దేవుడా.. మొన్న పవన్... ఇప్పుడు చంద్రబాబు..

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలని కూడా చూడారు. కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చాలు ఆయనకు అస్సలు నచ్చదు. వారికి గట్టి వార్నింగే ఇస్తుంటారు. అలా చంద్రబాబు ఆగ్రహానికి గురైంది పాపం అఖిల ప్రియ. వైసీపీ పార్టీ నుండి భూమా అఖిల ప్రియ అధికార పార్టీ అయిన టీడీపీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆమె తండ్రి భూమా నాగిరెడ్డి మరణానంతరం.. చంద్రబాబు అఖిల ప్రియకు మంత్రి పదవి ఇచ్చారు. అదే  పర్యాటక శాఖ మంత్రి. అయితే తాజాగా జరిగిన మంత్రి వర్గ భేటీలో చంద్రబాబు అఖిల ప్రియపై అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి అంటే ఏసీ కార్లలో తిరగడం కాదు .ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయాలి...అధికారులను ఎప్పటికప్పుడు పరుగులు పెట్టిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేయించాలి .అందులో అందర్నీ భాగస్వాములు చేయించాలి .ఇలా అయితే మీ స్థానంలో ఇంకొకరు ఉంటారు అని మంత్రి అఖిల ప్రియపై బాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారట. అయితే దీనికి కారణం ఉంది లెండి. ఇటీవల కృష్ణానదిలో బోటు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే కదా. ఈప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇందుకుగాను.. ఏపీ ప్రభుత్వంపై అందరూ విరుచుకుపడ్డారు. ప్రభుత్వం, అధికారుల నిర్ణక్ష్యంవల్లే ఇలా జరిగిందని అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే చంద్రబాబు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతున్నారు. మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఏపీ టూర్ లో ఈ విషయంపై అఖిల ప్రియకు క్లాస్ పీకిన సంగతి తెలిసిందే కదా. అఖిల ప్రియ.. మీరు అతి కొద్దికాలంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయారు. ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసు. కాబట్టి సాటివాళ్ల బాధను వెంటనే అర్థం చేసుకోగలరు. శోభ నాగిరెడ్డి దంపతులు నాకు పీఆర్పీ నుంచి తెలుసు. మీరు వైసీపీలో ఉన్నప్పుడు మీ నాన్న నాకు ప్రత్యర్థి కావాలి. నేను వస్తే ఓడిపోతానంటే.. మీరు అమ్మను కోల్పోయారనే కారణంతో ఎన్డీయేకి మద్దతు ఇచ్చినప్పటికీ నేను నంద్యాలలో ప్రచారం చేయలేదు. నంద్యాల ఉప ఎన్నికల్లోనూ అభ్యర్థిని నిలబెట్టలేదు. పరోక్షంగా రెండుసార్లు మీ విజయానికి తోడ్పడ్డా అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ.. తానేమీ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని... మంత్రిగా బాధ్యత వహించి.. బాధితులతో మాట్లాడాలి. ప్రజాసమస్యల పట్ల స్పందించకపోతే.. మీది బాధ్యత రాహిత్యం అవుతుందని అన్నాడు.   మొత్తానికి అటు చంద్రబాబు, ఇటు పవన్ చేతిలో అఖిల ప్రియకు క్లాస్ పడింది. మరి అతి చిన్న వయసులోనే మంత్రి పదవి దక్కించున్న అఖిల ప్రియ పెద్దల మాటలు దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా యాక్టివ్ అయితే బావుంటుంది మరీ. ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తే ఆమె రాజకీయ భవిష్యత్తుకు కూడా మంచిదే..

పవన్ జాతకంలో అది లేదట..

  రాజకీయాల్లో జోస్యాలు చెప్పడం కామనే. ఎవరి ఆలోచనా పరిధి మేరకు వాళ్లు కొన్ని అంచనాలు వేస్తూ.. పలానా పార్టీ అధికారంలోకి వస్తుందనో.. లేక పాలానా పార్టీకి ఇన్నీ సీట్లు వస్తాయనే.. ముందుగానే జోస్యం చెబుతుంటారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో కూడా జోస్యం చెప్పారు.. ప్ర‌ముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి తేల్చి. పవన్ నాలుగు రోజుల ఏపీ టూర్ తో ఏపీ రాజకీయాలు కాస్త వేడెక్కాయి అని చెప్పొచ్చు.. పవన్ చేసిన ప్రసంగాలు..ఆయన ప్రతిపక్ష పార్టీలపై వేసిన కౌంటర్లు.. రాష్ట్ర ప్రభుత్వాన్నే కాదు.. కేంద్ర ప్రభుత్వాన్ని సైతం లెక్క చేయకుండా ఆయన కౌంటర్లు విసిరారు. పలు విషయాలపై క్లారిటీ ఇచ్చారు. కొంతమందిగి ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ లు ఇచ్చారు. నాలుగు రోజుల్లో పవన్ పెద్ద హడావుడే చేశాడు. ఇక పవన్ చేసిన ప్రసంగాలకు జనసేన పార్టీ కార్యకర్తలైతే తన నాయకుడు నుండి ఇలాంటి మాటలే వినాలని ఎప్పటినుండో చూస్తున్నామని తెగ ఆనంద పడిపోయారు. ఆ ఆనందంతోనే వచ్చే ఎన్నికలను దృష్టిపెట్టుకోని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు.   దీంతో ఇప్పటివరకూ కేవలం రెండు పార్టీలు మాత్రమే సీఎం కుర్చీ కోసం పోటీ పడ్డాయి. అది అధికార పార్టీ అయిన టీడీపీ, ప్రతిపక్షపార్టీ అయిన వైసీపీ. ఈ రెండు పార్టీలు  వ‌చ్చే సార్వత్రిక ఎన్నిక‌ల్లో సీయం కుర్చీ కోసం నువ్వా-నేనా అన్న‌ట్టు పోటీ ప‌డుతున్నాయి. కాంగ్రెస్ ఉన్నా వేస్ట్ అనుకోండి. ఆ పార్టీ పరిస్థితి గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ టీడీపీ, వైసీపీ పార్టీలతో పాటు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా నేను కూడా రేసులోకి వ‌స్తున్నట్టు కనిపిస్తోంది.. ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.   అయితే ఇక్కడివరకూ బాగానే ఉన్నా... ఇప్పుడు ఓ వార్త మాత్రం హల్ చల్ చేస్తుంది. అదేంటంటే... జ్యోతిష్యుడు వేణుస్వామి పవన్ గురించి చెప్పిన జోస్యం.. పవన్ కళ్యాణ్‌కు సీయం అయ్యే యోగం ఎట్టి పరిస్థితుల్లో లేదని ఈయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడో లేదో తెలియదని కానీ… ఆయన జాతకరీత్యా ఆయ‌న ముఖ్య‌మంత్రి అయ్యే ఛాన్స్ లేద‌ని చెప్పారు. ఇంకేముంది ఎప్పటిలాగే పవన్ ప్యాన్స్ వేణుస్వామి పై అటాక్ మొద‌లు పెట్టారు. ఇక దీనిపై స్పందించిన వేణుస్వామి మాత్రం ఎవరి జాతకరీత్యా ఏం జరగాలో అదే జరుగుతుంది… నా పని నేను చేసుకుంటున్నా… మీరు న‌న్ను టార్గెట్ చేసి విమ‌ర్శ‌లు చేస్తే నేను మాత్రం ప‌ట్టించుకోన‌ని వేణుస్వామి అన్నారు. మరి పవన్ విషయంలో వేణుస్వామి చెప్పింది నిజమవుతుందో లేదో దానికి కాలమే సమాధానం చెబుతుంది. కానీ పవన్ నాకు పదవులు అవసరం.. సీఎం కుర్చీ అవసరం లేదు...నేను పదవులు కోసం రాజకీయాల్లోకి రాలేదు.. ప్రజల సేవకోసం వచ్చాను అని చెప్పాడు. అలాంటి పవన్ కు ఈ జ్యోతిష్యాలతో పని ఏముంటుంది.

మోడీజీ.. ఈ లొల్లి అవసరమా...

  ఎంత తెలివిమంతుడైనా ఏదో ఒక చిన్న పొరపాటు చేసి బుక్ అవుతుంటాడు. ముఖ్యంగా రాజకీయ నాయకులు చేసే చేతలు కానీ.. మాట్లాడే మాటలు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు అలాంటి చిక్కుల్లోనే పడ్డారు ప్రధాని మోడీ. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీపై కాంగ్రెస్, కాంగ్రెస్ పై బీజేపీ దుమ్మెత్తి పోసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలోనే మోడీ కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూ పాకిస్థాన్ ను మధ్యలోకి తెచ్చి నోరు జారారు. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో గెలుపొందేందుకు కాంగ్రెస్ కు పాక్ సాయం చేస్తోంద‌ని మోడీ ఆరోపించారు. మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్ ఇంట్లో ఇందుకోసం ఓ భేటీ జ‌రిగింద‌ని, పాక్ మాజీ అధికారులు, నేత‌లతో పాటు..భార‌త మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి, మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ కూడా ఈ భేటీలో పాల్గొన్నార‌ని, ఇది అనేక సందేహాల‌ను క‌లిగిస్తోంద‌ని మోడీ వ్యాఖ్యానించారు. దీంతో మోడీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఇప్పటికే మోడీ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. మోడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ‌కీయ ల‌బ్దికోసం మోడీ ఇలాంటి అస‌త్య ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఈ ఆరోప‌ణ‌లు త‌న‌ను చాలా బాధించాయ‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు.  మోడీ ఈ విష‌యంపై క్ష‌మాప‌ణ చెప్పాలని డిమాండ్ చేశారు.   అంతేనా ఒక్క కాంగ్రెస్ నుండే కాదు... ఇతర పక్షాల నుండి కూడా తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. ఇక మిత్రపక్షంగా ఉన్నా బీజేపీపై విమర్శలు చేసే శివసేన అయితే మోడీపై విరుచుపడింది. దేశ‌రాజ‌కీయాల స్థాయిని మోడీ దిగ‌జార్చార‌ని.. మోడీ త‌నంత‌ట తానే త‌న స్థాయిని త‌గ్గించుకుంటున్నార‌ని అభిప్రాయ‌ప‌డింది. గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో మొఘ‌ల్ సామ్రాజ్య స‌మాధుల‌ను మోడీ త‌వ్వార‌ని ఆరోపించింది. ప్ర‌చార స‌భ‌ల్లో మోడీ తీవ్ర భావోద్వేగంతో దూకుడుగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని, ఆయ‌న గుజ‌రాత్ ఊబిలో చిక్కుకుపోయార‌ని విమ‌ర్శించింది. మరి మోడీ లాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతైనా ఆలోచించాల్సిన విషయమే. ఏదో చిన్నా చితకా నేతలు అయితే అనుకోవచ్చు... కానీ ఒక దేశానికి ప్రధాని అయిన మోడీ ఓటమి భయంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయనకు సరైంది కాదు అని అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై మోడీ ఎలా స్పందిస్తారో చూద్దాం...

పెళ్లి ఫొటోలు అమ్ముకున్న విరాట్, అనుష్క శర్మ...!

  టీమిండియా నెం వన్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మల ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య  ప్రేమ నడుస్తోంది. మధ్యలో వారిద్దరి బ్రేకప్ అయ్యారు.. విడిపోయారు అంటూ పుకార్లు వచ్చినా.. అవన్నీ పుకార్లే అని నిరూపించారు. ఇక విరాట్, కోహ్లీ పెళ్లి విషయంలో కూడా ఎప్పటినుండో వార్తలు వచ్చాయి. ఈ నెలలోనే వారిద్దరి వివాహం ఉంటుందని.. పలు వార్తలు వచ్చినా.. ఖచ్చితమైన సమాచారం లేకపోవడంతో అందరూ ఏం జరుగుతుందా అని ఎదురుచూశారు. అయితే కోహ్లీ, అనుష్క మాత్రం సైలెంట్ గా పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చారు.     విరాట్, అనుష్కశర్మ ముందుగా ఎలాంటి ప్రకటన చేయకుండా గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నారు. ఏదో పెళ్లికి ముందు కోహ్లీ ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో అసలు విషయం బయటపడింది. ఆ తరువాత వారికి సంబంధించిన కొన్ని ఫొటోలు.. ఏదో కొన్ని సెకన్ల వీడియోలు పోస్ట్ చేశారు.  మెహందీ, సంగీత్ కార్యక్రమాలు, పెళ్లి అన్నీ ఇటలీలోనే జరిగాయి. కానీ వాటికి సంబంధిచిన ఫుల్ వీడియోలు..ఫోటోలు మాత్రం బయట పెట్టలేదు. పెళ్లి ఏలాగూ సీక్రెట్ గా చేసుకున్నారు... కనీసం వీడియో, ఫొటోలు అయినా చూడొచ్చు అనుకున్నారు అభిమానులు. అయితే ఇక్కడే ఇంకో విషయం బయటపడింది. అదేంటంటే... వారి పెళ్లి ఫొటోలు అమ్మకానికి పెట్టారట. వారి పెళ్లికి సంబంధించిన ఫొటోలు ఓ ఫ్యాషన్ మేగజైన్‌కు అమ్మినట్లు తెలుస్తోంది. అదేంటీ.. ఫొటోలు అమ్మకోవడం ఏంటీ అనుకుంటున్నారా...? అయితే దీని వెనుక ఓ రీజన్ ఉంది లేండి..ఈ ఫొటోలు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బును ఛారిటీ కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వాలని అనుష్క, విరాట్ నిర్ణయించుకున్నారట. అందుకే వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు తప్ప ఇతర ఫోటోలు బయటకు రానివ్వలేదట. హీరోయిన్ అనుష్క, క్రికెటర్ విరాట్ కోహ్లికి ఉన్న ఇమేజ్ ఆధారంగా ఈ ఫోటోలను భారీ ధరకు అమెరికా కేంద్రంగా నడిచే ఓ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ మేగజన్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోటోలను ఎంత మొత్తానికి అమ్మారు అనే విషయం మాత్రం బయటకు రాలేదు   ఇదిలా ఉండగా డిసెంబ‌ర్ 21న న్యూఢిల్లీలోని తాజ్ డిప్ల‌మాటిక్ ఎన్‌క్లేవ్‌లో వీరి రిసెప్ష‌న్ వేడుక జ‌ర‌గ‌నుంది. అలాగే ముంబైలో కూడా బాలీవుడ్ తార‌ల‌కు ప్ర‌త్యేకంగా రిసెప్ష‌న్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

రాహుల్ గాంధీకి సత్తా ఉందా.. మోడీకి అవే బలమా...

  ఎప్పటినుండో ఎదురుచూస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కోరిక త్వరలో తీరనుంది. మరో నాలుగు రోజుల్లో పార్టీ పగ్గాలు ఆయన చేతికి వెళ్లనున్నాయి. ఇప్పటికే రాహుల్ గాంధీ ఎన్నికలో భాగంగా... నామినేషన్ ప్రక్రియ ముగిసింది. అంతేకాదు ఈ ప్రక్రియలో రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  అధ్యక్షపదవికి రాహుల్‌ మినహా ఎవరూ నామినేషన్‌ వేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిసెంబర్‌ 16న ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు.దీంతో నెహ్రూ-గాంధీ ఫ్యామిలీ నుంచి అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్న ఐదోవ్యక్తి రాహుల్ అయ్యారు‌.   అయితే ఇక్కడ వరకూ బాగానే మరి రాహుల్ కు పార్టీని నడిపించగలిగే సత్తా ఉందా..? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. రాహుల్ గాంధీకి ఉన్న స్టామినా గురించి అందరికీ తెలిసిందే. ప్రతిపక్ష నేతలు అయితే రాహుల్ గాంధీని ఆడుకుంటారు. ఏకంగా పప్పు అనే పిలుచుకుంటారు. ఏజ్ పెరిగింది కానీ... మైండ్ ఎదగలేదు అని అబ్బో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో విమర్శలు గుప్పించేవారు. అంతేకాదు అప్పుడప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో పడుకోవడం..కెమెరా కంటికి చిక్కడం..బుక్ అవ్వడం.. కూడా రాహుల్ ఇమేజ్ ను డామేజ్ చేసేశాయి. ఇక పార్టీ నేతలు కూడా రాహుల్ కు పార్టీ పగ్గాలు ఇవ్వాలంటే కాస్త సందేహపడ్డారు కూడా. అందుకే ఎప్పుడో ఇవ్వాల్సిన బాధ్యతలు పెండింగ్ పడుతూ ఇప్పుడు చేపట్టనున్నారు.   మరోవైపు రాహుల్  కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న ఆ పార్టీ భావి ప్రధాన మంత్రి అభ్యర్ధి రాహుల్ గాంధీకి రాజకీయం చదరంగంలో కొన్ని బలహీనతలు ఉన్నాయి.. అవే మోడీకి బలాలు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అవి ఏమిటో ఒక లుక్ వేద్దాం ..రాహుల్ గాంధీ రాజకీయ జీవితాన్ని గమనిస్తే సమయానికి తగ్గట్లు నిర్ణయాలు తీసుకోవడంలో రాహుల్ విఫలమవుతున్నారు .ఉదాహరణకు మధ్యప్రదేశ్ ,ఓడిశా రాష్ట్రాల పీసీసీ అధ్యక్షా పదవులను నియమించడానికి గత ఆరు నెలలుగా సంప్రదింపులు చేస్తున్న కానీ ఇప్పటివరకు ఆ విషయంలో క్లారీటీ లేదు .అంతే కాదు లోక్ సభలో పార్టీ ఉపనేతగా ఉన్న అమరేందర్ సింగ్ రాజీనామా చేసిన కానీ ఉప నేత పదవిని ఇంతవరకు రాహుల్ నియమించలేదు . రాహుల్ చేస్తోన్న పలు ప్రసంగాలను చూస్తుంటే ఆయన మాటల్లో ఎదుటివార్ని ఆకర్షించే విధంగా ఉండవు .అంతే కాదు సమయానికి తగ్గట్లు ఫంచ్ లు ఉండవు ..విమర్శలు ఉండవు ..సెటైర్లు ఉండవు ..ఆయన పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న ..ఇక్కడ పాలన సరిగా లేని సమయంలో రాహుల్ ఏకంగా సెలవులు పెట్టి మరి ఇతర దేశాల పర్యటనలకు వెళ్తారు .పార్టీ వ్యవహారాల్లో మినహా ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఎటువంటి అనుభవం లేదు .ఇవే ప్రధాని మోదీకి బలంగా మారనున్నాయి అని రాజకీయ విశ్లేషకులు.   వీటన్నింటికన్నా ముందు తక్షణమే ఎదురవుతున్న ప్రశ్న రాహుల్‌ గాంధీ నాయకత్వాన జరిగిన ఎన్నికల ప్రచారంలో గుజరాత్‌లో పార్టీ విజయం సాధిస్తుందా, లేదా? అన్నది అనుమానం. ఎందుకంటే కొత్త బాధ్యతలు స్వీకరించిన వెంటనే పరాజయం ఎదురయితే అది రాహుల్ గాంధీకి పెద్ద మైనస్ అవుతుంది. వచ్చే ఏడాది మొదట్లో జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ, ఆ తర్వాత రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఆయన నాయకత్వానికి సవాల్‌గా నిలుస్తాయి. మరి రాహుల్ గాంధీ ఇవన్నీ తట్టుకొని ముందుకు సాగగలడా... రాహుల్ లోపాలను మోడీ ఎలా ఉపయోగించుకుంటాడో చూద్దాం..

పవన్ కు అర్ధం కాదు.. జగన్ అర్ధం చేసుకోడు..

  ఒకే దెబ్బకు రెండు పిట్టలు ఈ సామెత గుర్తుంది కదా... ఇక్కడ దెబ్బ కొట్టింది ఎవరంటే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇక రెండు పిట్టలు ఎవరో ఇప్పటికే అర్ధమైపోయి ఉంటది.. ఆ పిట్టలు ఎవరో కాదు... వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా..? పోలవరం ప్రాజెక్ట్ విషయంలో..   పవన్ కళ్యాణ్ ఏపీలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా... పోలవరాన్ని కూడా సందర్శించిన సంగతి తెలిసిందే కదా. ఈ ప్రాజెక్టు విషయంలో పవన్ ఏపీ ప్రభుత్వంపై, చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టు ఏ ఒక్క ప్రభుత్వానిదో, పార్టీదో కాదని.. ప్రాజెక్టు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వచ్చానని.. పోలవరం విషయంలో తాను ఎవరినీ నిందించడం లేదన్నారు. పోలవరం పూర్తి కాకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం లెక్కలు అడుగుతోందని అవి చెబితే తప్పేమిటని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని అనుమానాలు వచ్చాయని, దాంతో లెక్కలు అడుగుతున్నారని, మనం ఏ తప్పు చేయనప్పుడు లెక్కలు చెబితే తప్పేమిటని అన్నారు. ఇక జగన్ అయితే ఎప్పటినుండో పోలవరం విషయంలో చంద్రబాబును విమర్శిస్తూనే ఉన్నాడు. ప్రాజెక్టు అని చెప్పి డబ్బులు కాజేస్తున్నారని.. అబ్పో ఎన్నో విమర్సలు చేశాడు.   అయితే ఇప్పుడు వారి కామెంట్లకు చంద్రబాబు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. పోలవరం పనులు పరిశీలించడానికి వచ్చిన చంద్రబాబు మీడియా సమావేశంలో పాల్గొని.. జగన్, పవన్ విమర్శల గురించి స్పందిస్తూ నవ్వుతూనే షాకులిచ్చారు. పవన్ కళ్యాణ్ కు ఏం చెప్పినా పూర్తిగా అర్థం కాదు.. ఇక వైఎస్ జగన్ చెప్పినా అర్థం చేసుకోరు అంటూ కామెంట్ చేశారు చంద్రబాబు. వాస్తవానికి పోలవరం గురించి మాట్లాడే ముందు దాని గురించి పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది..ఎందుకంటే అది ఇప్పటి ప్రాజెక్టు కాదు..అంతే కాదు దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏ మేరకు ఉంటాయో అన్న విషయం కూడా ఆ ఇద్దరు గమనించి ముందుకు సాగాల్సి ఉంటుందని అన్నారు.   మొత్తానికి హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్టు.. రాజకీయాల్లోనే చాణుక్యుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ముందా పవన్, జగన్ కుప్పి గంతులు. ఏదో కేంద్రం సహకరించినా... సహకరించకపోయినా.. నానా కష్టాలు పడుతూ... ఏదోలాగ ప్రాజెక్టును పూర్తి చేయాలని చూస్తుంటే... కేంద్రంపై పోరాడి.. ఆయనకు సహకరించాల్సింది పోయి.. రివర్స్ లో ఆయపైనే కౌంటర్లు వేయడం. మరి ఇవన్ని చూస్తూ చంద్రబాబు ఊరుకుంటారా.. రివర్స్ కౌంటర్ ఇచ్చి నోరు మూయించారు.

పవన్ గుండు స్టోరీపై క్లారిటీ ఇచ్చిన పరిటాల సునీత....

జనసేన అధినేత పవన్ కళ్యాణ్... తన గుండు స్టోరీ గురించి చెప్పినప్పటినుండి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే కదా. ఏపీలో నాలుగు రోజుల పాటు పర్యటించిన పవన్ కళ్యాణ్.. పలు సమావేశాల్లో పాల్గొన్నారు. జనసేన కార్యకర్తలను మీట్ అయ్యారు. అయితే ఈసారి మాత్రం పవన్ చేసిన ప్రసంగాలు మాత్రం ఏపీ రాజకీయాల్లో వేడిని పుట్టించాయి. ఎప్పటినుండో తన మనుసులో దాగివున్న కొన్ని నిజాలను ఇప్పుడు అందరిముందు చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక దీనిలో భాగంగానే పవన్ తనకు పరిటాల గుండు కొట్టించాడని కొన్నేళ్ల క్రితం వచ్చిన వార్తలపై స్పందించి అసలు ఏం జరిగిందో చెప్పాడు. అప్పుడెప్పుడో జానీ సినిమా అప్పుడు తనకు చిరాకు వేసి గుండు కొట్టించుకున్నానని... అయితే పరిటాల రవి నాకు గుండు కొట్టించాడని ప్రచారం జరిగింది.. నేనెప్పుడు పట్టించుకోలేదు.. వదిలేశాను అని అన్నాడు. అంతేకాదు.. ఒక వేళ పరిటాల రవి గుండు కొట్టిస్తే నేను ఊరుకుంటానా.. నేనేమన్నా వాజమ్మనా అంటూ ఎప్పుడో రేగిపోయి,వదిలేసిన తేనే తుట్టుని మళ్ళీ కదిపాడు. ఇక పవన్ చెప్పిన గుండు స్టోరీ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది.   ఇక పవన్ చెప్పిన గుండు స్టోరీపై పరిటాల రవి భార్య పరిటాల సునీత స్పందిచారు. తన భర్తకు.. పవన్ కల్యాణ్ కూ సంబంధమే లేదని.. ఈ విషయంలో పవన్ నిజమే చెప్పారని అన్నారు. పవన్ కు గుండు కొట్టించే అవసరం పరిటాల రవి గారికి లేదు..అయినా తన భర్త అంత మూర్ఖుడు కాదని ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు అని తెలిపారు..రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారని చెప్పారు. మొత్తానికి ఎప్పటినుండో దాగివున్న ఓ నిజానికి అటు పవన్.. ఇటు మంత్రి సునీత గారు క్లారిటీ ఇచ్చారు. మరి ఇన్నాళ్లు పరిటాల రవి చేతిలో గుండు కొట్టింకున్నాడు అన్న విషయంలో.. ఇకనుండి పవన్ పై విమర్శలు గుప్పించాలంటే ఆలోచించాల్సిందే...

షర్మీలపై జగన్ కు పీకే సలహా.. జగన్ లాజిక్ కు పీకే షాక్..

  జగన్ స్వభావం గురించి అందరికీ తెలిసిందే. నేను మోనార్కుని.. ఎవరి మాట వినను అనే మెంటాలిటీ జగన్ ది. ప్రస్తుతం జరుగుతున్న పార్టీ ఫిరాయింపులే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకూ 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ ని  వీడి అధికార పార్టీ లోకి జంపు అయ్యారు. ఇంకా పలువురు..లిస్ట్ లో ఉన్నారు కూడా. అయితే పార్టీ నుండి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ.. జగన్ వైఖరి నచ్చలేదని.. ఆయన అస్సలు పట్టించుకోవడంలేదన్న పాట పాడిన వారు. అంతేకాదు ఇంత మంది పార్టీ మారుతున్నా... జగన్ మాత్రం నిమ్మకు నీరెత్తన్న్టటు ఉన్నాడంటేనే అతనికి ఉన్న గర్వం ఏంటో అర్ధమవుతుంది. అయినా సొంత కుటుంబసభ్యులనే పట్టించుకోని జగన్.. బయటవాళ్లను మాత్రం పట్టించుకుంటాడు అనుకోవడం.. హాస్యాస్పదం. ఇక తన చెల్లి షర్మీల అయితే తనకు ఎక్కడ పోటీ వస్తుందో అని ఆమెను పక్కన పెట్టాడు.   అయితే ఇన్ని రోజులు వినిపించని షర్మిల పేరు తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. అది కూడా వైసీపీ ఎన్నికల ప్రచార వ్యహకర్త ప్రశాంత్ కిషోర్ వల్ల. అసలు కథ ఏంటంటే.. జగన్ పై అవినీతి ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే కదా. మొత్తం 11 కేసులు ఉన్న నేపథ్యంలో.. ఏ కేసులో అయినా జైలుకు వెళ్లాల్సి వస్తే.. దానికి ప్రత్యామ్నయంగా పార్టీ పగ్గాలు అందుకోవడానికి పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి షర్శిలకు ఇవ్వాలని ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చారట. షర్మిలకు పార్టీ ప్రధాన కార్యదర్సి పదవి ఇచ్చి ప్రచారానికి వాడుకోవాలని సూచన చేశారట. అయితే ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ సూచనకు ముందు జగన్ ఖంగు తిన్నా... తరువాత తేరుకొని ఆలోచించి చెబుతా అని అన్నారట. అంతేకాదు... ప్రశాంత్ కిషోర్ కు అర్దంకాని ఓ తొక్కలో లాజిక్ కూడా చెప్పారట. నేను తీసుకునే నిర్ణయాలు అన్నీ ఏకపక్షంగానే, అప్పటికప్పుడే ఉంటాయి. ఇద్దరి స్వభావం ఒకటే..ఇద్దరూ ఒకే నిర్ణయాలు తీసుకుంటే ప్రమాదం అని చెప్పారట. ఇక జగన్ చెప్పిన సమాధానం అర్ధంకానీ పీకే... మళ్లీ అడుగగా.. జగన్ మళ్లీ అదే సమాధానం చెప్పాడట.   అయితే గతంలో జగన్ జైలుకు వెళ్లినప్పుడు షర్మిలానే పాదయాత్ర చేసింది. అయితే జైలు నుండి బయటకు వచ్చిన తరువాత జగన్ సొంత చెల్లి అని కూడా చూడకుండా ఆమెను పక్కకు నెట్టేశారు. అంతేనా ఆమె ఎంపీ సీటు ఆశించినా అది కూడా జగన్ ఇవ్వలేదు. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా ఆమెకు సీటు ఇచ్చే అవకాశం లేదన్న సంగతి తెలిసిపోతుంది. మొత్తానికి జగన్ కు షర్మిల అంటే బాగనే భయం ఉన్నట్టు కనిపిస్తోంది. ఎక్కడ తనకు బాధ్యతలు ఇస్తే.. తన పవర్ ఎక్కడ తగ్గిపోతుందో అని భయపడి.. సొంత చెల్లిని కూడా పైకి రానివ్వడంలేదు. ఇంక మిగిలిన వారిని రానిస్తాడా..?

పవన్ డైలాగ్ చెబితే.. రాహుల్ కు తిరుగులేదు..

  పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ను రాహుల్ గాంధీ చెబితే.. రాహుల్ గాంధీకి ఇక రాజకీయ భవిష్యత్ లో ఎలాంటి డోకా ఉండదట. రాహుల్ గాంధీ ఏంటీ.. ? పవన్ డైలాగ్ చెప్పడం ఏంటీ... ?దానికి రాజకీయ భవిష్యత్ కు సంబంధం ఏంటీ..? అని అనుకుంటున్నారా..? అదేంటో తెలియాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగురోజుల పాటు ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే కదా. ఈ పర్యటనలో పవన్ చేసిన ప్రసంగాలు ఏపీ రాజకీయాల్లోనే వేడిని పుట్టిస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలపై పెద్ద పెద్ద డిబేట్ లే జరుగుతున్నాయి. ప్రజాసేవ కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని.. ఎలాంటి పదవులు, అధికారాలు తనకి అవసరం లేదని అన్నారు. అంతేకాదు.. ఆయన అభిమానులు పదే పదే సీఎం సీఎం అని అంటున్నా.. ఆ నినాదాలు వద్దని ఎక్కడికక్కడ ఫ్యాన్స్ కి క్లాస్ పీకుతున్నారు దీంతో కుర్చీ రాజకీయాలు మాత్రమే చూసిన వారికి ఈ వ్యవహారం మింగుడు పడడం లేదు. జనసేన కార్యకర్తలు సైతం పవన్ వాదనను ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక అవస్థ పడుతున్నారు.   అయితే ఇప్పుడు పవన్ చెప్పిన ఈ డైలాగ్ నే రాహుల్ చెబితే ఆయన రాజకీయ భవిష్యత్తు బావుంటుందని అంటున్నారు. ఈ విషయాన్ని..  సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్ చెబుతున్నారు. ప్రస్తుతం పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావాలంటే తమకు అధికారం వచ్చినా ప్రధాని పదవిని తాను తీసుకోకుండా అన్ని విధాలుగా అర్హుడైన వ్యక్తిని ఆ కుర్చీలో కూర్చోబెడతామని రాహుల్ చెప్పాలని థాపర్ సూచిస్తున్నారు. ఒకప్పుడు సోనియా గాంధీ కూడా ఇలాంటి మాటకు కట్టుబడి ఉండడం వల్లే యూపీఏ రెండు సార్లు విజయం సాధించిందని థాపర్ అభిప్రాయాన్ని తెలియజేశారు. అయితే థాపర్ అభిప్రాయంతో విభేదించేవాళ్లు కూడా లేకపోలేదు. ఇప్పటికే రాహుల్ మీద బాధ్యతలకు దూరంగా ఉంటాడని పేరుందని, ప్రధాని పదవి వద్దంటే చెడు సంకేతాలు జనంలోకి వెళతాయని కొందరి వాదన. మరి ప్రస్తుతానికైతే రాహుల్ గాంధీపై ఉన్న పప్పు అన్న ముద్ర మాత్రం తొలిగిపోయింది. కాస్త మెచ్చూరిటీతో మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నారు. మరి థాపర్ చెప్పినట్టు రాహుల్ ఆ నిర్ణయం తీసుకుంటాడో.. లేదో చూద్దాం...

అంబానీ కొడుకు పెళ్లి కార్డు ధర ఎంతో తెలుసా...?

  డబ్బు ఉన్నోళ్లు ఏం చేసినా సెన్సేషనే అవుతుంది కదా. వాళ్లు తిన్నా.. కూర్చున్నా... వాళ్సు వేసుకున్న డ్రస్ లు, కార్లు, ఇళ్లు అబ్బో ఇలా ఒకటేమిటీ ఏం చేసినా అది హాట్ టాపిక్ కే అవుతుంది. ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే... రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసం లేదు కదా. దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ ఆయన. ఆయన ఏం చేసినా ఓ సంచలనమే. గతంలో  27 అంత‌స్తుల భ‌వ‌నంతో సంచ‌ల‌నం రేపాడు. ఇక ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ వాడే న‌గ‌లు, స్లిప్ప‌ర్స్, దుస్తుల‌పై కూడా ఎన్నో సంచ‌ల‌న వార్తలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. గతేడాది జియో 4జీ నెట్ వ‌ర్క్‌తో సంచలనం రేపాడు. ఇప్పుడు తాజాగా.. మరో న్యూస్ బయటకు వచ్చింది. ఈసారి ముఖేష్ అంబానీ కుమారుడి పెళ్లి సంద‌ర్భంగా డిజైన్ చేసిన పెళ్లి కార్డు.   గతంలో గాలి జనార్ధన్ రెడ్డి తన కూతురు పెళ్లి కార్డును చాలా వెరైటీగా డిజైన్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అప్పుడు అది వైరల్ అయింది కూడా. ఇప్పుడు ముఖేష్ అంబానీ కుమారుడి పెళ్లికి డిజైన్ చేసిన పెళ్లి కార్డు హాట్ టాపిక్ అయింది. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు ఆకాష్ పెళ్లి త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నుంది. ఈపెళ్లి తేదీ ఎప్పుడన్నది వెల్లడికాలేదు కానీ.. సోషల్ మీడియాలో ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి కార్డు మాత్రం వైరల్‌గా మారింది. ఈ కార్డు ధర ఎంతో తెలిస్తే ఎవరికి అయినా మైండ్ బ్లాక్ అవ్వ‌డం ఖాయం. ఈ కార్డుకు అయ్యే ఖ‌ర్చుతో ఒక ఐఫోన్ ఎక్స్‌ను కొనచ్చట. అంటే కార్డు ధర దాదాపు లక్షన్నర. ఈ కార్డు తయారీలో బంగారాన్ని వినియోగించి అత్యద్భుతంగా తీర్చిదిద్దారట‌. దేశంలో ఉన్న ప‌లువ‌రు బ‌డా వ్యాపార‌వేత్త‌లు, రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌ధాన‌మంత్రితో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, గ‌వ‌ర్న‌ర్లు, ఎంపీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమందికి ఈ ఆహ్వానాలు అంద‌నున్నాయి. దీనిని బట్టి ముఖేష్ స్టామినా ఏంటో మ‌రోసారి తేట‌తెల్ల‌మైంది. మొత్తానికి పెళ్లి కార్డుతోనే అందరికీ షాకిస్తే.. ఇంక పెళ్లి ఏ రేంజ్ లో చేస్తాడో మరి..

నన్ను ఎలా తిట్టారో చూడండి...

  ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ నేత మణిశంకర్‌ అయ్యర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే కదా. ప్రధాని మోదీని ‘నీచ జాతికి చెందిన వ్యక్తి’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనికి గాను కాంగ్రెస్ పార్టీనే మణిశంకర్‌ అయ్యర్‌ పై సీరియస్ అయ్యి.. మోడీకి క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. ఈ క్రమంలో మణిశంకర్‌ అయ్యర్‌ కూడా మోడీకి క్షమాపణలు చెప్పారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది.అయితే కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన మణిశంకర్ తనపై చేసిన ‘నీచ్’ వ్యాఖ్యలతో ఢిల్లీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇక ఈ వ్యాఖ్యలపై స్పందించిన మోడీ..  గుజరాతీలకు జరిగిన అవమానమని, కాంగ్రెస్‌ నేతల మొఘల్‌ ఆలోచనకు ఇది ప్రతిరూపమని సూరత్‌ అన్నారు. ఎన్నికల్లో బీజేపీకి ఓటేయటం ద్వారా కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. అంతేకాదు ఇప్పుడు మరో అస్త్రాన్ని బయటకు తీశాడు మోడీ. వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ నేతలు తనను తిట్టిన తిట్ల జాబితాను సిద్దం చేశారు. లప్రస్తుతం గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నికోల్‌లో నిర్వహించిన ర్యాలీలో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల తిట్ల దండకాన్ని ప్రజల ముందు ఉంచారు. మోడీని కాంగ్రెస్ తిట్టిన తిట్లు మీరు కూడా చూడండి...  పాకిస్థాన్‌లో మణిశంకర్ అయ్యర్ మాట్లాడుతూ నన్ను తమ దారి నుంచి అడ్డు తొలగిస్తామన్నారు. *  కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఇతర నేతలు కూడా నన్ను ‘నీచ్’ అన్నారు. *  తక్కువ కులంలో పుట్టడం, పేద కుటుంబంలో జన్మించినందుకే వారు నన్ను అలా పిలుస్తున్నారు. * కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ నన్ను చాలా అసభ్యంగా పేర్కొంటూ ట్వీట్ చేశారు. అది చెప్పడానికి కూడా నోరు రావడం లేదు. * ఒక గుజరాతీ, పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడని దిగ్విజయ్ సింగ్ నన్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. * 'మోదీ సర్కారు రాక్షస రాజ్యం. మోదీ రావణుడు' అని దిగ్విజయ్ నన్ను అభివర్ణించారు. * మోదీ హిట్లర్, ముస్సోలిని, గడాఫీ.. అని యూపీ కాంగ్రెస్ హెడ్ ప్రమోద్ తివారీ అన్నారు. * మరో నేత నన్ను కోతి అన్నారు. * జైరామ్ రమేశ్ నన్ను భస్మాసురుడిగా అభివర్ణించారు. * బేణీ ప్రసాద్ వర్మ నన్ను పిచ్చి కుక్క అన్నారు. పిచ్చి కుక్కను గెలవనివ్వబోమని శపథం కూడా చేశారు. * ఇమ్రాన్ మసూద్ అయితే నన్ను ఖండఖండాలుగా నరుకుతానని అన్నారు. * రేణుకా చౌదరి నన్ను వైరస్ అన్నారు. * మొన్న అయ్యర్ నన్ను నీచ్ జాతి వ్యక్తినని అన్నారు.. అంటూ కాంగ్రెస్ నేతలు వివిధ సందర్భాల్లో తనను అన్న మాటలను బయటపెట్టారు. మొత్తానికి మోడీ.. చిన్నపిల్లాడు నన్ను తిట్టారనో.. కొట్టారనో పితురీలు చెప్పినట్టుగా నన్ను ఎలా తిట్టారో అని అందరికి చూపించడం బలే కామెడీగా ఉంది.

పవన్ ని అందుకే తెరమీదకు తెస్తున్నారా...?

  మేకపోతు గాంభీర్యం అంటే ఏంటో తెలుసు కదా..పైకి ఏదో ధైర్యంగా ఉన్నట్టు కనిపించినా.. లోపల మాత్రం భయంతో వణికిపోవడమే. ఇందుకు ఉదాహరణగా చెప్పడానికి ఈ సామెతను వాడుతుంటారు. ఇప్పుడు ఈ సామెత ఎందుకు వాడాల్సి వచ్చిందబ్బా అనుకుంటున్నారా. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి అలానే ఉంది కాబట్టి. ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకొని...పేలాల్సిందానికన్నా ఎక్కువ పేలుతూ... మాట్లాడాల్సిన దానికన్నా ఎక్కువ మాట్లాడుతూ నోరు కాస్త కంట్రోల్ లో కూడా పెట్టుకోవడం చేత కానీ నగరి ఎమ్మెల్యే రోజా మాటలు చూస్తుంటే పైన చెప్పిన సామెత గుర్తుకు రాకుండా ఉండదు. అసలు సబ్జెట్ ఏంటీ..సమస్యలు ఏంటీ.. ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు...ఇవేమీ అవసరం లేదు ఆమెకి. మాములుగానే ప్రతిపక్షం అన్నపేరు తప్ప.. ఆ ప్రతిపక్షం వల్ల ఇప్పటివరకూ ఒరిగింది ఏం లేదు. ఎంత సేపు అధికార పక్షంపై, చంద్రబాబుపై నోటికొచ్చినట్టు మాట్లాడమంటే మాత్రం ఫస్ట్ ఉంటారు. ఆ పైత్యాన్ని మరోసారి నిరూపించారు రోజా గారు.   పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ, అధికార పార్టీపై ఆరోపణలు చేస్తుంది కదా. ఈ క్రమంలోనే...వైసీపీ బ్యాచ్ అక్కడికి వెళ్లింది. రోజా గారు కూడా అక్కడికి వెళ్లారు. అయితే అక్కడ ఏం జరుగుతుందో…ఏంటో అర్ధం కాలేదు అనుకుంట…వెంటనే…వెన్నుపోటూ అంటూ షరా మామూలుగా కధ మొదలు పెట్టేశారు. అక్కడ ఏం జరుగుతుంతో చెప్పకుండా...జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అక్కడి వెళ్లడంపై.. దాని గురించి కామెంట్లు విసిరారు. పవన్‌ది “జనసేన” కాదు-“భజన సేన” అని…పవన్ కళ్యాణ్ మాటలకు, చేతలకూ పొంతన ఉండదనీ, చంద్రబాబు ఎప్పుడు అవినీతి లో ఇరుక్కున్నా, తెరమీదకు పవన్‌ కళ్యాణ్ ను తెచ్చి విషయాన్ని పక్కదోవ పట్టిస్తారని రోజా…దండకం మొదలు పెట్టారు…”అనుభవం లేని వ్యక్తి ముఖ్యమంత్రి అవకూడదని పవన్‌ కళ్యాణ్ అంటున్నారు. మరి పిల్లనిచ్చిన మామపై చెప్పులు విసిరి, వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కావొచ్చా? అని పాడిన పాటే పాడారు.   అసలు ఆమె వెళ్లింది ఎక్కడికి.. అక్కడ పనులు ఎంతవరకు వచ్చాయి.. ఇంకా ఎన్ని పనులు జరగాల్సి ఉంది... ఇలాంటి విషయాలు మర్చిపోయారు. ఎప్పటిలాగే పవన్ పై, చంద్రబాబుపై తిట్ల పురాణం ఎత్తుకున్నారు. దీంతో ఒక పక్క మీ నాయకుడి బాగోతం రోజుకొక్కటి బయటపడుతూ ఉంటే…చేస్తున్న యాత్రలు జనం లేక చప్పగా సాగుతుంటే…ఏం చెయ్యాలో అర్ధం కాక…ఇలా చవకబారు విమర్శలు చెయ్యడానికా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంది అని అభిప్రాయపడుతున్నారు. కాస్త వెళ్ళి ముందు మీ నియోజకవర్గంలో పరిస్థితులను అడిగి తెలుసుకోండి…ఎన్నికైన మూడున్నర ఏళ్లలో ఇప్పటివరకు పైసా పనికూడా చేయించని మీరు…చివర్లో మీ చేతగాని తనాన్ని కూడా ప్రభుత్వంపై నెట్టెయ్యాలని చూస్తున్నారా అని పలువురు  అనుకుంటున్నారు. మరి రోజా గారు ఇప్పటికైనా ఏం మాట్లాడుతున్నామో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడితే మంచిది...