన్నారు. మొత్తానికి జగన్ చంద్రబాబు ఇలా కౌంటర్ ఇస్తాడని అనుకొని ఉండడేమో. ఇక చంద్రబాబు ఇచ్చిన కౌంటర్ కు జగన్ నుండి ఇంతవరకూ ఎలాంటి రెస్పాన్స్ లేదు. మొత్తానికి జగన్.. చంద్రబాబు ముందు తన ఆటలు సాగవని ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది..

కేంద్రానికి తెలిసొచ్చిందా.. అందుకే ఈ మార్పులా...!

  ఏదైనా ఒకపని చేయాలనుకున్నప్పుడు...నిర్ణయం తీసుకునేప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకుంటాం. అలాంటిది ఒక దేశానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవాంటే ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి. ఎలాంటి ముందు చర్యలు తీసుకోకుండా.. నిర్ణయాలు తీసుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తెలిసొచ్చినట్టుంది. అందుకే తాము తీసుకున్న నిర్ణయాలపై మరోసారి మార్పులు చేపడుతుంది. గత ఏడాది పెద్ద నోట్లు రద్దు చేస్తూ మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నల్ల ధనాన్ని అరికట్టేందుకు, నల్ల కుబేరుల తాట తీసేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడి వరకూ బానే ఉన్నా... ఈ నిర్ణయం వల్ల అందరూ బాగానే ఉన్నా సామాన్య ప్రజలు పడిన కష్టాలు మాత్రం దేవుడికే ఎరుక. ఇక దీనివల్ల ఎవరికీ ఒరిగింది ఏం లేదు. 500, 1000 నోట్లను రద్దు చేసి 2 వేల నోటును తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు మళ్లీ వెయ్యి నోటును తీసుకొస్తారన్న వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని కేంద్ర పెద్దలు అన్నారు.   ఇప్పుడు జీఎస్టీ వంతు వచ్చింది. జీఎస్టీ అమలుపై ఇప్పటికీ కొంత వ్యతిరేకత ఉన్న సంగతి తెలిసిందే. ఈ జీఎస్టీ వల్ల సామాన్య ప్రజల నెత్తిన భారం ఇంకా పడిందనే చెప్పొచ్చు. అందుకే మరోసారి మార్పులు చేసింది జీఎస్టీ కౌన్సిల్. జీఎస్టీ లో 28 శాతం, 18  శాతం, 12 శాతం, 5 శాతం అని ఇలా నాలుగు విభాగాలుగా విభజించిన సంగతి తెలిసిందే కదా. ఈ పర్సెటేజ్ లను బట్టి వస్తువులను విభజించారు. అయితే ఇప్పుడు కామన్ మెన్ ను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేసింది జీఎస్టీ కౌన్సిల్. గరిష్ట టాక్స్ రేట్ అయిన 28 శాతంలో 2 వందలకు పైగా వస్తువులు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్యను 50 కి తగ్గించింది. 28 శాతంలో ఉన్న 178 వస్తువులను 18 శాతం శ్లాబ్ లోకి మార్చింది. 13 రకాల వస్తువులపై పన్ను 18 నుంచి 12శాతానికి, ఆరు వస్తువులపై 12 నుంచి 5 శాతానికి, ఆరు వస్తువులపై 5 నుంచి సున్నా శాతానికి టాక్స్ తగ్గించారు. రెస్టారెంట్ల బాదుడుకు బ్రేకులేశారు. గతంలో ఉన్న 28, 18 శాతం ట్యాక్స్ రేటును 5 శాతానికి తగ్గించారు. దీంతో ఫుడ్ రేట్లు భారీగా తగ్గే ఛాన్స్ కనిపిస్తోంది. కొత్త రేట్లు ఈ నెల 15 నుంచి అమలులోకి రానున్నాయి. మరి అంత తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు.. మళ్లీ వాటిల్లో మార్పులు చేర్పులు తీసుకురావడం ఎందుకు..?నిజానికి జీఎస్టీ అమలై ఎన్నో రోజులు గడిపోయినా... కొంత మందికి ఇప్పటికీ జీఎస్టీ గురించి పెద్దగా అవగాహన లేదు. ఇప్పుడు మళ్లీ ఈ మార్పులు.. మరి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు .. మార్పుల చేయడం ఎందుకు.. ఏది ఏమైనా మొత్తానికి కేంద్ర ప్రభుత్వానికి కామెన్ మెన్ పవర్ ఏంటో అర్ధమయినట్టుంది.

ప్రతిపక్షం లేని అసెంబ్లీ అదిరిందిగా...

  ఉప్పు లేని కూర ఎలా ఉంటుంది. చప్పగా... రుచిలేకుండా అసలు ఏం తింటున్నామో కూడా తెలియకుండా ఉంటుంది. మరి దీనిలాగే ఉంటుంది.. ప్రతిపక్షం లేని అసెంబ్లీ కూడా. అలా ప్రతిపక్షం లేకుండానే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నిజానికి అసెంబ్లీలో ప్రతిపక్షం ఉంటేనే అదొక కళ. అధికారపక్షాన్ని ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాల్సి ఉంటుంది. ప్రజల సమస్యలపై చర్చించాలి. సమస్యలకు పరిష్కారమయ్యేలా అవసరమైతే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి. అధికారపక్షానికి మాట్లాడే ఛాన్స్‌ ఇవ్వకుండా, అసలు సభ జరిగేందుకు వీలుగా లేకుండా చేయాలి. ఇదీ అసెంబ్లీలో ప్రతిపక్షం చేయాల్సిన పని. కానీ ఏపీ అసెంబ్లీలో సీన్ రివర్స్ లో ఉంది. ఏంటో చెరువు మీద నక్క అలిగినట్టు... ప్రతిపక్షం అయిన జగన్ అండ్ కో బ్యాచ్ అసెంబ్లీ మీద అలిగి సమావేశాలకు డుమ్మా కొట్టారు. పాపం నష్టం వారికే అని తెలియట్లేదు. పైకి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటేనే అసెంబ్లీ సమావేశాలకు వస్తామని ఏదో కుంటిసాకు చెబుతున్నారు కానీ... పాదయాత్ర చేసుకోవడానికి అది జగన్ వేసిన ప్లాన్ అని అందరికీ తెలుసనుకోండి.   అయితే విచిత్రం ఏంటంటే.. ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోయినా బాగానే ఉంటుందేమే అనిపిస్తుంది ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే. ఎందుకంటే... ఇంతకుముందు ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా.. వైసీపీ నేతలు చేసే గోలకి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా.. అంతా గందరగోళంగా ఉండేది. గత అసెంబ్లీ సమావేశాలు అయితే అసలు ఎందుకు జరిగాయో కూడా తెలియదు. ఆ సమావేశాల వల్ల ఒక్క శాతం ఉపయోగం లేకుండా పోయింది. కానీ ఈసారి అసెంబ్లీ సమావేశాలు మాత్రం కాస్త భిన్నంగా ఉండబోతున్నాయి అని అర్ధమయింది. తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో ప్రశాంతంగా జరిగాయి. పట్టిసీమపైనా, నదుల అనుసంధానంపైనా చర్చలు జరగగా... ప్రతిపక్షం లేకపోవడంతో ఎక్కడా అసెంబ్లీకి ఆటంకం కలగలేదు.  ప్రభుత్వం చెప్పాలనుకున్నది చెప్పింది. దాంతో ఆ సమాచారమంతా రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చేరింది. దీంతో గడచిన మూడేళ్ళతో పోల్చుకుంటే ఈసారి అసెంబ్లీ సమావేశాలే ఆసక్తికరంగా సాగుతున్నట్లు భావించాల్సి ఉంటుంది.   ఇక ప్రతిపక్షం లేకపోవడం చంద్రబాబుకు కలిసొచ్చింది. తాము చేసిన అభివృద్ధిని గురించి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మంచి అవకాశం దొరికింది. దీంతో ఆయన ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం దక్కింది. అలాగే ప్రస్తుతం ఉన్న సమస్యలపై ప్రశ్నించే అవకాశాన్ని ప్రతిపక్షం కోల్పోయింది. మరి ప్రతిపక్షం ఇప్పటికైనా కళ్లు తెరిచి తాము చేసిన తప్పేంటో తెలుసుకొని అసెంబ్లీకి వస్తే బావుంటుంది. అలా కాని పక్షంలో తమ తప్పుకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది.

ఏపీ విషయంలో ఇంత నాన్చుడు అవసరమా..!

రాజకీయ నాయకులు అధికారంలోకి రాకముందు ఒకలా మాట్లాడతారు...అధికారంలోకి వచ్చిన తరువాత ఒకలా మాట్లాడతారు. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు అలానే ఉంది కేంద్ర ప్రభుత్వ వ్యవహారంచూస్తుంటే. ఎందుకంటే రాష్ట్రం విడిపోయే ముందు ఐదు కాదు పదిసంవత్సరాలు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పారు. పార్లమెంట్ సాక్షిగా వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు. కానీ ఆతరువాత ఆ చట్టం.. ఇ చట్టం అని చెబుతూ... ప్రత్యేక హోదా ఇవ్వడానికి నానా సాకులు చెబుతున్నారు. పోనీ రెవిన్యూ లోటును అయినా భర్తీ చేస్తున్నారా అంటే.. అదీ లేదు. ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఆ రాష్ట్రం మొదటి సంవత్సరం రెవిన్యూ లోటును పూర్తిగా కేంద్రమే భర్తీ చెయ్యాలి. ఏదో కష్టపడి తమ ఆర్ధిక లోటు 13,775 కోట్లు అని ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చూపించింది. ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిన కేంద్ర ప్రభుత్వం... ఈ విషయంలో కూడా వంకలు చూపించి.. 13,775 కోట్లు కాస్తా...  దానిని కేవలం 4117.89 కోట్లు అని తేల్చింది. ఇక ఈ నిధులు ఇవ్వడానికి కూడా కేంద్రానికి చేతులు రావడం లేదు. 4117.89 కోట్లలో ముందు  2303 కోట్లు రాష్ట్రానికి ఇచ్చింది. ఇంకా 1814.89 కోట్లు ఇవ్వాలి. అందులో రాష్ట్ర అధికారులు కాళ్ళు అరిగేలా తిరిగితే కాని  369 కోట్లు మంజూరు చేసింది. మిగతా 1445.89 కోట్లు ఎప్పుడు విదిలిస్తారో ఎవరికీ తెలియని మిస్టరీ. ఏదో చంద్రబాబు తన రాజకీయ అనుభవంతో.. రెవిన్యూ లోటుతో నానా కష్టాలు పడుతున్నా.. ఏదో ఒక రకంగా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు.

ఏ పాదయాత్రలో ఇన్ని బ్రేకులు ఉండవేమో..?

    మా జగనన్న మగాడు.. ఎన్ని వేల కిలోమీటర్లు అయినా ఇట్టే నడిచేస్తాడు... చంద్రబాబు ముసలాడు.. ఇంకేం చేస్తాడు.. ఇవి వైసీపీ నేతలు కోసిన కోతలు. అబ్బో ఒకటా రెండా తమ నేత గురించి ఓ రేంజ్లో పొగిడారు. కట్ చేస్తే పాదయాత్ర రెండో రోజే నడుముకి బెల్ట్. జగన్ బాబుగారికి నడుం పట్టేసిందట అప్పుడే. పాదయాత్ర మొదలు పెట్టిన రోజే ప్యారడైజ్ ఎఫెక్ట్.. రెండో రోజు నడుముకు బెల్ట్.. ఇప్పుడు కాళ్లు నొప్పులు.. ఇలా అయితే పాదయాత్ర జరిగినట్టే. పాదయాత్ర మొదలుపెట్టిన నాలుగు రోజులకే ఇలా ఉంటే.. ముందుంది కదా అసలు సినిమా. అప్పుడే కాళ్లు నొప్పులు అంటే ఎలా. అసలు ఈ నాలుగు రోజుల్లో జగన్ నడిచింది.. మహా అయితే 30-40 కిలోమీటర్లు. అది కూడా కంటిన్యూస్ గా కాదు.. మధ్య మధ్యలో జనాలతో ముచ్చటిస్తారు.. కార్యకర్తలతో మాట్లాడతారు.. లంచ్ బ్రేక్... కాసేపు రెస్ట్ బ్రేక్.. ఇన్ని బ్రేకులు తీసుకుంటారు. ఇక చీకటి పడకముందే ప్యాకప్. మరి ఈ మాత్రానికే కాళ్లనొప్పులని బిల్డప్ ఎందుకు. కాస్త కాళ్లునొప్పులు పుట్టగానే యాత్రకు బ్రేక్ ఇచ్చి డాక్టర్లతో చెక్ చేయించుకుంటున్నారు.   మళ్లీ జగన్ కు ఓ బంపరాఖర్ కూడా ఉంది. ప్రతి శుక్రవారం రెస్ట్ డే. అదేనండీ.. కోర్టుకు హాజరవ్వాలి కదా. కోర్టు పేరుతో గురువారం మధ్యాహ్నం నుండే జంప్ అవ్వడానికి ట్రై చేస్తారు. శుక్రవారం కోర్టు హాజరై ఆ తరువాత రెస్టే. ఇన్ని రెస్ట్ లు తీసుకుంటూ కూడా మళ్లీ ఆ నొప్పులు.. ఈ నొప్పులు అని గోల. మళ్లీ వీళ్లకి చంద్రబాబుతో పోలిక. రోజురోజుకు చంద్రబాబు వయసు తగ్గుతుంది కానీ పెరగడం లేదు. ఇప్పటికీ కుర్రాడిలా పరుగులు పెడుతున్నారు. పెట్టిస్తున్నారు. చంద్రబాబు పాదయాత్ర సమయంలో కాళ్లు బొబ్బలెక్కినా ఆపలేదు. డాక్టర్లు ఆగమన్నా కుదరదన్నారు. అలాంటి చంద్రబాబుతో పోలిక ఎందుకట. ఇంకా వేల కిలోమీటర్లు ముందున్నాయి. నాలుగు రోజులకు ఇంకా 50 కిలో మీటర్లు కూడా నడవలేదు. అందులో ప్రతి శుక్రవారం బ్రేక్. పాదయాత్ర మొత్తం మీద 3వేల కిలో మీటర్లకు శుక్రవారం పేరుతో బ్రేకులు.. మధ్య మధ్యలో రెస్ట్ బ్రేకులు ఇలా సీరియల్లో బ్రేకుల్లా.. బ్రేకులు ఎక్కువ సీరియల్ తక్కువగా పాదయాత్ర చేస్తే ఎప్పుడు ముగుస్తుందో.. ఏమో..?

జగన్ పాదయాత్రకు మొదటి బ్రేక్ పడింది...

  ఎన్నో అష్టకష్టాలు పడి జగన్ పాదయాత్రను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టి మరీ ఆయన నవంబర్ 6 నుండి తన పాదయాత్రను ప్రారంభించాడు. ఇక నాలుగు రోజుల పాదయాత్ర తరువాత జగన్ పాదయాత్రకు మొదటి సారి బ్రేక్ పడింది. ఎందుకో ఇప్పటికే అందరికీ బల్బు వెలిగి ఉంటది. అదే ఈరోజు శుక్రవారం కదా.. జగన్ కోర్టుకు వెళ్లాల్సిన రోజు. అక్రమాస్తుల కేసులో భాగంగా... నేడు హైదరాబాదులోని సీబీఐ కోర్టు విచారణకు హాజరయ్యారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని యర్రగుంట్ల వద్ద నిన్న సాయంత్రం జగన్ పాదయాత్ర ముగిసింది. ఇక అక్కడి నుండి కోర్టు విచారణ కోసం రోడ్డు మార్గంలో హైదరాబాద్ బయల్దేరారు. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో నగరంలోని లోటస్ పాండ్ లోని నివాసానికి ఆయన చేరుకున్నారు. కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత... 10.30 నిమిషాలకు ఆయన కోర్టుకు చేరుకున్నారు. కాగా పాదయాత్ర నేపథ్యంలో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును ఇవ్వాలని జగన్ కోర్టును కోరినా.. కోర్టు మాత్రం మీ వ్యక్తిగత పనుల కోసం మేము మినహాయింపు ఇవ్వాలా అని చీవాట్లు పెట్టి కోర్టుకు రావాల్సిందే అని ఆదేశించింది. దీంతో జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు రావాల్సిందే. ఈ క్రమంలో జగన్ పాదయాత్రకు నేడు తొలి బ్రేక్ పడింది. రేపటి నుంచి జగన్ పాదయాత్ర యథావిధిగా కొనసాగనుంది. ఈరోజు కోర్టుకు హాజరైన తరువాత ఆయన నేరుగా మళ్లీ రోడ్డు మార్గంలోనే యర్రగుంట్ల వెళ్లనున్నారు. కాగా జగన్ తో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, శ్రీనివాసన్, తదితర నిందితులు కూడా కోర్టుకు హాజరయ్యారు.

అక్కడ ఒక్క రోజు... 45 సిగరెట్లు తాగడంతో సమానం...

  సాధారణంగా సిగరెట్ తాగిన వాడి పక్కన కూర్చుంటే..ఆ తాగిన వాడి కంటే.. పక్కన కూర్చోని పొగ పీల్చుకునే వారికే ఎక్కువ ప్రమాదం అని చెబుతుంటారు. అది తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఎలాంటి సిగరెట్ తాగకపోయినా.. ఆ పొగ పీల్చకపోయినా చచ్చిపోయే రోజులు వచ్చాయి. అది ఎక్కడో కాదు. ఢిల్లీలో. అదేంటీ అనుకుంటున్నారా...? ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. దేశం మొత్తం మీద కాలుష్యం ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అని అడిగితే ఢిల్లీ అని టక్కున చెప్పేయోచ్చు. అంత కాలుష్యం ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఈ కాలుష్యం తారాస్థాయికి చేరింది. మాములుగా వాయునాణ్యత సూచి (ఏక్యూఐ) లో  100 పాయింట్లు దాటితేనే డేంజర్ అని చెబుతుంటారు. అలాంటిది  కొన్ని ప్రాంతాల్లో ఏక్యూఐ రీడింగ్‌ 999 పాయింట్లను తాకింది. ఉదాహరణగా చెప్పాలంటే.. ఢిల్లీలో ఒక్క రోజుండి వస్తే, ఒకమనిషి రోజుకు 45 సిగరెట్లు తాగిన దానితో సమానం అన్నమాట. దీంతో పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఊహించుకోవచ్చు. కనీసం మరో రెండు రోజుల పాటు ఇదే విధమైన వాయు కాలుష్యం ఢిల్లీలో ఉంటుందని కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఇంత కాలుష్యమున్న గాలిని పీల్చడం ప్రాణాలను హరిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇదిలా ఉండగా.. కాలుష్య నియంత్రణకు అధికారయంత్రాంగం సరిగ్గా పనిచేయడం లేదని మానవ హక్కుల కమిషన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఎవరి చావు వారు చావాలన్న చందంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ, కేంద్రప్రభుత్వం సహా ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు నోటీసులు పంపింది.  తాత్కాలిక ఉపశమన మార్గాలు కాకుండా, శాశ్వత పరిష్కారం ఆలోచించాలని సూచించింది. మరి ఒకప్పుడు లండన్.. ఇప్పుడు ఢిల్లీ.. మరి మనం కూడా ఆ పరిస్థితికి రాకుండా ఉండాలంటే.. ప్రభుత్వాలు మేలుకొని ఇప్పటినుండే జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం.

పాదయాత్ర ముహూర్తం జగన్ని ముంచుతుందా..?

2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా జగన్ చేయని ప్రయత్నం లేదు..  విమర్శలు , వ్యూహాలు ఒకటా రెండా ?  ఏవి జనాలలో అతని చరిష్మాని పెంచలేదు . దాంతో  తను తన పరివారం ఏమి చేసినా తెలుగుదేశం హవా ఆపలేకపోతున్నాం అని భావించి  ఎన్నికల వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిశోర్‌ను రంగం లోకి దింపాడు . కానీ  నంద్యాల ఎన్నికలతో ప్రశాంత్ సీన్ అర్థమైపోయింది.    దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వున్న జగన్ కి ఎవరు ఇచ్చారో గాని సలహా, పాదయాత్ర మొదలు పెట్టాడు.. ఒకప్పుడు తన తండ్రి కి అధికారం కట్ట బెట్టింది ఆ పాద యాత్రే కాబట్టి , ఇప్పుడు తనకి కూడా అది కలసి వస్తుంది అనుకున్నాడో ఏమో తన కాళ్ళకి పని చెప్పాడు .    ఈ నెల 6వ తేదీన ఇడుపులపాయలోని తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నుంచి పాదయాత్రను ప్రారంభించాడు. అయితే జగన్ ఏ ముహూర్తాన్న పాదం కదిపాడో గాని సమస్యలు ఒకటొకటి గా అతనిని చుట్టుముట్టడం మొదలు పెట్టాయి . మొదటి రోజే ప్యారడైజ్ పేపర్లతో  జగన్ పేరు మారుమోగింది . అంతేనా రెండో రోజు కి నడుముకి బెల్ట్ తో కనిపించాడు. ఇంకేంటి ? సోషల్ మీడియా జగన్ ని టార్గెట్ చేసి వార్తలు రాసేసింది.   ఇంకెంత కాలం ఇతని పాద యాత్ర సాగాదంటూ కొంతమంది జోకులు వేయటం మొదలు పెట్టారు కూడా . తెలుగుదేశం అనుకూల శ్రేణులు కూడా  సోషల్ మీడియా లో జగన్ ని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. పాదయాత్ర తో జనాలలో పేరు తెచ్చు కుందామనుకుంటే వున్న పేరు పోయి అభాసుపాలు అయ్యేటట్టు వుంది . దీనికంతటికి కారణం ఏంటయ్యా అని కొందరు వైకాపా అభిమానులు   పండితులు ను కలసి ఆరా తీసారుట. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత జాతకం.. ప్రస్తుతం జరుగుతున్న దశ, అంతర్దశలను పరిశీలిస్తే అతను పాదయాత్ర ప్రారంభించిన  ముహూర్తం ఏమంత బలంగా లేదంటున్నారు పండితులు.  మరి పరిష్కారం ఏంటి అంటే ?  జగన్ ఈ యాత్ర జరిగినంత కాలం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని,..    సీఎం చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా విమర్శించటం మీద కంటే .  ప్రజల .. సమస్యలపైనే ద్రుష్టి పెడితే మంచిదని సూచిస్తున్నారు .. అంతేకాదు..టైం బాలేదు కాబట్టి అనేక సమస్యలు చుట్టు ముట్టే అవకాసం వుంది కాబట్టి జాగ్రత్త గా వుండాలి కూడా గట్టిగా హెచ్చరిస్తున్నారు .. మరి జగన్ యోదుడిలా పోరాడుతాడా ? వెనక్కి తిరిగుతాడా ? కాలమే నిర్ణయించాలి .   

శశికళపై మళ్లీ ఐటీ అస్త్రం.. 187 చోట్ల దాడులు

జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాలు ఎలా మారిపోయాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఈ రాష్ట్రంలో బలపడాలని చూస్తోన్న బీజేపీ అందుకు సామ, దాన, బేధ, దండోపాయాలను ఉపయోగిస్తోంది. ఒప్పించడమో.. బెదిరించడమో ఎలాగైనా సరే అంతిమంగా తన దారికి తెచ్చుకుంటోంది. సరిగ్గా అన్ని తాను అనుకుంటున్నట్లు జరుగుతున్నాయి అనుకుంటున్న వేళ శశికళ కాస్త అతి చేసినట్లు కనిపించడంతో అక్రమాస్తుల కేసును తిరగదోడి ఆమెను సైడ్ చేశారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.   తాను జైలుకు వెళ్లినా మేనల్లుడి ద్వారా పార్టీని, ప్రభుత్వాన్ని చెప్పుచేతల్లోకి తీసుకోవాలని భావించింది చిన్నమ్మ. అయితే ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరపడం, ఆర్కే నగర్ ఉపఎన్నికలో గెలుపొందడానికి వీలుగా ప్రజలను ప్రలోభపెట్టాలని ప్రయత్నించినట్లు దినకరన్ ప్రయత్నించినట్లు తేలడంతో ఐటీ దాడులతో కేంద్రప్రభుత్వం అణచివేసిందని చెన్నై టాక్.   ఇదంతా సద్దుమణిగి ప్రశాంతంగా ఉందనుకున్న సమయంలో మరోసారి తమిళనాట ఐటీ దాడులు జరడగం సంచలనం సృష్టిస్తోంది. అన్నాడీఎంకే అధికారిక మీడియా సంస్థ జయ టీవీ కార్యాలయంతో పాటు.. శశికళ బంధువుల ఇళ్లపై ఇవాళ ఉదయం నుంచి దాడులు జరుగుతున్నాయి. తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌లలోని మొత్తం 187 ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు నిర్వహిస్తోంది. పన్న ఎగవేత ఆరోపణలతో పాటు.. డొల్ల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం రావడంతో ఐటీ శాఖ దాడులకు దిగిందని చెబుతున్నారు.

ఇండిగోలో ఈ గోలేంటి..?

  మ‌నం బ్యాంకుల్లో కానీ.. మ‌రేదైనా చోట కానీ ఓ ఫ్రేమ్ చూస్తూ ఉంటాం. "ఖాతాదారుడు మ‌న‌కు అత్యంత విలువైన వ్య‌క్తి ఎందుకంటే మన‌పై అత‌ను ఆధార‌ప‌డి లేడు.. మ‌న‌మే అత‌నిపై ఆధార‌ప‌డి ఉన్నాము" అంటూ జాతిపిత మ‌హాత్మాగాంధీ నిర్వ‌చించిన‌ట్లుగా ఓ సూక్తి క‌నిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అంటే గ‌తకొద్ది రోజులుగా ప్ర‌ముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగో వైఖ‌రి చూస్తుంటే ఆ మ‌హానుభావుడు ఎందుకు అలా చెప్పాల్సి వ‌చ్చిందో అర్థం చేసుకోవ‌చ్చు.  కొద్ది రోజుల క్రితం తెలుగుతేజం, ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణీ పీవీ సింధుతో ల‌గేజ్ విష‌యంలో గ్రౌండ్ స్టాఫ్ లోని అజితేష్ అనే వ్య‌క్తి అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. స్వ‌యంగా సింధు త‌న‌కు జ‌రిగిన అవ‌మానాన్ని ట్విట్ట‌ర్ వేదికగా పంచుకున్నారు. దీంతో ఇండిగో ఎయిర్ లైన్స్ పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ఇలాంటి సంఘ‌ట‌న జ‌రిగినా ఏమాత్రం గుణ‌పాఠం తెచ్చుకోని ఇండిగో సిబ్బంది మ‌రోసారి దుస్సాహాసానికి ఒడిగ‌ట్టారు. రాజీవ్ క‌టియాల్ అనే ఓ ప్ర‌యాణికుడు అక్టోబ‌ర్ 15న ఇండిగో విమానంలో ఢిల్లీ వెళ్లారు. అయితే విమానాశ్ర‌యంలో దిగిన త‌ర్వాత ఆయ‌న టార్మాక్ వ‌ద్ద నిలిపి ఉంచిన బ‌స్సుల వ‌ద్ద‌కు వెళ్లారు. ఆ స‌మ‌యంలో ఎండ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో ద‌గ్గ‌ర‌లోని చెట్టు వ‌ద్ద‌కు వెళ్లారు. అయితే ఆయ‌న నో ఎంట్రీ జోన్ లో ఉన్న‌ట్లు  సిబ్బంది గుర్తించారు. త‌న వ‌ద్ద టికెట్ వుంద‌ని.. వ‌చ్చేస్తాన‌ని చెప్పి  వెళ్లిపోతున్న ఆయ‌న‌ను టార్మాక్ సిబ్బంది తోచేశారు. పీక ప‌ట్టుకుని దాడికి దిగారు. క‌నీసం ఆయ‌న వ‌య‌సుకైనా గౌర‌వం ఇవ్వ‌కుండా అమాన‌వీయంగా ప్ర‌వ‌ర్తించిన సిబ్బంది తీరుపై ప్ర‌జ‌లు, నెటిజ‌న్ల నుంచి తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. గౌర‌వించుకోవాల్సిన ప్ర‌యాణికుల‌పై భౌతిక దాడుల‌కు దిగ‌డం స‌బ‌బు కాద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు ఇండిగో  ఎయిర్ లైన్స్ వ‌రుస వివాదాల‌పై కేంద్ర పౌర‌విమాన‌యాన శాఖ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు స్పందించారు. జ‌రిగిన ఘ‌ట‌న‌పై వెంట‌నే నివేదిక ఇవ్వాల‌ని.. దాడికి పాల్పడిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఇప్ప‌టికైనా ఇండిగో య‌జ‌మాన్యం స‌వ్యంగా వ్య‌వ‌హ‌రించ‌కుంటే క‌నుమ‌రుగైన విమానాయాన కంపెనీల జాబితాలోకి చేరిపోవ‌డం ఖాయం.

హైద‌రాబాద్ మెట్రోలో అమీర్ పేట స్పెష‌ల్

ఎన్నో ఏళ్లుగా భాగ్య‌న‌గ‌ర వాసులు వెయ్యి క‌ళ్ల తో ఎదురుచూస్తోన్న హైద‌రాబాద్ మెట్రో ఈ నెల‌లోనే ప‌రుగులు తీయ‌బోతోంది. ప్రధాని న‌రేంద్ర‌మోడీ న‌వంబ‌ర్ 28న హైద‌రాబాద్ మెట్రోను జాతికి అంకితం చేయ‌నున్నారు. ప్ర‌పంచంలోనే అతిపెద్ద పబ్లిక్ - ప్రైవేట్ భాగ‌స్వామ్యంతో రూపుదిద్దుకుంటున్న మ‌న మెట్రోలో ఎన్నో ప్ర‌త్యేక‌త‌లు సంత‌రించుకున్నాయి. భాగ్య‌న‌గ‌రంలో ఎన్నో మెట్రో స్టేష‌న్లు ఉండ‌గా.. వాట‌న్నింటిలోకి అమీర్ పేట స్టేషణ్ సంథింగ్  స్పెష‌ల్ అట‌. దీని ప్ర‌త్యేకత‌లు ఏంటో ఒక‌సారి చూస్తేః * ఇది ఇంట‌ర్ చేంజ్ మెట్రో స్టేష‌న్.. దీని విస్తీర్ణం 2 ల‌క్ష‌ల చ‌ద‌రపు అడుగులు.. పొడ‌వు 476 అడుగులు కాగా... వెడ‌ల్పు  148 అడుగులు. ఈ స్టేష‌న్ నుంచి ఒకేసారి 4 మెట్రో రైళ్లు రాక‌పోక‌లు సాగిస్తుంటాయి.   * దీనిని మూడు అంత‌స్తుల్లో నిర్మించారు. మొద‌టి అంత‌స్తులో టికెటింగ్, ఎంట‌ర్ టైన్ మెంట్, షాపింగ్ లు ఉంటాయి. రెండో అంత‌స్తులో ఒక మార్గం నుంచే వ‌చ్చే రైళ్లు ఆగుతాయి. మ‌రో మార్గం నుంచి వ‌చ్చే రైళ్లు మూడో అంత‌స్తులో ఆగుతాయి. * హైద‌రాబాద్ లోని అన్ని మెట్రో స్టేష‌న్ ల‌లో రైళ్లు 20 సెక‌న్లు మాత్ర‌మే ఆగుతాయి. కానీ అమీర్ పేటలో మాత్రం రెండు నిమిషాలు ఆగుతుంది. * ఈ స్టేష‌న్ లో 12 ఎస్కలేటర్లు, 16 లిఫ్టులు, 12 మెట్ల మార్గాలు ఉన్నాయి.

వామ్మో జగన్..పిల్లల్ని కూడా వదలట్లేదుగా...

  జగన్ కోసం పిల్లలు అన్నం మానేస్తున్నారా..?జగన్ కోసం నిద్రలో కలవరిస్తున్నారా.. దేవుడు జెలసీగా ఫీలయి వైఎస్ ను తీసుకెళ్లిపోయాడా.. జగన్ అంకుల్ చిక్కిపోయాడు అంటున్నారా..? అవునంటా చిన్న పిల్లలు జగన్ కోసం పరితపిస్తున్నారంట. ఈ మాటలు వింటుంటే.. ఓరి దేవుడో వైసీపీ పిచ్చికి హద్దులు లేకుండా పోయింది అనిపిస్తుంది. వాళ్ల మాటలు చూస్తుంటే... వాళ్ల అరాచకం తట్టు లేక పోతున్నాం. రాజకీయాల కోసం ఏమైనా చేస్తారేమో అనిపిస్తుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్లు వైసీపీ పేపర్ ను టిష్యూ పేపర్ అని ఎందుకు అన్నారో ఇప్పుడు అర్ధమయింది. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ చనిపోయినప్పుడు ఎవ్వరు ఏ కారణంతో చనిపోయిన రాజశేఖర్ కోసమే చనిపోయాడని పేపర్లోలో వేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా చిన్న పిల్లల్ని కూడా తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. ఓ ఏడేళ్ల చిన్న పిల్లంటా.. జగన్ కోసం అన్న తినడం మానేసిందట. వింటుంటే పిచ్చేక్కుతుంది కదా.. ఆ అరాచకం ఏంటో తెలుసుకుందాం. మారతహళ్లిలో గిరిధర్ అనే వ్యక్తికి నందిని అనే కూతురు ఉంది. ఆమె రెండురోజులుగా అన్న తినడం లేదట. ఎందుకంటే..జగన్  ను సీబీఐ అధికారులు విచారిండమే అంట. జగన్ అన్నయ్య ఎప్పుడు బయటకు వస్తాడని ఏడుస్తుందట. దాంతో జ్వరం రావడంతో హాస్పిటల్ కు తీసుకెళితే అక్కడ... ఎక్కువగా స్పందిస్తే ఇలానే జరుగుతుందని... నిద్ర పోతే సరిపోతుందని చెప్పారట. ఇప్పుడు ఈ స్టోరీని తీసుకెళ్లి తమ పత్రికలో ప్రచురించుకున్నారు. ఇంకో చోట ఇంకో పిల్లాడు కూడా జగన్ ఏకంగా దేవుడికే జలసీ వేసిందని అన్నాడట.. అందుకే వైఎస్ ను తీసుకెళ్లిపోయాడట. ఇలా చెప్పుకుంటూ పోతే.. వాళ్ల మాటలు వింటే షాకవ్వాల్సిందే. నిజంగా ఇవి పిల్లలు రాశారో.. లేక వాళ్లే రాసి పిల్లల పేర్లు చెబుతున్నారో తెలియదు కానీ.. వీళ్ల అతి చూస్తుంటే మాత్రం.. ఈవార్తలు చదివి ఇంకా ఎందుకు బతికి ఉన్నామబ్బా అనిపిస్తుంది కదా. ఎంత సొంత ఛానల్ అయితే మాత్రం ఇంత అతి అవసరమా. ఇంకా ముందు ముందు ఇంకెన్ని ఘోరాలు చదవాల్సి వస్తుందో..

పాదయాత్రను ప్యారడైజ్ అడ్డుకుంటుందా..?

ఏ ముహూర్తాన పాదయాత్ర చేయాలని జగన్ అనుకున్నాడో తెలియదు కానీ.. అది అనుకున్నదగ్గర నుండి జగన్ కు ఏదో ఒక ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది. ఏదోలా పాట్లు పడి... అక్కడా.. ఇక్కడా అనుమతులు తీసుకొని పాదయాత్ర మొదలుపెట్టాడు. కానీ ఏం చేస్తాం.. జగన్ జాతకం అంత బావుంది మరి. ఆదిలోనే హంసపాదు అన్న సామెత ప్రకారం... అలా పాదయాత్ర మొదలుపెట్టాడో లేదో ఇలా "ప్యారడైజ్ పేపర్స్" అంటూ జగన్ నెత్తిన పిడుగు పడింది. ప్యారడైజ్ పేపర్స్ ఏంటి... జగన్ కు వాటితో సంబంధం ఏంటీ అనుకుంటున్నారా..? అది తెలియాలంటే స్టోరీలోకి వెళదాం...   గత కొంతకాలం క్రితం ‘పనామా పేపర్స్’ పేరుతో నల్లధనం కుబేరుల లిస్ట్ బయటకు వచ్చి సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు.. "ప్యారడైజ్ పేపర్స్" పేరుతో అంతర్జాతీయంగా పన్న ఎగొట్టిన వారి పేర్లు బయటకు వచ్చాయన్నమాట. 180 దేశాలకు చెందిన డేటా లీకవగా అందులో సంఖ్యా పరంగా భారత్ 19వ స్థానంలో నిలిచింది. అందులో 714 మంది భారతీయ కుబేరులు పన్ను ఎగ్గొట్టిన వారే కావడం గమనార్హం. ఇక ఇందులో కూడా మన జగన్ గారి పేరు కూడా ప్రస్తావనకు వచ్చిందట. ఇప్పటికే లక్ష కోట్ల అవినీతి ఆరోపణ నేపథ్యంలో జైలు జీవితం గడిపి.. ఇప్పటికీ ఆ కేసు కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్న జగన్ కు.. ఇప్పుడు "ప్యారడైజ్ పేపర్స్" పుణ్యమా అంటూ ఈ వ్యవహారంలో కూడా ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది. ఇంకేముంది పాదయాత్ర ప్రారంభించిన రోజే బాంబులాంటి ఈ వార్త బయటకు రావడంతో వైసీపీలో కలకలం మొదలయ్యింది. అయితే జగన్ గురించిన ప్రస్తావన నామమాత్రంగానే వచ్చిందని, దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. మొత్తానికి జగన్ పాదయాత్రకు ఆదిలోనే కష్టాలు ఎదురయ్యాయి. ఇప్పటికే.. వారంలో ఒకరోజు తప్పనిసరిగా కోర్టుకు హాజరవుతున్న జగన్ ప్రతిష్టను.. ప్యారడైజ్ పేపర్స్ వ్యవహారం మరింత మసకబార్చినట్లు కనిపిస్తోంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో..

చంద్రబాబు చేసిన ఆ ఒక్క పొరపాటు..

  చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొని ఏం లాభం.. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి అలానే ఉంది. అంతా అయిపోయిన తరువాత ఇప్పుడు తెలంగాణలో మీటింగ్ పెట్టి ఆయన ఏం సాధిస్తారో అర్దం కాని పరిస్థితి. అసలే రాష్ట్రం విడిపోవడంతో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. కొంతమంది నేతలైతే ముందుగానే భయపడిపోయి అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. ఇక ఉన్న వారినైనా కాపాడుకోకుండా... వారిని సంతృప్తి పరకుండా చంద్రబాబు పొరపాటు చేశారు. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డిలాంటి వ్యక్తి కూడా పార్టీ నుండి బయటకు వెళ్లే పరిస్థితి వచ్చింది. రాష్ట్రం విడిపోయిన తరువాత చంద్రబాబు ఏపీ పై పెట్టిన శ్రద్ద తెలంగాణపై  పెట్టి ఉండే ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేది.   నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులు పార్టీకి దొరకడం చాలా అదృష్టమే. అలాంటి వ్యక్తికి ఎలాంటి పదవి ఇచ్చినా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ చంద్రబాబు అక్కడే పొరపాటు చేశారు. ఏపీలో టీడీపీ ఎలాగూ అధికారంలోకి వస్తుంది. కానీ తెలంగాణలో రావాలంటే కొంచం కష్టమైన పనే. అసలే తెలంగాణలో టీఆర్ఎస్ బలమైన పార్టీ. అలాంటి పార్టీకి ఎదురునిలవాలంటే ప్రతిపక్షపార్టీకి కూడా అంతే బలముండాలి. ఈ నేపథ్యంలోనే తెలంగాణపై కాస్త దృష్టిపెట్టి నేతలు, కార్యకర్తలతో టచ్ లో ఉంటూ.. అప్పుడప్పుడూ మీటింగ్ లు పెడుతూ ప్రజలకు దగ్గర ఉంటే ఏమన్నా ఫలితం ఉండేది. పోనీ పార్టీలో ఉన్న కొద్ది మంది నేతలకైనా పదవులు ఇచ్చారంటే అదీ లేదు. పార్టీ ఫండ్ కు ఆశపడి మల్లారెడ్డికి ఎంపీ పదవిని కట్టబెట్టారు. ఆ పదవి ఏదో రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తికి కట్టబెట్టి ఉంటే బావుండేది. అదిపోనీ.. కేంద్రం ఇచ్చిన రెండు సీట్లలో అయినా చంద్రబాబు టీటీడీపీ నేతలకు ఇచ్చి.. ఒకరిని ఎంపీ.. ఒకరిని కేంద్రమంత్రిగా కూర్చోపెట్టి ఉంటే వ్యవహారం మరోలా ఉండేది. ఏదో ఒక రకంగా పార్టీని బ్రతికించేవాళ్లు. ఆ రెండు సీట్లు కాస్త తీసుకెళ్లి ఏపీ వాళ్లకే కట్టబెట్టారు. చంద్రబాబు చేసిన బ్లండర్ మిస్టేక్ ఇదే. దీంతో టీటీడీపీ నేతల్లో అసంతృప్తి నెలకొంది.   దానికి తోడు ఈ మధ్య టీడీపీ-టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయి అన్న వార్తలు చాలా జోరుగానే వినిపించాయి. అది నిజంగా జరుగుతుందో లేదో తెలియదు కానీ.. తమ స్వార్ధ ప్రయోజనాల కోసం... ఇలాంటి వార్తలు పుట్టిస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. అందుకే రేవంత్ రెడ్డి పార్టీని వీడిపోవాల్సి వచ్చింది. స్వతహాగా రోషం, పౌరుషం ఉన్న రేవంత్ రెడ్డి.. తనను జైలుకు పంపిన వ్యక్తితోనే కలిసిఉండాలని.. జరిగే పరిణామాలను ఊహించలేకే పార్టీని గుడ్ బై చెప్పేశాడు. కారణం ఏదైనా కానీ రేవంత్ రెడ్డి మాత్రం పార్టీని వీడిపోయాడు. ఇంతకు ముందు కూడా టీడీపీ నేతలు పార్టీ మారారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం పోతూ పోతూ తనతో పాటు పార్టీని మొత్తం ఊడ్చేసుకొని తీసుకుపోతున్నాడు. దీనికి కారణం ఎవరో కాదు... స్వతహాగా పార్టీ అధినేతే కారణం. మరి ఇప్పుడు పార్టీని ఎలా కాపాడుకుంటారో ఆయన నిర్ణయాలపైనే ఆధారపడి ఉంది.

రేవంత్ మీద కూడా సినిమా తీస్తాడేమో..?

నిజ జీవిత ఘటనల ఆధారంగా సినిమాలు తీయడంలో క్రియేటివ్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ స్పెషలిస్ట్. ముంబై అండర్‌వరల్డ్‌పై కంపెనీ తీసినా.. సీమలో రెండు కుటుంబాల ఘర్షణను రక్తచరిత్రగా తీసినా.. బెజవాడ రౌడీయిజాన్ని అందంగా మలిచినా అది రామ్‌గోపాల్ వర్మకే చెల్లింది. సమాజంలో ఏదైనా ఘటన జరిగినప్పుడో.. ఆసక్తికరమైన అంశం కనిపించినప్పుడు దానికి సంబంధించిన అదనపు సమాచారం ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతాం. కానీ వర్మ స్టైలే వేరు.. ఆయన మాత్రం అందులో సినిమా తీసే విషయం ఏదన్నా ఉందా అని వెతుకుతాడు. కొన్ని సినిమాలుగా మలుస్తే.. మాటలకే పరిమితమైనవి మరికొన్ని..   వాటిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ చనిపోయినప్పుడు ఆయనను బేస్ చేసుకొని రెడ్డిగారు పోయారు అన్నాడు.. ఆ తర్వాత తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాల చేతిలో హతమైన గ్యాంగ్‌స్టార్ నయిమ్‌పై సినిమా అన్నాడు.. ఆ తర్వాత స్వర్గీయ జయలలిత మీద సినిమా అన్నాడు... కాదు కాదు దానికంటే ముందు శశికళ జీవితకథ ఆధారంగా సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. కానీ వీటీలో ఏ ఒక్కటీ సెట్స్ మీదకు వెళ్లిన దాఖలాలు లేవు. వర్మలో ఉన్న మరో లక్షణం ఏంటంటే.. కాంట్రవర్సీ కోసమో.. పబ్లిసిటీ స్టంటో తెలియదు కానీ లైమ్ లైట్‌లో ఉన్న ప్రముఖులని టార్గెట్ చేసి వారు ఇంద్రుడు.. చంద్రుడు అంటూ మునగచెట్టు ఎక్కించడమో.. లేకపోతే వారిపై విమర్శలు చేయడమో చేస్తూ ఉంటాడు. తాజాగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొన్న రేవంత్ రెడ్డిపై రామూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డిని బాహుబలిగా అభివర్ణిస్తూ తనదైన స్టైల్లో ప్రశంసల వర్షం కురిపించాడు. కాంగ్రెస్ పార్టీ అనేది ఫిల్మ్ థియేటర్ అయితే రేవంత్ రెడ్డి బాహుబలి అని.. ఆయన ఆ పార్టీలో చేరడం పట్ల తానెంతో హ్యాపీగా ఉన్నా అన్నాడు..   ‘‘రేవంత్ రెడ్డి బాహుబలి.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరడం నాకు చాలా చాలా హ్యాపీ.. రేవంత్ రెడ్డి చేరటం మూలాన నాకు కాంగ్రెస్ పార్టీ మీద మళ్ళి నమ్మకం వచ్చింది.. కాంగ్రెస్ పార్టీ ఫిల్మ్ థియేటర్ అయితే రేవంత్ రెడ్డి బాహుబలి.. బాహుబలి బాక్సాఫీస్ కి నోట్ల వర్షం కురిపిస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి ఓట్ల వర్షం కురిపిస్తాడు..’’   అంటూ చేసిన పోస్ట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చూస్తుంటే రేవంత్ రాజకీయాల్లోకి ఎలా వచ్చింది.. ముఖ్యంగా ఆయన ప్రస్థానంలోనే అత్యంత కీలకమైన ఓటుకు నోటు కేసు తదితర అంశాలతో సినిమా తీస్తానని ఎనౌన్స్ చేస్తాడేమో..? మరి వర్మ మనసులో ఏముందో..

ఉండాలీ కానీ.. మరీ అంత కాదు..!!

కొందరు మేధావులు అమాయకుల్లా కనిపిస్తారు.. కొందరు అమాయకులు మేధావుల్లా కనిపిస్తారు. ఈ స్టేట్మెంట్ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి గారిని చూడగానే అనిపిస్తుంటుంది. ఇంతకీ.. జానారెడ్డి గారు మేధావా..? అమాయకుడా..? అసెంబ్లీలో ఏదైనా సమస్య మీద మాట్లాడుతున్నప్పుడు ఆయన స్పీచ్ విన్నవారికి ఎవరికైనా సరే ఆ డౌట్ వస్తుంది. ఎంతో సబ్జెక్ట్ ఉండి కూడా విషయాన్ని స్ఫష్టంగా చెప్పలేకపోవడం నిజంగా దురదృష్టమే. సరే ఆ సంగతి పక్కనబెడితే.. ఆయన ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌కు పెద్ద దిక్కు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో జానా పోషించని పాత్ర లేదు. చేపట్టని పదవీ లేదు. అందుకే స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా " పెద్దలు జానారెడ్డి గారు అంటూ వినయంగా సంభోదిస్తారు.   అలాంటి వ్యక్తి తెలిసి అన్నారో.. లోపల తనను తాను అలా ఊహించుకుంటున్నారో కానీ ఒక మాట అనేసారు. తాను కాంగ్రెస్ పార్టీలో అద్వానీ అంతటి వాడినని చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగితే కదా.. నేను సీఎం పదవిని అడగను.. పార్టీ, కార్యకర్తలు, నాయకులు అందరూ కోరుకుంటే కనుక ఈ పదవి చేపడతానని మనసులోని మాటను బయటపెట్టారు.   ఆయన ఇలా మాట్లాడటానికి కారణం రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బలమైన వాగ్ధాటి, అభిమానగణం, దూకుడు ఉన్న రేవంత్ పార్టీలోకి వస్తే తన పరిస్థితి ఏంటా అని ఆయన లోలోపల మదనపడుతున్నారని.. అందుకే అద్వానీతో పొల్చుకున్నారని అంటున్నారు . అంటే ప్రధాని పదవి దక్కించుకోవడంలో విఫలమైన అద్వానీతో తనను తాను పోల్చుకున్న జానారెడ్డి... సీఎం పదవి కూడా తనకు అదేరీతిలో అందని ద్రాక్షగా మిగిలిపోతుందేమోనని ఈ సంకేతాలను ఇచ్చారా అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.  

అమిత్‌షాని ముంచేసిన రేవంత్

ఆ పార్టీ.. ఈ పార్టీ అని కాకుండా తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలపైనా రేవంత్ రెడ్డి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అదేంటి దెబ్బ పడితే గిడితే తెలుగుదేశం పార్టీకి పడాలి కానీ.. మిగిలిన పార్టీలకు వచ్చే ఇబ్బంది ఏంటీ.? అని మీరు అనుకోవచ్చు. ఓటుకు నోటు కేసులో దొరికినా.. జైల్లో పెట్టించినా తెలంగాణ ముఖ్యమంత్రిపై రేవంత్ దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు. నడిరోడ్డులో నిలబడి కేసీఆర్‌తో సై అంటే సై అంటున్నారు రేవంత్. అందుకే జనాలు కూడా ఆయనకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రేవంత్ స్పీడు ఇలాగే కంటిన్యూ అయితే సీఎం కూడా అయిపోతారని సర్వేల్లో సైతం తెలిసింది. అలాంటి ఛరిష్మా ఉన్న వ్యక్తి బయటికి వెళ్లిపోయే సరికి సగటు టీడీపీ కార్యకర్తలు దానిని జీర్ణించుకోలేకపోతున్నారు.   ఉన్న ఒక్కగానొక్క దిక్కు వీడ్కోలు పలికేయడంతో పార్టీకి ఇక భవిష్యత్తు లేదని భావించారేమో కానీ ఆయనతో సన్నిహితంగా మెలిగే నేతలు, కార్యకర్తలు రేవంత్ అడుగుజాడల్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక అసలు మ్యాటర్‌కి వస్తే... 2019 ఎన్నికల నాటికి ఎలాగైనా బలం పుంజుకుని ఒంటరిగా పోటీ చేయాలనుకున్న బీజేపీ ప్లాన్‌ను రేవంత్ చావుదెబ్బ కొట్టారు. టీఆర్ఎస్‌కు ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు తోడు.. ఇతర పార్టీల్లోని బలమైన నేతలను ఆకర్షించి లాభం పొందాలనుకున్న కమలనాథులకు రేవంత్ షాకిచ్చాడు. ఎందుకంటే చాలామంది కాంగ్రెస్ నేతలు కాషాయం తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారట. ఇందుకు సంబంధించి తెలంగాణ పర్యటన సందర్భంగా రాష్ట్ర పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారట అమిత్. అయితే టీడీపీని వీడిన రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ నెత్తిన పాలు పోసి.. పరోక్షంగా బీజేపీని నష్టపరిచాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.   ఎందుకంటే బీజేపీకి వలస వెళ్లాలని భావించిన కాంగ్రెస్ నేతలు కూడా రేవంత్ రాకతో హస్తంలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారట. ఈ రాజకీయ పరిణామాలన్నీ బీజేపీకి నష్టం కలిగించేలా ఉన్నాయని అమిత్ ఊహించారట.. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ రేవంత్‌ని పార్టీ మారకుండా చూడాలని టీడీపీ అధినేతకు ఫోన్ చేశారట షా.. కానీ అందరికీ షాకిస్తూ రేవంత్ తెలుగుదేశానికీ రాజీనామా చేశారు. ఈ పరిణామాలన్నింటిని చూస్తుంటే రేవంత్ రెడ్డి రాజీనామా టీడీపీ కన్నా బీజేపీనే ఎక్కువ కంగారు పెడుతున్నట్లు ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

30 ఏళ్ల పార్టీ.. మూడు నిమిషాల్లో మటాష్..!!

తెలుగుదేశం పార్టీ.. దశాబ్ధాల పాటు ఏకఛత్రాధిపత్యం కింద ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కోటలను బీటలను వార్చిన పార్టీ. తెలుగోడి ఆత్మాభిమానాన్ని నిలబెట్టిన పార్టీ. ఒక ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ వంటి శిఖరాన్ని ఢీకొట్టడమంటే అది మామూలు విషయం కాదు.. అందుకు కారణం టీడీపీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారకరామారావు పిలుపునందుకొని పార్టీకి మద్ధతునిచ్చి.. నేటికీ పార్టీ జెండా మోస్తున్న కోట్లాది మంది కార్యకర్తలు. టీడీపీ ఇంతకాలం రాజకీయాల్లో మనగలిగిందంటే అందుకు కారణం బలమైన క్యాడరే. అటువంటి పార్టీలో ఒక కుదుపు తీసుకువచ్చింది రాష్ట్ర విభజన. ఏపీలో అధికారాన్ని అందుకున్న తెలుగు తమ్ముళ్లు.. తెలంగాణలో మాత్రం ప్రతిపక్షంలో కూర్చొవలసి వచ్చింది.   చివరిసారిగా 2004లో ఉమ్మడి ఏపీలో పవర్‌ను చేజార్చుకున్న తెలంగాణ తెలుగు తమ్ముళ్లకు ముచ్చటగా మూడో పర్యాయం కూడా ప్రతిపక్షమే దిక్కైంది. సమీప కాలంలో పార్టీ అధికారంలోకి వచ్చే సూచన కనిపించకపోవడంతో.. ఎంతోమంది నేతలు అధికార టీఆర్ఎస్‌లోకి జంప్ చేశారు. ఇదే క్రమంలో 2014లో 15 మంది శాసనసభ్యులతో బలంగా కనిపించిన టీడీపీ.. మూడున్నరేళ్లు గడిచేసరికి ముచ్చటగా ముగ్గురితో సరిపెట్టుకుంది. కానీ కిందా మీద పడి.. కార్యకర్తలతో మద్ధతుతో బండి లాక్కొస్తున్న చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ఊహించని షాక్‌నిచ్చారు.   టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరబోతున్న ఆయన ఎంతమంది నాయకులు బయటికి వెళ్లినా.. ఏన్ని రకాల రాజకీయాలు జరిగినా చెక్కుచెదరకుండా ఉన్న పార్టీ క్యాడర్‌ను బీటలు వార్చారు. ఎన్టీఆర్ టీడీపీకి అంకురార్పణ చేస్తూనే బీసీలను బలంగా ఆకట్టుకున్నారు. అంతేకాకుండా బలమైన రెడ్డి సామాజిక వర్గం కూడా టీడీపీ జెండా మోసింది. ఇంద్రారెడ్డి, మాధవరెడ్డి వంటి వారితో మొదలుకుని ఎంతో మంది రెడ్లు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా అంతకు మించిన నేతలుగా పార్టీకి సేవ చేశారు. ఇలా కులాలకు అతీతంగా టీడీపీకి అండగా నిలబడిన వారంతా ఇప్పుడు ఆ బంధాన్ని తెంచుకోవాలని చూస్తున్నారు. అందుకు కారణం రేవంత్‌ రెడ్డి.   తెలంగాణలో కేసీఆర్‌కు ఎదురునిలవగల మోనగాడికి ఆయనను చూస్తున్నారు టీడీపీ కార్యకర్తలు..అందువల్ల ఆయనకే తమ మద్ధతు ప్రకటించాలని భావిస్తున్నారు. ఇదొక్కటే కాదు.. స్వయంకృతమో.. మరేదైనా కారణమో కానీ ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడం పార్టీని జాతీయ స్థాయిలో అప్రతిష్టపాలు చేసింది. అప్పటి నుంచే టీడీపీకీ తెలంగాణలో పతనం స్టార్ట్ అయ్యిందని రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట. తొలి నుంచి రేవంత్‌ వ్యవహారశైలి నచ్చని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ నాశనం కావడానికి ఆయనే కారణమన్నారు.. పార్టీలోకి వచ్చిన ఆరేళ్లలోనే టీడీపీని భ్రష్టు పట్టించిన ఘనత రేవంత్‌రెడ్డిదే అన్నారు. తనతో పాటు ఎంతోమంది నేతలు 30 ఏళ్లపాటు ఎన్నో కష్టాలకోర్చి బలోపేతం చేసిన పార్టీని రేవంత్ నిమిషాల్లో నాశనం చేశారని వ్యాఖ్యానించారు. 

రేవంత్‌ ఇంటి వద్ద "స్పై"డర్లు

చంద్రబాబు విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత అమరావతికి వెళ్లిన రేవంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ తెలుగుదేశానికి రాజీనామా చేశారు. వస్తూ.. వస్తూ బెజవాడ దుర్గమ్మ ఆశీర్వాదం తీసుకొని సొంత నియోజకవర్గం కొడంగల్‌కు వచ్చారు. టీడీపీకి వీడ్కోలు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలిసినప్పటికీ.. దానిపై స్పష్టత లేదు.. ఇప్పుడే చేరుతారా లేదంటే టైమ్ తీసుకుంటారా అన్న దానిపై రేవంత్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే అభిమానులు, పార్టీ కార్యకర్తలతో హైదరాబాద్ జలవిహార్ వద్ద "ఆత్మీయ సమావేశం" నిర్వహించి అన్ని వివరాలు అప్పుడు ప్రకటిస్తానని రేవంత్ చెప్పారు.   కానీ పోలీసులు ఈ సమావేశానికి అనుమతి నిరాకరించారు. దీందో అందరూ తన ఇంటి వద్దకే రావాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. ఆయనకు తెలంగాణలో మంచి పాపులారిటీ ఉండటంతో రేవంత్ నాయకత్వంలో నడిచేందుకు చాలా మంది మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే టీడీపీ నుంచి ఈ లిస్ట్ రెడీ అయిపోగా.. టీఆర్ఎస్‌కు చెందిన పలువురు అసమ్మతి వాదులు కూడా వీరికి జత కలిసే అవకాశం ఉండటంతో కేసీఆర్ అలర్ట్ అయ్యారు.   ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ అధికారులు జూబ్లీహిల్స్‌లోని రేవంత్ ఇంటి పరిసరాల్లో నిఘా వేసినట్లు టాక్. ఆయనను ఎవరెవరు కలుస్తున్నారు.. ఈ సమావేశానికి ఎవరెవరు హాజరవుతున్నారు అనే విషయాలను అత్యంత రహస్యంగా సేకరిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. చెప్పినట్లుగానే ఇవాళ ఉదయం పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకున్న అనంతరం రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల నుంచి తనను కలిసిన కార్యకర్తలు, నేతలను అప్యాయంగా పలకరించారు. వీరిలో చాలా మంది తెలుగుదేశానికి చెందిన వారు కాగా.. కొందరు ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ నిఘా వేశారన్న వార్త కొందరిలో గుబులు రేపుతోంది.