తండ్రి పరువు తీస్తున్న జగన్...

  కొడుకు అనేవాడు ఎవరైనా తండ్రి పరువు నిలబెట్టేట్టు వుండాలి. అంతేగాని తండ్రి పరువు కాస్తా తీసే విధంగా వుంటే ఎంతమాత్రం బాగోదు. తన కొడుకు వల్ల తన పరువు పోతూ వుంటే ఏ తండ్రి మనసైనా బాధపడుతుంది. ఒకవేళ సదరు తండ్రి గారు ఏ పుణ్యలోకాల్లోనో వుండి వుంటే ఆత్మక్షోభతో అల్లాడిపోతాడు. వై.ఎస్.జగన్ తండ్రిగారైన వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారి ఆత్మ కూడా ప్రస్తుతం ఇలాగే క్షోభిస్తూ వుండొచ్చని ఒక అంచనా. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలని, జగన్ చేస్తున్న రాజకీయాలని చూస్తే  ఎవరికైనా ఇలాంటి అంచనాలు, ఆలోచనలు రాక మానవు.   తండ్రి బతికి వున్నంత వరకు తండ్రి చాటు బిడ్డలాగా చేయాల్సిందంతా చేసిన జగన్ ఆ మహానేత కన్నుమూసిన దగ్గర్నుంచి రాజకీయంగా సొంత తెలివితేటలు ఉపయోగించడం ప్రారంభించాడు. కాకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకూ జగన్ చేస్తున్న రాజకీయాలు ఆయనకే బెడిసి కొడుతూ వచ్చాయి తప్ప అప్పట్లో అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీకి గానీ, ఇప్పుడు అధికారంలో వున్న చంద్రబాబుకు గానీ ఎలాంటి ఇబ్బందీ కలిగించలేకపోతున్నాయి. మొన్నటి ఎన్నికల ద్వారానే ముఖ్యమంత్రి అయిపోతానని కలలు కన్న జగన్ దారుణంగా షాకవ్వాల్సి వచ్చింది. వచ్చే  ఎన్నికలలో అయినా అధికారం చేజిక్కించుకుని తీరాలన్న ఉద్దేశంతో జగన్ చేయని పని లేదు. అధికార పక్షం మీద చేయని ఆరోపణ లేదు.. చల్లని బురద లేదు.. తిట్టని తిట్టు లేదు. అయినప్పటికీ జగన్‌ని ప్రజలు విశ్వసించడం లేదు. రాజకీయ వ్యూహాలు పన్నడంలో, తాను పన్నిన వ్యూహాల ద్వారా విజయాలు సాధించడంలో దిట్ట అయిన వైఎస్సార్ కుమారుడు ఇలా రాజకీయంగా నిరంతరం ఫెయిలవుతున్నాడు. కచ్చితంగా ఫెయిలయ్యే వ్యూహాలు పన్నుతూ అభాసుపాలైపోతున్నాడు.   ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరుపుతున్న పాదయాత్రనే చూడండి... జనం నుంచి ఎలాంటి స్పందన లేకుండా అరకొర జనాలతో జరుగుతున్న పాదయాత్రగా ఇప్పటికే బాగా పబ్లిసిటీ వచ్చేసింది. పాదయాత్ర చేస్తున్న జగన్ని చూస్తుంటే ఒక్కసారి పాపం అని జాలి కూడా కలుగుతోంది. ఆరోజుల్లో వైఎస్సార్ పాదయాత్ర చేస్తే ఎలా వుండేది? ఒక గంభీరమైన నది ప్రవహిస్తున్నట్టు వుండేది. సింహం నడిచొస్తున్నట్టు వుండేది. ఆయన ప్రసంగాలు జనం చెవుల్లో మార్మోగేవి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మాత్రమే కాకుండా సామాన్య జనం కూడా వైఎస్సార్ వెంట మైళ్ళకు మైళ్ళు నడిచారు... అంత గొప్పగా పాదయాత్ర చేశారు కాబట్టే ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొట్టగలిగారు. మరి ఇప్పుడు జగన్ చేస్తున్న పాదయాత్రో... ఎందుకులే.. చెప్పుకుంటే సిగ్గుచేటు. తన కుమారుడు ఈ తరహాలో చప్పచప్పగా పాదయాత్ర చేస్తూ వుండటం పైలోకాల్లోంచి చూస్తూ వైఎస్సార్ ఎంత ఆత్మక్షోభ అనుభవిస్తున్నారో ఏంటో!

కేసీఆర్ పిలవలేదు... కానీ చంద్రబాబు

  ఎక్కడ నెగ్గాలో కాదు... ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పవాడు అని ఓ సినిమాలో డైలాగ్ గుర్తుంది కదా. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును చూస్తే ఆ డైలాగ్ గుర్తుకువస్తుంది. దీనికి కారణం లేకపోలేదు. రాష్ట్ర విభజన జరిగిపోయి ఇప్పటికి నాలుగేళ్లు అయిపోయింది. ఏదో విడిపోయినప్పుడు.. విడిపోయినా తెలుగు ప్రజలు అన్నాదమ్ముళ్లు, అక్కా చెల్లెళ్లలాగానే కలిసి ఉందామని... విడిపోయినా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ ఒక్కటే అని ఎన్నో మాటలు చెప్పారు. చెప్పడానికైతే చెప్పారు కానీ.. అవన్నీ మాటలే అని చాలాసార్లే నిజమైంది. ఇంకా తెలంగాణ, ఆంధ్ర మధ్య అక్కడక్కడా విభేదాలు, వైరుధ్యాలు పొడసూపుతునే వున్నాయి.    ఇక సామాన్య ప్రజల సంగతేమో కానీ.... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే బహిరంగంగా చెప్పకనే చెప్పారు చాలాసార్లు. ఇటీవల జరిగిన రెండు సంఘటనలే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. అమరావతి శంకుస్థాపన సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా కేసీఆర్ ఇంటికి వెళ్లి.. ఆహ్వానించారు. కానీ ఇటీవల హైదరాబాద్ వేదికగా అట్టహాసంగా జరిగిన “ప్రపంచ తెలుగు మహాసభలు“ కు మాత్రం చంద్రబాబును పిలవలేదు. ఈ సభల కోసం దేశవిదేశాల ప్రముఖులకు ఆహ్వానాలు పంపిన కెసిఆర్... తెలుగు మహాసభలు అని పేరు పెట్టుకొని పక్కన ఉన్న తెలుగు రాష్ట్ర సీఎం అయిన చంద్రబాబును పిలవలేదు. అయితే ఈ విషయంలో మాత్రం కేసీఆర్ కు విమర్శలు పెద్ద ఎత్తునే వచ్చాయి. తెలుగు సభలు అని పేరు పెట్టుకొని ఎక్కడో ఉన్న వాళ్లని పిలిచారు కానీ.. పక్కన ఉన్నసీఎంను మాత్రం పిలవలేదని... కావాలనే కేసీఆర్ పిలవలేదని విమర్శలు గుప్పించారు. దీంతో మేము పిలవాలి అనుకున్నా బాబు బిజీగా ఉంటారని తెలుసుకుని పిలవలేదని ఏదో కలరింగ్ ఇచ్చారు.   అయితే చంద్రబాబు మాత్రం కేసీఆర్ చేసిన తప్పు చేయలేదు. విజయవాడలో ఓ భారీ బుక్ ఫెస్టివల్ జరుగుతోన్న నేపథ్యంలో... కవుల్ని సత్కరించాలని నిర్ణయించారు. దీనికి గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పలువురు కవులకు ఆహ్వానాలు పంపారు. అయితే ప్రపంచ తెలుగు మహాసభల అనుభవంతో తెలంగాణ కవులకు ఆహ్వానాలు ఉండవని అంతా భావించారు. ఆ అంచనాలు తల్లకిందులు చేస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ కవులు, రచయితలకు పిలుపులు వెళ్లడంతో షాక్ కు గురయ్యారట. ఈ నేపథ్యంలో కెసిఆర్ పిలవకపోయినా బాబు పిలిచి మరీ సత్కరించడం చూసి చాలా మంది బాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కొందరు మాత్రం.... కొందరు ఆంధ్ర వాళ్ళు అంత అవసరం ఏంటని ప్రశ్నిస్తుంటే, ఇంకొందరు మాత్రం పెద్దరికం నిలుపుకున్నారని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు.

నిన్నటి దాకా జయలలిత... ఇప్పుడు ఐశ్వర్యరాయ్..

  ఈ మధ్య తాము సెలబ్రిటీల కూతుళ్లమనో... కొడుకులమనో చెప్పుకొని ఫేమస్ అవ్వాలని చూస్తున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. గతంలో తాను మెగాస్టార్ చిరంజీవి కొడుకునని రవీందర్ అనే యువకుడు చాలా హంగామా చేశాడు. నేను ఆయన కొడుకునేనంటూ ఏకంగా డీఎన్‌ఏ టెస్టులు చేసుకోవాలంటూ ఓ బంపరాఫర్ కూడా ఇచ్చాడు. ఇక ఆ తరువాత ఆ ఎపిసోడ్ అలా ముగిసింది. గత కొద్దికాలంగా జయలలిత వారసుల విషయంలో కూడా పెద్ద డ్రామానే నడుస్తుంది కదా. తాను జయలలిత కొడుకు అని ఓ వ్యక్తి తెరపైకి వచ్చి..అడ్డంగా బుక్కయి జైలు శిక్ష అనుక్షవిస్తుండగా.. తాను జయలలిత అసలైన వారసురాలినని.. అమృత అనే ఓ మహిళ బయటకు వచ్చింది. ఈమె కూడా డీఎన్‌ఏ టెస్టులకు రెడీ అంటూ ఆఫరిచ్చిందనుకోండి. ఇవన్నీ ఒక ఎత్తైతే... ఇక ఇప్పుడు ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ వంతు వచ్చింది. ఇప్పుడు తాను ఐశ్వర్యరాయ్ కొడుకునని తెరపైకి వచ్చాడు. విశాఖ యువకుడిగా చెప్పుకుంటున్న ఓ 29 ఏళ్ల కుర్రాడు సంగీత్ కుమార్ ఐశ్వర్య తన తల్లి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించి ఓ వీడియో ఇప్పుడు నెట్లో హల్ చల్ చేస్తోంది.    ఇంతకీ వీడియోలో ఆ కుర్రాడు ఏం చెప్పాడో తెలుసా... 'నేను ఇన్‌విట్రో ఫర్టిలైజేషన్‌ (ఐవీఎఫ్‌) ద్వారా 1988లో లండన్లో జన్మించా. ఐశ్వర్య తల్లిదండ్రులు కృష్ణరాజ్‌ రాయ్‌, వ్రిందా రాయ్లు రెండేళ్లపాటూ నన్ను పెంచారు. నా తండ్రి అడివేలు రెడ్డి తర్వాత నన్ను విశాఖపట్నం తీసుకువచ్చాడు. అప్పటి నుంచి విశాఖలోనే ఉండాల్సి వచ్చింది. నా తల్లి నుంచి దూరమై ఇప్పటికి 27 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు నా తల్లితో ఉండాలనుకుంటున్నా. ఐష్ నా తల్లి అని నిరూపించడానికి నా దగ్గర ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవు. ఆ డాక్యుమెంట్లను నా కుటుంబ సభ్యులు నాశనం చేశారు అని చెప్పాడు. అంతేకాదండోయ్ ప్రపంచానికి తెలియని ఓ నిజాన్నికూడా చెప్పాడు ఆ కుర్రాడు. ఇప్పుడు ఐష్, అభిషేక్లు కలిసి ఉండటం లేదట. వారిద్దరూ సెపరేట్ అయ్యారంటూ మరో బాంబు పేల్చాడు. ఇక ఈ వార్తపై ఎలా స్పందించాలో తెలియక కొంతమంది అయోమయంలో పడితే... ఐష్ అభిమానులు మాత్రం.. ఈ వార్తలను చూసి నవ్వుకుంటున్నారు. మరి అసలు ఐశ్వర్య దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందో.. చూడాలి.

ఇదెక్కడి విడ్డూరం అంబటి గారు...

  ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్టు అన్న సామెత ప్రకారం... ఎక్కడో విజయవాడలోని దుర్గ గుడిలో పూజలు జరిగితే.. దానికి.. చంద్రబాబుకు లింకు పెట్టడం విడ్డూరంగా ఉంది. ఇంతకీ లింక్ పెట్టింది ఎవరనుకుంటున్నారా...? ఇంకెవరూ ఎప్పుడు సందు దొరుకుతుందా... ఎప్పుడు చంద్రబాబుపై విరుచుకుపడదామా అని చూసే వైసీపీ బ్యాచ్. ఆ బ్యాచ్ లో రోజా, అంబటి లాంటి వాళ్లు మరీ.. మైకు దొరికితే చాలు.. రెచ్చిపోయి మరీ మాట్లాడుతుంటారు. అయితే ఈ సారి అంబటి ఆ ఛాన్స్ తీసుకున్నాడు. లోకేష్‌ను సీఎం చేసేందుకే దుర్గ గుడిలో తాంత్రిక పూజలు చేయించారు అంటూ కాకమ్మ కధలు చెప్పేశారు… బెజవాడ కనకదుర్గ గుడిలో తాంత్రిక పూజలు జరినట్టు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. డిసెంబరు 26వ తేదీన అమ్మవారి ఆలయంలో తాంత్రిక పూజలు జరిగాయని.. ఆలయానికి సంబంధించిన ఓ అధికారి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయని బయటపడింది. ఇక దీనిపై ఈవో సూర్యకుమారి మాట్లాడుతూ.. అలాంటివి ఏం జరగలేదు అని అంటున్నా.. ఈ మధ్య కాలంలో తనకు తగులుతున్న ఎదురుదెబ్బల నుంచి బైటపడేందుకు సూర్యకుమారే తాంత్రిక పూజలు జరిపించారని పాలకమండలి కమిటీలోని కొందరు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ వివాదంపై దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు స్పందించి..ఈ వివాదంపై  సూర్యకుమారితో మాట్లాడానని..భద్రీనాథ్‌తో వచ్చిన వ్యక్తిని కృష్ణాజిల్లా విశ్వనాథపల్లి ఆలయ అర్చకుడు రాజాగా గుర్తించామని ఆయన చెప్పారు. అయితే రాజాను గుడిలోకి తీసుకువెళ్లడం తప్పని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలకు ఆదేశించామని తెలిపారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. ఎప్పటిలాగే ఈ వివాదంపై కూడా స్పందించారు అంబటి గారు. స్పందించి.. చాలా విచిత్రమైన వ్యాఖ్యలే చేశారు. చంద్రబాబు నాయడు తనయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్‌ను సీఎం చేసేందుకే దుర్గ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయని అర్దంపర్దంలేని వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పూజ చేస్తూ దొరికిపోయిన తర్వాత ఆ తప్పును అధికారులపై నెట్టేయడానికి యత్నిస్తున్నారని.. తను చూసినట్టే చెప్పుకొచ్చారు. మరి విడ్డూరం కాకపోతే ఏదో విమర్శలు చేయాలని కాకపోతే ఏంటి అంబటి మాట్లాడే మాటలు. దుర్గ గుడిలో తాంత్రిక పూజలు జరిగినందుకు కూడా చంద్రబాబే కారణమని ఇలాంటి మాటలు మాట్లాడటం మాంచి కామెడీగా ఉంది. విమర్శలు చేసినా కాస్త నలుగురు నమ్మేలా ఉండాలని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. అలా తాంత్రిక పూజలు చేస్తేనే సీఎం అయితే.. ఎన్నికలు ఎందుకు.. ఓట్లేయడం ఎందుకు. అంతేనా.. అలా పూజలకే సీఎం అయిపోతే.. జగన్ పాదయాత్రలు మానేని.. ఇప్పటికీ ఎన్ని పూజలు చేసేవాడో అని జనం అనుకుంటున్నారు.

బాబు సస్పెన్స్ లో పెట్టిన ఆ వ్యక్తి ఎవరు..?

  ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితనం గురించి అందరికీ తెలిసిందే. ముందు చూపుతో ఆలోచించాలన్నా... ఏదైనా అభివృద్ది చేయాలన్నా... అనుకున్నది సాధించాలన్నా ఆయనకే సాధ్యం. అందుకే ఆయన పనితనాన్ని పత్యర్ధులు సైతం పొగిడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఆయనకు కలిసిరావడం లేదు.  ఒకపక్క రాష్ట్రం విడిపోయి.. ఆర్ధిక కష్టాల్లో ఉంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం... చాలి చాలని నిధులు విదుల్చుతూ.. ఏవో కుంటిసాకులు చెబుతూ ఆయన్ని కష్టపడెతూనే ఉంది. అయినా కూడా మొక్కవోని దీక్షవోలే... ఏపీ అభివృద్ది కొరకు అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నారు. రాష్ట్రానికి, కొత్త ప్రాజెక్టులు, పరిశ్రమలు తీసుకురావడానికి... ప్రయత్నిసున్నారు. కానీ ఏం లాభం.. కేంద్ర ప్రభుత్వం పుణ్యమా అని సగం ప్రాజెక్టులు పెండింగుల్లోనే ఉన్నాయి. ఏదోలా కష్టపడి పోలవరాన్ని అయినా పూర్తి చేద్దామనుకుంటుంటే... దానికి కూడా పుల్ల పెట్టింది. అందుకే కేంద్రం ఎన్ని చేసినా.. ఎంత సతాయించినా సైలెంట్ గా ఉన్న చంద్రబాబు...పోలవరం విషయంలో మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు.   అంతేకాదు ఇప్పుడు తాజాగా మరోసారి ప్రాజెక్టులు లేట్ అవ్వడంపై స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు... ప్రాజెక్టుల పూర్తి విషయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు...మేము ఎంతో గ్రౌండ్ వర్క్ చెయ్యటం, ఆ ప్రాజెక్ట్ విషయంలో 99.9 శాతం మంది ప్రజలు సహకరించటం, చివర్లో ఒకడు వెళ్లి కేసు వెయ్యటం, ప్రాజెక్ట్ లేట్ అవ్వటం... ఇదే జరుగుతుందని అన్నారు. దానికి గాను ఆ అడ్డుకునే వ్యక్తి ఎవరు సార్...? ప్రతి ప్రాజెక్ట్ లో అడ్డుపడుతుంది ఒక్కరేనా సార్ ? దీంట్లో రాజకీయ ప్రయోజనం ఉంది అంటారా అని అడగగా, చంద్రబాబు స్పందిస్తూ, ఆ ఒక్కరూ ఎవరో మీకు తెలుసుగా అని బదులు ఇచ్చారు.. సమాజంలో అంతా బాగుంటే ఓర్వలేనివారు, అత్యాశపరులు కొందరుంటారు... వారే ఇలాంటివి చేస్తారు అని అన్నారు. అయితే ఆ ఒక్కరు ఎవరూ అనే విషయాన్ని... చంద్రబాబు నోటితో చెప్పించాలని విలేకరులు చాలా ప్రయత్నించారట... కానీ చంద్రబాబు మాత్రం, పేరు బయటకు చెప్పకుండా, అతను ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసులే అని అన్నారట. మొత్తానికి చంద్రబాబు ఓ వ్యక్తి ఎవరో చెప్పకుండా మంచి సస్పెన్స్ లో పెట్టారు. ఇంతకీ చంద్రబాబు సస్పెన్స్ లో పెట్టిన  ఆ వ్యక్తి ఎవరో మీకు అర్దమైందా...?

మోడీ, షాను టెన్షన్ పెడుతున్న వెంకయ్య.... రబ్బర్ స్టాంప్ అనుకున్నారేమో..

  కేంద్రం నుండి ఇప్పటివరకూ అందరి సంగతేమో కానీ.. మన రాష్ట్రానికి కాస్తో, కూస్తో సపోర్ట్ గా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క వెంకయ్యనాయుడని చెప్పడంలో ఎలాంటి సందేహం పడాల్సిన అవసరంలేదు. రాష్ట్రానికి కాస్త పెద్ద దిక్కుగా ఉండేవారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ, రాష్ట్రానికి చేతనైంది చేసేవారు వెంకయ్య నాయుడు... మంత్రిగా ఉన్నప్పుడు, తన సొంత శాఖలోనే కాదు, మిగతా శాఖల్లో కూడా రాష్ట్రానికి అధిక కేటాయింపులు వచ్చేలా చూసేవారు. ఆయనను కాస్త మోడీ, అమిత్ షాలు కలిసి ఉపరాష్ట్రపతి పదవి కట్టబెట్టి.. ఏదో పెద్ద పదవి ఇస్తున్నాం అని కలరింగ్ ఇస్తూ.. చాలా సైలెంట్ గా పక్కన పెట్టారు. వెంకయ్యనాయుడిని కావాలనే సైడ్ చేశారని ఆ మధ్య వార్తలు కూడా బాగానే వినిపించాయి.   ఇక ఉపరాష్ట్రపతి కదా.. పెద్దగా చేసేది ఏం ఉండదులే అని అనుకున్నారు మోడీ, షా. కానీ వాళ్లకి దిమ్మతిరిగేలా చేశారు వెంకయ్య. ఎదో రబ్బర్ స్టాంప్ లా ఉంటాడులే.. రాజ్యసభని మైంటైన్ చేయటం వరకే ఉంటారు.. అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేలు పెట్టరు అనుకున్నారు... కాని ఇప్పుడు అంతా రివర్స్ లో జరుగుతుంది... కొన్నాళ్ళ వరకు సైలెంట్ గా ఉన్న వెంకయ్య, మళ్ళీ పాత ఫార్మ్ లోకి వచ్చారు... టైం దొరికితే రాష్ట్రానికి వచ్చేస్తున్నారు... 15 రోజుల టైం గ్యాప్ లో, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి, రాష్ట్రంలో మూడు కార్యక్రమాల్లో పాల్గున్నారు...అంతే కాదు, ఉప రాష్ట్రపతి హోదాలో రాష్ట్రానికి సంబంధించిన కీలక పనుల పై రివ్యూ చేస్తున్నారు... కేంద్ర మంత్రుల్ని, సీనియర్ అధికారులని పిలిపించుకుని అన్ని విషయాల పై చర్చించారు... పోలవరం పై సమీక్ష చేశారు... కడప జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన ఉక్కు పరిశ్రమ పై రివ్యూ చేసారు.   ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పరిస్థితి ఒకలా ఉండేది. ఇప్పుడు ఉపరాష్ట్రపతి కావడంతో.. ఎవరైనా ఆయన దగ్గరకు రావాల్సిందే. దీంతో మోడీ, షా ఇద్దరూ... తలలు పట్టుకొని కూర్చున్నారట. అసలు ఏపీ విషయంలో వేలు పెట్టకుండా ఉంటారనే ఆయనికి ఉపరాష్ట్రపతి కట్టబెట్టి సైడ్ చేస్తే.. ఇప్పుడదే కొంపముంచిదేమో అని ఫీలవుతున్నారుట. మొదటి నుండి ఏపీ విషయంలో కాస్త చిన్న చూపు చూనే మోడీ.. నిధులు, ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబును ఇబ్బంది పెడుతుంటే... వెంకయ్య మళ్లీ ఫామ్ లోకి రావడం..ఏపీపై దృష్టి పెట్టడం చూసి.. కక్కలేక మింగలేక అన్నట్టు అన్న సామెత ప్రకారం... ఇద్దరూ బయటకు చెప్పలేక.. లోలోపల దాచుకోలేక.. ఆ బాధను తమలోనే దాచుకుంటున్నారట. మొత్తానికి హనుమంతుడి ముందు కోతి కుప్పి గంతులు వేస్తే ఎంత కామెడీగా ఉంటుందో... అలా రాజకీయాల్లో ఆరి తేరిన వెంకయ్య దగ్గర ఇలాంటి నాటకాలు ఆడితే అలానే ఉంటుంది మరి..

ఇలా బుక్కయ్యావేంటి పవన్...

  రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని ఎవరు చెప్పారో కానీ.. మహానుభావుడు ఆయన చెప్పింది మాత్రం నిజమే. ఎంతో అనుభవం లేకపోతే కానీ ఇలాంటి సూక్తులు బయటకు రావు. ఇప్పుడు రాజకీయాల గురించి ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటారా..? అక్కడే ఉంది మరి అసలు స్టోరీ. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఏపీ ప్రజలను తిట్టినందుకు తాను 11 రోజులు అన్న తినకుండా మానేసానని... చాలా బాధేసిందని చెప్పింది ఎవరో గుర్తొచ్చింది కదా. అదేనండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అంతేకాదు ఓ సభలో పవన్ మాట్లాడుతూ ‘ఏయ్.. కేసీఆర్ నీ తాట తీస్తా’ అని కూడా అన్నాడు. ఇక దానికి అసలే మాటలపుట్ట అయిన కేసీఆర్ ఊరుకుంటాడా.. ‘ఆడి పేరేందిరా బై’ ఎవడో పవన్ కళ్యాణ్ అంట.. ఆడేవడో నాకు తెలీదు.. అని కేసీఆర్ గారు చాలా పద్దతిగా పవన్ పై కామెంట్లు చేశారు. కట్ చేస్తే.. ఇప్పుడు కేసీఆర్ పవన్ కళ్యాణ్ భేటీ హాట్ టాపిక్ గా మారింది. అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ వీరిద్దరి భేట హాట్ టాపిక్ గా మారింది.   ఇక్కడి వరకూ అంతా బాగనే ఉంది. ఎవరి రాజకీయ అవసరాలు వాళ్లవి. ఈరోజు తిట్టుకోని... రేపు కలుసుకోవలం రాజకీయ నాయకులకు మామూలే. కానీ ఈ భేటీలో పవన్ మాట్లాడిన మాటలే కాస్త విడ్డూరంగా అనిపించాయి అంటున్నారు ఏపీ రాజకీయ విశ్లేషకులు. అంత విడ్డూరంగా పవన్ ఏం మాట్లాడాడబ్బా అనుకుంటున్నారా..? ఏంటంటే.... ఆంధ్రప్రదేశ్ లో సమస్యల పరిష్కారానికి, తెలంగాణా నాయకుల స్పూర్తిని తీసుకోవాలంట. కెసిఆర్ ఎలా పోరాడాడో ఆంధ్రా వారు ఆదర్శంగా తీసుకోవాలంట. ఈ మాటలే ఇప్పుడు ఆంధ్రా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కేసీఆర్ ని ఆంధ్రపాలకులు ఆదర్శంగా తీసుకోవాలనటం పవన్ అవివేకమే అంటున్నారు. అయినా ఏదో కేసీఆర్ పోరాడినందుకు రాష్ట్రాన్ని ఇవ్వలేదు.... సోనియా తన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఈ విషయం... అందరికీ తెలుసూ.. పవన్ ఇలా మాట్లాడటం చాలా కామెడిగా ఉంది అని అంటున్నారు. బహుశా ఆంధ్రుల ఉద్యమ స్ఫూర్తి గురించి సరైన అవగాహన పవన్ కు లేక మాట్లాడినట్టు ఉన్నారు.. తెలంగాణ కన్నా యాభై ఏళ్ళ ముందే అప్పటి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి , ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకున్న విజయం ఆంధ్రులది..మరి ఎన్నో పుస్తకాలు చదువుతా అని చెబుతారు..ఆంధ్రుల గురించి పవన్ ఎక్కడా చదవలేదా అని కూడా కామెంట్లు విసురుతున్నారు. మొత్తానికి  కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కు కూడా ఇప్పుడిప్పుడే రాజకీయనీళ్లు వంటపడుతున్నట్టు ఉన్నాయి. అందుకే ఎక్కడ పాడాల్సిన పాట అక్కడ పాడటం నేర్చుకుంటున్నారు. రాజకీయాల్లో ఇవన్నీ కామన్ అనుకోండి. పాపం పవన్ కు కొంచం కొత్త కదా... అందుకే ఇలా మాట్లాడి దొరికిపోయాడు. మాట్లాడితే మాట్లాడాడు... ఏపీ ప్రజలకు కోపం వచ్చేలా మాట్లాడి బుక్కయ్యాడు.. మరి దీన్ని ఎలా కవర్ చేసుకుంటాడో చూద్దాం...

పవన్‌కి ఇన్నాళ్ళకి తెల్లారింది

  పవన్ కళ్యాణ్‌కి పార్టీ పెట్టిన ఇన్నాళ్ళకి తెల్లారినట్టుంది. పార్టీ నిర్వహణ పరంగా ఇంతకాలం మొద్దు నిద్ర పోయిన ఆయన ఇప్పుడిప్పుడే నిద్రలేచి మెల్లగా ఆవలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన మనసులో వున్న రాజకీయపరమైన కోరికలు బయటపెట్టి చాలా సంవత్సరాలు అవుతోంది. అప్పటి నుంచి ఆయన జనసేన పార్టీలో ఏక్ నిరంజన్‌లాగా కొనసాగుతున్నారు. మధ్యలో ఇతరుల పేర్లు రెండు మూడు వినిపించినప్పటికీ ఆ తర్వాత వాళ్ళు సైడైపోయారు. పవన్ కళ్యాణ్ మళ్లీ తానే కర్త, కర్మ, క్రియలాగా పార్టీని కొనసాగించారు. పార్టీలో మరో నాయకుడనేవాడు లేకుండా అన్నీ తానే అన్నట్టుగా ఇంతకాలం వ్యవహరించారు. పార్టీ అనేది ఒక్కరితో నడవదు. పార్టీ మాత్రమే కాదు.. సినిమా అనేది కూడా ఒక్కరితో నడవదు. ఇన్ని సినిమాల్లో యాక్ట్ చేసిన పవన్ కళ్యాణ్ సినిమాల్లో మాత్రం చాలామంది చేత వర్క్ చేయిస్తున్నారు. పార్టీ విషయానికి వస్తే మాత్రం అన్నీ తానై నడుపుతూ వచ్చారు. ఏదైనా సినిమాకి హీరో దగ్గర్నుంచి లైట్ బోయ్ వరకూ అన్ని శాఖలూ ఒకే వ్యక్తి నిర్వహిస్తే ఎంత ఎటకారంగా వుంటుందో పవన్ కళ్యాణ్ పార్టీ నిర్వహణ కూడా అంతే ఎటకారంగా తయారైంది. జనసేన మీద ఇప్పటి వరకూ ప్రజల్లో సరైన అభిప్రాయం కలగకపోవడానికి ప్రధాన కారణం ఆ పార్టీలో సంస్థాగత నిర్మాణం ఎంతమాత్రం లేకపోవడమే. తాను తప్ప మరొకరు పార్టీ తరఫున లైమ్‌లైట్‌లోకి రాకుండా చేయడం అనేది పవన్ కళ్యాణ్ చేసిన తప్పిదాలలో ఒకటని రాజకీయ పరిశీలకులు ఎప్పటినుంచో చెబుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పార్టీ పెట్టానని చెప్పే పవన్ కళ్యాణ్ తన పార్టీలోనే ప్రజాస్వామ్యాన్ని అమలు చేయడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పార్టీ కోసం స్క్రిప్ట్ రైటర్ల కోసం వెతికే శ్రద్ధ పార్టీలో కార్యకర్తలు, నాయకులను పెంచుకునే అంశం మీద పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టకపోవడం వింతగా అనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతూ వచ్చారు.   ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే పనిలో పడ్డారు. నూతన సంవత్సరం ముందు రోజున పార్టీ కార్యకర్తల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఉరుములేని పిడుగులా పవన్ కళ్యాణ్‌కి పార్టీని బలోపేతం చేయాలన్న ఉత్సాహం రజనీకాంత్ కారణంగానే వచ్చిందని పరిశీలకులు భావిస్తున్నారు. అవతల తమిళనాడులో ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి వస్తాను... రాను అంటూ ఊరించిన రజనీకాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దూకేశారు. సహజంగానే జనాల్లో పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ ఫాలోయింగ్ వున్న రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశ ప్రకటన రాజకీయాల్లో సంచలనం కలిగించింది. రజనీకాంత్‌కి రాజకీయంగా సడెన్‌గా ఆకర్షణ పెరిగిపోయింది. రజనీ పార్టీ ఈసారి ఎన్నికలలో అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా వున్నాయన్న లెక్కలు కూడా బయటకి వచ్చేశాయి. అయితే రజనీ రాజకీయ రంగ ప్రవేశం విషయంలో ఇంత పాజిటివ్ రియాక్షన్ వచ్చింది... తాను నడుపుతున్న రాజకీయాలకు మాత్రం అంత రేంజ్‌లో పాజిటివ్ రియాక్షన్ రాలేదేంటా అని పవన్ కళ్యాణ్ ఆలోచనలో పడిపోయినట్టు సమాచారం. పొరుగు రాష్ట్రంలో స్టార్ పార్టీ ప్రకటించగానే ఇంత పొలిటికల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. తాను మాత్రం ఇంతకాలంగా దేకుతున్నా అంత క్రేజ్ అంతగా రాకపోవడం పవన్ కళ్యాణ్ ఫీలయ్యే విషయమే కదా... అందుకే పక్క రాష్ట్రం రాజకీయాలను చూసి ఉత్సాహం తెచ్చుకుని తాను కూడా పొలిటికల్‌గా ఒక కీలకమైన స్టెప్ వేశారు. పోనీలెండి.. ఇప్పటికైనా కార్యకర్తల నమోదు ప్రారంభించారు.. సంతోషం.

పాక్‌తో క్రికెట్ ఇక లేనట్లే-సుష్మాస్వరాజ్

భారత్-పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించాలని గట్టి ప్రయత్నాలు జరుగుతుండగా భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌తో భారత్ ఎప్పటికీ క్రికెట్ మ్యాచ్‌లు ఆడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. గత కొద్దిరోజులుగా దాయాదీ దేశం తరచూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది. ఈ ఘటనల్లో సైనికులతో పాటు సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు..   దీనికి తోడు కొద్దిరోజుల క్రితం కుల్‌భూషణ్ జాదవ్‌ని కలిసేందుకు వెళ్లిన ఆయన తల్లి, భార్యల పట్ల పాక్ అత్యంత అవమానకరంగా ప్రవర్తించింది. దీంతో భారతప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పార్లమెంట్ సాక్షిగా పాక్‌ తీరుపై మండిపడ్డారు. తాజాగా ఇవాళ ఓ సమావేశంలో మాట్లాడిన ఆమె ఆ దేశంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ఆడేది లేదని స్పష్టం చేశారు. తటస్థ వేదికల్లోనూ ఇరు దేశాల మధ్య మ్యాచ్‌లు జరగవని అన్నారు. ఇందుకు తగ్గట్టుగానే గ్లోబల్ టోర్నమెంట్లలోనూ ఇరుదేశాలను ఒకే గ్రూపులో పెట్టొద్దని బీసీసీఐ గతంలోనే ఐసీసీని కోరింది. మరోవైపు సుష్మ ప్రకటనతో క్రికెట్ ప్రేమికుల్లో కలవరం మొదలైంది.  

రోజాను భయపెడుతుంది ఎవరో తెలుసా...?

  వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా చాలా డేరింగ్ అండ్ డాషింగ్ అంటుంటారు. అంతేకాదు ఆమె నోటికి కూడా చాలా భయపడుతుంటారు. అలాంటిది ఇప్పుడు రోజానే ఓ వ్యక్తికి భయపడుతున్నారట. రోజాని అంతలా భయపెట్టిన వ్యక్తి ఎవరు..? రోజా అంతలా భయపడుతున్న ఆ వ్యక్తి ఎవరబ్బా అనుకుంటున్నారా..? ఎవరో కాదు...  టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్ గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు కొడుకు గాలి భానుప్రకాష్. గత ఎన్నికల్లోనే వైసీపీ నుండి పోటీ చేసిన రోజా పెద్ద మెజార్టీతో ఏం గెలవలేదు. గాలి ముద్దుకృష్ణమ నాయుడిపై పోటి చేసిన రోజా...ఏదో చావుత‌ప్పి కన్నులొట్ట‌బోయిన‌ట్టు కేవ‌లం 800 ఓట్ల స్వ‌ల్ప మెజార్టీతో గెలిచింది. ఇక గెలిచి ఈ మూడేళ్లలో ఆమె నియోజక వర్గానికి చేసింది ఏదైనా ఉందీ అంటే.. చెప్పుకోవడానికి ఏం లేదు. నియోజ‌క‌వ‌ర్గానికి చేసిందేమీ లేదు… పోని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అయినా అందుబాటులో ఉంటున్నారా ? అంటే అదీ లేదు.   ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ అవుతోన్న గాలి వార‌సుడు గాలి భానుప్ర‌కాష్ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తి గ్రామాన్ని చుట్టి వ‌స్తున్నారు. ఇంటింటికి టీడీపీని ఒంటి చేత్తో స‌క్సెస్ చేసిన ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంపై పూర్తిగా గ్రిప్ సాధించారు. ఇటు తండ్రి నుంచి వ‌చ్చిన రాజ‌కీయ వార‌స‌త్వాన్ని అంది పుచ్చుకుని, ఆ ప‌రిచ‌యాల‌ను వాడుకుని న‌గ‌రిలో తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గాలికి వ‌య‌స్సు పైబ‌డ‌డంతో సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్ కూడా భాను ప్ర‌కాష్‌ను ఎంక‌రేజ్ చేస్తూ వ‌స్తున్నారు. దీంతో వారి సహకారంతో నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి విష‌యంలో త‌న వ్యూతో భానుప్ర‌కాష్ ముందుకు వెళుతున్నారు. తండ్రి ముద్దుకృష్ణ‌మ నాయుడు ఎమ్మెల్సీగా ఉన్నా.. ఆయ‌న వ‌య‌స్సు దృష్ట్యా కుమారుడే వ్య‌వ‌హారాల‌ను న‌డిపిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నుల‌తో పాటు భానుప్ర‌కాష్ ఆలోచ‌న‌లు చూసిన విప‌క్ష వైసీపీ నాయ‌కులు కంటిన్యూగా టీడీపీలో జాయిన్ అవుతూనే ఉన్నారు. ఇక భానుప్ర‌కాష్ దూకుడు చూసిన రోజా ఇప్పుడు భయపడుతుందట. అంతేకాదు.. చివ‌ర‌కు న‌గ‌రిలో సొంత ఇళ్లు క‌ట్టుకుని ఎన్నిక‌ల‌కు ఇక్క‌డే మ‌కాం వేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారట. ఇంకా విచిత్రం ఏంటంటే భాను ప్ర‌కాష్ ఈ రోజు ఏ గ్రామానికి వెళ్లి వ‌చ్చారో ? మ‌రుస‌టి రోజు రోజా అక్క‌డ వాలిపోతున్నార‌ట‌. ఈ విష‌యం ఇప్పుడు న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద సంచ‌ల‌నంగా మారింది. మొత్తానికి తన నోటితో అందరినీ భయపెడుతున్న రోజానే.. ఇప్పుడు ఆమెనే భయపడుతుందటే... గ్రేటే..

కలిసింది అందుకేనా..!కలరింగ్ ఇచ్చినా వర్కవుట్ కాలేదా..!

  ఈ మధ్య ఏపీ రాజకీయాలు చాలా హాట్ హాట్ గా తయారవుతున్నాయి. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ఎవరెవరూ పొత్తుతో బరిలోకి దిగుతారు...అసలు పొత్తు పెట్టుకుంటారా..? ఒంటరిగా బరిలో దిగుతారా..? అబ్బో ఎన్నో అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ-బీజేపీ పార్టీలు మిత్రపక్షంగా ఉన్నా... ఈమధ్య రెండు పార్టీల మధ్య విబేధాలు తెలత్తుతూనే ఉన్నాయి. బీజేపీ నేతలు ఏదో ఒక కారణంతో...టీడీపీని విమర్శించడం...దీనికి టీడీపీ నేతలకు కోపం రావడం.. చంద్రబాబు వారిని వారించడం.. దానికి గాను నేతలు ఏం చేయలేక లోలోపలే ఆగ్రహాన్ని అణుచుకోవడం.. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల పొత్తుపై  ఇప్పటినుండే అనుమానాలు ఉన్నాయి. అంతేకాదు మరోవైపు టీడీపీ, జనసేనతో కలిసే అవకాశం ఉందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇక టీడీపీతో బీజేపీకి వస్తున్న విబేధాలను వైసీపీ క్యాష్ చేసుకోవాలని ఎప్పటినుండో చూస్తుంది. అందుకే బీజేపీతో పొత్తు కోసం అర్రులు చాస్తుంది. గతంలో మోడీ జగన్ కు అపాయింట్ మెంట్ ఇవ్వడంతో అది నిజమే అనుకున్నారు కూడా అందరూ.   అయితే ఆ తరువాత నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం... వైసీపీ చిత్తుగా ఓడిపోవడం ఆ తరువాత బీజేపీ తోక ముడవడం అన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు తాజాగా... వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి,రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మోడీతో భేటీ అవ్వడంతో.. మరోసారి హాట్ టాపిక్ అయింది. శుక్రవారం కోర్టులో హాజరు అవ్వాల్సి ఉన్నా.. రాజ్యసభకు వెళ్లాలని పర్మిషన్ తీసుకుని ఆయన ప్రధానిని కలిశారు. అయితే అత్యంత రహస్యంగా ఉన్నా...ఈ భేటీ బయట పడటంతో... ఇప్పుడు దానిని కవర్ చేసుకునే పనిలో పడ్డారు. ప్రధాని మోడీకి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు చెప్పడానికి, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినందుకు మోదీకి అభినందనలు తెలపడానికి వెళ్లాని కలరింగ్ ఇస్తుంది తమ ఛానల్. అయితే ఇవేమీ కాదు.... వైసీపీతో బీజేపీ పొత్తు అంశంపైనే ఎక్కువగా చర్చించినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.  జగన్ పాదయాత్ర ఏ విధంగా సాగుతోంది. ఆయన పాదయాత్రకు ఏ రకమైన స్పందన వస్తోందనే విషయాలను కూడా ప్రధానికి విజయసాయిరెడ్డి వివరించినట్టు సమాచారం.   దీంతో...  బీజేపీ విజయానికి విజయ సాయి రెడ్డి శుభాకాంక్షలు చెప్పడం ఏంటో? పాదయాత్ర విశేషాలు మోడీకి ఎందుకు? జగన్ ఎమన్నా బీజేపీ నాయకుడా? లేకపోతే కనీసం వైకాపా బీజేపీ ఒక కూటమిలో ఉన్నాయా? మోడీకీ జగన్ యాత్ర విశేషాలతో పనేముంది? అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. మొత్తానికి వైసీపీ ఏదో కవర్ చేయడానికి ప్రయత్నించినా... కారణం మాత్రం అందరికీ అర్దమైపోతుంది. నిజంగా బీజేపీతో పొత్తు ప్రయత్నాలు చేస్తే అది తప్పేమి కాదు. రాజకీయాల్లో అవన్నీ కామనే. మరి అందులో దాచుకోవాల్సిన పనేం లేదు. వైసీపీ బయటకు చెప్పుకోవడానికి భయపడాల్సిన అవసరం లేదు. కాస్తో కూస్తో భయపడితే బీజేపీ భయపడాలి. ఎందుకంటే వైసీపీకి అవినీతి మరకలు ఉన్నాయి కాబట్టి. మరి చూద్దాం.. వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు. ఎవరితో పొత్తు పెట్టుకుంటారో..

కేంద్రం ఇప్పుడేం చెబుతుందో...!

  ఏపీలో ఇటీవల హాట్ టాపిక్ గా మారిన విషయం ఏదైనా ఉంది అంటే.. అది పోలవరం గురించి అని చెప్పొచ్చు. ఎప్పుడైతే కాఫర్ డ్యామ్ పేరుతో పోలవరానికి కేంద్రం అడ్డుపుల్ల వేసిందో అప్పటినుండి.. పోలవరం పై చర్చలు నడిచాయి. ఇక ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా రాష్ట్రప్రభుత్వాన్ని, చంద్రబాబుని ఏకిపారేద్దామని ఎదురుచూసే వైసీపీ అయితే.. ఈ కారణం చూపించి.. చంద్రబాబుపై మాటలతో దాడి చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పోలవరం దర్శించి.. పోలవరంపై స్పందించి ఏపీ ప్రభుత్వంపై..చంద్రబాబుపై సీరియస్ అవ్వడంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది. మరి కేంద్రం చేసిన పనికి.. ఇన్ని రోజులు కేంద్రం ఏం చేసినా సైలెంట్ గా ఊరుకున్న చంద్రబాబు మాత్రం పోలవరం పై కేంద్రం తీరు చూసి ఫైర్ అయ్యారు.   కానీ ఇప్పుడు 2018 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న చంద్రబాబు కోరిక తీరే అవకాశం దక్కింది. నిర్మాణ పనులపై ఇటీవల ఏర్పడ్డ గందరగోళం ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో కొలిక్కివచ్చేసింది. కాఫర్‌ డ్యాం పేరుతో ఏపీ ప్రభుత్వం ప్రకటించిన టెండర్లను సైతం ఆపేసిన కేంద్రానికి జాతీయ జల విద్యుత్ పరిశోధన బృందం ఓ ఝలక్ ఇచ్చింది.  ఓ వైపు నుంచి కాఫర్‌ డ్యాం, మరోవైపు నుంచి ప్రధాన డ్యాం నిర్మించుకుంటూ వెళ్లి వీటిని అనుసంధానించడం ద్వారా నీటిని నిలబెట్టుకోవచ్చంటూ జాతీయ జల విద్యుత్ పరిశోధన బృందం (ఎన్‌హెచ్‌పీసీ) కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చేసింది. అంతేకాదు.. చంద్రబాబు ఆశిస్తున్నట్టు ఈ సీజన్‌కు నీటిని నిలిపి గ్రావిటీ ద్వారా కాల్వలకు విడుదల చేసుకోవచ్చని తెలిపిందట. ఆ తర్వాత మిగిలిన ప్రధాన డ్యాం పనులు పూర్తి చేయొచ్చని సూచించిందట.ఇలా చేయడం వల్ల ఎగువ కాఫర్ ‌డ్యాం నిర్మాణ వ్యయం కూడా తగ్గిపోతుందని కేంద్రానికి నిపుణుల బృందం కేంద్రాని తెలిపినట్లు తెలుస్తోంది.   అంతేకాదు.. ఎగువ కాఫర్‌ డ్యాం 42.5 మీటర్లకు పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై కూడా స్పందించి...  ఎగువ కాఫర్ డ్యాంను 42.5 మీటర్లకు పెంచేందుకు అభ్యంతరం లేదంటూనే… ప్రధాన డ్యాం నిర్మాణాన్ని 42.5 మీటర్లకు నిర్మించాలని తెలిపింది. ఎగువ కాఫర్‌ డ్యాంను పూర్తిగా నది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కాకుండా…. సగం వరకు కాఫర్ డ్యాం, మిగిలిన సగం ప్రధాన డ్యాం నిర్మించి రెండింటినీ అనుసంధానించాలని తెలిపింది. దీని ద్వారా నీటిని నిలుపుదల చేసి వచ్చే ఖరీప్ నాటికి కాల్వలకు గ్రావిటీ ద్వారా నీటిని విడుదల చేయొచ్చని సూచించింది. సో.. దీనివల్ల 2018 నాటికే పోలవరం ద్వారా నీళ్లివ్వాలన్న చంద్రబాబు కల నెరవేరుతుందన్నమాట. మొత్తానికి చంద్రబాబు ఖాతాలో మరో పెద్ద విజయం దక్కినట్టే.. మరి దీనిపై అసలు కేంద్రం ఎలా స్పందిస్తుందో చూద్దాం...

అమ్మ గదిలో ఏముందో..?

  తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం...వరుసపెట్టి ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే శశికళ.. దినకరన్.. ఇంకా శశికళ కుటుంబసభ్యుల ఇళ్లల్లో ఐటీ అధికారులు దాడులు జరిపి వేల కోట్ల ఆస్తులు స్వాదీనం చేసుకున్నారు. అయితే జయలలిత మరణించిన తరువాత ఆమె డెత్ ఎంత మిస్టరీగా మారిందో... ఆమెకు సంబంధించిన ఆస్తుల గురించిన విషయాలు కూడా అంతే రహస్యంగా ఉన్నాయి. ఇటీవల జయలలిత కొడనాడ్ ఎస్టేట్ లో కూడా ఆమె ఆస్తులకు సంబంధించి.. కీలక పత్రాలు దొంగిలించారు. ఇక ఇప్పుడు శశికళ, ఆమె బంధువర్గమే లక్ష్యంగా జరుగుతున్న ఐటీ దాడులు కీలక దశకు చేరుకున్న వేళ.... పోయిస్ గార్డెన్స్ లోని వేదనిలయంలో జయలలిత పర్సనల్ గదిని నేడు తెరిచి, అందులో ఏముందో తేల్చాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులు నిర్ణయించుకున్నారు. గతంలో కూడా ఐటీ అధికారులు వేదనిలయంలో సోదాలు జరిపారు. కానీ అప్పుడు జయ ఆంతరంగిక గదుల జోలికి వెళ్లలేదు. కానీ ఇప్పుడు ఆమె గదిలో ఏముందో తేల్చాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే... ఐటీ అధికారులు ఆమె ఇంటికి వెళ్లారు. ఇప్పటివరకూ చిన్నమ్మ సామ్రాజ్యంపై విరుచుకుపడిన ఐటీ, ఇప్పుడు జయలలిత ఏం దాచుకుందో తేల్చనున్నారు. ఇక ఐటీ అధికారులు అమ్మ ఇంటికి వెళ్లడంతో... తమిళనాడు మొత్తం అసలు ఆ గదిలో ఏముంది... ఆమె మాత్రమే వాడిన గదిలో ఏం దాచారని... ఐటీ అధికారులు ఏం నిజాలు బయట పెడతారని ఎదురుచూస్తున్నారు. మరోపక్క అన్నాడీఎంకే శ్రేణులు కూడా భారీ ఎత్తున అక్కడకు చేరుకున్నాయి. మరి ఎన్నో రహస్యాలు దాగి ఉన్న జయలలిత జీవితంలో.. ఇప్పటివరకూ దేనికి సరైన సమాధానం అన్నదే దొరకలేదు. ఆఖరికి తన మరణం కూడా. మరి ఇన్ని రోజులు రహస్యంగా... ఎవరినీ రానివ్వకుండా ఉన్న ఆమె గదిలో ఏముందో..? అధికారులు ఏం బయటపెడతారో చూద్దాం..?

మోడీకి బాబుకి చెడింది అక్కడేనట...

గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమిగా ఎన్నికల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే కదా. అయితే ఆ తరువాత రెండు పార్టీల మధ్య కాస్త విబేధాలు వచ్చాయి. ఏదో మిత్రపక్షంగా ఉండటానికి ఉన్నాయి కానీ... రెండు పార్టీల మధ్య అంత సఖ్యత లేదనే చెప్పొచ్చు. దానికి తోడు ఈ మధ్య ఏపీ బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతుండటంతో టీడీపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక బీజేపీ ఎంత సతాయించిన సైలెంట్ గా ఉన్న చంద్రబాబు.. పోలవరం విషయంలో మాత్రం అడ్డుపుల్ల వేసినందుకు.. కేంద్రంపై అసహనం వ్యక్తం చేశారు. ఇక ఇన్ని పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల పొత్తు కూడా అనుమానంగానే ఉంది.   ఏపీ లో ఉన్న బీజేపీ నేతలతోనే.. చంద్రబాబుకు, నరేంద్రమోడీకి కూడా గత కొంత కాలంగా అంతగా సత్సంబంధాలు లేదన్న సంగతి తెలిసిందే. అందుకే ఆయనకు అపాయింట్ మెంట్ ఇవ్వడానికి కూడా మోడీ ఆలోచిస్తున్నారన్న వార్తలు జోరుగా వినిపించాయి. అంతేకాదు.. ఆ మధ్య కేసీఆర్ కు కూడా అపాయింట్ మెంట్ ఇచ్చిన మోడీ.. చంద్రబాబు కు ఇవ్వకపోవడంతో... ఈ వార్తల్లో నిజముందనే అనుకున్నారు. అయితే అసలు వారిద్దరి మధ్య అంత దూరం పెరగడానికి రీజన్ వేరే ఉందట. దానికి కారణం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అట. నితీష్ కు, మోడీ, చంద్రబాబుకు మధ్య సంబంధం ఏంటనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. నితీష్, లాలూ కూటమి నుండి బయటకు వచ్చిన తరువాత ఎన్డీఏ తో చేతులు కలిపిన సంగతి తెలిసిందే కదా. అయితే.. మొదటి నుంచి నీతిష్ కు చంద్రబాబుకు మంచి రిలేషన్స్ ఉన్న నేపథ్యంలో.. కుమార్ మహాకూటమి నుంచి ఎన్.డి.ఎ.లోకి ఫిరాయించక ముందు చంద్రబాబుకు ఫోన్ చేసి.. ఆయన సలహా కోరారట.   ఆ సమయంలో చంద్రబాబు నితీష్ తో ఎన్డీఏలోకి రావద్దని సలహా ఇచ్చారట. అంతే కాదు.. .ఆ సందర్భంలో మోడీకి వ్యతిరేకంగా కొన్ని కామెంట్స్ కూడా చంద్రబాబు చేసినట్టు చెబుతున్నారు. అంతగా  అవసరమైతే కొత్త కూటమి పెడదామని కూడా చంద్రబాబు నీతీష్ కు ప్రతిపాదించారట. కానీ నితీష్ మాత్రం మోడీతోనే చేతులు కలిపారు. అక్కడితో ఆగకుండా.. చంద్రబాబు చేసిన కామెంట్లను.. మోడీ చేవిలో ఊదరట నితీష్ కుమార్. దాంతో మొదటి నుండి చంద్రబాబుకు కాస్త దూరంగా ఉంటున్న మోడీ.. ఈ ఉదంతం తర్వాత ఇంకా దూరం పెరిగిపోయింది. ఇలా ఇన్ని కారణాలతో మోడీ- చంద్రబాబు సంబంధాలు దారుణంగా బెడిసికొట్టాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ.. ప్రచారం మాత్రం జరుతుంది. మరి నిజనిజాలు ఏంటో వాళ్లకే తెలియాలి.

పీకే కోసం కార్యకర్తలకు దూరమవుతున్నాడా..?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యవహార శైలి తొలి నుంచి ఎవరికీ అంతుపట్టడం లేదు.. కాకలు తీరిన రాజకీయ నాయకుల నుంచి నిన్న మొన్న పొలిటిక్స్‌లో ఓనమాలు నేర్చుకున్న వారికి సైతం ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియని పరిస్థితి. ఎవరిని నమ్మకుండా.. ఏం చెప్పినా వినకుండా.. తనకు తోచింది చేయడం జగన్ నైజం. ఈ వైఖరి వల్ల ఆయనతో ఇమడలేక వైసీపి నుంచి ఎంతో మంది నేతలు బయటకు వచ్చేశారు.   వచ్చిన ప్రతి ఒక్కరి నోటా ఇదే మాట రావడం ఆశ్చర్యకరం. అలాంటి జగన్‌మోహన్ రెడ్డి తన పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ మాటను మాత్రం తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. ప్రజా సంకల్ప యాత్ర, నవరత్నాలు, మద్యపాన నిషేధం వంటివి అందులో భాగమేనని లోటస్ పాండ్ టాక్. కానీ పార్టీలోని కొందరు నేతలకు, కార్యకర్తలకు ఇది నచ్చడం లేదు.. పార్టీ స్థాపించిన నాటి నుంచి వెంట నడిచిన మమ్మల్ని కాదని.. నిన్న గాక మొన్న వచ్చిన ప్రశాంత్ కిశోర్ మాటలకు అధినేత ఎక్కువ విలువ ఇవ్వడం పట్ల వారు మనస్తాపానికి గురవుతున్నారు.   అంతేకాకుండా ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జగన్ అక్కడి స్థానిక సమస్యలు తెలుసుకోకుండా.. ప్రశాంత్ జోక్యం చేసుకోవడం పట్ల నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా అధినేత వద్ద తమ ఆవేదన వ్యక్తం చేయలేక పని కానిచ్చేస్తున్నారు. ఈ పరిణామాలు క్యాడర్‌ని జగన్‌కి దూరం చేసేలా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. పార్టీ నేతలు ఒక్కొక్కరిగా అధికార పార్టీ గూటికి చేరుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కార్యకర్తలను కూడా దూరం చేసుకుంటే.. జగన్ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. మరి జగన్ కార్యకర్తలకు దూరమవుతాడా..? పీకే‌కి ప్రాధాన్యత తగ్గిస్తాడా అన్న దానికి కాలమే సమాధానం చెబుతుంది.

ముత్తయిదువుని విధవగా మారుస్తారా..

గూడఛర్యం ఆరోపణలపై పాక్ జైల్లో శిక్ష అనుభవిస్తూ.. అక్కడి సైనిక కోర్టుల నుంచి మరణశిక్షను ఎదుర్కుంటోన్న  భారత  మాజీ నేవి అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ని గత సోమవారం ఆయన తల్లి, భార్య కలిశారు. ఇస్లామాబాద్‌లోని పాక్ విదేశాంగ వ్యవహారాల కేంద్ర కార్యాలయంలో కుల్‌భూషణ్‌ను కలిసిన ఆయన తల్లి, భార్యకు చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయంలో పాక్ వ్యవహరించిన తీరు అంతర్జాతీయంగా విమర్శలకు దారి తీసింది.   కనీసం చేతితో తాకే అవకాశం లేకుండా అడ్డుగా గాజు గోడను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా.. మాతృభాషలో మాట్లాడకూడదని.. బొట్టు, గాజులు, మంగళసూత్రం సహా చెప్పులను కూడా తొలగించాలని షరతు పెట్టారు. వీరి వెంట ఉండాల్సిన భారత దౌత్య అధికారిని పక్కకు తీసుకెళ్లారు. దీనిపై భారత్‌లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది.   పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా ఇవాళ కేంద్ర విదేశాంగ మంత్రి సుస్మాస్వరాజ్ దాయాదీ దేశం తీరును ఎండగట్టారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను పాకిస్థాన్ ఏ మాత్రం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. భర్త ప్రాణాలతో ఉండగా.. ఓ ముత్తయిదువును వితంతువుగా మారుస్తారా..? అంటూ ప్రశ్నించారు. ఈ విషయం పాక్‌ అధికారులకు తెలియదా..? కుల్‌భూషణ్ భార్య కట్టుకున్న చీరను బలవంతంగా విప్పించి.. కుర్తా కట్టించడం ఆమెను అవమానించినట్లు కాదా అని.. ఇది యావత్ భారతదేశ మహిళలకు జరిగిన అవమానమని నిప్పులు చెరిగారు. పాకిస్థాన్ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పి తీరాలని.. లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని సుష్మ హెచ్చరించారు.  

ఇప్పుడేం పంచులేస్తావ్ హైపర్ ఆదీ?!

జబర్దస్త్‌లో పంచె కట్టుకొచ్చి పంచులేసే హైపర్ ఆదీ ఈ మధ్య కాలంలో బాగా పాపులరైపోయాడు. అతి తక్కువకాలంలో ఎక్కువ గుర్తింపు వస్తే ఎవరి కళ్ళయినా నెత్తిమీదకి ఎక్కడం మానవమాత్రుల్లో సహజం. ఆది కూడా మానవమాత్రుడే కాబట్టి ఆయనేం మినహాయింపు కాదు. జబర్దస్త్‌కి నవ్వుల నాగబాబు ఒక జడ్జి అనే విషయం తెలిసిందే. స్కిట్ విన్నవ్వాలంటే నాగబాబు అనుగ్రహం అవసరం కూడా కమెడియన్స్‌కి వుంటుంది. అందుకో కమెడియన్లు నాగబాబు, రోజా అనుగ్రహం కోసం తపిస్తూ వుంటారు. ‘బిస్కెట్లు’ వేస్తూ వుంటారు. అలా నాగబాబుకు ఆది భారీ బిస్కెట్ వేశాడు.   నాగబాబు సోదరుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని మీడియా ద్వారా ఆడుకుంటున్న కత్తి మహేష్‌ని తిట్టడం ద్వారా నాగబాబు అనుగ్రహం పొందాలని ఫిక్సయ్యాడు. తన స్కిట్‌లో కత్తి మహేష్‌ని ‘సుత్తి రాజేష్’ అనే మారుపేరుతో కసిదీరా తిట్టాడు. తద్వారా నాగబాబు ఆనుగ్రహం కాస్తంత ఎక్కువగానే పొందాడు. ఈ విషయంలో కత్తి మహేష్ రియాక్ట్ అయ్యేసరికి నేను తిట్టింది నిన్ను కాదు.. ‘సుత్తి రాజేష్’ అనే మరో వ్యక్తిని అని టీవీ లైవుల సాక్షిగా ఆది తన తెలివితేటలు ప్రదర్శించాడు.  పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తమ హీరో పేరు చెప్పుకుని ఎంత ఓవర్ చేస్తారో అంత ఓవరూ చేశాడు. కత్తి మహేష్‌ని తిట్టి పోయడం ద్వారా ఆదికి జబర్దస్త్‌లో బాగానే వర్కవుట్ అయింది. గత కొన్ని వారాలుగా జబర్దస్త్‌లో ఆదికి పెరిగిన పాయింట్లు, గెలిచిన ఎపిసోడ్లే దీనికి నిదర్శనం. పెద్దవాళ్ళని పట్టడం ఎలాగో తెలుసుకుని, విజయవంతంగా ఇంప్లిమెంట్ చేసిన హైపర్ ఆదికి ఈ సందర్భంగా అభినందనలు.   ఇంతవరకూ బాగానే వుంది. పవన్ కళ్యాణ్‌ని విమర్శిస్తు్న్నాడన్న నెపంతో కత్తి మహేష్‌ని తిట్టిపోసి, పంచ్‌లు వేసిన హైపర్ ఆది ఇప్పుడు  జబర్దస్త్‌లో మరో జడ్జి రోజా మీద కూడా అలాగే పంచ్‌లు వేస్తాడా? పవన్ కళ్యాణ్‌ని కత్తి మహేష్ విమర్శించిన దానికంటే వంద రెట్లు ఎక్కువగా రోజా ఈమధ్య విమర్శించారు. రోజాకి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి మధ్య పుట్టిన నిప్పు ఇప్పుడు జ్వాలగా మారింది. ఇలాంటి దశలో హైపర్ ఆది ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటాడో చూడాలి. ఒక జడ్జిగా వున్న నాగబాబుని ఇంప్రెస్ చేయడానికి మరో జడ్జిగా వున్న రోజాని విమర్శిస్తాడా? వెటకారం పంచులేస్తాడా? కత్తి మహేష్ లాంటి సామాన్యుడు పవన్ కళ్యాణ్‌ని విమర్శిస్తే ఆదికి పౌరుషం పొడుచుకుని వచ్చింది. మరి ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్‌ని రోజా విమర్శించారు. మరి ఇప్పుడు హైపర్ ఆదికి రోషం పొడుచుకుని వస్తుందో రాదో మరి! చూద్దాం.

కర్నూలు ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు..?

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికల నగరా మోగింది. శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటాలో.. ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే అధికార పార్టీ నుంచి అభ్యర్థిని ఖరారు చేయడం టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. మంగళవారం సాయంత్రానికి నామినేషన్ గడువు ముగుస్తుండటంతో అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలన్న దానిపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. దీంతో పార్టీ సీనియర్ నేతలు.. కర్నూలు జిల్లా నాయకులతో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు.   టికెట్ కోసం చాలా మంది ఆశావహులు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. కేఈ ప్రభాకర్, ఎం. శివానందరెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డిలో ఎవరిని ఎంపిక చేస్తారని జిల్లా మొత్తం ఉత్కంఠగా ఎదురచూస్తోంది. ఎమ్మెల్సీగా ఉన్న శిల్పాచక్రపాణి రెడ్డి నంద్యాల ఉపఎన్నికకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. పార్టీ సభ్యత్వంతో పాటు పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మల్సీ పదవికి కూడా శిల్పా రాజీనామా చేయడంతో.. ఈ స్థానంలో ఖాళీ అయ్యింది.   వైసీపీ బలంగా ఉన్న కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గంలో నాడు దివంగత భూమా నాగిరెడ్డి అండతో శిల్పా గెలుపొందారు. అలాంటి చోట మరోసారి ఎన్నికలు రావడంతో ప్రతిపక్షం సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. అలాగే నంద్యాల ఉపఎన్నికతో డీలా పడిన శ్రేణుల్లో నూతనోత్సాహం నింపాలని వైసీపీ అధినేత భావిస్తున్నారు. అయితే సరైన అభ్యర్థుల కోసం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ పదవిని కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన వారికే ఇవ్వాలని ఓ వర్గం.. గతంలో ప్రాతినిధ్యం వహించిన సామాజిక వర్గానికే ఇవ్వాలని మరో వర్గం గట్టిగా పట్టుబడుతున్నాయి. అయితే సీఎం మనసులో ఏముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

తెలుగు మహాసభల్లో ఎన్టీఆర్‌ను అందుకే గుర్తు చేయలేదట..?

  అంతరించిపోతున్న తెలుగు భాషను కాపాడటంతో పాటు .. తెలుగు భాష, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం.. ప్రపంచ తెలుగు మహా సభలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు గాను ఘనంగా ఏర్పాట్లు చేసింది. ప్రధాన వేదికతో పాటు భాగ్యనగరంలో ఏ మూల చూసినా తెలుగు కవులు, కళాకారుల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా 42 దేశాల్లోని తెలుగువారిని.. పలు రాష్ట్రాల్లోని వారిని.. ఒక కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన తెలుగువారిని ఆహ్వానించి.. వారిని ఘనంగా సత్కరించి పంపారు. ఇందుకోసం రూ.60 కోట్లకు పైనే ఖర్చు చేశారు.  ఇంతా చేసి కేసీఆర్ విమర్శలు మూట గట్టుకున్నారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పి.. తెలుగు భాష అనేది ఒకటి ఉందని.. తెలుగువారు తలచుకుంటే ఏదైనా సాధించగలరని చేతల్లో చూపించిన.. తెలుగుతల్లి ముద్దుబిడ్డ, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ పేరు మచ్చుకైనా ఎక్కడా తలచుకోలేదు. అంతేనా..? సోదర తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మాటవరసకు కూడా ఆహ్వానించకపోవడంతో ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.   సోషల్ మీడియాలో అయితే కేసీఆర్‌ గారిపై ఏ రేంజ్‌లో కామెంట్లు పడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతమంది ఏమనుకున్నా.. లెక్క చేయని మనస్తత్వం కేసీఆర్‌ది.. ఆయన ఒకదానికి కమిట్ అయితే ఆరు నూరైనా వెనక్కు తగ్గరు.. తెలుగు మహాసభల విషయంలోనూ ఇదే జరిగింది. ఐదు రోజుల పాటు వేడుకలు నిర్వహించారు.. ముగింపు వేడుకలకు రాష్ట్రపతిని పిలిచారు.. ప్రతి ఏడాది తెలుగు పండుగ చేసుకుందామని ఒక పద్యంతో వేడుకలకు వీడ్కోలు పలికారు కేసీఆర్. అయితే ఇన్ని రోజుల తర్వాత తెలుగు మహాసభల వేళ ఎన్టీఆర్‌‌ ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదో ఇప్పుడు తీరిగ్గా వివరణ ఇచ్చారు తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిధారెడ్డి. తెలుగు మహాసభలు భాషకు, సాహిత్యానికి సంబంధించినవి.. ఇవి రాజకీయ సభలు అయితే, ఎన్టీఆర్‌ని తప్పకుండా గుర్తుచేసుకుంటాం. ఎందుకంటే రామారావు రచయిత కాదు. సినీనటుడు, మాజీ ముఖ్యమంత్రి అంతవరకే తప్ప.. ఇక్కడ  ఎన్టీఆర్‌లు, ఏఎన్నార్‌లు ఉండరు అంటూ తనదైన స్టైల్లో ఘాటుగా సమాధానమిచ్చారు సిధారెడ్డి.