శభాష్ ఇండియా
posted on May 3, 2015 3:31PM

ఇండియా... అంతర్గతంగా ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా శభాష్ అనిపించుకుంటున్న దేశం. ఒక పక్క పాకిస్థాన్, మరోపక్క చైనా, అన్నిటికీ మించి అమెరికా దేశాలు ఇండియా సహనానికి ఎన్ని పరీక్షలు పెడుతున్నప్పటికీ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకువెళ్తోంది. ప్రపంచ దేశాలతో స్నేహం చేసే విషయంలో, మిత్రధర్మం పాటించే విషయంలో, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడే విషయంలో, ఆపత్కాలంలో ఆదుకునే విషయంలో ఇండియా అనేక దేశాల కంటే ముందు వుంటోంది. ఇటీవల పొరుగు దేశమైన నేపాల్‌లో అత్యంత భయంకరమైన భూకంపం సంభవించినప్పుడు భారతదేశం చూపించిన చొరవ, చేసిన సాయం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
నేపాల్‌లో భూకంపం సంభవించగానే మొట్టమొదట స్పందించి, ఎవరూ అడగకుండానే సహాయ కార్యక్రమాలను ప్రారంభించిన దేశం ఇండియా. భూకంపం సంభవించిన సమయంలో తక్షణం అందాల్సిన సాయం శిథిలాల నుంచి క్షతగాత్రులను రక్షించడం, ఆ తర్వాత వారందరికీ ఆహారం, వసతి, వైద్య సదుపాయాలు అందించడం, భూకంప ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని ఇతర ప్రాంతాలకు తరలించడం... ఈ పనులన్నీ భారత సైనిక దళాలు విజయవంతంగా నిర్వహించాయి. నేపాల్ వాసులను ఆదుకోవడం మాత్రమే కాకుండా, నేపాల్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించడంలో కూడా భారత సహాయక బృందాలు ఎంతో చాకచక్యంగా వ్యవహరించాయి.
నేపాల్ భూకంపం సమయంలో భారత దేశం వ్యవహరించిన తీరుకు అంతర్జాతీయంగా ప్రశంసలు లభిస్తు్న్నాయి. ఇండియాకు ఆగర్భ శత్రు దేశమైన పాకిస్థాన్ నుంచి కూడా ప్రశంసలు అందాయి. పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీప్ మన ప్రధాని నరేంద్ర మోడీకి స్వయంగా ఫోన్ చేసి కొనియాడారంటే ఈ విషయంలో భారతదేశం వేసిన ముందడుగును అర్థం చేసుకోవచ్చు. నేపాల్‌కి అటువైపు సరిహద్దులో వున్న చైనా మొన్నటి వరకూ నేపాల్ మీద లేనిపోని ప్రేమ ప్రదర్శిస్తూ వుంటుంది. నేపాల్‌లో వున్న హిమాలయాను తొలచి నేపాల్‌కి - చైనాకు మధ్య భూగర్బ రైల్వే మార్గాన్ని నిర్మించాలని, తద్వారా ఇండియా మీద దాడి చేసే సులభ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తోంది. అలాంటి చైనా కూడా భూకంప సమయంలో నేపాల్‌ని ఆదుకున్నది శూన్యం. ఆదుకునే విషయాన్ని అలా వుంచి, నేపాల్‌లో చిక్కుకుపోయిన తన దేశస్థులను తరలించుకునే కార్యక్రమం కూడా చేయలేక చేతులెత్తేసింది.