ఉద్యోగంలో ఒత్తిడి ఉండవచ్చు! కానీ...

ఉద్యోగంలో ఒత్తిడి ఉండవచ్చు! కానీ...
ఒత్తిడితో చేసే ఉద్యోగం వల్ల నానారకాల రోగాలు మనల్ని పట్టిపీడిస్తాయంటూ ఆ మధ్య కొన్ని పరిశోధనలు నిరూపించాయి. సదరు ఒత్తిడితో పాటుగా ఊబకాయం, రక్తపోటు, గుండెజబ్బులు వంటి అనారోగ్యాలన్నీ మనల్ని చుట్టుముడతాయని తేలిపోయింది. కానీ తాజాగా ఒక పరిశోధన ఒత్తిడిలో చేసే ఉద్యోగం మంచిదే అంటోంది. కాకపోతే దాని కోసం కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోక తప్పదని చెబుతోంది.

ఏడేళ్ల పరిశీలన
ఇండియానా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తమ పరిశీలన కోసం ఒక 2,363 మంది ఉద్యోగులను ఎన్నుకొన్నారు. వీరందరూ కూడా యాభై ఏళ్లు పైబడినవారే. ఇలా ఎన్నుకొన్న అభ్యర్థులని ఏడేళ్ల పాటు నిశితంగా గమనించారు. ఈ పరిశీలనలో ఉద్యోగంలో ఒత్తిడికీ, మరణాలకీ ఖచ్చితమైన సంబంధం బయటపడింది. ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు చేసేవారు త్వరగా చనిపోయేందుకు 15.4 శాతం అధికమైన అవకాశం ఉన్నట్లు తేలింది. పనిలో పనిగా బయటపడిన మరో ఫలితం వారిని నిర్ఘాంతపరిచింది.

ఒత్తిడితో మృత్యువు దూరం
ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ, నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఎక్కువగా ఉన్న ఉద్యోగులు సుదీర్ఘకాలం బతికినట్లు తేలింది. ఉద్యోగం ఎంత కఠినమైనదైనప్పటికీ, లక్ష్యాలు ఏర్పరిచే అవకాశం దగ్గర్నుంచీ వాటిని సాధించే విధానం దాకా అన్నీ ఉద్యోగికి అందుబాటులో ఉన్నప్పుడు అది అతని ఆరోగ్యం మీద అనుకూల ప్రభావమే చూపుతోందని తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు త్వరగా చనిపోయే అవకాశం ఏకంగా 34 శాతం తక్కువగా ఉందట.

ఒత్తిడి ఒకోసారి బాగుంటుంది
ఒక పక్క ఒత్తిడిలో ఉండి, దానిని పరిష్కరించేందుకు ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేని వ్యక్తులు... సదరు ఒత్తిడిని అధిగమించేందుకు అతిగా తినడమో, సిగిరెట్లు కాల్చడమో వంటి పనులు చేస్తుంటారట. ఇక మనసులోనే తిష్టవేసుకునే ఒత్తిడి వలన రక్తపోటు ఎలాగూ తప్పదు. అదే సమయంలో బాధ్యతలూ నీవే, హక్కులూ నీవే అన్న భరోసాని ఉద్యోగికి కల్పించినప్పుడు అతను అదే ఒత్తిడిని ఒక సవాలుగా తీసుకుంటాడు. దానిని ఎదుర్కోవడాన్ని, తద్వారా తనని తాను నిరూపించుకోవడాన్నీ ఇష్టపడతాడు.

వింటానికి బాగుంది కానీ...
‘నిర్ణయాలు తీసుకునే అధికారం’ అన్న వాక్యం వినడానికి బాగుంది కానీ... ఆ అదృష్టం ఎంతవరకూ, ఎంతమందికి లభిస్తుందన్నదే అనుమానం. ఒత్తిడి మాత్రమే ఉండి స్వేచ్ఛ లేని సందర్భాలలో దానిని ఎదుర్కొనేందుకు మనసుని స్థిరంగా ఉంచుకోవడం, శ్వాస మీద ధ్యాస ఉంచడం, సమయానికి ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం... వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించమని చెబుతున్నారు. వినడానికి బాగానే ఉంది కానీ, వీటిని ఎంతమంది పాటిస్తారన్నదే అనుమానం!!!

 

- నిర్జర.