అటు మోడీకి.. ఇటు జగన్ కు చెక్...
పాపం ముద్రగడ పాదయాత్రలు, నిరసనలు, దీక్షలు చేయకుండానే పని చాలా సులువుగా అయిపోయింది. ఏపీ ప్రభుత్వం కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు పాస్ చేసిన సంగతి తెలిసిందే కదా. బీసీ ఎఫ్ కేటగిరిలో కాపులకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే చంద్రబాబు మరోసారి రాజకీయాల్లో తనకు ఎవరూ సాటిరారు అని నిరూపించారు. ఎందుకంటే కాపులకు రిజర్వేషన్లు కల్పించి అటు జగన్ కు.. ఇటు కేంద్రానికి చెక్ పెట్టాడు. అదేలా అంటారా.. అక్కడే ఉంది మరి అసలు ట్విస్ట్..
కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని.. గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ హామీని ముద్రగడ సీరియస్ గా తీసుకొని దీక్షలు కూడా చేపట్టారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్లు చేశారు. అయితే అది కష్టమైన పని అని చంద్రబాబుకు తెలిసినా.. దానికి ఓ కమిటీ వేసి ఎలాగోలా 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంటూ.. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి.. దానికి ఆమోదముద్ర వేయించారు. ఇక అసెంబ్లీలో జగన్ అండ్ కో బ్యాచ్ ఎలాగూ లేదు.. ఒకవేళ ఉన్నా.. జగన్ ఎప్పటినుండో ఈ డిమాండ్ చేస్తున్నాడు కాబట్టి.. నోరు మొదిపే అవకాశం లేదు. దీంతో చంద్రబాబు తన వంతుగా తన పని పూర్తి చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు ఈ బిల్లు పని కేంద్రం చేతిలో పడింది. కానీ.. అసలు విషయమంతా ఇక్కడే ఉంది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు. ఇప్పుడు కాపుల కోసం బీసీల్లో F కేటగిరీని సృష్టించి ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించారు. అయితే.. ఇప్పటికే బీసీలో ఉన్న A,B,C,D గ్రూపులకు 25 శాతం రిజర్వేషన్లు, బీసీ E కేటగిరీలో ఉన్న మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు, ఎస్సీలకు 15, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అంటే అన్నీ కలిపి 55 శాతం అవుతున్నాయి.
కానీ ఇప్పుడు చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయంతో అది కాస్తా 55 కు చేరింది. కాబట్టి ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కి విరుద్ధం. మరోవైపు ఈ రిజర్వేషన్ అమలు కావాలంటే తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చాలి. తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చాలంటే దేశంలోని సగానికిపైగా రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం అవసరం. అప్పుడు గానీ కేంద్రం రౌండ్ సీల్ వేసే పరిస్థితి ఉండదు. కానీ త్వరలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కేంద్రం ఈ పని చేసి ఇరకాటంలో పడే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఏపీలో కాపులకు రిజర్వేషన్ ఇస్తే.. ఇలాంటి డిమాండ్లే మిగిలిన రాష్ట్రాల్లో రాకమానవు. అదే జరిగితే సర్కారుకు తడిసి మోపెడవుతుంది. కాబట్టి దీనిపై కేంద్రం ఇప్పుడప్పుడే నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. సో చంద్రబాబుకు ఇది కలిసొస్తుంది. ఎన్నికల ప్రచారంలో.. రిజర్వేషన్ కల్పించాలని.. కేంద్రం నిర్ణయం తీసుకోవాలని.. చెప్పుకోవచ్చు. దీంతో అటు కాపు ఓట్లు కోసం ఎక్కడికిపోయే పరిస్థితి ఉండదు. మరోవైపు బీసీల నుండి కాస్త వ్యతిరేకత వస్తున్నా.. కాపులకు ఇచ్చే రిజర్వేషన్లలతో వారికి ఎలాంటి నష్టం లేదని చెబితే ఈ వ్యతిరేకత తగ్గే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇన్ని రోజులు ఇదో వంకగా అసెంబ్లీలో రచ్చ చేసిన జగన్ కు పాపం..ఇక దేనిపై రచ్చ చేస్తాడో చూడాలి. మొత్తానికి చంద్రబాబు రాజకీయ చాణక్యుడని మరోసారి రుజువు చేశాడు. మరి కేంద్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది... ఎన్నికల లోపు బిల్లు పాస్ అవుతుందా.. చూద్దాం ఏం జరుగుతుందో..