ఏం మాట్లాడుతున్నారు సార్... ప్రజలే కట్ చేస్తారు జాగ్రత్త...!

  ఏపీలో మిత్రపక్షంగా ఉన్నా టీడీపీ-బీజేపీ మధ్య ఎప్పటినుండో కోల్డ్ వార్ జరుగుతుంది. అధికారంలో ఉన్న టీడీపీ నేతల కంటే.. బీజేపీ నేతలే టీడీపీపై విమర్సలు చేయడం విచిత్రం. అదేంటో బీజేపీ లేకపోతే టీడీపీ లేదన్నట్టు.. బీజేపీ వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చింది అన్నట్టు మాట్లాడుతున్నారు బీజేపీ పార్టీ నేతలు. నిన్నటి దాకా సోము వీర్రాజు రెచ్చిపోయాడు. రాజు గారి మాటలు వింటే కోటలు దాటాల్సిందే. అప్పట్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో నేను డిసైడ్ చేస్తా అని వ్యాఖ్యలు చేశాడు. ఆ తరువాత.. పార్టీ పెద్దలతో తిట్లు తిన్నాడు. అంతేకాదు ఈ మధ్య చాలా సందర్భాల్లోనే టీడీపీపై విమర్శలు గుప్పించారు. ఇక కేంద్ర మాజీ మంత్రి, బిజెపి మహిళా మోర్చా అద్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా చంద్రబాబును బెదిరిస్తున్నట్టే మాట్లాడారు. మిత్రపక్షం వైఖరి మార్చుకోకుంటే తమ సామర్ద్యం బట్టి అన్ని స్థానాలలో పోటీచేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు వీళ్ల జాబితాలో మరో బీజేపీ నేత చేరారు. ఆయన ఎవరో కాదు.. ఆయనే మాణిక్యాలరావు.   మాణిక్యాలరావు.. ఏపీ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి. ఈయన గారు ఏకంగా ఏపీనే కట్ చేస్తారట. ఇంతకీ అసలు సంగతేంటంటే... తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెంలో జరిగిన జన్మభూమి గ్రామసభ కార్యక్రమంలో మంత్రిగారు పాల్గొన్నారు. అయితే జడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజుతో మంత్రి గారికి వైరం ఉంది. ఈనేపథ్యంలో... ఆయన కాస్త ఆవేశ పడి రెచ్చిపోయారు. నియోజకవర్గంలో తనను అంటరానివాడిగా చూస్తున్నారని, స్థానికంగా జరిగే కార్యక్రమాలకు తనను టీడీపీ నేతలు ఆహ్వానించలేదని, తానేమైనా శత్రువునా? అని ఆరోపించారు. "నన్ను నిలదీసే పరిస్థితి వస్తే ప్రభుత్వాన్నే నిలదీస్తా... నన్ను కట్‌ చేయాలని ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్‌ను కూడా కట్‌ చేస్తా.. సహనానికి హద్దులు ఉంటాయి.. కచ్చితంగా కుక్కకాటుకు చెప్పు దెబ్బ ఉంటుంది".. బాపిరాజు వర్గం, నాకు అవమానం చేస్తుంది అని మంత్రి అన్నారు. అంతేకాదు పలు అనుచిత వ్యాఖ్యలు కూడా ఉపయోగించారు. అయితే బాపిరాజు మాట్లాడుతూ, నేను ఏమి చెయ్యలేదు అని,మంత్రి అపోహపడుతున్నారని అన్నారు. ఏది ఏమైనా...  ఒక మంత్రి స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదని.. రాజకీయాల్లో సవా లక్ష ఉంటాయి... అక్కడ లోకల్ గా ఉండే వారి మీద ఈయన వ్యాఖ్యలు చేసుకోవాలి...అంతేకాని ఇలా రాష్ట్ర పరువు తీసే విధంగా మాట్లాడటం... సిగ్గు చేటని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్ ను మీరు కట్ చేసేది ఏంటి.. ప్రజలు తలుచుకుంటే మిమ్మల్ని కట్ చేస్తారు అని అంటున్నారు. మరి మొన్న గజల్ శ్రీనివాస్ ఉత్తముడు అని బిరుదు ఇచ్చి, తెల్లారినాక నాలుక కరుచుకున్నారు. ఇప్పుడు కూడా, తన స్థాయి మరిచి మాట్లాడిన మాటలకు మంత్రి గారు క్షమాపణ చెప్తారేమో చూద్దాం...

అజ్ఞాతవాసి అందుకే ఫట్ అట.. వైసీపీ పైత్యం...

  సాధారణంగా సినిమా ఫ్లాప్ అయిందంటే దానికి ఎవరిని బాధ్యులు చేస్తారు. సినీ ఇండస్ట్రీ వాళ్లయితే వాళ్లకి సినిమా తీయడం ఎంత కష్టమో తెలుసుకాబట్టి ఎవరి మీద ఆ నెపాన్ని వేయారు. ఇక మిగిలిన వాళ్లు ఎవరికి నచ్చినట్టు వాళ్లు మాట్లాడుకుంటారు. కొంత మంది స్టోరీ బాలేదని.. కొంత మంది డైరెక్షన్ సరిగా లేదని... ఇంకొంత మంది స్ర్కీన్ ప్లే బాలేదని.. ఎవరికి తోచినట్టు వాళ్లు అంటారు. కానీ ఇక్కడ ఓ విచిత్రమైన వార్త ఒకటి తెరపైకి వచ్చింది. ఆ వార్త తెచ్చింది కూడా ఎవరో కాదు.. ఎప్పుడూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించే వైసీపీ బ్యాచ్. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా పోవడానికి కారణం చంద్రబాబు కారణమట. ఇదీ ఇప్పుడు వైసీపీ అందుకున్న పాట.   పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. త్రివిక్రమ్, పవన్ కాంబో కాబట్టి పెద్ద ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు అందరూ. బ్లాక్ బాస్టర్ హిట్ ఖాయం అని ఫిక్స్ అయ్యారు. కానీ అంచనాలు తలక్రిందులయ్యాయి. అనుకున్నంట టాక్ రాలేదు. ఒకరకంగా చెప్పాలంటే.. ఫ్లాప్ టాక్ కూడా వినిపిస్తోంది. దీంతో.. వైసీపీ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాలిట ఐరన్ లెగ్ అని కొత్త ప్రచారం మొదలుపెట్టారు. చంద్రబాబుకు సపోర్ట్ చెయ్యడం మొదలు పెట్టాక పవన్ కళ్యాణ్ కు అన్ని ప్లాపులేనట.  “యాధృచ్ఛికమే కావొచ్చు గానీ.. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఈ నాలుగేళ్లలో పవన్‌ కల్యాణ్‌ నటించిన సినిమాలన్నీ ఫ్లాప్‌లే.. గోపాల గోపాల, సర్దార్‌ గబ్బర్‌సింగ్, కాటమరాయుడు సినిమాలు బయ్యర్లను నిలువునా ముంచేశాయి,” అని సాక్షి టీవీకి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉంటే వానలు రావన్న వాదనను తెరపైకి తెచ్చాయి.  ఇప్పుడు ఈ కొత్త వాదనను మొదలుపెట్టాయి. దీంతో జగన్ ఆఖరికి ఇంత దిగజారిపోయాడా అని అనుకుంటున్నారు. జగన్, ఇప్పటికైనే ఇలాంటి పనికిమాలిన వాటి గురించి కాకుండా, కొంచెం ప్రజా సమస్యల పై స్పందిస్తే, ఏమన్నా ఉపయోగం ఉంటుంది... లేకపోతే ఇవాళ నువ్వు ఫ్లాప్ హీరో అంటున్న అతనే, నీ స్థానం లాగేస్తాడు అని కొంతమంది చర్చించుకుంటున్నారు. మరి జగన్ గారు మీరు కూడా ఒకసారి ఆలోచించండి...  

బాబుగారు ఏమన్నా వాడుతున్నారా..?

  అధికారుల చేత పనులు ఎలా చేయించుకోవాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బాగా తెలుసు. అందుకే సమర్ధవంతమైన అధికారులు రిటైర్డ్ అయినా వారికి ఏదో ఒక బాధ్యతలు అప్పగిస్తూనే ఉంటారు. వారిచేత రాష్ట్రానికి సేవలు చేయించుకుంటారు. ఈ జాబితాలో నండూరి సాంబశివరావు కూడా చేరిపోయారు. ఆయన్నికూడా చంద్రబాబు వదిలిపెట్టలేదు. డీజీపీగా సేవలు అందించిన నండూరి సాంబశివరావు ఇటీవలే రిటైర్డ్ అయిన సంగతి తెలిసిందే కదా. అలా రిటైర్డ్ అయ్యారో లేదో.. అప్పుడే చంద్రబాబు ఆయనకు  కొత్త పోస్ట్ ఇచ్చారు... విశాఖపట్నం గంగవరం పోర్టు చీఫ్ సెక్యూరిటి అధికారిగా నండూరి సాంబశివరావుని నియమించారు. సాంబశివరావుకి, విశాఖకు ఎక్కువ అనుబంధం ఉంది. గతంలో ఇక్కడ పోలీస్ కమిషనర్గా పనిచేశారు. విశాఖలో శాంతి భద్రతలను కట్టుదిట్టం చేసి పోలీసులు ప్రజల మధ్య స్నేహ భావాన్ని పెంపొందించారు. అనంతరం ఆయన రాష్ట్ర ఆర్టీసీ ఎండిగా కూడా బాధ్యతలు చేపట్టి ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేసారు. తరువాత ఆయన డీజీపీగా బాధ్యతలు స్వీకరించి, ఒక బాధ్యత గల పోలీస్ అధికారిగా రాష్ట్ర ప్రజలకి విశేష సేవలందించి ప్రభుత్వంచే మన్ననలు పొందారు. పదవీ విరమణ అనంతంర ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎప్పడైనా తన సేవలను స్వీకరించవచ్చని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైతే ఎలాంటి సేవలు చేసేందుకు అయినా తాను సిద్దంగా ఉన్నట్లు తెలియజేసారు. ఇంకేముంది సాంబశివరావు గారు అలా చెప్పారో లేదో... చంద్రబాబు ఇలా కంటిన్యూ అయిపోయారు. తనకో పదవి ఇచ్చేసి కూర్చోబెట్టారు. ఇక సందర్భంగా ఆయన మాట్లాడుతు.. గతంలో విశాఖతో ఏంతో అనుబంధం ఉన్న నాకు తిరిగి ఇక్కడకే రావడం పట్ల చాలా ఆనందంగా ఉందని...నా సేవలు గంగవరం పోర్టుకు ఎంతో అవసరమని తెలిపారు. మొత్తానికి చంద్రబాబు అందర్ని వాడుతున్నారుగా...

అమ్మ జగన్ ఇంత కుట్రా.. నిధులు ఆపమని బావ చేత లేఖ...

  చేయాల్సింది అంతా చేసేసి మళ్లీ పైకి ఏం తెలియనట్టు మాటలు మాత్రం కోటలు దాటిస్తున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు సందు దొరుకుతుందా.. ఎప్పుడు చంద్రబాబుపై, ప్రభుత్వంపై విమర్సలు చేద్దామా అని చూసే జగన్ నాటకం బయటపడింది. ఏపీకి ప్రత్యేకహోదా చంద్రబాబువల్లే రావడం లేదని.. రాజధాని అమరావతి నిర్మాణమంటూ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందంటూ... వచ్చిన నిధులు ప్రభుత్వం దోచుకుంటుంది.. భూ ఆక్రమణలకు పాల్పడుతుందంటూ.. అబ్బో ఒకటా.. రెండా ఎన్నో డైలాగులు కొట్టారు. అంతేనా... ఇటీవల పార్లమెంట్లో కూడా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అమరావతి నిర్మాణానికి నిధుల కేటాయింపుపై కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇక దీనికిగాను.. రాజధాని నిర్మాణానికి నిధులు కావాలని ఏపీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకును కోరిందని...రుణం ఇచ్చే అంశాన్ని ప్రపంచ బ్యాంకు పరిశీ లిస్తోందని.. సంప్రదింపులు పూర్తి అయిన వెంటనే రుణం మంజూరవుతుందని తెలిపారు.   అయితే ఇప్పుడు జగన్ గారి బండారం బయటపడింది. అదేంటంటే... అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వద్దంటూ కెనడాకు చెందిన ఓ ఎన్జీవో సంస్థ, ప్రపంచ బ్యాంకుకు లేఖ రాసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే దీని వెనుక వైసీపీ హస్తం ఉన్నట్టు బయటపడింది. ఎక్కడ అమరావతి.. ఎక్కడ కెనడా... అమరావతి నిర్మాణం ఆపటానికి కెనడాలో ఉన్న సంస్థకి సంబంధం ఏంటి.. అన్న సందేహాలు వస్తున్నాయి కదా..? అక్కడే ఉంది అసలు ట్విస్ట్... కెనడా ఎన్జీవో సంస్థ వెనుక ఉంది కధ అంతా నడిపించింది, జగన్ బావ బ్రదర్ అనిల్ కుమార్ అని తెలిసింది. ఈ విషయాన్ని మంత్రి నక్కా ఆనందబాబు బయట పెట్టారు. రాష్ట్ర అభివృద్ధి ని సైందవుడిలా జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు అని అన్నారు. రైతుల స్వచ్ఛందంగా రాజధాని నిర్మాణం కోసం 34 వేల ఎకరాలు ఇస్తే, స్విస్ ఛాలెంజ్ పద్దతిలో ప్రపంచ రాజధాని నిర్మాణం చేపట్టడం జరిగితే, అమరావతి రాజధాని లో నిర్మాణం ఇష్టంలేని జగన్మోహన్ రెడ్డి ఇన్ని కుట్రలు పన్నుతున్నారని అన్నారు. జగన్ బావ బ్రదర్ అనిల్, తనకు ఉన్న మతపరమైన పరిచయాలతో, అక్కడ నుంచి ప్రపంచ బ్యాంకు కు ఫిర్యాదు చేసినట్టు, ప్రభుత్వంలోని పెద్దలు అంచనాకి వచ్చారు.. అంతేకాదు.. పూర్తి వివరాలు సేకరించి, ప్రజల ముందు ఉంచటానికి రెడీ అయ్యారు.   ఒక పక్క అమరావతి అభివృద్దికి చంద్రబాబు నానా తంటాలు పడుతుంటే...జగన్ గారేమో తెరవెనుక నుండి ఇలాంటి పనులు చేస్తున్నారని...మళ్లీ ఏపీలో ఎలాంటి అభివృద్ది లేదంటూ పైకేమో చిలక పలుకులు పలుకుతున్నారు. మరి ఇప్పుడేమో ఈ విషయం బయటపడింది. దీనిపై ఎలాగ స్పందిస్తాడో చూద్దాం..

జగన్ పై పీకే సీరియస్.... నా రిపోర్ట్ నేను ఇస్తున్నాను..

  ఒకపక్క వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు చేసుకుంటూ పోతుంటే.. మరోపక్క ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త పీకే మాత్రం సర్వేలు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటికే ఎన్నో సర్వేలు చేసిన పీకే..తాజాగా చేసిన సర్వేలో జగన్ దిమ్మతిరిగే విషయాలు బయటపడినట్టు తెలుస్తోంది. రెండు విడతలుగా తన సర్వేను పూర్తి చేసిన పికె ఓ నివేదికను తయారుచేసి జగన్ కు అందచేశారట. ఆసర్వే ప్రకారం.. టిడిపి బలంగా ఉన్న నియోజకవర్గాలలో అక్కడ తమ పార్టీ నేతలకి డిపాజిట్లు కూడా వచ్చేలా లేవు అని పీకే రిపోర్ట్ లో తేల్చి చెప్పేశాడట. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మళ్ళీ టిడిపి విజయకేతనం ఎగరేయడం ఖాయం అని..అలాగే , కృష్ణా , తూర్పు ,గుంటూరు, లలో టిడిపి హవా ఎప్పటిలానే కొనసాగుతుంది అని చెప్పాడట. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రాయలసీమలో కూడా ఈసారి జగన్ కు షాక్ తగిలే పరిస్థితులు ఉన్నాయట. ఎన్నడూ లేని విధంగా రాయలసీమ జిల్లాల ప్రజలు కూడా టిడిపికే పట్టం కట్టేలా ఉన్నారని..దానికి కారణం చంద్రబాబు కరువు సీమలో నీటి ప్రాజెక్ట్ లు ఏర్పాటు చేసి నీటి కరువు లేకుండా చేయడమే అని చెప్పాడట.   ఇక ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు ఈ సర్వే చూసిన జగన్ పీకే మీద మండిపడ్డాడట. దీనికి పీకే కూడా వెనక్కి తగ్గలేదట. పీకే కూడా.. సీరియస్ గా మాట్లాడట. నా రిపోర్ట్ నేను ఇస్తున్నాను ఇది పక్కా రిపోర్ట్ దీనిని బట్టి మీరు ఎలా చేస్తే బాగుంటుందో అలా చేద్దాం అని చెప్పడట. పీకే ఆన్సర్ కి షాకైన జగన్... ఆ తరువాత కూల్ అయ్యాడట. తమ కంచుకోట అయిన రాయలసీమలో కూడా జగన్ ఓట్లు రాకపోతే.. మిగిలిన ప్రాంతాల్లో పీకే చెప్పినట్టు డిపాజిట్లు రావడం కూడా కష్టమే. మరి చూద్దాం.. ఎన్నికల వరకూ సర్వేల్లో మార్పు ఏమైనా ఉంటుందో...?లేదో..?

పవన్ వివాదంలోకి మరో హీరోయిన్.. అవసరమా..

పవన్ కళ్యాణ్, కత్తి మహేశ్ వార్ లో నటి పూనమ్ కౌర్ వచ్చి ఇప్పుడు ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే కదా. కత్తి మహేశ్ పవన్ పై చేస్తున్న విమర్శలకు స్పందించిన పూనమ్ కౌర్ ఆయనపై పరోక్షంగా ట్వీట్లు చేసింది. మరి కత్తి మహేశ్ ఊరుకుంటాడా... ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి పూనమ్ వ్యక్తిగత జీవితాన్నే అందరి ముందు పెట్టాడు. పూనమ్ కు ఆరు ప్రశ్నలు వేస్తున్నానని.. దానికి సమాధానం చెప్పాలని పబ్లిక్ గా డిమాండ్ చేశాడు. దీంతో అనవసరంగా ఈ మ్యాటర్లోకి వచ్చానని తెలుసుకున్న పూనమ్.. పవన్ కు తనను కాపాడాలని ట్వీట్లు చేసింది. ట్వీట్లు చేస్తే చేసింది.. చేసిన కొద్ది నిమిషాల్లోనే మళ్లీ ట్వీట్లు డిలీట్ అని లేనిపోని అనుమానాలు లేవనెత్తింది. మరోవైపు కత్తి మహేశ్ ప్రశ్నలపై పూనమ్ కౌర్ సోదరుడు శ్వామ్ సింగ్ స్పందించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆధారాలు ఉంటే బయటపెట్టమని సవాల్ విసిరాడు. ఇక ఏకంగా వ్యక్తిగత విషయాలే బయటకు వస్తుండటంతో ఈ నెల 15 వరకూ సైలెంట్ గా ఉండమని పవన్ ఫ్యాన్స్ కు పిలుపునిచ్చారు. దీంతో 15న ఏం జరగబోతుందా అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరో హీరోయిన్ తెరపైకి వచ్చింది.. సంజన పవన్ కు మద్దతుగా ట్వీట్ చేసింది. పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోవడం కోసం కొంత మంది మంచి మార్గాలను వెతుక్కుంటారని, కష్టపడి పని చేస్తారని చెప్పింది. మరికొందరేమో గౌరవంగా, సక్సెస్ ఫుల్ గా ఉన్న వ్యక్తులను కించపరుస్తూ పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటారని అంది. 'పవర్ సర్... మేమంతా మీతోనే ఉన్నాం' అంటూ ట్వీట్ చేసింది. మరి ఇప్పటికే  కత్తికి వ్యతిరేకంగా ట్వీట్ చేసి  పూనం కౌర్ వివాదంలో చిక్కుకుంది. ఆ తరువాత కళ్లు తెరిచింది. అన్నితెలిసి ఇప్పుడు సంజన కూడా కత్తికి వ్యతిరేకంగా ట్వీట్ చేసింది. మరి కత్తి ఈ ట్వీట్ చూసి ఊరుకుంటాడా.. పూనమ్ కౌర్ కు చేసినట్టే.. సంజన వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చి మళ్లీ మీడియాలో పెడతాడా..? చూద్దాం ఏం జరుగుతుందో...

కమల్ చేసినట్టు పవన్ చేసుంటే...

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తమిళ స్టార్ హీరో కమల్ కు తెలిసినంత కూడా తెలియదా అని అనుకుంటున్నారు. ఇంతకీ ఏ విషయంలో..? కమల్ ను చూసి పవన్ ఏం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. గత నాలుగు నెలల నుండి కత్తి మహేశ్, పవన్ అభిమానుల మధ్య జరుగుతున్న వార్ సంగతి తెలిసిందే కదా. గోరుతో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నట్టు అన్న సామెత ప్రకారం...ఇప్పుడు ఈ వ్యవహారం అలానే తయారైంది. రోజు రోజుకు కత్తి మహేశ్ రెచ్చిపోయి పవన్ పై కామెంట్లు చేయడం... దానికి పవన్ అభిమానులు కూడా రెచ్చిపోయి కత్తిని టార్గెట్ చేయడం జరగుతూనే ఉంది. ఒకపక్క కత్తి మహేశ్ పవన్ ఫ్యాన్స్ వల్లే తాను ఇలా చేస్తున్నాని చెబుతున్నాడు.. మరోపక్క పవన్ అభిమానులు మాత్రం... కత్తి మహేశ్ అలా మాట్లాడుతున్నందుకే మేము ఇలా మాట్లాడుతున్నామని అంటున్నారు. వెరసి... ఇప్పుడు ఈ వ్యవహారం పెద్ద రచ్చగా తయారైంది.   ఈ నేపథ్యంలోనే.. మొగ్గలోనే తుంచిపారెయ్యాల్సిన ఒక సమస్యను..మొదట్లోనే తుంచిపారేస్తే ఇంత పెద్ద రచ్చ జరిగి ఉండేది కాదు అని అంటున్నారు. దీనిలో భాగంగానే... కమల్ ను గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే.. గత కొద్దిరోజుల క్రితం ఆర్క నగర్ ఉపఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విధంగా దినకరన్ గెలిచాడు. ఇక ఈ ఫలితాలపై స్పందించిన కమల్ హాసన్... అక్కడ ఓటర్లు డబ్బుకు అమ్ముడుపోయి తమ జీవితాన్ని తామే సమస్యల్లో నెట్టుకున్నారని... ఈ ఓట్ల కొనుగోలుతో ఓ సారి ఎన్నికలు ఆగిపోయినా రెండోసారి కూడా పరిస్థితిలో ఏ మార్పు లేదని... అధికార పార్టీ ఒక్కో ఓటుకి 6 వేల రూపాయలు ఇస్తే , స్వతంత్ర అభ్యర్థి 20 వేలు ఇచ్చాడని కమల్ చెప్పుకొచ్చారు. ఆ 20 వేలకు అమ్ముడుబోయిన ఓటర్లు బిక్షమెత్తినట్టే అని కమల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇంకేముంది....దినకరన్ భిమానులు ఎదురుదాడి మొదలుపెట్టారు. కమల్ మీద వ్యక్తిగత దూషణలకు దిగేశారు. ఇక ఎలాగూ రొచ్చులో చెయ్యి పెట్టాను...దానికి ప్రతి దాడి ఉంటుందని ముందే ఊహించి... ఎట్టిపరిస్థితుల్లోనూ రెచ్చిపోకండి అంటూ తన ఫ్యాన్స్ కి బహిరంగంగానే ప్రకటన చేశారు. దీంతో కమల్ చేసినట్టే పవన్ కూడా తన ఫ్యాన్స్ కు ఇలానే ముందే పిలుపు ఇచ్చినట్టైతే... వ్యవహారం ఇంత వరకూ వచ్చి ఉండదని అంటున్నారు. అలా కాకుండా...కత్తి మహేష్ విషయంలో పవన్ కళ్యాణ్.. దోబూచులాడుతూ వ్యవహరించకుండా... కత్తి మహేష్ జోలికి పోకండి అంటూ స్పష్టమైన ట్వీట్ ఒక్కటి చేసినా.. ఈపాటికి అంతా చల్లబడిపోయ్యేదని అంటున్నారు.

క్షుద్రపూజలా? తోటకూర కట్టా?

  విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో క్షుద్ర పూజలు జరిగాయని, లోకేష్‌ని ముఖ్యమంత్రి చేయడం కోసమే ఈ పూజలు జరిగాయని వైసీపీ నాయకులు గొంతు చించుకుని అరుస్తున్నారు. వీళ్ళ ధోరణిని చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో అర్థం కాని పరిస్థితి. ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా దాన్ని ముఖ్యమంత్రికి ఆపాదించి, దురుద్దేశాలు పులిమి రచ్చ చేయడం జగన్ పార్టీకి మామూలైపోయింది. జనం నోళ్ళలో నానడానికి ఇంతకంటే మంచి మార్గం వీళ్ళకి కనిపిస్తున్నట్టు లేదు. అసలు కనకదుర్గ దేవాలయంలో క్షుద్ర పూజలు నిర్వహిస్తే పదవులు వచ్చేస్తాయని ఎక్కడైనా రాసి వుందా? గతంలో ఎప్పుడైనా ఎవరైనా అలా చేసినట్టు దాఖలాలు ఏవైనా వున్నాయా? లేకపోతే సాక్షాత్తూ కనకదుర్గమ్మే వైసీపీ నాయకుల కలలోకి వచ్చి చెప్పిందా? నిజంగానే తమకు దుర్గమ్మ కలలోకి వచ్చి ఇదంతా చెప్పిందని వైసీపీ నాయకులు చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.   కనకదుర్గ గుడిలో వేళకాని వేళలో ఏవో పూజలు జరిగాయని అంటున్నారు. గుడి ఇ.ఓ. ప్రమేయం కూడా ఇందులో వుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో సమగ్రంగా విచారణ జరుగుతోంది. అసలు విషయం  త్వరలోనే తేలుతుంది. అయితే ఇంతలోనే వైసీపీ నాయకులు ఈ ఇష్యూని తమకు అనుకూలంగా మలచుకోవాలని తెగ తంటాలు పడిపోతున్నారు. దుర్గమ్మకి క్షుద్రపూజలు చేస్తే ముఖ్యమంత్రి అయిపోయేమాట నిజమే అయితే ఈపాటికి ఎవరో కాదు.. సాక్షాత్తూ వై.ఎస్.జగనే ఆ కార్యక్రమం కానిచ్చేసి వుండేవారని తెలుగుదేశం నాయకులు విమర్శిస్తున్నారు. జగన్ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఆయన ఏ క్షుద్రపూజలు చేస్తే అయ్యారో జగన్ పార్టీవాళ్ళే చెప్పాలి. ముఖ్యమంత్రి పీఠం మీదకి ఎక్కాలంటే ప్రజల్లో బలం వుండాలి. ప్రజల నమ్మకం పొందాలి. అంతే తప్ప మంత్రాలకి చింతకాయలు రాలవన్నట్టుగా క్షుద్రపూజలు చేస్తే ముఖ్యమంత్రులు అయిపోరు. అయినా ముఖ్యమంత్రి అవ్వాలన్న ఉద్దేశంతో తన గుడిలో క్షుద్రపూజలు ఎవరైనా చేయిస్తే దుర్గమ్మ చూస్తూ ఊరుకోదు.. వాళ్ళకు తగిన శాస్తి చేసి తీరుతుంది. అంతేకాదు.. తన గుడిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నవారిని కూడా క్షమించదు.

పూనమ్ పై కొల్లు రవీంద్ర క్లారిటీ...

  ఇప్పుడు ఎక్కడ చూసినా కత్తి మహేశ్, పవన్ కళ్యాణ్, పవన్ అభిమానులు, పూనమ్ కౌర్, కోన వెంకట్ వీళ్ల చుట్టే వార్తలన్నీ తిరుగుతున్నాయి. కొన్ని మీడియా ఛానెళ్ళు అయితే అన్ని విషయాలు పక్కన పెట్టి కేవలం ఈ విషయం మీదే ఫోకస్ పెట్టాయి. రోజు మొత్తం ఈ వార్తలనే చూపిస్తూ... రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఇక ఈ ఎపిసోడ్ లోనే కత్తి మహేశ్, పవన్ పై చేసిన విమర్శలకు పూనమ్ కౌర్ స్పందించి.. కత్తిపై పరోక్షంగా కామెంట్లు చేసింది. ఇక పూనమ్ చేసిన ట్వీట్లపై కూడా కత్తి స్పందించి.. ఏకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. పూనమ్ పై ఆరు ప్రశ్నలు సంధించి.. వాటికి సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ వ్యవహారం ఇంకా ముదిరింది.   ఇక పూనమ్ కు ఎవరి సిఫార్స్ మీద ఏపీ చేనేత అంబాసిడర్ పదవి ఇచ్చారన్న ప్రశ్న కూడా ఉంది. దీంతో పూనంకు బ్రాండ్ అంబాసిడర్ పదవి ఎవరిచ్చారు? ఎవరి సిఫార్సుతో ఇచ్చారు? ఏ అర్హతతో ఇచ్చారు? అంబాసిడర్‌గా నియమించడానికి అసలు కారణాలేంటని అనుమానాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు ఇక ఈ వ్యవహారంపై పూనం తమ్ముడు శ్యామ్ సింగ్ కూడా స్పందిస్తూ...పూనం కౌర్ నిఫ్ట్‌లో చదువుకుంది... పూనంకు చేనేతపై పూర్తిగా అవగాహన ఉంది... గత మూడేళ్లుగా ఆమె చేనేతపై ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తోంది. పూనం కృషి చూసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టారు. అంతే తప్ప.. ఎవరూ సిఫార్సుతో ఈ పదవి రాలేదని స్పష్టం చేశాడు.   ఇదిలా ఉండగా ఈ వ్యవహారంపై చేనేత శాఖకు మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర క్లారిటీ ఇచ్చారు. చేనేత వస్త్రాలకు సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ ఎవర్ని నియమించారని ఓ మీడియా ప్రతినిధి కొల్లు రవీంద్రను అడుగగా.... "నేను చేనేత శాఖకు మంత్రిగా ఉన్న సమయంలో చేనేత వస్త్రాలకు సంబంధించి ఎవరినీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించలేదు. అసలు ప్రభుత్వ పరంగా అలాంటి నియామకమే జరగలేదు. ప్రభుత్వ పరంగా అంబాసిడర్‌ను నియమించాలనే చర్చ ఎప్పుడూ జరగలేదు. కొంతమంది చేనేత సంఘ సభ్యులు పవన్‌ కల్యాణ్‌ను అంబాసిడర్‌గా ఉండాలని చెప్పి ఆయన్ను కలిసి కోరారు. ఆ సమయంలో ఆయనకు చేనేత వస్త్రాలు కూడా అందించారు. అంతే తప్ప చేనేత వస్త్రాలకు సంబంధించి ఎవరినీ బ్రాండ్ అంబాసిడార్‌గా నియమించలేదు.. చేనేతకు ఎవరూ బ్రాండ్ అంబాసిడర్‌ లేరు" అని ఆయన తేల్చిచెప్పారు.   మరి పూనమ్ సోదరుడేమో.. పూనంకు చేనేతపై పూర్తిగా అవగాహన ఉంది.. గత మూడేళ్లుగా ఆమె చేనేతపై ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తోంది. పూనం కృషి చూసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టారని చెబుతున్నారు. మరోపక్క.. కొల్లు రవీంద్ర చేనేతకు ఎవరూ బ్రాండ్ అంబాసిడర్‌ లేరు అని అంటున్నారు. మరి ఏది నిజమో... ఎవరు చెప్పింది నిజమో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే..

వైసీపీకే షాకిచ్చిన కత్తి... వైసీపీ ఆగ్రహం....

  కత్తి మహేశ్.. కత్తి మహేశ్.. కత్తి మహేశ్.. ఓరి దేవుడా ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ పేరే వినిపిస్తోంది.. ఏ టీవీ ఛానల్ పెట్టినా ఈయనే కనిపిస్తున్నాడు. ప్రధాని మోడీ దగ్గర నుండి.. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరకూ కూడా ఇంతలా కవరేజ్ ఇవ్వలేదేమో మీడియా వాళ్లు. అంతలా పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు కత్తి మహేశ్ ఇప్పుడు. ఏదో సినిమా క్రిటిక్స్ చెప్పుకుంటూ ఉండే ఈయన.. బిగ్ బాస్ షో కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా అందరికీ పరిచయం. ఆతరువాత ఇక ఎప్పుడైతే పవన్ పై విమర్శలు చేస్తూ వార్తల్లోకి ఎక్కాడో... ఆరోజు నుండి ఈరోజు వరకూ ఆయన ఏదో ఒక ఛానల్ లో కనిపిస్తూనే ఉన్నారు. గత నాలుగు నెలల నుండి ఈ వివాదం నడుస్తూనే ఉంది.   మరోవైపు కత్తి మహేశ్ చేస్తున్న విమర్శలకు పవన్ అభిమానులు ఎలాగూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియా వాళ్లపై కూడా సీరియస్ అవుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఒక్క పవన్ అభిమానులే కాదు.. సామాన్య ప్రజలు కూడా మీడియాపై, కత్తి మహేశ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియాకు ఇదొక్కటే న్యూసా... ఇంకేం లేవా దేశంలో.. రాష్ట్రంలో సమస్యలు అంటూ మండిపడుతున్నారు. అందరి సంగతేమో కానీ ఇప్పుడు వైసీపీ కూడా కత్తి మహేశ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. విచిత్రంగా ఉంది కదా...   ఎందుకంటే.. అసలు వైసీపీ వదిలిన బాణమే కత్తి మహేశ్ అని అందరి టాక్. కత్తి మహేశ్ పవన్ పై అంతలా రెచ్చిపోవడానికి కారణం వైసీపీనే అని.. వైసీపీనే కత్తి మహేశ్ ను నడిపిస్తుందని అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి అలాంటిది కత్తి మహేశ్ పై వైసీపీ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసిందబ్బా అనుకుంటున్నారా..? జగన్ ప్రజాసంకల్పం పేరుతో జగన్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా... అయితే ఛానెల్స్ మొత్తం కత్తి మహేష్ వెంట పడుతున్నాయి తప్పా... జగన్ చేస్తున్న పాదయాత్ర గురించి పట్టించుకునే నాధుడు లేకుండా పోయాడు. అందుకే మెల్లమెల్లగా కత్తి మహేష్ వల్ల జగన్ కి జరుగుతున్న డామేజ్ వైసీపీకి అర్ధం అవుతోంది. దీంతో కత్తి మహేశ్ అంటే కోప్పడుతున్నారట. మొత్తానికి.. వారు విసిరిన బాణం....వారికే వచ్చి తగిలింది పాపం..

అయ్యో జగన్... ఆఛాన్స్ కూడా పోయింది...

  పాపం జగన్ కు ఉన్న ఒక్క ఆశ కూడా ఆవిరైపోయింది. ఇంతకీ ఆ ఆశ ఏంటనుకుంటున్నారా.. ఇంకేముంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని కేసుల నుండి బయటపడదామన్న ఆశ. కానీ అది కూడా జరగదని అర్దమైపోయింది. జగన్ ఎప్పటినుండో బీజేపీతో పొత్తు కోసం ఆర్రులు చాస్తున్న సంగతి తెలిసిందే. ఏదో పైకి అదేం లేదు అని జగన్ అండ్ కో బ్యాచ్ కవరింగ్ ఇస్తున్నా... మోడీతో చేతులు కలపడానికి ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలేనే పలుమార్లు ఎంపీ విజయసాయిరెడ్డి కూడా రాయబారం నడిపినట్టు..దీనిలో భాగంగానే ఆయన మోడీని కలిసినట్టు వార్తలు వచ్చాయి. ఇక మిత్రపక్షాలైన టీడీపీ-బీజేపీ ఈ మధ్యకాలంలో ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకునే పనిలో పడ్డారు. బీజేపీ నేతలైతే కాస్త ఎక్కువగానే నోరు పారేసుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తమ పార్టీ లేకపోతే టీడీపీ లేదు అన్న రేంజ్ లో మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్లు. మరి దీనికి టీడీపీ నేతలు ఊరుకుంటారా..? ఏదో మాతో పొత్తు ఉంది కాబట్టి మీకు ఆ నాలుగు సీట్లైనా వచ్చాయి అని వాళ్లు అంటున్నారు. వెరసి రెండు పార్టీల మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది.   ఇక ఇదే అదనుగా భావించిన జగన్ బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. బీజేపీ ఏం తక్కువ తినలేదు... ఆ పార్టీ పెద్దలు కూడా వైసీపీ పార్టీతో ముందుకు పోవాలన్న ఆలోచన చేసినట్టు వార్తలు వచ్చాయి. అందుకే జగన్ కు అపాయింట్ మెంట్ ఇచ్చి మరీ మాట్లాడారు. ఆఖరికి ఏమైంది నంద్యాల ఎన్నికల్లో దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది. వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటో.. మోడీగారికి బాగా అర్ధమైంది. అందుకే అప్పుడు కాస్త మారారు. ఇక గుజరాత్ ఎన్నికలు ఆయనలో పూర్తి మార్పు తీసుకొచ్చాయనుకోండి. అది ఎంతలా అంటే ఆయనే స్వయంగా చంద్రబాబుతో మాట్లాడతానని మన ఎంపీలకు చెప్పడమంత. రెండు రోజుల క్రితం టీడీపీ, బీజేపీ ఎంపీలు మోడీని కలిసిన నేపథ్యంలో... ఏపీకి తాను అండగా ఉంటానని.. ఈ విషయం నేను చంద్రబాబుతో మాట్లాడతానని మోడీ చెప్పారట. మోడీ చేసిన ఈ వ్యాఖ్యలకు ముందు ఎంపీలు షాకైనా... ఆతరువాత గుజరాత్ ఎన్నికల తరువాత.. మోడీ, షా కి చంద్రబాబు ప్రాధాన్యత ఏమిటో తెలిసొచ్చిందని అనుకున్నారట. అంతేకాదు ఎంపీలు కలిసిన రెండో రోజే.. ఈ నెల 12 న చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇస్తున్నట్టు పీఎంఓ నుంచి బాబుకి పిలుపు వచ్చింది. దీంతో జగన్ బ్యాచ్ కు షాక్ తగిలింది. ఏదోలా పొత్తు పెట్టుకొని... తనపై ఉన్నకేసుల నుండి బయటపడొచ్చు కదా అని ఆశలు పెట్టుకున్న జగన్ కు మోడీ షాకిచ్చారు. జగన్ కు నిరాశే మిగిలింది. 

ఈ ప్రశ్నలకు పూనమ్‌కౌర్ సమాధానం చెబుతుందా..?

పవన్‌కళ్యాణ్, పూనం కౌర్‌లకు బహిరంగ సవాల్ విసురుతూ.. ఇవాళ ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ వద్ద మీడియా మీట్‌ను ఏర్పాటు చేశారు కత్తిమహేశ్. ఈ సందర్భంగా మీడియా సాక్షిగా పూనంకౌర్‌కు కొన్ని ప్రశ్నలు సంధించి... వాటికి సమాధానం చెప్పాలంటూ సవాల్ విసిరారు. * మీకు బ్రాండ్ అంబాసిడర్‌గా పదవి ఎవరి వల్ల వచ్చింది * తిరుమలలో పవన్ పక్కన నిల్చొని ఒకే గోత్ర నామాలతో పూజ చేసుకున్నారా లేదా..? * పవన్ మోసం చేశాడన్న బాధతో మీరు ఆత్మహత్యాయత్నం చేస్తే మిమ్మల్ని ఎవరు కాపాడారు..? మిమ్మల్ని ఆసుపత్రిలో ఎశరు చేర్చారు..? ఆ బిల్స్ ఎవరు కట్టారు..? * పవన్ మీ అమ్మగారిని కలిసి ఏం ప్రామీస్ చేశాడు..? ఆ మాటను ఆయన నెరవేర్చాడా..? * నరసింగ్‌ అనే క్షుద్ర మాంత్రికుడితో పవన్, త్రివిక్రమ్ కలిసి క్షుద్రపూజలు చేస్తే.. ఆ ప్రదేశంలో ఉండి మీరు ఏం చేశారు..? * త్రివిక్రమ్ అంటే ఎందుకంత కోపం..?

ప్రదీప్‌కు అందరూ ఎందుకు వత్తాసు పలుకుతున్నారో తెలుసా..?

  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చాలామంది విపరీత ధోరణులున్న మనుషులు ఒక కోరికని బలంగా వ్యక్తీకరిస్తున్నారు... ‘‘యాంకర్ ప్రదీప్ తప్పతాగి డ్రైవ్ చేసి చాలా పెద్ద నేరం చేశాడు.. నీతులు చెప్పిన అతనే డ్రంకెన్ డ్రైవ్ చేశాడు.. అంచేత  అతనికి జైలుశిక్ష పడాలి. యాంకర్‌గా అవకాశాలన్నీ పోవాలి... చివరికి బికారిగా మిగలాలి’’ ఇదీ వరస! ఇలాంటి ధోరణులకు వత్తాసు పలికే మీడియా, సోషల్ మీడియా వుండనే వున్నాయి. వీళ్ళు కూడా తమ శాయశక్తులా కథనాలను వండివారుస్తున్నారు. తమ బుర్రకి తోచిన ఊహాగానాలను జనంలోకి వదులుతున్నారు. ప్రదీప్‌ని యాంకర్‌గా ఎంకరేజ్ చేయకూడదని ఛానళ్ళు నిర్ణయించుకున్నాయనే గాలివార్త కూడా వీటిలో ఒకటి. అసలింతకీ ప్రదీప్ అంత పెద్ద నేరం చేశాడా? తాగి డ్రైవ్ చేయడమే ఘోరమా? ఈమాత్రం దానికే అతనికి జైలుశిక్ష పడిపోవాలా?   హైదరాబాద్‌లో ప్రతిరోజూ డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు జరుగుతూనే వుంటాయి. రోజుకు వేలాదిమంది పోలీసులకు దొరికిపోతూ వుంటారు. ఫైనో, చిన్నపాటి శిక్షలో విధిస్తూ వుంటారు. అలాంటి వేలాదిమందిలో ప్రదీప్ కూడా ఒకడు. అది కూడా ప్రపంచమంతా తాగి తందనాలు ఆడే న్యూ ఇయర్ రోజునే ప్రదీప్ తాగి డ్రైవ్ చేశాడు. ఖర్మ కాలి, దరిద్రం నెత్తిమీద వుండి దొరికిపోయాడు. ప్రదీప్‌ని పోలీసులు పరీక్షిస్తే సదరు మీటరు 178 చూపించిందట. అదేదో మర్డర్ చేసి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయినట్టు కొంతమంది ఫీలింగ్. మీటర్ అంత చూపించింది కాబట్టి ప్రదీప్‌కి శిక్ష పడటం ఖాయమని ఎవరికి వారే జడ్జిలు అయిపోయి తీర్పులు ఇచ్చేస్తున్నారు. మర్డర్ చేసి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన వాళ్ళకే శిక్ష పడని ఈ రోజుల్లో ఏదో పొరపాటుగా చేసిన చిన్న తప్పుకి జైలు శిక్షల వరకూ వెళ్ళడం ఎంత వరకు న్యాయం? న్యూ ఇయర్ రోజున హైదరాబాద్‌లో ప్రదీప్‌తోపాటు కొన్ని లక్షల మంది తప్పతాగారు. కొన్ని వేల మంది డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిపోయారు. ప్రదీప్‌ని పోలీసులు పరీక్షించినప్పుడు మీటర్ చూపించింది 178. అయితే మీటర్ 5 వందలకు మించి చూపించిన మహాతాగుబోతులు చాలామంది ఆరోజు దొరికారు. వాళ్ళతో పోలిస్తే ప్రదీప్ చాలా బెటర్ కదా!   పొరపాట్లు అందరూ చేస్తారు.. నీతులు చెప్పాడు కాబట్టి పొరపాటు చేయకూడదు... డ్రంకెన్ డ్రైవ్ చేయొద్దని చెప్పిన ప్రదీపే తాగి డ్రైవ్ చేశాడు కాబట్టి శిక్షించాలని కొంతమంది వాదిస్తున్నారు. నీతులు చెప్పేవారు తప్పు చేస్తే శిక్షించేపనయితే మన దేశంలో చాలమంది రాజకీయ నాయకులని, అధికారులని, ఉన్నత స్థానాల్లో వున్నవారిని అర్జెంటుగా శిక్షించాలి. వారిని శిక్షించే శక్తి మన వ్యవస్థకు లేనప్పుడు ప్రదీప్‌ని మాత్రం ఎందుకు శిక్షించాలి? అతనికి ఒక్క అవకాశం ఎందుకు ఇవ్వకూడదు? ఎప్పుడో ఏ మహానుభావుడో చెప్పినట్టు... మనలో పాపం చేయనివాడు ఎవరో చెప్పండి.. ఏ లోపం లేనివాడు ఎవరో చూపండి...

రోజాగారు మరీ ఇంత అరాచకమా... జగన్ బాహుబలి.. మరి మీరు...?

సాధారణంగా బాహుబలి అంటే మనకు ఎవరు గుర్తొస్తారు... ఇంకెవరూ ఆరడుగుల ఆజానుబాహుడు ప్రభాస్. అయితే పొలిటికల్ లో బాహుబలి ఎవరో మీకు తెలుసా...? ఇంకెవరూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. జగన్ కు ఈ పేరు పెట్టింది ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు.. జగన్ ను అన్నగా భావించే.. నోరు తెరిస్తే అద్భుతంగా మాట్లాడే, వైసీపీ ఎమ్మల్యే రోజా గారు.   సీఎం చంద్రబాబుపై  విమర్శలు చేయమంటే వైసీపీ ఎమ్మెల్యే రోజా ఒంటికాలుపై లేస్తుందని అందరికీ తెలుసు. సీఎం అని కూడా చూడకుండా.. చంద్రబాబుపై నోరు పారేసుకుంటుంది. చంద్రబాబును ఎంతగా విమర్శిస్తే..వైసీపీ అధినేత జగన్ వద్ద అన్ని మార్కులు కొట్టేయొచ్చన్న ప్లాన్‌తో రోజా పలు మార్లు నోరు జారిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా చంద్రబాబును విమర్శిస్తూ సినిమా డైలాగ్స్ వేసింది. ఒక్క చంద్రబాబునే కాదు.. ఢిల్లీలో ఉన్న పెద్దలను కూడా రోజా ఇదే సినిమా డైలాగులతో పోల్చారు. ఎప్పటిలాగానే చంద్రబాబుపై విమర్శలు గుప్పించే క్రమంలో... చంద్రబాబుపై యువత తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆమె అన్నారు. చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెబితే ఎంత పద్ధతిగా ఉంటుందో, ఎంత గట్టిగా ఉంటుందో రుచి చూపించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. జగన్‌పై తప్పుడు కేసులు పెట్టించి 16 నెలలు జైల్లో పెట్టించినా చెక్కు చెదరని చిరునవ్వుతో అన్ని సమస్యలను ఎదుర్కొంటున్న జగనన్నను ఒకసారి చూడాలని.. ధైర్యానికి కేరాఫ్ అడ్రస్ ఎవరని అంటే.. జగన్మోహన్ రెడ్డని రోజా అన్నారు. అంతేకాదు... జగన్ బాహుబలిలా, ఢిల్లీలో శివగామి, ఏపీలో భళ్లాలదేవుడి కుట్రలకు ఎదురొడ్డి చిరునవ్వుతో ఎదుర్కొంటున్నారని రోజా జగన్ పై పొగడ్తలు కరిపించారు. అంటే ఇక్కడ శివగామి అంటే మోడీ అని రోజాగారి ఉద్దేశ్యమా. మొత్తానికి ఈ దేశంలో జగన్ ఒక్కడే పోటుగాడు అని, దేశం మొత్తంలో ఉన్న మిగతా రాజకీయ నాయకులు చేతకాని వారని తేల్చి చెప్పింది రోజా... మరి చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్టు... వింటున్నాం కదా.. రోజా మేడం గారు ఏదిపడితే అది మాట్లాడి జగన్ పరువే తీస్తున్నారు. పాపం ఆ సంగతి ఆమెకు అర్ధం కావట్లేదు.

కింగ్‌ మేకరే.. కింగ్‌ కాలేడు

  అభిమానులను ఊరించి.. ఊరించి ఫైనల్లీ తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక తలైవా ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చాడో.. ఒక్కసారిగా తమిళనాట మాత్రమే కాదు.. జాతీయ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు... ర‌జ‌నీ పార్టీ పేరేంటి ? ఆయ‌న పార్టీ ప్ర‌భావం త‌మిళ‌నాడులో ఎంత వ‌ర‌కు ఉంటుంది ? ఆయన ఒంటరిగా బరిలో దిగుతారా...? లేక పొత్తులతో ఎన్నికల బరిలో దిగుతారా...? ఎక్క‌డిక‌క్క‌డ హాట్ హాట్‌గా పొలిటిక‌ల్ డిస్క‌ర్ష‌న్లు న‌డుస్తున్నాయి. ఇక ఎవరి చర్చల్లో వారుంటే.. జ్యోతిష్యులు కూడా వారి పనిలో వారున్నారు.   రాజకీయాల్లో జ్యోతిష్యాలు చూడటం.. జోస్యాలు చెప్పడం కామనే. దీనిలో భాగంగానే... కర్ణాటకకు చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు ప్రకాష్‌ అమ్మునై అప్పుడే రజనీగారి జోస్యం చెప్పారు. రజనీ జాతకాన్ని పరిశీలించిన ప్రకాష్‌.. తలైవాకి ముఖ్యమంత్రి అయ్యే యోగం ఏ మాత్రం లేదని తేల్చేశారు.  ‘‘రజనీకాంత్‌ ప్రజలను ఆకర్షించే సత్తా ఉన్న వ్యక్తి...మకర రాశి, సింహ లగ్నంలో జన్మించిన రజనీకాంత్‌కు రాజకీయాల్లో అడ్డు ఉండబోదని.. ఆయన రాజకీయాల్లోకి వస్తే ఖచ్ఛితంగా రాణించగలరు అని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తే గెలవటం ఖాయం... కానీ, ముఖ్యమంత్రి పదవిపై మాత్రం ఆయన ఆశలు పెట్టుకోకపోవటమే మంచింది. ఆయన కింగ్‌ మేకర్‌ అవుతారే తప్ప.. కింగ్‌ కాలేరు’’ అని తేల్చిచెప్పేశాడు. అంతేకాదు.. సొంతవాళ్లే వెన్నుపోటే ప్రమాదం పొంచి ఉందని.. కాబట్టి రజనీ రాజకీయాలపరంగా ఎవరినీ నమ్మకపోవటమే మంచిదని ఆయన సూచిస్తున్నారు.   మరి ఇక్కడ ఏపీలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కూడా సీఎం యోగం లేదని జ్యోతిష్యుడు వేణుస్వామి జోస్యం చెప్పారు. ఇక్కడ తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకి కూడా సీఎం యోగం లేదని ప్రకాష్‌ అమ్మునై జోస్యం చెప్పారు. మరి ముందు ముందు రాజకీయాలు ఎలా మారుతాయి.. వీళ్లకు నిజంగానే సీఎం అయ్యే యోగం ఉందో..? లేదో..? వీళ్ల జోస్యం నిజమవుతుందో..? లేదో..? తెలియాలంటే మనం కూడా వెయిట్ చేయాల్సిందే.

జగన్ దీనికి సమాధానం చెప్పు..

  ఎప్పుడూ అధికార పార్టీ పైన విమర్శలు గుప్పించడం... ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా చంద్రబాబును కాల్చి చంపండి.. ఉరితీయండి అంటూ వైసీపీ అధినేత జగన్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటాడు. అంతేకాదు.. ఎప్పుడూ చంద్రబాబు అది చేయలేదు.. ఇది చేయలేదు.. దానికి సమాధానం చెప్పాలి... దీనికి సమాధానం చెప్పాలి అంటూ విమర్శించమే పని. కానీ జగన్ మాత్రం సమాధానం చెప్పాల్సిన వాటికి మాత్రం చెప్పకుండా..కాలం వెల్లదీస్తున్నాడు.   అక్రమాస్తుల కేసులో భాగంగా ఈడీ ఇప్పటికే చాలాసార్లు జగన్ ఆస్తులను అటాచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. గతంలోనూ వందల కోట్ల జగన్ ఆస్తులు అటాచ్ చేసింది. అయితే గత కొద్దరోజులుగా ఏలాంటి వార్తలు లేవు కానీ..మరోసారి జగన్ ఆస్తులు అటాచ్ మెంట్ చేసింది ఈడీ. ఆస్తులు జప్తు చేస్తున్నట్టు పత్రికా ప్రకటన జారీ చేసింది. దీంతో ఈడీ ఇచ్చిన షాక్ కు జగన్ క్యాంపులో ఆందోళన మొదలైంది. మొన్నటివరకూ.. నెమ్మదించిన జగన్ కేసులు, ఇప్పుడు మరో సారి స్పీడ్ పెంచుకోవడంతో  ఏమి జరుగుతుందో అనే టెన్షలో ఉన్నారు జగన్ అండ్ కో బ్యాచ్.   మరి అన్ని విషయాలపై రియాక్ట్ అయ్యే జగన్ తన విషయాల గురించి ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదని అంటున్నారు. తన ఆస్తులు ఈడీ ఎందుకు జప్తు చేస్తుందో.. దానిపై ఎందుకు జగన్ సమాధానం చెప్పడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే  తెలుగుదేశం నేత వర్ల రామయ్య జగన్ తీరుపై మండిపడ్డారు. జగన్ ఆస్తులను ఈడీ అటాచ్ చేయడం ఇదేం ఫస్ట్ టైమ్ కాదు.. ఇప్పటికి చాలాసార్లు అటాచ్ చేసింది.. అయినా జగన్ దీనిపై ఎందుకు స్పందించడంలేదు.. తన ఆస్తులు ఈడీ ఎందుకు జప్తు చేస్తుందో జగన్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్ కు ఉంది కదా... అలా కాకుండా... జగన్.. పార్టీ నేతలు తేలు కుట్టిన దొంగల్లా కూర్చున్నారని అన్నారు. ఈడీ వంటి అథారిటీ ఆస్తులు సీజ్ చేసిందంటే..జగన్ వి అక్రమ ఆస్తులని ఆయన ఒప్పుకున్నట్టే అని అన్నారు. భారతదేశంలో నైతిక విలువలకు తిలొదకాలిచ్చిన రాజకీయ నాయకుడు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అని వర్ల రామయ్య విమర్శించారు. అంతేకాదు.. ఆస్తుల జప్తుపై వైసీపీ వివరణ ఇవ్వగలదా.. ఇవి అక్రమ ఆస్తులు కాదు కష్టార్జితమని చెప్పగలరా అని వర్ల రామయ్య ప్రశ్నించారు. మరి దీనిపై జగన్ సమాధానం చెబుతాడా...? జగన్ సమాధానం చెబుతాడు అని అనుకోవడం మన అమాయకత్వం అని అనుకోవచ్చు.. ప్రజాస్వామ్యంలో నాయకుడిగా ఉన్నప్పుడు ఏదైనా ఆరోపణలొచ్చినప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాజకీయ నాయకులకు ఉంటుందన్న విషయాన్ని జగన్ అప్పుడు కావాలనే మరిచిపోతుంటారు.

చంద్రబాబు సాధించాడుగా...

  మొత్తానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుకున్నది సాధించాడు. ఇప్పటివరకూ నెలకొన్న గందగోళానికి ఎలాగూ తెర పడింది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అడ్డుపుల్ల వేసిన సంగతి తెలిసిందే కదా. పోలవరం కొంత పన్నుల్లో భాగంగా.. ఏపీ ప్రభుత్వం టెండర్లకు పిలుపునివ్వగా... దానికి కేంద్రం అడ్డుకుంది. ఇక అంతే.. అప్పటినుండి చంద్రబాబుపై ఒకటే విమర్శలు గుప్పించారు ప్రతిపక్షపార్టీ నేతలు. కావాలనే చంద్రబాబు ఇలా చేస్తున్నారని ఎన్నో కామెంట్లు చేశారు. కేంద్రం చేసిన పనికి ఎంతో సహనంగా ఉన్న చంద్రబాబు కూడా కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు కేంద్రం దిగొచ్చింది. పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వే, స్పిల్ చానల్ నిర్మాణానికి ప్రత్యేకంగా టెండర్లు పిలవాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం ఒకే చేసింది.   అసలయితే ఈ పనులన్నీ ప్రధాన కాంట్రాక్టర్ అయిన ట్రాన్స్ టాయ్ చేయాలి. కానీ ఆర్ధిక పరిస్థిలను ఆలోచించి... చంద్రబాబు సబ్ కాంట్రాక్టులు పెట్టించి పనుల్లో వేగం పెంచారు. దీంతో అత్యంత కీలకమైన పనులు ట్రాన్స్ టాయ్ చేస్తుంది.. చిన్నచిన్న వర్క్ సబ్ కాంట్రాక్టర్లు చేస్తున్నారు. అయితే ఈ పనుల్లో కూడా వేగం మందగించడంతో... ఆ పనుల్లో కొంత భాగం విడదీసి కొత్త టెండర్లకు పిలుపునిచ్చింది. అయితే దానికి ట్రాన్స్ టాయ్ అభ్యంతరం చెప్పింది. జలవనరుల శాఖకు పిర్యాదు చేసింది. దీంతో కేంద్రం ఏపీ పిలుపునిచ్చిన టెండర్లను నిలిపివేసింది. దీంతో కేంద్రంపై చంద్రబాబుతో పాటు ఏపీ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ కాఫర్‌ డ్యాం పేరుతో ఏపీ ప్రభుత్వం ప్రకటించిన టెండర్లను సైతం ఆపేసిన కేంద్రానికి జాతీయ జల విద్యుత్ పరిశోధన బృందం ఓ ఝలక్ ఇచ్చింది.  ఓ వైపు నుంచి కాఫర్‌ డ్యాం, మరోవైపు నుంచి ప్రధాన డ్యాం నిర్మించుకుంటూ వెళ్లి వీటిని అనుసంధానించడం ద్వారా నీటిని నిలబెట్టుకోవచ్చంటూ జాతీయ జల విద్యుత్ పరిశోధన బృందం (ఎన్‌హెచ్‌పీసీ) కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చేసింది. చంద్రబాబు కూడా స్వయంగా కేంద్ర జలవనరులశాఖ మంత్రి గడ్కరీతో మాట్లాడారు. ఇక చంద్రబాబు బాధను కూడా అర్దం చేసుకున్నకేంద్రం టెండర్లకు పిలుపునిచ్చింది. దీంతో చంద్రబాబు కల తీరే అవకాశం దక్కింది. ఏది ఏమైనా చంద్రబాబు అనుకున్నది సాధించారు...

రోజా హారతి ఇచ్చింది... ఈడీ షాకిచ్చింది...

  యాదృశ్చికమో లేక రోజా టైం బ్యాడో తెలియదు కానీ కరెస్ట్ టైంకే అన్నీ జరుగుతాయి. ఇప్పటికే రోజాది ఐరెన్ లెగ్ అని పలు విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఇప్పటికి ఎన్నో సంఘటనలు నిరూపించాయి. ఇప్పుడు తాజాగా మరో ఘటన ఇటీవల జరిగిన నంద్యాల ఉపఎన్నికల్లో ఓడి పోవడానికి ఓ రకంగా రోజానే కారణమని సొంత పార్టీ నేతలే తిట్టుకున్నారు. ఆతరువాత.. రోజా తిరుమలపై కొబ్బరికాయ కొట్టింది.. పాదయాత్ర ఆగింది అని అన్నారు. ఇక జగన్ పాదయాత్రలో భాగంగా.. అనుమతి లేకుండా ఓ మహిళా సదస్సును.. నిర్వహించారన్న ఆరోపణలతో జగన్ పై కేసు నమోదు చేశారు. ఇక ఇప్పుడు మరోసారి జగన్ కు షాక్ తగిలింది. గతంలో అక్రమాస్తుల కేసులో భాగంగా... జగన్ ఆస్తుల్ని అటాచ్ చేసిన ఈడీ.. ఇప్పుడు.. ఆయన ఆస్తులను జప్తు చేస్తున్నట్టు ప్రకటన చేసింది. కంపెనీల్లోకి పెట్టుబడుల రూపంలో నిధులు మళ్లించి అప్పటి వైఎస్‌ ప్రభుత్వం నుంచి భారీగా లబ్ధి పొందిన ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి, ఆయనకు సహకరించిన మరో రెండు సంస్థలకు చెందిన రూ.117 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. దీంతో ఈడీ ఇచ్చిన షాక్ కు జగన్ క్యాంపులో ఆందోళన మొదలైంది. మొన్నటివరకూ.. నెమ్మదించిన జగన్ కేసులు, ఇప్పుడు మరో సారి స్పీడ్ పెంచుకోవడంతో...ఈ  ఏమి జరుగుతుందో అనే టెన్షలో ఉన్నారు జగన్ అండ్ కో బ్యాచ్.   ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ వార్త మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఎవరి గురించి అనుకుంటున్నారా..? ఇంకెవరు గురించి.. రోజా గురించే. పాదయాత్రలో భాగంగా జగన్ నిన్న నగరి చేరుకున్న నేపథ్యంలో.. రోజా స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. బొట్టు పెట్టి, హారతి ఇచ్చి మరీ స్వాగతం పలికారు. కట్ చేస్తే.. ఈరోజు ఈడీ షాక్. మరి ఏ చిన్న పాయింట్ దొరికినా నెటిజన్లు ఊరుకుంటారా..? రోజా హారతి ఇచ్చింది.. జగన్ కు ఈడీ షాకిచ్చింది అంటూ కామెంట్లు మొదలయ్యాయి.

ప్రదీప్ వెనుక ప్రముఖ వ్యక్తి... నేను చూసుకుంటా...

  బుల్లి తెరపై అందరూ మహిళా యాంకర్లే రాజ్యమేలుతున్న సమయంలో.. మేల్ యాంకర్ గా అడుగుపెట్టి చాలా తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు ప్రదీప్. ఇప్పటి వరకు ప్రదీప్ పై ఎలాంటి రూమర్లు కానీ... వివాదాలు కానీ లేవు. ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న ప్రదీప్ పై తోటి యాంకర్లకు మంచి అభిప్రాయం ఉంది. కానీ పాపం న్యూ ఇయర్ రోజు ఒక్క తప్పు చేసి అడ్డంగా బుక్కయ్యాడు. డిసెంబర్ 31న అర్ధరాత్రి తర్వాత మోతాదుకు మించి మద్యం తాగి పోలీసులకు చిక్కాడు ప్రదీప్. ఇక అంతే మీడియాకు మాంచి న్యూస్ దొరికింది. దొరికింది ఒక్కసారి అయితే.. రోజు మొత్తం ప్రదీప్ ను బద్నాం చేసింది మీడియా. ఒక విధంగా, మీడియా తప్ప.. చాలామంది ప్రదీప్ కు సపోర్ట్ గా నిలిచారు.   సోషల్ మీడియాలో అయితే తప్పతాగి దొరికి పోయిన ప్రదీప్ అని, న్యూఇయర్ రోజు తాగి దొరికిపోయిన ప్రదీప్ అని, ప్రదీప్ పక్కన ఉన్నఅమ్మాయిలు ఎవరూ అని, అబ్పో ఎవరికి నచ్చిన టైటిల్స్ వాళ్లు పెట్టుకొని రచ్చ రచ్చ చేశారు. దాని తరువాత...ఇప్పుడు ప్రదీప్ పరిస్థితి ఏంటి... ప్రదీప్ కు జైలు శిక్ష పడుతుందా...? లేక కేవలం ప్రదీప్ కు కౌన్సిలింగ్ మాత్రమే ఇచ్చి పంపిస్తారా..? ఇలా లెక్కకు మించి ప్రశ్నలు వేశారు. అయితే పోలీసులు కౌన్సిలింగ్ కు రావాలని కోరినా ప్రదీప్ ఇంత వరకూ హాజరు కాలేదు. అయితే కేసు నుంచి తప్పించుకునేందుకు అతను జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అందుకే అజ్ఞాతంలో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి.   ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే....కేసు నుంచి తప్పిస్తానని ప్రదీప్ కు ఓ ప్రముఖ వ్యక్తి హామీ ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. ఏమీ కాదని, కొన్ని రోజులు మౌనంగా ఉండాలని, ఆ తర్వాత అంతా సర్దుకుంటుందని, బయటపడతావని..ఏం జరగకుండా చూసుకుంటానని సదరు ప్రముఖ వ్యక్తి.. ప్రదీప్‌కు హామీ ఇచ్చారని గాసిప్ రాయుళ్లు పుకార్లు పేలుస్తున్నారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే సీజ్ చేసిన కారును తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. దీంతో ఇప్పుడు ఆ ప్రముఖ వ్యక్తి ఎవరబ్బా అని చర్చ సాగుతోంది. ఇంతకీ, ప్రదీప్ కు బరోసా ఇచ్చిన ఆ వ్యక్తి ఎవరబ్బా...?