మీడియాని నియంత్రించాల్సింది ఇలా...



టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మీడియాని నియంత్రించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే తరాల రాజకీయ నాయకులకు ఎన్నో మార్గాలు చూపించారు. కేసీఆర్ మీడియాని నియంత్రించిన తీరు చూసి ఆయన రాజకీయ శత్రువులు కూడా ఆశ్చర్యంతో నోళ్ళు నొక్కుకున్నారు. కర్ర విరగకుండా పాము చచ్చిన చందాన ప్రభుత్వం మీద నేరుగా వేలెత్తి చూపించడానికి అవకాశం లేని విధంగా ఆయన మీడియాని నియంత్రించిన తీరు అమోఘం. గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు మీడియాని నియంత్రించాలని చూశారుగానీ, ఆ ప్రయత్నాలు ఫలించక చేతులు ఎత్తేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో యావత్ మీడియా ప్రభుత్వాన్ని చూసి భయపడుతోంది. కేసీఆర్‌కి, ఆయన ప్రభుత్వానికి  వ్యతిరేకంగా ఒక వార్త రాయాలన్నా, ఒక కథనం ప్రసారం చేయాలన్నా ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితికి మీడియా చేరుకుంది. అధికారం చేపట్టిన వెంటనే రెండు ఛానళ్ళకు తన చేతికి మట్టి అంటకుండా చుక్కలు చూపించిన కేసీఆర్ చతురత సామాన్యమైనది. వాటిలో ఒక ఛానల్ గండం నుంచి గట్టెక్కి బతుకు జీవుడా అనుకుంటూ వుంటే, మరో ఛానెల్ ఎన్నాళ్ళీ సంకెళ్ళు అని ఆవేదనగా ప్రశ్నిస్తోంది. సచివాలయంలోకి మీడియా ప్రతినిధుల ప్రవేశానికి చెక్ పెట్టే ప్రయత్నం కూడా కేసీఆర్‌ మీడియా విషయంలో అనుసరిస్తున్న దృఢ వైఖరికి అద్దం పట్టింది.

అయితే మీడియాని నియంత్రించడం అనేది బయటి మీడియా విషయంలో మాత్రమే కాకుండా సొంత మీడియా విషయంలో కూడా అమలు చేస్తే బాగుండేదేమో. టీఆర్ఎస్ సొంత మీడియాలో ప్రభుత్వానికి మాత్రమే అనుకూలంగా కథనాలు రావడం, ఇతర పార్టీలకు, సీమాంధ్రులకు వ్యతిరేకంగా మాత్రమే వస్తున్న కథనాలను చూసి మీడియాను ఈ రకంగా కూడా నడిపించవచ్చా అనే పాఠాలు నేర్పిస్తున్నాయి. ఆ మీడియాకి చెందిన ప్రతినిధులు చేస్తున్న నిర్వాకాలు తెలంగాణ ప్రజలు గతుక్కుమనేలా చేస్తున్నాయి. వెలుగులోకి రాని అంశాల గురించి అలా వుంచితే, ఇటీవల జరిగిన ఒక ఘటన సొంత మీడియాని కూడా కేసీఆర్ అదుపులో పెట్టాలన్న హెచ్చరికగా మిగిలింది. టీఆర్ఎస్‌కి చెందిన మీడియా ప్రతినిధి ఒకరు మరో మీడియా ప్రతినిధితో కలసి ఒక వ్యాపారిని బ్లాక్ మెయిల్ చేస్తూ, పది లక్షల రూపాయలు డిమాండ్ చేయడంతో దిక్కు తోచని వ్యాపారి ఆత్మహత్యా ప్రయత్నం చేసి చావుబతుకుల్లో వున్నాడు. ఈ లెక్కన సర్కారు వారి మీడియా ప్రతినిధులు రాష్ట్రంలో ఏరకంగా రెచ్చిపోతున్నారనడానికి ఈ  శాంపిల్ ఘటన చాలు. ఇప్పటికై ఘనత వహించిన ముఖ్యమంత్రి గారు తన సొంత మీడియాను కూడా నియంత్రించే విషయాన్ని ఆలోచిస్తే అందరికీ బావుంటుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu